ఆనంద నందనం

‘‘బాబూ, అక్కడ ఫ్యాను ఉన్నచోట కాకుండా ఒక్కడివే ఇక్కడ కూర్చున్నావేం..?’’ ‘‘ఇక్కడ కిటికీ దగ్గర గాలి బాగానే వస్తోందండీ... పైగా దూరంగా కనిపిస్తోన్న కొండనీ, చెట్లూ చేమల్నీ చూడటం కూడా బావుంది. నేను ఇంటర్వ్యూకని వచ్చాను.

Published : 08 Oct 2022 23:01 IST

ఆనంద నందనం

- గోగినేని మణి

‘‘బాబూ, అక్కడ ఫ్యాను ఉన్నచోట కాకుండా ఒక్కడివే ఇక్కడ కూర్చున్నావేం..?’’

‘‘ఇక్కడ కిటికీ దగ్గర గాలి బాగానే వస్తోందండీ... పైగా దూరంగా కనిపిస్తోన్న కొండనీ, చెట్లూ చేమల్నీ చూడటం కూడా బావుంది. నేను ఇంటర్వ్యూకని వచ్చాను. సమయం ఉంది పిలవటానికని చెప్పటంతో ఏదో పుస్తకం తిరగేస్తూ కాలక్షేపం చేస్తున్నా.’’

‘‘అవునా, అయితే నువ్వు చదువుకో... నేనూ పక్కన కూర్చుందామని ఇటు వచ్చా. పెద్దవాడిని కదా... ఏవో మాటలు కలుపుతూంటే నీకు ఇబ్బంది. అటు పక్కకు వెళ్తాలే. ఇక్కడకు మా అబ్బాయితో వచ్చా. వాడికేదో పని ఉంది. పూర్తిచేసుకుని వచ్చే వరకూ నాకు ఖాళీయే.’’

‘‘అయితే ఇక్కడే కూర్చోండి, నాకేం ఇబ్బంది లేదు. ఈ కాసేపటిలో నేను ప్రిపేరవ్వాల్సిందేం ఉండదులెండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడటం వలన ప్రయోజనం ఉంటే ఉంటుందిగానీ నష్టం అయితే ఉండదు కదండీ..!’’

‘‘ప్రయోజనం మాత్రం ఏం ఉంటుందంటావ్‌..?’’

‘‘పెద్దల మాటల్లో చాదస్తం ఉంటుందని చాలామంది అనుకుంటారుగానీ, వాటిని అనుభవంతో ఇచ్చే సలహాలుగా స్వీకరించగలిగితే,కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయని నేననుకుంటాను- అది ప్రయోజనమే కదా... మీరేదో ఇబ్బంది అన్నారని ఇదంతా చెప్పుకొచ్చాను. ఎక్కువగా మాట్లాడుతున్నాననిపించిందా..? ఆ పైన... మిమ్మల్ని చూడగానే నాకు మా తాతయ్య గుర్తుకొచ్చారు. నాకు మా ఇంట్లోవాళ్ళల్లో తాతయ్యతోనే ఎక్కువ స్నేహంలెండి.’’

‘‘నాకూ నీతో మాటలు కలపటం సంతోషంగా అనిపిస్తోంది. అయితే ఇక్కడే కూర్చుని కాలక్షేపం చేసేస్తా.

ఇంతకీ నీ పేరేమిటంటావ్‌?’’

‘‘ఆనందం’’

‘‘అదేమిటీ, ముందూ వెనకా ఏమీ లేవా..?’’

‘‘మా తాతయ్య నన్ను పిలిచే పేరే మీకు చెప్పాను. నన్నలా పిలుస్తూంటే, మా తాతయ్యకు మనసంతా ఆనందంగా మారిపోతుందని అంటూ ఉంటారండీ.’’

‘‘బావుందయ్యా. మరి ఇంటిపేరు?’’

‘‘ఆనంద నందనం’’

‘‘ఇలాంటి సర్‌నేమ్‌ ఉంటుందని నాకు తెలియను కూడా తెలియదే!’’

‘‘అది సర్‌నేమ్‌ కాదండీ, మేం మా ఊళ్ళో కొత్తగా కట్టించుకున్న ఇంటికి పెట్టుకున్న పేరది. గేటుకి ఒక పక్కగా ఈ పేరు రాసి ఉంటుంది. ఇక రెండు ప్రహరీ గోడల మీదా బొమ్మలు కూడా వేయించాం. స్త్రీ, పురుషుల సమానత్వం గురించి తెలియజేసేలా ఇంటి పనులూ, పొలం పనుల దృశ్యాలూ, పండుగ సంబరాలూ విద్య గురించి బోధించే బొమ్మలూ... ఇలాంటివి మా ఊళ్ళో ఉండే భాస్కరం అనే ఆర్టిస్టు ఎంత బాగా వేశాడనుకున్నారూ. మా ఇంటిముందు నుండి... రోజూ వెళ్ళే వాళ్ళయినా సరే, నిదానంగా అడుగులు వేస్తూ ఆగి ఆగి బొమ్మలు చూస్తూ వెళ్తూంటారండీ. అదేమిటో, మా ఇంటి ప్రసక్తి వస్తే, నాకు ఉత్సాహం పొంగుకు వచ్చేస్తుంది.’’

