ఓ తండ్రి తీర్పు

అడ్వకేట్‌ దగ్గరికి వెళ్లాడు రాజారాం. వెళ్లాక ఆయన చెప్పారు... ‘‘మీ అబ్బాయి దగ్గర నుంచి మెయిల్‌ వచ్చిందండీ. అలా ఎలా తీసుకుంటారు నిర్ణయం అంటున్నాడు. నేను మిమ్మల్ని తప్పుగా గైడ్‌ చేస్తున్నానట. అతను నాకంటే పెద్ద లాయర్‌ దగ్గరికి వెళ్తాడట

Updated : 18 Oct 2022 13:18 IST

ఓ తండ్రి తీర్పు

- ఉమాబాల చుండూరు

అడ్వకేట్‌ దగ్గరికి వెళ్లాడు రాజారాం. వెళ్లాక ఆయన చెప్పారు... ‘‘మీ అబ్బాయి దగ్గర నుంచి మెయిల్‌ వచ్చిందండీ. అలా ఎలా తీసుకుంటారు నిర్ణయం అంటున్నాడు. నేను మిమ్మల్ని తప్పుగా గైడ్‌ చేస్తున్నానట. అతను నాకంటే పెద్ద లాయర్‌ దగ్గరికి వెళ్తాడట. మీకు ఈ విషయం చెప్పాలని రమ్మన్నాను’’ అన్నారు అడ్వకేట్‌ కృష్ణకిషోర్‌.
‘‘నిన్న నాతో కూడా ఫోన్‌ చేసి మాట్లాడాడు. ఈ వయసులో ఇలాంటి పనేమిటి అని నిల దీశాడు. నేను నా ఇష్టం. నేనేమైనా చేస్తాను అని గట్టిగానే చెప్పాను. కోపంతో ఫోన్‌ కట్‌ చేశాడు. ఏమంటారు కృష్ణగారూ, నేను చేసింది న్యాయపరంగా వీగిపోదుగా’’ అడిగాడు రాజారాం.
‘‘నేను అన్నీ రిఫర్‌ చేసి నా సీనియర్స్‌ సలహా అడిగే మీ విషయంలో ముందుకు వెళ్లాను. మీకు కోర్టు ఆర్డర్‌ కూడా ఇచ్చింది. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది?’’ అడిగారు అడ్వకేట్‌.
‘‘బాగుందండీ. మాకు కూడా ప్రశాంతంగా ఉంది. వెళ్లొస్తాను’’ అని లేచి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి బయలుదేరాడు రాజారాం. ఇంటికి వెళ్లి భార్యకి విషయం చెప్పి, ‘నేను బట్టలు మార్చు కొస్తాను అన్నం పెట్టు’ అని లేచాడు. అన్నం తిని కాసేపు పడక కుర్చీలో నడుం వాల్చాడు.

*            *      *

రాజారాం తల్లిదండ్రులది మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఈయన రెండోవాడు. పెద్దకొడుకు వ్యవసాయం చూసుకునేవాడు. రాజారాం ఆరోజుల్లో బి.ఏ పాసయ్యి, తండ్రి సలహా మీద బి.ఇడి. ట్రైనింగ్‌ అయ్యాడు. తరువాత శ్రీకాకుళంలో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. తాత్కాలికంగా తండ్రికి సహాయంగా మారినా, జీవితంలో పైకి రావాలనే తపనతో ప్రైవేట్‌గా ఎం.ఏ చేసి, కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాడు విజయనగరంలో. తరవాత శారదతో పెళ్లి జరిగింది. కొడుకు పుట్టాడు. ‘మహాదేవ్‌’ అన్న పేరు పెట్టారు. తరవాత ఎందుకో మళ్లీ పిల్లలు కలగలేదు.
కొన్నాళ్లకు రాజారాం ప్రిన్సిపాల్‌ అయ్యాడు. హైదరాబాద్‌ బదిలీ అయ్యింది. అప్పటికి కొడుకు పదోతరగతి పరీక్షలు రాశాడు. హైదరాబాదులో మంచి కాలేజీలో చేర్చారు. స్వతహాగా తెలివితేటలు ఉన్నవాడు అవడంతో మహాదేవ్‌ చెన్నైలో ఐఐటీలో సీటు సంపాదించుకున్నాడు.
అప్పటికి రాజారాంకి ఇంకో నాలుగేళ్లు సర్వీస్‌ ఉంది. మహాదేవ్‌ చదువూ, ఆయన ఉద్యోగం ఒకేసారి పూర్తి అయ్యాయి.
