సంకెళ్ళు

1840... బ్రిటిష్‌ పాలనకు కేంద్రమైన కలకత్తా నగరాన్ని ఆనుకుని గంగానదికి ఉపనది అయిన హుగ్లి ప్రశాంతంగా ప్రవహిస్తోంది. ఆ నది వేలాది మత్స్యకారులకు జీవనాధారం.

Published : 29 May 2022 00:28 IST

సంకెళ్ళు

- సింహప్రసాద్‌

1840...
బ్రిటిష్‌ పాలనకు కేంద్రమైన కలకత్తా నగరాన్ని ఆనుకుని గంగానదికి ఉపనది అయిన హుగ్లి ప్రశాంతంగా ప్రవహిస్తోంది. ఆ నది వేలాది మత్స్యకారులకు జీవనాధారం.

చీకటితోనే లేచి మత్స్యకారులంతా వలలు తీసుకుని నదికెళ్ళారు. గంగామాతకు నమస్కరించి వేటకు దిగారు.

వారి అదృష్టం పండింది. వేటాడిన చేపల్ని ఒడ్డు మీద రాశులుగా పోసి మురిసిపోయారు. కష్టం ఫలించిందన్న ఆనందం వారి కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది.

సరిగ్గా అప్పుడే ఇద్దరు ఆంగ్లేయులు వాహ్యాళికి అటుగా వచ్చారు. మత్స్యసంపదను చూసి అబ్బురపడ్డారు.

‘‘ఈ నదిలో చేపలు చాలా ఎక్కువగా ఉన్నాయే!’’ ఒకడు రెండోవాడితో అన్నాడు.

‘‘ఇప్పుడేం చూశావు. ఇంకో నెలలో- అంటే ఫిబ్రవరి నుంచి అక్టోబరు వరకూ వీళ్ళకు రోజూ పండగే. ఆ సీజన్లో బెంగాలీలు లొట్టలేసుకుంటూ తినే పులస చేపలు ఎదురెక్కుతాయి తెలుసా!’’.
‘‘వాటి ఖరీదెక్కువ అని విన్నాను. డిమాండ్‌ వున్నప్పుడు రేటు పెరగటం సహజం అనుకో. అంటే వీరికి వూరికే బోలెడంత ఆదాయం వచ్చిపడుతుందన్న మాట’’ తల పంకిస్తూ అన్నాడు.

ఆరోజే ఆ సంగతిని ఈస్టిండియా కంపెనీ అధికారికి చేరవేశారు.
‘‘వావ్‌. మన ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గం దొరికింది. కొత్త పన్ను విధించొచ్చు’’ మెరుస్తోన్న కళ్ళతో అన్నాడతడు.
‘‘నదీ గర్భంలోని సంపద మీద పన్ను వేస్తే చులకన అవుతామేమో?’’

‘‘మనం ఏదీ సూటిగా చెప్పం కదా. పడవల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని చెబుతూ, చేపల వేట మీద భారీ పన్ను విధిస్తాం. దానివల్ల చేపలు పట్టేవారి సంఖ్య తగ్గిపోతుంది గనుక రవాణా సాఫీగా సాగిపోతుందని బుకాయిస్తాం. అయినా మనల్నీ, మన చర్యల్నీ ప్రశ్నించే వాళ్ళింకా పుట్టలేదు. ఈ భారతీయులకు అన్ని తెలివితేటలు లేవులే’’ హేళనగా నవ్వాడు.

వెంటనే కొత్త ఉత్తర్వు జారీ అయ్యింది. నదిలో చేపలు పట్టాలన్నా, చేపల పడవలు తిరగాలన్నా పన్ను చెల్లించితీరాలని వాడవాడనా ప్రకటించారు. అతిక్రమిస్తే వలలూ, పడవలూ జప్తు చేయడమే గాక కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
అది మత్స్యకారుల మీద పిడుగులా పడింది. భారీ పన్ను చెల్లించి వేటకెళ్ళగల స్తోమత లేక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

అనాది నుండీ ఈ వృత్తిని స్వేచ్ఛగా చేసుకుంటూ జీవనం సాగిస్తోంటే ఈ ఆంక్షలేమిటో, ఎందుకో అర్థం కాలేదు. వేట తప్ప కడుపు నింపుకోడానికి మరో ఉపాధి తెలీదు. ఈ దుర్భర పరిస్థితిని తట్టుకుని బతకడం ఎలాగో బోధపడలేదు.

