Updated : 22 May 2022 00:16 IST

ప్రేమ-పెళ్ళి

- బి. వెంకట మనోహర్‌ బాబు

‘‘ఛీ..నువ్వెప్పుడూ ఇంతే, నన్ను గంటలు గంటలు వెయిట్‌ చేయిస్తావు’’ విసురుగా అంది రమ్య.
‘‘సారీ రమ్యా, అనుకోకుండా ఒక కాల్‌ వస్తే మాట్లాడాల్సి వచ్చింది. దారిలో సిగ్నల్‌ పడి వెయిట్‌ చేయాల్సి వచ్చింది. అందుకే లేట్‌ అయ్యింది’’ సంజాయిషీ ఇచ్చాడు ఆదిత్య.
అయినా రమ్య కోపంగా చూడటంతో టాపిక్‌ డైవర్ట్‌ చేస్తూ ‘‘ఏంటీ, సడన్‌గా కలవాలన్నావు’’ అన్నాడు.
అప్పటికీ ఆమె ముఖంలో కోపం తగ్గలేదు. ‘‘నీలాంటి వాడిని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి’’ అంది కసిగా. వాళ్ళిద్దరికీ ఇది మామూలే. ఎప్పుడూ చెప్పిన టైమ్‌కన్నా లేట్‌గానే వెళ్తాడు ఆదిత్య. కోపంతో మండిపడుతుంది రమ్య. పావుగంట బతిమాలించుకుని క్షమించి నవ్వేస్తుంది. ‘ఈసారి... కొంచెం ఎక్కువ కోపంగా ఉందేంటి’ అనుకున్నాడు ఆదిత్య. ఎప్పుడూ తను లేట్‌గా వెళితే... కోపాన్ని నటించి, అరిచి, బతిమాలించుకుని- మళ్ళీ లేట్‌గా వస్తే ఇంకొకరిని చూసుకుంటానని బెదిరిస్తుందే కానీ, నిజానికి తను చాలా మంచి అమ్మాయి, అర్థం చేసుకునే మనస్తత్వం.
అసలు తన జూనియర్‌ రమ్యలో ఆ గుణాలు చూసే కదా... ఇష్టపడి, వెంటపడి, ఆమె ప్రేమను గెల్చుకోవటానికి నానా పాట్లుపడి, ఎలాగైతేనేం ఆమె మనసు గెల్చుకుని తనదాన్ని చేసుకున్నాడు. ఇది జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఈ నాలుగేళ్ళల్లో వాళ్ళు వారాంతాల్లో కలుస్తూనే ఉన్నారు. కబుర్లు, సినిమాలు, మాల్స్‌... ఇలా సరదాగా గడుపుతూనే ఉన్నారు. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు, కావలసినంత ఆదాయం, స్వేచ్ఛ ఉన్నాయి. కానీ కుటుంబ విలువల మీద నమ్మకం ఉన్న ఇద్దరూ ఎప్పుడూ ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చెయ్యలేదు. ఈ బంధాన్ని పెళ్ళిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో... రమ్యా వాళ్ళ నాన్న తనకి ఒక సంబంధం చూశారు.
ఆదిత్య సంగతి చెప్తే ఎలా రియాక్టవుతారో అన్న భయం వల్ల తండ్రితో ఏమీ చెప్పలేక పోయింది.
ఏం చెయ్యాలో సలహా చెప్తాడని ఆదిత్యను రమ్మంది.
‘‘నాన్న నాకు పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు’’ సీరియస్‌గా చెప్పింది రమ్య.
‘‘నీకు అప్పుడే పెళ్ళేంటి? నా జూనియర్‌వేగా...’’ కంగారుపడ్డాడు ఆదిత్య.
‘‘నీకంటే జూనియర్‌నే అయినా నాకు 23 ఏళ్ళు వచ్చాయి. ఆడపిల్లలకు తొందరగా పెళ్ళి చేస్తారు. ఎవరో ఒక ఫ్రెండ్‌ అన్నారట నాన్నతో- ‘మంచి సంబంధం ఉంది, మీ అమ్మాయికి చేస్తారా’ అని. దాంతో నాన్న తొందరపడుతున్నారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది ఆదిత్యా’’ అప్పటిదాకా కోపంగా ఉన్న రమ్య కళ్ళలో నీళ్ళు వచ్చాయి.
