పిల్లల పెత్తనం

ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలు. విశ్వం టిఫిన్‌ చేసి తీరిగ్గా పేపర్‌ చూస్తున్నాడు. పిల్లలిద్దరూ మరో గదిలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. హాసిని పెద్ద అమ్మాయి, ఇంటర్మీడియట్‌ చదువుతోంది. నిశాంత్‌, పదో తరగతి చదువుతున్నాడు.

Published : 31 Jul 2022 00:38 IST

పిల్లల పెత్తనం

- షేక్‌ అహమద్‌ బాష

దివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలు. విశ్వం టిఫిన్‌ చేసి తీరిగ్గా పేపర్‌ చూస్తున్నాడు. పిల్లలిద్దరూ మరో గదిలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. హాసిని పెద్ద అమ్మాయి, ఇంటర్మీడియట్‌ చదువుతోంది. నిశాంత్‌, పదో తరగతి చదువుతున్నాడు.

నిర్మల కూడా వచ్చి భర్త పక్కన కూర్చుంది. విశ్వం పిల్లలిద్దరినీ పిలిచాడు.

‘‘ఏం చేస్తున్నారు, కాస్సేపు నాతో కబుర్లు చెప్పకూడదూ?’’ చిరునవ్వుతో అడిగాడు విశ్వం. అతనో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎక్కువగా టూర్లు ఉంటాయి. కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువ. పిల్లలన్నా, భార్య అన్నా అతనికి ఎంతో ఇష్టం, ఇంట్లో ఉన్న రోజు వారితో గడిపేందుకు ఇష్టపడతాడు. పిల్లలకూ తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రి అలా పిలుస్తూనే హాసిని తండ్రి పక్కన వాలిపోయింది. నిశాంత్‌ తల్లి పక్కన చేరాడు.

‘‘ఎలా చదువుతున్నారు? వీలున్నప్పుడు అమ్మకు పనుల్లో సాయం చేస్తున్నారా?’’

‘‘బాగా చదువుకుంటున్నాం నాన్నా, నేను ఇంట్లో పనుల్లో అమ్మకు సహాయం చేస్తున్నాను, అమ్మ మాకు లంచ్‌ బాక్స్‌ తయారుచేసేసరికి నేను ఇల్లు ఊడ్చేస్తాను, బట్టలన్నీ వాషింగ్‌ మిషన్‌లో వేస్తాను. ఇక తమ్ముడు రోజూ బయటనుంచి కావలసిన కాయగూరలూ, అమ్మ చెప్పే ఇంకేమన్నా వస్తువులూ తీసుకుని వస్తాడు... కానీ ఒకటే సమస్య నాన్నా’’ ఆగింది హాసిని. తల్లీ, తమ్ముడూ ఆమె వైపు కుతూహలంగా చూశారు.

నవ్వుతూ అడిగాడు విశ్వం ‘‘ఏం సమస్యమ్మా?’’ ‘‘నాన్నా, వాడు రోజు మార్చి రోజు వంకాయలు తెచ్చి అదే వండమని అమ్మను గొడవ చేస్తాడు’’ అందరూ నవ్వారు.

నిశాంత్‌ చిన్నబుచ్చుకుని ‘‘నాకు వంకాయ లంటే ఇష్టం, మరి నీకోసం వేరే కూరగాయలు కూడా తెస్తున్నాగా’’ నిష్టూరంగా అన్నాడు. ‘‘మరి రోజూ ఇద్దరికీ రెండురకాల కూరలు చెయ్యాలంటే అమ్మకు కష్టం కదా?’’ వివరణ ఇచ్చింది.

అలా సరదాగా సమయం గడుపుతున్న పిల్లలను అడిగాడు విశ్వం ‘‘మరి మీరు స్కూల్‌ పుస్తకాలే చదువుతున్నారా, లేక నేను తెచ్చిపెట్టిన కథల పుస్తకాలు కూడా చదువుతున్నారా?’’ ఇద్దరూ తలలు వంచుకున్నారు.

హాసిని మెల్లగా చెప్పింది ‘‘స్కూలు పుస్తకాలు చదువుకుని, హోంవర్క్‌ చేసేదానికే టైమ్‌ సరిపోవడం లేదు నాన్నా, మరి కథలు ఎప్పుడు చదవాలి?’’

విశ్వం మెల్లగా చెప్పాడు ‘‘చూడు హాసినీ, మనం స్కూల్లో చదివేది ఎంత ముఖ్యమో, బయట ప్రపంచాన్ని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం చదివే చదువు మనకు ఒక మంచి ఉద్యోగాన్నో, డబ్బూ హోదా ఉన్న మంచి జీవితాన్నో ఇస్తుందనడంలో సందేహం లేదు, కానీ జీవితమంటే కేవలం ధనార్జనే కాదు, ధనం మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది, కానీ మనలో ప్రేమ, ప్రశాంతత, స్నేహం, బాధ్యత, నిజాయతీ అనే మానవత్వపు లక్షణాలను ఈ పుస్తకాలే కలిగిస్తాయి. ఇవి చదివితే సమయం వృథా అనుకోకూడదు, నిజానికి చక్కని విలువలులేని జీవితమే వృథా. సరే, మీకోసం ఒక మంచి పుస్తకం తెచ్చాను, నా బ్యాగులో ఉంది, తీసుకురా’’ అని చెప్పాడు. హాసిని తండ్రి క్యాంప్‌ బ్యాగ్‌ నుంచి ఒక తెలుగు కథల పుస్తకం తెచ్చింది. అది నిశాంత్‌ చేతికిచ్చి మొదటి కథ గట్టిగా చదవమన్నాడు. వాడు చిన్నగా చదవసాగాడు. అక్కడక్కడా తప్పులను సవరించి పోత్సహించాడు. చదవడం అయిష్టంగా మొదలెట్టిన నిశాంత్‌ కథ నచ్చేసరికి ఎంతో ఇష్టంగా, కుతూహలంగా చదవసాగాడు. రచయిత ఆ కథ ముగించిన తీరుకు చివరలో హాసిని చప్పట్లతో తన సంతోషాన్ని ప్రకటించింది. నిశాంత్‌ కూడా చాలా సంతోషంగా కనబడ్డాడు.

‘‘మీకు ఈ కథ నిజంగా నచ్చిందా, మీకు సంతోషం కలిగిందా?’’ విశ్వం మెల్లగా అడిగాడు.

‘‘సంతోషమా నాన్నా, అంతా ఇంతా కాదు, అసలు కథలు ఇంత బాగుంటాయని నాకు ఇంతవరకూ తెలియదు’’

‘‘అవును నాన్నా, మొదట్లో చదివేదానికి నాకు అంత ఇష్టం లేదు, కానీ మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదని చదవడం మొదలుపెట్టానా, మెల్లగా ఆ కథలో లీనమై పోయాను’’ నిశాంత్‌ చెప్పాడు.

‘‘చూశారా, మీరు ఎంత ఆనందాన్ని ఇన్ని రోజులుగా కోల్పోయారో, మరి ఇకనైనా రెగ్యులర్‌గా పుస్తకాలు చదువుతారా?’’

‘‘ఇక మీదట రోజూ కథల పుస్తకాలు చదువుతాం నాన్నా’’ ఇద్దరూ ముక్తకంఠంతో చెప్పారు.

‘‘సరే, ఈ కథ నీతి ఏమిటి?’’ అడిగాడు విశ్వం.

