వీలునామా

అలవాటయిన కాళ్లు చెరువుగట్టుకి దారి తీశాయి. ఒకరోజా, రెండు రోజులా... కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు. రోజూ ఏదో ఒక వేళలో చెరువుగట్టు పావంచా మీద కూర్చుని, కాళ్లు నీళ్లలో ...

Updated : 13 Feb 2022 03:06 IST

వీలునామా

నండూరి సుభద్రాదేవి

లవాటయిన కాళ్లు చెరువుగట్టుకి దారి తీశాయి. ఒకరోజా, రెండు రోజులా... కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు. రోజూ ఏదో ఒక వేళలో చెరువుగట్టు పావంచా మీద కూర్చుని, కాళ్లు నీళ్లలో పెట్టుకుని నా అరిపాదాల కింద చక్కలిగింతలు చేస్తూ, ఇంద్రధనుస్సు రంగుల్లో మెరుస్తూ తుళ్లిపడే చేపపిల్లల్నీ, వగరు వాసనతో ఠీవిగా తలెత్తి చూసే రంగురంగుల కలువపూవుల్నీ, వాటిమీద హడావుడిగా తిరుగుతూ ఝంకారం చేసే భ్రమరాల్నీ, ఎగిసిపడే పిల్లకెరటాల్నీ, చేపలకోసం వచ్చే పేరు తెలియని పక్షుల్నీ, తల్లుల కోసం ఆరాటంగా రోడ్డుమీద పరుగులు తీస్తున్న తువ్వాయిల్నీ చూడడం నా దైనందిన చర్యల్లో ఒకటి. వయసు పెరిగినా అలవాటు మారలేదు.

కానీ, ఈవేళ ఇవేవీ నన్ను అలరించడం లేదు. మనసుకి సెగ తగిలినట్లుగా భగభగమంటోంది. పేగులు ఆకలితో కరకరలాడుతున్నా ఇంటికి వెళ్లాలని అనిపించడం లేదు. నా తమ్ముడి పార్ధివదేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడి నాకు శాంతీ స్థిమితం లేకుండా పోతోంది.

‘‘తమ్ముడి మరణం నిజంగానే నిన్ను కుంగదీసిందా?’’ మనసు నిలదీసింది. ‘హార్ట్‌ ఈజ్‌ ది లోన్లీ హంటర్‌’ అని ఏ ఇంగ్లీషు కవి అన్నాడో గానీ ఆ మాటలు నా పట్ల అక్షరాలా నిజం. తట్టుకోలేక పోతున్నాను.

తమ్ముడు వాసు... నేను పదోతరగతి ఆఖరి ఎగ్జామ్‌ రాసి, ఇంటికి వచ్చేసరికి పుట్టాడు. ‘‘నీ రిజల్ట్స్‌ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపం రా’’ అన్నాడు నాన్న. వాడికి వెన్నపూస తినిపించడం నుంచీ, చదువు చెప్పే గురువుదాకా అన్ని పాత్రల్నీ నేనే పోషించాను. వాడిని కన్న నాలుగేళ్లకి అమ్మ కనుమూసినా, ఆలోటు ఏమాత్రం తెలియకుండా వాడిని పెంచుకొచ్చాను. నాకు పెళ్లై ఇద్దరాడప్లిలలు కలిగే దాకా ఆ అనుబంధం అలాగే కొనసాగింది. నా భార్య మణి కూడా వాడిని కొడుకులాగే ఆదరించింది.

నా పిల్లలకి నా దగ్గరకంటే వాడి దగ్గరే చేరిక ఎక్కువ. పండగలకీ, పేరంటాలకీ వాళ్లని బజారుకు తీసుకెళ్లి గాజులూ, పూసలదండలూ కొనిపెడుతూ ఉండేవాడు. వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి ‘‘ఇదిగో వదినా, చీర కొనుక్కో’’ అంటూ నా భార్యకి ఇచ్చాడు. మా అనుబంధం చూసి, పైకి గంభీరంగా ఉన్నా, మానాన్న పొంగిపోయేవాడు. కానీ.. కానీ...