అది చూసి ఆదిత్య తట్టుకోలేకపోయాడు. ‘‘రమ్యా, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్ళి చేసుకుని తీరుతాం. నా మీద నమ్మకం లేదా’’ అంటూ లాలనగా అడిగాడు.
‘‘నీమీద నమ్మకం లేక కాదు ఆదిత్యా... నాన్న ఒప్పుకుంటారనే నమ్మకం కలగటం లేదు. ఏమంటారో అని భయంగా ఉంది’’ బాధగా అంది రమ్య.
‘‘పోనీ నన్ను రమ్మంటావా... ఇద్దరం కలసి వెళ్ళి మాట్లాడదామా? నన్ను చూస్తే ఆయన అభిప్రాయంలో మార్పు రావచ్చేమో’’ సాలోచనగా అన్నాడు ఆదిత్య.
నిజానికి ఆదిత్యకి కూడా కొంచెం భయంగానే ఉంది- తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి. ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళితే తమ జంటని చూసి పెద్దలు కాదనరేమో అన్న ఆశ కలుగుతోంది. ఎటో ఆలోచిస్తున్నవాడల్లా రమ్య ‘‘వద్దు’’ అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు.
అయోమయంగా చూస్తున్న ఆదిత్యతో రమ్య ‘‘మీ పేరెంట్స్‌ అయినా మా పేరెంట్స్‌ అయినా విషయం చెప్పగానే కంగారుపడి అరవచ్చు. నిన్నూ నన్నూ తిట్టొచ్చు కూడా. మొదటిసారి నీతో కలిసి మీ ఇంటికి వచ్చినపుడు ఆవేశంలో వాళ్ళు అన్న మాటల ప్రభావం, జీవితాంతం మన అనుబంధం మీద పడొచ్చు. తరవాత వారితో సరిగ్గా ఇమడలేకపోవచ్చు. వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేక, వారితో సర్దుకోలేక, వారిని చూస్తే ఆ మాటలే గుర్తుకువచ్చి మనస్పర్థలు రావచ్చు. నీకైనా మా వాళ్ళతో అలాగే జరగొచ్చు. జీవితాంతం కలిసుండాల్సింది మనం మాత్రమే కాదు కదా ఆదిత్యా - మన కుటుంబాలు కూడా కదా... అందుకే వద్దన్నాను’’ అంది సంజాయిషీగా.
ఆ మాటల్లోని లోతుని అర్థంచేసుకుని ‘‘నిజమే రమ్యా, మన పేరెంట్స్‌ గురించి మనకే బాగా తెలుస్తుంది కాబట్టి, రేపు ఆదివారమే మనం మన పేరెంట్స్‌కి చెప్పేద్దాం’’ అన్నాడు ఆదిత్య.
‘‘సరే అయితే, ఎల్లుండి సాయంత్రం మళ్ళీ కలుద్దాం. వాళ్ళ రియాక్షన్‌నిబట్టి మనం ఏం చెయ్యాలో చూద్దాం’’ అంది రమ్య వెళ్ళబోతూ.
రమ్య వెళ్ళాక- ‘తన తల్లిదండ్రులకు రమ్య విషయం ఎలా చెప్పాలా’ అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆదిత్య.

* * * * *

మర్నాడు టిఫిన్‌ అయ్యాక, వాళ్ళ నాన్న టీవీ చూస్తుండగా, వాళ్ళ అమ్మని పిలిచి ఇద్దరికీ రమ్య విషయం చెప్పాడు. మొదట ఇద్దరూ ఆశ్చర్యపోయినా ఆదిత్య ఊహించినట్లుగా ఆవేశపడలేదు. రమ్య వివరాలూ వారి కుటుంబ వివరాలూ తెలుసుకుని సంతృప్తిపడ్డట్లుగా కనిపించినా సీరియస్‌గానే ఉన్నారు. కొంతసేపటికి ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు.
