నాన్న తన కష్టం కనపడనీయలేదు.. నేనూ అర్థం చేసుకోలేకపోయా!
- కొచ్చెర్లకోట ఎస్వీ నరసింహారావు
నాపిల్లలకి కొత్త సంవత్సర బహుమతిగా ఇంత పెద్ద షాక్ ఇవ్వాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. వాళ్లకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటంలేదు. అంతెందుకు, ఈ వార్త ఇంకా నా శ్రీమతి చెవినే వేయలేదు.
నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. మంచి కంపెనీ, చాలా మంచి జీతం. అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతోంది అనుకుంటుంటే... మా కంపెనీవాళ్ళు కూడా రెసిషన్ బూచిని చూపించి ఎక్కువ జీతం తీసుకునే ఎంప్లాయీస్ కొంతమందిని ఇంటికి పంపించే క్రమంలో... నన్ను కూడా ‘వచ్చే నెల నుంచి రావక్కర్లేదు’ అని చెప్పేశారు. నేను అస్సలు ఊహించని పరిణామం. మిగతా విషయాలు అన్నీ పక్కన పెట్టేస్తే వెంటనే గుర్తొచ్చింది మాత్రం మా పిల్లలకి నేనిచ్చిన మాటే.
జీతం రాకపోతే ప్రతీ నెలా నా కమిట్‌మెంట్లు ఎలా మీట్ అవ్వాలి అనుకునే ఈ పరిస్థితిలో మా ఫ్యామిలీ ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్న సింగపూర్, మలేషియా, బాలి... ట్రిప్‌కి అడ్వాన్స్ కట్టడానికి సమయం దగ్గరపడింది. మొదటిసారి వాళ్ళని ఫారెన్ తీసుకువెళుతున్నాను, వాళ్ళు లైఫ్‌లో ఆ అందమైన అనుభవం మర్చిపోకూడదు అని నా ఉద్దేశ్యం. అందుకే పిల్లలతో కలిసి నెట్లో సెర్చ్ చేసి... వాళ్ళని ఎగ్జైట్ చేసి మరీ చాలా ప్లాన్స్ వేసుకున్నాం. పాపం మొదటి నుంచీ నా భార్య మనస్విని అడ్డం కొడుతూనే ఉంది- అంత హైఫై ట్రిప్ వద్దని.
ఇప్పుడు నేను ఇరకాటంలో పడిపోయాను. పిల్లల్ని అంత ఊరించి... హడావుడిగా పాస్‌పోర్టులు తీయించి, వాళ్ళు ఫ్రెండ్స్‌కి గొప్పగా చెప్పుకుని అంతా అయ్యాక ఇప్పుడు...వెళ్ళట్లేదు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నా బాధ. చూద్దాం.. డబ్బులు కట్టడానికి ఇంకా వారం ఉంది. ఈలోగా అద్భుతం ఏదో జరుగుతుందని కాదు కానీ... పాజిటివ్ థింకింగ్ నాకు అలవాటు.
నేను పిల్లల గురించి ఇంతగా ఆలోచించడానికి కారణం- నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులే. మా నాన్న స్కూల్ టీచర్. ప్రైవేట్లు కూడా చెప్పేవాడు. అయినా ఎప్పుడూ ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే కూడా ‘ఊఁ’ అనేవాడు కాదు. నిజం చెప్పాలంటే చిన్నతనంలో నాకైతే ఏ సరదా తీరలేదు. నాకు ఒక అక్క... తను ఏదీ అడిగేది కాదు. నేనే... ఎక్కడికైనా వెళదామనీ మంచి బట్టలు కావాలనీ సైకిలు కావాలనీ... అమ్మ దగ్గర మారాం చేసేవాడిని. పాపం అమ్మ ఏం చెప్పలేక... నన్ను ఊరుకోబెట్టలేక సతమతమయ్యేది.
సినిమా అంటూ నాలుగైదుసార్లు గోల చేశాక నన్ను తన డొక్కు సైకిల్ ముందు కూర్చోపెట్టుకుని తీసుకెళ్ళి, బెంచ్ టికెట్ కొని సినిమా చూపించేవాడు నాన్న. ఇంటర్వెల్‌లో వేరుశనక్కాయలు కొనిపెడితే నాకు పండగే. మళ్ళీ తను కొనుక్కునేవాడే కాదు. నాకు ఆయనది మహా పిసినిగొట్టుతనం అనిపించేది. పాపం అమ్మా, అక్కా చూసిన సినిమాల్ని అయితే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.