‘‘అది తెలుస్తోంది. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తుంటారు?’’

‘‘మా ఊళ్ళో వ్యవసాయమేనండీ.’’

‘‘మీ ఊళ్ళో ఎన్ని ఎకరాలున్నాయేం?’’

‘‘అబ్బో... చాలానే ఉన్నాయి. నాకు లెక్క తెలియదండీ.’’

‘‘అన్ని ఎకరాలు ఉంటే, మీ నాన్న ఒక్కరే సాగు చేయగలరా... కౌలుకి ఇచ్చేశారా?’’

‘‘మా నాన్నే ఎందుకు చేస్తారూ?

మా ఊరివాళ్ళు అందరూ ఎవరివి వారే సాగు చేసుకుంటారు.’’

‘‘భలేవాడివే. ‘మీకు’ అని అడగలేదని అందరివీ కలిపి చెప్పావా?’’

‘‘మా ఊరు అని అనుకుంటాం కాబట్టి, ఊళ్ళో ఉన్నవన్నీ మా అందరివీ అని నా ఉద్దేశ్యం కూడా లెండి. ఇక మాకు ప్రత్యేకంగా మాత్రం ఓ మూడెకరాలు ఉన్నాయండీ.’’

‘‘అంతేనా, అయితే ఆర్థిక ఇబ్బందులూ ఎక్కువే ఉంటాయిగా. ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్ళే సరిగా పండీ పండక అంటూ ఇబ్బందులు చెబుతూంటారు.’’

‘‘అదేంలేదండీ, మేం భాగ్యవంతులమే!’’

‘‘అవునా, అంటే ఇతరత్రా వ్యాపారాలేవైనా..?’’

‘‘అవేం లేవండీ. మా ఇంట్లో అందరం ఆరోగ్యవంతులమే. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు కదండీ. మా తాతయ్యకి దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళున్నా, మా నాన్నతో సమానంగా నడుస్తూ పొలానికి బయలుదేరతాడు. అక్కడ ఒడ్డున కూర్చోమన్నా వినకుండా పొలంలోకి దిగుతాడు. అంతేనా, చుట్టుపక్కలవాళ్ళ పొలాలకి తిరుగుతూ ఏవో సలహాలిస్తూంటాడు. మా నాన్నమ్మ కూడా అంతేనండీ... క్షణం తీరిగ్గా కూర్చోదు. అమ్మతో కలిసి రోజంతా కోళ్ళూ పశువుల పెంపకం పనులు చూస్తూనే ఉంటుంది.’’

‘‘పాపం... అందరూ బాగా కష్టపడతారన్నమాట. లేకపోతే ఈ రోజుల్లో ఇల్లు గడవటం కష్టమే అవుతుంది మరి.’’

‘‘పాపం అనే మాట ఇక్కడ కరెక్టు కాదండీ. ఇష్టపూర్వకంగా చేసే కష్టం వల్ల ఆనందమే తప్ప ప్రయాస ఏం ఉండదండీ. కష్టపడి పనిచేసి, కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోగలగటాన్ని మించిన ఆనందం లేదని తాతయ్య చెబుతూంటారు... నిజమేకదండీ. తాతయ్య ఇంకో మాట కూడా అంటూ ఉంటారు... ఉత్సాహంతో పనిచేసే వారి అరిచేతిలోనే ఆనందానికి చిరునామా దొరుకుతుందని. అమ్మావాళ్ళు పెరట్లో మొక్కల్ని పెంచినా, ఆవుల్నీ గేదెల్నీ పోషించినా ఆనందం కోసమేగానీ, వాళ్ళ దృష్టి ఆదాయం మీద ఉండదండీ. అమ్మకాలకంటే పంపకాలే ఎక్కువ మరి. మా వాళ్ళకే కాదండీ... మా ఊరివాళ్ళందరికీ కూడా ఇచ్చి పుచ్చుకోవడం, ఉన్నది అందరితో పంచుకోవడం లాంటి మంచి అలవాట్లు ఉన్నాయండీ.’’

‘‘నీ మాటలు కడుపు నిండిన వాడివిలా ఉన్నాయి. మరి నువ్వూ మీ ఇంట్లో వాళ్ళతోపాటు, కష్టపడి వ్యవసాయమేదో చేసుకోక, ఉద్యోగం కోసం ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావయ్యా?’’