మహాదేవ్‌కి క్యాంపస్‌ ఇంటర్వ్యూలో మంచి జాబ్‌ వచ్చినా మంచి యూనివర్శిటీలో ఎయిడ్‌ రావడంతో ఎంఎస్‌ కోసం అమెరికా వెళ్లాడు.
ఈలోపు ఒక సంఘటన జరిగింది... రాజారాం రిటైర్‌ అవడానికి రెండు నెలల ముందు ఆయన కాలేజీలో పనిచేసే ఇంగ్లీషు లెక్చరర్‌ గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయనకి రావలసిన మొత్తం, చనిపోయిన ఆయన కుటుంబానికి ఇవ్వడానికి రాజారాం ఒకటికి రెండుసార్లు వాళ్లింటికి వెళ్లాల్సి వచ్చింది.
చనిపోయిన ఆయనకి ఇంకా ఓ నాలుగేళ్ల సర్వీస్‌ ఉంది. పేరు భానుప్రకాష్‌. భార్య టీచర్‌గా పనిచేస్తోంది. ఒక కూతురూ, కొడుకు. కూతురు ఇంజినీరింగ్‌ అయిపోయి హెచ్‌.సి.ఎల్‌లో ఉద్యోగం చేస్తోంది. కొడుకు అప్పుడే ఇంజినీరింగ్‌లో చేరాడు.
భానుప్రకాష్‌గారిది పద్ధతైన సంసారం. కూతురు కూడా చూడటానికి లక్షణంగా ఉండటమే కాదు. సౌమ్యంగా బాధ్యతగా అనిపించింది. అలా ఆయన సంసారాన్ని చూశాకా, రాజారాంకి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది.
‘‘శారదా, భానుప్రకాశ్‌ గారి అమ్మాయిని చూస్తే నాకో ఆలోచన వచ్చింది. అమ్మాయి చక్కగా ఉంది. మంచి కుటుంబం, చక్కని సంస్కారవంతుల పెంపకం. మన మహీకి ఆ అమ్మాయిని అడిగితే ఎలా ఉంటుంది. వాడికి ఇంకో సంవత్సరంలో చదువు అయిపోతుంది. ఉద్యోగం ఎలాగూ వస్తుంది. ఎప్పుడైనా పెళ్లి చేయాలి కదా ఏమంటావు?’’ అన్నాడు భార్యతో.
‘‘మీరు అంతలా చెప్తున్నారంటే విశేషమే... కానీ అసలు మనం వాడి పెళ్లి గురించి అనుకోలేదే ఎప్పుడూ’’ అందావిడ.
‘‘మనం కావాలనుకున్నప్పుడు మంచి సంబంధం దొరకొద్దూ? రేపు ఆదివారం సాయంత్రం ఒకసారి వెళ్లొద్దాం వాళ్లింటికి. నువ్వూ అమ్మాయిని చూడొచ్చు’’ అన్నాడు రాజారాం.
అనుకున్నట్టుగానే మర్నాడు సాయంత్రం వాళ్లింటికి వెళ్లారు. ఏదో పనిమీద ఇటువైపు వచ్చి, మిమ్మల్ని చూద్దామని ఊరికే వచ్చాం అని చెప్పారు.

భానుప్రకాశ్‌ గారి భార్య సులోచన సంతోషించింది. కూతురు స్వర్ణసీత టీ చేసి తీసుకుని వచ్చింది. టీ తాగుతూ భార్యవైపు చూశారు. ఆవిడ కూడా కళ్లతోనే నవ్వింది రాజారాంని చూసి. ఆ అమ్మాయిని ఆఫీసు వివరాలూ, చదివిన కాలేజీ వివరాలూ అన్నీ అడిగారు. కాసేపు కూర్చుని వాళ్లని కూడా తమ ఇంటికి రమ్మని ఆహ్వానించి వచ్చేశారు.
దారిలో అంది శారద... ‘‘నిజమేనండీ అమ్మాయి కళగా బావుంది. మనవాడికి సూట్‌ అవుతుంది. నెమ్మదిగా కదిపి చూద్దాం. దేవుడి దయవలన అన్నీ కలిసొస్తే మంచిదే’’ అని.
మర్నాడే కొడుకుతో ఫోన్లో మాట్లాడారు.
‘‘అసలు నేను ఇంకా ఆలోచించలేదు ఆ విషయం’’ అన్నాడు మహీ.
