అభిమానాలు- ఆప్యాయతలు

ఆ రోజు శనివారం. చాలా సంవత్సరాలు అయింది చిలుకూరు బాలాజీ గుడికెళ్లాలని అనుకుని. నేనూ మావారూ కలసి కారులో బయలుదేరాం. శనివారం మూలాన గుడిలో రష్‌ ఎక్కువగా ఉంది. నాకు ఏ మొక్కులూ లేవు. ఇంట్లో చేసే పనులు ఏమీ లేక, ఏం చేయాలో తెలియక ఇలా అనుకుని వచ్చాం గుడికి!

Updated : 10 Apr 2022 06:31 IST

అభిమానాలు- ఆప్యాయతలు

యశోదాకైలాస్‌ పులుగుర్త

రోజు శనివారం. చాలా సంవత్సరాలు అయింది చిలుకూరు బాలాజీ గుడికెళ్లాలని అనుకుని. నేనూ మావారూ కలసి కారులో బయలుదేరాం. శనివారం మూలాన గుడిలో రష్‌ ఎక్కువగా ఉంది. నాకు ఏ మొక్కులూ లేవు. ఇంట్లో చేసే పనులు ఏమీ లేక, ఏం చేయాలో తెలియక ఇలా అనుకుని వచ్చాం గుడికి!

పదకొండు ప్రదక్షిణలు ముగించుకుని దేవుడిని దర్శించుకుని గుడి బయటకు వచ్చాం... అక్కడ కొద్ది దూరంలో ఒక ముసలామె అప్పుడే తోట నుంచి కోసుకు వచ్చినట్లుగా నిగనిగలాడుతున్న జామపండ్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతుండడం చూసి మావారు కొనుక్కొద్దామని అటువైపు వెళ్లారు. నేను అటూ ఇటూ చూస్తుండగా అనుకోకుండా ఎవరో ఒకామె నాకు దగ్గరగా వస్తూ నా భుజంమీద చేయివేసి ‘హలో పరిమళా’ అని పిలిచేవరకూ నాకు తెలియనే లేదు ఆ వచ్చింది ఎవరో! ఎదురుగా సుధ... అబ్బా, ఎన్నాళ్లకు కనపడింది! అసలు సుధలో ఏ మార్పూలేదు... అదే చిరునవ్వూ, ఆత్మీయతా.

సుధను చూసి దాదాపు ఆరేడు సంవత్సరాలు అయిపోయింది. ఏమాత్రం మారని సుధ... అలాగే అమాయకంగా, ఒద్దికగా చిరునవ్వు నవ్వుతూ కనబడింది.

నాలోనే మార్పు వచ్చింది... ఆ మధ్య ఆఫీసులో నాతో కలిసి పనిచేసిన రత్నమాల నన్ను చూసి, ‘ఏమిటే ఎలా ఉండేదానివి, ఇలా అయిపోయావేంటి’ అంటూ ఆశ్చర్యపోయింది. చెప్పాలంటే వయసుకి మించిన దానిలాగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా కనిపిస్తున్నానట.

సుధ నా చేతులను ఆప్యాయంగా స్పృశిస్తూ ‘‘ఎలా ఉన్నావు పరిమళా... బావగారు ఎక్కడ... మీ పిల్లలు ఎక్కడున్నారు?’’ అంటూ ఎడతెరిపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపించింది.

నేను నా గురించి చెప్పాకా తన వివరాలు చెప్పింది.

‘‘ఏదైనా మొక్కు మొక్కుకున్నావా’’ అని అడిగితే అవునంటూ చిరునవ్వు నవ్వింది. సుధ పరోపకార జీవి. తనకోసం కాకపోయినా తన బంధువులూ, ఆత్మీయుల విషయంలో కూడా దేవుడికి మొక్కుకుని ఆ మొక్కులను తీర్చుకునే విశాలహృదయురాలు. ఈలోగా మావారు వచ్చారు. మా వారిని కూడా పలకరించి వాళ్లింటికి మేమిద్దరమూ తప్పక రావాలని మరీ మరీ చెబుతూ సుధ తన ఫోన్‌ నంబర్‌, ఇంటి అడ్రస్‌ చెప్పి సెలవు తీసుకుని వెళ్లిపోయింది.
సుధ కుటుంబం, మా కుటుంబం విద్యానగర్‌లో ఎనిమిది సంవత్సరాలు పక్క పక్కనే ఉండేవాళ్లం. అప్పటికి మేము సొంత ఫ్లాట్‌ కొనుక్కోలేదు. మా పిల్లలు చదువుల్లో ఉన్నారు. తరువాత మేము  సోమాజిగూడాలో మంచి సెంటర్‌లో త్రీ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌ కొనుక్కుని వెళ్లిపోయాం. అప్పటినుండీ నాకు సుధతో సంబంధం పూర్తిగా పోయింది. ఇన్నాళ్లకి తను అనుకోకుండా తటస్థపడింది.