‘‘అందరూ ఒకే పని చేస్తే ఎలా... అందరూ అన్ని రకాల పనులూ చేస్తేనే ప్రజల అవసరాలు తీరతాయి, అంతేకదండీ. అందుకే నా చదువుకి తగిన ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటున్నా.’’

‘‘ఒకవేళ ఈ ఉద్యోగం రాలేదనుకో...’’

‘‘ఓడిపోయినట్లు కాదని మా వాళ్ళు ముందే చెప్పారు. సాధించేవరకూ ప్రయత్నించాల్సిందేననే ధైర్యమూ ఇచ్చారు. విఫలం చెందొచ్చుగానీ ప్రయత్న లోపం ఉండకూడదని అంటారు కదండీ...

మాదీ అదే సిద్ధాంతం.’’

‘‘సెలెక్ట్‌ కాకపోయినా నిరాశపడనంటావ్‌... అంతేగా?’’

‘‘నిరాశ కలిగినా, దాన్ని ఈ ఆఫీసు దగ్గరే వదిలేసి ఉత్సాహంగానే ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభిస్తానంటున్నానండీ.’’

‘‘అనకూడదుగానీ చాలాసార్లు అలా జరిగినా ఆశాభంగం ఉండదా, అలా ప్రయత్నిస్తూనే ఉంటావా?’’

‘‘అప్పుడు నా దారి మార్చే ప్రయత్నం చేస్తానేమో. అమ్మావాళ్ళకి సాయం చేయటంలో అలవాటైన కోళ్ళ పెంపకమో, పది పాడి పశువుల్ని పెట్టుకుని పాల వ్యాపారమో మొదలుపెడతాననుకుంటా.’’

‘‘నీకు ధీమా కొంచెం ఎక్కువే సుమా!’’

‘‘కష్టపడే తత్వం, శ్రమించగలిగే శక్తీ ఉన్న వాళ్ళకు అటువంటి భరోసా ఉంటుందండీ, ఆనందంగానూ బతగ్గలరు.’’

‘‘బావుందయ్యా, నేను చెప్పటం కాదు, నువ్వే నాలుగు మంచిమాటలు నాకు వినిపించావు. నీ మాటలు వింటూంటే, మీ ఊరునీ మీ వాళ్ళనూ ఒకసారి చూసి రావాలనిపిస్తోంది.’’

‘‘నా మాటల్లో మీకేం అనిపించిందో తెలియదుగానీ, మాది చాలా సామాన్యమైన కుటుంబమేనండీ. ప్రత్యేకతలేం లేవు. అయితే, మీరు వచ్చారంటే మాత్రం మా వాళ్ళు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి, మిమ్మల్ని అభిమానంతో నాలుగు రోజులు కదలనివ్వకుండా కట్టిపడేస్తారనుకోండీ.’’

‘‘నిజమా... తప్పకుండా ఓసారి వస్తా. అది సరేగానీ, నిన్ను ఇంటర్వ్యూకి ఇంకా పిలవలేదు. ఇంతసేపు కూర్చోబెట్టేశారూ... యజమానులనేవాళ్ళు ఇంతే... అహం ఎక్కువ ఉంటుంది.’’

‘‘అయ్యో, అలా అనుకోవటం దేనికిలెండి. నేను ఇదే పనిమీద వచ్చాను కాబట్టి కాసేపు వేచి ఉండటంలో ఇబ్బందేం ఉండదు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్నవాళ్ళకి చాలా పనులే ఉంటాయిగా. అయినా ఇక్కడ చాలా మర్యాదగా ఒక కూపన్‌ ఇచ్చి ఆలస్యం అయి, ఆకలి వేస్తే క్యాంటీన్‌లో టిఫినో భోజనమో చేయొచ్చనీ చెప్పారు.’’

‘‘అర్థమైంది... నువ్వు ఎవరిలోనైనా, ఏ పనిలోనైనా ముందుగా మంచిని మాత్రమే ఎంచి చూసే రకమని.’’

‘‘మీరూ మీ అబ్బాయి కోసం ఎదురుచూస్తూ కూర్చునే ఉన్నారు. మీరేమీ అనుకోకపోతే నా దగ్గరున్న కూపన్‌ తీసుకుని క్యాంటీన్‌లో ఏదైనా కొంచెం టిఫిన్‌ తిని రండి.’’

‘‘అదేమిటీ, ఆలస్యం అవుతుందేమోనని నీకు ఇచ్చారు. నీకు అవసరం అవుతుందిగా?’’

‘‘నాకు సాయంకాలం వరకూ ఆకలి వెయ్యదండీ. ఇంట్లో అంత సుష్టుగా తిని వచ్చా.’’

‘‘అంటే... ఎన్ని రకాల వంటకాలు చేసి పెట్టారేం మీ ఇంట్లో..?’’

‘‘ఆధరవులు ఎక్కువ ఉంటే సుష్టుగా తినగలుగుతామనుకోవటం నిజం కాదు కదండీ. మనకోసం ఇష్టంగా చేసి, ఆప్యాయంగా వడ్డించే వాళ్ళనిబట్టే అన్నం రుచీ పెరుగుతుందంటారు. నిజమే, అందుకేగా... ఎవరికైనా అమ్మచేతి వంట తర్వాతనే మరేదైనా అనిపిస్తుంది. నిజానికి నేనివాళ పప్పూ పచ్చడితోనే ముగించేశా. ‘హడావుడిగా కూర చేస్తే ముట్టుకోనేలేదూ’ అని నాన్నమ్మ సణుగుతూనే ఉంది. ‘సాయంకాలం వచ్చాక తింటాలే’ అని నాన్నమ్మ నొచ్చుకోకుండా నచ్చచెప్పి హడావుడిగా వచ్చేశా.’’

‘‘అయినా, నీ కూపన్‌ నాకు ఎందుకులే. అవసరం అయితే, డబ్బు ఇచ్చే తింటా. నా దగ్గర డబ్బులు లేవని అనిపించిందా నీకు?’’

‘‘అదేంకాదండీ, పెద్దవారు కదా...

ఈ పరిచయంతో కలిసి కాఫీ తాగుదాం అని పిలవలేనుగా. అందుకే కేవలం గౌరవంతో, మర్యాద కోసమని... అంతేనండీ.’’

‘‘మీ ఇంటికే వస్తానన్నాగా... అప్పుడు కడుపునిండా తింటాలే!’’

‘‘అంతకన్నా ఆనందం ఇంకేముంటుందీ... తప్పకుండా రావాలి. అడ్రస్‌ చెప్పమంటారా?’’

‘‘వద్దులే, నా దగ్గర ఉంది.’’

‘‘నా అడ్రస్‌...మీకు...ఎలా...తెలుసూ..?’’

‘‘నీ పేరు నందకిషోర్‌ అయితే, మీ తాతయ్య పిలిచే పేరంటూ ‘ఆనందం’ అని ఎలా చెప్పావో, నేనూ అలానే కొంత నిజం, కొంత కల్పన కలిపి నా గురించి చెప్పాను. మా అబ్బాయితో ఈ ఆఫీసుకి వచ్చింది... వాడికి ఇంటర్వ్యూలో సాయం చేద్దామని. ఈ ఫ్యాక్టరీ మాదేలే. వాడితో కలిసి ఆఫీసు రూమ్‌లోకి వెళ్తుంటే అందరికీ దూరంగా కూర్చున్న నువ్వు ప్రత్యేకంగా కనిపించావ్‌. నాకే ఈ ఆలోచన సొంతంగా వచ్చిందో లేక ఎక్కడైనా చదివిన లేక చూసిన ఇటువంటి సంగతి ప్రభావం ఉందో తెలియదుగానీ, నిన్ను... ఇదిగో ఇలా ఇంటర్వ్యూ చేసి, సెలెక్ట్‌ చేసేశాను.’’

‘‘మీరు చెప్పింది... నాకింకా అయోమయంగా, ఆశ్చర్యంగా ఉందండీ... నా గురించి...’’

‘‘ఒక్క మెతుకు పట్టుకుని చూసి అన్నం ఉడికిందో లేదో తెలుసుకున్నట్లు... ఈ నాలుగు మాటల ద్వారా నీ గురించి బాగానే తెలుసుకున్నానని అనుకుంటున్నాను. ఏ పనిని అయినా నిజాయతీగా కష్టపడి ఇష్టంగా చేసే తత్వం నీదనిపించింది. నువ్వు ఈ ఆఫీసులో ఉంటే, నీ చుట్టుపక్కలున్న వాళ్ళకీ ఉల్లాసాన్నీ ఉత్తేజాన్నీ కలిగిస్తూ పని చేయించగలవు. మీ ఇల్లే కాదు, నీ వల్ల ఈ ఆఫీసు కూడా ‘ఆనంద నందనం’గా మారుతుందని భావిస్తూ, నీ విద్యార్హతలకు అదనంగా నీ వ్యక్తిత్వానికే ఎక్కువ మార్కులు వేశాను.’’

‘‘చాలా సంతోషమండీ. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానే తప్ప వమ్ము చేయను. ఇంటికి నేనీ రోజు మామూలుగా వెళ్ళను... గాలిలో తేలుతూ వెళ్తాను. ఈ రోజునూ మిమ్మల్నీ ఎప్పటికీ మరచిపోలేను.’’


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..