తనదాకా వస్తే కానీ..

‘‘కాఫీ, కాఫీ... అంటూ నా మానాన నేను అరుస్తూనే ఉన్నాను. మీరేమో ఏమీ పట్టనట్లు పొద్దున్నే ఆ పేపర్‌ ముందు వేసుకుని కూర్చుంటారు’’ భర్త మీద చిరుకోపం ప్రదర్శిస్తూ కాఫీ కప్పును అందించింది వరలక్ష్మి.

Published : 12 Jun 2022 01:34 IST

తనదాకా వస్తే కానీ..

- ఈదర శ్రీనివాస రెడ్డి

‘‘కాఫీ, కాఫీ... అంటూ నా మానాన నేను అరుస్తూనే ఉన్నాను. మీరేమో ఏమీ పట్టనట్లు పొద్దున్నే ఆ పేపర్‌ ముందు వేసుకుని కూర్చుంటారు’’ భర్త మీద చిరుకోపం ప్రదర్శిస్తూ కాఫీ కప్పును అందించింది వరలక్ష్మి.
ఇంటి ముందున్న లాన్‌లో కూర్చుని స్వచ్ఛమైన ఉదయపు గాలులు పీలుస్తూ ప్రశాంతంగా న్యూస్‌పేపర్‌ తిరగేస్తున్న వెంకట్రావు, భార్య మాట వినపడగానే చదువుతున్న పేపర్‌ పక్కన పెట్టి భార్య అందించిన కాఫీ కప్పును అందుకుంటూ- ‘‘వినపడలేదు, వినపడితే లేచి రాకుండా ఉంటానా, అంత కోపం ఎందుకు’’  భార్యను అనునయించాడు.

ఉదయాన్నే పచ్చని చెట్ల మధ్య కూర్చుని వాటినుండి వెలువడే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వేడివేడిగా భార్య చేతి ఫిల్టర్‌ కాఫీ తాగుతూ, న్యూస్‌పేపర్‌ తిరగేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు. అది అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది.
వెంకట్రావు ఆ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి. రిటైర్‌ అయిన దగ్గర నుండి తన ఇంటి చుట్టూ మొక్కలు పెంచడాన్ని వ్యాపకంగా పెట్టుకున్నాడు. ఇల్లు చిన్నదైనా ఇంటి ముందు లాన్‌, ఇంటి చుట్టూ మొక్కలు, ఇంటిమీద సన్నజాజి పందిరి  పెంచటంతో వెంకట్రావు ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది- పొదరిల్లు లాగా.

తను పెంచిన మొక్కలను చంటి బిడ్డల్లాగా చూసుకుంటాడు వెంకట్రావు. రోజూ ఉదయాన్నే వాటితో ఓ గంటపాటు గడిపి వాటి యోగక్షేమాలు చూసిన తర్వాతే ఏ పనైనా మొదలుపెడతాడు.
‘‘త్వరగా తాగండి, మరీ చిన్న పిల్లాడిలా తాగుతున్నారు. అవతల నాకు వంటగదిలో పని ఉంది’’ అంటూ నింపాదిగా కాఫీ తాగుతున్న వెంకట్రావును కసురుకుంది వరలక్ష్మి.
‘‘రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత అబ్బాయి ఫోన్‌ చేశాడు’’ కాఫీ తాగటం పూర్తవడంతో కప్పు భార్యకు అందిస్తూ చెప్పాడు వెంకట్రావు.
కొడుకు మాట రావడంతో అప్పటిదాకా చిటపటలాడిన వరలక్ష్మి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఎంతైనా కన్నప్రేమ  కదా?
భర్త పక్కనే కూర్చుంటూ ‘‘ఏమంటున్నాడు... కోడలు కూడా  మాట్లాడిందా? మనవళ్ళు ఏం చేస్తున్నారట?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
‘‘పిల్లలిద్దరూ ఎదిగి వస్తున్నారు కదా... అక్కడి వాతావరణం చూస్తుంటే భయమేస్తోందట. హైస్కూల్‌ పిల్లలు కూడా విచ్చలవిడిగా డ్రగ్స్‌ వాడుతున్నారట. అక్కడే కనుక పిల్లల్ని చదివిస్తే పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందట. అందుకని అబ్బాయీ కోడలూ పిల్లలూ అందరూ అమెరికా వదిలి కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చేయాలని అనుకుంటున్నారు.’’
‘‘మరి అబ్బాయి ఉద్యోగం?’’ మరో సందేహం లేవనెత్తింది వరలక్ష్మి.
‘‘వాళ్ళ కంపెనీ బ్రాంచ్‌ ఇక్కడ కూడా ఉందట. ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేయమని రెండు నెలల ముందే అడిగితే వాళ్ళు సరే అన్నారట’’ ఉద్యోగానికి ఏమీ ఢోకా లేదు అన్నట్లు వివరంగా చెప్పాడు వెంకట్రావు.
‘‘పోనీలెండి, ఇకనన్నా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. భగవంతుడు ఇన్నాళ్ళకు నా ప్రార్థన ఆలకించాడు’’ అంది గుండె నిండా సంతోషంతో వరలక్ష్మి.