‘‘ఇప్పుడు ఆలోచించరా... మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ. నాకూ అమ్మకూ నచ్చింది. నీకు బాగా సూటవు తుందని అనిపించింది. ఊరికే ఒకమాట నీ చెవిన వేద్దామని’’ అన్నాడు రాజారాం.
ఒక నెల రోజుల తరువాత రాజారాం, శారద డైరెక్ట్‌గా సులోచనగారింటికి వెళ్లి ‘‘మాకు మీ అమ్మాయి నచ్చింది. మీకిష్టమైతే మా అబ్బాయితో ఒకసారి మాట్లాడండి, ఇద్దరికీ నచ్చితే వచ్చే సంవత్సరం పెళ్లి చేద్దాం’’ అని చెప్పి, మహాదేవ్‌ ఫోటో, ఫోన్‌ నంబరు ఇచ్చి వచ్చారు.
మహాదేవ్‌కి కూడా స్వర్ణ ఫొటో పంపించారు. అబ్బాయీ అమ్మాయీ మాట్లాడుకోవడం, ఒకరికొకరు నచ్చడం జరిగిపోయింది.
ఈలోపు మహాదేవ్‌కి చదువు పూర్తయి అక్కడ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జాయిన్‌ అయ్యేముందు ఇండియా వచ్చాడు.
స్వర్ణసీతని ప్రత్యక్షంగా చూడటం... ఇద్దరికీ నచ్చడం జరిగింది. ఒక నెల రోజుల్లో వివాహం జరిగేటట్టూ, ఇక్కడ ఆఫీస్‌లో ఫార్మాలిటీస్‌ ముగించుకుని ఓ రెండునెలల తరువాత అమ్మాయి అమెరికా వెళ్లేటట్టూ నిర్ణయం తీసుకున్నారు.
కన్నుల పండుగగా పెళ్లి జరిగిపోయింది. జోడీ బావుందని అందరూ అన్నారు. పదిహేను రోజుల తరువాత మహాదేవ్‌ అమెరికా వెళ్లిపోయాడు.
స్వర్ణ అత్తగారింట్లో ఉంటోంది... అప్పుడప్పుడూ తల్లిదగ్గరికీ వెళ్తోంది. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే చాలా ముచ్చటగా ఉండేది రాజారాం దంపతులకు. చక్కగా వంట చేసేది స్వర్ణ. మంచి పనిమంతురాలు. మహాదేవ్‌ అదృష్టవంతుడనీ తమ సెలక్షన్‌ రైటే అనీ అనుకునేవారు వాళ్లిద్దరూ.
నెల రోజుల తరువాత స్వర్ణ అమెరికా వెళ్లిపోయింది డిపెండెంట్‌ వీసా మీద.
రోజంతా ఖాళీగా ఉండటం అలవాటు లేక ఇబ్బందిగానే ఉండేది స్వర్ణకి. మనకీ, వాళ్లకీ టైమ్‌లో తేడా వలన ఎప్పుడంటే అప్పుడు ఫోన్‌ చెయ్యడమూ కుదరదు. లోకల్‌గా ఇంకా ఎవరూ తెలీదు. జాబ్‌ చేద్దామన్నా డిపెండెంట్‌ వీసా మీద అక్కడ జాబ్స్‌ రావు.
‘‘ఇక్కడ ఏమన్నా హయ్యర్‌ కోర్స్‌ చదువు. నీకు టైంపాస్‌ అవుతుంది. తరువాత జాబ్‌ వస్తుంది ఇక్కడ చదవడం వలన’’ అని చెప్పాడు మహీ. సరే నంది స్వర్ణ.
అక్కడ అకడమిక్‌ ఇయర్‌ మొదలవడానికి ఇంకా రెండు నెలలుంది.
‘‘రెండు నెలల టైమ్‌ ఉంది కదా ఇండియా వెళ్లు. నెలా రెండు నెలలుండి వచ్చేశావంటే, రాగానే కాలేజీలో జాయిన్‌ అవ్వొచ్చు. ఒకసారి జాయిన్‌ అయ్యాకా మళ్లీ వెళ్లలేవు’’ అన్నాడు మహాదేవ్‌.
‘‘వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు, తరువాత వెళ్తాను’’ అంది స్వర్ణ.
‘‘ఇప్పుడు వెళ్లకపోతే ఇంకో రెండేళ్ల వరకూ వెళ్లలేవు. వెళ్తే నీకు కొంచెం బెంగ కూడా తగ్గుతుంది’’ అన్నాడు మహీ.
తను చెప్పిన దానిలో కూడా నిజం ఉందనిపించి సరే అంది స్వర్ణ.
వారంరోజుల్లో టికెట్‌ కొని ఇండియాకి పంపించాడు మహీ.
ఇన్ని రోజుల తరువాత తనవాళ్లని చూడబోతున్నందుకు స్వర్ణకి చాలా సంతోషంగా అనిపించింది. ఎయిర్‌పోర్ట్‌కి అత్తగారూ, మామగారూ, తల్లీ తమ్ముడూ అందరూ వచ్చారు రిసీవ్‌ చేసుకోవ
డానికి. అందరినీ చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి స్వర్ణకి. వాళ్లని వాళ్ల ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి తమ ఇంటికి వెళ్లిపోయారు రాజారాం దంపతులు.
ఒక వారం పోయాకా అత్తగారింటికి వచ్చింది స్వర్ణ. తను ఉన్నన్ని రోజులూ రోజూ ఏదో ఒక ప్లేస్‌కి వెళ్లిరావడం, రాత్రి అందరూ బయట హోటల్‌లో భోజనం చేయడం... సరదాగా గడిచిపోయాయి. అందరికీ తమ రొటీన్‌ లైఫ్‌లో కొంచెం బ్రేక్‌ వచ్చినట్టే అనిపించింది. స్వర్ణకి అటూ ఇటూ తిరగడంతో రోజులు గిర్రున తిరిగిపోతున్నాయి.
నెలరోజులు అవుతుండగా ఇక్కడ కూడా విసుగు అనిపించసాగింది స్వర్ణకి. తిరిగి అమెరికా వెళ్లిపోయి చదువులో పడితే బాగుండును అనిపిస్తోంది. అదే విషయం మహీకి చెప్పింది స్వర్ణ, వచ్చేస్తానని.
‘‘నేను చాలా బిజీగా ఉంటున్నాను. టికెట్‌ పంపుతాను వద్దువుగానీ. ఇంకొన్ని రోజులు ఉండు’’ అని చెప్పాడు మహీ.
పెళ్లి కాకముందు పరిస్థితి వేరు... పెళ్లి అయ్యాకా పరిస్థితి వేరు. భర్తా, తల్లిదండ్రులూ ఇద్దరూ కావాలనిపించడం సహజం. కానీ ఇద్దరిలో ఎవరు అని ఆప్షన్‌ వస్తే భర్తవైపే మొగ్గడం కూడా అతి సహజం. తిరిగి వెళ్లిపోవాలనే కోరిక బలీయమైపోసాగింది స్వర్ణకి. ఈ మధ్య తన మెసేజ్‌లకి జవాబూ రావడం లేదు. ఫోనూ ఆన్సర్‌ చేయడం లేదు మహాదేవ్‌.
రాజారాంతో అదే చెప్పింది స్వర్ణ. ‘‘మీరు ఫోన్‌ చేసి చెప్పండి మామయ్యా. నాకు దొరకడం లేదు మీ అబ్బాయి. నాకు వెళ్లిపోవాలని ఉంది’’ అని.
‘‘నేను కూడా కాల్‌ చేశానమ్మా, తీయలేదు. తరువాతైనా చూసుకుని కాల్‌ చేస్తాడు తిరిగి. అలా కూడా చేయలేదు. నేను ఈరోజు రాత్రి మెయిల్‌ ఇస్తానమ్మా. నీకు కాల్‌ చేయమంటాను, అలాగే టికెట్‌ బుక్‌ చేయమంటాను’’ అన్నాడు ఆయన.
ఆయనకీ కొంచెం వింతగానే ఉంది కొడుకు ప్రవర్తన. అన్నట్టుగానే కొంచెం ఘాటుగానే మెయిల్‌ ఇచ్చాడు. దానికీ రిప్లై లేదు. రెండ్రోజులు చూసి, మహీ ఫ్రెండ్‌ మెయిల్‌ ఐడి ఉంటే దానికి మెయిల్‌ ఇచ్చాడు... అందరం కంగారు పడు తున్నామనీ, కొడుకు క్షేమ సమాచారం చెప్పమనీ.
మర్నాడు పొద్దున్నే ఫోన్‌ వచ్చింది. వాళ్లకి రాత్రి టైం అది.
‘‘ఏంట్రా... ఏమై పోయావ్‌... మాకు కంగారుగా ఉంది. స్వర్ణకి ఏడుపు ఒకటే తక్కువ... ఏమైంది’’ అన్నాడు రాజారాం.
మహీ చిరాగ్గా ‘‘ఏంటి డాడీ మీరంతా ఇంత గొడవ చేస్తున్నారు. ఫ్రెండ్స్‌లో కూడా నా పరువు తీస్తున్నారు. అంత బెంబేలు పడేంత ఏముంది... బిజీగా ఉండి కాంటాక్ట్‌లో లేను’’ అన్నాడు.
‘‘అదేంటి మహీ... ఇది పెద్ద విషయం కాదా. ఒకపక్క నీ భార్యతో టచ్‌లో లేవు. మాతోనూ లేవు. ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చేస్తానంటోంది. టికెట్‌ కొని పంపించు తొందరగా. అసలు ఒకసారి స్వర్ణతో మాట్లాడు’’ అన్నాడు గట్టిగా.
‘‘నాకు కొన్ని ప్రోబ్లమ్స్‌ ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది. నేను చెప్తాను. మీరూ చెప్పండి తనకి’’ అని ఫోన్‌ కట్‌ చేశాడు.
తల పట్టుకుని కూర్చున్నాడు కాసేపు ఆయన. వెంటనే కోడలికి ఫోన్‌ చేసి చెప్పాడు విషయం.
కొన్ని రోజులు గడిచాయి. ఒక సాయంత్రం సడన్‌గా సులోచన వచ్చింది చాలా ఆందోళనగా.
‘‘అన్నయ్యగారూ ఇదేంటండీ... నాకు చాలా టెన్షన్‌గా ఉంది. మీ అబ్బాయి స్వర్ణకి మెయిల్‌ ఇచ్చాడట గంట క్రితం. మీకూ కాపీ పెట్టాడట, మీరు చూశారా’’ అందావిడ.
‘‘లేదమ్మా, ఇప్పుడే వాకింగ్‌ నుండి వచ్చాను. కంగారుపడకండి. నేను చూస్తాను’’ అని ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి చూశాడు. మొత్తం చదివి ఆయన మొహం కందగడ్డలా అయింది. పిచ్చెక్కింది వెధవకి అనుకుని మనసులో...
‘‘ఏదో తప్పు జరిగిందమ్మా. నేను సరిదిద్దుతాను. నేను రాత్రికి మీ ఇంటికి వస్తాను. మీరూ అమ్మాయీ కంగారు పడకండి. అన్నీ సర్దుకుంటాయి’’ అన్నాడు.
‘‘మీరే మాకు దిక్కు అన్నయ్యగారూ... పిల్ల ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది’’ అని కళ్లు తుడుచుకుని లేచిందావిడ.
‘‘ఏమైందండీ’’ అంది శారద ఆదుర్దాగా.
‘‘ఆ వెధవకి పిచ్చెక్కింది.’’
‘‘ఎవరికి’’
‘‘ఇంకెవరు, మన పుత్రరత్నానికి... స్వర్ణకి మెయిల్‌ ఇచ్చాడట. ‘నాకు నువ్వంటే ఇష్టం లేదు... ఇద్దరం స్నేహంగా విడిపోదాం. ఈ రోజుల్లో ఇది చాలా కామన్‌. నీకు తెలియందే ముంది. నువ్వు మీ మమ్మీకి చెప్పు. నేను నా పేరెంట్స్‌కి చెప్తాను. నేను చేసింది తప్పే... సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఇద్దరం డైవోర్స్‌ తీసుకుందాం... ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. సారీ...’ అని రాసి, నాకో కాపీ పెట్టాడు.
పెళ్లంటే ఆటనా... సింపుల్‌గా సారీ చెప్పి విడిపోవడానికి. మనమేమైనా దాచి పెట్టామా, బలవంత పెట్టామా. వాడు స్వర్ణను చూసి, నచ్చిందని చెప్తేనే కదా ముందుకు వెళ్లింది. ఇప్పుడు ఇలా మాట్లాడతాడా. నేను వదలను వాడిని. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఊరుకుంటానా... స్వర్ణ చేత విడాకులు ఇప్పించను. ఏం చేసుకుంటాడో చూద్దాం’’ అన్నాడు ఆవేశంగా.
రాజారాం కొడుక్కి ఫోన్‌ చేశాడు. ఈసారి వెంటనే ఫోన్‌ తీశాడు మహాదేవ్‌.
‘‘చెప్పండి డాడీ’’ అన్నాడు.
‘‘బుద్ధి ఉందిరా నీకు... ఏంటి విడాకులు ఇస్తావా. నీకు ఇష్టమైతేనే చేశాం కదరా పెళ్లి. ఇప్పుడు ఇష్టం లేదంటే అర్థం ఉందా’’ అన్నాడు కోపంగా.
‘‘డాడీ ఆవేశపడకండి. నాది తప్పే. నేను పెళ్లికి ఒప్పుకోవడం తొందరపాటే. సారీ చెప్తున్నాను కదా. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు. నా వలన తనకి జరిగిన అన్యాయానికి నేను మూల్యం చెల్లిస్తాను. ఎంత కావాలో అడగండి. నేను ఇన్నాళ్లూ దూరంగా ఉండటానికి ఇదే కారణం. నిర్ణయం తీసుకోవడానికి నాకు టైం పట్టింది. ఇంక చెప్పేయడం మంచిదని చెప్పేశాను. ఇవాళ రేపు ఇది కామన్‌ డాడీ. ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు మాట్లాడొద్దు. అందుకే, ఇప్పుడు నాలా తొందరపడకుండా ముందు కొంతకాలం కలిసి ఉండి... ఇద్దరికీ సరిపడుతుంది అనుకుంటేనే పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే ఫ్రెండ్స్‌లా విడిపోతున్నారు’’ అంటుండగానే...
‘‘షట్‌ అప్‌ మహీ... ఇంకో మాట మాట్లాడకు’’ కోపంగా అరిచాడు రాజారాం.
‘‘అంత అడ్వాన్సుడు అయిపోయావా. పెళ్లి చేసుకుని మూడు నెలలు కలిసుండి నచ్చ లేదంటావా... ఏదో వంకతో భార్యని ఇండియా పంపించేసి నాటకాలు ఆడతావురా...  నేను ఎంతో మందికి చదువు చెప్పాను. మంచీ చెడూ చెప్పాను. కానీ నా ఇంట్లోనే విష పురుగు పెరుగుతోందని గమనించుకోలేదు.
నువ్వు అడగ్గానే, నీకు విడాకులు వచ్చేస్తాయనుకుంటున్నావా... రాకుండా నేను చేస్తాను. స్వర్ణకి మేమున్నాం... ఏమనుకున్నావో’’ అనేసి మహీ ‘డాడీ డాడీ’ అంటున్నా, ఫోన్‌ కట్‌ చేసేశాడు కోపంగా.
స్వర్ణ వాళ్లింటికి వెళ్లి, ‘‘నువ్వేమీ వర్రీ అవ్వొద్దమ్మా. వాడు అడిగితే విడాకులు ఇచ్చేస్తామా ఏంటి. నీకు మేమున్నాం. నువ్వేమీ అధైర్యపడకు. నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది’’ అని రాజారాం అంటుండగానే...
‘‘వద్దు మామయ్యా, నువ్వంటే ఇష్టం లేదు అంటున్న వ్యక్తితో నేను కూడా జీవించలేను. ఏదైనా కారణం ఉంటే ఆ కారణం సహేతుకమైనా కాకపోయినా సర్దుకుపోవచ్చు. కానీ ‘నువ్వు వద్దు, నాకు ఇష్టం లేదు’ అని మొహం మీద చెప్పినప్పుడు అంతకంటే అవమానం ఉంటుందా... నేను పెళ్లికి ముందూ తరువాతా ఒకేలా ఉన్నాను.

నా ఉద్యోగం వదిలేసి మీ అబ్బాయితో బతకడానికి అంత దూరం వెళ్లాను. కొద్ది రోజులకి తనే నన్ను మభ్యపెట్టి చదువూ అదీ అని కబుర్లు చెప్పి, కొద్దిరోజులే అంటూ ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు సింపుల్‌గా సారీ చెప్పి, నువ్వు ఎంత కావాలంటే అంత డబ
ఇస్తానంటాడా? ఏమనుకుంటున్నాడు నన్ను? మీరంటే నాకు రెస్పెక్ట్‌ మామయ్యా-అత్తయ్యా. కానీ, అతన్ని మీరు ఎలాగో కన్విన్స్‌ చేసినా నాకు అతనితో బతకడం ఇష్టం లేదు. గౌరవంగా ఉద్యోగం చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతుంటే- మీరే వచ్చి అడిగారు. అమ్మ ఒంటరిది, మంచి సంబంధం అంటోంది, నేను చేసుకుంటే అమ్మకి బాధ్యత ఉండదనే అనుకున్నా తప్ప ఇలా ఊహించలేదు’’ అంది స్వర్ణ.
‘‘నువ్వు చెప్పిందీ నిజమే... ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఎవరైనా నీలానే మాట్లాడు తుంది. మేము చాలా దురదృష్టవంతులం తల్లీ. నీకు అంతా మంచే జరుగుతుంది. వాడు కాదన్నా మాకు నువ్వు ఆప్తురాలివే. మేము నీకు ఎప్పుడూ అండగా ఉంటాం. మమ్మల్ని క్షమించండి’’ అని చెప్పి అక్కడినుండి వచ్చేశారు.
స్వర్ణ డైవోర్స్‌కి అప్లై చేసింది. పరస్పర అంగీకారంతో కాబట్టి తొందరగానే వచ్చేశాయి విడాకులు. ఒక్క పైసా కూడా భరణంగా తీసుకోలేదు స్వర్ణ. తరువాత తను పని చేసిన కంపెనీలోనే తిరిగి ఉద్యోగంలో చేరిపోయింది.
ఇక రాజారాం విషయానికొస్తే... ఆయన ఆరోజు నుండి తన కొడుకుతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నాడు. మళ్లీ కొడుకు తండ్రితో మాట్లాడాలని ప్రయత్నించినా వీలు కాలేదు.
‘కొంతకాలం అయితే వాళ్లే మారతారులే... వాళ్లకి నేను తప్ప ఎవరున్నారు’ అనుకున్నాడు మహీ. కానీ రాజారాం బాగా ఆలోచించి ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు.
ఒక పేరున్న అడ్వకేట్‌ని కలిశాడు. తను ఎందుకొచ్చాడో, తన నిర్ణయం ఏంటో చెప్పగానే ఆయన మొదట చాలా ఆశ్చర్యపోయాడు.
‘‘మీరు మీ శ్రీమతితో కలిసి బాగా ఆలోచించు కుని వచ్చారా... ఒక్కడే కొడుకు అంటున్నారు’’ అన్నాడు ఆ లాయర్‌ సందేహంగా.
‘‘నాకు అర్థమయింది లాయర్‌గారూ మీ సందేహం. తరువాత నా ఆలోచన ఇది...’’ అని చెప్పాడు ఆయనకి.
‘‘అవునా, ఈ ఏజ్‌లోనా’’ అని మళ్లీ ఆశ్చర్యపోయారు ఆయన.
ఇక లాభం లేదని జరిగింది మొత్తం పూస గుచ్చినట్లు వివరంగా చెప్పాడు రాజారాం.
అంతా విని, ఆయన చాలా ఇంప్రెస్‌ అయ్యారు... తప్పకుండా మీ కేస్‌ తీసుకుని న్యాయం చేస్తానని మాట ఇచ్చారు.
అలాగే ఎంతో శ్రద్ధగా పనిచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు లాయర్‌. ఆ కేస్‌ గురించీ, తీర్పు గురించీ పేపర్‌లో ప్రకటించి, మహాదేవ్‌కి ఒక కాపీ పంపించారు. రాజారాం ఆ పేపర్‌ తీసుకుని స్వర్ణ ఇంటికి వెళ్లి, అంతా చెప్పి పేపర్లో ప్రకటన చూపించాడు. అది చూసిన స్వర్ణ కళ్లనీళ్ల పర్యంతమైంది.
‘పైకి ఊరికే సానుభూతి చూపిస్తున్నారేమో’ అని లోపల ఎక్కడో ఉన్న చిన్న అనుమానం కూడా పటాపంచలైపోయింది. కళ్లనీళ్లు ఆగలేదు... రాజారాం కాళ్లకి దణ్ణం పెట్టింది. నోటమాట రాలేదు. తరువాత ఆయన చెప్పిన ఆలోచనకి ఒప్పుకోలేదు. కానీ ఆయన స్వర్ణకి వివరించి చెప్పి, ఇదే సరైన నిర్ణయం అని నచ్చచెప్పాకా ఒప్పుకుంది.
ఇదీ ఇంతవరకూ జరిగిన విషయం.

*         *      *

ఈలోపు ఉరుములేని పిడుగులా  ఊడిపడ్డాడు మహాదేవ్‌. రావడం రావడం ఆ ప్రకటన వచ్చిన న్యూస్‌ పేపర్‌ని, నేలకేసి కొట్టి ‘‘ఏంటి ఇదంతా... మీకు మతి ఉండే చేస్తున్నారా... ఈ ఏజ్‌లో మీరు చేయాల్సిన పనులేనా’’ అని అడిగాడు కోపంగా.
రాజారాం చాలా ప్రశాంతంగా ‘‘ఏ విషయం నువ్వు మాట్లాడుతోంది’’ అని అడిగాడు ‘‘అదే ఈ పేపర్‌లో విషయం... ఆ అడ్వకేట్‌ నాకు పంపిన జడ్జిమెంట్‌ కాపీ... ఇవన్నీ ఏంటి’’ అని అడిగాడు.
‘‘అవన్నీ చదివితే నీకు అర్థమయ్యి ఉండాలే... చాలా తెలివైనవాడివి కదా’’ అన్నాడు రాజారాం.
‘‘ఇప్పుడు నన్ను మీరు ‘మీ కొడుకుని కాదు’ అనుకుంటే కాకుండా పోతానా?’’
‘‘ఎందుకు కాకుండా పోవు? నువ్వు పెళ్లి చేసుకుని, నీ భార్యని కాదంటే కాకుండా పోయి నప్పుడు... నీ విషయంలో ఎందుకు కాదు? నీకూ మాకూ ఏ సంబంధం లేదు. నాకున్న ఆస్తి కూడా నా సంపాదనే. సో, దానిమీద కూడా నీకు హక్కు లేదు. అందుకే నువ్వు నా కొడుకువి కాదని, నిన్ను నిరాకరిస్తూ... నీతో సంబంధం తెంచుకోవడానికి కోర్ట్‌కి వెళ్లి నీకు జడ్జిమెంట్‌ పంపించాను. ఇంకా అర్థమవ్వాలంటే నిన్ను డిజ్‌ ఓన్‌ చేసుకున్నాను. నువ్వు ఇక వెళ్లవచ్చు’’ అన్నాడు రాజారాం.
‘‘అంటే మీకు నేను లేకపోయినా ఫరవాలేదు అన్నమాట. సరే, కానీ ఈ ఏజ్‌లో ఒకరిని- అదీ అమ్మాయిని, పెంచుకోవడమేంటి... అర్థముందా? ఇంతకీ ఏదీ ఆ అమ్మాయి’’ అని అడిగాడు.
‘‘కూర్చో వస్తుంది చూద్దువుగానీ’’ అన్నాడు రాజారాం.
కాసేపటికి స్వర్ణ హ్యాండ్‌బ్యాగ్‌తో లోపలికి వచ్చి చెప్పులు పక్కన వదిలి ఏదో అనబోతూ... మహాదేవ్‌ని చూసి తడబడి మౌనంగా నిలబడిపోయింది.
‘‘రా అమ్మా రా... కూర్చో’’ అంటూ...
‘‘ఇదిగో శారదా, అమ్మాయి వచ్చింది, మంచినీళ్లు తీసుకురా’’ అని పిలిచారు లోపలికి వినబడేటట్టు.
స్వర్ణసీతని అక్కడ ఊహించని మహాదేవ్‌ కూడా అన్యమనస్కంగా లేచి నిలబడ్డాడు.
‘‘అదిగో తనే మేము దత్తత తీసుకున్న అమ్మాయి... చూశావుగా వెళ్లు ఇక’’ అన్నాడు.
‘‘ఇదంతా మా ఇష్టప్రకారమే జరిగింది... బంగారం లాంటి ఆ సీతమ్మ తల్లిని దత్తత తీసుకోవడం మా అదృష్టం... దేవుడు కొన్ని అదృష్టాలని తీసేసుకున్నా, కొన్ని ఇస్తాడు’’ అనగానే... ‘‘అంటే ఈవిడ మిమ్మల్ని చూస్తుందా మీ చివరి దశలో’’ అన్నాడు మహాదేవ్‌ వ్యంగ్యంగా.
‘‘అవును, ఆ అమ్మాయి మీద మాకు నమ్మకముంది. అన్నట్లు మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాం’’ చెప్పాడు రాజారాం.
‘‘అంటే ఈవిడ ఇంకో పెళ్లి చేసుకుని కూడా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుందన్నమాట’’ అన్నాడు మహాదేవ్‌.
‘‘కచ్చితంగా... మా భవిష్యత్తు గురించి మాకు అస్సలు బెంగ లేదు. నువ్వు ఎంత తొందరగా వెళితే అంత మంచిది. మళ్లీ రాకు ఎప్పుడూ’’ అన్నాడు రాజారాం.
మహాదేవ్‌ విసురుగా వెళ్లిపోయాడు.
శారదా రాజారాం నిస్సత్తువగా కూర్చుండిపోతే, స్వర్ణ వాళ్ల దగ్గరకు వెళ్లి ఇద్దరి భుజాల మీదా చేతులు వేసింది. ఆ స్పర్శలో ఎన్నో అర్థాలు బోధపడ్డాయి వాళ్లకి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..