ఫేస్‌బుక్‌ పుత్రుడు

‘‘ఈరోజు దైవ సమానులైన నా తల్లిదండ్రుల 50వ వివాహ వార్షికోత్సవం. ఎంతో శ్రమపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి, మా జీవితాలని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది, నేడు 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మా తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరిస్తూ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

Updated : 28 Aug 2022 04:26 IST

ఫేస్‌బుక్‌ పుత్రుడు

- వై.వి.ఎస్‌.రాధాకృష్ణ

‘‘ఈరోజు దైవ సమానులైన నా తల్లిదండ్రుల 50వ వివాహ వార్షికోత్సవం. ఎంతో శ్రమపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి, మా జీవితాలని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది, నేడు 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మా తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరిస్తూ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

నా ప్రియమైన ముఖపుస్తక స్నేహితులారా... నా తల్లిదండ్రులకు మీ శుభాకాంక్షలు కూడా అందజేస్తారని ఆశిస్తున్నాను.’’

‘‘ఏమోయ్‌ ఇలా చూడు... ఈ పోస్టు బాగుందా. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు గోడను ఉన్న మా నాన్నగారి పెళ్ళి ఫొటో ఒకటి మనవాడు సెల్‌ఫోన్‌తో ఫొటో తీశాడు కదా... అది నాకు సెండ్‌ చేయమను.

ఈ మ్యాటర్‌తోపాటు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తా. మా నాన్నగారి పుట్టినరోజుకన్నా ఈసారి లైక్‌లు ఎక్కువ రావాలి.’’

‘‘ఫేస్‌బుక్‌ పోస్టులు సరేగానీ, మొన్న అత్తగారికి ఫోన్‌ చేసినప్పుడు మీ తమ్ముడూ మరదలూ కూడా మాట్లాడారు. ఇంటి కప్పు బాగు చేయించాలంట, ముందా విషయం చూడండి. పెద్దాయన ఇబ్బందిపడతారు’’ కాఫీ కలుపుతూ చెప్పింది సుశీల.

‘‘ఈ మాత్రం పనికి నా వరకూ రావడం ఎందుకు. వాడు చేయించేయొచ్చు కదా.

కొత్త ఇంటిని కట్టడం కాదు కదా ఇద్దరం కలిసి చేయించడానికి’’ ఫేస్‌బుక్‌ చూస్తూనే అన్నాడు శివం.

‘‘అసలు పెద్ద కొడుకుగా మీరు చేయించాలి. బాధ్యత తనే తీసుకుంటున్నాడు కదా, కొంచెం సాయంచేస్తే బాగుంటుంది. అసలే మొన్న వర్షాలకి ధాన్యం తడిసి అనుకున్న రేటు రాలేదని మీ మరదలు ఫోన్‌చేసి బాధపడింది, కొంచెం ఆలోచించండి’’ కాఫీ చేతికిస్తూ అంది సుశీల.

‘‘సరేలే, ఈసారి ఫోన్‌ చేసినప్పుడు నాతో మాట్లాడమని చెప్పు.’’

‘‘మూడు నిమిషాలు అయింది పోస్ట్‌ చేసి, ఇంకా ఒక్కడూ చూడలేదు. సరేలే ఆ క్యారేజీ బ్యాగ్‌ ఇలాగ ఇయ్యి, నేను బ్యాంక్‌కి వెళ్ళి వస్తా’’ బ్యాగ్‌ తీసుకుని వెళ్ళిపోయాడు శివం.

శివం ఒక జాతీయ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి రామయ్య ఒక ఎకరం సొంత పొలం, మూడు ఎకరాలు కౌలుకి చేస్తూ శివంను పెద్ద చదువులు చదివించడంతోపాటు తనకు తెలిసిన అధికారుల సలహాలూ రికమండేషన్‌లతో ఉద్యోగ ఏర్పాటూ చేశాడు. ఇక పొలం వ్యవహారాలను తన రెండో కొడుకు కేశవకి అప్పచెప్పాడు. కేశవ్‌ కూడా అలాగే కష్టపడుతూ తండ్రి బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు.