ఏదీ, నిరుడు కురిసిన వాత్సల్యవర్షం... ఎక్కడ తమ్ముడూ... చెప్పాపెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయావ్‌... ఈ పాపిష్టి అన్నని చూడడానికి కూడా మనస్కరించలేదా... మనసు ఆక్రోశిస్తోంది. తోడబుట్టిన వాడిపట్ల, నీ విధిని నువ్వు సక్రమంగానే నెరవేర్చావా అంటోంది హృదయం. జవాబు లేదు నా దగ్గర.

ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్లిళ్లు చేశాను. ఎవరి జీవితాలు వాళ్లవి. నాకు పెన్షను వస్తుంది. బతుకుకి భరోసా ఉంది. నాన్న దగ్గర అంతగా చేరిక లేకపోయినా, ఏ విషయమూ నా దగ్గర దాచని తమ్ముడు, ఒకరోజున ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. గుళ్లో తాళి కట్టానని చెప్పాడు.

ఇంట్లో పెద్ద రభసే అయింది. మణి మాత్రం తోడికోడల్ని సాదరంగా ఆహ్వానించింది. ముఖ్యంగా ఆడవాళ్ల మధ్యే ఎక్కువగా పొరపొచ్చాలొస్తాయనే అపోహ ఉంది నాలో. కానీ మణి ధోరణి వేరుగా ఉంది. నాన్న మాత్రం పరిస్థితులతో రాజీ పడలేదు. గుట్టు చప్పుడు కాకుండా వీలునామా రాయించుకొచ్చేశాడు.

ఉన్న ఆరెకరాల పొలం, ఇల్లూ నా పేరున రాయించాడు. ఆస్తి ఆయన స్వార్జితం కనుక ఎవరూ నోరు విప్పడానికి అవకాశం లేకపోయింది. తమ్ముడి భార్య ‘వహ్ని’ ద్వారా సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్లు గొడవకి వచ్చారు. నాన్న మాత్రం బెదరలేదు, చెదరలేదు. చేసేదేమీ లేక వాళ్లూ వెళ్లిపోయారు.

పైకి ఏమీ అనలేక స్థితప్రజ్ఞుడిలా మిన్నకుండిపోయాడు వాసు. అన్నదమ్ములిద్దరం ఒకే ఇంట్లో పక్క పక్క వాటాల్లో ఉంటున్నా ఎదురుపడితే ముభావంగా పలకరించుకోవడం అలవాటయిపోయింది. కొన్నాళ్లకు నాన్న కూడా సుస్తీ చేసి దాటిపోయాడు. ఇంట్లో మిగిలిన నలుగురి మధ్యా మౌనమే రాజ్యమేలేది.

ఈ పరిస్థితి జీర్ణించుకోలేని మణి ఒకరోజున నన్ను నిలదీసింది...

‘‘దేనికైనా ఒక హద్దుండాలి. ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్తసంబంధాన్ని దూరం చేసుకుంటారా? ఇది మీకు తగిన పనేనా? ‘ఎందుకు పుట్టానా’ అని వాడు బాధపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా’’ అంటూ నామీద విరుచుకుపడింది. నాకు ఒక్కసారిగా మనసు భగ్గుమంది.

‘‘వాడి తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడతావేం? నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి ఉండాలని లేదా? ఉన్నదే ఆరెకరాల భూమి. ఆడపిల్లలిద్దరికీ చెరో రెండెకరాలు పసుపూ కుంకుమ కింద ఇద్దామనుకుంటున్నాను. అదీ తప్పేనా? పిల్లల తల్లిగా ఆలోచించడం నేర్చుకో కాస్త’’ విసురుగా అన్నాను.

‘‘పోయేనాడు ఏం మోసుకుపోతాం’’ అని సణుక్కుంటూ లోపలికి వెళ్లిపోయింది.

‘‘నాకు నా భార్య సపోర్టే లేదు’’ అనుకున్నాను గుబులుగా.

రోజులు భారంగానే గడుస్తున్నాయి.

