స్వయం సిద్ధ

‘‘సుప్రజ అంటే ఆ రోజు భర్తతో విడాకులు తీసుకోవాలన్న అమ్మాయేనా?’’ అన్నారు మావారు.

Updated : 06 Mar 2022 00:56 IST

స్వయం సిద్ధ

రేణుక జలదంకి

‘‘సుప్రజ అంటే ఆ రోజు భర్తతో విడాకులు తీసుకోవాలన్న అమ్మాయేనా?’’ అన్నారు మావారు.

‘‘అవునండీ, తనే! కూతురు పెళ్ళట... మన ఇద్దరినీ రమ్మని ఫోను చేసి మరీమరీ చెప్పింది... తప్పకుండా వెళ్లాలి.’’

‘‘నీ ప్రియమైన విద్యార్థిని కూతురి పెళ్ళంటే వెళ్ళక తప్పుతుందా? దానికి తోడు నువ్వు సాధించిన విజయం!’’ నవ్వారు శ్రీవారు.

సుప్రజ దగ్గరనుంచి ఫోను వచ్చినప్పటినుంచీ నా మనసు గర్వంతో గంతులు వేస్తోంది. ఇది నా విజయం, ఇద్దరు పిల్లలు మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణమయ్యాను. సుప్రజ కొడుకు భరత్‌ ఐఐటీలో మంచి ర్యాంకు సంపాదించి యూఎస్‌లో జాబ్‌ చేస్తున్నాడట. కూతురు కావ్య బీటెక్‌ చేసి హైదరాబాద్‌లో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తుందట. ఇవన్నీ తాను చెప్తుంటే, అవన్నీ నేనే సాధించినంత గర్వంగా ఉంది. నా ప్రమేయం లేకుండానే నా మనసు గతంలోకి పరుగులు తీసింది.

              

ముప్పై ఏళ్ళ క్రితం ఏలూరులో జూనియర్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజులు...

మొదటిరోజు ఇంటర్‌ సిఈసీ మొదటి సంవత్సరం తరగతి తీసుకోబోతూ అందరినీ పరిచయం చేసుకుంటుండగా నన్ను ఓ అమ్మాయి ఆకర్షించింది. ఆ అమ్మాయి అందంగానే ఉన్నప్పటికీ నన్ను ఆకర్షించింది ఆ అమ్మాయి అందం కాదు... పదవ తరగతిలో తనకు వచ్చిన మార్కులు. అంత మంచి మార్కులు వచ్చిన అమ్మాయి సిఈసీ ఎందుకు తీసుకున్నట్లు..?- అదే అడిగాను. తనకు బొద్దింకలన్నా, కప్పలన్నా భయమట. సైన్సు తీసుకోవాలంటే ప్రాక్టికల్స్‌ ఉంటాయని తీసుకోలేదంది. ఖాళీ పీరియడ్‌ ఉన్నప్పుడు మాట్లాడాలని స్టాఫ్‌ రూమ్‌కు రమ్మని చెప్పాను.

‘అలాగే మేడమ్‌’ అంది వినయంగా - తనే సుప్రజ..!

చెప్పినట్లుగానే స్టాఫ్‌ రూమ్‌కి వచ్చిన సుప్రజకు బైపీసీ తీసుకోమనీ ప్రాక్టీసు మీద ప్రాక్టికల్స్‌ సులభమవుతాయనీ ఒకవేళ మరీ భయమైతే, చేయవలసిన అవసరం లేకుండా, ప్రిన్సిపాల్‌తో మాట్లాడతాననీ చాలా నచ్చచెప్పాను. ఎంత నచ్చచెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో, కాస్త కోపం వచ్చినా, ఆ పిల్ల మూర్ఖత్వానికి జాలి కూడా కలిగింది.

ఆ తర్వాత మా రెండేళ్ళ ప్రయాణంలో తను నాకు చాలా దగ్గరైంది. తరగతిలో మొదటిగా ఉండే విద్యార్థులను ఇష్టపడని ఉపాధ్యాయులు ఉండరు కదా!