సుధా, మేమూ పక్క పక్కనే అద్దె ఇళ్లల్లో ఉండగా నేను సుధకి దూరంగా ఉండడానికి  ప్రయత్నించినా తను మాత్రం నాతో సన్నిహితంగా ఉండేది. సుధ ఆలోచనలూ అభిప్రాయాలూ ఎందుకో నాకు నచ్చేవి కావు... నాకు నచ్చని వ్యక్తులు నాకు దగ్గరగా ఉండటాన్ని కూడా ఇష్టపడను నేను.

మాది ఉమ్మడి కుటుంబమే. మొదట్లో నా పెళ్లయి అత్తవారింటికి వచ్చినపుడు... మావారి అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ, మా అత్తగారూ, మామగారే కాకుండా ఆయన బాబాయి పిల్లలూ, మేనత్త పిల్లలూ కూడా ఉండేవారు. ఇక రోజూ వచ్చి పోయే బంధువుల మాట చెప్పనే అక్కర్లేదు. ఇల్లు ఒక తిరునాళ్లలాగా ఉండేది. వంటలూ వార్పులూ భోజనాలూ ఇవి తప్పించితే మరో లోకం నాకు అక్కడ కనిపించేది కాదు.

నాకు పెళ్లికి ముందు కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి...  ఉమ్మడి కుటుంబంలో ససేమిరా ఉండకూడదనీ, మాకంటూ ఓ అందమైన పొదరిల్లు ఏర్పరుచుకుని అందులో నేనూ మావారూ మా పిల్లలే ఉండాలనీ... ఇలా ఎన్నో ఆలోచనలు ఉండేవి. కానీ, అదేమిటో భగవంతుడు మనకు ఇష్టం లేని పనులే జరిపిస్తాడు. నా విషయంలో అదే జరిగిందని అనుకుంటాను. 

దాని ఫలితమే- మాకు పెళ్లైన కొద్దికాలానికే వేరే కాపురం పెడదామని మా వారిని శతవిధాల పోరడం. వీలుకాదని చెప్పిన మావారి మీద అలకలూ సత్యాగ్రహాలతో సహా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాక చివరకు నా మనసును మా అత్తవారే గ్రహించి వాళ్ళే మమ్మల్ని వేరే ఉండమని చెప్పేశారు. వాళ్లతో శాశ్వతంగా బంధం తెగిపోయింది. నేను అనుకున్నది సాధించే వరకూ నిద్రపోను, అలా అని నిరుత్సాహ పడిపోను. ఆశతో ఓపికతో పోరాడుతూనే ఉంటాను, చివరకు సాధిస్తాను.

అలా మేము విడిగా విద్యానగర్‌లో ఒక ఇంట్లోకి అద్దెకు దిగాం. తరువాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టి, వాళ్లు స్కూళ్లల్లో చదువుకుంటున్న సమయంలో సుధావాళ్లు మా పక్కనున్న ఇంటిలో దిగారు. వాళ్లది చాలా పెద్ద కుటుంబం. వాళ్ల అత్తగారూ, మావగారూ, మరుదులూ, ఆడపడుచులే కాకుండా సుధవాళ్ల పినమామగారి పిల్లలు కూడా ఉండేవారు... మా అత్తవారింట్లోలాగ. 

అయితే సుధ చాలా అమాయకురాలు.