ఓరోజు మణి స్వీటు తెచ్చి చేతికిస్తూ ‘‘మనం పెద్దమ్మా పెదనాన్నా కాబోతున్నాం’’ అని సంబరంగా చెప్పింది. ‘తమ్ముడికి కొడుకు పుట్టి, నా పిల్లలకి పోటీ కొస్తాడేమో’ అనుకున్నాను అసహనంగా.

లిప్తకాలంలో నా మనసుని చదివేసింది నా జీవిత సహచరిణి. ‘‘మరో కంసుడు కాకండి. మన పెద్ద పిల్లకంటే వాసు భార్య మూడేళ్లే పెద్దది. కొత్త వారసుణ్ణి సాదరంగా ఆహ్వానించాలి మనం’’ అంది లోపలికి నడుస్తూ.

ఒకరోజు తమ్ముడూ, అతడి భార్యా ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు. నేను వసారా చావిడిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాను. ఎంత వినకూడదని అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి తొలిపొద్దు సూర్యకిరణాలు తాకినట్లుగా.

‘‘ఎంతకాలం వహ్నీ, ఎంతకాలం... అన్నయ్యతో ఈ నిశ్శబ్ద యుద్ధం. పోనీ, నేను ఏమైనా ఆస్తికోసం గొడవ చేశానా? మీవాళ్లు ఓమాట అడిగారు, అంతే. అంతమాత్రానికి అన్నయ్య ఏళ్ల తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా? నాకు చిన్నప్పుడు వెన్న తినిపించిన ఆ మనసేనా శిలలా మారిపోయింది! ఉంచుకోమను ఆయన్నే ఉంచుకోమను. నాకేం అక్కర్లేదు. నా రెక్కల కష్టం మీద నేను బతకగలను. నిన్నూ పిల్లల్నీ పోషించుకోగలను. అయినా, మా విషయంలో మీవాళ్లు ఎందుకు కలగజేసు కున్నారసలు? నీనుంచి కూడా ఇక్కడ ఎవ్వరూ ఏమీ ఆశించలేదు కదా!’’ అన్నాడు.

‘‘నిజమే మావాళ్ల పొరపాటు కూడా ఉంది. నేను ఏదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను కానీ, ఇలా మనస్పర్థలు వస్తాయని ఊహించలేకపోయాను. పోనీలెండి, ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్లుంటాయి కనుక! వచ్చే బుడతడిని చూసి ఆయనే మారతారు’’ నవ్వుతూ అంది వహ్ని.

వాసు కూడా బొళబొళా నవ్వేశాడు. వాళ్లు బయటకి వస్తారేమోననే అనుమానంతో పచార్లు ఆపి గబగబా లోపలికి వెళ్లాను. చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. వహ్నిని పురిటికి తీసుకుని వెళ్లారు ఆమె పుట్టింటివాళ్లు.

సదా చిరునవ్వుతో కనిపించే వాసూ... చిన్నబుచ్చుకున్న మొహంతో రెండురోజులపాటూ తన గదిలోంచి బయటకి రాలేకపోయాడు. మణి అతణ్ణి మందలించి తీసుకువచ్చింది.

ఒకరోజున తెల్లవారుఝామున వాసు మొబైల్‌ రింగ్‌ అవుతుంటే పక్కగదిలో పడుకున్న నాకు మెలకువ వచ్చింది. మణి నిద్రమత్తులో అటూ ఇటూ దొర్లుతోంది. లోపలనుంచి తమ్ముడి గొంతు... ‘‘ఇదిగో, ఇప్పుడే బయల్దేరుతున్నాను’’ అని వినిపించింది. పది నిమిషాల్లో బ్రీఫ్‌కేసుతో బయటకి వచ్చాడు. నన్ను చూడగానే ‘‘అన్నయ్యా, వహ్నికి నొప్పులు మొదలయ్యాయట. నేను బయలుదేరు తున్నాను. వెళ్లాకా నీకు ఫోన్‌ చేస్తాను. వదిన లేచాకా చెప్పు’’ అన్నాడు. తల ఊపి ఊరుకున్నాను. చీకటిలో కలిసిపోయాడు వాసు.