ఆదిత్య మనసంతా ఆందోళనతో నిండిపోయింది. ఏదో రమ్య కన్నీళ్ళు చూసి ఆవేశంలో ‘పెద్దలు ఒప్పుకోకపోయినా మనం పెళ్ళి చేసుకుందాం’ అన్నాడే కానీ పెద్దల ఆశీస్సులూ ఆదరణా లేకుండా చేసుకునే పెళ్ళిళ్ళల్లో ఎంత వేదన ఉంటుందో చాలామంది ఫ్రెండ్స్‌ అనుభవాల ద్వారా తనకు తెలుసు. అలా చేసుకోవటం తనవల్ల కాదు. అమ్మా, నాన్నా తనని ఎంత ప్రేమగా చూసుకున్నారో, ఎంత కష్టపడి తమ సుఖాలన్నీ వదులుకుని తనని ఈ స్థాయిలో నిలబెట్టారో... అన్నీ గుర్తొచ్చాయి. అలాంటి అమ్మా నాన్నలను పెళ్ళి కారణంగా దూరం చేసుకోవటం అన్న ఆలోచనే భరించలేకపోతున్నాడు. అలాగే రమ్య లేని జీవితం తలుచుకుంటే శూన్యం తప్ప ఏమీ కనిపించట్లేదు. ‘ఏం చెయ్యాలి... ఎలా... ఈ సమస్య నుంచి బయటపడాల’ని ఆలోచిస్తున్న ఆదిత్య- తల్లిదండ్రులు తిరిగి వచ్చినది కూడా గమనించలేదు.
ఆదిత్య వాళ్ళ నాన్న వచ్చి, ‘‘మేము రమ్య పేరెంట్స్‌ని కలిసి మాట్లాడాం. రేపు వాళ్ళు లంచ్‌కి వస్తున్నారు. మీరిద్దరూ లీవ్‌ పెట్టి మాతోనే ఉండాలి’’ అని చెప్పి సీరియస్‌గా వెళ్ళిపోయారు.
తండ్రి అలా చెప్పగానే- ఆనందం, భయం ఒకేసారి కలిగాయి ఆదిత్యకి. విషయం లంచ్‌ దాకా వచ్చిందంటే పెద్దవాళ్ళు సమ్మతించి ఉండొచ్చని అనుకున్నాడు.
మర్నాటి మధ్యాహ్నందాకా ఉత్కంఠతో, ఉద్వేగంతో ‘ఇది’ అని తెలియని అలజడితో గడిపాడు ఆదిత్య. అమ్మ మాత్రం మౌనంగా లంచ్‌ ఏర్పాట్లు చూస్తోంది. సరిగ్గా 12-30కి కాలింగ్‌ బెల్‌ మోగింది. నాన్న తలుపు తీసి అందరినీ ఆహ్వానించారు. మామూలు మాటల మధ్య లంచ్‌ పూర్తయింది. ఆదిత్య రమ్యని కళ్ళతోనే అడిగాడు ఏమయిందని. తాను కూడా కళ్ళు ఎగరేసి చెప్పింది తెలియదని.
లంచ్‌ అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు. టెన్షన్‌ భరించలేక ఇక లాభంలేదని ఏదో ఒకటి తేల్చుకోవాలని, ‘‘అమ్మా, ఒప్పుకున్నట్లేనా మా పెళ్ళికి’’ అని అడిగాడు ఆదిత్య.
వాళ్ళ అమ్మ పొడిగా ‘‘లేదు’’ అని, ఇంకేదో అనబోయేంతలో రమ్యవాళ్ళ అమ్మ ‘‘ఆదిత్యా, రమ్యతో నీ పెళ్ళి చెయ్యం అనడానికి కారణం కులమూ డబ్బూ కాదు. మేము వాటిని లెక్కచెయ్యం. రమ్య మా ఒక్కగానొక్క కూతురు, మా ప్రాణంకన్నా ఎక్కువ. దానికన్నా దాని సుఖంకన్నా ఈ ప్రపంచంలో మాకు ఎక్కువ అయినది ఏదీ లేదు. అది అడిగితే మేం కాదనేదీ లేదు. నీ చదువూ ఉద్యోగం, మీ హోదా కూడా తక్కువేమీ కాదు. కానీ...’’ అంటుండగా...