అమ్మ అంటే ఎంత జాలి వేసేదో, నాన్నంటే అంత చిరాకు ఏర్పడిపోయింది. డబ్బుతో ముడిపడ్డ ఏవీ మాతో చేయనిచ్చేవాడు కాదు. రానురాను చిరాకొచ్చి అసలు అడగడం మానేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మతో చెప్పేవాడిని. అమ్మే వారధి- నాకూ నాన్నకీ. ఇప్పుడు ఇద్దరూ లేరు... జ్ఞాపకాల్లో తప్పితే.
మర్నాడు నేను అస్సలు అనుకోని ఫోన్ వచ్చింది. దానితో కాకినాడ వెళ్ళక తప్పలేదు. హెూటల్లో దిగి, తయారై పది అయ్యేసరికి మా ఇంటి దగ్గర ఉన్నాను.
‘‘ఏదో బేరం వచ్చిందట కదా బాబూ’’ మా రిక్షా రామూ అడిగాడు. అతనూ, తన భార్యా మా ఇల్లు కనిపెట్టి చూసుకుంటూ వెనకాల చిన్న పాకలో ఉంటున్నారు. నిజానికి మా ఇల్లు- అంటే- వంద గజాలలో చిన్న రేకుల షెడ్. దాంట్లో అన్నేళ్ళు ఎలా ఉన్నామో ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ షెడ్ కూడా మొత్తం శిథిలమైపోయింది. అమ్మేద్దామని అనుకుంటూంటే సరైన బేరం రాక చూస్తున్నాను. మొన్ననే ఫోన్ వచ్చింది ఈ రోజు మాట్లాడుకుందాం రమ్మని.
* * *
రాము మా ఇంటి తలుపు తెరిచాడు. లోపల అంతా దుమ్ము పట్టేసింది. నాన్న ప్రైవేట్లు చెప్పే చిన్న రూమ్‌లోకి వెళ్ళాను. అక్కడే నేనూ చాలా ఏళ్ళు ట్యూషన్స్ చెప్పేవాడిని.
ఎదురుగా నాన్న అల్మారా కనిపించింది. చిన్నప్పుడైతే అది ముట్టుకునే సాహసం చేసేవాళ్ళం కాదు. తలుపు తెరిచి చూస్తే... ఒక అర నిండా పాత డైరీలు పేర్చి ఉన్నాయి. ఒకటి తీసి చూశాను. అది నా చిన్నప్పటిది. రోజువారీ ఖర్చు రాసి ఉంది. నవ్వొచ్చింది... ఆయన పెట్టిన ఖర్చు ఏముంది రోజూ రాసుకోవడానికి- మొత్తం తిరగేస్తుంటే ఒక విషయం తెలిసింది. చాలాసార్లు ‘ఈ నెల జీతం రాలేదు...’ అని రాసుంది. అంతేకాదు, ‘మోహనరావు నుంచి చేబదులు’ అంటూ కొంత అమౌంట్ రాశారు. మోహనరావు మామయ్య మా నాన్న క్లోజ్ ఫ్రెండ్, బిజినెస్‌మేన్... మంచి మనిషి. మూడు నాలుగు నెలల తర్వాత... ‘జీతం వచ్చింది మోహనరావు అప్పు తీర్చాను...’ అని రాసుంది.
ఇంకో డైరీ తీశాను... అందులోనూ ఇంతే. ప్రతీ నెలా దరిదాపుగా ఇదే తంతు. ఇప్పటివరకూ ఈ విషయం నాకు తెలియదు. అంతేకాదు, ఇంకొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ప్రతీ నెలా రెండు రికరింగ్ డిపాజిట్లు కడుతున్నట్టు రాశాడు. ఒకటి మా అక్క విశిష్ట పెళ్ళికి, రెండోది నా చదువుకి అట.
అక్క పెళ్ళి సింపుల్‌గా చేసినా నాన్న డబ్బుకి ఇబ్బందిపడినట్టు నేను వినలేదు. వేరే ఊర్లో ఇంజినీరింగ్ చేసినా ప్రతీ నెలా ఒకటికల్లా నాకు డబ్బులు వచ్చేసేవి, ఇదన్నమాట కారణం. ఎందుకో మనసు కొంచెం బాధగా మూలిగింది.
