ఆలంబన

హాల్లో ఫోన్‌ మోగుతుంటే వెళ్ళి తీసింది అనుపమ. వంశీ ఫోన్‌ చేస్తున్నాడు. అటునుంచి- ‘‘అమ్మా! రేపటితో మా ఇంటర్న్‌షిప్‌ అయిపోతుంది. రేపు రాత్రికల్లా నేనూ మనోజ్ఞా ఇంటికి వచ్చేస్తాం’’ అనగానే... అనుపమ మొహం ఆనందంతో మతాబులా వెలిగిపోయింది.

Updated : 20 Feb 2022 11:07 IST

ఆలంబన

డాక్టర్‌ తాళ్ళూరి లక్ష్మి

హాల్లో ఫోన్‌ మోగుతుంటే వెళ్ళి తీసింది అనుపమ. వంశీ ఫోన్‌ చేస్తున్నాడు. అటునుంచి- ‘‘అమ్మా! రేపటితో మా ఇంటర్న్‌షిప్‌ అయిపోతుంది. రేపు రాత్రికల్లా నేనూ మనోజ్ఞా ఇంటికి వచ్చేస్తాం’’ అనగానే... అనుపమ మొహం ఆనందంతో మతాబులా వెలిగిపోయింది. వంశీ ఎంత మంచి కబురు చెప్పాడు. ఈరోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తోంది! అదే చెప్పింది వంశీతో ‘‘చాలా సంతోషంగా ఉందిరా వంశీ. అంకుల్‌కి కూడా ఫోన్‌ చేసి చెప్పండి. సంతోషపడతారు’’ అంది.

‘‘మనోజ్ఞ ఎప్పుడో చెప్పేసిందమ్మా. నేనే పనిలో పడి కొంచెం ఆలస్యం చేశాను. సరే ఉంటాను’’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు వంశీ.

అనుపమకిక కుదురుగా ఉండడం సాధ్యం కాలేదు. ఏ పని చేస్తున్నా వంశీనే గుర్తుకు రాసాగాడు. కాలం ఎంత వేగంగా పరుగెడుతోంది. నిన్నగాక, మొన్ననేగా వంశీని మెడికల్‌ కాలేజీలో చేర్చింది. అప్పుడే అయిదున్నర సంవత్సరాలు గడిచిపోయాయా! అనుపమ మస్తిష్కంలో గతించిన కాలం సినిమా రీల్లా గిర్రున తిరగసాగింది.

*   *   * 

అనుపమ ఎన్నటికీ మరిచిపోలేని రోజు వంశీకి మెడిసిన్‌లో సీటు వచ్చిన రోజు. సిటీకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్నపాటి టౌన్లో కట్టిన మెడికల్‌ కాలేజీలో వంశీకి సీటు వచ్చిందని తెలిసిన రోజున అనుపమ పడిన సంతోషం అంతా ఇంతా కాదు. వంశీ నాన్నగారు పోయాక ఆయన వంశీ గురించి కన్న కలలను సాకారం చేయడానికి నాలుగేళ్లుగా తనూ, వంశీ పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కినందుకు ఎంతగానో మురిసిపోయింది.

ఆరోజే వంశీని కాలేజీలో చేర్చాల్సిన రోజు. ఇద్దరూ వంశీకి కావలసిన సామానంతా రెండు బ్యాగులలో సర్దుకుని పొద్దుటే ఆర్టీసీ బస్సులో బయల్దేరి పదిగంటలకల్లా ఆ చిన్న టౌన్‌ చేరుకున్నారు. బస్టాండు నుంచి మెడికల్‌ కాలేజీ ఆరేడు కిలోమీటర్లు దూరం ఉంటుంది. బస్టాండ్‌లో ఆటో చేసుకుని కాలేజీకి బయలుదేరారు. సగం దూరం వెళ్ళేసరికి టైర్‌ పంక్చరై ఆటో ఆగిపోయింది. స్టెప్నీ కూడా లేకపోవడంతో ఆటోడ్రైవర్‌ టైర్‌కి పంక్చర్‌ వేయించుకుని వస్తానని వెళ్ళిపోయాడు- వేరే ఆటో వస్తే దాన్లో మీరు వెళ్లిపొమ్మని చెప్పి. అనుపమ, వంశీ మరో ఆటో ఏదైనా వస్తే ఆపడానికి రోడ్డుపైన ఎండలో నిలబడ్డారు.

ఎంతసేపటికీ ఒక్క ఆటో కూడా రాకపోవడంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా వారి పక్కనుంచే ఒక మెరూన్‌ రంగు కారు కొంచెం ముందుకెళ్ళి ఆగి మళ్ళీ రివర్స్‌ చేసుకుని వచ్చి వారి పక్కనే ఆగింది. అందులో నుంచి ఒక అమ్మాయి దిగి ‘‘లిఫ్ట్‌ కావాలా ఆంటీ?’’ అని అడిగింది. అనుపమ తలూపడంతో ‘‘అయితే ఎక్కండి’’ అని అనుపమనీ వంశీనీ కారులో ఎక్కించుకుంది. వాళ్ళిద్దరూ కారెక్కగానే ‘‘నా పేరు మనోజ్ఞ. డ్రైవ్‌ చేస్తోంది మా నాన్నగారు మనోహర్‌. నన్ను మెడికల్‌ కాలేజీలో చేర్చడానికి తీసుకెళుతున్నారు. మీరు కూడా మెడికల్‌ కాలేజీకేనా?’’ అని అడిగింది. అవునని చెప్పి అనుపమా వంశీ తమని తాము పరిచయం చేసుకున్నారు.

మెడికల్‌ కాలేజీ చేరగానే, ప్రవేశానికి అవసరమైన తతంగమంతా పూర్తి చేసుకుని, కాలేజీకి దగ్గరలోనే ఉన్న హాస్టళ్ళలో కూడా అడ్మిషన్‌ పనులు పూర్తి చేసుకున్నారు. బాయ్స్‌ హాస్టల్‌, గర్ల్స్‌ హాస్టల్‌ పక్కపక్కనే ఉన్నాయి. వంశీ, మనోజ్ఞా తమకి కేటాయించిన గదుల్లో సామానులు సర్దుకుని బయటకు వచ్చారు. అప్పటికే లంచ్‌ టైమ్‌ కావడంతో నలుగురూ కలిసి కాలేజీ క్యాంటీన్‌లో భోజనం చేశారు.

భోజనం చేస్తుండగా మనోజ్ఞ అడిగింది ‘‘మీరుండేది కూడా సిటీలోనేనా ఆంటీ?’’ అని.

‘‘అవునమ్మా, శ్రీనగర్‌ కాలనీలో ఉంటాం’’ జవాబిచ్చింది అనుపమ.

‘‘అంటే మీరుండేది మాకు దగ్గరలోనే అన్నమాట. మేముండేది జూబ్లీహిల్స్‌లో. అయితే నాన్నా, వెళ్లేటప్పుడు ఆంటీని వాళ్లింట్లో డ్రాప్‌ చేసి వెళ్లండి’’ వాళ్ల నాన్నతో అంది మనోజ్ఞ.

‘‘అయ్యో! మీకంత కష్టమెందుకమ్మా. నన్ను బస్టాండు దగ్గర దించేస్తే బస్సులో వెళ్ళిపోతాను’’ అంది అనుపమ.

అంతవరకూ వాళ్ళ మాటల్లో ఎక్కువగా కల్పించుకోని మనోహర్‌... ‘‘ఇందులో కష్టమేముందండీ. నేనెటూ సిటీకేగా వెళుతోంది.
మీకభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు’’ అన్నాడు. మనోజ్ఞ మరింత బలవంతం చేయడంతో ఒప్పుకోక తప్పలేదు అనుపమకి.

పిల్లలిద్దరినీ హాస్టల్లో వదిలేసి వస్తుండగా మనోహర్‌ అన్నాడు వంశీతో- ‘‘వంశీ, మనోజ్ఞ నన్ను వదిలి ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. ఇక్కడ నువ్వే తనకి ఆసరాగా ఉండాలి.’’

వంశీ ఆయనకు భరోసా ఇచ్చాడు. ‘‘మీరేమీ దిగులు పడకండి అంకుల్‌. మనోజ్ఞకి ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటాగా’’ అన్నాడు.

మనోహర్‌ కారు స్టార్ట్‌ చేస్తుండగా గద్గద స్వరంతో అంది అనుపమ ‘‘వంశీ, జాగ్రత్త. టైమ్‌కి భోజనం చేస్తూ ఉండు. నేను వార్డెన్‌గారితో మాట్లాడాను. హాస్టల్‌ జీవితం అలవాటయ్యేదాకా ప్రతి శనివారం సాయంత్రం ఇంటికి పంపడానికి పర్మిషన్‌ ఇచ్చారు. శనివారం కాలేజీ అయిపోగానే ఇంటికి వచ్చేయ్‌. తిరిగి ఆదివారం సాయంత్రం వెళ్ళొచ్చు’’ అంది.

సిటీకి తిరిగి వస్తుండగా అనుపమతో అన్నాడు మనోహర్‌ ‘‘మీరు వంశీ గురించి దిగులు పడకండి. నేను ఎలాగూ ప్రతి శనివారం మనోజ్ఞను తీసుకురావడానికి కాలేజీకి వెళతాను. తనతోపాటు వంశీని కూడా తీసుకొచ్చి తిరిగి సోమవారం పొద్దుటే కాలేజీలో దింపేస్తాను.’’

‘‘థాంక్స్‌ అండీ. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. గుండెల్లో నుండి కొండంత భారాన్ని తీసేసినట్టుగా ఉంది’’ మనస్ఫూర్తిగా అంది అనుపమ.

కొద్దిసేపయ్యాక తిరిగి మనోహరే అన్నాడు. ‘‘వంశీ నాన్నగారు ఊళ్లో లేరా? కాలేజీకి రాలేదు.’’ ఒకసారి గాఢంగా ఊపిరి పీల్చుకుని బదులిచ్చింది అనుపమ... ‘‘ఆయన లేరు. నాలుగేళ్లక్రితం యాక్సిడెంట్‌లో చనిపోయారు.’’

‘‘సారీ, మీ వ్యక్తిగత విషయాలు అడిగినందుకు క్షమించండి’’ ఎంతో బాధపడుతూ అన్నాడు మనోహర్‌. విషయం మార్చి అనుపమను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యడానికి తిరిగి తనే అడిగాడు. మీరేమైనా ఉద్యోగం చేస్తుంటారా?’’ అని.

‘‘అవునండీ, ఒక ప్రైవేట్‌ ఉమెన్స్‌ కాలేజీలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా పని చేస్తున్నాను’’ జవాబిచ్చింది అనుపమ.

తరువాత మనోహర్‌ తన గురించి చెప్పుకొచ్చాడు. అతను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మనోజ్ఞ ఒక్కతే సంతానం. మనోజ్ఞ చిన్నప్పుడే భార్య మరో ప్రసవంలో కన్ను మూసింది. అప్పటినుంచీ అతడే మనోజ్ఞకు సర్వస్వమై పెంచుకొస్తున్నాడు. ‘‘ఒక విధంగా చెప్పాలంటే మనిద్దరి జీవితాలూ ఒకే బాటలో పయనిస్తున్నట్టున్నాయి’’ వాతావరణం తేలిక చేస్తూ నవ్వాడతడు.

వారలా మాట్లాడుకుంటుండగానే సిటీకి చేరుకున్నారు. అనుపమను వాళ్లింటి దగ్గర దింపేసి వెళ్లిపోయాడు మనోహర్‌.

*   *   * 

ఆ విధంగా పరిచయమైన ఆ రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఈ అయిదున్నర ఏళ్ళల్లో దినదిన ప్రవర్ధమానమవుతూ వారి మధ్య ఎంతో సామీప్యత తెచ్చింది.

తరచుగా ఒకరింటికి మరొకరు భోజనాలకి రావడం, ఏ శుభకార్యమైనా అందరూ కలిసి చేసుకోవడం, ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాలు పంచుకోవడం, ఇలా చాలా దగ్గరయ్యారు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ఞ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు గడపడం దాదాపు పరిపాటి అయిపోయింది.

వంశీ, మనోజ్ఞా మెడిసిన్‌ మూడో సంవత్సరం పూర్తయి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ఞ ఇంట్లో కూర్చుని కూర్చుని విసుగుపుడుతోందంటే మనోహర్‌ మనోజ్ఞను ఊటీకి తీసుకెళ్లడానికి ప్లాన్‌ చేశాడు. అయితే మనోజ్ఞ పట్టుబట్టి తమతోపాటూ వంశీ అనుపమలు కూడా వచ్చేటట్లు చేసింది. అప్పటినుంచీ సెలవుల్లో ఏ ప్రదేశానికి వెళ్ళినా నలుగురూ కలిసే వెళ్ళసాగారు.

వంశీ, మనోజ్ఞా కూడా ఈ అయిదున్నర ఏళ్ళలో ఎన్నడూ చదువుపై అశ్రద్ధ చూపలేదు. ఇద్దరూ ఎంతో కష్టపడి చదివి మెడిసిన్‌ మంచి మార్కులతో పాసయ్యారు. గత సంవత్సరంగా చదువుకున్న కాలేజీ అనుబంధ హాస్పిటల్‌లోనే హౌస్‌ సర్జన్లుగా పని చేస్తున్నారు. అది రేపటికల్లా పూర్తవుతుంది. ఇక పూర్తిస్థాయి డాక్టర్లుగా పని చేయవచ్చు.

ఆహ్లాదకరమైన గతంలో నుంచి బయటకొచ్చిన అనుపమ మనసు దూది పింజలా గాలిలో తేలిపోసాగింది. ఇక వంశీని ఒక ఇంటివాడిని చేసేస్తే తన మరో బాధ్యత కూడా పూర్తవుతుంది. వంశీ పెళ్ళనుకునేసరికి అనుపమ మనసులో మనోజ్ఞ సుందర రూపం మెదిలింది. ఇద్దరూ ఈడూజోడుగా ఉంటారు. ఒకరంటే ఒకరు ఎంతో సఖ్యతతో చాలా చనువుగా కూడా ఉంటారు.

మనోజ్ఞ ఎంతో మంచి అమ్మాయి. చాలా చలాకీగా ఉన్నా ఎంతో మృదుస్వభావురాలు. ఆ అమ్మాయి చెంగు చెంగున ఇంట్లో తిరుగుతుంటే ఇంటికే కళ వచ్చినట్టుండేది. వంశీకి మనోజ్ఞ తోడైతే వాళ్ళిద్దరి జీవితాలు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా సాగిపోతాయి. వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనే భావనతో అనుపమ నిర్వచించలేని ఒక తీయటి అనుభూతికి గురయింది.

‘ఈ విషయంలో ముందుగా మనోహర్‌గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే ఆ తరువాత వంశీ మనోజ్ఞల ముందు ప్రస్తావించవచ్చు. ఈరోజే మనోహర్‌గారితో మాట్లాడాలి’ అనుకుంది అనుపమ.

అనుకున్నట్టుగానే అనుపమ ఆ రాత్రే ఫోన్‌చేసి మనోహర్‌కి తన మనసులో మాట చెప్పి అతని అభిప్రాయం కూడా అడిగింది. మనోహర్‌ కూడా వంశీ మనోజ్ఞలు ఒకటైతే తనకంటే ఎక్కువగా ఆనందించేవారు ఎవ్వరూ ఉండరని చెప్పడంతో మనసు ఎంతో కుదుటపడి ఆరాత్రి సంతృప్తిగా నిద్రపోయింది అనుపమ.

*   *   * 

‘‘హౌస్‌ సర్జన్సీ కూడా అయిపోయింది. ఇకముందు ఏం చేద్దామనుకుంటున్నావు వంశీ?’’ కాఫీ సిప్‌ చేస్తూ వంశీని అడిగాడు మనోహర్‌.