నగరంలోని జమీందార్లనీ, రాజులనీ కలిసి తమ గోడు వెలిబుచ్చారు. వారందరూ అగ్రకులస్తులే. కంపెనీ అధికారుల దగ్గర పలుకుబడి గలవారే. అయినా బ్రిటిష్‌ వారితో తలపడటానికీ, వారికి అయిష్టమైంది చెయ్యడానికీ వెనుకాడారు. ఆ వూసెత్తితే తమకెక్కడ చిక్కులు వస్తాయోనని భయపడ్డారు. మద్దతివ్వలేమని తేల్చి చెప్పేశారు.

‘‘తమరే అలా అంటే మేమెలా బతకాలి సామీ’’ కాళ్ళమీద పడ్డారు మత్స్యకారులు.
‘‘ఎవరి కర్మకెవరు బాధ్యులు. మేము మీ పక్షాన నిలబడి వాదించలేం’’ అంటూ తమ అశక్తతనీ, అనాసక్తతనీ వెలిబుచ్చారు.
నిరాశతో వెనుదిరిగారు మత్స్యకారులు. హుగ్లి ఒడ్డున బాబూ ఘాట్‌లో సమావేశమయ్యారు. ఏ ఒక్కరి ఆలోచనా కించిత్తు ఆశ కల్పించలేకపోయింది.
దిక్కూ దరీ కనుచూపుమేరలో కన్పించలేదు.

‘పొట్ట చేతబట్టుకొని వలస బోవాల్సిందే’నని ఏడ్చేశారు కొందరు.
‘‘అహిరిబోలా ఘాట్‌ దగ్గరి గుడి ముందు ఒక సాధువు కూర్చుని వుంటాడు. అతడు హిమాలయాల్నుంచి వచ్చాట్ట. అతడ్ని అర్థిస్తే దారి చూపుతాడేమో?’’ ఒకరన్నారు.
‘‘ఏ పుట్టలో ఏ పాముందో. ప్రాధేయపడితే పోయేదేం వుండదు గానీ పదండి’’.
వీళ్ళు వెళ్లేసరికి సాధువు ధ్యానంలో వున్నాడు. చేతులు జోడించి గొంతుక్కూర్చున్నారు. ఎట్టకేలకు అతడు కళ్ళు తెరిచాడు. ‘‘మీరే మమ్మల్ని ఒడ్డున పడేయాలి సామీ’’ కాళ్ళ మీద పడ్డారు.

నోరు విప్పి చెప్పబోతోంటే, సర్వం తెలుసన్నట్టు చూసి, చిన్నగా నవ్వి అన్నాడు... ‘‘రాస్మణీ దేవిని అర్థించండి. మీ కార్యం నెరవేరుతుంది’’.

విస్తుబోయారు. పరమాశ్చర్యంగా చూశారు. ‘‘మహామహా జమీందారులే చేతులెత్తేశారు. ఒక ఆడది ఏం చేయగలుగుతుంది?’’ సందేహం వెలిబుచ్చారు.

చిద్విలాసంగా నవ్వాడు. ‘‘మీరన్నట్టు ఆమె స్త్రీయే. వితంతువు కూడా. అంతేకాదు, మీలాగే శూద్ర కులస్తురాలు. కానీ పేద ప్రజల పక్షాన నిలిచే సత్తా, ప్రజోపకరమైన పనులు చేయగల ఉపకారగుణం ఆమెకు మెండుగా ఉన్నాయి. ఈ ఘాట్‌తో పాటు బాబూ ఘాట్‌ వగైరాలనీ ఆవిడే నిర్మించింది. స్నానాలకు నదిలో మెట్లు కట్టించింది. వెదురు బొంగులు పాతించింది. భర్త మరణించడంతో కుటుంబ వ్యాపారం, ఆస్తిపాస్తుల నిర్వహణా సమర్థంగా చేస్తున్నదా స్త్రీ మూర్తి. మీకు తప్పక సాయపడుతుంది. వెళ్ళండి’’
‘‘ఒక ఆడమనిషి దొరలతో మాట్లాడగలదా? ఈవిడ మాట్లాడినా వాళ్ళు వింటారా?’’