నా స్వభావానికి విరుద్ధం. అమాయకంగా నెమ్మదిగా ఇంట్లో వారికి అన్ని సేవలూ చేస్తూ ఎప్పుడూ హడావుడిగా ఉండేది. ఏనాడూ ధూమ్‌ధామ్‌లు లేకుండా ప్రశాంతంగా తన బాధ్యతలను నిర్వహించే సుధ పట్ల నాకు చాలా అసహనంగా ఉండేది. ఎన్నోసార్లు చెప్పాను... ‘ఇలా నువ్వు ఉమ్మడి కుటుంబంతో అతుక్కుపోతే రేపు నీకూ నీ పిల్లలకూ చిప్పే మిగులుతుందనీ, వేరే కాపురం పెట్టుకుని బాగుపడమనీ.’ అన్నింటికీ ఒక చిరునవ్వే సమాధానం సుధ నుండి. ఇక నామాట వినేలా లేదని గోడకు చెప్పినట్లే అనుకుని చెప్పడం మానేశాను.

సుధ పట్ల నేను కోపంగా అసహనంగా ఉన్నా ఒక్కోసారి నా స్వార్ధంకోసం ఆమెను నేను ఉపయోగించుకున్న రోజులు కూడా ఉన్నాయి. నాకు ఉద్యోగం మూలాన ఇంటికి రావడం ఆలస్యమైతే స్కూల్‌కు వెళ్లే మా పాపనీ బాబునీ స్కూలు అయిపోయిన తరువాత సుధా వాళ్లింట్లో అప్పుడప్పుడూ ఉంచవలసిన అవసరం వచ్చేది. 

ఆరోజుల్లో మేము చాలా హాయిగా ఆనందంగా బతుకుతున్నామని సంబర పడేదాన్ని. వీకెండ్‌లో పిల్లలని తీసుకుని నేనూ మావారూ హోటల్స్‌కీ సినిమాలకీ వెళ్లేవాళ్లం. పిల్లల సెలవుల్లో ఏవో టూర్స్‌కు తప్పనిసరిగా వెళ్లేవాళ్లం. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామనీ, ఇదే జీవితం అనీ ఆనందపడుతూ సుధా వాళ్లకు ఈ అదృష్టం లేదు కదా అనుకుంటూ ఆనందపడేదాన్ని. ఆమెకు శని ఆదివారాలు వస్తే ఎవరో ఒకరు బంధువుల పిల్లలు- ఇక్కడే హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండి చదువు కుంటున్నవాళ్లు- వీరింటికి రావడం, లంచూ, డిన్నరూ చేసుకుని మరీ వెళ్లడం మామూలు. 

సుధ భర్త గవర్నమెంట్‌ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తూ ఉండేవాడు. ఆయన ఆదాయం అంతా ఉమ్మడి కుటుంబ ఖర్చుల్లో కొట్టుకుపోయేది. మేము అలా కాదు.

మా డబ్బును ఎన్నో పొదుపు పధకాలలో పెడుతూ, వడ్డీలకు ఇస్తూ, ఇన్సూరెన్స్‌ పాలసీలలో మదుపుచేస్తూ, బంగారమూ స్థలాల కొనుగోలులో పెట్టీ చాలా కూడపెట్టాం. అందుకనే చాలా తక్కువ కాలంలోనే మేము పాష్‌ ఏరియాలో అపార్ట్‌మెంట్‌ కొనుక్కోగలిగాం. 

సుధ పిల్లలు కేవలం సాధారణ డిగ్రీ కాలేజీలో చదివేవారు. అది చూసి నేను తనతో అనేదాన్ని... ‘చూశావా, సుధా మేము ఉమ్మడి కుటుంబం నుండి బయటకు వచ్చేసిన మూలానే కదా మా పిల్లలని ఇంత బాగా చదివిస్తున్నాం... నువ్వు ఆ పని చేయలేకపోయినందుకే మీకు అవన్నీ సాధ్యం కాలేదు’ అంటే, చిరునవ్వు నవ్వి ఊరుకునేది. నాకు సుధపట్ల జాలి స్థానంలో కోపం ఉవ్వెత్తున లేచేది.