*            *            *

ఓ నాలుగు రోజులు గడిచాక ఉదయాన్నే వెంకట్రావు బయటకు వెళ్ళటానికి బయలుదేరుతుండగా ‘‘ఎక్కడికండీ... ఇంత పొద్దున్నే బయల్దేరారు’’ అంటూ కాఫీ కప్పుతో ఎదురు వచ్చింది వరలక్ష్మి.
‘చెప్పాలా వద్దా’ అని ఓ క్షణం సంశయించి ఎప్పుడో చెప్పే బదులు ఇప్పుడే చెబితే మంచిదని నిర్ణయించుకున్న వాడిలా ‘‘అబ్బాయికి వాళ్ళ ఆఫీసు దగ్గర ఇల్లు వెతకడానికి వెళ్తున్నాను. ఇళ్ళ బ్రోకర్‌కి చెబితే ఈరోజు రమ్మన్నాడు. ఎండ పడకముందే వెళ్ళి వద్దామని బయల్దేరాను’’ అని తను పొద్దున్నే బయటికి వెళ్ళే విషయం భార్యకు చెప్పాడు వెంకట్రావు.
‘‘అదేమిటండీ, అబ్బాయికి ఇల్లు వెతకటం ఏమిటి? వాడికి అంత కర్మ ఏం వచ్చింది? ఈ ఇల్లు వాడిది కాదా? వాడు ఇండియాకి వస్తున్నాడంటే ఎంతో సంబరపడిపోయాను. ఒకే ఇంట్లో అందరం కలిసి హాయిగా గడపవచ్చు అని. కానీ ఇప్పుడు ఇదేమిటి? ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా కాపురం పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు వాడికి వేరు కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ వరలక్ష్మి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది.


వరలక్ష్మిని చూస్తే వెంకట్రావుకు జాలేసింది. ‘‘మన ఇల్లు చాలా చిన్నది. మన ఇద్దరికీ అంతంతమాత్రంగా సరిపోతుంది. వాళ్ళు అమెరికాలో పదేళ్ళకు పైగా ఉండి వస్తున్నారు. మన ఇల్లు నచ్చాలి కదా. వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మన ఇల్లు ఉండదు కదా! అదీకాక వాడి ఆఫీసుకు మన ఇల్లు చాలా దూరం. అందుకని వాడికి ఆఫీసుకు దగ్గరగా, వాళ్ళ అభిరుచికి తగ్గట్టు బ్రోకర్ని ఇల్లు వెతకమని అన్నాను’’ భార్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు వెంకట్రావు.
‘‘ఎంత చిన్నదైనా, ఎంత పాతదైనా ఇది వాడి సొంతిల్లండీ. అంతగా చాలకపోతే మేడమీద ఒక పోర్షన్‌ వేసి మనమే పైకి వెళ్ళి ఉందాం. ఇక దూరం అంటారా... ఎంతమంది రోజూ మైళ్ళకు మైళ్ళు ప్రయాణించి ఆఫీసులకు వెళ్ళటం లేదు. పైపెచ్చు వాడికి కారు కూడా ఉంది’’ అంటూ భర్త చెప్పే కారణాలు సహేతుకంగా లేవని తేల్చేసింది వరలక్ష్మి.
‘‘నువ్వు చెప్పేవన్నీ నిజమే అయినా, వాళ్ళు కోరుకున్న విధంగా మన ఇల్లూ మనమూ ఉండము కదా. వాళ్ళకు నచ్చినచోట వాళ్ళని ఉండనివ్వు. వాళ్ళను చూడాలనుకున్నప్పుడు ఎంతలోకి వెళ్ళి వస్తాం’’ కొడుకు వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు అని చెప్పకనే చెప్పాడు వెంకట్రావు.
‘‘మీరు చెప్పే కారణాలు చూస్తుంటే, అవన్నీ నిజం కావని నా మనసుకి అనిపిస్తుంది. వేరే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నేనే వాడికి ఫోన్‌ చేసి అసలు విషయం కనుక్కుంటాను’’ అంటూ కొడుక్కి ఫోన్‌ చేయటానికి సెల్‌ఫోన్‌ చేతిలోకి తీసుకుంది.
ఫోన్‌ చేయబోతున్న భార్యను వారించి ‘‘మనతో ఉండటం వాడి భార్యకి ఇష్టం లేదట’’ అసలు విషయం చెప్పాడు వెంకట్రావు.
ఆ మాటలు విన్న వరలక్ష్మి ఒక్కసారిగా సోఫాలో కూలబడి, ‘‘ఎందుకు ఇష్టం లేదండీ, మనం ఏం తప్పు చేశాం’’ అడిగింది జాలిగా వెంకట్రావు వంక చూస్తూ.
‘‘కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. మా అమ్మానాన్నలు ఏం తప్పు చేశారని ఆరోజు నువ్వు నా చేత వేరు కాపురం పెట్టించావు. అలాగే ఈరోజు నీ కోడలు కూడా నీ కొడుకు చేత వేరు కాపురం పెట్టిస్తోంది. తరాలు మారినా మనుషులు మాత్రం మారడంలేదు’’ అంటూ వరలక్ష్మికి గతాన్ని గుర్తు చేశాడు.
భర్త మాటలకు వరలక్ష్మి నిశ్చేష్టురాలయింది. గతంలో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఏదో ఆలోచిస్తూ గతం తాలూకు జ్ఞాపకాల సుడిలోకి జారుకుంది.

