Updated : 19 Jun 2022 10:16 IST

నేటి భారతి

రేణుక జలదంకి

‘కోర్టులో సవాళ్ళు విసిరిన భారతి - నిర్ఘాంతపోయిన జడ్జి - ఆలోచించవలసిన విషయం’ అంటున్న లాయర్లు, జనం!

హాలులో నుండి పెద్దగా వినిపించిన టీవీ శబ్దానికి పడక గదిలో ముసుగుదన్ని నిద్రపోతున్న చాణక్య ఉలిక్కిపడి లేచాడు. కప్పుకున్న దుప్పటి విసిరికొట్టి హాలులోకి పరుగు తీశాడు. అతను సిటీలోని ప్రముఖ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
హాల్లోకి వచ్చి, సోఫాలో కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్న తండ్రి పక్కన కూలబడ్డాడు.

‘‘భారతి అంటే ఆ అమ్మాయేనా?’’ తండ్రి అడుగుతుంటే మౌనంగా తల ఆడించాడు.

మనసు అతని ప్రమేయం లేకుండానే మూడేళ్లు వెనక్కి- ఓ ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల సమయానికి- వెళ్ళి ఆగింది.

* * * *

ఓ ఆదివారం సాయంత్రం... చాణక్య అలవాటుగా సముద్ర తీరాన తిరుగుతూ అలలను చూస్తూ ఆలోచనలో పడ్డాడు. రేపు పత్రికకు మంచి వ్యాసం అందించాలి. తను కొత్తగా జర్నలిస్ట్‌గా ఇంత చిన్న పత్రికలో చేరటం తప్పేమో అని కూడా అనిపిస్తోంది. కానీ ఓ ఛాలెంజ్‌గా కూడా తోస్తోంది. ఈ చిన్న పత్రికలో పేరు తెచ్చుకుంటే, సులభంగా పెద్ద పత్రికలో జాబ్‌ సంపాదించవచ్చు.

ఆలోచనలలోపడి చీకటి పడిందే గుర్తించలేదు. ఇంటికి వెళ్ళడానికి ముందుకు కదిలి బైకు దగ్గరకు వస్తుండగా వినిపించింది సన్నటి మూలుగుతో కూడిన ఏడుపు.
‘అ...మ్‌...మ్మా...’ ఎవరో స్త్రీ బాధతో హృదయ విదారకంగా ఏడుస్తోంది. 
ఆ స్వరంలో నిస్సహాయత...

గాబరాగా అటు వైపు పరుగు తీశాడు. అమావాస్య దగ్గర పడుతున్నందువల్లేమో అంతా చీకటి. ఫోను టార్చి వేశాడు. బీచ్‌ను ఆనుకుని వున్న సరుగుడు చెట్లు... గుండెను పిండి వేస్తున్నట్లున్న ఆ సన్నని ఏడుపు ఆ ప్రదేశం నుండి వస్తున్నట్లుగా నిశ్చయం చేసుకున్న అతను చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. ధైర్యం తెచ్చుకుని అటువైపు అడుగులు వేస్తున్న అతని కాలికి మెత్తగా తగలడంతో ఫోను టార్చ్‌ వెలుతురులో కిందకు చూసి ఉలిక్కిపడ్డాడు. అర్ధనగ్నంగా, కింద పడిపోయి ఏడుస్తోన్న ఓ అమ్మాయి... ఆమె నోటిలో కుక్కిన బట్ట పక్కకు తొలిగి ఆమె మూలుగు గొంతులో నుండి బయటకు వస్తోంది. అంత చీకటిలో కూడా ఆమె పచ్చని దేహం, రక్తపు గాయాలు, రక్తంతో తడిసిన ఇసుక, జరిగిన ఘోరానికి సాక్షులమని మూగగా రోదిస్తూ ఉన్నాయి.