గుంభనంగా నవ్వాడా సాధువు.
‘‘ఆమె తెలివితేటలూ, ధైర్యసాహసాలూ నాకు తెలుసు. వెదురు వ్యాపారం చేసే భర్త వ్యాపార వృద్ధికీ, ఆస్తిపాస్తులు పెరగటానికీ ఆమె సలహాలే కారణం. బాలియ ఘాట్‌ కాలువ కిరుపక్కలా గల భూములు కొని వ్యాపార కుటుంబం కాస్తా జమీందారీ కుటుంబంగా మారడానికి కారణం ఆ రాస్మణీదేవే. సనాతన హిందూ సమాజంలో, పితృస్వామ్య వ్యవస్థలో ఒంటిగా నెగ్గుకొస్తున్న స్త్రీశక్తి ఆమె. ఎలాంటి శంకలూ పెట్టుకోకుండా వెళ్ళండి. మీకంతా శుభమే జరుగుతుంది’’.

అతడంత వివరంగా చెప్పినా ఎవరికీ నమ్మకం చిక్కలేదు. సర్వసంగ పరిత్యాగి అయిన ఆ సాధువు మాట పట్టుకుని వెళ్ళడమా, మానడమా అని వూగిసలాడారు.
‘‘ఆమెది మా ఊరే. ఇప్పుడు జమీందారిణి అయినా ఇదివరకు పేద కుటుంబమే. ఆమె తండ్రి హరేకిషన్‌ దాస్‌ ఓ కూలీ. ఎంతో అందంగా వుండే ఆమెని రాజా చంద్రదాస్‌ అనే ధనవంతుడు పెళ్ళాడాడు. వాళ్ళు కలకత్తాలోని జాన్‌ బజార్లో ఉంటారు. వెళ్ళి మొరబెట్టుకుందాం’’ అన్నాడొకడు ఉత్సాహంగా.

అది తప్ప మరో దారీ మిగల్లేదు. అంతా పొలోమంటూ రాస్మణి నివాసానికి వెళ్ళారు.
ఆమె కొంచెం పొట్టిగా వుంది. గుండ్రని మొహం. తెల్లచీర ధరించి కొంగు తలమీంచి కప్పుకుంది. అయినా నల్లని జుట్టు కన్పిస్తూ ఆమె వయస్సును తెలియజేస్తోంది. ఆమె కంట బడగానే అప్రయత్నంగా చేతులు జోడించారు. ఆమె కళ్ళు కురిపిస్తోన్న వాత్సల్యం అందర్నీ కట్టిపడేసింది. వారి గుండెలకు భరోసా చిక్కింది.

మత్స్యకారులు చెప్పిందంతా విన్నది రాణి. హుగ్లీ నది మీద ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులెందరు వుంటారోనని ఆరా తీసింది. ఆపైన దీర్ఘంగా ఆలోచించింది.
బ్రిటిష్‌ వారి స్వభావం ఆమెకు బాగా తెలుసు. గతంలో ఒకసారి దుర్గాపూజ ఊరేగింపుని శాంతికి భంగకరంగా వుందని చెప్పి నిషేధించగా ఆమె ఆ ఆజ్ఞని ఉల్లంఘించింది. ఆమెకు భారీ జరిమానా విధించారు. అది జనంలో వ్యతిరేకత రగిలించడం గమనించి ఉపసంహరించుకున్నారు.