*           *           *

వెంకట్రావుది సిటీకి దగ్గర్లో ఉన్న ఓ పల్లెటూరు. పేరుకు పల్లెటూరే అయినా సిటీకి దగ్గరగా ఉండటంతో స్వచ్ఛమైన పల్లెటూరి గాలులను సిటీ తాలూకా కాలుష్యపు వాయువులు మింగేశాయి. కేవలం గాలినే కాదు, ప్రజల మనసులను కూడా కలుషితం చేసింది సిటీ వాతావరణం. సిటీకి దగ్గరగా ఉండటంతో రియల్‌ ఎస్టేట్‌ రాబందులు పచ్చని పల్లెపై వాలిపోయి పొలాలన్నీ ప్లాట్లుగా మార్చి వేశారు. వెంకట్రావు తండ్రికి కూడా రెండు ఎకరాల పచ్చటి నేల ఉంది. రియల్‌ ఎస్టేట్‌ దళారుల ప్రలోభాలకు ఏ మాత్రం లొంగిపోకుండా ఆ రెండు ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని గుట్టుగా సాగిస్తున్నాడు. వెంకట్రావు కూడా అదే ఊర్లో జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలబడడంతో ఏ కష్టాలూ లేకుండా జీవన నౌక సాగిపోతోంది. వెంకట్రావుకు వరలక్ష్మితో పెళ్ళి అయిన నాటి నుండి మొదలయ్యాయి కష్టాలు. వరలక్ష్మి కాస్తంత కలిగిన కుటుంబం నుంచి రావడం, పైపెచ్చు మొదటి నుండి సిటీ వాతావరణంలో పెరగడంతో, పెళ్ళయిన తర్వాత అత్తగారింట్లోని పల్లెటూరి వాతావరణంలో ఇమడలేకపోయింది. ‘‘చుట్టుపక్కల వాళ్ళు పొలాలను మంచి రేటుకు అమ్ముకుని, ఆ డబ్బుతో సిటీలో మంచి బిల్డింగ్‌ కట్టుకుని మిగిలిన డబ్బుతో బిజినెస్‌ చేసి కోట్లు సంపాదిస్తున్నారు’’ అని రోజూ భర్తని సతాయించేది వరలక్ష్మి.
‘‘వాళ్ళకంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి, పొలాలు అమ్ముకుని సిటీకి పోతున్నారు. మనకేం ఖర్మ, మనకు ఆ భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు’’ అని వెంకట్రావు భార్యకు ఎంత నచ్చచెప్పాలని చూసినా వినేది కాదు వరలక్ష్మి.

తన తల్లిదండ్రులు బతికున్నంతకాలం పొలం అమ్మే ప్రసక్తే లేదని వెంకట్రావు భార్యకు తెగేసి చెప్పాడు. ఇక ఎటూ పొలం అమ్మేటట్లు లేరని, వెంకట్రావును సిటీకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోమని మళ్ళీ ఒత్తిడి చేయటం మొదలుపెట్టింది. దానికి కూడా వెంకట్రావు ససేమిరా అనడంతో వరలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్యాభర్తల గొడవలు మొదటి నుండీ గమనిస్తున్న వెంకట్రావు తండ్రి- కొడుకు కాపురం సరిదిద్దాలని ‘‘పోనీ, కోడలు చెప్పినట్లే పట్నంలో కాపురం పెట్టరాదా అయ్యా? పట్నానికి మన ఊరు ఎంత దూరం అని, మీరైనా మేమైనా క్షణాల్లో ఒకరి దగ్గరికి ఇంకొకరు చేరుకోవచ్చు’’ అంటూ కొడుకుని వేరు కాపురం పెట్టించడానికి ఒప్పించాలని చూశాడు.