‘‘నేను చెప్తాను వదినా’’ అని ఆదిత్య వాళ్ళ అమ్మ ‘‘ఆదిత్యా గుర్తుందా... నిన్న మొన్నటి వరకూ నీకు కాలేజ్‌కి లేట్‌ అయి నువ్వు తినకుండా వెళ్ళిపోతుంటే... నీ వెనకాలే తిరుగుతూ, నీకు అన్నం ముద్దలు నోట్లో పెట్టి పంపించేదాన్ని. నీకు ఉద్యోగం వచ్చాక కూడా లేట్‌గా లేచి హడావుడిగా ఆఫీస్‌కి వెళ్తూ ‘అమ్మా నా షర్ట్‌ ఎక్కడ, షూస్‌ ఎక్కడ’ అంటూ అరుస్తూ ఉంటే అన్నీ ఇచ్చి టిఫిన్‌ నోట్లోపెట్టి పంపించేదాన్ని గుర్తుందా’’ అంటూ అడిగింది.
ఆదిత్యకు వెంటనే- ముందురోజు కూడా తాను మీటింగ్‌కని హడావుడి పడుతుంటే అమ్మ నోట్లో టిఫిన్‌ పెట్టడం గుర్తొచ్చింది. అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తోందో అర్థంకాలేదు. ఆదిత్య అయోమయంగా చూస్తుంటే, ఆమె రమ్య వైపు తిరిగి... ‘‘రమ్యా, నీకేం పనులు వచ్చు’’ అని అడిగింది. అప్పుడు రమ్యా వాళ్ళ అమ్మ కల్పించుకుని ‘‘ఆదిత్యకి మీరు ఎలా అన్నీ చేశారో, నేను రమ్యకి కూడా అంతే చేశాను వదినా. దానికి కూడా పనులు ఏమీ రావు’’ అంది.
వారిద్దరూ ఒకరికొకరు సైగ చేసుకుని ఆదిత్య, రమ్యలను ‘‘రేపు పెళ్ళి అయ్యాక జీవితాన్ని ఎలా ప్లాన్‌ చేసుకున్నారు’’ అని అడిగారు.
దానికి ఆదిత్య ‘‘దీనికి పెద్ద ప్లానింగ్‌ ఎందుకమ్మా. అందర్లాగానే మేము కూడా. పెళ్ళయ్యాక రమ్య ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటుంది, నేను ఉద్యోగం చేస్తాను... అంతే సింపుల్‌’’ అంటుండగా...
‘‘స్టాపిట్‌ ఆదిత్యా... నేను పెళ్ళయ్యాక ఉద్యోగం మానేస్తానని నీతో చెప్పానా? నేను ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలని నువ్వెలా డిసైడ్‌ చేస్తావు? నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఇది. గ్రోత్‌కి మంచి అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో నేను ఉద్యోగం మానను’’ అని కచ్చితంగా చెప్పింది రమ్య.

‘‘మీ జనరేషన్‌తో ఇదేరా సమస్య. మీరు గారాబంగా పెరుగుతారు. బాధ్యత తెలీదు. చదువులూ ఉద్యోగాలూ అయ్యాక కూడా సరదాల పేరుతో లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యాలి అనుకుంటారేగానీ బాధ్యత తీసుకోవటానికి ముందుకు రారు. మీకు కావల్సినవన్నీ ఎవరో ఒకరు అమర్చి పెడితేనే మీకు లైఫ్‌ నడుస్తుంది. అంతేకానీ జీవితాన్ని మీ కంట్రోల్‌లోకి తీసుకోవటం మీకు చేతకాదు. మీరు అలా అవ్వటానికి తల్లిదండ్రులుగా కొంత మా తప్పు కూడా ఉంది. ఒక్క సంతానమే కావటంతో మీకు ఏ కష్టమూ రాకుండా పెంచాలని కష్టమంతా మేము పడి మిమ్మల్నిలా పెంచాం. బాధ్యత లేకుండా పెరిగితే భవిష్యత్తులో ఎలా జీవిస్తారు- అన్న ఆలోచన అప్పుడు మాకు రాలేదు. ఇప్పుడు వచ్చినా ప్రయోజనం లేదు.
