నువ్వు...నేను...మనమై!

‘‘నాన్న టిఫిన్‌ సరిగా తినలేదు. ఫీవరిష్‌గా ఉందన్నారు. మనిద్దరం వెళ్ళిపోతే ఆయనను కనిపెట్టుకునే వారుండరు. ఒకవేళ టెంపరేచర్‌ ఎక్కువయితే ఆయన మనకు ఫోన్‌ చెయ్యడానికి కూడా మొహమాటపడతారు. ఈ సమయంలో అమ్మ ఉంటే...’’ వినీల్‌ స్వరం రుద్ధమయింది.

Published : 01 May 2022 00:10 IST

నువ్వు...నేను...మనమై!

-కె.వి.సుమలత

‘‘నాన్న టిఫిన్‌ సరిగా తినలేదు. ఫీవరిష్‌గా ఉందన్నారు. మనిద్దరం వెళ్ళిపోతే ఆయనను కనిపెట్టుకునే వారుండరు. ఒకవేళ టెంపరేచర్‌ ఎక్కువయితే ఆయన మనకు ఫోన్‌ చెయ్యడానికి కూడా మొహమాటపడతారు. ఈ సమయంలో అమ్మ ఉంటే...’’ వినీల్‌ స్వరం రుద్ధమయింది.

‘‘ఏంటి వినూ, చిన్న పిల్లాడిలా. కాస్త జ్వరానికే కంగారుపడాలా? ఇప్పుడు టాబ్లెట్స్‌ వేసుకున్నారు కదా, కాసేపటికి జ్వరం జారిపోతుంది.

కాఫీ ఫ్లాస్కులో పోసి ఆయన మంచం పక్కనే పెట్టాను. ఫ్రూట్స్‌ కూడా పక్కనే పెట్టాను. సాయంత్రం వచ్చేటప్పుడు బ్రెడ్‌ తెస్తాను. నాకు ఆఫీసులో అర్జెంట్‌ మీటింగుంది, నేను వెళ్ళిపోతాను. నువ్వు కాసేపాగి వస్తావా?’’ హరిత అంది.

‘‘ఈరోజుకి నువ్వు ఇంట్లో ఉంటే బాగుండేది హరీ. నాన్న అనారోగ్యంతో ఒంటరిగా ఉంటే, నేను నా వర్క్‌ సరిగా చేయలేను. మానేద్దామా అంటే అర్జంట్‌ ప్రాజెక్టు ఉంది.’’

‘‘నో వే వినూ! నేనూ తప్పనిసరిగా వెళ్ళాలి. డోంట్‌ థింక్‌ అదర్‌వైజ్‌. నేను బయలుదేరుతున్నా.’’

చేసేదేంలేక ‘‘పద నేను కూడా వస్తున్నా’’ అంటూ లంచ్‌ బాక్స్‌ తీసుకొని తండ్రి గదిలోకి నడిచాడు.

‘‘నాన్నా, మేము వెళ్తున్నాం. మీరు జాగ్రత్త! జ్వరం తగ్గిన తర్వాత తినగలిగినంత మటుకు లంచ్‌ తీసుకోండి.

తినలేకపోతే ఫ్రూట్స్‌ తినండి. టాబ్లెట్స్‌ వేసుకోవడం మరచిపోవద్దు. నేను మధ్యలో గుర్తుచేస్తాలెండి’’ వినీల్‌ పడుకున్న విశ్వంగారి పక్కన కూర్చుని అన్నాడు.

‘‘ఈ మాత్రం జ్వరానికే నాకేం కాదులే నాన్నా, మీరిద్దరూ వెళ్ళిరండి’’ అంటూ లేచి కూర్చున్నారు.

‘‘జాగ్రత్త మావయ్యగారూ’’ అంటూ హరిత, ఆ వెనుక వినీల్‌ కారుదగ్గరకు వెళ్ళారు.

దారిలో వినీల్‌ అన్యమనస్కంగా ఉండటం హరిత గమనించింది కానీ ఆఫీసు మూడ్‌లో ఉండటంతో ఏమీ అడగలేదు.

వినీల్‌, హరిత ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే. లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజి. పెళ్ళయి ఏడాది అయింది. పెళ్ళయిన నెలకే జాబ్‌లో ప్రమోషన్స్‌ వచ్చాయి. ఇద్దరూ బిజీ అయిపోయారు. ఇప్పట్లో పిల్లలు వద్దనుకుని కెరీర్‌ వైపే దృష్టి పెట్టారు.

దురదృష్టవశాత్తు వినీల్‌ తల్లి నెలక్రితం చనిపోయింది. వినీల్‌ పెళ్ళికన్నా ముందే అతడి చెల్లెలు రూప పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తండ్రి ఒక్కడినీ ఆ ఇంట్లో ఉంచడం ఇష్టంలేక సిటీకి తీసుకొచ్చేశాడు. భార్యా వియోగంలో ఉన్న తండ్రిని కనిపెట్టుకుని హరిత ఇంటిపట్టున ఉంటే బాగుండునని వినీల్‌ కోరిక. తన వంతు ధర్మంగా ఇంటి పనులు నిర్వర్తిస్తోంది కదా, ఇంకా పూర్తిగా ఇంటికి అంకితం అవడం ఏమిటి అని హరిత అభిప్రాయం.

హరిత ఆఫీసు బిజీలోపడి మామగారి అనారోగ్యాన్ని మరచిపోయింది. రోజూకంటే కాస్త ఆలస్యంగా ఇల్లు చేరింది.

కిచెన్లో బ్రెడ్‌ కాలుస్తున్న వినీల్‌ని చూసి ‘‘హాయ్‌ వినూ, ఎంతసేపయింది నువ్వు వచ్చి? బ్రెడ్‌ స్లైస్‌ ఎవరికి?’’ అని అడిగింది.

వినీల్‌ ఒకసారి తలెత్తి చూసి మాట్లాడకుండా పనిలో నిమగ్నమయ్యాడు.

హరితకు అప్పుడు గుర్తొచ్చింది మామగారికి జ్వరమనీ తను వచ్చేటప్పుడు బ్రెడ్‌ తెస్తానందనీ.

‘‘ఓ... ఐయామ్‌ సారీ వినూ. మీటింగ్‌ టెన్షన్లో మరచిపోయాను. పోనీలే నాకు గుర్తులేకపోయినా నువ్వైనా బ్రెడ్‌ తెచ్చావు. మావయ్యగారికి. జ్వరం తగ్గలేదా, ఎలా ఉన్నారు?’’ అంది గిల్టీగా.

వినీల్‌ మాట్లాడకుండా ప్లేటులో బ్రెడ్‌ స్లైస్‌ పెట్టుకొని, పాలు గ్లాసులో పోసుకొని తండ్రి రూమువైపు నడిచాడు.

అతని వెనుకనే హరిత వెళ్ళింది. ‘‘ఎలా ఉంది మావయ్యగారూ’’ అని పలుకరించింది.

కళ్ళు తెరచి కోడలి వంక నీరసంగా చూసి ఫర్వాలేదన్నట్లుగా తల ఊపారు.

‘‘లేవండి నాన్నా, ఈ బ్రెడ్‌ తిని, పాలు తాగండి’’ అని చేయి ఆసరా ఇచ్చి లేపాడు వినీల్‌.

వద్దు వద్దంటున్నా బలవంతంగా అవి తినిపించి, పాలు తాగించాడు వినీల్‌.

‘‘ఇక కాసేపు పడుకోండి’’ పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ఇదంతా అయ్యేదాకా హరిత అక్కడే ఉంది.

‘‘ఇక మీరు వెళ్ళండి. అవసరమయితే పిలుస్తా’’ అన్నారు విశ్వంగారు.

ఇద్దరూ అక్కడినుండి బయటకు వచ్చేశారు.

వినీల్‌కి కోపం వచ్చిందని గ్రహించిన హరిత సంజాయిషీ ఇవ్వబోయింది కానీ వినీల్‌ అందుకు అవకాశం ఇవ్వలేదు.

ఆ రాత్రి వినీల్‌, తండ్రి వద్దంటున్నా వినకుండా ఆయన రూములోనే పడుకున్నాడు.

ఆ మరుసటి రోజు కూడా విశ్వంగారికి జ్వరం తగ్గక పోవడంతో బ్లడ్‌ టెస్ట్‌ చేయించాడు. మలేరియా జ్వరంగా నిర్ధారించారు డాక్టర్‌. టైమ్‌కి మందులు వేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు.

వినీల్‌ హరితను అడగకుండానే తనే ఆఫీసుకి లీవు పెట్టుకుని ఇంటి దగ్గర ఉండిపోయాడు.

‘‘అదేమిటి వినూ, నాకు మాట మాత్రంగానైనా చెప్పలేదే? నేనూ రెండు రోజులు లీవు పెట్టేదాన్నిగా’’ హరిత కాస్త కోపంగా అంది.

‘‘ఎందుకులే నిన్ను కష్టపెట్టడం? ఆయన మా నాన్నగారు కదా, నేనే చూసుకోవాలి’’ నిష్ఠూరంగా అన్నాడు వినీల్‌.

‘‘అదేం మాట. ఆఫీసులో అర్జంటు మీటింగు ఉండడంతో ఆ రోజు ఉండలేకపోయాను. వర్క్‌ తెలియని వాళ్ళకయితే వివరంగా చెప్పవచ్చు. నువ్వు అన్నీ తెలిసి ఇలా మాట్లాడుతున్నావేంటి? నేనసలు ఏమీ చేయడం లేదా? నీకు నాన్నగారయితే నాకు మామగారు కాదా? నీతోపాటు వెళ్తున్నాను, నీతోపాటు వస్తున్నాను. వచ్చిన దగ్గరనుండి వెళ్ళేదాకా ఇంట్లో నేను చేయగలిగిన పని చేస్తున్నాను’’ రెచ్చిపోయింది హరిత.

‘‘ఇంట్లో పని పనిమనిషి చేస్తుంది. వంట మాత్రమే నువ్వు చేసేది. మొన్న మొన్నటిదాకా కర్రీ పాయింట్‌ నుండి కర్రీస్‌ నేను వచ్చేటప్పుడే తెచ్చేవాడిని. నాన్నగారు వచ్చిననాటి నుండే- బయట వంటలు ఆయన తినలేరని ఇంట్లో వండుకుంటున్నాం. అదీ నేను హెల్ప్‌ చేయకుండా అంతా నువ్వే చేస్తున్నావా? ఏదో పెద్ద చేస్తున్నాను చేస్తున్నాను అంటున్నావు, ఏంటి నువ్వు చేసేది’’ గఁయ్‌ మన్నాడు వినీల్‌.

‘‘రోజూ నువ్వు హెల్ప్‌ చేస్తున్నావా? తొందరగా వచ్చిన రోజు చేస్తావు. రానిరోజు ఎవరు చేస్తున్నారు? ఉదయం నుండి సాయంత్రం దాకా వర్క్‌ చేసి మళ్ళీ ఇంట్లో రెండు రకాల వంటలూ, మర్యాదలూ చేయాలంటే నేను మనిషినా, రోబోట్‌నా?’’
‘‘సరే, నిన్నెవడు కష్టపడమన్నాడు? నువ్వు జాబ్‌ మానెయ్యి. నా శాలరీ మనం లగ్జరీగా బతకడానికి చక్కగా సరిపోతుంది.

ఇంటిపట్టున ఉండి నాన్నగారిని చూసుకో. నాకు నచ్చినట్లుగా ఉండు, అదే పదివేలు’’ వినీల్‌ గట్టిగా అన్నాడు.

‘‘నేనెందుకు జాబ్‌ మానెయ్యాలి? నేను ఈ పొజిషన్‌ కొచ్చానంటే ఎంత కష్టపడి ఉంటాను? అదంతా బూడిదలో పోసిన పన్నీరవాలా? వంటలక్కలా మారి, నీకూ మీ నాన్నగారికీ సేవలు చేయాలా?’’ అంతకన్నా గట్టిగా అరిచింది హరిత.

‘‘నోర్ముయ్‌’’ అని ఏదో మాట్లాడబోతున్న వినీల్‌కి గుమ్మం పట్టుకొని తమవంకే చూస్తున్న తండ్రి కనిపించి ఆపేశాడు.

‘‘వినూ, నా గురించి గొడవపడుతున్నావా? నేను ఊరికి వెళ్ళిపోతాను’’ నీరసంగా అన్నారు విశ్వంగారు.

‘‘మీరు ఎవరికోసమూ ఎక్కడికీ వెళ్ళక్కరలేదు నాన్నా. నేను మిమ్మల్ని చూసుకోగలను. మీరు ఇవేమీ పట్టించుకోవద్దు. పదండి రెస్టు తీసుకుందురుగానీ’’ వినీల్‌ ఆయన చెయ్యి పట్టుకొని అన్నాడు.

‘‘మావయ్యగారూ, నాకు మీరంటే కోపమేమీ లేదు. నేను జాబ్‌ మానేసి ఇంట్లో ఉండలేను. నాకు చేతనయినంతలో మీకు చేసి పెడతాను. పనిమనిషికి ఇంకాస్త జీతం పెంచి ఇంట్లో ఉండమంటాను. అంతేకానీ ఆయన అలా మాట్లాడితే నాకు కష్టంగా ఉంటుంది’’ హరిత మామగారితో అంది.

‘‘ఆ అమ్మాయి చెప్పింది రైటే కదా వినూ. ఇంత చదువుకున్నది ఇంట్లో ఉండడానికా. నువ్వు లీవు పెట్టక్కరలేదు వెళ్ళిపో,

నేను చూసుకోగలను’’ మాట్లాడలేకపోతున్నారు విశ్వంగారు.

తను ఏం మాట్లాడినా తండ్రి మనసు నొచ్చుకుంటుందని వినీల్‌ మౌనంగా తల ఊపి తండ్రిని తీసుకెళ్ళి పడుకోబెట్టాడు.

విశ్వంగారి జ్వర తీవ్రత తగ్గుముఖం పట్టింది. వినీల్‌ ఆఫీసుకి వెళ్తున్నాడు.

వినీల్‌, హరితలిద్దరూ ఇల్లు చేరేసరికి రాత్రయిపోతుంది. వీళ్ళు వచ్చేసరికి విశ్వంగారే రైస్‌ కుక్కర్‌ పెడుతున్నారు. ఆయనకు చేతనయినట్లుగా వంట చేస్తున్నారు.

ఆయన తినేసి వీళ్ళకోసం ఎదురు చూస్తుంటారు.

అదంతా వినీల్‌కి కష్టంగా అనిపిస్తోంది. ఆయనకి కోడలు చేసి పెట్టాల్సిందిపోయి, ఆయనే ఎదురు తమకు పనులు చేస్తున్నారు.

‘‘మీరెందుకు చేస్తున్నారు మావయ్య గారూ... నేను వచ్చాక వంట చేస్తానుగా’’ అని మొదట్లో హరిత మామగారితో అంది.

‘‘మీరు రావడం ఆలస్యమవుతుంది కదమ్మా, నాకు పెందళాడే తినకపోతే అరగదు. అయినా ఇంట్లో ఉండి చేసేదేముంది. పై పనంతా పనమ్మాయే చేస్తుంది. నాకేం కష్టమవడం లేదు’’ అన్నారాయన.

అంతే! ఇక పట్టించుకోవడం మానేసింది హరిత.

హరిత ప్రవర్తన సహించలేని వినీల్‌ ఆమెపై చిరాకుని పెంచుకున్నాడు. ఇద్దరిలోనూ అవగాహనా లోపం ఏర్పడింది.

పరస్పరం వాదులాడుకోవడం, మాటామంతీ లేకుండా ఎడముఖం పెడముఖంలా దూరం దూరంగా పడుకోవడం ఎక్కువయింది. ముద్దూ ముచ్చట కరువయింది.

ఇదంతా గమనిస్తున్న విశ్వంగారు ఇద్దరికీ విడివిడిగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించాలని హితబోధ చేశారు.

‘‘ఊహుఁ... ఉద్యోగం మానడం, అతని మాటలకు తలవంచడం రెండూ నేను చేయను’’ అని తేల్చి చెప్పేసింది హరిత.

‘‘కుటుంబ బంధాలకన్నా ఉద్యోగం ఎక్కువనుకున్న ఈ అమ్మాయి నాకు వద్దు. బాధ్యతలు నిర్వర్తించడాన్ని తలవంచడం అనుకోవడం మూర్ఖత్వం. తను ఆ విషయం అర్థం చేసుకునే వరకూ నేను ఇలాగే ఉంటాను’’ అన్నాడు వినీల్‌.

‘‘పోనీ నేను మన ఇంటికి వెళ్ళిపోతాను. నావల్ల మీ మధ్య గొడవలు వద్దు’’ అన్నారు విశ్వంగారు.

‘‘మీరలా అంటే నేను చాలా బాధపడతాను నాన్నా. ఇలా అనుకుంటే అసలు పెళ్ళే చేసుకునేవాణ్ణి కాదు. సమస్యంతా దీనిలోనే ఉంది. అవసరమయితే దీన్నయినా వదిలేస్తాను కానీ, మిమ్మల్ని దూరం చేసుకోను’’ వినీల్‌ అన్నాడు.

‘‘మర్యాదగా మాట్లాడు. దాన్ని, దీన్ని అంటే ఎవరూ పడరు. నువ్వు వద్దంటే ఎవరూ పట్టుకొని వేలాడరు. నేను ఈ క్షణమే వెళ్ళిపోతాను’’ హరిత దూకుడుగా అంది.

‘‘వెళ్ళిపో. ఎవరూ బతిమాలేవారు లేరు’’ అంతకన్నా స్పీడుగా అన్నాడు వినీల్‌.

‘‘నువ్వు ఇల్లు కదిలావంటే చచ్చినంత ఒట్టే’’ అని విశ్వంగారు హరితను బలవంతంగా ఇల్లు కదలకుండా ఆపారు.

విషయం హరిత తల్లిదండ్రుల దాకా వెళ్ళింది. వాళ్ళు కూడా ఇద్దరికీ చాలా రకాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. విముఖత ధోరణి ప్రబలంగా పేరుకుపోవడంతో ఆ జంటకు హితబోధలు నచ్చలేదు.

అంతలో హరితకు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది. దగ్గరగా ఉండి పోట్లాడుకునే దానికన్నా దూరంగా ఉంటేనన్నా ఒకరిపై మరొకరికి ద్వేషం తగ్గి ప్రేమగా మారుతుందేమోననే ఆలోచన పెద్దవాళ్ళకు వచ్చింది.

వినీల్‌ అంగీకారంతో సంబంధం లేకుండానే హరిత విదేశాలకు వెళ్ళిపోయింది.

తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు పెద్దవాళ్ళ ఆలోచనలు తలకిందులయ్యాయి.

హరిత విదేశాలకు వెళ్ళాక ఇద్దరి మధ్యా గొడవలు మరింత పెరిగాయి. ఫోన్లో తిట్టుకునేవారు. వాట్సాప్‌ ద్వారా వాదులాడుకునేవారు. ఛాటింగ్‌లో దుమ్మెత్తి పోసుకునేవారు.

అలా ఒకరంటే మరొకరికి విముఖత పెరిగి పెరిగి విడాకులు తీసుకోవాలనుకునే దాకా వచ్చింది. ఇద్దరూ వారి వారి పెద్దలకు అదే చెప్పారు. వారి అంగీకారంతో నిమిత్తం లేకుండా తమ నిర్ణయాన్ని ప్రకటించారు.

హరిత విదేశాల నుండి తిరిగి వచ్చాక విడాకులకు అప్లై చేసుకుంటానని చెప్పేసింది.

నాదీ అదే నిర్ణయం అని వినీల్‌ కూడా తీర్మానించాడు.

అన్నట్టుగానే హరిత తిరిగి వచ్చాక కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ వేసింది. విడాకులు వచ్చాయి. ఎవరి జీవితాలు వారివిగా విడిపోయారు.

ఇద్దరికీ కొంతకాలం చాలా హాయిగా అనిపించింది. ఇష్టం వచ్చినంతసేపు వర్క్‌ చేసుకోవచ్చు. బయట తిరగవచ్చు. సరదాగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేయవచ్చు. బాధ్యతల బరువు లేకపోవడంతో రిలీఫ్‌గా అనిపించింది.

రెండు నెలలయ్యేసరికి ఏదో వెలితి మొదలయింది. మనకోసం ఎదురుచూసేవారు లేరు. ‘నీ జీవితం నాది’ అని తోడు పంచుకునే వ్యక్తి లేని లోటు తెలియసాగింది.

ఇప్పుడు ఇద్దరిలో ఒకే ఆలోచన- మళ్ళీ ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు అని.

ఆలస్యమెందుకు... వేట మొదలు పెట్టారు. మాట్రిమోనిలో గాలింపు.

పరిచయస్తులూ బంధువులూ స్నేహితులలో ఎవరు తమకు సరిజోడు అని వెతకడం మొదలుపెట్టారు.

ఆ వెతుకులాటలో ఇద్దరికీ తమకు తెలియని నిజాలు బయటపడసాగాయి. అప్పటివరకూ తాము ఎదుటి వ్యక్తిలో నచ్చనివి మాత్రమే చూసి ద్వేషాన్ని పెంచుకున్నామనీ, దుర్గుణాలను తవ్వడం వల్ల సద్గుణాలను మరచిపోయామనీ అర్థమైంది.
హరితకు ఎవరిని చూసినా వాళ్ళకన్నా వినీల్‌లోనే పాజిటివ్‌ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘అనవసరంగా తొందరపడ్డాను’ అనే భావం తొలవసాగింది. పెళ్ళి అంటేనే ‘ఒకరికోసం మరొకరు సర్దుకుపోవడం’ అని అర్థమయింది.

మామగారి కోసం ఉద్యోగం మానెయ్యమంటే తలవంచడం అనుకుందే తప్ప బాధ్యతగా భావించలేదు. ప్రత్యామ్నాయంగా అందుకు అనుకూలమైన మరోపని వెతుక్కోవడం చేయలేదు- అని పదే పదే మనసులో మథనపడసాగింది.

వినీల్‌కి కూడా తను ప్రవర్తించిన తీరు తనకే చిరాకు కలిగించసాగింది. జీవిత భాగస్వామి ఆలోచనలను గౌరవించి సరైన నిర్ణయం తీసుకోవలసిందని బాధపడ్డాడు. ఆమెలోని తెలివితేటలను అర్థం చేసుకోకుండా, వంటింటికి పరిమితం చేయాలనుకున్నాడే కానీ కుటుంబ బంధాలను సమపాళ్ళలో మోయడంలో కాస్త వివేకం చూపించి ఉండాల్సిందని తెలుసుకున్నాడు.

వినీల్‌ ఫోన్‌ నుండి హరిత ఇన్‌బాక్స్‌లోకి ఒక మెసేజ్‌ వెళ్ళింది...

‘నేను వర్క్‌ లోడ్‌ తగ్గించుకుంటున్నాను. టూర్లు క్యాన్సిల్‌ చేసుకున్నాను. ఇంటి దగ్గర ఉండే సమయం పెంచుకుంటున్నాను. నీకిష్టమేనా హరీ?’

అప్పటికే వినీల్‌కి మెసేజ్‌ టైప్‌ చేయబోతున్న హరిత ముఖం ప్రసన్నమయింది.

‘ఇష్టమే. నేను కూడా వేరే జాబ్‌ చూసుకుంటున్నాను. మావయ్యగారిని కనిపెట్టుకుని ఉండే సమయం ఉండేలా... నీకేమీ అభ్యంతరం లేదు కదూ.’

హరిత రిప్లై గాలిలో అలా అలా తేలుతూ వినీల్‌ ఫోను చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..