మేము మా సొంత అపార్ట్‌మెంట్‌కి వచ్చేసిన కొద్దికాలానికి మా పిల్లల కాలేజీ చదువులు అయిపోయాకా వాళ్లను అమెరికా పంపించి పెద్ద చదువులు చదివించాం. వాళ్లు పెద్ద పెద్ద ఉద్యోగాలలో అక్కడే  స్థిరపడ్డారు. మేము సిటీలో ప్రైమ్‌ ఏరియాలో మరో రెండు ప్లాట్స్‌ కొన్నాం. ఈ క్షణాన అమ్మేసినా రెండుకోట్లు పైగా డబ్బు వచ్చి ఒళ్లో వాలుతుంది. మా పిల్లలిద్దరూ అమెరికాలో వాళ్లకు నచ్చిన వాళ్లను వివాహాలు చేసుకున్నారు. ఎవరి జీవితాలు వాళ్లవి. బిజీలైఫ్‌... ఎప్పుడో వారానికో, పదిరోజులకో ఫేస్‌టైమ్‌లో చూసుకోవడం మాట్లాడుకోవడం!

నేనూ మావారూ రిటైర్డ్‌ జీవితాన్ని మా ఇంటినాలుగు గోడలమధ్య అనుభవిస్తున్నాం. ఏ బంధువులూ మా ఇంటికిరారు, మా అత్తగారింటి వైపు వారు అయితే అసలు తొంగే చూడరు. మేము సంపాదించుకున్న డబ్బులు చాలా ఉన్నాయి. జీవితమంతా హాయిగా కూర్చుని తిన్నా సరిపోయేటన్ని డబ్బులు ఉన్నాయనీ, విడిగా వచ్చేయడం మూలానే ఇవన్నీ సాధ్యం అయ్యాయనీ లేకపోతే మా సంపాదన అంతా ఉమ్మడి కుటుంబంలో ఏరులా పాకి ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్లమనీ నేను అనుకుంటాను కూడా.

రిటైర్డ్‌ జీవితం అంటే విలాసవంతంగా జీవించాలనే నా అభిప్రాయం. చాలామంది రిటైర్‌ అయ్యాక అతిపొదుపుగా జీవిస్తారు. కానీ, మేము మాత్రం ఇప్పుడు కూడా విమానాల్లోనే ప్రయాణం. సంపాదన ఉన్నప్పుడూ, రిటైర్‌ అయ్యాకా కూడా ఒకటే జీవన విధానం మాది. 

పాపం సుధ, ఉన్నదంతా ఖర్చు పెట్టేసి, సొంత ఇల్లుకూడా ఏర్పరచుకొని ఉండదు. అప్పట్లో డిగ్రీ చదువుతున్న సుధ పిల్లలు ప్రస్తుతం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు.

ఏమిటో... ఒక్కొక్కసారి ‘మాకేంటీ’ అని అనుకున్నా, ఇంట్లో నేనూ మావారూ ఒకరి ముఖాలు మరొకరం చూసుకుంటూ ఉండాలెప్పుడూ. ఎన్ని సినిమాలు చూసినా, టూర్లు తిరిగొచ్చినా చివరకు ఇంట్లో ఇద్దరమే! ఒకసారి బాత్‌రూమ్‌లో నేను స్లిప్‌ అయినపుడు కాలు ఫ్రాక్చర్‌ అయింది.  డాక్టర్‌ కాలుకి బేండేజ్‌ వేసి మూడునెలల వరకూ కదలొద్దన్నారు. ఎవరూ సహాయానికి రాలేదు, అసలు మా సంగతి ఎవరికి తెలుసును కనుక. ఒకవేళ తెలిసినా రారు కూడా! లేడీ అటెండర్‌ను పెట్టుకున్నాం, వంటకు ప్రత్యేకంగా వంట మనిషిని పెట్టుకున్నాం. అప్పుడనిపించింది. డబ్బులున్నాయి కాబట్టే ఇవన్నీ కుదిరాయని!

కానీ మావారి స్వభావంలో మాత్రం మార్పు కనబడుతోంది. ఒంటరితనంతో బోర్‌ ఫీలవుతున్నట్లుగా అనిపిస్తోంది! ఎవరింటికైనా వెళితే బాగుండును, సందడిగా గడపాలని ఉందన్నట్లు మాటల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తాం, ఎవరు రమ్మంటారు కనుక... 