‘మీ పనులే మీరు సొంతంగా చేసుకోలేని స్థితిలో- పెళ్ళితో వచ్చే బాధ్యతలను మీరు మోయగలరా?’ అన్న సందేహం వచ్చింది మాకు.
ఆదీ, పెళ్ళంటే నువ్వు అనుకున్నట్లుగా గర్ల్‌ఫ్రెండ్‌ భార్య అవటం కాదు. ఇంటికి భార్యని తెచ్చుకోవటం అంటే- తనవారినందరినీ వదిలి వచ్చిన అమ్మాయి బాధ్యతను నువ్వు తీసుకుంటున్నట్లు. మరి నీకే ఏ బాధ్యతా పట్టకపోతే ఇంకొకరి బాధ్యత ఎలా తీసుకోగలవు? తనకి ఏ కష్టమూ రాకుండా ఎలా చూసుకోగలవు? తనకి ఒంట్లో బాగోలేకపోతే కనీసం కాఫీ అయినా కలిపి ఇవ్వగలవా? రేపు మీకు పిల్లలు పుడితే, కనీసం వాళ్ళకి పాలు అయినా పట్టగలవా... ఆలోచించు.
రమ్య కూడా నీలాగా గారాబంగా పెరిగిన పిల్లే. తను కూడా తన భర్త నుంచి ఏదో ఆశిస్తుంది కదా! భర్తగా తనకి నువ్వు ఏం చేయగలవో ఆలోచించావా? ఇప్పటిదాకా ఇది నీ జీవితం. కానీ ఒకసారి ‘పెళ్ళి’ అన్న బంధం ముడిపడిన తర్వాత ‘నీ’ కాస్తా ‘మీ’ అవుతుంది. కొన్ని కోల్పోవలసి వస్తుంది. కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది, కొన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. అస్సలు ఇష్టం లేనివి కూడా కొన్ని చెయ్యాల్సి వస్తుంది.
ఎప్పుడైతే జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందో ఇది ఊహించని వ్యక్తులు కంగారుపడతారు, గందరగోళంలో పడతారు. బాధ్యతను స్వీకరించలేక, భాగస్వామితో సర్దుకోలేక... తాము అప్పటిదాకా గడిపిన జీవితాన్నీ ఆ సరదాల్నీ వదులుకోలేక... చివరకు బంధాలను వదిలించుకుంటే స్వేచ్ఛ లభిస్తుందన్న నిర్ణయానికి వస్తారు. దాని ఫలితమే సమాజంలో నానాటికీ పెరుగుతున్న విడాకుల కేసులు.
‘జీవితాంతం కలిసి ఉంటాం’ అని ప్రమాణం చేసుకున్న జంటలు కొన్ని సంవత్సరాలైనా కాకముందే విడిపోతున్నారు. వారి పిల్లలు సింగిల్‌ పేరెంట్‌ పెంపకంలో పెరిగి సమాజంలో ఎంతో పోరాటం చేయాల్సి వస్తోంది, మానసిక సమస్యలు కూడా వారికే ఎక్కువగా వస్తున్నాయి’’ అంది ఆదిత్య తల్లి.
‘‘మీ అమ్మగారు చెప్పింది అక్షరాల సత్యం’’ అంటూ ఆంటీ గొంతు వినపడేసరికి ఉలిక్కిపడి తలెత్తి చూశాడు ఆదిత్య.
ఆవిడ రమ్యతో ‘‘రమ్యా, ఇందాక ఆంటీ చెప్పినట్లు- నువ్వు కూడా ఏ బాధ్యతా లేకుండా పెరిగావు. ఇప్పుడు కుటుంబ బాధ్యతలోకి వెళ్తే ఆ పరిస్థితులు ఎదుర్కోగలవా? కోడలిగా నువ్వు వెళ్ళిన కుటుంబంతో సర్దుకోగలవా? కుటుంబ బాధ్యతను నిర్వర్తించగలవా? అందరితో కలసిపోగలవా? అంతెందుకు, నలుగురు వస్తే వంట చేసి వడ్డించగలవా? ఒక పూట పనిమనిషి రాకపోతే ఇల్లు దిద్దుకోగలవా? ఎవరి సాయం లేకుండా ఇల్లూ ఉద్యోగం చూసుకోగలవా?