‘‘మీకు న్యాయం జరిగేలా చూస్తాను. నాక్కొంచెం సమయం ఇవ్వండి’’.
సాక్షాత్తూ దుర్గామాతే అభయమిచ్చినట్లు పరమానందభరితులైపోయారు.
ఆరోజే కంపెనీ అధికారి వద్దకు తన గుమాస్తాని పంపింది. హుగ్లీ నది మీద ఓ పది కిలోమీటర్ల ప్రాంతం తనకు లీజుకిస్తే 10,000 రూపాయల రొక్కం ఇస్తానని ప్రతిపాదించింది.

ఒక్కసారిగా పదివేలు... అదీ ఎంతో దూరం విస్తరించి వున్న నదిలో పది కిలోమీటర్ల భాగం లీజుకిస్తే! ఎగిరి గంతేశారు.
ఆవిడో పిచ్చిదనుకున్నారు. చేపల పరిశ్రమ పెట్టడానికో, లేక కలప నానబెట్టడానికో ఉపయోగిస్తుందని భావించారు. అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలనుకుని వెంటనే అంగీకరించేశారు.
రాతకోతలయ్యాయి. లీజు ఒప్పందంలోని షరతులన్నీ క్షుణ్ణంగా చదివాకే సంతకం చేసింది రాస్మణీ దేవి. డబ్బు ఇచ్చి రసీదు తీసుకుంది.

మరుసటి రోజున ఓ కంపెనీ ప్రతినిధినీ, మత్స్యకారుల్నీ వెంటబెట్టుకుని హుగ్లీ నదిని పరిశీలించింది. మీటియా బర్జ్‌, ఘసూరి మధ్య నది విల్లులా వంగి వుంది. చేపల వేటకు అనువుగా వుంటుందని భావించి, అక్కడ పది కిలోమీటర్లు తీసుకుని గుర్తులు పెట్టించింది.

‘‘ఈ నదీ భాగం నాది. ఇక మీ ఇష్టానుసారం ఇక్కడ చేపలు పట్టుకోండి. మీరెవరికీ ఎలాంటి పన్నులూ చెల్లించనక్కర్లేదు. ఎవరికీ భయపడాల్సిన పని లేదు’’.
మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకపోయాయి. గంగామాతే ఆవిడ రూపంలో వచ్చి వరం ఇచ్చినట్టుగా వుందని పొగిడారు. పొంగిపోయారు.
పిమ్మట సాధువుని కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

‘‘ఇది ప్రారంభం మాత్రమే. మున్ముందు ఎన్నో ప్రజోపకార్యాలు చేస్తుంది. ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా దక్షిణేశ్వర్‌ కాళీ మందిరాన్ని నిర్మిస్తుంది...’’ అన్నాడు సాధువు.
అంతా అబ్బురంగా అపురూపంగా చూశారు.

‘‘ఒక శూద్ర వనిత మందిరం నిర్మిస్తుందా? ఎవరైనా వస్తారా? అసలు ఏ పూజారైనా లోపల అడుగుపెడతాడా? ఇలాంటిది కనీవినీ ఎరగం!’’ అన్నారు.
చిద్విలాసంగా నవ్వాడు సాధువు. ‘‘త్వరలోనే రాస్మణీదేవి బెనారస్‌ యాత్రకు సంసిద్ధమవుతుంది. స్వప్నంలో ఆమెకు కాళీమాత ప్రత్యక్షమై తనకు మందిరం నిర్మించమని కోరుతుంది. మందిరం కోసం హుగ్లీ పడమటి భూములు కొందామని ప్రయత్నిస్తే అగ్రకులస్తులు అమ్మనివ్వరు. అంచేత నదికి తూర్పున వున్న దక్షిణేశ్వర్‌ గ్రామంలోని సుమారు 30,000 ఎకరాలు కొని కాళీ మందిరం నిర్మిస్తుంది. మీరనుమానించి నట్టు అర్చకులుగా బ్రాహ్మణులెవరూ ముందుకు రారు. కడకు ఎక్కడ్నుంచో వచ్చిన రామ్‌ కుమార్‌ చటోపాధ్యాయ పూజారిగా కుదురుతాడు. అతడికి మందిర ఆవరణలోనే బస ఏర్పాటుచేస్తుంది’’.

ఏదో మహా విచిత్రం చూస్తున్నట్టుగా వింటోంటే, చెప్పడం ఆపి అన్నాడు సాధువు. ‘‘ఒక చిత్రం చెప్పనా. ఆ పూజారి తమ్ముడు గదాధర్‌ అక్కడి ప్రసాదం తీసుకోడు. ఎందుకో తెలుసా... మందిరాన్ని ఒక శూద్రురాలు నిర్మించిందని. భగవల్లీల చూడండి. తర్వాత అతడే రామకృష్ణ పరమహంసగా మారతాడు. ఆపైన కాళీ మందిర పూజారీ మహా ఆధ్యాత్మికవేత్తా అవుతాడు’’.

ఆ మాటలను విశ్వసించలేక, విశ్వసించకుండా వుండలేక చేతులు జోడించి వెనుదిరిగారు మత్స్యకారులు. లీజుకు తీసుకున్నాక రాస్మణీదేవి మిన్నకుండలేదు. వెంటనే మరో బృహత్తర కార్యానికి ఉపక్రమించింది.
ఎక్కడెక్కడ వున్న కమ్మర్లనీ, ఆ వృత్తి తెలిసినవారినీ పిలిపించింది. ఇనుమును కరిగించి అతి పెద్ద ఇనుప గొలుసులు తయారుచేయడానికి రింగులు పోత పోయించింది. ఒక్కో రింగూ పిల్ల ఏనుగు పాదమంత వుండటం చూసి జనం ఆశ్చర్యచకితులయ్యారు.
ఇదంతా ఎందుకో ఎవరికీ అంతుబట్టలేదు. బహుశా బంగళా చుట్టూ రక్షణ కంచెగా వేయిస్తుందేమోననుకున్నారు.

అవి తయారుకాగానే వాటిని హుగ్లీ ఒడ్డుకి తరలింపించింది. రింగులన్నీ కలిపి రెండు అతిపెద్ద గొలుసులుగా తయారుచేయించింది. తను లీజు తీసుకున్న నదీ భాగానికి హద్దులైన మెటియాబుర్జ్‌లో ఒకటి, ఘసూడీ వద్ద రెండోదీ నది మీద, ఆ ఒడ్డు నుంచి
ఈ ఒడ్డుదాకా, కట్టించింది.

నదిని గొలుసుల్తో బంధిస్తోందేమిటని విస్తుబోయారు జనం. ఆ రెండు గొలుసుల మధ్యనున్న పది కిలోమీటర్ల నదీ భాగం మీద సర్వహక్కులూ తనవేనంటూ ప్రకటించింది.
గొలుసులకు అటూ ఇటూ కూడా చిన్న పడవలూ, పెద్ద సవారీ పడవలూ, పొగ ఓడలూ అన్నీ ఆగిపోయాయి. రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.

బ్రిటిష్‌ అధికారులు బెంబేలెత్తిపోయారు.
ఆ వెంటనే నిప్పులు కక్కారు.
‘‘మా పడవలూ ఓడలూ తిరక్కుండా నదికి సంకెళ్ళు వేసి ఆపేస్తే ఎలాగ? వెంటనే తొలగించు’’ హుకుం జారీ చేశారు.

రాస్మణీదేవి పట్టించుకోలేదు. అన్నిరకాల రవాణా ఆగిపోయేసరికి నిప్పు తొక్కిన కోతులయ్యారు. హుటాహుటిన కంపెనీ అధికారి ఆమె దగ్గరకు వెళ్ళాడు.
‘‘ఇదేం పిచ్చిపని? వెంటనే గొలుసులు తీసేసి, దారి వదలకపోతే మీమీద తీవ్ర చర్య తీసుకోవాల్సొస్తుంది’’ హెచ్చరించాడు.