సరే, సుధ ఆ రోజు గుడిలో కలిసి పదే పదే వాళ్లింటికి రమ్మనమని పిలిచింది కదా అని- మనసులో ఇష్టం లేకపోయినా- ఏం చూస్తాను తనని, తన ఉమ్మడి కుటుంబ జనాలనే కదా అనుకుంటూ- తప్పదన్నట్లు వెళ్లాం నేనూ మావారూ. సుధకి ఫోన్‌ చేశాం ‘‘వస్తున్నాం’’ అని. ‘‘లంచ్‌కి వచ్చేయండి పరిమళా’’ అంది. సుధా వాళ్లు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ చక్కని ఏరియాలో ఉంది. పోనీలే కనీసం మంచి ఏరియాలోనైనా ఉంటున్నారు అనుకుంటూ వాళ్ల ఫ్లాట్‌కు వెళ్లి కాలింగ్‌ బెల్‌ నొక్కాము.

సుధ చంకలో రెండేళ్ల పిల్లవాణ్ణి ఎత్తుకుని డోర్‌ తెరవడానికి వచ్చింది. మమ్మల్ని చూడగానే బోల్డంత సంబరపడుతూ లోనికి ఆహ్వానించింది. ఎంత బాగుంది ఆ అపార్ట్‌మెంట్‌... చాలా పెద్దదిగా తమ అపార్ట్‌మెంట్‌ కంటే చాలా బాగుంది. ఎంతో నీట్‌గా ఎక్కడి వస్తువులక్కడ పొందికగా అమర్చుకున్నారు.

సోఫాలో కూర్చోగానే ‘‘వీడు నా మనవడు, మా అబ్బాయి రఘు కొడుకు’’ అని చెప్పింది. 

‘‘మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సుధా’’ అని అడిగాను.

‘‘అప్పుడు మా రఘు డిగ్రీ చదువుతుండే వాడు కదా పరిమళా... డిగ్రీ అవగానే వాడికి బరోడాలో ఒక ఫెర్టిలైజర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా చిన్న మరిది రామం, నీకు తెలుసుకదా, మా దగ్గర ఉండి చదువుకునే వాడు, ఆ తరువాత అతనికి ముంబయిలో చాలామంచి ఉద్యోగం వచ్చింది. మా మరిది మావారితో ‘అప్పుడే మన రఘుకి ఉద్యోగం ఏమిటన్నయ్యా’ అంటూ మాన్పించి, ముంబయి లోనే తన దగ్గరుంచుకుని మా వాడిచేత అక్కడే యూనివర్సిటీలో ఎమ్‌.బీ.ఏ చదివించాడు. ప్రస్తుతం ఇక్కడే జే.పీ మోర్గాన్‌ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మా కోడలు కూడా కాలేజీలో లెక్చరర్‌. మేమందరం కలిసే ఉంటున్నాం’’ అని చెప్పింది.

‘‘మా అమ్మాయి ప్రతిమను కూడా మా ఆడపడుచు తన దగ్గర పెట్టుకుని, ఎమ్‌.కామ్‌ చదివించి బ్యాంకింగ్‌ పరీక్షలకు తయారు చేసింది. ఇప్పుడది వైజాగ్‌లో బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. పెళ్లి అయింది, వాళ్ల అత్తా మామగారూ అందరూ కలిసే ఉంటున్నారు’’ అని చెప్పింది.

ఈలోపు ‘‘పెద్దమ్మా’’ అంటూ ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి లోపలనుండి వచ్చింది. 

ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ, ‘‘మా రెండవ మరిది కూతురు శ్రావ్య... ఇక్కడే ఇంజినీరింగ్‌ కాలేజీలో సీట్‌ వచ్చింది, బైట ఎక్కడో ఉండి చదువుకోవడం ఏమిటని మా ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాం’’ అని చెప్పింది.

శ్రావ్య విషయంలోనే- ఆ అమ్మాయికి ఈ ఊళ్లో కాలేజీలోనే సీట్‌ రావాలనీ, వస్తే తను చిలుకూరు బాలాజీకి నూటఎనిమిది ప్రదక్షిణలు చేస్తాననీ మొక్కుకుని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలోనే  పరిమళను అనుకోకుండా కలిసినట్లు చెప్పింది సుధ.

నేను చెప్పలేదూ, మా సుధ పరోపకార జీవని... వాళ్ల మరుదులనూ, ఆడపడుచునీ వీళ్లే దగ్గరుంచుకుని చదివించి, పెళ్లిళ్లు చేశారు... ఆ కృతజ్ఞతా భావంతో తిరిగి అన్నగారి పిల్లలను కూడా వాళ్లు తమ దగ్గర పెట్టుకుని పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివించారు. చేసిన సహాయాన్ని మరిచిపోయిన వాళ్లే ఉంటారని తెలుసు కానీ సుధ కుటుంబంలోని సభ్యులకు ఒకరిమీద మరొకరికి ఎంతటి ఆప్యాయతా కృతజ్ఞతాభావం!

‘‘మీ ఫ్లాట్‌ చాలా బాగుంది సుధా’’ అనగానే...

‘‘అవును కదూ, ఈ ఫ్లాట్‌ స్టోరీ చెబితే ఆశ్చర్యపోతావు పరిమళా’’ అంది. ‘‘మావారు రిటైర్‌మెంట్‌కు ముందు ఒక చిన్న అపార్ట్‌మెంట్‌, పాతిక ముఫై లక్షల్లో సెకండ్‌ సేల్‌లో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకు తుంటే- అవునూ, నీకు శ్రీను గుర్తున్నాడా?’’

‘‘శ్రీనునా..?’’

‘‘అదే పరిమళా, మావారి బాబాయ్‌ కొడుకు. అప్పట్లో మా ఇంట్లోనే ఉంటూ హైటెక్‌సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేసేవాడూ, నిన్ను ఆంటీ అంటూ చనువుగా పిలిచేవాడూ...’’

‘‘ఆఁ అవును... గుర్తొచ్చాడు.’’

‘‘అతను అప్పుడు ఈ అపార్ట్‌మెంట్‌ కొనుక్కున్నాడు. అతనికి బెంగుళూర్‌లో మరో ఉద్యోగం వచ్చింది. మేము ఫ్లాట్‌ కోసం చూస్తున్నామని తెలిసి ఈ ఫ్లాట్‌ను మాకు అతను కొనుక్కున్న రేటుకే చాలా చవకగా ఇచ్చేశాడు, అతనికి మేమంటే చాలా అభిమానంలే’’ అనగానే తెల్లబోయాను! 

ఇంత పెద్ద ఫ్లాట్‌, తమకంటే విశాలమైనది, లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కేవలం పాతిక ముఫై లక్షలకు ఎవరిచ్చేస్తారు? ప్రస్తుతం కోటిరూపాయలు పైనే విలువ పలుకుతుంది. అసలే నా బుర్ర ఆర్ధిక పరమైన మదుపులతో రాటుతేలిపోయి ఉంది!

‘‘అయితే సుధా, నీ టైమ్‌పాస్‌ ఏమిటి’’ అనగానే అదే చిరునవ్వు...

‘‘ఏముంది పరిమళా? కొడుకూ కోడలూ మేమూ అంతా కలిసే ఉంటున్నాం... వాళ్ళంతా ఆఫీసులూ ఉద్యోగాలూ అంటూ బయటకి వెళ్ళిపోతారు... నేనూ మావారు ఖాళీనే కదా, ఇదిగో మా పిల్లలకు ఈ విధంగా సహాయపడుతూ కాలక్షేపం చేస్తున్నాం...’’ అంది.

‘‘రోజూ ఇంటికి ఎవరో ఒకరు బంధువులు వచ్చి వెళ్తూనే ఉంటారు. కోడలు కూడా ఉద్యోగస్తురాలు. ఇదిగో నాకు చేతనైన సాయం చేస్తాను. ఈ పసివాడు- నా మనవడు చాలు నాకు. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిచిపోతుంది. బయటకి వచ్చేది చాలా తక్కువ’’ అని చెప్పింది. మావారు అయితే సుధ మాటలను కళ్లు వెడల్పు చేసుకుంటూ మరీ వింటున్నారు. సుధ మీద జాలి అనిపించింది. ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నందుకు.