ఇంటర్మీడియట్‌ పూర్తయ్యాక మా కాలేజీకి అనుసంధానంగా ఉండే డిగ్రీ కాలేజీలోనే బీకాంలో జాయినయింది.

రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు, సుప్రజకు పెళ్ళి అన్న వార్త విని ఎందుకో బాధపడ్డాను. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లను చదువు మాన్పించి పెళ్ళి చేస్తున్న ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద బాగా కోపం వచ్చింది.

సుప్రజను పిలిపించి మాట్లాడాను. అమ్మాయిలకు తమ కాళ్ళ మీద తాము నిలబడే స్థిరత్వం చదువు ఇస్తుందనీ వీలైతే పెళ్ళి ఆపమనీ ఒకవేళ సాధ్యం
కాకపోతే పెళ్ళయినా చదువు మానవద్దనీ చెప్పి, ఆశీర్వదించి పంపించాను.

విద్యార్థినులతోపాటు కాలేజీ లెక్చరర్లమంతా కూడా పెళ్ళికి వెళ్ళి వచ్చాం. పెళ్ళికొడుకు అందంగా ఉన్నాడు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. నాకు సంతోషంగా అనిపించింది.

ఆ తర్వాత అప్పుడప్పుడూ తన స్నేహితుల ద్వారా సుప్రజ సంగతులు తెలియడమే కానీ, తనను ప్రత్యక్షంగా చూసిందే లేదు. సుప్రజ స్నేహితురాళ్ళు కూడా చాలా ఫిర్యాదులే చేశారు. వాళ్ళ పెళ్ళిళ్ళకు సుప్రజ రాలేదనీ పుట్టింటికి కూడా అరుదుగానే వస్తోందనీ ఇద్దరు పిల్లలు- అయిదేళ్ళ బాబూ మూడేళ్ళ పాపా అనీ తెలిసింది.

ఓ రోజు కూరగాయల మార్కెట్‌ దగ్గర సుప్రజ నాన్నగారు కనిపించారు. సుప్రజ కాలేజీలో చదివేటప్పుడు ఆయన మా కాలేజీకి వస్తుండటంతో ఆయన్ని గుర్తుపట్టిన నేను ఉత్సాహంగా సుప్రజ గురించి అడిగాను.
ఆయన చెప్పిన విషయం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సుప్రజ భర్తను వదిలేసి వచ్చేసిందట. విడాకులు తీసుకోవాలని పట్టుబడుతోందట. ‘‘మేమంతా ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదమ్మా! మీరు శ్రమ అనుకోకుండా మా ఇంటికి రాగలరా? మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్తే నేను కారు తీసుకుని వస్తాను’’ అభ్యర్థనగా అన్నారాయన.

ఆలస్యం మంచిది కాదని, వెంటనే సుప్రజ ఇంటికి వెళ్ళి సుప్రజను చూసిన నేను నివ్వెరపోయాను. ఒకప్పుడు గలగలపారే గోదారిలా, ఆత్మవిశ్వాసం నింపుకున్న ముఖంతో, చెరగని చిరునవ్వుతో కనిపించిన సుప్రజలో అవేవీ మచ్చుకైనా కానరాలేదు. పిల్లలు మాత్రం ముద్దుగా బొమ్మల్లా ఉన్నారు. కాసేపు కుశలప్రశ్నలు అయ్యాక అసలు విషయంలోకి దిగాను.
‘‘ఏం చెప్పమంటారు మేడమ్‌! పెళ్ళనగానే భర్త నన్ను ప్రేమగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడనీ ఒకరికి ఒకరంగా ఉండాలనీ కలలు కన్నాను. కానీ, కనీసం ప్రేమగా ఓ మాట, నా పట్ల రవ్వంత అభిమానం కూడా చూపించకపోవడం మొదట్లో నాకు చాలా బాధనిపించింది. క్రమేణా నాకు అర్థమైంది... ఆయనకు స్త్రీలంటే చులకన భావం. కనీసం ప్రేమగా మాట్లాడాలన్నా కూడా నేను ఎక్కడ అది అలుసుగా తీసుకుంటానో అని ఇగో’’ ఒక్క క్షణం నా మనసు కలుక్కుమనిపించినా, సర్దుకున్నాను.