ఏం జరిగిందో అర్థమైన మరుక్షణం అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తనతోపాటు పత్రికలో పనిచేసే రామకృష్ణకు ఫోను చేశాడు. పోలీసులకంటే ముందు ఆమెను డాక్టరు దగ్గరకే తీసుకుని వెళ్ళడం ముఖ్యం అనుకున్నారు ఇద్దరూ. అంబులెన్సులో ఎక్కిస్తున్నప్పుడు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నట్లుగా చూసిన ఆమె చూపు చాణక్యను కదిలించివేసింది. ‘‘భయపడకండి, మీకేమీ కాదు. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. వాళ్ళను వదలిపెట్టకూడదు. శిక్ష అనుభవించి తీరాలి’’ వణుకుతున్న స్వరంతోనే ధైర్యం చెప్పాడు.

డాక్టరుకు తన విజిటింగ్‌ కార్డు చూపించి, పోలీసులు ఓ అరగంటలో వస్తారని చెప్పి, హాస్పిటల్లో చేర్చి, ఆమెకు స్పృహ వచ్చేలోపు ఆమె హ్యాండ్‌బ్యాగులో డిటైల్స్‌ చూసి రేపటి పత్రిక కోసం న్యూస్‌ సిద్ధం చేశాడు. మిగిలిన వివరాలు ఆమెను అడిగి రాయాలని ఎదురు చూడసాగాడు.

ఆమెకు స్పృహ రాగానే, వివరాలు కనుక్కోవాలని దగ్గరకి వెళ్ళిన అతను, భయంతో బెడ్‌ మీద వణికిపోతున్న ఆమెను చూసి చలించిపోతూ, దూరంగా ఉండిపోయాడు.  పోలీసులకు తనకు తెలిసిన వివరాలు చెప్పి, వాళ్ళు పిలిచినప్పుడు వస్తానని చెప్పి వచ్చేశాడు.

అప్పుడే తెలిసింది ఆమె పేరు ‘భారతి’ అని. ఆ తర్వాత రోజు ఉదయాన్నే హాస్పిటల్‌కు వెళ్ళిన అతను ఆమెకు తాము ఉన్నామంటూ వచ్చిన జనసందోహాన్ని చూసి, నిశ్చింతగా వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత అతను ఎప్పుడూ ఆమెను చూడలేదు. కానీ పేపర్‌ ద్వారా కేసు వివరాలు తెలుస్తూనే ఉన్నాయి.

నిందితులు ఆమె పనిచేసే ఆఫీసు దగ్గరలో ఉండే క్యాంటీన్‌లో పనివాళ్ళు అనీ, ప్రతిరోజూ ఆమె దినచర్య గమనించి, ఆదివారం అలవాటుగా బీచ్‌కు వస్తుందని తెలుసుకుని ఆమెను అనుసరించారనీ, ఆదమరచి ఉన్న సమయంలో నోటిలో గుడ్డలు కుక్కి లాక్కెళ్ళి ఈ దారుణానికి ఒడికట్టారనీ తెలిసింది.

ఈ సంఘటనతో చాణక్య పేరు సిటీ అంతా మారుమోగిపోయింది. ఓ ఏడాది తర్వాత ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూకు వెళ్ళటం, అక్కడ చేరటం, అక్కడ తన పని కూడా వేరుగా ఉండటంతో భారతి గురించే మరచిపోయాడు. కోర్టు నుండి సమన్లు వచ్చినప్పుడు వెళ్ళి సాక్ష్యం చెప్పాడు- అంతే!

ఇన్నాళ్లకు భారతి గురించి టీవీలో ఇప్పుడే వినడం! ఇంతకూ ఆ భారతి... ఈ భారతి ఒకరేనా? కోర్టులో ఏమైంది? ఇవాళే జడ్జిమెంట్‌ వస్తుందని పత్రికా కార్యాలయంలో చెప్పుకుంటుంటే విన్నాడు. దోషులకు శిక్ష పడుతుందని కూడా అనుకున్నారు. శిక్ష పడలేదా? వెంటనే తయారై కోర్టుకు బయలుదేరాడు.

