ఆకాశానికో నక్షత్రం

‘‘ఏమిటే వసుధా సంగతులు?’’ సంగీత ఫోన్‌లో అడుగుతోంది. ‘‘ఏముంటాయే సంగతులు, బోరు కొడుతోంది జీవితం. పిల్లలు, పని...

Updated : 08 May 2022 03:20 IST

ఆకాశానికో నక్షత్రం

- పద్మావతి రాంభక్త

‘‘ఏమిటే వసుధా సంగతులు?’’ సంగీత ఫోన్‌లో అడుగుతోంది.

‘‘ఏముంటాయే సంగతులు, బోరు కొడుతోంది జీవితం. పిల్లలు, పని...

అంతా రొటీన్‌. విసుగ్గా ఉంది’’ అన్నాను.

‘‘అవునే, నీకేం... హాయిగా సంపాదించే మొగుడు, మంచి అత్తగారు. అన్నీ ఉన్నా నీకు జీవితం పాపం విసుగ్గానే ఉంటుందిలే’’ అంది.

‘‘నువ్వలాగే అంటావు ఎప్పుడూ. ఇల్లు ఒక జైలులాగా ఉంటోందే, అసలు స్వేచ్ఛ లేదు. అప్పుడప్పుడు... కాదు కాదు... ఎప్పుడైనా ఒక్క పిసరు ఆలస్యంగా నిద్ర లేస్తే చాలు, మా అత్తగారు ముఖం అదోలా పెడతారు. పిల్లలకు రెండు రోజులు సెలవులు కదా అని కాస్త ఆలస్యంగా లేవడమూ తప్పేనా?’’ అన్నాను.

‘‘నేను మీ ఇంటికి వచ్చినపుడు చూశాను కదా. నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం. కానీ ఆ విషయం కూడా నువ్వు గుర్తించవు. ఆ మాత్రమైనా ఆవిడ తన అభిప్రాయం వ్యక్తం చెయ్యకూడదా చెప్పు. అయినా ఆవిడ నోరు తెరచి ఏమీ అనదుగా, నువ్వే ఆవిడ ముఖం చూసి ఊహించుకున్నావా ఏం? ఒకవేళ మీ అమ్మే అయినా ఎప్పుడైనా కోప్పడి, బుద్ధి చెప్పదూ’’ అంది సంగీత అదోలా.

‘‘కాదు, నాకు తెలుసు. ఆవిడకు కొన్ని పద్ధతులు నచ్చవు. ఉదయం స్నానం చెయ్యకుండా ఏదైనా తింటే ఆవిడకు ఇష్టముండదు తెలుసా. నచ్చని పని చేస్తే ఆవిడ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. అమ్మ అయితే నేనేం చేసినా ఏమీ అనదు’’ అన్నాను విసుగ్గా.
‘‘పాపం, పాతకాలం వాళ్ళకి కొన్ని నచ్చవు. కానీ మనం కూడా ఆ నచ్చనివేవో చెయ్యకుండా ఉంటే సరిపోతుందిగా. వాళ్ళను బాధపెట్టే బదులు వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఏమవుతుంది. కొందరు ఎంత గోల చేస్తారో నీకు తెలీదు.

మీ అత్తగారు చాలా సర్దుకుపోయే మనిషి. అయినా ఆవిడ పాతకాలం వాళ్ళలా తను చెప్పినట్టే ఉండాలన్న మొండిమనిషి కూడా కాదు. తక్కువగా మాట్లాడతారు, ఆవిడ మాటలు కూడా మృదువుగా ఉంటాయి. నేను చూశాను కనుకే ఇంతలా చెప్తున్నాను’’ అంది.

‘‘ఏమిటివాళ ఆవిడ తరఫున వకాల్తా పుచ్చుకున్నావు?’’ అన్నాను కినుకగా.

‘‘నేనేం వకాల్తా తీసుకోలేదు. నువ్వు బయట ప్రపంచం చూడక నీకే కష్టాలున్నట్టు ఊహించుకుంటున్నావు’’ అంది.

‘‘సరేలే, ఇంకేంటి విషయాలు, విశేషాలు చెప్పు. నేను మాత్రం పిల్లలు, మొగుడు, అత్తగారు ఈ ఝంజాటం వదలి కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి, అమ్మ వండి పెడుతుంటే తిని, నాన్న దగ్గర గారాలు పోయి హాయిగా రెస్ట్‌ తీసుకుని వద్దామనుకుంటున్నాను’’ అన్నాను.
ఉన్నట్టుండి సంగీత సైలెంట్‌ అయిపోయి మళ్ళీ ఫోన్‌ చేస్తానని పెట్టేసింది.

****

సంగీతా, నేనూ స్కూల్‌ చదువుల నుండీ స్నేహితులం. నేను కొంచెం మంకుపట్టు, పెంకితనం ఉన్నదాన్ని అయితే- అది ఆలోచనాపరురాలే కాక బహు నెమ్మదస్తురాలు. అందుకే నాతో సర్దుకుపోతూ స్నేహం కొనసాగించింది. నాకు అన్నీ తెలుసు కానీ గబగబా మాట విసిరేస్తాను. కానీ తరవాత ఒక్కోసారి బాధపడతాను. ‘అంత మాట, దురుసు పనికిరాదు వసుధా, అవతలవారు బాధపడతారు. మనం తరవాత తెలుసుకుని ఒక ‘సారీ’ చెప్పేసినా, మాట అలా వాళ్ళ మనసులో ఉండిపోతుంది’ అంటూ సంగీత నాకు చెప్తూ ఉంటుంది. కానీ నాకు పుట్టింట్లో బాగా గారం ఎక్కువ. అమ్మానాన్నా నన్ను బాగా ముద్దుగా చూసుకునేవారు. వాళ్ళ ముద్దు వల్లే నేను ఇలా తయారయ్యానని సంగీత నన్ను దెప్పిపొడుస్తూ ఉంటుంది. అమ్మానాన్నలతో కాస్త మృదువుగా మెలగమని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నేను ఏ సమయంలో ఏది అడిగినా అమ్మ ఓపికగా నాకు చేసి పెడుతుంది. నాన్న కూడా నాకు కొండ మీద కోతి కావాలన్నా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తారు. నేను కూడా వాళ్ళ దగ్గర బాగా గారాలుపోతూ ఉంటాను. గారం తీర్చేవారుంటే ఎవరు మాత్రం గారాలు పోరు. ఇంకా చెప్పాలంటే- నా పిల్లలకు నేను అంతలా చెయ్యను. పేచీ పెడితే విసుక్కుంటాను కూడా. నాకు అలా ఎప్పుడుపడితే అప్పుడు ఏదిపడితే అది అడిగితే చెయ్యడం విసుగూ చిరాకే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే- బద్ధకం. మా ఆయన ‘నువ్వు మీ అమ్మానాన్నలకు ఎలాగో - నీ పిల్లలు నీకు అలాగే’ అంటూ ఉంటారు.

‘నాకు మాత్రం పిల్లలంటే ఇష్టం ఉండదా ఏమిటి... కానీ అస్తమానూ ఎలా చేసి పెట్టమంటారు’ అంటూ విసుక్కుంటాను. అప్పుడప్పుడూ నేను ఏ వడియాలో వేయించనంటే వాళ్ళ నాయనమ్మను వేయించి పెట్టమంటారు. అప్పుడు నావైపు అదోలా చూసి ఆవిడ వేయించి పెడతారు.

****

రెండు రోజుల తరవాత సంగీత మళ్ళీ ఫోన్‌ చేసింది.
‘‘ఏమిటి, ఆ రోజు ఉన్నట్టుండి ఫోన్‌ పెట్టేశావు’’ అని అడిగాను.
‘‘ఏమీ లేదు. ఎందుకో ఉన్నట్టుండి మూడ్‌ ఆఫ్‌ అయింది’’ అంది.
‘‘అవునా, మాటల మధ్యన నేను పొరపాటుగా నిన్ను ఏమైనా అన్నానా’’ అడిగాను.
‘‘లేదు లేదు, నాకే ఒక విషయం గుర్తుకువచ్చి మనసు పాడైంది’’ అంది.
‘‘అవునా, ఏమిటది చెప్పు...
నాకు తెలియని విషయం ఏముంది?’’ అన్నాను.
‘‘జరిగిన విషయం నీకు చెపుదామనే ఆ రోజు ఫోన్‌ చేశాను. ఫోన్‌ చేసిన వెంటనే ఆ మాట ఎత్తడమెందుకని కాసేపు మాట్లాడాక చెప్పాలని అనుకున్నాను. ఈలోగా నా మూడ్‌ మారిపోయి పెట్టేశాను’’ అంది.
‘‘నా మాటలు విన్నాక నీకు ఏదైనా గుర్తుకువచ్చిందా?’’ అన్నాను.

‘‘అవును, నువ్వు మీ అమ్మానాన్నల దగ్గరకు వెళ్ళి రెస్ట్‌ తీసుకుంటానన్నావు కదా. అది వినగానే నాకు మా నాన్న గుర్తుకువచ్చి ఏడుపు తన్నుకొచ్చింది. అందుకే ఫోన్‌ పెట్టేశాను’’ అంది.
‘‘అవునా, ఏం మీ నాన్నగారికి వంట్లో బాగా లేదా?’’ అన్నాను ఆత్రుతగా.
అటువైపు సంగీత నిశ్శబ్దమై పోయింది.
‘‘సంగీతా, ఏమైంది చెప్పు?’’ అన్నాను లాలనగా.

కాసేపు చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. ఆ తరువాత ‘‘వసుధా, నాన్న నాకు ఇక లేరే’’ అంది రుద్ధకంఠంతో.
ఆ తరువాత మళ్ళీ తనే ‘‘నీకు తెలీదు కదా... అమ్మానాన్నా నన్ను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని అడిగారో... కానీ నేను పనులంటూ తీరికలేదంటూ వెళ్ళలేదు’’ అంటూ మళ్ళీ ముక్కు ఎగపీల్చింది.
‘‘ఇదంతా ఎప్పుడు జరిగింది?’’ అడిగాను.

‘‘ఈ మధ్యనే, ఒకసారి నేను వెడతానని అడిగితే మా ఆయన పంపలేదు. మరొకసారి నాకు కుదరలేదు. అలా నాన్న ఎన్నోసార్లు చూడాలని ఉంది రమ్మంటూ అడుగుతూనే ఉన్నారు. నేనే నిర్లక్ష్యం చేశాననిపిస్తోంది’’ అంది బాధగా.
‘‘ఊరుకో సంగీతా, బాధపడకు’’ అన్నాను ఓదార్పుగా.

‘‘అలా కాదు. చివరకు నేను తీరిక చేసుకుని బయలుదేరి, వస్తున్నానని నాన్నకి ఫోన్‌ చేసి చెప్పాను. నాన్న నన్ను రిసీవ్‌ చేసుకోవడానికి రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. కానీ...’’ అంటూ మళ్ళీ భోరుమంది.
‘‘అయ్యో ఏమైంది’’ అన్నాను.

నాకు కూడా దాని ఏడుపు చూసి ఏడుపొస్తోంది. వాళ్ళ నాన్నగారు నాకు కూడా బాగానే పరిచయం. నలుగురికీ బాగా సహాయపడే మనిషిగా మంచి పేరుంది. నన్ను చూడగానే చక్కగా ప్రేమగా పలకరించేవారు.

‘‘నేను రైలు దిగేసరికి ప్లాట్‌ఫాం మీద గోలగా ఉంది. జనం అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఒకచోట గుమిగూడుతున్నారు. నేను నాన్న కోసం అంతా పరికిస్తూ ‘ఏమిటా’ అనే ఉత్సుకతతో జనం చూస్తున్న వైపు వెళ్ళాను. అక్కడ నాన్న ప్లాట్‌ఫాం మీద పడి ఉన్నారు. నాకు ఒక్క క్షణం ఏమీ అర్థంకాలేదు. అందరూ గుమిగూడి చూస్తున్నది నాన్ననా అని నేను శిలాప్రతిమనై అలా ఉండిపోయాను. రెండు నిముషాలకు స్పృహలోకి వచ్చి, నాకు తెలిసిన హాస్పిటల్‌ నంబర్‌కు హడావిడిగా ఫోన్‌ చేసి ఆంబులెన్స్‌ని పిలిచాను. కానీ హాస్పిటల్‌కు వెళ్ళాక తెలిసింది, నాన్నకు ఎప్పుడో ప్రాణం పోయిందని. నాకు చివరిచూపు కూడా దక్కలేదు. అన్నిటికన్నా ఎక్కడ దుఃఖం వస్తోందంటే- నన్ను చూడాలనే నాన్న చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. పాపిష్టిదాన్ని, ఒక్క వారం ముందు బయలుదేరినా నాన్నతో కొన్ని రోజులు గడిపిన తృప్తి అయినా ఉండేది నాకు. వసుధా, అమ్మానాన్నలను పోగొట్టుకున్నాకేనే వాళ్ళ విలువ అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనం చిన్నపిల్లలం. వాళ్ళు పోయాక మనం పెద్దవాళ్ళం. మనల్ని పిల్లలుగా వాళ్ళ తరవాత ఎవరు చూస్తారు, ఎవరు లాలిస్తారు చెప్పు’’ అంది.

‘‘అంత హఠాత్తుగా అలా ఎలా జరిగింది. చాలా షాకింగ్‌గా ఉంది’’ అన్నాను.

‘‘నాన్నకి అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వచ్చేదిట. కానీ ఏదో అరగక అలా పట్టేస్తోందని ‘ఈనో’ తాగడమో లేదా మెడికల్‌ షాపులో మాత్ర అడిగి తెచ్చి వేసుకోవడమో చేసేవారని నాన్న స్నేహితులు చెప్తే తెలిసింది. అక్కడకీ వాళ్ళు డాక్టర్‌కి చూపించుకోమని పోరు పెట్టేవారట. ఈయనేమో ‘నాకేమీ లేదు, నేను బాగానే ఉన్నాను. నా కూతుర్ని చూడాలనే బెంగ తప్ప నాకు ఏ రోగమూ లేదు’ అనేవారట. నేను వస్తున్నానని తెలిసి పళ్ళూ స్వీట్లూ అన్నీ కొనుక్కొచ్చి ఇల్లంతా నింపేశారట. అందరికీ ఫోన్లు చేసి
నా కూతురు చాలా కాలానికి వస్తోందని చెప్పారట. తెగ సంబరపడుతూ నన్ను రిసీవ్‌ చేసుకుని ఇంటికి తీసుకెడదామని వచ్చారు పాపం. ఇంతలోనే నేను రైలు దిగకమునుపే హార్ట్‌ ఎటాక్‌ వచ్చి నిలుచున్న మనిషి నిలుచున్నట్టే కుప్పకూలిపోయారని, అక్కడ ఉండి చూసిన వారు చెప్పారు. నేను ఎంత దురదృష్టవంతురాలినో చూడు’’ అంది.

‘‘విన్న నాకే ఇంత బాధగా ఉంది.
ఇక నీకు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను’’ అన్నాను.
‘‘వసుధా, ఒక మాట చెప్తాను వింటావా?’’ అంది.
‘‘చెప్పు’’ అన్నాను.

‘‘మనకి వయసు పెరుగుతున్నపుడు, మనల్ని కన్నవాళ్ళకి కూడా వయసు పెరుగుతోందని మనం గుర్తించాలి. పసివాళ్ళమైన మనల్ని కష్టపడి, వాళ్ళ సుఖాలను వదులుకుని మరీ పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నల్ని మనం జాగ్రత్తగా మనకు వీలైనంతలో చూసుకోవాలి.

‘రెండవ బాల్యం’ అంటారు చూడు... ఆ దశ వాళ్ళది. వాళ్ళ చిన్న చిన్న కోరికలు మనం తీర్చాలి కదా, ఏమంటావు? వాళ్ళు పాపం ఏదీ నోరు తెరచి అడగరు. మనమే తెలుసుకుని చెయ్యాలి’’ అంది.

తను విడమరచి చెప్పకపోయినా సంగీత చెప్పింది నాకు బాగా అర్థమైంది. నాలో ఒక అంతర్మథనం మొదలైంది. ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్ళినా అన్నీ మంచం దగ్గరకు రప్పించుకుంటూ గారాలు పోతాను. అమ్మ అడిగడిగి మరీ నాకు కావలసినవన్నీ వండి పెడుతుంది. నేను కూడా ‘నాకు అది తినాలనుంది, ఇది తినాలనుంది’ అని చేయించుకుని తింటాను. నాన్న బయట నుండి నాకు ఇష్టమైన స్వీట్లూ అవీ తెస్తారు. నేను ఏది అడిగితే అది ఎంత మండుటెండలో అయినా వెళ్ళి తెస్తారు. అమ్మైతే నాకు నచ్చినవన్నీ చెయ్యడానికి వంటింట్లోనే మగ్గిపోతుంది. విశ్రాంతి ఎరుగని పనిచక్రమై తిరుగుతూనే ఉంటుంది. మధ్యమధ్యలో ‘కూరలో ఉప్పు తగినంత పడలేదనో, మరొకదాంట్లో కాస్త కారం ఎక్కువైందనో’ వంకలు పెడితే, ‘నాకు నచ్చినట్టు చెయ్యలేకపోయానే’ అని గిలగిల్లాడిపోయేది తప్ప ఏనాడూ విసుక్కోలేదు.

‘నేను మాత్రం నా పిల్లల్ని తెగ విసుక్కుంటాను. మరి అమ్మావాళ్ళు అలా విసుక్కోరెందుకు నన్ను...

నేను బాధపడతాననే కదా! అంత సహనమూ అంత ఓపికా ఆ వయసులో వాళ్ళకెక్కడిది? వాళ్ళకీ శక్తి తగ్గుతూ వస్తోంది కదా. నేను ఎన్నాళ్ళుగా వెడుతున్నాను వాళ్ళ దగ్గరకి... వాళ్ళు సేవలు చేస్తూనే ఉన్నారు, నేను దర్జాగా ఆ సేవలు నా హక్కుగా అనుకుంటూ అనుభవిస్తూనే ఉన్నాను. ఈ విషయం ఇన్నాళ్ళూ నాకెందుకు తట్టలేదు. నేను మారాలి. వాళ్ళకి నేను కూడా ఏదైనా చేస్తూ ఉండాలి. ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు? ఇప్పటికే వయసు మీదపడి ఉన్నారు. వాళ్ళున్నన్ని రోజులూ అపురూపంగా చూసుకోవాలి. ఆనందంగా ఉంచాలి’ నా మనసులో ఇదంతా ఆలోచించుకున్నాక నాకు కర్తవ్యం బోధపడింది.

గబగబా ఫోన్‌ తీసి డయల్‌ చేశాను.

‘‘చెప్పరా తల్లీ, ఏంటి సంగతులు? నువ్వు బావున్నావు కదమ్మా?’’ అడిగారు నాన్న.

‘‘నేను బావున్నాను కానీ, అమ్మ ఫోన్‌ తియ్యలేదేమిటీ, రెండు మూడుసార్లు చేశాను. ఇక ఇదిగో నీకు చేశాను నాన్నా. మీరిద్దరూ ఎలా ఉన్నారు?’’ అడిగాను.

‘‘మేము బావున్నాం. అమ్మా నేనూ బయటకు వచ్చాం. అమ్మ సంచీ ఆ పక్కన పెట్టి వెళ్ళింది. ఫోన్‌ అందులో ఉండిపోయి నట్టుంది’’ అన్నారు.
‘‘ఎక్కడకు వెళ్ళారు నాన్నా’’ అడిగాను.

‘‘అబ్బే, ఎక్కడికీ లేదమ్మా. అమ్మకి ఒంట్లో కాస్త నలతగా ఉంటేనూ...
డాక్టర్‌ దగ్గరకి తీసుకొచ్చాను. నువ్వేమీ కంగారుపడకు. అంతా బాగానే ఉంది’’ అంటూ నవ్వారు.
‘‘అలాగే నాన్నా, జాగ్రత్త. నేను వద్దామనుకుంటున్నాను, అందుకే ఫోన్‌ చేశాను’’ అన్నాను.
‘‘అవునా, అంతకన్నానా... నీకు నచ్చిన వన్నీ అమ్మని చేసి పెట్టమని చెప్తాను. నేను... ఇదిగో... ఇంటికి వెళ్ళే దారిలో నీకిష్టమైన స్వీట్లూ అవీ కొంటానులే’’ అన్నారు నాన్న తెగ సంబరపడిపోతూ.

‘‘వద్దు నాన్నా, నువ్వేమీ కొనకు. అంత హడావిడి పడకండి. అమ్మని కూడా కంగారుపెట్టకు, అసలే వంట్లో బాగా లేదు కదా’’ అంటూ కాసేపు జాగ్రత్తలు చెప్పి ఫోన్‌ పెట్టేశాను.
నేను మరునాడు సామాన్లన్నీ సిద్ధం చేసుకుని పుట్టింటికి బయలుదేరాను. అత్తగారు ఎప్పట్లాగే పిల్లల్ని చూస్తానన్నారు కనుక వాళ్ళని ఆవిడ దగ్గర వదలి బయలుదేరాను.

‘‘వెళ్ళొస్తాను అత్తయ్యగారూ’’ అంటూ మృదువుగా ఆవిడకి చెప్పి మరీ బయలుదేరుతుంటే ఆవిడ నా ముఖంవైపు వింతగా చూశారు.
బహుశా అంత నెమ్మదిగా నేను ఆవిడతో మాట్లాడటం ఇదే మొదటిసారేమో.
అమ్మ దగ్గరకు వెళ్ళాక, టెస్ట్‌ రిపోర్టులు అన్నీ అడిగి చూసి ఏమీ ఫరవాలేదని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నాను.

‘‘నేను చెప్పలా ఏమీ లేదని, ఊరికే నీరసంగా ఉంది అంటే వినలేదు నాన్న. బలవంతంగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. ఖర్చు దండుగ. ఆ డబ్బులుంటే పిల్లకు ఏమైనా కొనడానికి పనికొచ్చేవి కదా’’ అంటూ మాట్లాడేస్తోంది అమ్మ.
నాన్న చిరునవ్వుతో వింటున్నారు.

అమ్మ వంటింట్లోకీ నాన్న వీధిలోకీ కదులుతుంటే ‘‘మీరు నాకు ఏమీ చెయ్యడానికి వీల్లేదు. ఈసారి నేనే మీకు అన్నీ చేసి పెడతాను’’ అన్నాను.

‘‘అదేమిటి వసూ, పాపం నువ్వు రెస్ట్‌ తీసుకో...’’ అంటూ ఇద్దరూ ఏదో అనబోతుంటే ఆపేసి, ‘‘లేదు, నేను చెప్పినట్టు వినాల్సిందే’’ అన్నాను గట్టిగా. వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని, నా ముఖం వైపు వింతగా చూశారు.

నేను వంటింట్లోకి జొరబడి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కమ్మగా వండిపెట్టాను. మా ఇంటి దగ్గరున్న షాపులోంచి నేను కొని తెచ్చిన స్పెషల్‌ స్వీట్లూ అవీ చూసి నాన్న తెగ సంబరపడిపోయారు.

పోనీ కూరలైనా తరిగి ఇస్తానని అమ్మ ఒకటే గొడవ, నాన్న బయటకు వెళ్ళి ఏదైనా తెస్తానని ఒకటే మారాం. కానీ నేను వింటేగా. వాళ్ళని కూర్చున్న చోటు నుండి కదలనివ్వకుండా అన్నీ అందించాను. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నాకు వాళ్ళు చేసినప్పటికన్నా వెయ్యిరెట్లు ఆనందంగా, తృప్తిగా అనిపించింది. ఇక ఎప్పటికప్పుడు నా వీలు చూసుకుని వస్తూ పోతూ వాళ్ళని భద్రంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. వీళ్ళనేనా, మా అత్తగారితో కూడా నా ప్రవర్తన మార్చుకుని ఆవిడతోనూ ప్రేమగా మెలగాలని నిశ్చయించుకున్నాను.

సంగీతకి ఫోన్‌ చేసి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి అసలు. కానీ పాపం వాళ్ళ నాన్నకి సంబంధించిన విషాదం గుర్తొస్తే మాత్రం నా మనసంతా చేదుగా అయిపోతోంది. కానీ సకాలంలో సంగీత నా కళ్ళు తెరిపించడం వల్లనే నన్ను కన్నవాళ్ళకి నేను ఏదో చెయ్యగలుగుతున్నాను.

వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది కానీ నాకు ఇన్నాళ్ళకు కాస్తయినా దాన్ని తీర్చుకోవాలన్న జ్ఞానం కలిగింది కదా, అదే నాకు సంతోషం.

‘చీకటి వెలుగుల గమనాలనూ తుఫానులనూ ఇంకా ఎన్నిటినో అనుభవించి అలసిపోయిన ఆకాశమంటి అమ్మానాన్నలకు ఒక చిన్న నక్షత్రాన్ని బహూకరిస్తే ఎంత ఆనందం...

ఆ ముఖాల్లో ఎంత వెన్నెల..!’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..