‘‘ఇలాంటివన్నీ గమనించినా గమనించనట్లే ఉండిపోవాలి సుప్రజా! అప్పుడు అతని ఇగో దెబ్బతినదు.’’

‘‘అలా కూడా చేశాను మేడమ్‌. అంతేకాదు, నా మీద ఆధిపత్యం చలాయించాలనే ధోరణి తప్ప, నన్ను ప్రేమతో కట్టిపడేయాలని తెలియని మూర్ఖత్వం. నన్ను కనీసం నా తల్లిదండ్రులతో, స్నేహితులతో కూడా మాట్లాడనివ్వరు. ‘ఓ చిన్న మెచ్చుకోలు మాట కాదు కదా, ఈసడించకపోతే చాలు- అదే మహాభాగ్యం’ అనే పరిస్థితికి వచ్చాను. చిన్న విషయంలో కూడా నాకై నేను నిర్ణయం తీసుకోకూడదు. తినే తిండీ కట్టుకునే బట్టలూ అన్నీ ఆయన ఇష్టప్రకారమే చేయాలి. అలా నేనంటూ లేకుండా ఓ మరబొమ్మలా మారిపోయినప్పటికీ, ఓ చిన్న ప్రశంస కూడా కోరుకోకుండా ఉండలేకపోతున్నాను.’’

‘‘నీ చదువు..?’’ అడగడం అనవసరం అనుకుంటూనే అడిగాను. అలాంటి వ్యక్తి సుప్రజ చదువు సాగనిస్తాడా? 

సుప్రజ నిస్తేజంగా చూసింది.

‘‘ఏమైనా దురలవాట్లు ఉన్నాయా?’’ సందేహిస్తూనే అడిగాను.

‘‘మందు తాగడం అలవాటుంది మేడమ్‌. కానీ ఇప్పటివరకూ చెప్పిన దురలవాట్ల ముందు మద్యం తాగడం అనేది నా దృష్టిలో చాలా చిన్న లోపం. పిల్లల విషయంలో ఆర్థికపరమైన బాధ్యత తీసుకుంటారు, అంతే! నావల్ల కావడం లేదు మేడమ్‌. అనుక్షణం నేను తన ముందు ఓ గడ్డిపోచలా తీసివేయబడుతూ జీవించడం నావల్ల కావడం లేదు. అందుకే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.’’

నేను ఓ పది నిమిషాలు మాట్లాడలేకపోయాను.

‘‘మరి పిల్లలు...?’’ మెల్లగా పెదవులు కదిపాను.

‘‘పిల్లల్ని నేనే పెంచుకుంటాను మేడమ్‌.’’

‘‘మరి పిల్లలకు తండ్రి ప్రేమ ఎలా దొరుకుతుంది? నువ్వు ఇంత చిన్నవయసు నుండీ ఒంటరిగా ఉండటం సాధ్యమా?’’

‘‘ఎందుకు ఉండలేను మేడమ్‌.

ఒకవేళ సాధ్యం కాకపోతే వేరే పెళ్ళి చేసుకుంటాను.’’

‘‘నీకు ఈసారి లభించే భర్త ఎలాంటి అవలక్షణాలూ లేకుండా ఉండగలడని హామీ ఇవ్వగలవా? ఒకవేళ నీకు మంచి భర్త లభించినా, నీ బిడ్డలకు తండ్రి మాత్రం కాలేడు. సరే, వదిలేయ్‌. ఒకవేళ నీ భర్త నీకు పిల్లలను ఇచ్చేందుకు ఒప్పుకోకపోతే..?’’

‘‘పిల్లల కోసం వీలైనంత వరకూ కోర్టులో పోరాడుతాను. ఒప్పుకోకపోతే పిల్లలను ఇచ్చేస్తాను మేడమ్‌.

నా చదువును కొనసాగిస్తాను. నా బతుకు నేను బతుకుతాను.’’