* * * *

కోర్టులో- జడ్జి గారు భారతికి అనుకూలంగా తీర్పు ఇస్తూ, నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వగానే, భారతి రెండు చేతులు జోడించింది. ఆమె ముఖంలో ఎలాంటి భావాలూ కనిపించలేదు. ఆమె పక్కనే ఉన్న తల్లిదండ్రుల ముఖంలో కూడా ఎలాంటి మార్పూ లేదు.

‘‘గౌరవనీయులైన జడ్జి గారికి నమస్కారం. ఈ మూడేళ్ళుగా మీరు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం చెప్తూ వచ్చాను. ఈ రోజు నన్ను మీ బిడ్డలా భావించి, ఒక్క అరగంట నా మనసులో మాటలు చెప్పుకునే అవకాశం ఇస్తారా?’’ జోడించిన చేతులతో అడిగింది.
‘‘చెప్పండి’’ జడ్జిగారి కరిగిన హృదయం అతని కళ్ళలో కనిపించింది.

‘‘నేను ఈ సంఘటన జరగకముందు ఎప్పుడూ ఏ కోర్టులకూ వెళ్ళలేదు. అందువల్ల కొన్ని విషయాలు నాకు తెలియవు. ఆ రోజు నాకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు నా దగ్గర రుజువులు అన్నీ తీసుకున్నారు. అక్కడ జరిగిందంతా తెలుసుకున్నారు. నేను అంతటితో కోర్టు నిందితులను మాత్రమే కోర్టుకు పిలిచి విచారిస్తుందనీ శిక్ష విధిస్తుందనీ అనుకున్నాను. కానీ, నన్ను కూడా మీరు కోర్టుకు పిలిచారు. పదేపదే జరిగిన సంఘటన గురించి అడిగారు. ఇలా ఎందుకు చేశారో తెలుసుకోవాలని ఉంది. ఇన్నాళ్ళూ ఎందుకు అడగలేదంటారేమో... అలా అడగడం వల్ల నాకు న్యాయం జరగదేమో అని ఆగాను. కానీ, రేపటి నాలాంటి అభాగినుల కోసం అడగాలని ఉంది.’’

‘‘చెప్పకపోతే, మళ్ళీ మళ్ళీ అడగకపోతే నిజానిజాలు కోర్టుకు ఎలా తెలుస్తాయి?’’ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అందుకున్నాడు.
‘‘ఒకవేళ ఆ అత్యాచార ఘటనలో నేను చనిపోయి ఉంటే..? అప్పుడు ఎవరిని అడిగేవారు?’’ ఆమె స్వరం ఓ మాస్టారుని స్టూడెంట్‌ అడుగుతున్నట్లుగా వినయంగా ఉంది.

‘‘అప్పుడు అక్కడి ఆధారాలు సేకరించిన పోలీసుల్నీ మిగతా సిబ్బందినీ విచారణకు పిలుస్తాం.’’
‘‘నా విషయంలో కూడా ఆ ఆధారాలు ఉంటాయి కదా?’’
‘‘నేరం జరిగినట్లు ఫిర్యాదు చేసిన బాధితురాలు తన సాక్ష్యం వినిపించాలి- అది చట్టం.’’

‘‘బాధితురాలు లేకుండా విచారణ ఎందుకు చేయకూడదు?’’ ఆమె స్వరంలో తెలుసుకోవాలన్న తపన తప్ప వాదనకు దిగినట్లుగా మాత్రం లేదు.
‘‘అదెలా? అవతలివారు తాము ఆ నేరం చేయలేదంటే...’’
‘‘బాధితురాలు మరణించినప్పుడు కూడా నిందితులు అదేమాట అంటున్నారు. అప్పుడు ఏ ఆధారాలతో వారిని నేరస్తులని రుజువు చేయగలుగుతున్నారు?’’