వెంకట్రావు తల్లి కూడా భర్తకి వత్తాసు పలికింది. తల్లిదండ్రులిద్దరూ నచ్చచెప్పడంతో వెంకట్రావు సిటీలో కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు కానీ తన ఉద్యోగాన్ని మాత్రం ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోలేదు.

సిటీలో కాపురం పెట్టి, రోజూ ఊరికి బస్సులో ఉద్యోగ నిమిత్తం వెళ్ళిరావటం మొదలుపెట్టాడు వెంకట్రావు. ఉద్యోగం  వంకతో తల్లిదండ్రుల యోగక్షేమాలు ప్రతిరోజూ ప్రత్యక్షంగా విచారించవచ్చని ఆ పని చేశాడు.

వరలక్ష్మి కూడా సిటీలో కాపురం పెట్టడంతో ఏదో ఒక రకంగా తన కోరిక తీరిందని సరిపెట్టుకుంది. సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుండి ఇంటి ఖర్చు అమాంతంగా పెరిగిపోయింది. దానికి కారణం కూడా కొంతవరకు వరలక్ష్మే. ఎదురింటివాళ్ళు పిలిచారని ఒకరోజూ పక్కింటి వాళ్ళు తోడు రమ్మన్నారని మరో రోజూ... ఇలా వారానికి నాలుగు రోజులు షాపింగుల పేరుతో పనికి వచ్చేవీ పనికిరానివీ ఎడాపెడా కొనేస్తూ ఇల్లంతా సామాన్లతో నింపటం మొదలెట్టింది.

పల్లెలో ఉండగా ఏనాడూ తండ్రిని వెంకట్రావు ఒక్క రూపాయి అడిగిన పాపాన పోలేదు. పైపెచ్చు ప్రతి నెలా ఎంతోకొంత తండ్రికి సాయం చేస్తూ వచ్చేవాడు. కానీ సిటీకి వెళ్ళిన మూడు నెలల్లోనే తండ్రిని ఎదురు డబ్బులు ఇవ్వమని అడగాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు వెంకట్రావు. అప్పటికిగానీ పల్లెటూరి విలువా, అత్తామామ అవసరం తెలిసి రాలేదు వరలక్ష్మికి.

*           *            *

కొడుకు కాలేజీ చదువులకు వచ్చేదాకా తండ్రి సహాయంతో అప్పులు చేయకుండా ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు వెంకట్రావు. కానీ కొడుకు అమెరికా వెళ్తానని తన కోరిక బయటపెట్టగానే ముందు తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వద్దనుకున్నా, తల్లీ కొడుకులు ఇద్దరూ గట్టిగా పట్టుబట్టడంతో చేసేదిలేక ఒప్పుకున్నాడు. కొడుకుని అమెరికా పంపాలంటే ఎంత లేదన్నా 10 లక్షలు కావాలి. 10 లక్షలు అప్పు అంటే మళ్ళీ వడ్డీతో కలిసి తడిసి మోపెడు అవుతుంది. ఒకవేళ ప్రావిడెంట్‌ ఫండ్‌ మీద అప్పు తీసుకుందామనుకున్నా అంత లేదు. అన్ని రకాలుగా ఆలోచించి చివరకు ఊళ్ళోని పొలం అమ్మటానికి నిశ్చయించుకుని తండ్రితో చెప్పాడు.

‘‘ఇంతకాలం ఈ భూమిని సొంత బిడ్డలా చూసుకున్నాం. ఇప్పుడు నువ్వేమో ఆ పొలాన్ని అమ్మమంటున్నావు. కనీసం మేం బతికున్నంత వరకు అన్నా అమ్మకుండా అట్టి పెట్టరాదా?’’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు వెంకట్రావు తండ్రి రాఘవయ్య.

ఆ మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకున్నాడు వెంకట్రావు. ‘‘ఏమయ్యా ఈ ఆస్తి మొత్తానికి వారసుడు మన ఒక్కగానొక్క మనవడే కదా... వాడి భవిష్యత్తుకు ఉపయోగపడని ఆస్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మనం మాత్రం ఇంకెంతకాలం బతుకుతాం’’ అంటూ వెంకట్రావు తల్లి తన భర్తకు నచ్చజెప్పడంతో కాస్త మెత్తబడ్డాడు రాఘవయ్య.