‘‘జీవితంలో అత్యాశ ఉండకూడదు, అత్యాశ ఉంటే అది దుఃఖానికి దారితీస్తుంది’’

‘‘చూశారా, ఒక చిన్న కథ మీకు ఎంత మంచి విషయాన్ని తెలియచెప్పిందో, పుస్తకాలు మనకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా మన జీవితం ఒడుదొడుకులు లేకుండా సాగిపోవడానికి సహాయం చేస్తాయి. ప్రతి రచయితా ఒక్కో సమస్యను చర్చించి, జీవితం కలిగించే అనేక అనుమానాలను తీర్చి ఒక కొత్త దారిని చూపిస్తాడు. సరే, ఈ రోజు పేపరు తీసుకు రండి’’ పిల్లలిద్దరూ ముఖాలు చూసుకున్నారు. నిశాంత్‌ ఒక తెలుగు, ఒక ఆంగ్ల దినపత్రికలను తెచ్చాడు.

‘‘భయపడకండి, వీటిల్లో మీకు ఎలాంటి ప్రశ్నలూ వేయను, వీటిని మీరు చదవడం లేదని నాకు తెలుసు’’ అన్న మాటలకు ఇద్దరూ నవ్వారు. ‘‘కానీ నేను ఇంట్లో ఎక్కువ రోజులు లేకున్నా ఇవెందుకు తెప్పిస్తున్నానూ... మీరూ, అమ్మా చదువుతారని. అమ్మ చదువుతుంది, కానీ మీరు కేవలం స్పోర్ట్స్‌ పేజీ మాత్రం చూస్తారని చెప్పింది. మీరు స్కూల్లో, కాలేజీల్లో చదివే చదువుతో ఒక డిగ్రీ తీసుకుని బయటపడతారు. అలా ప్రతి సంవత్సరం దేశంలో కనీసం కోటి మంది చదువు పూర్తి చేసుకుని వస్తారనుకుందాం, కానీ బయటి ప్రపంచంలో అన్ని ఉద్యోగాలు కానీ, ఉపాధి పథకాలు కానీ ఉండవు. మరి కంపెనీలు కానీ, ప్రభుత్వం కానీ ఎవర్ని ఎంపిక చేసుకుంటాయి? డిగ్రీతోపాటు మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్నవారినీ, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిశోధనల గురించి జ్ఞానం ఉన్నవారినీ, కొత్త విషయాల్లో శ్రద్ధ చూపించే వారినీ మాత్రమే ఎన్నుకుంటారు. పేపర్లు చదివితే మీకు జనరల్‌ నాలెడ్జ్‌తోపాటు భాష మీద మంచి పట్టు వస్తుంది. అప్పుడు మీరు సులభంగా ఇతరులతోగానీ, ఇంటర్వ్యూలలో జరిగే చర్చలోగానీ ధైర్యంగా పాల్గొంటారు. భాష మీద పట్టు లేకపోతే మీరు ఎలాంటి చర్చలో పాల్గొనలేరు. మీరు ఇప్పుడే రాజకీయాలను చదవనక్కరలేదు. చూడండి, ఈ తెలుగు పేపర్లో ఈమె ఎంతో కష్టపడి ఒక పరిశ్రమను స్థాపించి, ఈరోజు ఎందరికో ఉద్యోగాలు ఇచ్చిన వార్త వచ్చింది. ఇలాంటివి చదివినప్పుడు, మనకు ఒక స్ఫూర్తి కలగడమే కాకుండా మనం కూడా ఒక కొత్త పద్ధతిని కనిపెట్టగలం. ఈ అమ్మాయిని చూడండి, తను ఎలా జర్మనీలో చదువుకుందో, అలా చదువుకునేందుకు ఏం చేయాలో రాసింది. ఇక ఈ ఇంగ్లీష్‌ పేపర్‌లో ప్రతి ఆదివారం అనేక విషయాలపైనా, కొత్త పరిశోధనలపైనా, సమస్యలపైనా వ్యాసాలు వస్తాయి. ఆంగ్లంలో కొత్త పదాలను పరిచయం చేస్తూ, వాటిని అనేక వాక్యాలలో ఉపయోగించి చూపిస్తారు. ఇలాంటివన్నీ చదువుతూ ఉండాలి. డిగ్రీ అయిన తర్వాత ఇవన్నీ చదవడం మొదలు పెట్టడం అంటే ఆలస్యమైపోతుంది. రేపట్నుంచీ ఇద్దరూ ఇవన్నీ చదువుతారు కదూ.’’