‘‘ఆ రోజు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలూ ఆమె ఒంటి మీదా బట్టల మీదా అంటిన వారి స్పెర్మ్‌ ఆధారంగా కూడా నిర్ణయించగలం.’’
‘‘అదే పని ఆమె బతికి ఉన్నప్పుడు కూడా ఎందుకు చేయకూడదు?’’
‘‘అంటే..?’’
‘‘ఒక్కసారి ఓ స్త్రీ తన మీద అత్యాచారం జరిగిందని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆమెను మళ్ళీమళ్ళీ కోర్టుకు పిలవడం ఎంతవరకూ సమంజసం..?

ఆ రోజు నలుగురి మానభంగం నా శరీరాన్ని చిత్రవధ చేస్తే ఈ రోజు ఎన్నో వేలమంది చూపులు నన్ను హింసిస్తున్నాయి. ఆ రోజు చనిపోకుండా ఎందుకు బతికి ఉన్నానా అని ప్రతి రోజూ బాధపడుతున్నాను.
ఆ సంఘటన జరిగే వరకు స్నేహితులతో సంతోషంగా గడిపిన నేను ఇప్పుడు ఆనందంగా పదిమందిలో గడపగలనా? ఓ ఛలోక్తి ఎవరి మీదైనా సునాయాసంగా విసిరే నేను ఇకముందు అలా ఉండగలనా?’’
‘‘అంటే, ఇప్పుడు నీకు న్యాయం జరగలేదంటావా?’’ జడ్జిగారు మెత్తని స్వరంతో అడిగారు. 

‘‘ఆ న్యాయం జరిగే క్రమంలో ఎంతో కోల్పోయాను అంటున్నాను సర్‌.’’
‘‘నేరాన్ని రుజువు చేయాలంటే ఇదంతా తప్పదు. నిందితుడు నేరస్తుడు అవునో కాదో తెలియాలంటే విచారణ జరగవలసిందే.
అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి?’’ ఈసారి జడ్జిగారు ప్రశ్నించారు.

‘‘ఇలాంటి కష్టం వచ్చినప్పుడు స్త్రీలు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ స్త్రీ పేరూ ఊరే కాదు, అత్యాచారం జరిగింది ఫలానా యువతి మీదేమో అని ఊహించదగ్గ ఏ చిన్న ఆధారమూ కూడా బయట ప్రపంచానికి తెలియకూడదు. అప్పుడే ఆమె తన జీవితం- ముందు జీవితంలా గడపగలదు.’’
‘‘మరి, విచారణ జరపకపోతే తప్పుడు కేసులను ఎలా కనిపెట్టగలం?’’ లాయరు ప్రశ్నించాడు.
‘‘తప్పుడు కేసులా... అంటే..?’’ విచిత్రంగా చూసింది ఆమె.

‘‘కొంతమంది స్త్రీలు ఏదో కారణంతో పురుషులను ఇరికించాలని తప్పుడు కేసులు పెడుతుంటారు. అప్పుడు పురుషులు అన్యాయంగా బలైపోరా?’’
భారతి అయోమయంగా చూసింది.
నలుగురు పురుషులు తన మీద అత్యాచారం చేశారని ఓ స్త్రీ తప్పుడు కేసు పెడుతుందా?!

‘‘అలాంటప్పుడు తప్పుడు కేసులకూ నిజమైన కేసులకూ తేడా గుర్తించే నైపుణ్యం కోర్టులకు ఉండదంటారా? నిజంగా ఓ స్త్రీ తనను నలుగురు బలాత్కరించారని అబద్ధం చెప్పి కోర్టుకు ఎక్కగలదా? తేడా మీకు ఆ రోజే అర్థం అవుతుంది కదా?’’

‘‘సరే, ఫిర్యాదుదారు నుండి ఫిర్యాదు రహస్యంగా తీసుకుంటాం. నిందితుల మీద కేసు బుక్‌ చేయాలంటే, వారి తల్లిదండ్రులూ బంధువులూ ఒప్పుకుంటారా? వారు ఫలానా నేరం చేశారని చెప్పాలి కదా. అప్పుడైనా బాధితురాలి పేరూ ఊరూ బయటకు వస్తాయి కదా.’’
‘‘ఎందుకు? నేరస్తుడు చేసిన నేరం చెప్తారు. బాధితురాలి ఊరూ పేరూ ఎందుకు? అప్పటి నుండే బాధితురాలి వివరాలు ఎందుకు దాచి పెట్టకూడదు? రహస్య విచారణ ఎందుకు జరపకూడదు? ఆమె కేసు పెడుతున్నప్పుడు మాత్రమే ఆమె నుండి కావలసిన వివరాలన్నీ రాబట్టుతారు. ఆ తర్వాత ఆమె కోర్టుకు తిరగకుండా చూసుకునే బాధ్యత కోర్టులే చూసుకుంటే..?’’

‘‘అంటే, మీరు చెప్తున్నదేమిటి?’’
‘‘ఇలాంటి అత్యాచార కేసుల విషయంలో పనిచేసేందుకు రహస్య న్యాయ వ్యవస్థ ఉండాలి. అక్కడ అంతా స్త్రీలే ఉద్యోగులుగా ఉండాలి. అప్పడే బాధితురాలు సంకోచం లేకుండా తన బాధ నివేదించగలదు. బాధితురాలి జీవితంలో అత్యాచారం జరగక ముందూ జరిగిన తర్వాతా ఎలాంటి మార్పు ఉండకూడదు. ఆమె కోలుకున్న మరుక్షణం తన సాధారణ జీవితం సాగించగలగాలి.

ఓ చేయని నేరం మోస్తున్నప్పుడు నిందితుడు బాధను అనుభవిస్తూ ఉంటాడు. ఆ నేరం అతను చేయలేదని రుజువు అయినప్పటికీ కొందరి దృష్టిలో అతను నేరస్తుడుగానే ఉండిపోవచ్చు. అక్కడ అతను నిందితుడు కాబట్టి ఆ భారాన్ని మోయక తప్పదు. మరి ఏ నేరం చేసిందని ఆ అమాయకపు స్త్రీ జీవితాంతం నేరాన్ని మోయాలి? తనది కాని నేరానికి బలైపోయి, దోషిలా చింతించడం ఏమిటి..?’’

‘‘అంటే, ఆమె మీద అత్యాచారం జరిగినట్లే ప్రపంచానికి తెలియకూడదు... అంతేనా మీరంటున్నది?’’
‘‘ప్రపంచానికే కాదు, ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియకుండా కాపాడుకోవచ్చు.’’
‘‘ఇంకా నయం, ఆమె కాబోయే భర్తకు కూడా తెలియకూడదు అన్నారు కాదు’’ లాయరు స్వరంలో కొద్దిగా వ్యంగ్యం ధ్వనించింది.

‘‘తప్పేముంది? అది ఆమె నిర్ణయం. అది శరీరానికి పొరపాటున అయిన ఓ గాయమనో, పొరపాటున బురదలో జారి పడిందనో ఆమె అనుకుంటే చెప్పదు. అంతకుమించి ఏదో ఉందనీ భర్త దగ్గర దాచి పెట్టడం తప్పనీ ఆమె భావిస్తే చెప్పుకుంటుంది. అది పూర్తిగా ఆమె ఆంతరంగిక విషయం.’’

‘‘ఇదంతా జరిగే పనేనా?’’

‘‘ఎందుకు జరగదు. ఇంతకుముందు ఇన్ని వ్యవస్థలు ఉన్నాయా, తర్వాత పుట్టుకు రాలేదూ? ప్రభుత్వం తలచుకుంటే ఏమైనా చేయగలదు. ఓ అత్యాచారం జరగగానే ఆమె నుండి ఫిర్యాదు అందుకున్న మరుక్షణం- ఆమెకు వైద్య సహాయం అందించడం దగ్గర నుంచీ కేసు పెట్టడం వరకూ అంతా రహస్యంగానే జరగాలి. అత్యాచారం జరిగినట్లు కొన్నాళ్ళకు ఆమే మరచిపోయేలా సాగాలి దర్యాప్తు. అంటే ఆమె వద్ద తీసుకున్న రుజువులూ ఆధారాలతో కేసు సాగాలి. నేరం పూర్తిగా రుజువు అవడమో, లేదా నిర్దోషులుగా బయటికి రావడమో జరిగే వరకూ నిందితులకు బెయిలు ఇవ్వకూడదు.’’