‘‘హలో శివా, పోస్ట్‌ చాలా బాగుంది. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల పెళ్ళిరోజు గుర్తుంచుకునే కొడుకులు ఉండడం నిజంగా మీ తల్లిదండ్రుల అదృష్టం. మీ అమ్మగారికీ నాన్నగారికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయి’’ ఫింగర్‌ ఇంప్రెషన్‌ వేస్తున్న శివంను చూస్తూ మేనేజర్‌ మోహన్‌ అన్నాడు.

‘‘థాంక్యూ సార్‌’’ ఏదో అవార్డు తీసుకున్న ఫీలింగ్‌తో తన సీట్లోకి వెళ్ళాడు శివం. ఆరోజు పని నెమ్మదిగా ఉంది. ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫేస్‌బుక్‌లో లైక్స్‌ కామెంట్స్‌ చూసుకుంటూ సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు.

‘‘ఏమోయ్‌ శివం, ఈరోజు మీ నాన్నగారి పెళ్ళిరోజట కదా, వెళ్ళావా మీ ఊరు’’ పక్కింటి గోపాలం మాస్టారు మొక్కలకు నీళ్ళు పోస్తూ అడిగారు.

‘‘లేదు మాస్టారూ, బ్యాంకులో కొంచెం పని ఎక్కువగా ఉంది, అందుకని వెళ్ళలేకపోయాను. వచ్చే గురువారం వెళ్దామని అనుకుంటున్నాను’’ బైక్‌ స్టాండ్‌ వేస్తూ చెప్పాడు శివం.

‘‘రెండేళ్ళక్రితం నీ గృహప్రవేశానికి వచ్చినప్పుడు చూశాను మీ నాన్నగారిని... ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా?’’ మాస్టారు అడిగారు.

‘‘లేదు మాస్టారూ, మొన్న వేసవికాలం మైల్డ్‌ స్ట్రోక్‌ వచ్చి కుడివైపు పేరలైజ్‌ అయింది. పెద్దగా బయటకు రావట్లేదు. నాకు హెల్త్‌ కార్డు ఉంది కాబట్టి పెద్ద ఆస్పత్రిలో వైద్యం చేయించగలిగాను. ప్రస్తుతం పర్వాలేదండీ’’ చెప్పాడు శివం.

‘‘ఓ... సారీ, నాకు తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, నీ కొత్త ఇంట్లోనా’’ అడిగారు మాస్టారు.

‘‘లేదు మాస్టారూ, ఆ పాత ఇంటి నుంచి రానన్నారు. అంచేత రెంట్‌కి ఇచ్చేశాను’’ అని చెప్పి బ్యాగ్‌ తీసుకుని ఇంటి లోనికి వెళ్ళిపోయాడు.

గురువారం వచ్చింది. సుశీల, శివం బయలుదేరి సొంత ఊరికి వెళ్ళారు. ‘‘ఇదిగో పదివేలు. కేశవ ఎంత అడిగితే అందులో సగం ఇయ్యి’’ సుశీల చేతిలో పెట్టాడు శివం. ఇంటిముందు కారు ఆపి లోపలికి వెళ్ళారు.

‘‘ఏరా పెద్దోడా, ఎలా ఉన్నావ్‌, పిల్లల్ని తీసుకురాలేదా’’ తల్లి కాంతమ్మగారు పలకరించారు.

‘‘లేదమ్మా, ఏవో పరీక్షలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఏం నాన్నా, ఎలా ఉంటోంది ఆరోగ్యం?’’

‘‘ఆఁ బాగానే ఉంటుందిలే’’ ముభావంగానే అన్నారు రామయ్యగారు.

‘‘మావయ్యగారూ, టైమ్‌కి మందులు వేసుకుంటున్నారా, మీకు ఇష్టం అని చెప్పి పాలకోవా తెప్పించారు మీ అబ్బాయి’’

అత్తగారి చేతిలో పెడుతూ మావగారిని పలకరించింది సుశీల.