ఇద్దరూ తలూపారు. ‘‘చూడు హాసినీ, నువ్వు వీడికంటే పెద్దదానివి, కనుక వాడికి ఏవైనా అనుమానాలు వస్తే చెప్పు, అలాగే మీ ఇద్దరికీ తెలియనివి అమ్మను అడగండి. ఇక మీదట మీరిద్దరూ రోజూ ఒక కథ చదవాలి, కనీసం ఒక అరగంట పేపర్లు చదవాలి, ఇద్దరికీ చెరో డైరీ ఇస్తున్నాను. అందులో మీరేం చదివారో క్లుప్తంగా రాయండి. నేను ఆదివారం వచ్చినప్పుడు వాటన్నిటిపైనా చర్చిద్దాం. ఎవరు బాగా చర్చిస్తే వారికి కోరుకున్న బహుమతి ఇస్తాను’’. నిర్మల చిరునవ్వుతో తండ్రీ పిల్లల మాటలు వింటూ మధ్యలో కొన్ని సలహాలు ఇస్తోంది. ఇద్దరి చదువూ ఆమే పర్యవేక్షిస్తుంది కనుక వారి గురించి బాగా తెలుసు. ఆమె ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ మీదనే విశ్వం పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఇద్దరూ అంగీకరించారు.

‘‘సరే ఇప్పుడు మరో కొత్త విషయం మాట్లాడుకుందాం. ఈ నెల నుంచీ మనింట్లో పెత్తనమంతా మీదే. నేను ఎక్కువగా బయట తిరుగుతుంటాను, ఇక అమ్మ ఇంటిపనితో  తీరిక లేకుండా ఉంటుంది. కనుక మీరిద్దరే అమ్మ సహాయంతో మన కుటుంబానికి కావలసిన వస్తువులన్నీ కొనండి, బియ్యంతో సహా. చూడండి, నాకు అన్నీ పోను ఇరవై ఎనిమిది వేలు చేతికి అందుతుంది. అంటే నా ఇన్సూరెన్స్‌, మనం కట్టుకున్న కొత్తింటి అప్పు, మీ చదువులూ పెళ్ళిళ్ళకూ అవసరమయ్యే ఖర్చు కోసం ప్రతి నెలా పదివేల రూపాయల ఆర్‌.డి... ఇలాంటివన్నీ పోగా ఇరవై ఎనిమిది వేలు వస్తుంది. నా జీతం బ్యాంకుకు వస్తుంది. కనుక, ఇకమీదట అమ్మ ఏటీఎం నుండి నెలనెలా మన ఇంటి ఖర్చులకు ఎంత కావాలో అంత మీకు తీసిస్తుంది. ఆ డబ్బుతో మనింట్లో ఏమి వండాలో, ఎలా ఖర్చు చేయాలో మీరే నిర్ణయించండి. నేనుంటే నేనూ లేదా అమ్మా మీకు సహాయం చేస్తాం. ఆ డబ్బు లోంచే మీ స్కూల్‌ ఫీజులూ, మీకు కావలసిన పుస్తకాలూ అన్నీ తీసుకోవాలి’’. పిల్లలు అతనివైపు ఆశ్చర్యంగా చూశారు. ఒకవైపు సంతోషం, మరోవైపు ఈ బాధ్యత ఎలా నిర్వహించాలి అనే సందిగ్ధత వారి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కనబడింది.

‘‘మీరేం కంగారుపడొద్దు, రెండు నెలల్లో మీకు అన్నీ తెలుస్తాయి. ఆఁ, చెప్పడం మరిచిపోయాను, ప్రతినెలా ఐదు వందలు పాకెట్‌ మనీ తీసుకోండి, అది మీరెలా ఖర్చుపెడతారో అమ్మా నేనూ అడగం’’
ఆ నెల నుండే పిల్లలు కుటుంబ భారాన్ని తలకెత్తుకున్నారు. తల్లి పర్యవేక్షణలో ఎంత బియ్యం, నూనెలు, పప్పులు కొనాలో తెలుసుకున్నారు. ఖర్చు అయిన ప్రతి పైసా తమకిచ్చిన డైరీలో రాస్తున్నారు. మూడు మాసాల్లోనే ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నారు.

ఓ రోజు నిశాంత్‌ తల్లితో చెప్పాడు ‘‘అమ్మా, ఇకమీదట పిజ్జాలూ, బర్గర్లూ మానేద్దాం, వాటికే ఎక్కువ ఖర్చు అవుతోంది, వాటికయ్యే ఖర్చులో సగం డబ్బులకే నువ్వు యూట్యూబ్‌ చూసి ఇంకా రుచిగా ఉండేవి చేయగలవు’’.

హాసిని కూడా తమ్ముడికి వంత పాడింది. నిర్మల ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయింది. అంతకుముందు డబ్బులేదనో, వాటికి ఎక్కువ ఖర్చవుతుందనో చెబితే తనతో వాదించి, ఒక్కోసారి యుద్ధం ప్రకటించే పిల్లలేనా ఇలా మాట్లాడుతున్నారు అనుకుంది. కుటుంబ బాధ్యతా, దినపత్రికల ప్రభావం వారిమీద బాగా పనిచేస్తోందని ఆనందపడింది.

నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు పిల్లలు తెలుగుతో బాటు ఆంగ్ల నవలలు కూడా చదువుతున్నారు. ఇంట్లో పుస్తకాలు పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక ర్యాక్‌ చేరింది. ఇద్దరూ ఇంజినీరింగ్‌కు వచ్చారు. పిల్లల పెత్తనంలో తల్లిదండ్రులు సంతోషంగా, ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు. డబ్బు విలువ తెలిసిన పిల్లలు ఎంతో పొదుపుగా, ఆరోగ్యంగా జీవించడం నేర్చుకున్నారు. ఇంటి పరిస్థితులు అర్థం చేసుకున్న పిల్లలతో సమస్యలేముంటాయి! వారు చదువుతున్న పత్రికలూ, పుస్తకాలూ ఇచ్చిన ఆధునిక విజ్ఞానంతో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు. ఏ విషయంపైన చర్చ వచ్చినా చక్కగా మాట్లాడుతున్నారు. నిర్మలా విశ్వంలు వారి రహస్య పర్యవేక్షణను మాత్రం సడలించలేదు. బయట ప్రపంచంలో అనేక చెడు శక్తులు విజృంభిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు పిల్లలకు పరిపక్వత వయస్సు వచ్చేవరకూ వారిని గమనిస్తూ ఉండాలనీ, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనివారూ, అతి గారాబం చేసే వారి పిల్లలు మాత్రమే గాడి తప్పుతున్నారనీ వారు గ్రహించారు.