‘‘అత్యాచారం జరిగినట్లు ఆమె మరచిపోవడమా... అది సాధ్యమేనా?’’ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ విస్తుపోయాడు.

‘‘పదే పదే గుర్తు చేసేవారు లేకపోతే మరచిపోవచ్చేమో! కానీ, అది సాధ్యం కాదని మీరే చెప్తున్నారు. చేయని నేరానికి ఆమె జీవితాంతం ఆ శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. అది చాలదన్నట్లు జనం వంకర మాటలతో, సానుభూతి చూపులతో ఆమె, తన తల్లిదండ్రులూ అయినవారూ ఎందుకు కుంగిపోతూ బతకాలి?

ఇన్నాళ్ళుగా- నేనూ నా తల్లిదండ్రులూ బయట తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాం. మనసారా నవ్వలేకపోతున్నాం. నా నవ్వు ఎవరైనా గమనించారేమో అని వెంటనే దిక్కులు చూస్తున్నాను.. సానుభూతి, పరామర్శల పేరుతో- ఎవరూ లేకుండా ఒంటరిగా ఎందుకు వెళ్ళావనో, ఆ సమయం వరకూ బయట ఉండటం ఎందుకనో అడిగే వారి మాటలకు సమాధానం చెప్పలేక ఎంత కుంగిపోయానో, తీరా కోర్టులో అత్యాచార ఘటన గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కూడా ఎంత క్షోభను అనుభవించానో నాకు తెలుసు.

స్త్రీలకు ప్రమాదం జరగకుండా కాపాడటానికి ఎన్నో యాప్‌లూ ఎన్నో చట్టాలూ తీసుకొచ్చారు. ఆర్థికపరమైన చేయూతనిస్తున్నారు. వీటన్నిటితోపాటు వారు వారుగా బతకడానికి మానసికమైన చేయూతనివ్వండి. ఇది నా ప్రార్థన.’’
ఆమె స్వరంలో ధ్వనిస్తున్నదేమిటి? మానవ మృగాల అత్యాచారాల ధాటికి తట్టుకుని నిలబడినా, నరం లేని నాలుకల ధాటికి చిత్రవధ చేయబడిన వేలాది మహిళల అంతరంగపు ఆక్రోశమా... ఆక్రందనా... లేక వారందరి తరఫున ఆమె విన్నపమా..?
జడ్జి గారి కళ్ళకు ఆమె అస్పష్టంగా కనిపించడంతో కళ్ళు తుడుచుకున్నారు.

బయటకు నడుస్తున్న ఆమెను చుట్టుముట్టిన పత్రికా విలేఖరులనూ టీవీ యాంకర్లనూ దాటుకుని ముందుకు అడుగువేస్తున్న ఆమెకు, అప్పుడే జనంలో నుండి వడివడిగా వస్తున్న చాణక్య కనిపించాడు. ఆమె అతన్ని గుర్తించినట్లు చూడగానే, అతను దగ్గరగా వచ్చి, ‘‘దోషులకు శిక్ష పడింది... కంగ్రాట్స్‌’’ అన్నాడు ఉద్వేగంగా.

‘‘దోషులు మాత్రమే శిక్షించబడ్డారని మీరు భావిస్తున్నారా?’’ అతన్ని సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఆమె. ‘నీకు తోడుగా ఉన్నా’మన్నట్లుగా ఆమె కళ్ళ నిండుగా నీళ్ళు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..