‘‘ఎవరు కొన్నారో నాకు తెలుసుగానీ, రామ్మా కూర్చో. ఈమధ్య మీ ఇంటికి వెళ్ళావా? నాన్నగారూ అమ్మగారూ కులాసాయేనా?’’ రామయ్యగారు అన్నారు కోడలితో.

‘‘కులాసాగానే ఉన్నారు మావయ్యగారూ. అత్తయ్యగారూ మీరూ కూర్చోండి. నేనూ

లక్ష్మీ కలిసి కాఫీ తెస్తాం’’ తోటి కోడల్ని పలకరించడానికి వంటింట్లోకి వెళ్ళింది సుశీల.

‘‘కేశవ ఏడమ్మా, ఇల్లు బాగుచేయించాలి అన్నాడు... ఎంత వరకు వచ్చింది’’ తల్లిని అడిగాడు శివం.

ఇంతలో కేశవ వచ్చాడు. ‘‘అన్నయ్యా, ఎంతసేపు అయింది వచ్చి, వదినా పిల్లలూ ఎక్కడ? మొన్న అమ్మానాన్నల పెళ్ళిరోజు అని చెప్పి ఫేస్‌బుక్‌లో పెట్టావు కదా, అది చూసి మనవాళ్ళు చాలామంది ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అమ్మా నాన్నా చాలా సంతోషించారు అన్నయ్యా.’’

‘‘సరేరా, నేను వచ్చిన పని ఏంటంటే మన శేఖరు ఇల్లు అమ్మేస్తాను- ఎవరినైనా చూడమని ఫోన్‌ చేశాడు. మనమే కొంటే బాగుంటుంది. సెంటర్లో ఉంది కదా, ఒక్కసారి చూద్దామని వచ్చాను. నేను శేఖర్‌ని కలిసి వస్తాను’’ శివం బయటికి వెళ్లాడు.

‘‘ఇంటిపని పూర్తయిందా, ఖర్చు ఎంతయింది కేశవా?’’ మరిదిని పలకరించింది సుశీల.

‘‘కొంతమేర రిపేర్‌ చేయించవలసి వచ్చింది వదినా, దానికీ కూలీకీ కలిపి ఇంచుమించు పదివేలు అయింది.’’

‘‘ఇదిగో మీ అన్నయ్య ఇమ్మన్నారు’’ అంటూ శివం ఇచ్చిన పదివేలు లక్ష్మి చేతిలో పెట్టింది.

‘‘మావయ్యగారు మందులు వేసుకుంటున్నారా’’ కేశవని అడిగింది.

‘‘అన్నయ్య హెల్త్‌ కార్డు పుణ్యమా అని హాస్పిటల్‌ ఖర్చులు పెద్దగా అవలేదుగానీ మందులు మాత్రం చాలా ఖరీదుగా ఉన్నాయి వదినా.’’

‘‘కేశు బాబు గారూ, ఇవిగోండి కూరగాయలూ పాలూ. నేను వెళ్తాను అండీ’’ పాలేరు సంచితో కూరలూ క్యాన్‌తో పాలూ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు.కేశవ వాటిని తీసుకెళ్ళి శివం కారులో పెట్టాడు.

ఇంతలో శివం వచ్చాడు. ‘‘శేఖర్‌తో మాట్లాడానురా. ఏ విషయం రేపు సాయంత్రం చెప్తాను అన్నాడు. మేం బయలుదేరుతాం మరి’’ తండ్రికీ తల్లికీ కూడా చెప్పి బయలుదేరి వెళ్లిపోయారు. రెండు వారాల తర్వాత...