‘‘అలా ఇచ్చేస్తే వారికి తల్లి ప్రేమ ఎలా దొరుకుతుంది? నీ భర్త వేరే పెళ్ళి చేసుకున్నా ఆ వచ్చే ఆవిడ అతనికి భార్య కాగలదు కానీ, నీ బిడ్డలకు మనస్ఫూర్తిగా తల్లి కాలేదు కదా?’’ ఈసారి సుప్రజ మౌనంగా
ఉండిపోయింది.

‘‘మాతృత్వం ఓ పదవి సుప్రజా!

ఏ పదవిలో అయినా హక్కులు కూడా ఉంటాయి కానీ, ఈ పదవిలో అన్నీ బాధ్యతలే! ఓ బిడ్డకు జన్ననిచ్చాం అంటే ఆ బిడ్డను మంచి పౌరునిగా పెంచగలగాలి. మనం జన్మనిచ్చిన పిల్లలు దేశానికి మేలు చేయకపోయినా ఫర్లేదు, హాని చేసేవారు కాకూడదు. తల్లిదండ్రుల పోషణలో సక్రమంగా పెరగనివారే ఎక్కువమంది సమాజానికి హానిచేసే చీడపురుగులుగా తయారవుతారు. మన కడుపున పుట్టిన పిల్లలు ఉన్నతస్థాయికి వెళ్ళేలా చూడగలగాలి. నీ పిల్లలు ఎదిగే ప్రతి మెట్టుకూ నువ్వు నిచ్చెనగా నిలవాలి.

నీ భర్తలో అవలక్షణాలు అంటావా... వాటిని ఎదుర్కొనడానికి ప్రయత్నించు. వదిలి దూరంగా వచ్చి కాదు, దగ్గర ఉండే ప్రయత్నించు. వీలు కాకపోతే సహనంతో సర్దుకుపో. సర్దుకుపొమ్మని ఎందుకు
అంటున్నానంటే... లేకపోతే మీమధ్య గొడవల వల్ల పిల్లలకు మనశ్శాంతి ఉండదు. వారికి అందమైన బాల్యాన్ని అందివ్వు. వారు ప్రశాంతంగా చదువుకుని పైకి రావాలంటే మీమధ్య వివాదాలు వారికి తెలియనివ్వకు. మాతృత్వం అనే పదవి నీకు అందించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించు.’’

‘‘పిల్లలకు మంచి బాల్యాన్ని అందివ్వాలంటే, ఆయన నాకు నచ్చని పనులెన్ని చేసినా నోరు ఎత్తకూడదు మేడమ్‌.
నోరెత్తితే రభసే! ఎక్కడ పక్కింటివారు వింటారో అన్నట్లు, నేను సర్దుకునిపోయే కొద్దీ, అది ఆయన అలుసుగా తీసుకుంటున్నారు. అలా ఓ బానిసలా పడి ఉండటం చాలా కష్టంగా ఉంది’’ బాధగా చెప్పింది.
నేను ఏమీ మాట్లాడలేకపోయాను.

సుప్రజ చాలాసేపు తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది. ఓ పదినిమిషాలు చూసి గదిలోనుండి బయటకు నడిచి, సుప్రజ తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చేశాను. బయటకు వస్తుండగా అమాయకమైన ముఖాలతో ఎదురువచ్చిన సుప్రజ కొడుకూ, కూతురు బుగ్గలు నిమిరి సున్నితంగా ముద్దాడి వచ్చేశాను.

సుప్రజ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఫర్వాలేదు. నా బాధ్యత నేను పూర్తి చేశానని తృప్తిగా నిట్టూర్చాను. కొన్ని రోజుల తర్వాత సుప్రజ కాపురానికి వెళ్ళిందన్న వార్త నన్నుసంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

                         

సుప్రజ కూతురి పెళ్ళిరోజు రానే వచ్చింది. ఏలూరులో ముందుగానే హోటల్‌ గది బుక్‌ చేసుకున్నాం. పెళ్ళి సమయానికి తయారై అద్దె కారులో నేనూ మావారూ కల్యాణ మండపానికి చేరుకున్నాం.
అందరినీ ఆహ్వానిస్తూ మండపం గుమ్మంలోనే ఎదురయ్యారు సుప్రజ దంపతులు. ముదురు నీలం రంగు పట్టుచీరకు లేత గులాబీ రంగు అంచు ఉన్న చీర కట్టుకుని, గులాబీ రంగు పొడవు చేతుల జాకెట్టుతో వయసు తెచ్చిన ప్రౌఢ అందంతో హుందాగా కనిపించింది సుప్రజ. పక్కనే సూటులో ఆమె భర్త కాస్త గంభీరంగా కనిపించాడు. సుప్రజ నన్ను చూడగానే ‘‘మేడమ్‌’’ అంటూ వచ్చి ఆప్యాయంగా హత్తుకుపోయింది. మంచి మనసుతో నూరేళ్ళు చల్లగా ఉండమని మనసులోనే ఆశీర్వదించాను.

సుప్రజ కొడుకు యూఎస్‌ నుంచి వచ్చినట్లున్నాడు. అందరినీ చాలా మర్యాదగా పలకరిస్తున్నాడు. పెళ్ళకొడుకూ పెళ్ళికూతురూ చూడముచ్చటగా ఉన్నారు. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. స్టేజీ మీద సుప్రజ భర్తతో నూతన వధూవరులతో కలసి అభినందనలు అందుకుంటోంది.

సుప్రజతో కలిసి చదువుకున్న నా విద్యార్థినులు ఒకరిద్దరు కనిపించారు. అందరితో మాట్లాడి పెళ్ళి అయ్యాక భోజనం చేసి, బయలుదేరి రాబోతూ సుప్రజకు చెప్పి వచ్చేస్తానని మావారికి చెప్పి లోపలకు వెళ్లాను. అప్పుడే కాస్త విశ్రాంతి దొరికిందేమో పెళ్ళికూతురు గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది సుప్రజ.

‘‘ఎలా ఉన్నావు సుప్రజా? సంతోషంగా ఉన్నావు కదూ. మీ వారిలో మార్పు ఏమైనా వచ్చిందా?’’ నా ప్రశ్నకు అలాంటి సమాధానం వస్తుందనీ, అది నన్ను తర్వాత జీవితమంతా బాధపెడుతుందనీ తెలిసి ఉంటే అడిగేదాన్నే కాదు.

‘‘బావున్నానంటే అది అబద్ధమే మేడమ్‌... అందుకే నిజమే చెప్తాను. పిల్లల కోసం నన్ను రాజీపడమన్నారు. ఆరోజు మీరు చెప్పింది నాకు కూడా నిజమేననిపించింది. అందుకే నా భర్త దగ్గరకు వచ్చేశాను. ప్రతిక్షణం రాజీపడుతూ బతికాను. నా సుఖసంతోషాలు వదిలిపెట్టినప్పటికీ, పిల్లల చదువుల విషయంలో తీసుకునే నిర్ణయాల కోసం, ఇద్దరి అభిప్రాయాల్నీ ఒకే తాటి మీదకు తీసుకురావడానికి ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయాను. పిల్లల ఉన్నతే ధ్యేయంగా బతికాను.

కానీ గత కొన్నేళ్ళుగా తిరిగి చూసుకుంటే నాకోసం నేను గడిపిన ఒక్క క్షణమైనా కనిపించడం లేదు. నేను పుట్టింది ఇందుకేనా? పెళ్ళంటూ అయి పిల్లలు పుట్టారంటే, అతనిలో అవలక్షణాలు ఎన్ని ఉన్నా, అవమానాలు ఎన్ని ఎదురైనా, ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి అవి భరిస్తూ, అతనిలో మార్పు కోసం ఎదురుచూస్తూ, పిల్లలను చూసుకుంటూ... ఇదేనా... నా జన్మకు సార్థకత?

నా జీవితంలో ఏ ఒక్క క్షణమూ నేను సంతోషంగా జీవించిన దాఖలాలు లేవు. సమాజం ఒంటరి తల్లికి విలువివ్వదనే ఒకే ఒక్క కారణంతో భగవంతుడు ప్రసాదించిన విలువైన జీవితాన్ని నాలా బానిసలా గడిపేస్తున్న వారెందరో కదా. నాకు అర్థంకానిది ఒక్కటే మేడమ్‌... కప్పలూ బొద్దింకలంటే అసహ్యించుకునే నేను, ఆ సబ్జెక్ట్‌ వల్ల నాకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఇష్టం లేకుండా తీసుకోలేక ఆగగలిగాను. మరి నిత్యం నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మనిషిని ఎందుకు వదలలేకపోయాను?’’

సుప్రజ కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయేమో కనిపించలేదు. కానీ నా గుండె బాధతో బరువెక్కి ఏ క్షణమైనా పొర్లేట్లుగా ఉంది. ‘‘పెళ్ళికి ముందు మీరు నా శ్రేయస్సు కోరి చదువు గురించి చెప్పింది విన్నా
ఆర్థికంగా బాగుండేది. వివాహం గురించి చెప్పింది విన్నా ఆత్మస్థైర్యం మిగిలి ఉండేది. ఒకటి మాత్రం నిజం మేడమ్‌... ఎవరెన్ని చెప్పినా స్త్రీ తనకు తాను స్వయంగా సిద్ధం కాలేకపోతే ఉపయోగం ఉండదని
తెలుసుకున్నాను. కానీ ఒకందుకు సంతోషంగా ఉంది మేడమ్‌. నా కూతురినీ కొడుకునీ మంచి విలువలతో పెంచగలిగాను. రేపు నా కొడుకు ఇలా తన భార్యను మనసు లేని మరబొమ్మగా చూడడు.
నా కూతురు నాలా ఉండదు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ జీవిస్తుంది. వాళ్ళు తమ పిల్లలను కూడా అలాగే పెంచగలరు. నేను నా మనసు చంపుకుని కష్టపడిన ఫలితం ముందు తరాలకు నేను అందించిన మంచి ఆశయాలతో పెరిగిన నా పిల్లలు. ఆ రోజు నేను మీ మాట వినకపోయి ఉంటే నా భర్త లాంటి వ్యక్తులే ముందు తరాలలో పునరావృతమవుతుంటారు. అందుకు మాత్రం మీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటాను.’’

ఈసారి సుప్రజ కళ్ళు ఏ మూలో మరుగునపడి ఉన్న తడితో చెమ్మగిల్లాయి. మండపం అంతా పూలు..! అతివల తలలో పూలు..! దేవుని పటం దగ్గర పూలు..! వికసించి కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ఓ మూలగా పెద్ద గాజు సీసాలో అందంగా ఉన్న సంపెంగలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆ పూల పరిమళాన్ని ఆస్వాదించాలనిపించి దగ్గరగా వెళ్ళాను. విచిత్రం! వాటినుంచి ఎలాంటి సువాసనా రావడం లేదు. గాజుసీసాలో నిండుగా ఉన్న రసాయనంలోని ఆ అందమైన సంపెంగలు రసాయనంతో చేస్తున్న సహజీవనం వల్ల తమ సహజ పరిమళాన్ని ఎప్పుడో కోల్పోయాయి- అచ్చం... సుప్రజలా.

నా మనసు సముద్రాన్ని, ఆలోచనా తరంగాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. ‘నేను ఆ రోజు సుప్రజకు నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపించడం తప్పా ఒప్పా?’ అన్న సందిగ్ధంలో పడిపోయాను. నిజమే, సుప్రజకు- తనకంటూ జీవితమూ సంతోషమూ స్వేఛ్ఛా అవసరం లేదా? వ్యక్తిత్వాన్ని చంపుకుంటేనే కుటుంబమా? రెండూ కావాలంటే... ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు బదులెవరు చెప్తారు? ఈ లోకంలో ఇలా బాధ్యతల సుడిగుండంలో కొట్టుకుపోతున్న సుప్రజలందరినీ సమావేశపరిస్తే సమాధానం దొరుకుతుందా? ఏమో! ఎవరెన్ని చెప్పినా మహిళ స్వయంసిద్ధగా ఉన్నప్పుడే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుందేమో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..