మీ నాన్న ఈ పెళ్ళి సంబంధం తేవడం ఒక రకంగా మంచిదే అయింది. మీ ప్రేమ గురించి ఇప్పటికైనా మాకు తెలిసింది. మా ఒక్కగానొక్క కూతురి పెళ్ళి మీద మాకెన్నో ఆశలు ఉన్నాయి. ఇలా చెయ్యాలీ అలా చెయ్యాలీ అని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఈ రోజుల్లో ఎంతో ఆర్భాటంగా జరుగుతున్న పెళ్ళిళ్ళు ఎన్ని నిలబడుతున్నాయి? ఏ ఆడపిల్ల పెళ్ళికి వెళ్ళినా నా మనసులో ఒకే ఆలోచన... ఈ జంట అయినా కడదాకా కలిసుంటారా... అని.
ఆదిత్యా, నాకు కొడుకులు లేరు. కొడుకైనా అల్లుడైనా నువ్వే. అలాగే మీ పేరెంట్స్‌కీ కోడలైనా కూతురైనా రమ్యే. మీరు పెళ్ళి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే మీ పిల్లలతో ఆడుకుంటూ మేం నలుగురం హాయిగా గడిపేస్తాం. కానీ, అందుకు భిన్నంగా ఏమైనా జరిగితే ఈ వయసులో మేం తట్టుకోలేం. మీ ఇద్దరి బంధం ఎంత దృఢంగా ఉంటే మేము అంత మనశ్శాంతిగా ఉంటాం. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి. బంధాన్ని చివరి వరకూ నిలుపుకోగలమనే నమ్మకం, భరోసా మీకు ఉంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాం’’ అంటుండగానే-
‘‘వద్దు’’ ఆదిత్యా రమ్యా ఒకేసారి అన్నారు. ‘‘మేము మరోసారి మాట్లాడుకుని మా నిర్ణయం చెప్తాం’’ అన్నారు.
రెండు రోజుల తరవాత అందర్నీ పిలిచి- ‘‘ఇన్నాళ్ళూ చాలామంది విడాకులు తీసుకోవటానికి కారణం వారిమధ్య ప్రేమ తగ్గి ఉంటుంది అనుకునేవాళ్ళం. కానీ మీరు చెప్పినట్లు బాధ్యత తీసుకోలేకపోవటం అని అర్థం అయ్యింది. అయితే, పెళ్ళి అంటూ చేసుకుంటే ఎవరితోనైనా ఇదే సమస్య కదా. సమస్య మేము ‘బాధ్యత తీసుకోవటం’ కాబట్టి- బాగా ఆలోచించుకుని- ఒక సంవత్సరం ఆగి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పారిద్దరూ.
‘‘ఏం చేస్తారు... ఈ సంవత్సరంలో?’’ అడిగింది రమ్య తల్లి.
‘‘నువ్వు ఇంట్లో ఏయే బాధ్యతలు నిర్వహిస్తున్నావో అవన్నీ నేర్చుకుంటాను. వంట చేస్తా, ఇల్లు సర్దుతా... అన్నీ చేస్తా.’’
‘‘నేను కూడా నాన్న చేసే పనులన్నీ చేస్తూ అమ్మకి సాయం చేస్తా’’ అన్నాడు ఆదిత్య.
‘‘ఉద్యోగాలు చేస్తూ ఇంటిని కూడా చూసుకోగలగడం ఇద్దరం నేర్చుకుంటాం. తర్వాతే మా పెళ్ళి’’ కచ్చితంగా చెప్పారిద్దరూ.
‘‘కానీ మా పిల్లల్ని మాత్రం మాలా పెంచం, మీలా పెంచుతాం’’ అంది రమ్య.
తమ మాటలను శాంతంగా విని, తప్పొప్పులను అర్థం చేసుకున్న పిల్లలను చూసి ఆ తల్లిదండ్రుల మొహాలలో ఆనందం, తృప్తి తాండవించాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని