పరుగు

అది జనవరి నెల... చివరి శనివారపు ఉదయం పదకొండు గంటలు... మాదాపూర్‌లోని ఒక ‘మాల్‌’...పోర్టికోలో కారు దిగి ‘‘గంట తర్వాత ఫోన్‌ చేస్తాను, వచ్చి బ్యాగ్స్‌ తీసుకెళ్ళు’’

Published : 15 May 2022 01:02 IST

పరుగు

- వరుణ్‌ పారుపల్లి

అది జనవరి నెల... చివరి శనివారపు ఉదయం పదకొండు గంటలు... మాదాపూర్‌లోని ఒక ‘మాల్‌’...

పోర్టికోలో కారు దిగి ‘‘గంట తర్వాత ఫోన్‌ చేస్తాను, వచ్చి బ్యాగ్స్‌ తీసుకెళ్ళు’’

అని డ్రైవరుతో చెప్పి పర్సు తీసుకుని లోపలికి నడిచాను.

అప్పుడప్పుడే జనసంచారం మొదలవుతోంది. ఇంకా కొన్ని దుకాణాలు తెరవలేదు కూడా. మామూలుగా అయితే నాకు ఇలా ‘మాల్స్‌’ చుట్టూ తిరగడం అస్సలు ఇష్టముండదు. ఏదైనా ‘బ్రాండ్‌ స్టోర్‌’కు వెళ్ళి కావాల్సింది కొనుక్కొని వచ్చేస్తా. కానీ, ఆఖరి నిమిషంలో వచ్చి పడ్డ అమెరికా ట్రిప్‌ వల్ల ఇప్పుడు షాపింగ్‌ చేయక తప్పడం లేదు. రేపు రాత్రికే నా ఫ్లైట్‌. సరిగ్గా గంటసేపట్లో నాకు కావలసిన బట్టలు కొనడం పూర్తయింది. వాటిని తీసుకుని ఫుడ్‌ కోర్టులో కూర్చుని ఒక కాఫీ ఆర్డర్‌ ఇచ్చాను.
‘కాఫీ రాగానే డ్రైవరుకు ఫోన్‌ చేస్తా.

కాఫీ అయ్యేలోపు వచ్చి బ్యాగ్స్‌ తీసుకెళ్తాడు’ అనుకుంటూ, అటూ ఇటూ చూస్తుండగా నాకు రెండు టేబుల్స్‌ అవతల కూర్చున్న ఒకామె మీద నా దృష్టి పడింది. ఆమెని ఎక్కడో చూసినట్టుంది... ఎక్కడ చూశాను..? నేను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలోనా... కాదు, బహుశా అంతకంటే ముందు..? కొంపదీసి ‘మైథిలి’ కాదు కదా!

మైథిలి గుర్తుకు రాగానే ఏదో అలజడి. ఇద్దరం వరంగల్‌లో పీజీ కలిసి చదువుకున్నాం. నేను హన్మకొండలో పుట్టి పెరిగాను. తను ఏదో పల్లెటూరి నుండి వచ్చింది. మా డాడీ బ్యాంక్‌ మేనేజర్‌. వాళ్ళ నాన్న ఒక సాధారణ రైతు.

పీజీలో చేరిన కొత్తలో దానికి సరిగ్గా ఇంగ్లిషు మాట్లాడటం కూడా వచ్చేది కాదు. కానీ, మొదటి సంవత్సరం అయ్యేసరికి గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారినట్లు- ఇంగ్లిషు భాషలో, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో ఆరితేరిపోయింది.

మూడో సెమిస్టర్లో తను మా యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. చూస్తూండగానే కాలేజీలో అదొక స్టార్‌లాగా ఎదిగిపోయింది.

నాలుగో సెమిస్టర్లో తనని అధిగమించడానికి నేను సెమిస్టర్‌ మొదటి రోజు నుండే చదవడం మొదలుపెట్టాను. లెక్చరర్లు దానికి ‘పేపర్‌ లీక్‌ చేస్తున్నారేమో’ అన్న అనుమానంతో పరీక్షలప్పుడు వాళ్ళ హాస్టల్‌కు వెళ్ళి చదివేదాన్ని. కానీ, నేను అనుమానించినట్లు ఏదీ జరగలేదు. మైథిలి తను చదువుకోవడమేకాక తోటివారి సందేహాలు కూడా తీర్చేది. ఎంత పోటీపడి చదివినా, చివరకు పరీక్షల్లో నాకు దానికంటే రెండు మార్కులు తక్కువే వచ్చేవి. ‘చదివినట్టే కనపడవు, ఇలా ప్రతీసారి నువ్వే టాపర్‌గా ఎలా వస్తున్నావే?’ అన్న నా ప్రశ్నకు తన నవ్వే సమాధానమైంది. ఆ నవ్వు చూస్తే నాకు పుండు మీద కారం పూసినట్లనిపించేది.

‘టౌనులో, ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన నన్ను, కేవలం ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన పల్లెటూరి మొద్దు దాటేయడం ఏంటి?’ అని నాకు చాలా అసహనంగా ఉండేది.

మా పీజీ పూర్తయింది. మాలో చాలామందికి క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు వచ్చాయి. నాకూ మైథిలికీ ఒకే రోజు ఉద్యోగం వచ్చింది- కాకపోతే, వేరే వేరే సంస్థల్లో. ఆ తరవాత- ఇదే దాన్ని చూడడం.

‘అసలు అక్కడ కూర్చున్నది నిజంగా మైథిలీయేనా? పిలిచి చూద్దాం... తనే అయితే పలుకుతుంది కదా’ అనుకుంటూ, ‘‘మైథిలీ...’’ అన్నాను. ఆ పిలుపు విని ఆమె తల తిప్పి నావైపు చూసింది.

‘‘మీరు... మైథిలీనా? వరంగల్‌ కేయూలో పీజీ చేశారా?’’ అని అడిగాను.

దానికి ఆమె ‘‘అవును... మీరు..? సారీ, ఎక్కడో చూసినట్లుంది, కానీ గుర్తు రావడం లేదు. ఏం అనుకోకండి’’ అంది.

‘‘నేను, గౌతమిని, నువ్వు ఎంసీఏలో నా క్లాస్‌మేట్‌వి.’’

నా సమాధానం వినగానే ఠక్కున లేచి, నా టేబుల్‌ దగ్గరకు కుర్చీ లాక్కుని, ‘‘గౌతమీ, నువ్వా..? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. పీజీ తర్వాత మనం కలవలేదు కదా- ఎక్కడ ఉంటున్నావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడేంటి?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మైథిలి.

‘‘ఇక్కడే, జూబ్లీహిల్స్‌... రోడ్‌ నెంబర్‌ 74. మొన్ననే 5-బెడ్‌రూమ్‌ విల్లా కొన్నాం. నేను గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలో డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తున్నా. నాకింద నూటయాభై మంది పని చేస్తారు. ఇక మావారు, సొంతంగా కంపెనీ పెట్టారు. ఏడాదికి వందకోట్ల టర్నోవర్‌. రేపు సాయంత్రం యూఎస్‌ వెళ్తున్నాను. దాని కోసమే షాపింగ్‌ చేయడానికి వచ్చాను. ఇక ఫ్యామిలీ విషయానికొస్తే, ఇద్దరు పిల్లలు. బాబు సెవెన్త్‌ చదువుతున్నాడు, పాప నైన్త్‌. ఇద్దరూ సౌతిండియాలోనే బెస్ట్‌ బోర్డింగ్‌ స్కూల్స్‌లో చదువుతున్నారు. చేతి నిండా డబ్బు, ఉద్యోగంలో సక్సెస్‌, ఏ బాదరబందీ లేని జీవితం... ఇంతకంటే ఏం కావాలి చెప్పు?’’ అని తన స్పందన కోసం తన మొహంలోకి చూశా.

తను నిజంగానే సంతోషిస్తున్నట్లు ‘‘సూపర్‌... ఐ యామ్‌ హ్యాపీ ఫర్‌ యు’’ అంది.

ఇంతలో కాఫీ వచ్చింది. ఇంకొక కాఫీ మైథిలి కోసం ఆర్డర్‌ ఇవ్వబోతే తను ‘వద్దు’ అంది.