తెల్లవారి పదింటికి ఫోన్‌, ‘‘అన్నయ్యా! బాబు పుట్టాడు. అచ్చు నాన్నగారిలా ఉన్నాడు. వీడిని చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు. వదినకి చెప్పు ఈ సంగతి. పిల్లలిద్దరికీ నేను చెప్తాలే’’ అని ఫోన్‌ పెట్టేశాడు.

భారమైన నిట్టూర్పు వచ్చింది నాలోనుండి. అనుకున్నంతా అయింది. ‘నా పిల్లలు... వాళ్లకి ఆస్తి కట్టబెట్టాలి’ అనే స్వార్థం నాలో ఉన్నట్లే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్లూ అంతగా లేని స్వార్థం మొలకెత్తి, మొక్కగామారి మహావృక్షమై పోదూ. దీన్ని మొదట్లోనే తుంచెయ్యాలి. ఇవాళో రేపో వెళ్లి లాయరుగారిని కలవాలి. ఆస్తిని నా కూతుళ్లకి సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా చరమ జీవితం నిశ్చింతగా గడిచి పోతుంది... నా ఆలోచనల్లో నేను ఉండగానే...

‘‘ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? చంటాడు వస్తాడు, వాడితో ఏం ఆటలు ఆడాలనా?’’ కాఫీగ్లాసు అందిస్తూ నవ్వుతూ అంది మణి.

‘‘నువ్వొక పిచ్చి మాలోకానివే మణీ, నా తర్వాత ఎలా బతుకుతావో గానీ’’ అన్నాను. ఖాళీ గ్లాసు టీపాయ్‌ మీద పెడుతూ కోపంగా.

‘‘ఇప్పుడేమయిందండీ, పొద్దుటినుంచీ అన్యమనస్కంగానే ఉన్నారు. ఆరోగ్యం బాగానే ఉందా?’’ కలవరపడుతూ నుదుటిపైన చేయి ఉంచి అడిగింది. పక్కకి జరిగాను చిరాగ్గా.

నా అకారణ కోపానికి కారణం తెలియక తికమకపడింది. కాసేపు స్థిమిత పడ్డాకా కారణం తెలుసుకుని తేలిగ్గా నవ్వేసింది. విస్తుపోయి చూశాను అమెవైపు.

‘‘మీకేమైనా పిచ్చా! చంటివెధవ ఇప్పుడు పుట్టాడు. వాడు పెరిగి పెద్దై ఆస్తిలో భాగం ఎక్కడ తన్నుకుపోతాడోనని వీలునామా దాకా వెళ్లిపోయారు. అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి. విల్లు రాసేందుకు ఇంకా సమయం ఉంది. నేను గుర్తు చేస్తాను లెండి. అంతవరకూ నిశ్చింతగా ఉండండి’’ అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది. సాలోచనలో పడ్డాను.

చంటాడు రావడం, ఇల్లంతా సందడీ... కాలం రెండేళ్లు గిర్రున తిరిగిపోయింది. మధ్య మధ్య వీలునామా గురించి మనసు నన్ను హెచ్చరిస్తున్నా, బుజ్జగించి దాటవేస్తూ వచ్చాను.

ఆవేళ లాయరు రఘుపతిగారు బజార్లో కనిపించారు. కుశల ప్రశ్నలయ్యాకా రేపు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను సార్‌’’ అన్నాను. ‘‘రండి’’ అని టైమ్‌ చెప్పారాయన. శెలవు తీసుకున్నాను.

‘ఇక నా పని నేను చేసుకుపోవాలి కానీ దీనిమాటకి విలువ ఇవ్వడం అనవసరం’ గట్టిగా మనసులో అనుకుని తేలికపడ్డాను.

తెల్లవారిలేస్తూనే వాసూ వచ్చాడు.

‘‘అన్నయ్యా పిల్లాడికి రెండు నిండి మూడో ఏడు వచ్చింది కదా. ఈవేళ సింహాలమ్మ గుడికి తీసుకెళ్లి పుట్టువెంట్రుకలు తీయించుకొస్తాం’’ అన్నాడు. సరేనన్నట్లు తలూపాను. వాళ్లు వెళ్లిపోయారు.

స్థిమితంగా నా పనులు కానిచ్చుకుని, వంటింట్లోకి కేక పెట్టాను. ‘అలా పొలంవైపు వెళ్లొస్తా, తలుపు వేసుకో’మని.

బండి లాయరుగారింటికి దారి తీసేలోపల మా దూరపు చుట్టం సాయి పరుగెత్తుకుంటూ ఎదురొచ్చాడు. నన్ను చూస్తూనే భోరుమన్నాడు.

‘‘బావా, ఘోరం జరిగిపోయింది. ఇంత పొద్దున్నే వాసూ ఎక్కడికి బయలుదేరాడు? వెహికల్‌కి లారీ గుద్దుకుని యాక్సిడెంటయి, ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయట. చంటాడు దూరంగా పొదల్లో పడబట్టి బతికిపోయాడు. కానీ, వీడు... మనవాసూ... ఆ చెరుకులారీ కింద పడి...’’ ఇక చెప్పలేక జేబురుమాల్ని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. స్థాణువైపోయాను.

మెదడు మొద్దుబారిపోయింది. శూన్యంలోకి చూస్తుండిపోయాను.

ఏం జరిగింది! ఏం వింటున్నాను! ఇంట్లో ఫోన్‌ రింగవడం తెలుస్తోంది. మణి భోరున ఏడుస్తూ బయటికి వచ్చింది. ఇంటిముందు ఒక్కొక్కరూ పోగవుతున్నారు. జరగాల్సిన తతంగం యాంత్రికంగా జరిగిపోతోంది.
అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు చూపుల్లో పదిరోజులు గడిచిపోయినా మార్పు రావడం లేదు. నా తమ్ముడి రూపం... పొత్తిళ్లలో గుప్పిళ్లు మూసుకున్నది లగాయతు దహనం అయ్యేదాకా... ఒక్కొక్కటిగా కళ్లముందు కదిలి... ఒక్కసారిగా భోరుమన్నాను. పేగులు కదిలిపోతున్నాయి.

‘‘భగవాన్‌! మనుషులు మరణిస్తేనే గానీ, మిగతావాళ్లకి వాళ్ల విలువ తెలియదా! నిన్నమొన్నటిదాకా ఎంత స్వార్థంతో ఉన్నాను. విసిరేస్తేనే గానీ నాకు చేతిలోని రత్నం విలువ తెలియలేదు. నాకు అష్టైశ్వర్యాలు అక్కరలేదు తండ్రీ, నా తమ్ముడు నాకు కావాలి’’ మరోసారి భోరుమన్నాను.

‘‘ఎందుకేలుత్తున్నావు పెదనాన్నా, అమ్మకొట్టిందా?’’ బుజ్జి చేతులతో తుడిచాడు చంటాడు. ఆర్తిగా వాణ్ణి గుండెలకి హత్తుకుని లోపలికి నడిచాను. మరదలు పుట్టింటికి వెళ్లిపోవడానికి అన్నీ సర్దుకుంటోంది.

‘‘ఏంటమ్మా, అన్నీ సర్దుకుంటున్నావు?’’ అడిగాను కంగారుగా.

‘‘ఇక ఏం మిగిలింది బావగారూ, నాకిక్కడ?’’ అంటూ కళ్లు తుడుచుకుందామె.

‘‘ఏమీలేకపోవడం ఏంటమ్మా! ఈ ఇంట్లో సగభాగం, పొలంలో సగభాగం, పాడిలో సగభాగం వీడివి. నీ బిడ్డవి నీవికావా? నిన్నటిదాకా నాకు ఇద్దరు పిల్లలు. ఇప్పటినుంచీ ముగ్గురు. వాసు ఆఫీసులోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు. మెసేజ్‌ వచ్చింది. పుట్టింటికి వెళ్లి మూడు రోజులు నిద్ర చేసిరా. వచ్చాక జాయిన్‌ అవుదువుగానీ’’ అన్నాను.

మణి ఆశ్చర్యంగా నాకేసి చూసింది. ఈసారి నేను లాయరు గారింటికి వెళ్తానంటే మణి అడ్డు చెప్పలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..