‘‘మాస్టారూ, మా ఇంటికి దగ్గరలో- నా స్నేహితుడు కొత్తగా కట్టుకున్న ఇల్లు అమ్ముతుంటే- మా బ్యాంకులో లోను తీసుకుని నేను కొన్నాను. ఇంటికి ఇంకా కొంత వర్క్‌ పెండింగ్‌ ఉంది. అయిన తర్వాత ఏప్రిల్‌ నెలలో గృహప్రవేశం అనుకుంటున్నాను. మీరూ ఆంటీగారూ తప్పనిసరిగా రావాలి’’ సంతోషంగా చెప్పాడు శివం.

‘‘కంగ్రాచ్యులేషన్స్‌. తప్పకుండా వస్తాం. మీ నాన్నగారిని కూడా ఒకసారి చూడాలని ఉంది’’ అభినందిస్తూ అన్నారు గోపాలం మాస్టారు. మర్నాడు బ్యాంకులో స్వీట్‌ బాక్స్‌తో అందరికీ స్వీట్స్‌ పంచుతూ మేనేజర్‌ మోహన్‌గారికి కూడా ఇస్తూ ‘‘రిజిస్ట్రేషన్‌ పూర్తయింది సార్‌, ఏప్రిల్‌లో గృహప్రవేశం ఉంటుంది. మీరూ మేడంగారూ కూడా తప్పనిసరిగా రావాలి సార్‌’’ స్వీట్‌ బాక్స్‌ చేతికందిస్తూ చెప్పాడు.

‘‘ష్యూర్‌ ష్యూర్‌, తప్పనిసరిగా నీ లోన్‌ ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తయ్యాయి కదా, ఆల్‌ ద బెస్ట్‌’’ అంటూ స్వీట్‌ తీసుకున్నాడు మోహన్‌.

‘‘థ్యాంక్యూ సర్‌’’ తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు శివం. గృహ ప్రవేశానికి ముందురోజు ఏర్పాట్లూ అలంకరణలూ చక్కగా జరుగుతున్నాయి. గోపాలం మాస్టారు ముందురోజు సాయంత్రమే వచ్చారు. రామయ్యగారి దగ్గరికి వెళ్ళి ‘‘నమస్కారం బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంటోంది’’ అంటూ పలకరించారు.

‘‘రండి మాస్టారూ, కూర్చోండి. చాలాకాలం అయింది మిమ్మల్ని చూసి’’ లేవలేని పరిస్థితుల్లో ఎడమ చేతితోనే సైగ చేస్తూ పలకరించారు రామయ్యగారు.

‘‘మీ విషయాలన్నీ మీ శివం చెబుతూనే ఉంటాడు’’ మాట కలుపుతూ అన్నారు మాస్టారు.

‘‘అవునండీ, వాడికి ఏదైనా పని ఉండి వచ్చినప్పుడు అన్ని విషయాలూ తెలుసుకుని వెడుతూ ఉంటాడు’’ కొంచెం వేదాంతధోరణిలో బదులిచ్చారు రామయ్యగారు. మాస్టారుకి ఆ మాటల్లో ఏదో గూడార్థం ఉన్నట్టు అనిపించింది. ‘‘నమస్తే మాస్టారూ బాగున్నారా?’’

‘‘ఏం కేశవా, బాగున్నావా? క్రితం వారం మీ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళావని మా ఆవిడ చెప్పింది.’’

‘‘అవును మాస్టారూ, గృహప్రవేశం పత్రికలు పంచడానికి వచ్చాను’’ అని, తండ్రివైపు తిరిగి, ‘‘నాన్నా అందరూ వస్తున్నారు, వీల్‌ చైర్‌లో కూర్చోపెట్టనా వాకిట్లో ఉందువుగాని.’’

‘‘సరేరా, ముందు ఒక్కసారి బాత్‌రూమ్‌కి తీసుకెళ్ళు.’’

కేశవ వీల్‌ చైర్‌ తేవడానికి బయటికెళ్ళాడు.

‘‘రామయ్యగారూ, మీరు మీ పెద్దబ్బాయి ఇంట్లో ఉంటే అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ ఉండేది కదా’’ మాస్టారు సలహా ఇచ్చారు.

‘‘మాస్టారూ, నేనుంటే వాడికి ఏంటి లాభం’’ చిరునవ్వుతో అన్నారు రామయ్యగారు. మాస్టారు కదా... ఆయనకు విషయం పూర్తిగా అర్థమైంది. కేశవ వచ్చి రెండు చేతులతో రామయ్యగారిని లేపి వీల్‌ చైర్‌లో కూర్చోపెట్టి బయటకు తీసుకువెళుతూ ‘‘మాస్టారూ వరండాలో కూర్చోండి. నాన్నగారిని తీసుకొస్తాను’’ అని చెప్పి రామయ్యగారిని తీసుకుని పెరటి వైపు వెళ్ళాడు. సాయంత్రం భోజనాలయ్యాయి. అందరికీ పడకలు ఏర్పాటుచేసి రామయ్యగారిని మంచంమీద పడుకోబెట్టి భార్యకు మంచినీళ్ళు పెట్టమని చెప్పి ‘‘నాన్నా, ఒకసారి క్యాటరింగ్‌ అతన్ని కలిసి రేపటికి పువ్వుల దండలూ తమలపాకులూ తేవాలి, అవి తీసుకుని వస్తాను’’ అని దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు కేశవ. ఇవన్నీ పరిశీలిస్తున్నారు మాస్టారు. ఆయన మనసులో ఏవేవో ఆలోచనలు. ఆ ఆలోచనలతోటే కాసేపటికి నిద్రపోయారు. తెల్లవారుజాము ముహూర్తం. హడావుడిగా స్నానాదులు ముగించుకుని శివం-సుశీల దేవుడి ఫోటోలూ ప్రతిమలతో కొత్త ఇంటికి బయలుదేరారు. అప్పటికే కేశవ ఆవు, దూడతో కొత్త ఇంటి దగ్గర ఉన్నాడు. కార్యక్రమం పూర్తయింది. అందరూ అల్పాహారం హడావుడిలో ఉన్నారు. శివం బంధువులు ఒక్కొక్కరినీ తీసుకెళ్ళి ఇల్లంతా చూపిస్తున్నాడు. మాస్టార్ని కూడా తీసుకెళ్ళి చూపించాడు. అంతా చూసిన తర్వాత ‘‘బాగుందయ్యా శివం, ఆల్‌ ద బెస్ట్‌’’ అని వచ్చి పందిట్లో కూర్చున్నారు. 9.30 దాటింది. బ్యాంకు మేనేజర్‌ మోహన్‌ పాత ఇంటి దగ్గర కారు ఆపారు. బయట కేశవ కూతురు ఉంది.

‘‘పాపా, రామయ్యగారి ఇల్లు ఇదేనా?’’ మోహన్‌ అడిగాడు.

‘‘అవునండీ’’ ముచ్చటగా సమాధానం చెప్పింది.

‘‘మరి కొత్త ఇల్లు ఎక్కడ?’’

‘‘కొట్టు దగ్గర నుంచి పక్కకి తిరిగితే ఎదరేనండీ. అది మా పెదనాన్నగారి ఇల్లండీ.’’

‘‘ఓ అలాగా, మీ తాతగారు ఎక్కడున్నారు?’’

‘‘లోపలే ఉన్నారండీ. అక్కడకు రావడానికి రెడీ అవుతున్నారు.’’

‘‘సుమా, ఒక్కసారి పలకరించి అక్కడికి వెళ్దాం’’ మోహన్‌ భార్యతో చెప్పి కారు దిగి, ‘‘పాపా, మీ తాతగారి దగ్గరికి తీసుకెళ్తావా’’ అన్నాడు.

తండ్రి భుజంమీద కండువా వేసి బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు కేశవ.

‘‘నమస్కారమండీ’’

‘‘నమస్కారమండీ... మీరు...’’

‘‘నేను మీ అబ్బాయి పనిచేసే బ్యాంక్‌ మేనేజర్‌నండీ.’’

‘‘రండి సార్‌ కూర్చోండి’’ కేశవ రెండు కుర్చీలు తెచ్చి వేశాడు. ఈలోపు పాప రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చింది. మోహన్‌ ఇల్లంతా చూస్తున్నాడు. ఉండటం శుభ్రంగా ఉన్నా మరీ పాతకాలపు ఇల్లు.

‘‘మీ ఆరోగ్యం బాగుంటోందాండీ?’’

‘‘పరవాలేదు లెండి.’’

‘‘మీరు కూడా లోన్‌ తీసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా’’ కేశవ వైపు తిరిగి అడిగాడు మోహన్‌.

‘‘పొలం మీద కొంచెం అప్పు ఉందండీ, లోన్‌ తీసుకునే పరిస్థితుల్లో లేను.’’

‘‘లోన్‌ సంగతి మీ అన్నయ్య చూసుకుంటాడు కదండీ.’’

‘‘వాడూ కొత్తగా ఇల్లు కట్టుకుని ఇబ్బందుల్లో ఉన్నాడు కదండీ.’’

‘‘పదండి బాబూ, అక్కడికి వెళుతూ మాట్లాడుకుందాం’’ అందరూ బయలుదేరారు.

పాప ముందుగానే పరిగెత్తుకెళ్ళి పెదనాన్నకు వార్త చెప్పింది. శివం హడావుడిగా ఎదురొచ్చి ‘‘రండి సార్‌, రండి మేడమ్‌’’ అంటూ మోహన్‌కి చెయ్యి అందించాడు. మోహన్‌ని లోపలికి తీసుకువెళ్ళి టిఫిన్‌ అయిన తర్వాత ఇల్లంతా చూపించ సాగాడు. అంతా చూస్తూ బెడ్‌రూమ్‌లోకి వచ్చారు.

‘‘నైస్‌, బాగుంది. ఈ రూమ్‌లో మీ నాన్నగారు ఉంటారా... అటాచ్డ్‌ బాత్రూమ్‌ బాగా ఉపయోగపడుతుంది’’ అన్నాడు మోహన్‌.

‘‘అంటే సార్‌... నాన్నగారికి ఇప్పటికే 82. పైగా పెరాలసిస్‌. సో, కొత్త ఇంట్లో ఏమైనా శుభకార్యం జరిగితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా. అందుకని పాత ఇంటిని బాగు చేయించాను సార్‌.’’

మోహన్‌ అతని భార్యా షాక్‌తో ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళని అలా చూసిన తర్వాత శివానికి అర్థమైంది, తనన్న దానికి అర్థం ఏమిటో.

‘‘అంటే సార్‌, ఆ ఇంటి నుంచి రావడం మా నాన్నగారికి ఇష్టంలేదు’’ అంటూ ఏదో కవర్‌ చేయబోయాడు. మోహనే సర్దుకుని మాట మారుస్తూ ‘‘కిచెన్‌ ఏది’’ అంటూ బెడ్‌రూమ్‌ బయటకు వచ్చాడు.

శివం మేనేజర్‌నీ స్టాఫ్‌నీ చుట్టాలకి పరిచయం చేశాడు. భోజనాలు అయ్యాయి. ఒక్కొక్కరూ బయలుదేరుతున్నారు. మోహన్‌ వెళ్తూ వెళ్తూ ‘‘ఓకే ఆల్‌ ద బెస్ట్‌ శివం’’ అని చెప్పి ‘‘మీ బ్రదర్‌ ఎక్కడ?’’ అడిగాడు.

‘‘అరే కేశవా, ఇలారా’’ పిలిచాడు శివం.

‘‘చెప్పు అన్నయ్యా’’ వచ్చాడు కేశవ.

‘‘మా సార్‌ బయలుదేరుతున్నారు. నిన్ను చూడాలి అన్నారు.’’

‘‘చాలా థ్యాంక్స్‌ సార్‌. మా గురించి వీలు చూసుకుని వచ్చారు’’ చెయ్యి అందిస్తూ అన్నాడు.

‘‘ఒకసారి మీ ఆధార్‌ కార్డూ రేషన్‌ కార్డూ తీసుకుని బ్యాంకులో కలవండి, హౌసింగ్‌ లోన్‌ పెడదాం.’’

శివం, కేశవా ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

‘‘సార్‌, చెప్పాను కదా... నా పరిస్థితి’’ కేశవ ఏదో అనబోయాడు.

‘‘లోను విషయం పూర్తిగా నేను చూసుకుంటాను. నీ దగ్గర ఉన్నప్పుడే కట్టు, ఓకేనా.’’

రామయ్యగారి వైపు తిరిగి ‘‘నేనూ మీ కొడుకు లాంటి వాడినేనండీ, ఆశీర్వదించండి’’ కాళ్ళకు నమస్కారం పెట్టి బయలుదేరాడు.

ఇది కూడా గోపాలం మాస్టారు చూస్తూనే ఉన్నారు. ఆయన కూడా బయటికి వస్తూ ‘‘ఓకే శివం బయలుదేరుతాను మరి’’ అంటూ రామయ్యగారి వైపు తిరిగి, ‘‘వెళ్ళొస్తాను రామయ్యగారూ, ఆరోగ్యం జాగ్రత్త’’ అన్నారు.

‘‘ఏం ఆరోగ్యమో ఏంటో, ఇలా కాలక్షేపం చేస్తున్నాను మాస్టారూ.’’

‘‘మీరు చాలా అదృష్టవంతులు. కేశవ లాంటి కొడుకు మీ పక్కన ఉండగా నిండు నూరేళ్లు ఆనందంగా గడపగలరు’’

అని కేశవ వైపు తిరిగి, ‘‘నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో నాయనా. ప్రేమా ఆదరణా అనేవి ఫేస్‌బుక్‌లో దొరకవు. నీలాంటి కొడుకు వలన దొరుకుతాయి’’ అంటూ అతని భుజంమీద తడుతూ ఆయన కూడా బయలుదేరారు.

మోహన్‌- గోపాలం మాస్టారుగారి మాటలకు శివంకు బుర్ర తిరిగిపోయింది. కళ్ళు తిరిగినంత పనై ఒక కుర్చీలో కూలబడిపోయాడు. ఇది ఎవరూ పెద్దగా గమనించలేదు. ఎవరి పనులు వాళ్ళు ముగించుకున్నారు. కాసేపటికి సుశీలను గదిలోకి పిలిచి జరిగింది చెప్పాడు. దానికి సుశీల ‘‘నిజం చెప్పాలంటే మన పెళ్ళయిన కొత్తలో నుంచి ఇప్పటివరకూ చూస్తూనే ఉన్నాను. మామగారూ కేశవా మనపట్ల చూపించే అభిమానానికి మనం వాళ్ళకు చేసింది పదో వంతు కూడా కాదు. మనవల్ల వాళ్ళు బతకటం లేదు. నిజానికి వాళ్ళ వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం.

ఈ సంగతి మీకు ఇప్పటికైనా తెలిస్తే సంతోషించే వాళ్ళలో మొదటిదాన్ని నేనే. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ప్రశాంతంగా ఆలోచించి వాళ్ళ గురించి ఒక నిర్ణయం తీసుకోండి’’ అంది. ఆరోజు రాత్రి ఫేస్‌బుక్‌లో మరో పోస్ట్‌కి రెడీ అయ్యాడు శివం. ఇంటి ఫొటోలూ గృహప్రవేశం ఫొటోలూ అప్‌లోడ్‌ చేసి మేటర్‌ కూడా పోస్ట్‌ చేసి ప్రశాంతంగా నిద్రపోయాడు. మర్నాడు పొద్దున మోహన్‌ పోస్ట్‌ ఓపెన్‌ చేశాడు. మేటరు చదవడం ప్రారంభించాడు. ఈరోజు ఉదయం మా నూతన గృహ ప్రవేశం బంధుమిత్రులతో చాలా ఆనందంగా  see more....మోహన్‌ మనసులో ‘ఈ శివం ఇంక మారడు’ అనుకుంటూ ఆ  see more...ని ప్రెస్‌ చేశాడు. మేటర్‌ చాలా ఉంది. నెమ్మదిగా చదవడం ప్రారంభించాడు.

... బంధుమిత్రులతో చాలా ఆనందంగా జరుపుకున్నాము. ముఖపుస్తక మిత్రులకు ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ ముఖపుస్తక వేదికగా ఇద్దరు వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరో ఇద్దరు వ్యక్తులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ముందుగా మా నాన్నగారికీ తమ్ముడికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసు కుంటున్నాను. నాన్నా, నేను కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో మెట్లు ఎక్కాననుకున్నాను కానీ, ఆ మెట్లు మీవి, తమ్ముడి భుజాలని గుర్తించలేకపోయాను. ఇప్పటివరకూ నాకు తెలియకుండానే ఏదో మాయా ప్రపంచంలో ఉండి, మన కుటుంబం గురించి నేను పట్టించుకోలేదు. నేను ఏదీ కావాలని చేయలేదు నాన్నా. కేశవా, నేనూ నా ఉద్యోగం నా సంపాదన అనుకుంటూ, నువ్వూ నా కుటుంబమే అన్న సంగతి మర్చిపోయాను. మీరిద్దరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వ్యక్తులు- గోపాలం మాస్టారు, మా మేనేజర్‌ మోహన్‌ గారు.

సార్‌, మీరు గమనించిన విషయాలు నేను అనాలోచితంగా చేసినవి. నా తప్పును పరోక్షంగా ఎత్తిచూపి నా బాధ్యతను గుర్తు చేసినందుకు మీకు ఎప్పటికీ కృతజ్ఞుడిని.
పోస్టు పూర్తిగా చదివాడు మోహన్‌. చాలా సంతోషించాడు.

తెల్లారింది. లేచి బయటకి వచ్చాడు శివం. బాత్‌రూమ్‌లోకి వెళ్ళి మొహం కడుక్కున్నాడు. కేశవ వచ్చి టవల్‌ అందిస్తూ ‘‘ఆ పోస్ట్‌ ఏమిటి అన్నయ్యా, నేనేమైనా తప్పు చేశానా’’ అని అడిగాడు.

గట్టిగా కావలించుకుని ‘‘నాకు బతకడం చేతకాదురా. గిరిగీసుకుని అందులోనే ఉండిపోయా. నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి. వయసులో నేను పెద్దవాడినైనా, బాధ్యతలో నీకన్నా చాలా చిన్నవాడినిరా’’ అంటూ బోరున ఏడ్చేశాడు.

‘‘ఊరుకో అన్నయ్యా, ఊరుకో’’ అంటుంటే కేశవ కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయి.

గబగబా ఇంట్లోకి వెళ్ళి తాళంచెవి తెచ్చాడు శివం. ‘‘దగ్గరలో మంచిరోజు చూసుకుని నువ్వు నాన్నను తీసుకుని కొత్త ఇంట్లో ఉంటే మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించారని
అనుకుంటాను’’ అన్నాడు.

అలాగే తండ్రికి కూడా క్షమాపణ చెప్పి, సాయంత్రం బయలుదేరి వెళ్తూ, ‘‘ఒకసారి బ్యాంకుకి రా. అగ్రికల్చర్‌ లోన్‌ పెడదాం. అప్పు తీర్చేసి, నాన్ననీ పొలాన్నీ జాగ్రత్తగా చూసుకో. నీకైనా నాకైనా ఒక్కతే ఆడపిల్ల. దాని బాధ్యత కూడా నాదే. నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్‌ చెయ్‌. వెళ్ళొస్తాను.’’

మనసులో భారం అంతా దించుకుని ఆనందంగా బయలుదేరాడు శివం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..