‘‘సరే, ఒక ఎకరా అమ్మి డబ్బులు ఇస్తాను. ఆ డబ్బుతో నీ కొడుకుని అమెరికా పంపు’’ అని వెంకట్రావుకి అభయమిచ్చాడు రాఘవయ్య.
తండ్రి ఒప్పుకోవడంతో కొండంత భారం నెత్తి మీద నుండి దిగిపోయినందుకు సంతోషించాడు వెంకట్రావు.
వెంకట్రావు కొడుకు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడిపోయాడు. ఆ తర్వాత ఒక్కసారి మాత్రం ఇండియాకు వచ్చాడు. అదీ కన్న తల్లిదండ్రులను చూడటానికి కాదు- తన పెళ్ళికి.
పెళ్ళయిన నెలకు మళ్ళీ అమెరికా వెళ్ళి ఇప్పటివరకు తల్లిదండ్రుల మొహం కూడా చూడలేదు. అంతా ఫోన్ల మీదే గడిచిపోతున్నాయి, అనుబంధాలు అన్నీ అలా ఫోన్లతోనే నడచిపోతున్నాయి.

*            *           *

‘‘ఏమిటో ఆలోచనలో పడ్డావ్‌...’’
వెంకట్రావు పిలుస్తుంటే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడింది వరలక్ష్మి.
‘‘ఏదో తొందరపాటున నోట్లో నుంచి వచ్చేసింది. నా మాటలు పట్టించుకోకు’’ అంటూ భార్యను ఓదార్చబోయాడు వెంకట్రావు.

‘‘మీరు పైకి నోటితో అనకపోయినా, మనసులో అనుకున్న నిజం మాత్రం మీరు అన్నదే. ఆరోజు నేను ఎంత అవివేకంగా ప్రవర్తించానో ఇప్పుడు తలుచుకుంటే నామీద నాకే అసహ్యం వేస్తోంది’’ అంటూ సిగ్గుతో తలవంచుకుంది వరలక్ష్మి.
‘‘ఏ విషయమైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు. మనం మన పెద్దవాళ్ళను గౌరవంగా చూసుకుంటే, మన పిల్లలు కూడా మనల్ని గౌరవంగా చూస్తారు.

ఆ రోజున మనం మన పెద్దవాళ్ళను దూరంగా పెట్టాం, ఈ రోజున మనవాడు మనల్ని దూరంగా పెడుతున్నాడు. ఇప్పుడు ఇంత దూరం, అంత దూరం అని బాధ పడితే ఏం లాభం’’ అంటూ కొడుకు తప్పేమీ లేదన్నట్లు భార్యను ఓదార్చాడు వెంకట్రావు.

‘‘అవునండీ, ఆ రోజున పెద్దవాళ్ళ విలువ నాకు తెలియలేదు. ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్ఛ ఉండదని చెప్పుడు మాటలు విని అలా చేశాను కానీ, అందరం కలిసి ఉంటే ఒకరికొకరం కష్టసుఖాల్లో పాలుపంచుకోవచ్చన్న జ్ఞానం లేకపోయింది. పాపిష్టిదాన్ని మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి దూరం చేశాను. అందుకేనేమో భగవంతుడు నా కొడుకూ కోడల్ని నాకు దూరం చేస్తున్నాడు’’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

‘‘దిగులుపడకు... దూరమైనా, దగ్గరైనా అంతా మన చేతుల్లోనే ఉంది. మా అమ్మానాన్నలు మనకు సాయపడటంతో వాళ్ళ విలువ మనకు తెలిసి వచ్చింది. అదేవిధంగా మనం కూడా అబ్బాయి పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తూ, అడిగినా అడగకపోయినా అవసరాలకు సాయపడుతూ ఉంటే...ఎలా అయితే నువ్వు మా అమ్మానాన్నల విలువను గుర్తించావో, అలాగే వాళ్ళు కూడా మన విలువను గుర్తిస్తారు. అప్పటిదాకా కాస్త ఓపికపట్టక తప్పదు.’’
భర్త చెప్పింది నిజమే అన్నట్లుగా తల ఊపుతూ భర్తతోపాటు కొడుక్కి మంచి ఇల్లు వెతకడానికి తనూ బయలుదేరింది... తమ మధ్య నెలకొన్న దూరం ముందు ముందు తగ్గకపోతుందా అనే ఆశతో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..