దటీజ్‌ మహీ

వంటిల్లు సర్దుకుంటుండగా కాలింగ్‌ బెల్‌ శబ్దం వినిపించింది. తలుపులు తెరవగానే ఎదురుగా మ్లానమైన మొహంతో కనిపించిన మహికని చూసి ఆశ్చర్యపోయాను.

Published : 05 Jun 2022 00:53 IST

దటీజ్‌ మహీ

అప్పరాజు నాగజ్యోతి

వంటిల్లు సర్దుకుంటుండగా కాలింగ్‌ బెల్‌ శబ్దం వినిపించింది. తలుపులు తెరవగానే ఎదురుగా మ్లానమైన మొహంతో కనిపించిన మహికని చూసి ఆశ్చర్యపోయాను.

‘అదేమిటి మహీ, నీ ఫ్రెండ్‌తో సాయంకాలందాకా ఎంజాయ్‌ చేసొస్తావనుకున్నాను. అరగంటలోనే తిరిగొచ్చేశావేమిటి?’ అన్న నా ప్రశ్నకి బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది.

దాని ప్రవర్తనకి నేను పెద్దగా నొచ్చుకోలేదు ఎందుకంటే మహీ మనస్తత్వం నాకు బాగా తెలుసు. మనసుకు ఏదైనా బాధ కలిగితే మౌనంగా, ఒంటరిగా ఉండిపోతుంది. అలాంటి సమయంలో వెళ్లి పలకరిస్తే అస్సలు ఇష్టపడదు. కొద్దిసేపటి తర్వాత తనే వస్తుంది. అందుకే నేను దాని వెనకాలే వెళ్లి మళ్ళీ రెట్టించి అడగకుండా నా మానాన నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను. అయితే  చేతులు యాంత్రికంగా పనులని చేసుకుపోతున్నా ‘అక్కడ అసలేమయిందో, మహీ ఎందుకు హర్ట్‌ అయిందో’ అన్న ఆలోచనే మనసంతా నిండిపోయింది!

ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారి మూలాన ఇంటర్మీడియట్‌లో చేరాక మహీకి కాలేజీకి వెళ్ళే అవకాశమే రాలేదు. ఇంట్లోనే ఆన్‌లైన్‌ క్లాసులకి అటెండవుతూ టెన్త్‌ దాకా తనతో కలిసి చదివిన స్నేహితురాళ్ళతోనే అప్పుడప్పుడూ ఫోనులో మాట్లాడుతూ వుంటుంది.

అలాంటిది, చాన్నాళ్ళ తర్వాత ఈరోజు మధ్యాహ్నం ‘అమ్మా, ఈరోజు నా స్కూల్‌ ఫ్రెండ్‌ శ్రేయ మన పక్క బ్లాక్‌లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికొచ్చింది. వారం రోజులు ఇక్కడే ఉంటుందట. వెళ్లి తనని కలిసి రానా?’ అని మహిక అడగ్గానే ‘వెళ్లిరామ్మా. నువ్వు చాలాకాలంగా ఇంటి నుండి కాలు బైటపెట్టింది లేదు. ఇలాగైనా నీకు కాస్త చేంజ్‌గా వుంటుంది. హాయిగా మీ ఫ్రెండ్‌తో నీకిష్టమొచ్చినంతసేపూ గడిపిరా. ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులూ వీలైనప్పుడల్లా మన ఇంటికి రమ్మని చెప్పు’ అని చెప్పి పంపించాను.

‘చాలా రోజులకి కలిసిన స్కూల్‌ ఫ్రెండ్‌తో కబుర్లు చెప్పుకుంటుంటే కాలమే తెలియదు, అలాంటిది ఈ పిల్ల ఇంత త్వరగా వెనక్కి తిరిగొచ్చేసిందంటే తప్పకుండా అక్కడ ఏదో జరిగే ఉంటుంది’ అనుకుంటూ వంటింట్లో పని పూర్తి చేస్తుండగా పెద్దగా వెక్కిళ్ల శబ్దం వినిపించడంతో ఒక్క ఉదుటున మహీ గదికి పరిగెత్తాను. అక్కడ మంచంపై బోర్లా పడుకుని ఏడుస్తున్న మహీని చూసి నా మనసు కలుక్కుమంది. ‘ఏం జరిగిందమ్మా’ అంటూ లాలనగా అడిగాను.
నా మాటలకి అది సమాధానం చెప్పకుండా మరింత పెద్దగా ఏడవడంతో నాకు కంగారేసినా సర్దుకుని ఓదార్పుగా దాని వీపు నిమురుతూ అలాగే కూర్చుండిపోయాను.

కొద్దిసేపటికి తేరుకున్న మహిక మెల్లిగా నోరు విప్పింది. ‘అమ్మా, ఒక విషయం చెప్పు, నేను చాలా లావయ్యానా? నాకు బాగా ఒళ్ళు వచ్చేసిందా?’

ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూనే దాన్ని భుజాలు పట్టుకుని లేపి పైకీ కిందకీ తేరిపార చూశాను.

మహిక మంచి పొడగరి. మునుపు కొద్దిగా సన్నగా పీలగా ఉండే పిల్ల, బహుశా ఈ కోవిడ్‌ సమయంలో ఇంటి పట్టునే ఉండి సరైన ఆహారం తీసుకోవడం వల్లనేమో మరి ఇప్పుడు ఎత్తుకు తగినంత లావుందే తప్ప ఎంతమాత్రమూ ఎబ్బెట్టుగా లేదు.

ఆ మాటే దాంతో చెప్పి ‘అయినా ఎన్నడూ లేనిది ఈ వేళ కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి మహీ’ అనగానే ‘అది కాదమ్మా, ఇందాక శ్రేయని కలిసేందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే...’ అంటూ అక్కడ జరిగింది చెప్పుకొచ్చింది.

*     *     * 

తలుపులు తెరిచిన శ్రేయ ‘హాయ్‌ మహీ, ఎన్నాళ్ళయిందో మనం కలిసి’ అంటూ మహీని వాటేసుకుంది. ఆ మరుక్షణమే మహీని పైనుండి కిందదాకా చూసి ‘సన్నగా తీగలా ఉండేదానివి, ఇలా మారిపోయావేంటే’ అనేసింది.
ఆ మాటలకి మహికకి మూడాఫ్‌ అయింది.

ఆ తర్వాత శ్రేయ ఏదో మాట్లాడుతూనే ఉన్నా మహికకి ఇంక అక్కడ ఎక్కువసేపు కూర్చునేందుకు మనస్కరించలేదు. అందుకే ఓ పావుగంట తర్వాత ‘కొంచెం పని ఉంది, నేను వెళ్తాను’ అని చెప్పి ఇంటికొచ్చేసింది.

*     *     * 

మహీ చెప్పింది విన్నాక నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అసలే మహికకి మొదటినుండీ ఇతరులు తన గురించి ఏమనుకుంటారోనన్న భయమూ, ఆందోళనలూ ఎక్కువ. దానికితోడు ఏ విషయంలోనైనా తనని ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం. అలాంటి మనిషికి ఇటువంటి కామెంట్స్‌ని తట్టుకోవడం కష్టమే. చదువుకున్నవాళ్ళు కూడా మ్యానర్స్‌ లేకుండా ఇలా బాడీ షేమింగ్‌ చేయడం ఏమిటో!

అయినా ఎవరైనా తనని కామెంట్‌ చేయడం ఆలస్యం, విపరీతంగా బాధపడిపోతూ భోరున ఏడ్చేసేయడం, ఆ తర్వాత రోజుల తరబడి దాని గురించే ఆలోచిస్తూ మనస్సుని కష్టపెట్టుకోవడంలాంటివి ఈ పిల్ల ఎప్పటికి మానుతుందో ఏమో!

అందుకే, ‘పనీపాటా లేని వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో వాగితే దాని గురించి పట్టించుకోవడం అనవసరం మహీ. ఇలాంటి విషయాలని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి. ఏమైనా నువ్వింత సెన్సిటివ్‌గా ఉండడం మంచిది కాదు’ అంటూ దాన్ని మందలించాను.

‘జరిగింది ఇంతే అయితే నేనూ పెద్దగా పట్టించుకునేదాన్ని కాదమ్మా. ఇప్పుడే నా ఫేస్‌ బుక్‌ చూసుకుంటుంటే, అందులో శ్రేయ పెట్టిన ఫొటోలు కనిపించాయి. ఇందాక వాళ్ళింట్లో తను నాతో కలిసి సెల్ఫీలు తీసుకుంది! రెండేళ్ల క్రితం నా ఫోటోనీ, ఇప్పటి ఫోటోనీ పక్కపక్కనే చూపిస్తూ ‘ఒకప్పటి మన స్కూల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌, ఇప్పుడేమో ఇలా’ అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌ చేసింది.. ట్విటర్‌లోనూ అలాగే పెట్టింది. ఆ పోస్టుల కింద నా స్కూల్‌ ఫ్రెండ్స్‌ రాసిన నెగెటివ్‌ కామెంట్స్‌ చూస్తుంటే ఏడుపొచ్చేస్తోందమ్మా’ అంది.

‘చూడు మహీ, నువ్వు ఇంతకాలం నీ స్నేహితురాళ్లు అని భావించిన వారి నిజస్వరూపం ఇప్పటికైనా బైటపడినందుకు సంతోషించు. ఏది జరిగినా మన మంచికే అనుకుని నీ జీవితంలో దీన్నొక పాఠంలా తీసుకో. ఇంక దీన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసేయ్‌’ అన్నాను ఓదార్పుగా.

నేనైతే ఇదంతా ఒక పిల్లచేష్టలా భావించి ఆ క్షణానే మర్చిపోయానుగానీ, మహీ మాత్రం ఈ విషయాన్ని తన బుర్రలో నుండి అంత తేలిగ్గా తీసేయలేదని ఆ మరుసటి రోజు ఉదయానికిగానీ నాకు తెలిసిరాలేదు!

*     *     * 

‘అమ్మా ఈరోజు నుండి నేను స్ట్రిక్ట్‌గా డైటింగు చేయబోతున్నాను. వైట్‌ రైస్‌, ఆయిల్‌ ఫుడ్‌, స్వీట్స్‌లాంటి వాటి జోలికి వెళ్లను. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి వెజిటబుల్‌ సలాడ్‌, మధ్యాహ్నం రెండు ఫుల్కాలని కూర లేదా పప్పుతో తింటాను. రాత్రికి గ్లాసు పాలు మాత్రమే తీసుకుంటాను. నా షేప్‌ జీరో సైజుకి వచ్చేదాకా తగ్గేదే లేదు’

ఉదయం డైనింగ్‌ టేబుల్‌ వద్దకొచ్చి అప్పటికే నేను వడ్డించిన ఇడ్లీలని పక్కకి నెట్టేస్తూ మహిక చెప్పిన విషయం నాకు రుచించకపోయినా నేను తనతో వాదించలేదు. బాడీ షేమింగ్‌కి గురైన టీనేజ్‌ పిల్లలు మానసికంగా ఎంత కుంగిపోతారో నాకు బాగా తెలుసు.

ఇక ఆ రోజునుండీ మహీ ధ్యాసంతా ‘ఎంత త్వరగా వెయిట్‌లాస్‌ అయి జీరోసైజు ఫిగర్‌లోకి వచ్చేస్తానా’ అన్న దానిపైనే ఫిక్సయిపోవడంతో మిగతా ఆక్టివిటీస్‌ అన్నీ పక్కకి వెళ్ళిపోయాయి.

ఉదయాన నిద్రలేస్తూనే అరచేతులతో మొహాన్ని రుద్దుకుంటూ ‘కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ...’ అంటూ దేవతలకు నమస్కారం చేసుకునే పిల్ల ఇప్పుడు లేవగానే వెయింగ్‌ మిషన్‌పైన నిలబడుతోంది.

ఓ వారం తర్వాత.......

‘అమ్మా, వారంరోజులు డైటింగ్‌ చేస్తే ఒక్క కేజీ బరువే తగ్గాను. ఇలా అయితే లాభం లేదు. ఇకనుండి మధ్యాహ్నం ఫుల్కా తినడం మానేస్తాను. అలా చేస్తే త్వరగా వెయిట్‌లాస్‌ అవుతుంది’
బాంబులా దూసుకొచ్చిన మహీ మాటలకి గాభరాపడ్డాను.

‘అదేమిటే రోజంతా అర్ధాకలితో ఉంటావా. అది ఆరోగ్యానికి మంచిది కాదు’ అన్న నా మాటల్ని అది అస్సలు ఖాతరు చేయలేదు. ‘నీకు తెలీదులేమ్మా. అంతగా ఉండలేకపోతే కాసిని పాలు తీసుకుంటాన్లే’ అనేసి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత పదిరోజులకి.......

‘అమ్మా, ఈ వీడియో చూడు, రోజంతా- రెండుగంటలకోమారు గ్లాసుడు నిమ్మకాయ నీళ్లని తేనెతో కలిపి దాన్నే ఆహారంగా తీసుకుంటే కేవలం పది రోజుల్లోనే పదిహేను నుండీ ఇరవై కేజీలదాకా బరువు తగ్గొచ్చట. ఈరోజు నుంచి నేను ఈ డైట్‌నే ఫాలో అవుతాను’ అన్న మాటలకి నాకు అరికాలి మంట నెత్తికొచ్చింది.

‘నీకేమైనా మతిపోయిందా మహీ? నీ హైట్‌కి నువ్వు ఏ మాత్రం ఓవర్‌ వెయిట్‌ లేవు. ఎవరో అన్న మాటలని పట్టుకుని ఇలా అర్థం పర్థం లేని డైటింగులు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఈ ధ్యాసలో పడి నువ్వు పది రోజుల నుండీ మ్యూజిక్‌ ప్రాక్టీసు చేయడం కూడా మానేశావు. ఇంతకుముందల్లా ‘చదివింది చాలు, ఇంక పడుకోవే’ అన్నా వినకుండా ‘ఐఐటిలో సీట్‌ రావాలంటే చాలా కష్టపడాలి’ అని చెప్పి రాత్రి పన్నెండుదాకా చదువుకుని, ఆ తర్వాత అరగంట సేపు మ్యూజిక్‌ ప్రాక్టీసు చేసుకునిగానీ నిద్రపోయేదానివి కావు. ఇప్పుడేమో ఆకలికడుపుతో రాత్రుళ్ళు ఎక్కువసేపు మేలుకుని ఉండలేక ఎనిమిది గంటలకే నిద్రపోతున్నావు. ఈ వెయిట్‌ లాస్‌ పిచ్చిలో పడి చదువూ, కెరీర్‌, హాబీలూ అన్నింటినీ నాశనం చేసుకోకు’ అని గట్టిగా చెప్పాను.

*     *     * 

‘మీ అమ్మాయికి ఈసారి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులొచ్చాయి. నెక్ట్స్‌ ఎగ్జామ్స్‌లోనూ ఇలాగే జరిగితే స్టార్‌ బ్యాచ్‌ నుండి తీసేయవలసి వస్తుంది. ఈ విషయం మీకు ముందుగానే తెలిస్తే జాగ్రత్తపడతారని చెబుతున్నాను మేడం’ అంటూ ఉదయాన్నే మహీ కాలేజీ హెడ్‌ నుండి వచ్చిన ఫోన్‌ కాల్‌ని నేను సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే, మొదటినుండీ నేనుగానీ, మావారుగానీ మహీపై చదువు విషయంలో అనవసరపు ఒత్తిడిని పెట్టలేదు. ఆటలూ, సంగీతంతోపాటు చదువునీ తనే బ్యాలన్స్‌ చేసుకుంటూ వస్తోంది. ‘ఈమారు దాని ధ్యాసంతా వెయిట్‌లాస్‌ పైనే ఉండడంతో చదువుని కాస్త అశ్రద్ధ చేసినట్టుంది. మెల్లిగా అదే తెలుసుకుంటుందిలే’ అనుకుని ఊరుకున్నాను.

కానీ ఒక గంట తర్వాత మహీయే నా వద్దకు వచ్చింది.

‘అమ్మా, మొన్న జరిగిన పరీక్షల్లో నాకు చాలా పెద్ద ర్యాంకు వచ్చింది. రిజల్ట్‌ షీట్‌ని కాలేజీ వెబ్‌సైట్‌లో ఓపెన్‌గా పెట్టారు కాబట్టి ఈ విషయం ఈ పాటికి కాలేజీలో అందరికీ తెలిసిపోయుంటుంది. ఇప్పుడు వాళ్లంతా నా బరువు గురించే కాకుండా నా మార్కుల గురించి కూడా కామెంట్‌ చేస్తూ నవ్వుకుంటుంటారు కదమ్మా, ఫేస్‌ బుక్‌ గానీ ట్విటర్‌ గానీ ఓపెన్‌ చేయాలంటేనే భయంగా ఉందమ్మా’

దాని మాటలకి నేను చివ్వున ‘ఒక్క విషయం చెప్పు మహీ, ఇప్పుడు నీ బాధ అంతా నీకు పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయనా లేక ఆ విషయం అందరికీ తెలిసిపోయిందే అనా?’ అని అడిగాను.

నా ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు మహీ ఒక్కక్షణం తడబడింది. ‘అది కాదమ్మా, నేను ఎప్పుడూ క్లాసులో టాప్‌ ఫైవ్‌లో ఉంటాను కదా. అలాంటిది నా ర్యాంకు ఒక్కసారిగా అంత కిందకి జారడంతో నా గురించి అంతా ఏమనుకుంటారోనని బెంగగా ఉంది’ అనేసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

ఇంక ఆ రోజు ఎంత బతిమిలాడినా భోజనం చేయకుండానే పడుకుందది. కాసేపటి తర్వాత ఫోన్‌ రింగ్‌ అయితే ఎత్తాను.

‘హలో పిన్నీ, నేను మోక్షని. ఈరోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. మీరంతా ఇంట్లోనే ఉంటారుగా?’

‘ఇంట్లోనే వుంటాం మోక్షా. చాలా రోజులయింది నిన్ను చూసి, రెండు రోజులు ఇక్కడే ఉండేటట్లుగా రా’ అన్నాను.

‘మరోసారి వచ్చినప్పుడు ఉంటాన్లే పిన్నీ. ఇంకో గంటలో మీ ఇంట్లో వుంటాను’ అని చెప్పి ఫోన్‌ పెట్టేసింది.

మోక్ష మా అక్కయ్య కూతురు. ఎమ్మెస్సీ న్యూట్రిషన్‌ చదువుతోంది. గలగల మాట్లాడుతుంది. అదంటే మహికకి చాలా ఇష్టం. చాన్నాళ్లుగా డల్‌గా ఉంటున్న మహికలో మోక్ష రాక ఏమైనా కొత్త హుషారుని తెస్తుందేమోనన్న చిరు ఆశ నాలో కొండంత ఉత్సాహాన్ని నింపింది.

చెప్పినట్టుగానే గంటలో మోక్ష వచ్చింది. తనతో మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది. ‘పిన్నీ, ఈ అమ్మాయి నా ఫ్రెండ్‌ ప్రజ్ఞ. తను జేఈఈలో ఆల్‌ ఇండియా టాపర్‌. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో వుంది. మన మహీ కూడా జేఈఈకి ప్రిపేర్‌ అవుతోంది కదా, ఆ ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌కి సంబంధించిన టిప్స్‌ ఇస్తుందని ప్రజ్ఞని నాతోపాటు తీసుకొచ్చాను. అన్నట్టు మహీ ఏది పిన్నీ’ అంటుంటే అప్పుడే హాల్లోకొచ్చింది మహిక.
దాన్ని చూస్తూనే సోఫానుంచి లేచెళ్లి ‘హాయ్‌ మహీ’ అంటూ వాటేసుకుంది మోక్ష.

ఆ తర్వాత ‘మహీ, తను నా ఫ్రెండ్‌ ప్రజ్ఞ. సెవెంత్‌ దాకా మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. తను జేఈఈ ఫిఫ్త్‌ ర్యాంకర్‌’ అంటూ పరిచయం చెయ్యగానే ప్రజ్ఞవేపు ఆరాధనగా చూసింది మహిక.

‘అందరూ అనుకున్నట్లుగా ఐఐటీలో సీటు రావడం మరీ అంత కష్టమైన పనేమీ కాదు మహికా. కాకపోతే చాలా డిసిప్లిన్డ్‌గా ఇంటర్‌లో చేరినప్పటినుండీ రోజుకు కనీసం నాలుగైదు గంటలు శ్రద్ధగా చదవాలి. రెండుగంటలు బోర్డు సిలబస్‌ చదివి సబ్జెక్టు బాగా అర్థం చేసుకున్న తర్వాత మరో రెండుగంటలు జేఈఈ ఓరియెంటేషన్‌తో చదవాలి, ప్రతీవారం రెగ్యులర్‌గా జేఈఈ మాక్‌ టెస్టులు రాస్తూ పోవాలి. అలా రెండేళ్లపాటూ చేస్తే ఐఐటిలో సీట్‌ రావడం ఖాయం. అయితే ఒక్క విషయం మహికా, వారం వారం పరీక్షలు రాసిన వెంటనే మన ర్యాంకుని వేరే వాళ్ళ ర్యాంకుతో పోల్చుకోవడంలాంటి తెలివితక్కువ పనులు మాత్రం చేయొద్దు. ఎందుకంటే మన ర్యాంకు పెద్దదైతే అప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది, మెంటల్‌ స్ట్రెస్‌ పెరిగిపోతుంది. దాని ప్రభావం ఆ తర్వాత రాసే పరీక్షపై పడి అందులో ర్యాంకు మరింత తగ్గిపోయే అవకాశం వుంది. కాబట్టి వేరేవాళ్ళతో పోల్చుకోవడాల్లాంటివి చేయకుండా, పరీక్షలో మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని, ఆ తరవాత వారం రాసే పరీక్షలో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేసేట్టుగా చూసుకోవాలి...’

ప్రజ్ఞ చెప్తున్న టిప్స్‌ నాకు చాలా బాగా నచ్చాయి. చిన్నపిల్లే అయినా అక్షర సత్యాలు చెబుతోంది. ముఖ్యంగా ‘వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు’ అన్న మాట కేవలం పరీక్షలకీ, ర్యాంకులకే కాకుండా జీవితంలో ప్రతీ విషయానికీ వర్తిస్తుంది.

అంతలో అకస్మాత్తుగా మహికకి ఏమి తోచిందోగానీ ‘ప్రజ్ఞా, ఐఐటిలోనూ ర్యాగింగులు జరుగుతాయా? మీ సీనియర్స్‌ మిమ్మల్ని ర్యాగింగ్‌ చేశారా?’ అని అడిగింది.

‘మా కాలేజీలో ర్యాగింగ్‌ అంటూ పెద్దగా జరగలేదు కానీ, చేరిన మొదట్లో హాస్టల్లో కొన్ని రోజులపాటు మాత్రం సీనియర్స్‌ వాళ్ళ శాడిజం బాగానే చూపించుకున్నారు. ముఖ్యంగా నాలాగా నల్లగా, బొద్దుగా ఉండేవాళ్ళని ర్యాగింగు పేరిట బాడీ షేమింగ్‌ చేసి వాళ్ళ సరదాని చక్కగా తీర్చుకున్నారు. లైఫ్‌లో అవన్నీ తప్పవు కదా’ అంటూ సింపుల్‌గా ప్రజ్ఞ చెప్పినదానికి మహిక చాలా ఆశ్చర్యపోయింది.

‘అదేమిటి ప్రజ్ఞా, వాళ్ళు మిమ్మల్ని బాడీ షేమింగ్‌ చేస్తే దాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు?’

‘ఇలాంటివన్నీ నాకు స్కూల్‌ డేస్‌ నుండీ అలవాటైపోయాయి మహికా. అప్పట్లో ఎవరైనా నన్ను ‘తారుడ్రమ్ము, సిలిండర్‌’ అంటూ వెక్కిరించినప్పుడు ఇంటికొచ్చి బాగా ఏడ్చేదాన్ని. అది చూసి మా నాన్నగారు ఒకరోజు నాతో ఒక మాట చెప్పారు ‘చూడమ్మా, నల్లగా ఉండటం, లావుగా ఉండటం లేదా పొట్టిగా వుండడం, ఇవేవీ లోపాలు కావు. ఎదుటివ్యక్తిలోని సుగుణాలన్నింటినీ పక్కకి తోసేసి, కేవలం రంగూ, రూపూ, ఆకారాల్లో వికారాలని వెతుక్కుని హేళన చేయడమన్నది మనుషుల్లోని కుసంస్కారానికి నిదర్శనం. అలాంటి వాళ్ళ మాటలని పట్టించుకుంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు. అన్నింటికంటే ముందు నువ్వు ‘నేను అందంగా లేను’ అని అనుకోవడం మానేసి భగవత్‌ ప్రసాదితమైన నీ శరీరాన్ని ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్‌ చేయడం మొదలెడితే నీమీద నీకు కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. అప్పుడు ఎదుటివాళ్ళ కామెంట్స్‌ నిన్ను తాకవు. ఏనాడైతే వాళ్ళ కామెంట్స్‌కి నువ్వు బాధపడడం మానేశావో, ఆనాడే వాళ్లకి నిన్ను కామెంట్‌ చేయడంలో ఉన్న మజా పోతుంది. దాంతో వాళ్లు నిన్ను వదిలేసి, తాము గేలి చేయగానే ఏడ్చేసే మరో వీక్‌ క్యాండిడేట్‌ని వెతుక్కుంటూ వెళ్తారు. నువ్వే ఆలోచించు, ఈ ప్రపంచం సచిన్‌ టెండూల్కర్‌ని ఒక గొప్ప క్రికెట్‌ క్రీడాకారుడిగా గుర్తిస్తోందా, లేక ‘పొట్టివాడు’ అంటూ గేలి చేస్తోందా? నీ శరీరకొలతలూ, రూపురేఖలూ, మేనివర్ణాలతో నిన్ను అంచనా వేసే వాళ్ళందరికీ నీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే నీ సమాధానం కావాలి. ఒకసారి గనక నువ్వు పైకి ఎదిగితే ఇంక ఆ తర్వాత నిన్ను ఎగతాళి చేసే ధైర్యమూ, దమ్మూ ఎవరికీ ఉండదు’

ఆ రోజున నాన్న చెప్పిన మాటలు నా మనసులో లోతుగా నాటుకున్నాయి. ఇంక ఆనాటినుండి నన్నెవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా, వాటిని నేను మనసుదాకా తీసుకువెళ్ళడం మానేశాను. నా గురించి ఎదుటివాళ్ళు ఏమనుకుంటారోనని ఆలోచించడం మాని, నన్ను నేను ఉన్నదున్నట్లుగా యాక్సెప్ట్‌ చేయడం మొదలెట్టాను’.

‘ప్రజ్ఞ చెబుతున్న దాన్ని ఆశ్చర్యంగా వింటోంది మహిక.

‘నిజమే ప్రజ్ఞా. ఇదే విషయాన్ని కాస్త అటూఇటుగా మేము రోజూ మా లెక్చరర్స్‌ నోటి నుండీ వింటుంటాం. మా కాలేజీలో జరిగే సెమినార్లలో చాలామంది తమ శరీర కొలతలు బాగోలేవనీ, అద్దం ఎదుట నిలబడితే డిప్రెషన్‌ కలుగుతోందనీ, చుట్టుపక్కల వాళ్ళు చేసే బాడీ షేమింగ్‌ని భరించలేకపోతున్నామనీ, ఎలాగైనా వారం పదిరోజుల్లో జీరో సైజ్‌ ఫిగర్‌కి మారిపోవాలనుందనీ, అందుకు తగిన క్రాష్‌ డైట్‌లు చెప్పండంటూ అడుగుతుంటారు. వాటన్నింటికీ మా లెక్చరర్స్‌ నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగానే ‘ముందు మీరు వేరే వాళ్ల మాటల్ని పట్టించుకోవడాన్ని మానేయండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్‌ చేయడం నేర్చుకోండి. ఎవరో కామెంట్‌ చేశారని కాకుండా, మీ బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎంఐ) ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా మీరు ఓవర్‌ వెయిట్‌ ఉంటే అప్పుడు మాత్రమే బరువు తగ్గే ప్రయత్నాలని మొదలెట్టండి. అప్పుడు కూడా సర్జరీలు చేయించుకోవడం, క్రాష్‌ డైట్‌ల జోలికి పోవడం చేయొద్దు. వాటి వలన తాత్కాలికంగా బరువు తగ్గినా, శరీరానికి అందవలసిన న్యూట్రిషన్‌ అందక హార్మోన్స్‌ సమతుల్యత దెబ్బతిని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కోవిడ్‌ లాంటి వైరస్‌ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి హెల్దీ లైఫ్‌ స్టైల్‌ని అలవర్చుకోండి. మీ డైట్‌లో ప్రతిరోజూ రెండు రకాల కూరలు, పళ్ళు, మొలకలు, నట్స్‌ ఉండేట్టుగా చూసుకోండి. అలాగే బాడీ ఫిట్‌నెస్‌ కోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజులో ముప్పై, నలభై నిమిషాలు చేయండి. స్వీట్స్‌, వేపుళ్ళు లాంటివి పండగల రోజుల్లో, లేదా నెలకి ఒకటి రెండుసార్లు, అదీ లిమిట్‌లో తింటూ ఆరోగ్యంగా ఉండండి. ‘నేను సన్నబడాలి, తెల్లగా ఉండాలి’ అని కాకుండా ‘ఆరోగ్యంగా వుండాలి, ఫిట్‌గా ఉండాలి’ అనుకోండి ఎందుకంటే హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌’ అని చెబుతుంటారు.

వాళ్ల మాటలని శ్రద్ధగా వింటున్న మహిక మోములో భావాలు మారుతుంటే ఆనందంగా చూస్తుండిపోయాను. ఎందుకంటే, ఎదుటి వాళ్లు తనను గురించి ఏమనుకుంటారోనన్న ధ్యాస మహికలో ఎక్కువ పాళ్ళలోనే ఉన్నా, అంతకు మించిన విజ్ఞత కూడా ఉందని నా ప్రగాఢమైన నమ్మకం. మరో అరగంటపాటు కూర్చుని వెళ్ళిపోయారు మోక్ష, ప్రజ్ఞ.

వాళ్ళతో పాటే కింద దాకా వెళ్లి వాళ్ళని సాగనంపి వచ్చాక ‘అమ్మా, ఈ రోజు చపాతీలోకి పాలక్‌ పనీర్‌ చేస్తావా ప్లీజ్‌, అంతదాకా నా రూమ్‌లో కూర్చుని చదువుకుంటాను’ అన్న మహిక మాటలతో, దాని విజ్ఞతపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదన్నది స్పష్టమవగా ‘దటీజ్‌ మహీ’ అంటూ దాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను!!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..