వారింటి నుండి వీడ్కోలు తీసుకుంటుంటే సుధ అంది మాతో, ‘‘అప్పుడప్పుడు వస్తూ ఉండండి’’ అని.

ఆ ఆప్యాయతకు మావారి కళ్లల్లో మెరిసిన మెరుపులు నా దృష్టిని దాటలేకపోయాయి. ‘ఒక రెండ్రోజులు మా ఇంట్లో ఉండండి పరిమళా’ అన్నా మావారు వెంటనే ఒప్పేసుకునేటట్లు అనిపించింది. ఆప్యాయతకూ అభిమానానికీ అలమటించిపోతున్న వ్యక్తిలా అనిపించారు.

మా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నపుడు, నాలో ఏదో మార్పు... నా ఆలోచనలలో నాకు తెలియకుండానే మార్పు..!

సుధ ఎంత సంతోషంగా ఉంది. తనకంటే నేనే తెలివైనదాన్ననీ, నా ఆలోచనా విధానం చాలా గొప్పదనీ, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి తెలివిగా బయటకు వచ్చేశామనీ మురిసిపోయాను. అహర్నిశలూ నా ప్రణాళికలూ ఆలోచనలతో డబ్బునంతటినీ అనేక చోట్ల మదుపుపెట్టాము. నా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారనీ, అమెరికా వెళ్తారనీ, సుధ పిల్లలని కేవలం డిగ్రీలే చదివిస్తోందనీ అనుకునేదాన్ని. ఇప్పుడు సుధ పిల్లలు ఎందులో తీసిపోయారు? చక్కని చదువులూ ఉద్యోగాలలో స్థిర పడ్డారు. ముఖ్యంగా కంటికెదురుగా ఉన్నారు. చక్కని ఫ్లాట్‌ కొనుక్కుని సుధ ఎంత సంతోషంగా ఉంది. ఇంటి నిండా ఆప్యాయంగా పలకరించే తనవాళ్లూ, ఏ అవసరానికైనా మేమున్నామని ఆరాటపడే బంధువులూ... ఎంతో ఆనందంగా క్షణం తీరిక లేకుండా అంతా తానై తిరుగుతోంది!

కానీ, నేనూ మావారూ? మా ఇంటిమీద పొరపాటున కూడా ఏ కాకీ వాలదు.

మేము బతికి ఉన్నామో లేదో కూడా ఎవరికీ తెలియదు, తెలుసుకోవాలన్న అవసరం కూడా లేదు ఎవరికీ!

దీని కంతటికీ ఒక్కటే కారణం కళ్లెదుట కనిపిస్తోంది పరిమళకి... తన ప్రణాళికలకూ పొదుపు పధకాలకూ కారణం తన తెలివితేటలూ ముందుచూపే అని గర్వపడింది. అందరితో కలసి ఉంటే  ఇవన్నీ సాధ్యం కాదనుకుంది. ఆ పెట్టుబడులకు కాలపరిమితి దాటిపోయాకా ఇప్పుడు కళ్లు తెరిచి చూస్తే తానూ తన భర్తా ఇద్దరూ కూడా ఏకాకులుగానే మిగిలిపోయారు. ఎలా ఉన్నారన్న ఒక్క ఆత్మీయ పలకరింపుకి కూడా తాము నోచుకోలేదు... తాము ఎన్ని కోట్లు సంపాదిస్తే మటుకు ఎవరు ఆనందిస్తారు? 

కానీ సుధ మాత్రం... తమ పెట్టుబడులను మనుషుల ఆప్యాయతలూ అభిమానాలపైన మదుపుచేసింది. వీటికి కాలపరిమితి లేదు. వాటిమీద రాబడి అలా అలా ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుంది... ఎవరో అన్నట్లుగా ‘అభిమానాలూ ఆప్యాయతలూ మీతో ఉన్నప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు కూడా వాటితోనే ఉంటాయ’న్నది నిజం అనిపించింది. పరిమళ మనసంతా ఏదో తెలియని ఆవేదన ఆవహించగా ఆమె కళ్ల నుండి రెండు కన్నీటి చుక్కలు చెక్కిలిమీదుగా కిందకు జారిపడ్డాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..