‘‘నేనేం నేరం చెయ్యలేదే. నా స్వంత ఆస్తిని పరిరక్షించుకోడానికి ఇనుప కంచె వేశానంతే’’ నదురూ బెదురూ లేకుండా నిబ్బరంగా చెప్పింది.
‘‘అలాగని చెప్పి మా పడవల రాకపోకలకు ఆటంకం కల్పిస్తే వూరుకోం. పర్యవసానం తీవ్రంగా వుంటుంది’’.

‘‘మన ఒప్పందాన్ని మరొక్కసారి చదవండి. ఆ పది కిలోమీటర్లూ నా వ్యక్తిగత ఆస్తి. దాన్నీ అందులోని సంపదనీ రక్షించుకునే హక్కు నాకుంది. పడవల రవాణా వల్ల నా మత్స్యసంపదకూ, చేపలు పట్టుకోడానికీ ఇబ్బంది కలుగుతోంది. నష్టం వాటిల్లుతోంది. నాకు నష్టం కలిగే పని మీరెలా చేయగలరు?’’

ఆమె లేవదీసిన లాపాయింట్‌కి అతడి బుర్ర గిర్రున తిరిగింది. నీళ్ళు నముల్తూ చూశాడు.
‘‘సొంత ఆస్తి రక్షణ హక్కు సొంతదారుడికి వుందని మీ బ్రిటిష్‌ చట్టమే చెబుతోంది. ఒప్పుకోనంటే చెప్పండి, లండన్‌ కోర్టులో కేసు వేస్తాను. కోర్టు తీర్పు వచ్చేవరకూ మీరు మీ పడవల రాకపోకల్ని పూర్తిగా ఆపెయ్యాల్సి వుంటుంది సుమా, ఆలోచించండి’’.
ఆ తెల్లవాడు తెల్లబోయాడు. అతడి దిమ్మతిరిగిపోయింది. తీర్పు ఖాయంగా ఆమె పక్షాన్నే వస్తుంది.

అసలు అందాకా సరుకు రవాణా, పాసెంజర్ల రాకపోకలూ నిలిపెయ్యాలి. ఏ రకంగానూ ధిక్కరించలేని పరిస్థితి.

‘ఒక భారతీయ స్త్రీకి- అందునా వితంతువు, ఆపైన శూద్ర వనిత అయిన ఈమెకు ఇంత తెగువ, తెలివి, ధైర్యం, సాహసం ఎలా వచ్చాయి... గంగ నీరు తాగినందునా... వంగ భూమిలో పుట్టినందునా... ఈ దేశపు గాలి పీల్చినందునా... తమతో తలపడడమే గాక, తమనే ముప్పతిప్పలు పెడుతుందంటే ఈమె నిజంగా అద్భుత వ్యక్తే... అసామాన్యురాలే... సాహసవంతురాలే’... నిలువునా ముంచెత్తిన ఆశ్చర్యం నుండి తేరుకుంటూ, అభినందన పూర్వకంగా చూస్తూ అన్నాడు కంపెనీ అధికారి...
‘‘మొదటిసారిగా మీ ముందు శిరస్సు వంచుతున్నాను. దయచేసి నదికి మీరు వేసిన సంకెళ్ళు తీసెయ్యమని అర్థిస్తున్నాను’’.

‘‘దానికన్నా ముందు మా మత్స్యకారుల స్వేచ్ఛకు మీరు వేసిన సంకెళ్ళు తీసెయ్యాలి’’ దృఢ స్వరంతో నిర్భయంగా చెప్పింది రాస్మణీదేవి.

మరి చేసేది లేక అంగీకారసూచకంగా తలాడించాడు.

చేపల వేటకు విధించిన పన్నుని ఉపసంహరించుకోవడమే కాదు, ఆమె ఇచ్చిన 10,000 వాపస్‌ చేసి ఒప్పందం రద్దు చేసుకున్నారు!

మత్స్యకారుల గుండెల్లో ఆమె రాణి రాస్మణీదేవిగా నిలిచిపోయింది!

గంగామాతతో సమానంగా ఆమెని లోకమాతగా కొలవసాగారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..