ఇంకా చాలా డైరీలే తిరగేశాను. ప్రతీ ఏడాదీ సంక్రాంతికి పిల్లలకీ అమ్మకీ బట్టలు కొన్నట్టు రాశాడు. ఆయన కొనుక్కున్నట్టు ఎక్కడా లేదు. అప్పుడు గుర్తొచ్చింది. తన బట్టలు తనే అతి జాగ్రత్తగా ఉతికి... మళ్ళీ ఇస్త్రీ కూడా అవసరం లేకుండా ఆరేసుకునేవాడు. నిజంగా ఆయన కొత్త బట్టలు కట్టుకోవడం నాకు చూసిన గుర్తే లేదు. నెల నెలా వచ్చిన ట్యూషన్ ఫీజు చూస్తే చాలా తక్కువ అనిపించింది. చాలామంది పిల్లలు వచ్చేవారు... మరీ ఇంత తక్కువ ఉందేమిటీ... ఆశ్చర్యంగా ఉంది. కానీ వెంటనే గుర్తొచ్చింది, ఎవరి అమ్మో నాన్నో వచ్చి, ‘ఈ నెల ఫీజు ఇవ్వలేకపోతున్నాం’ అంటూ ఏదో సంజాయిషీ చెబితే... ‘నేను అడిగానా? ఉన్నప్పుడు ఇవ్వండి. మీ పిల్లల చదువు ముఖ్యం’ అనేవాడు నాన్న.
మెల్లగా నాన్న అంటే నేను వేసుకున్న భావచిత్రం రంగులు మార్చుకుంటోంది.
ఈలోగా ఇంటి గురించి మాట్లాడటానికి రమ్మని ఫోన్ వచ్చింది. రాము రిక్షా మీద వెళ్ళాను. అతని పేరు సత్తిబాబు. చాలా పాష్‌గా ఉంది ఇల్లు, మందీ మార్బలం కూడా ఎక్కువే. నేను వెళ్ళేసరికి ఎదురొచ్చి నా పేరు పెట్టి పలకరించి లోపలికి తీసుకెళ్ళాడు. ఇలాంటి వాడితో జాగ్రత్తగా ఉండాలి- నాకు నేను చెప్పుకున్నాను.
నేను కూర్చుంటూ ‘‘నమస్కారం’’ అన్నాను.
‘‘మీరు నమస్కారం పెట్టకూడదు. మీరు మా గురువుగారి అబ్బాయి’’ అంటూ తను మా నాన్న దగ్గర ఏ సంవత్సరం చదువుకున్నాడో, నాన్న ఎలా చితక్కొట్టి మరీ లెక్కలు చెప్పేవాడో గొప్పగా వివరించాడు. ‘‘మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు కూడా నాకు కొన్నాళ్ళు... లెక్కలు చెప్పారు. అయితే ఎప్పుడూ నన్ను కొట్టలేదు’’ పకపకా నవ్వాడు.
నేనూ శ్రుతి కలిపాను. ఇదంతా ఎంతవరకూ నిజమో నాకు మాత్రం అసలు గుర్తులేదు. ఇన్ని కబుర్లూ చెప్పి ఇల్లు తక్కువకి అడుగుతాడేమో... అనుమానంగా ఉంది.
‘‘ఇంతకీ ఇల్లు ఎంత చెబుతున్నారు?’’ అడిగాడు.
నా వరకూ డెబ్భై లక్షలు వస్తే... హౌస్ లోన్ తీరిపోతుంది... ఇంకా పైన వస్తే... కార్ లోన్ కూడా కట్టేయచ్చు. ఎంత
చెబుదామా అని ఆలోచిస్తున్నాను. ఆచితూచి రేట్ చెప్పాలి, ప్రస్తుతం ఒక లక్ష కూడా
నాకు ఎక్కువే. ‘‘ముందుగా ఆలోచించుకుని రాలేదా?’’ నవ్వాడు.
ఏమైతే అయ్యిందని ‘‘ఒకటి అనుకుంటున్నాం’’ అన్నాను.
‘‘అబ్బో...’’ నవ్వాడు.
‘‘గురువు గారి దగ్గర బేరం ఆడకూడదు... ఇంకో మాట ఏమైనా చెబుతారా?’’ అన్నాడు.
‘‘నాకు ఈరోజే అర్జెంట్‌గా అమ్మేసే అవసరం కూడా ఏం లేదు’’ బెట్టుగా అన్నాను.
‘‘నిజానికి ఎక్కువ చెబుతున్నారు.’’
‘‘మీ ఇష్టం’’ నేనూ నవ్వి లేచేశాను.
‘‘ఇంకోమాట ఏమైనా చెబితే ఆలోచిస్తాను’’ అన్నాడు.
‘‘ఏమనుకోవద్దు. అదే చివరి మాట’’ అన్నాను. ప్రస్తుత నా పరిస్థితినిబట్టి నిజానికి కొంత తగ్గాలి, కానీ ఎందుకో అసలు తగ్గబుద్ధి వెయ్యలేదు.
రామూని ఆ డైరీలు అన్నీ హెూటల్ రూమ్‌కి తెమ్మన్నాను. వాటిని తిరగేస్తూంటే... చాలా విషయాలు అర్థం అయ్యాయి. నాన్నది పిసినారితనం కాదు... తక్కువ ఆదాయం వలన... తప్పని అతి జాగ్రత్త మాత్రమే. ఈలోగా డైరీల మధ్య నుంచి నాన్న దస్తూరితో రాసున్న ఒక పేపర్ బయటపడింది, కుతూహలంతో చదవడం మొదలెట్టాను.
‘ఇది ఎవరైనా చదువుతారనో, చదవాలనో రాయటం లేదు... కేవలం నా తృప్తి కోసమే. నాకు తెలుసు నేను ఘోరంగా విఫలమైన తండ్రిని. పిల్లల చిన్నచిన్న కోరికలు కూడా తీర్చలేకపోయాను. పాపం, చిన్నతనం... పైగా మా తోడల్లుడి పిల్లల్ని చూసి మా అబ్బాయి ఏమైనా కావాలి అని గొడవ చేస్తే... విననట్టు ఉండేవాడిని... లోపల ఎంతో బాధని దిగమింగుకుని.’
చదవడం ఆగిపోయింది... అక్షరాలు నా కన్నీళ్ళ వలన అలుక్కుపోయాయి. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ మొదలెట్టాను.
‘పంచడానికి ఏవైనా ఆస్తులు ఉంటే, ఇవున్నాయి, అవున్నాయి... అంటూ పిల్లలకి గర్వంగా చూపించుకోవచ్చు, అదే నాలాగా ఇల్లు గడవడానికే కష్టంగా ఉండి... అప్పులున్నాయంటే... ఏం చూపించాలి? ఆత్మన్యూనతతో కుంగిపోవడం తప్పితే. అమ్మాయి పెళ్ళీ అబ్బాయి చదువూ గట్టెక్కించడానికే నేను యాతనపడాల్సి వచ్చింది. తను ఏనాడూ ఏవీ అడగకపోయినా... నా భార్యని కూడా ఎప్పుడూ సుఖపెట్టలేకపోయాను. ఈ జీవితం ఇలాగే గడిచిపోయింది. ఈ ముసలితనంలో నా ముఖ్య కోరిక... నేను మా అబ్బాయికి భారం కాకూడదు.’
మళ్ళీ ఆగిపోయాను... గుండె బరువెక్కింది. నిజమే ఆయన ట్యూషన్ చెబుతూ వెళ్ళిపోయాడు. కళ్ళు నీటితో నిండినా... మనసు ఆ అక్షరాల వెంట పరుగెడుతోంది.
‘మరొక కోరిక... పెద్ద పెద్ద ఆస్తులు ఎలాగూ ఇవ్వలేకపోయాను, ఎలాగోలా తనఖా సొమ్ము కట్టేసి ఈ చిన్న ఇంటిని నా తదనంతరం మా అబ్బాయికి అప్పచెప్పాలి... అంతే!’
నాన్న అంటే నాకున్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. అమ్మ కష్టం కళ్ళకి కనబడింది, నాన్న తన కష్టం కనపడనీయలేదు. నేనూ అర్థం చేసుకోలేకపోయాను.
తిరుగు ప్రయాణంలో రైల్లో కూర్చొని ఆలోచిస్తూంటే... ఈ మధ్యనే అక్క పంపిన ఒక వాట్సాప్ మెసేజ్ గుర్తొచ్చింది... ప్రకాష్ పనసకర్ల రాసి తనికెళ్ల భరణి చదివిన ‘నాన్న ఎందుకో వెనుకబడ్డాడు’ అనే కవిత ఇప్పుడు వింటూంటే ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది. గబుక్కున టాయిలెట్‌లోకి వెళ్ళి మనస్ఫూర్తిగా ఏడ్చాను.
నాన్న చేసింది పొరపాటు అనడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు కానీ... ఆ మనస్తత్వాన్ని నేనూ మార్చుకోవాలి. పిల్లల్ని నొప్పించకూడదని ఆలోచిస్తూ... నా సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళకపోవడం సరైన పద్ధతి కాదని నాకు తెలిసొచ్చింది.
నాకు ఇంక్రిమెంట్ వస్తే గొప్పగా చెప్పాను, ప్రమోషన్ వస్తే నానా హడావుడీ చేశాను. మరి ఉద్యోగం పోయిందని చెప్పడానికి ఏమైంది? ఇదేమీ నేను చేసిన నేరం కాదు కదా? ఓకే... ఫారెన్ టూర్ విషయంలో వాళ్ళకి బాధగా ఉండటం సహజమే. కానీ ఇప్పటి నుంచీ వాళ్ళతో ఇలాంటివి అన్నీ షేర్ చేసుకుంటే... జీవితమంటే ఒక అవగాహన వస్తుంది, సమస్యలంటే భయపడకుండా ఎదురీదగల సామర్థ్యం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటుపోట్లని ధైర్యంతో ఎదుర్కొని ముందుకెళ్ళే మనఃస్థితి చాలా అవసరం.
మర్నాడు పొద్దుటే టిఫిన్ తింటూ నా భార్యకీ పిల్లలకీ ఉద్యోగం విషయం చెప్పాను. పిల్లలిద్దరూ కొంచెం మొహాలు చిన్నబుచ్చుకున్నారు. మనస్విని మాత్రం... ‘‘అయితే ఫారెన్ టూర్ క్యాన్సిల్ చెయ్యండి. వచ్చే ఏడాది వెళ్ళొచ్చు’’ అంది.
నేను నవ్వాను. ‘‘మీరేమంటారు?’’ పిల్లల్ని అడిగాను.
‘‘నీ ఇష్టం నాన్నా’’ అంది మా అమ్మాయి... మా అక్కే గుర్తొచ్చింది.
మా అబ్బాయి మొహం ముడుచుకుని ‘‘నాన్నా, నీకు ఇంకో ఉద్యోగం ఎలాగూ వస్తుంది. నా ఫ్రెండ్స్‌కీ, మా సార్‌కీ కూడా గొప్పగా చెప్పాను మన ట్రిప్ గురించి. మళ్ళీ ఇంత సరదా ఉంటుందా?’’ ఏడుపు ఒకటే తక్కువ, ఎంతైనా నా ఫోటో కాపీ వాడు.
నా భార్య ఏదో అనబోయింది. నేను ఆగమని సైగ చేశాను.
ఇందాక మా బావమరిది ఫోన్ చేశాడు. అతని ఫ్రెండ్ కాకినాడలో కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లోనే ఉన్నాడు. అతని ద్వారా తెలిసిన నిజం ఏమిటంటే, మా ఇల్లు బేరం ఆడిన సత్తిబాబు... మా ఇంటి రెండువైపులా ఉన్న స్థలాలు కొనేశాడట. మధ్యలో ఉన్న నా స్థలం కొని తీరాలి- ఫ్లాట్స్ కట్టాలంటే. ఆ రేటు మీదే నిలబడి పొమ్మని సలహా ఇచ్చాడు. అందుకే దైర్యంగా-
‘‘సరే అయితే ఒక పని చేద్దాం. ఒక్క సింగపూర్ వెళ్ళొచ్చేద్దాం, అదీ అంత హైఫైగా కాకుండా... కొంచెం బడ్జెట్లో ప్లాన్ చేద్దాం’’ అన్నాను.
అంతే, పిల్లలిద్దరి మొహాలూ వెలిగిపోయాయి.
‘‘ఇంకో విషయం... ఈ ట్రిప్ స్పాన్సర్ చేస్తున్నది... మీ తాత.’’
అవునా అన్నట్టు చూశారు ఇద్దరూ. తాత గురించి మొదటిసారి వాళ్ళకి గొప్పగా చెప్పాను. నా భార్య కూడా కొంచెం ఆశ్చర్యంగానే చూస్తోంది.
చివరికి అలవాటుగా ‘‘అన్నీ చక్కబడ్డాక... ఈసారి ఇంకా మంచి టూర్ ప్లాన్ చేద్దాం’’ అన్నాను.
‘‘అదిగో... మళ్ళీ ప్రామిస్ చేసేశారు... వాళ్ళు దాన్నే పట్టుకుంటారు’’ గయ్యిమంది మనస్విని.
‘‘అదే... నాన్నగా నా వీక్‌నెస్’’ నవ్వాను.
పిల్లల ఆనందంకంటే ఏ తండ్రికైనా కావాల్సింది వేరే ఏముంటుంది!?
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
General News
NTPC: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి ప్రారంభం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