వంశీ, మనోజ్ఞలు చదువులు ముగించుకుని ఇళ్ళకి వచ్చి దాదాపు వారం రోజులవుతుంది. ఆరోజు మనోహర్‌, మనోజ్ఞలను డిన్నర్‌కి పిలిచింది అనుపమ...మర్నాడు ఆదివారం కావడంతో డిన్నర్‌ ఎటువంటి తొందర లేకుండా తీరికగా చేయవచ్చని. భోజనాలు పూర్తయ్యాక నలుగురూ డ్రాయింగ్‌ రూమ్‌లో కూర్చుని మాటలు మొదలెట్టారు. మనోహర్‌కి డిన్నర్‌ అయ్యాక కాఫీ తాగడం అలవాటు. అందుకే అతనికి ప్రత్యేకంగా కాఫీ చేసి ఇచ్చింది అనుపమ, తను పిల్లలతోపాటు ఐస్‌క్రీమ్‌ స్కూప్‌ తింటూ.

‘‘ఎండీ చేద్దామనుకుంటున్నాను అంకుల్‌. మరో మూడు నెలల్లో నీట్‌ పరీక్షలు ఉన్నాయి. నేనూ మనోజ్ఞా ఎప్పుడో ప్రిపరేషన్‌ మొదలెట్టాం. ఇద్దరం ఎయిమ్స్‌లో సీట్‌కోసం ప్రయత్నిద్దామనుకుంటున్నాం’’ అన్నాడు.

వంశీ మాటలకు చివుక్కున తలెత్తి చూసింది అనుపమ. అతని మాటలతో ఏకీభవిస్తున్నట్టు మనోజ్ఞ కూడా తల తిప్పుతోంది.

‘‘స్పెషలైజేషన్‌ ఏం చేద్దామనుకుంటున్నారు?’’ యథాలాపంగా అడిగాడు మనోహర్‌.

‘‘నాకైతే ఇంటర్నల్‌ మెడిసిన్‌ చదవాలని ఉంది. మనోజ్ఞ గైనకాలజీ చేస్తానంటోంది.’’

‘‘చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు వంశీ. ఈ కాలంలో మెడిసిన్‌ చదువుకి ఒక పరిధి అంటూ పెట్టుకోలేం. డీఎం డిగ్రీ కూడా సర్వసాధారణమై పోయింది. ఎంత చదివినా నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉందనిపిస్తుంది.’’

వాళ్ల మాటలు వింటూ మనోహర్‌ కేసి అర్ధింపుగా చూసింది అనుపమ. ఆమె మనోగతం అవగతం చేసుకున్నట్టు తన మాటలకు వంశీ స్పందించక ముందే తిరిగి అన్నాడు మనోహర్‌.

‘‘అయితే, మాలాంటి తల్లిదండ్రులు సంతోషపడేదీ, సంపూర్ణంగా తృప్తి చెందేదీ పిల్లలు చదువులు ముగిశాక, ఉద్యోగాలు సంపాదించుకుని పెళ్ళిళ్ళు చేసుకుని ఒక ఇంటివారిగా స్థిరపడినప్పుడు. ఆ పక్రియ ఎంత వేగంగా పూర్తయితే అంత ఆనందిస్తారు. అందరిలాగే మీ అమ్మగారూ, ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా- మీ ఇద్దరి విషయంలోనూ త్వరలో ఇదే జరగాలని ఆశిస్తున్నాం’’ అన్నాడు.

‘‘మా పెళ్ళా...’’ ఆశ్చర్యంగా చూశాడు వంశీ.

‘‘అవును, మీ పెళ్ళే వంశీ’’ మధ్యలో కలగచేసుకుంటూ అంది అనుపమ. ‘‘మనోహర్‌గారూ నేనూ అనుకుంటున్నదేమిటంటే మనోజ్ఞకీ నీకూ అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరికీ త్వరలో పెళ్ళి చేయాలని.

ఆ తరువాత పై చదువులు చదవాలా, ఉద్యోగాలు చేయాలా అనేది మీ ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవచ్చు’’ అంది.

ముఖాన విస్మయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే వంశీ మనోజ్ఞ వైపు చూశాడు. ఆ అమ్మాయి ముఖంలోనూ అదే రకమైన భావోద్వేగం కనిపిస్తోంది. కొద్దిసేపు ఇద్దరూ కళ్లతో మాట్లాడుకున్నాక, మనోజ్ఞ అంది- ‘‘వంశీ, కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నట్టున్నారు. ఇంకా ఆలస్యమెందుకు, చెప్పు’’ అంది.

మనోజ్ఞ మరోసారి హెచ్చరించాక, ఒకసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని గొంతు విప్పాడు వంశీ. ‘‘అమ్మా, మీ మనసుల్లో ఈ విధమైన ఆలోచన ఉందని నేనూ మనోజ్ఞా అసలు ఊహించలేదు. లేకుంటే ఎప్పుడో మీకు విశదపరిచేవాళ్లం- మా మనసుల్లో అటువంటి ఆలోచనే లేదని. మా ఇద్దరికీ- ఒకరిపై ఒకరికి ఎంతో అభిమానం, ఆప్యాయత, గౌరవం ఉన్నాయి. కానీ అవి మీరనుకుంటున్నట్టు పెళ్ళికి దారితీసే ప్రేమా ఇష్టమూ కాదు. మేం పరస్పరమూ ఒకరి మంచి మరొకరు కోరుకునే మంచి స్నేహితులం మాత్రమే. మా ఇద్దరి మనోగతాలూ ఆలోచనలూ ఎప్పుడూ ఒకే పంథాలో ఉంటాయి’’ అన్నాడు వంశీ.

ఈసారి తెల్లబోవడం అనుపమ, మనోహర్‌ల పనైంది. వారి ముఖాల్లో కదలాడుతున్న ఆశాభంగాన్ని గమనిస్తూ తిరిగి కొనసాగించాడు వంశీ.

‘‘అమ్మా! నిజానికి మనోజ్ఞా నేనూ కలిసి మీ ఇద్దరితో ఒక విషయాన్ని గురించి ఎప్పటినుంచో మాట్లాడుదామనుకుంటున్నాం. సందర్భం కుదరకా ధైర్యం చేయలేకా ఇంతవరకూ ప్రస్తావించలేదు.’’

‘‘మా ఇద్దరితోనా... ఏ విషయం గురించి?’’ ప్రశ్నార్థకంగా చూసింది అనుపమ.

విషయాన్ని ఎలా చెప్పాలో మనసులో మధించుకుంటున్నట్టున్నాడు వంశీ. కొంచెం సమయం తీసుకుని తిరిగి సాగించాడు. ‘‘మనోజ్ఞా నేనూ ఈ విషయం గురించి దాదాపు రెండేళ్ళ నుంచీ చర్చించుకుంటున్నాం. అన్ని కోణాల్లోంచీ ఆలోచించాం. మా ఇద్దరికీ ఎంతో బాగా మనసుకి హత్తుకునేలా నచ్చింది. ఇలాగే కనక జరిగితే ఎంత బాగుంటుందోనని ఎన్నోసార్లు అనుకున్నాం. అయితే ఈ విషయం చెబితే మీ ప్రతిస్పందన ఎలా ఉంటుందోనన్న జంకుతో ఇంతకాలం చెప్పలేదు. ఇప్పుడు మెడిసిన్‌ పూర్తి చేసుకుని మేమిద్దరం జీవితంలోని మరో దశలోకి అడుగుపెడుతున్న తరుణాన ఈ విషయం మీద మీరెలాంటి నిర్ణయం తీసుకున్నా మన జీవితాల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండదని ఈ అంశాన్ని మీముందు ఉంచుతున్నాం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. అయితే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మటుకు మేమెంతో సంతోషిస్తాం.

‘‘ఇక సాగదీయక అసలు విషయం ఏంటో చెప్పరా బాబూ. ఈ ఉత్కంఠ భరించలేకపోతున్నాను’’ కొద్దిగా అసహనంతో కూడిన కంఠంతో అంది అనుపమ.

‘‘నేను చెబుతాను ఆంటీ’’ ముందుకొచ్చింది మనోజ్ఞ. ‘‘వంశీ, నేనూ ఎంతగానో కోరుకునేదీ అభిలషించేదీ ఏమిటంటే మీరూ నాన్నగారూ పెళ్ళి చేసుకుని దంపతులవడం. మీ జీవితాలను నందనవనాలుగా చేసుకుని హాయిగా జీవించడం.’’

‘‘ఏమిటీ?’’ మనోజ్ఞ చెప్పడం పూర్తికాక ముందే ఏక కంఠంతో అరిచారు అనుపమ, మనోహర్‌లు. అప్పటికే అనుపమ ముఖం రంగులు మారడం ప్రారంభించింది- ఒక విధమైన చెప్పలేని సిగ్గుతో, లజ్జతో, అభిమానంతో.

‘‘అవును అంకుల్‌. మీరు విన్నది నిజమే. మేమిద్దరం మనసారా కోరుకునేది మీరిద్దరూ ఒకటై ఆనందంగా ఒకరికొకరు తోడూ నీడై జీవించాలని’’ అన్నాడు వంశీ.

మనోహర్‌కి ఏం మాట్లాడాలో పాలుపోలేదు. ఎంతో ప్రయత్నం మీద అన్నాడు ‘‘అదికాదు వంశీ, ఈ వయసులో మాకు పెళ్ళేమిటి?’’

‘‘అదేంటి అంకుల్‌ అలా అంటారు. ఇప్పుడు మీ వయసేమంత మించిపోయిందని. అమ్మకి నలభై ఆరు దాటలేదు. మీకు యాభై  దాటలేదు. కనీసం ముప్ఫై ఏళ్ళ జీవితం ఉంది మీ ముందర. ఇలా ఒంటరిగా ఎంత కాలం గడుపుతారు. ఇప్పటివరకూ మనోజ్ఞా నేనే మీలోకమై ఉన్నాం. మున్ముందు మనోజ్ఞా నేనూ మీకు పూర్తిగా తోడుండడానికి వీలవుతుందో లేదో చెప్పలేం. మా వృత్తి జీవితాలతో, సంసార ఝంఝాటాలలో పడి మీతో ఎంతసేపు గడపగలుగుతామో మాకే తెలీదు. అందుకే మీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక జీవన సహచరి, సహచరుడు ఉండాలి. అమ్మకి మీరూ మీకు అమ్మా గత ఆరేళ్లుగా బాగా తెలుసు. ఒకరంటే ఒకరికి గౌరవం, అభిమానం ఉన్నాయి. ఇద్దరి అభిరుచులు కూడా బాగా కలుస్తాయి. నాకు తెలిసి మీరు కలిసి జీవించడానికి ఒప్పుకుంటే మీ జీవితాలు ఎంతో ఆనందంగా హృద్యంగా సాగిపోతాయి. ఒకరికొకరు జీవితాంతం ఆలంబనగా నిలుస్తారు.

దయచేసి ఒప్పుకోండి అంకుల్‌’’ అర్ధింపుగా అన్నాడు వంశీ.

‘‘మీకు పెళ్ళి చేయాల్సిన వయసులో మాకు పెళ్ళేమిట్రా మీ పిచ్చి కాకపోతేను?’’ ఎంతో లోతైన బావిలోనుంచి వస్తున్నట్టు బలహీనంగా వినపడింది అనుపమ గొంతు.

మనోజ్ఞ అనుపమ పక్కకి చేరి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుంటూ అంది... ‘‘ఆంటీ! అమ్మ ప్రేమంటే తెలియకుండా పెరిగిన దాన్ని. మీరు కలిశాకే అమ్మ ప్రేమలోని మాధుర్యం ఎలా ఉంటుందో తెలిసింది. మీరూ నాన్నగారూ కలిసి ఉంటే రేపు నేను పెళ్ళి చేసుకున్నాక కూడా నాకంటూ ఒక పుట్టిల్లు, ఒక అమ్మా నాన్నా ఉంటారు. మీ దగ్గర నేను అమ్మ ప్రేమని సంపూర్ణంగా జీవితాంతం పొందగలుగుతాను. నాకోసం నాన్నా, వంశీ కోసం మీరూ మీ సరదాలన్నీ చంపుకుని ఎంత త్యాగం చేశారో మా ఇద్దరికీ బాగా తెలుసు. ఇకమీదైనా మీకోసం మీరిద్దరూ జీవించాలన్నది మా ఇద్దరి ఆకాంక్ష. దయచేసి కాదనకండి ఆంటీ.’’

‘‘మీ సంగతటుంచు. ఈ సమాజం నవ్విపోదూ పెళ్ళీడు కొచ్చిన పిల్లల్ని పెట్టుకుని తగుదునమ్మా అని సిగ్గు లేకుండా పెళ్లి చేసుకున్నారని’’ చివరి ప్రయత్నంగా సమాజం ప్రసక్తి తెచ్చింది అనుపమ.

‘‘నాకూ మనోజ్ఞకూ లేని అభ్యంతరం ఈ సమాజానికెందుకమ్మా. ఉంటే మాకుండాలి. మేమే పెళ్లి చేసుకోమని మిమ్మల్ని ప్రోద్బలం చేస్తుంటే అభ్యంతరం చెప్పడానికి వాళ్ళెవరమ్మా. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా విమర్శించినా మనమెవ్వరం పట్టించుకోవలసిన అవసరం లేదు. కొద్దిరోజుల్లో వాళ్ళే మరిచిపోతారు. మనోజ్ఞా నేనూ మరో నాలుగైదేళ్లు మా చదువులపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాం. సాధ్యమైనంత ఎక్కువ చదివి విద్యలో, వృత్తిలో పూర్తి నైపుణ్యం సాధించిన తరువాతే సరైన జోడును చూసుకుని జీవితంలో స్థిరపడదలచుకున్నాం. ఈలోగా మా ఇద్దరికీ కావాల్సింది మీ ఇద్దరి సంతోషం, ఆనందం. మా కోరికను కాదనకుండా ఒప్పుకోండమ్మా’’ మరోసారి అనుపమను అర్ధించాడు వంశీ. అదే సమయంలో మనోహర్‌ని కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది మనోజ్ఞ.

ఏం మాట్లాడాలో తెలీక యాదృచ్ఛికంగా మనోహర్‌ వైపు చూసింది అనుపమ ఏం చేద్దామన్నట్లు. అతని కళ్లల్లో లీలగా కనబడుతున్న అంగీకార భావం చూసి అప్రయత్నంగా వంశీ మాటలకు తలూపింది తన ఒప్పుదలను సూచిస్తూ. ఆమె తలూపగానే గట్టిగా అరిచాడు వంశీ- ‘‘మనో, అమ్మ ఒప్పేసుకుంది’’ అని.

అతని కేక వినగానే మనోజ్ఞ ఒక్క ఉదుటున అనుపమ పక్కకి చేరి ‘‘థ్యాంక్యూ ఆంటీ థ్యాంక్యూ’’ అంటూ అనుపమను పట్టుకుని కుదిపేసింది గట్టిగా కావలించుకుని. అనుపమ ఎర్రబారిన ముఖంతో సిగ్గుల మొలకే అయింది.

‘‘మనో, అంకుల్‌ ఇంకా ఏమీ చెప్పలేదు’’ సందేహం వెళ్ళబుచ్చాడు వంశీ.

‘‘నాన్న అంగీకారమా... అమ్మ సరే అన్నాక ఆయన ఒప్పుదల ఎవరికి కావాలి? అయినా నామాట కాదనే ధైర్యం ఉందా ఆయనగారికి?’’ తల ఎగరేస్తూ అంది మనోజ్ఞ. ఆమె మాటలకు ఒక చిన్న మందహాసం చేశాడు మనోహర్‌.

వాళ్ళ నవ్వులతో ఆ ఇల్లు ఒక స్వర్గసీమే అయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..