కాఫీ సిప్‌ చేసి, ‘‘సరేగానీ, నీ సంగతేంటి? పొద్దున్నే మాల్‌లో న్యూస్‌పేపర్‌ తిరగేస్తున్నావు. నువ్వూ షాపింగ్‌కు వచ్చావా?’’ అనడిగాను.

‘‘లేదు, దగ్గరలో ఉన్న స్కూల్లో పిల్లలకు టాలెంట్‌ టెస్ట్‌ ఉంది ఈ రోజు. వాళ్ళ ఎగ్జామ్‌ అయ్యేంతవరకూ టైమ్‌ పాస్‌ చెయ్యాలి కదా... మాల్‌ అయితే ఫ్రీ వైఫై ఉంటుందని ఇలా వచ్చా’’

కన్నుగీటింది మైథిలి.

‘‘ఓ నైస్‌... మీ పిల్లల పుణ్యమా అని మనం కలుసుకున్నాం. ఎంసీఏ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం. మనం ఒకరి పెళ్ళికి ఒకరు కూడా రాలేదు. మనవాళ్ళు ఇంకెవరన్నా టచ్‌లో ఉన్నారా?’’

‘‘పీజీ తర్వాత ఎవరూ కలవలేదు. కాకపోతే ఈమధ్యే ‘వాట్సాప్‌’ పుణ్యమా అని కొందరు టచ్‌లోకి వచ్చారు. మొదట ముఖాముఖి కలిసింది మాత్రం నిన్నే. నీ నంబర్‌ ఇవ్వు, మన క్లాస్‌ గ్రూప్‌లో యాడ్‌ చేస్తా’’ అని నా నంబర్‌ తీసుకుని సదరు వాట్సాప్‌ గ్రూపులోకి నన్ను చేర్చింది.

నాకు కుతూహలంగా ఉంది... ‘ది గ్రేట్‌ ర్యాంకర్‌, ఇప్పుడు ఏం చేస్తుందా?’ అని. అదే అడిగాను, ‘‘ఇంకేంటి సంగతులు? నువ్వెక్కడ ఉండేది? ఎక్కడ జాబ్‌ చేస్తున్నావు?’’

‘‘నేను జాబ్‌ మానేసి పదేళ్ళవుతోంది. మావారు ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో డైరెక్టర్‌. ఇద్దరు పిల్లలు... ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. పాప ప్లస్‌ టూ చదువుతోంది. బాబు నైన్త్‌. పాపకి బాచిలర్స్‌కి యూఎస్‌ వెళ్ళాలని ఉంది, ‘శాట్‌’కి ప్రిపేర్‌ అవుతోంది. కొండాపూర్‌లో ఉంటున్నాం. సింపుల్‌ లైఫ్‌.... ఇదిగో, ఇదే మా ఫ్యామిలీ’’ అని ఫోన్‌ అందించింది మైథిలి.

ఫొటోలు చూసి తన ఫోన్‌ తిరిగిస్తూ ‘‘అదేంటే, అంత షాక్‌ ఇచ్చావు. నువ్వు మన బ్యాచ్‌ టాపర్‌వి. లెక్చరర్లకు ఫేవరెట్‌ స్టూడెంట్‌వి. అలాంటిది, నువ్వు జాబ్‌ మానేసి ఇంట్లో కూర్చోవడం ఏంటి?’’ ఆశ్చర్యపోతూ అడిగాను.

‘‘అలాంటిదేం లేదు. నీకు తెలుసు కదా... ఎంసీఏ అవుతూనే క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో ఉద్యోగం వచ్చింది. పెళ్ళికి ముందు మూడు సంవత్సరాలూ ఆ తర్వాత అయిదేళ్ళూ ఉద్యోగం చేశాను. బాబు పుట్టాక ఉద్యోగం మానేసి, ఇంట్లోనే ఫుల్‌టైమ్‌ అమ్మ జాబ్‌ చేస్తున్నా. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవారయ్యారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. అందుకే, సాయంత్రం మా కాలనీ పిల్లలకు ట్యూషన్స్‌ చెప్తున్నాను. అది సరేగానీ, మీ ఫ్యామిలీ ఫొటోలు చూపించవా?’’ తన మాటలకు నాలో అహం కొంచెం శాంతించింది.

ఇప్పుడు నా వైభవం తనకు చూపించే అవకాశం దొరికింది అని లోలోపలే సంతోషిస్తూ ‘‘తప్పకుండా... ఇవిగో చూడు’’ అని ఫోన్‌ లాక్‌ తీసి తనకు అందించాను. గ్యాలరీలో ఉన్న ఫొటోలు చూసి, ‘‘అదేంటి గౌతమీ, ఒక్క ఫొటోలో కూడా మీ ఫుల్‌ ఫ్యామిలీ లేదు? ఒక దానిలో నువ్వు లేకపోతే, ఇంకో దానిలో మీవారు లేరు. పిల్లలిద్దరూ కలిసున్నవి కూడా చాలా తక్కువ ఫొటోలు ఉన్నాయి. చాలా వరకూ సింగిల్‌ ఫొటోలే ఉన్నాయి. ఎందుకలా?’’ ఫోన్‌ నాకు అందిస్తూ అడిగింది మైథిలి.

‘‘ఓ, అదా... ఏం లేదు, మా పిల్లలిద్దరూ బోర్డింగ్‌ స్కూల్స్‌లో చదువుతున్నారన్నాను కదా. నాకూ మావారికీ వర్క్‌తో క్షణం తీరిక ఉండదు. అయన బిజినెస్‌ మీదా, నేను ఉద్యోగరీత్యా ఎప్పుడూ ట్రిప్పుల మీదే ఉంటాం. పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు మాత్రం మా ఇద్దరిలో కనీసం ఒకరు ఇంట్లో ఉండేలా ప్లాన్‌ చేస్తాం. ఇక పిల్లలు కూడా వేరు వేరు తరగతులు, వేరువేరు స్కూల్స్‌. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా కలిసుండే సమయం తక్కువ. అందుకే అన్నీ సింగిల్‌ ఫొటోస్‌ ఉన్నాయి’’ అన్నాను. అంతలోనే, ‘ఇదేంటీ... నేను దానికి సంజాయిషీ ఇస్తున్నాను’ అనుకుని సర్దుకుంటూ, ‘‘పిల్లలను ఒక వయసు తర్వాత స్వతంత్రంగా ఉండనివ్వాలి. అప్పుడే వాళ్ళకు బాధ్యత అలవాటు అవుతుంది. ఈ కాలం పిల్లలు చాలా షార్ప్‌. వాళ్ళకు మనం కూర్చోబెట్టి నేర్పాల్సిన పని లేదు. నన్నడిగితే నువ్వు అనవసరంగా జాబ్‌ మానేశావు.

నీ డిగ్రీకి నువ్వు న్యాయం చేయడం లేదు. ఒక్కసారి ఆలోచించు... నువ్వు కూడా జాబ్‌ చేస్తే, నీ జీతమూ మీవారి సంపాదనా కలిపి మీకు చాలా ఉపయోగపడేది.

ఇప్పుడు ఉంటున్న కొండాపూర్‌లో కాకుండా, ఇంకొంచెం మెరుగైనచోట ఇల్లు కొనగలిగేవారు. హాయిగా ప్రపంచం అంతా తిరిగి చూసేదానివి. అసలు మీ లైఫే వేరే లెవెల్లో ఉండేది. నీకెప్పుడూ ఆలా అనిపించలేదా?’’ ఆఖరి వాక్యాలను ఒత్తి పలుకుతూ మైథిలి మొహంలో భావాలను చదవడానికి ప్రయత్నించాను. దానికి చిరునవ్వు నవ్వి, ‘‘అఫ్‌కోర్స్‌, ఇప్పటి పిల్లలు చాలా షార్ప్‌- ఒప్పుకుంటాను.

కానీ వాళ్ళకు ‘ఏది మంచి, ఏది చెడు’ అనే విచక్షణ నేర్పాల్సింది మాత్రం తల్లిదండ్రులే. ఇప్పుడు బాగుపడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, చెడిపోవడానికీ అంతకంటే ఎక్కువ దారులున్నాయి. పిల్లలపై మనం పెట్టగలిగిన అతి ముఖ్యమైన పెట్టుబడి... మనం వాళ్లతో గడపగలిగే సమయం. మనం వాళ్ళను దేశాలు తిప్పకపోయినా, ఆస్తులు సంపాదించి ఇవ్వకపోయినా పర్లేదు... వాళ్ళను మంచి వ్యక్తిత్వం ఉన్నవారిలా తీర్చిదిద్దగలిగితే చాలు, అదే మనం వారికి ఇచ్చే నిజమైన ఆస్తి’’ బదులిచ్చింది మైథిలి.
‘‘ఇవన్నీ కాదే, నీలా ట్యాలెంట్‌ ఉండి, జాబ్‌లో గ్యాప్‌ వచ్చిన ఆడవాళ్ళకు మా కంపెనీలో మేము ప్రత్యేకంగా జాబ్స్‌ ఇస్తాం. ‘సెకండ్‌ ఛాన్స్‌’లాగా. నువ్వు కావాలంటే ఇంటర్వ్యూ కూడా లేకుండా నిన్ను తీసుకుంటా. నా ఇమెయిల్‌ ఐడి నీకు మెసేజ్‌ చేస్తా. నీ రెజ్యూమే నాకు పంపించు’’ అన్నాను. అలా అంటున్నప్పుడు, ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉన్నానన్న గర్వం, నా గొంతులో పలికింది.

‘‘లేదు, గౌతమీ... నీ అభిమానానికి థ్యాంక్స్‌. కానీ, మేము సుఖంగా బతకడానికి సరిపోయేంత మావారు సంపాదిస్తున్నారు. దేవుడి దయవల్ల కొంత వెనకేశాం. జీవితంలో సున్నా నుండి మొదలై ఈ స్థాయికి వచ్చాం. ఇక పిల్లలు, వారికి నచ్చింది చేయగలిగేలా మేము సపోర్ట్‌ చేయగలిగితే చాలు’’ అంటూ తను సున్నితంగా తిరస్కరించింది.

‘ఇదేంటీ? నా ఆస్తీ హోదా చూపించి దాన్ని చిన్నబుచ్చాలనుకుంటే, అది అస్సలు ఏమీ పట్టనట్లు ఇంత కూల్‌గా ఉందేంటి?’... కౌచ్‌లో కూర్చున్న నాకు ఉన్నట్టుండి ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపించింది. ఫోన్‌ తీసి డ్రైవరుకు డయల్‌ చేశా. లైన్‌ కలవలేదు. మళ్ళీ ప్రయత్నించి, కలవకపోయే సరికి విసుగ్గా పెట్టేశాను.

‘‘ఏమైంది గౌతమీ? ఎవరికి ఫోన్‌ ట్రై చేస్తున్నావు?’’

‘‘మా డ్రైవర్‌కి షాపింగ్‌ అయ్యాక ఫోన్‌ చేస్తా, బ్యాగ్స్‌ తీసుకెళ్లడానికి రమ్మని చెప్పాను. ఎక్కడ చచ్చాడో ఏమో... ఫోన్‌ కలవడం లేదు’’ విసుక్కున్నా.

‘‘సెల్లార్లో ఉన్నాడేమో, సిగ్నల్‌ ఉండి ఉండదు. కాసేపాగి మళ్ళీ ట్రై చెయ్యి’’ అనునయంగా చెప్పింది మైథిలి.

‘‘సరే, ఇక అదే చెయ్యాలి. నాకు దేనికోసమైనా ఎవరికోసమైనా ఎదురుచూడటం అంటే పరమ చిరాకు’’ చురుగ్గా అని, మళ్ళీ డ్రైవరుకు ఫోన్‌ చేశా. ఈసారి కలిసింది. ఫోన్‌ ఎత్తగానే, ‘‘ఎక్కడున్నావు? పావుగంట నుంచీ నీకు ట్రై చేస్తున్నా, రా, ఫుడ్‌ కోర్టుకి వచ్చి బ్యాగ్స్‌ తీసుకెళ్ళు’’ అని చెప్పి పెట్టేశా.

ఐదు నిమిషాల తర్వాత...

‘‘మేడమ్‌, పిల్లల పరీక్ష అవ్వలేదా ఇంకా?’’ అని మా డ్రైవర్‌ గొంతు వినిపించింది. నేను చూసేసరికే అతడు వచ్చి మైథిలిని పలకరిస్తున్నాడు.

‘‘లేదు వెంకట్‌, ఇంకో అరగంట ఉంది. ఒంటిగంట దాకా కదా... అయ్యాక, నేను పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్తాను. అన్నట్టు, నువ్వేంటి ఇక్కడ?’’ అడిగింది మైథిలి.

‘‘నేను పని చేసేది గౌతమి మేడమ్‌ దగ్గరే. మీ ఇద్దరికే ముందే పరిచయం ఉందా?’’ అని ఆశ్చర్యపోతూ అడిగాడు.

‘‘ఆఁ, మేమిద్దరం ఫ్రెండ్స్‌లే. ఇదిగో, ఈ బ్యాగ్స్‌ తీసుకెళ్ళు’’ అని విసుగ్గా చెప్పాను.

‘‘సరే మేడమ్‌, మిమ్మల్ని సాయంత్రం కలుస్తా’’ అని మైథిలికి చెప్పి, నా దగ్గర ఉన్న సామాన్లు అందుకుని వెళ్ళిపోయాడు మా డ్రైవర్‌ వెంకట్‌.

‘‘నా అమెరికా ట్రిప్‌ అయ్యాక ఒకసారి కలుద్దాం’’ అని మైథిలికి చెప్పి అక్కడి నుండి బయటపడ్డాను.

కారు ఎక్కి కూర్చున్నానే కానీ, నా ఆలోచనలు మైథిలి చుట్టే తిరుగుతున్నాయి.

కొంచెం దూరం వెళ్ళగానే, వెంకట్‌ ‘‘మేడమ్‌, మైథిలి మేడమ్‌ మీకు ముందే తెలుసా?’’ అనడిగాడు.

‘‘తెలుసు. మేమిద్దరం క్లాసుమేట్స్‌మి. తను నీకెలా తెలుసు?’’ తిరిగి అడిగాను.

‘‘మా ఆవిడ వాళ్ళింట్లో పని చేస్తుంది. వైట్‌-ఫీల్డ్్సలో పెద్ద విల్లా వాళ్ళది. సారూ, మేడమ్‌ చాలా మంచివారు. వారి చేతికి ఎముక లేదు. మా ఇద్దరు ఆడపిల్లలు బాగా చదువుతారు. అది గమనించి, వాళ్ళ స్కూల్‌ ఫీజులు మైథిలి మేడమే కట్టి చదివిస్తున్నారు. ఇవ్వాళ ఏదో టెస్ట్‌ ఉందట, వాళ్ళ బాబుతోపాటు మా పిల్లలను కూడా తీసుకొచ్చి రాయిస్తున్నారు. మేడమ్‌ ఇంతకుముందు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కానీ తర్వాత, పిల్లల కోసం మానేశారు. అయిదు సంవత్సరాల నుండి అదేదో ఎన్‌జీఓ అట... దాని తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదో అవార్డు వచ్చిందని మేడమ్‌ ఫొటో ఈ రోజు పేపర్లో కూడా వేశారు, ఇదిగో చూడండి...’’ అంటూ తన పక్కన ఉన్న పేపర్‌ నాకు అందించాడు.

ఆ వార్త చివరి పేరా మైథిలి మాటల్లో... ‘జీవితం అనేది పరుగుపందెం కాదు. మనం ఎవరితోనూ పోటీపడి పరిగెత్తనక్కర్లేదు. ఎందుకంటే, ఎవరి పరుగు వారిదే.

మనకు ఉన్నదాంట్లోనే పక్కవారికి సహాయపడాలి. ఇవ్వడంలో ఉన్న ఆనందం... దాచుకోవడంలో ఉండదు.’

ఆ ఆఖరి వాక్యం చదివిన నాకు, ఎవరో ఛెళ్ళున చరిచినట్టయింది.

ఇరవైరెండు సంవత్సరాల క్రితం నా పరుగు పందెం మొదలుపెట్టాను.

కానీ, విచిత్రంగా ఆ పందెంలో నేనొక్కదాన్నే పరిగెడుతున్నాను. అందులో పోటీ అనుకున్న మైథిలి ఎప్పుడూ పరిగెత్తలేదు. ఇంతకీ ఈ పరుగులో నేను గెలిచానా? ఓడానా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..