సాఫీగా సాగుతున్న సంసారంలో ఉన్నట్లుండి ఒక సంక్షోభం వచ్చింది. విశ్వం స్వభావం కాస్త ప్రత్యేకమైనది. అతను టూర్లు వెళ్లినప్పుడు తనతోపాటు చేరే ఇతర అధికారులతో కలిసి డ్రింక్స్‌, పేకాట లాంటి అలవాట్లకు దూరంగా ఉంటాడు. మార్కెటింగ్‌ అనేది ఒక ప్రత్యేక ప్రపంచం. దానిలో విశ్వం ఇమడలేకపోయినా తన బాధ్యతను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కంపెనీ వ్యాపారంలో ఎప్పుడూ ముందుండి, తనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవడం, పిల్లలని బాగా చదివించుకోవడం, ఎలాంటి కుటుంబ సమస్యలూ లేకపోవడం చూసి కొందరికి కంటగింపు అయి అసూయకు దారితీసింది. సేల్స్‌ కాస్త తగ్గినప్పుడు అతనికి రెండు నెలల జీతం ఇచ్చి కంపెనీ అతన్ని బయటకు పంపింది. అతనికి సహాయం చేసేవారు కరవయ్యారు. ఈ విషయం భార్యకు తప్ప పిల్లలకు చెప్పలేదు. కొన్ని కన్సల్టెన్సీలకు అప్లికేషన్లు పెట్టుకున్నాడు. కొన్ని ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. కానీ పాత ఉద్యోగంలో వచ్చిన జీతానికి తగ్గ ప్యాకేజీ రావడంలేదు. తండ్రి టూర్లకు పోకపోవడం, కాస్త దిగులుగా ఉండడం, తల్లి ఇంట్లో ఖర్చులను బాగా తగ్గించడం పిల్లలు గమనించారు. ఒక నెల గడిచింది. విశ్వానికి సరైన ఉద్యోగం దొరకలేదు. ఒకరోజు తల్లిదండ్రులు తమ గదిలో ఆర్థిక పరిస్థితులను చర్చించుకోవడం పిల్లలు విన్నారు. పిల్లల పేరుతో ఆదా చేసిన డబ్బును తీసి వాడుకుందామనీ, దానితో ఇంటి మీద ఉన్న అప్పూ నెలవారీ కంతులూ తీర్చమనీ నిర్మల భర్తకు సలహా ఇవ్వడం, పిల్లల పేరుతో ఉన్న డబ్బును తాకను అని విశ్వం నిర్ద్వంద్వంగా చెప్పడం కూడా విన్నారు.

ఇద్దరు పిల్లలూ తండ్రి గదిలోకి వెళ్లి అడిగారు ‘‘నాన్నా, మనింట్లో ఏం జరుగుతోంది, ఎందుకు మీరు ఉద్యోగానికి వెళ్లడం లేదు?’’

విశ్వం కాస్త తడబడి చివరకు తన పరిస్థితిని వివరించాడు. అప్పుడు హాసిని  ‘‘నాన్నా, ఈ కుటుంబ బాధ్యతను మాకు అప్పజెప్పి, మేము ఎంతో నేర్పుగా నిర్వహిస్తున్నామని మెచ్చుకున్నారుకదా,
మరి కష్టాలు వచ్చినప్పుడు మాకు ఎందుకు చెప్పడం లేదు?’’ అని అడిగింది.

‘‘మేం ఇప్పుడు అప్పటికంటే పెద్దవాళ్లం అయ్యాం, పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకోగలం’’ అన్నాడు నిశాంత్‌.

ఇద్దరూ ఏక కంఠంతో తండ్రికి చెప్పారు... ‘‘నాన్నా మీకున్న తెలివికీ, కష్టపడే తత్వానికీ, మీకు ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చి తీరుతుంది. మీరు దిగులుపడొద్దు. మీరు మాకు పాకెట్‌ మనీగా ఇచ్చిన డబ్బూ, తాతయ్యలూ మామయ్యలూ బాబాయీ అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బంతా మేం బ్యాంకులో దాచాం. మా ఇద్దరి అకౌంట్లలో కలిపి లక్ష రూపాయలపైనే ఉన్నాయి. ఆ డబ్బును మీకు ఇస్తాం. దాన్ని ఇంటి ఖర్చుకు వాడండి. ఈలోగా మీకు మరో మంచి ఉద్యోగం వస్తుంది’’

భార్యా భర్తలకు ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఇద్దరూ లేచి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. నిర్మలకైతే కళ్లనుండి నీళ్లు జలజలా రాలాయి. తాత్కాలికంగా వారి సమస్యలు తీరాయి. మరో నెలలో విశ్వానికి ఒక పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం దొరికింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..