అబ్బాయి పెళ్ళి

అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్‌ ఫోన్‌ చేశాడు. ‘‘చెప్పన్నయ్యా, వదినా పిల్లలూ అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి?’’ అడిగింది సుమిత్ర.

Updated : 27 Feb 2022 01:28 IST

అబ్బాయి పెళ్ళి

యశోదాకైలాస్‌ పులుగుర్త

ప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్‌ ఫోన్‌ చేశాడు.

‘‘చెప్పన్నయ్యా, వదినా పిల్లలూ అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి?’’ అడిగింది సుమిత్ర.

‘‘అంతా బాగానే ఉన్నాం సుమిత్రా, బావగారు ఎలా ఉన్నారు? ఇంక రెండేళ్ళలోనా బావగారి రిటైర్‌మెంట్‌’’ అనగానే, ‘‘అవునన్నయ్యా’’ అంటూ జవాబిచ్చింది.

‘‘మీ వికాస్‌ పెళ్ళి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్రా?’’

‘‘ఏమిటో అన్నయ్యా, విక్కీకి ఏ అమ్మాయీ నచ్చడం లేదు. రెండేళ్ళుగా చూస్తున్నాం. ఒక్కోసారి అనుకుంటాను... ఏ ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు, మాకు ఈ బాధలు ఉండేవి కాదూ అని...’’ సరదాగా చెప్పింది అన్నగారితో.

‘‘మా మీద బాధ్యత పెట్టినపుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు. పెద్దాడు వినోద్‌ అలా కాదు... అమెరికాలో ఉన్నా మేము చూసి చెప్పిన మొదటి సంబంధానికే నచ్చిందని చెప్పాడు. కానీ వీడు అలా కాదు’’ అంటూ సుమిత్ర తన గోడుని వెళ్ళబోసుకుంది అన్నగారి దగ్గర.

‘‘అలా అనకే సుమిత్రా... ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకడం గగనమైపోతోంది. అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు. ఇంతకీ నీకో విషయం చెప్పాలని ఫోన్‌ చేశాను. నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్‌మేట్‌ సుధారాణి గుర్తుందా? సుధా వాళ్ళన్నయ్యా నేనూ అప్పట్లో ఫ్రెండ్స్‌మి కదా... ఈమధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకుని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నాం.’’

‘‘అయ్యో అన్నయ్యా, సుధ గుర్తు లేకపోవడమేమిటీ? నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినపుడు తను కూడా కాకినాడలో పుట్టింట్లో ఉందని తెలిసి తనని కలిశాను కూడా. తను వైజాగ్‌ నుండి వచ్చిందపుడు. అఫ్‌కోర్స్‌, ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిందనుకో... దాని భర్త స్టేట్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడని చెప్పింది. ఆ తరువాత మళ్ళీ కలవలేదు, తనతో ఏ కాంటాక్టూ లేదు కూడా.’’

‘‘వాళ్ళు ఇప్పుడు హైద్రాబాద్‌లో హబ్సిగూడాలో ఉంటున్నారుట. సుధ కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారుట. అమ్మాయి చాలా బాగుంటుందనీ మంచి ఉద్యోగం కూడా చేస్తోందనీ సుధ అన్నయ్య శేఖర్‌ చెప్పాడు. శేఖర్‌కి నీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చి వాళ్ళ సుధకి పంపమన్నాను. బహుశా తను నిన్ను కాంటాక్ట్‌ చేయొచ్చు. నేను కూడా సుధ నంబరు నీకు పంపుతాను. పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్రా... పైగా మనకు బాగా తెలుసున్న కుటుంబం కూడానూ.’’

‘‘నిజమేననుకో, కానీ అప్పట్లో సుధ చాలా పొగరుగా గర్వంగా ఉండేది అన్నయ్యా.’’

‘‘అది అప్పట్లో కదా... పెళ్ళి అయి ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా మారకుండా ఉంటుందా? సుధ వాళ్ళ అమ్మా నాన్నగారూ అక్కా అన్నయ్యా అందరితో మనకు అప్పట్లో మంచి కాంటాక్ట్‌ ఉండేది.’’

‘‘జస్ట్‌ గుర్తొచ్చి చెప్పానంతే, మాట్లాడతానులే అన్నయ్యా. సుధ కూతురు విక్కీకి నచ్చితే అంతకంటే ఏం కావాలి’’ అంటూ ఫోన్‌ పెట్టేసింది.

రెండు రోజులు ఎదురుచూసింది.

ఏ ఫోనూ రాలేదు. ‘ప్రస్తుత రోజుల్లో అబ్బాయి వైపు వాళ్ళే ప్రతీ దానికీ ఆత్రుత పడవలసి వస్తోంది. సంబంధం ముందూ సంబంధం చూసుకున్నాకా కూడా. అమ్మాయి తరఫువాళ్లు ఏమీ స్పందించరు... ఏ విషయమూ చెప్పరు. అబ్బాయి వైపు వాళ్ళే ఫోన్‌ చేసి ‘ఏమైందండీ’ అని అడిగితే అప్పుడు కూల్‌గా ‘ఇప్పుడే మీకు చెపుదామనుకుంటున్నాం’ అంటూ ఏదో సాకు చెప్పి నాన్చేస్తారు. అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగా చెప్పరు. ఈ లోపల టెన్షన్‌ అంతా అబ్బాయి వైపు వాళ్ళే పడాలి. వాళ్ళు మటుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు.

ఏం చేస్తాం’ అనుకుంటూ, సుధకి తనే ఫోన్‌ చేసింది. చాలా బిజీగా ఉన్న మూలాన తరువాత మెల్లిగా చేద్దాములే అనుకుందిట సుధ. తను వికాస్‌ వివరాలు చెపుతూ, వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది. కూతురు ధృతి వివరాలు ఇచ్చింది సుధ. ఒరాకిల్‌ కార్పొరేషన్‌లో నాలుగు సంవత్సరాలనుండి పనిచేస్తోందని చెప్పింది. వికాస్‌ అమెజాన్‌లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది. ముందస్తు షరతుగా ధృతికి అమెరికా వెళ్ళడం ఇష్టం లేదనీ కాబోయే అల్లుడు కూడా ఇండియాలోనే ఉంటానంటేనే సంబంధాన్ని ఒప్పుకుంటామన్నట్లు చెప్పింది. అలాగే తన కూతురి జాబ్‌ విషయం ఆమె ఇష్టమనీ పెళ్ళయినాక ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదన్నట్లూ చెప్పింది. వికాస్‌కూ అమెరికా వెళ్ళడం ఇష్టంలేదనీ జాబ్‌ విషయంలో తమకు పట్టింపులు ఏమీ లేవనీ తను కూడా ముప్ఫై సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నాననీ చెప్పింది సుమిత్ర.

‘‘నా కూతురికీ నచ్చితే, నాదేముంది’’ అంది సుధ. ‘‘ఇద్దరివీ ఫోన్‌ నంబర్లు ఇద్దాము, వాళ్లు మాట్లాడుకుంటారులే’’ అని సుధ అంటే, ‘‘అలా కాదు ఒక మంచిరోజు చూసుకుని మేమే వికాస్‌తో కలసి మీ ఇంటికి వస్తాం’’ అని చెప్పింది సుమిత్ర.

‘‘ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్రా? తాత ముత్తాతల కాలంలోలాగా పెళ్ళి చూపులూ అవీ ఎందుకు?’’ అంది సుధ.

ఆ మాటల్లో కాస్త నిరసన కన్పించినా సుమిత్రే సర్దుకుంటూ, ‘‘పెళ్ళి చూపులుగా కాదు సుధా, జస్ట్‌ నిన్ను చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది కదా, చూసినట్లుగా కూడా ఉంటుంది’’

అనేసరికి, ఇంకేమీ మాట్లాడలేక రమ్మనమని చెప్పింది సుధ.

ధృతి వికాస్‌కి చాలా నచ్చేసింది. తన రిక్వైర్‌మెంట్‌కి తగ్గట్లుగా అందం, ఉద్యోగం, బోల్డ్‌నెస్‌ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు. ధృతికి కూడా వికాస్‌ నచ్చడంతో పెళ్ళి ఫిక్స్‌ చేసుకున్నారు.

పెళ్ళి విషయాలంటూ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధ. కట్న కానుకలవీ సుమిత్రకూ ఇష్టంలేదు కాబట్టి ఆ ప్రసక్తి రాలేదు. కానీ పెళ్ళిలో జరిగే కొన్ని కొన్ని సంప్రదాయాలూ పద్ధతులూ ముద్దుముచ్చట్ల గురించైనా సుధ మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురుచూసింది. అయినా తను గమనిస్తూనే ఉంది సుధను... ఏ తల్లికైనా- కూతురికి మంచి సంబంధం కుదిరిందంటే ఆ ఆనందం ముఖంలో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. కానీ సుధ ముఖం ఎప్పుడూ ఎందుకో గంటు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడు మాట్లాడినా తన కూతురిని అల్లారుముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నామనీ తన కూతురిని విడిచి ఉండలేనట్లు మాట్లాడుతుందే తప్ప, పెళ్ళీ ఆ తరువాత జరగబోయే కార్యక్రమాల ప్రసక్తి ఉండదు. లోకంలో తనూ తన కూతురులా ఎవరూ ఉండరన్న భావాన్ని సుధ తన మాటల్లో అడుగడుగునా వ్యక్తపరుస్తూనే ఉంటుంది.

తనకీ విక్కీ అంటే పంచప్రాణాలే.

తన గారాల కొడుకు. ఆరువారాల ముందే పుట్టేసిన విక్కీ- పుట్టినపుడు చాలా అర్భకంగా ఉండేవాడు. అసలు వాడు తనకి దక్కుతాడా అని ఆవేదన చెందేది. తను వాడిని కళ్ళల్లో వత్తులు వేసుకుని జీతం నష్టం మీద ఒక సంవత్సరం సెలవు పెట్టుకుని మరీ పెంచుకుంది.
‘కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుందన్న బెంగేమోలే పాపం సుధకు’ అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో ‘ఒకే ఊళ్లో ఉంటున్నాం. నీ కూతురిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా, ఎందుకంత బాధపడతావు’ అని ధైర్యం చెప్పినా... ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు. కాబోయే కోడలితో సరదాగా కాసేపు తను మాట్లాడాలనిపించేది సుమిత్రకు. ధృతి అలవాట్లూ ఇష్టాయిష్టాలూ తెలుసుకోవాలని ఆరాటపడేది. కానీ తాము ఎన్నిసార్లు కలుసుకున్నా సుధ తనకు ఆ అవకాశాన్నిచ్చేదే కాదు. ఏమిటో తన సొత్తుని ఎవరు ఎత్తుకుపోతారో అన్నట్లుగా ఎప్పుడూ కూతురినే అంటుకునిపోతూ ఒక్క క్షణం కూడా కూతురికి దూరంగా ఉండలేనట్లుగా ప్రవర్తించేది. ఒకరోజు సుమిత్రే చొరవచూపి ‘‘పెళ్ళి షాపింగ్‌ చేద్దాం సుధా’’ అంటే, ‘‘షాపింగ్‌దేముంది సుమిత్రా, ధృతికి అన్నీ కొని పెట్టేశాను. ఒక్క పెళ్ళి చీర కొనాలి, ఇంకా టైముందిగా’’ అంటూ దాటేసింది. కానీ సుమిత్రే చొరవ చూపి బలవంతంగా షాపింగ్‌ చేద్దామని చెప్పి కాబోయే కోడలికి పెళ్ళి చీరలూ జ్యూయెలరీ కొంది. ఇక బాగుండదని వికాస్‌కి పెళ్ళి బట్టలు తీసుకున్నారు వాళ్లు.

పెళ్ళి జరిగిపోయింది ఏ ఆర్భాటాలూ లేకుండా. ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్ళి జరిపించినట్లు సుమిత్రకు అనిపించింది.

ఫస్ట్‌ నైట్‌ ఏదో ఒక పెద్ద హోటల్‌లో బుక్‌ చేసుకున్నారు వికాస్‌, ధృతి. ఈ విషయంలో సుధ ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకి తరువాత తెలిసింది.

పెళ్ళయి పది రోజులు గడచిపోయాయి. కూతురిని ఎప్పుడు అత్తారింటికి పంపించాలనుకుంటున్నారోనన్న ప్రసక్తి సుధ మాటల్లో ఏనాడూ తీసుకురాలేదు. ‘ఎన్ని ఆధునిక భావాలున్నా కనీస సంప్రదాయాలంటూ ఉంటాయన్న ఇంగితం కూడా ఉండదా’ అనుకుంటూ బాధపడింది సుమిత్ర. వికాస్‌ మాత్రం వాళ్ళింటికి తరచుగా వెళ్తూ ఒక్కో రోజున అక్కడే ఉండిపోతున్నాడు.

ఒకరోజు వికాస్‌తో సుమిత్ర ‘‘ఏరా విక్కీ, ధృతిని మనింటికి ఎప్పుడు పంపిస్తారుట?’’ అని అడిగింది.

‘‘నాకవన్నీ తెలియవు మమ్మీ. అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటంట?’’ అని తిరిగి ప్రశ్నించాడు.

మనసుని సరిపెట్టుకోలేక ఒక రోజున తనే సుధకి ఫోన్‌ చేసి ‘‘సుధా మంచి రోజు చూసుకుని ధృతిని అత్తారింటికి పంపించు’’ అంది సుమిత్ర.

‘‘అదేమిటి సుమిత్రా, అత్తారిల్లు, పుట్టిల్లంటూ నీకూ పట్టింపు ఉందా? ఇప్పటి పిల్లలకి అవేమీ లేవు. వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు. నేను మా ధృతిని అలాగే పెంచాను. ఎప్పుడో దానికి మూడ్‌ ఉన్నపుడు వచ్చి వెళుతుందిలే’’ అంటూ తేలికగా తీసిపారేసింది.

అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్‌ చుట్టపుచూపుగా వచ్చింది. దానికే సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. చాలా హడావుడి పడిపోతూ ఏవేవో స్పెషల్‌ డిషెస్‌ చేసేసింది. కూతురు వచ్చిన మరుక్షణం నుండి ధృతికి ఒకటే ఫోనులు సుధ నుండి. ధృతికి తల్లితో మాట్లాడటమే సరిపోయింది, అసలు తనతో మాట్లాడిన మాటలు ఒకటి అరా అంతే. ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది. ఏదో ముఖ ప్రీతికి రావడం ఏమిటోననుకుంటూ ధృతి వెళ్ళిన వైపే మ్రాన్పడిపోయి చూస్తూ ఉండిపోయింది సుమిత్ర. ఆ తరువాత మళ్ళీ ధృతి రానేలేదు. తను కూడా ఇక అడగదలచుకోలేదు.

వికాస్‌ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళుతున్నాడు. ‘‘అదేమిటి విక్కీ, ఇలా ఎన్ని రోజులు అటూ ఇటూ తిరుగుతావు? నీ భార్యను మనింటికి రమ్మనమని చెప్పకూడదా, ఈ తిరుగుడు తప్పుతుంది.’’

‘‘మమ్మీ, ధృతిని విడిచి ఆంటీ ఉండలేరుట, ఆవిడను బాధపెట్టడం ఎందుకు’’ అన్నాడు.

‘‘మరి నాకు రా విక్కీ? మాకూ నువ్వు ప్రాణమే, వదిలి ఉండలేము. కానీ నీకు ధృతితో పెళ్ళి అయింది. భార్యను నీతో తెచ్చుకోవడం పద్ధతి’’ అంటే, ‘‘చూద్దాంలే మమ్మీ, ఇప్పుడు నాకేమీ కష్టంగా లేదు, నెమ్మదిగా ఆంటీతో మాట్లాడుతానులే’’ అని తేలిగ్గా అనేశాడు.
ఒకరోజు వికాస్‌ వస్తూనే ‘‘మమ్మీ మేము మా ఆఫీసుకి దగ్గరగా ఒక ఫ్లాట్‌ రెంట్‌కి తీసుకున్నాం. వచ్చే ఆదివారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం’’ అన్నాడు.

‘‘అదేమిటి విక్కీ ఇంత సడన్‌గానా... ఎందుకీ నిర్ణయం? ఇప్పుడు మనముంటున్న ఈ ఫ్లాట్‌ మీ ఇద్దరి ఆఫీస్‌కి ఎంత దూరమని? పది కిలోమీటర్లలోపే ఉంది కదా... కారులో వెళ్తే పదిహేను నిమిషాలు డ్రైవ్‌. మనకి సొంత ఫ్లాట్‌ ఉండగా రెంట్‌కి మరొకటి ఎందుకు, డబ్బు దండగ కదా విక్కీ? నీకు ఆఫీస్‌కి దగ్గరగా ఉంటుందనే కదా... మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్‌ ఇల్లు అమ్మేసి ఈ ఫ్లాట్‌ కొన్నాం. అయినా మీ డాడీతో ఒక్కమాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకోవడం ఏ మాత్రం బాగా లేదురా’’ అంది సుమిత్ర.

‘‘డాడీతో కూడా చెపుతాను మమ్మీ. నువ్వన్నది నిజమే, కానీ మేము కూడా మా కెరీర్‌నీ ఫ్యూచర్‌నీ ప్లాన్‌ చేసుకోవాలి కదా. అక్కడికి వెళ్ళాక విల్లా కొనడానికి ప్లాన్‌ చేస్తున్నాం... రెండున్నర కోట్లట. మేము ఉండబోయే ఫ్లాట్‌కి దగ్గరలోనే విల్లా కూడానూ. దగ్గర ఉంటే అన్నీ చూసుకోవచ్చు కదా. మా ఇద్దరి శాలరీస్‌కి ఎంత లోన్‌ వస్తుందో చూసుకోవాలి.

ఆంటీ వాళ్ళే మాకు ఫ్లాట్‌ చూశారు. ఆంటీ అంకుల్‌ విల్లా బుక్‌ చేసుకోడానికి అడ్వాన్స్‌ పేమెంట్‌గా కొంత హెల్ప్‌ చేస్తామన్నారు. అంతా వాళ్ళే చూస్తున్నారు’’ అన్నాడు.

సుమిత్రకి చాలా కోపం వచ్చేసింది. తెలుసున్న సంబంధం అని చేసుకుంటే చివరికి ఇలా జరుగుతోందన్నమాట. అత్తమామల నిర్ణయాలకి లొంగిపోతూ డూడూ బసవన్నలా తలూపుతున్నాడు వీడు. తమని పరాయివాళ్ళను చేసి ప్రతీదీ వాళ్ళే నిర్ణయించడం పట్ల మనసు చాలా బాధపడుతోంది. విక్కీ భవిష్యత్‌ బాగుండాలని వాడిని కన్న తల్లిదండ్రులుగా తమకి మాత్రం ఉండదా?

జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడలేని అసహాయత. ‘ఇదేమిటి’ అని వాళ్ళను నిలదీసి అడిగితే చాలు, పెద్ద రాద్ధాంతం చేసి సంసారాలు విడిపోయే పరిస్థితిని కలిగిస్తారు.

అందుకే మౌనంగా ఉండిపోయింది.

వికాస్‌ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్లు ఉన్నాడు. పక్క గదిలోనుండి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఆయన ఏమీ అనకుండా ‘మంచిది’ అనేసి ఊరుకున్నారు. ‘విల్లా బుకింగ్‌కి అడ్వాన్స్‌ పేమెంట్‌ కట్టే ముందు చెప్పు. మా తరఫు నుండి ఒక పది లక్షలిస్తాం’ అని చెప్పారు.

వాడు వెళ్ళిపోగానే, ‘‘అదేమిటీ, విక్కీ ముందుగా మనతో ఒక్క మాట చెప్పకుండా ఇలా చేస్తుంటే మంచిది అంటారేమిటండీ’’ అంటూ భర్తను నిలదీసింది కోపంగా.

‘‘చూడు సుమిత్రా, నీ మానసిక సంఘర్షణని అర్థం చేసుకోలేని మూర్ఖుడిని కాదు. నేనూ అన్నీ గమనిస్తూనే ఉన్నాను. వాడితో పోట్లాడమంటావా, లేక వాడి అత్తమామలతో పోట్లాడమంటావా?’’

‘‘అది కాదండీ, అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని రెండు రోజులైనా ఉందా? పెళ్ళయి ఆరు నెలలైనా కూతురిని అత్తారింటికి పంపమంటే ఇంకా అత్తిల్లు, పుట్టిల్లంటూ ఏమిటని అంటుందా సుధ? అలా అని ఇన్ని రోజులూ పెళ్ళయినా కూడా కూతురిని తన దగ్గరే పెట్టుకోలేదా? కూతురితోబాటు తెలివిగా మన విక్కీని కూడా మన నుండి దూరం చేసింది. కూతురిని అత్తారింటికి పంపకుండానే ఏకంగా విడికాపురమే పెట్టిస్తోంది వాళ్ళచేత. తెలుసున్న సంబంధం అని ఎగిరిపడుతూ మరీ వాళ్ళ వెనకపడినందుకు భలే శాస్తి అయింది నాకు. విక్కీ తల్లిదండ్రులం ఇంకా బతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు...’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యవైపు జాలిగా చూస్తూ-

‘‘నువ్వు వాళ్ళ వెనకపడకపోయినా ఈ పెళ్ళి జరిగేది... ఎందుకంటే రాసిపెట్టినదాన్ని ఎవరూ తప్పించలేరు కనుక. పోట్లాడి మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్రా? ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా తెగిపోవడం తప్ప. వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే, మనల్నే దుర్మార్గులుగా చూస్తారు జీవితమంతా.

ప్రస్తుతం- ఆడపిల్లల తల్లిదండ్రులవే రోజులన్నీ. పెళ్ళయినా కూతురి సంసార విషయాలలో జోక్యం చేసుకుంటూ డామినేట్‌ చేస్తున్నారు. ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెంచుకోడానికి కూడా వెనుకాడటలేదు. అప్పట్లో కూతురిని అత్తారింటికి పంపిస్తూ బోల్డన్ని జాగ్రత్తలు చెపుతూ సంసారం చక్కగా చేసుకో తల్లీ, అత్తవారింట మెప్పు పొందమని దీవించేవారు. కానీ ఇప్పుడు మగపిల్లలే అణిగిమణిగి ఉండే రోజులు వచ్చాయి. ‘పెళ్ళయ్యేదాకానే ఆడపిల్లలు మన పిల్లలు’ అనేవారు వెనక... ‘పెళ్ళయ్యేదాకానే మగపిల్లలు మన పిల్లలు’ అనుకోవాలి ఇప్పుడు. నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే సుమిత్రా, వాడిని కనిపెంచి ప్రయోజకుడిని చేసి పెళ్ళి చేశాం.

వాడు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో. అంతేకానీ, వాడిమీద ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకోకు. కోరికల్నీ ఆశల్నీ తగ్గించుకుని సర్దుకుపోతేనే కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాం. లేకపోతే అనుక్షణం దిగులూ విచారమే’’ అనిచెప్పి గంభీరంగా అక్కడ నుండి వెళ్ళిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..