రైతు

‘‘ఏమండీ బిజీగా ఉన్నారా!’’ అంటూ నా ఆఫీస్‌ గదిలోకి వచ్చింది సుజన. సాధారణంగా నా ఆఫీసు గదిలోకి ఎవరూ రారు. వచ్చిందంటే ఏదో ఇంపార్టెంట్‌ పనిమీదే వచ్చి ఉంటుంది. అందుకని చూస్తున్న ఫైల్స్‌ని పక్కన పెట్టి ‘‘ఫర్వాలేదు చెప్పు, ఏమిటి విషయం?’’ అడిగాను

Published : 04 Sep 2022 00:19 IST

రైతు

- డా।। మజ్జి భారతి

‘‘ఏమండీ బిజీగా ఉన్నారా!’’ అంటూ నా ఆఫీస్‌ గదిలోకి వచ్చింది సుజన. సాధారణంగా నా ఆఫీసు గదిలోకి ఎవరూ రారు. వచ్చిందంటే ఏదో ఇంపార్టెంట్‌ పనిమీదే వచ్చి ఉంటుంది. అందుకని చూస్తున్న ఫైల్స్‌ని పక్కన పెట్టి ‘‘ఫర్వాలేదు చెప్పు, ఏమిటి విషయం?’’ అడిగాను. ‘‘ఏమీ లేదు మామయ్య గారి విషయం మీతో మాట్లాడదామని...’’
నాన్న విషయం అనగానే మాట్లాడేదేమీ లేనట్టు మళ్ళీ నా ఫైల్స్‌ అందుకున్నాను. ఎందుకంటే తను చెప్పబోయే విషయం నాకు తెలుసు. నిన్న నాన్న ఫొటో పేపర్లో చూడగానే ఇలాంటి డిస్కషన్‌ ఏదో వస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తూనే ఉన్నాను. కానీ ఆ విషయం గురించి మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను.
నా విముఖతను కనిపెట్టిన సుజన ‘‘అది కాదండీ, ఏమీ లేనివాళ్ళలా ఆయనెందుకు పనిచేయడం? వ్యవసాయం అంటే అంత సరదాగా ఉంటే, ఓ నలుగురు మనుషుల్ని పెట్టుకుని వ్యవసాయం చేయించుకోవచ్చు కదా! ఈ వయసులో ఆయనెందుకు శ్రమ పడటం? చూసేవాళ్ళంతా కొడుకు సరిగ్గా పట్టించుకోక ఆయనింకా కష్టపడవలసి వస్తుందంటున్నారు. మీకైతే ఎలా ఉందోగానీ నాకైతే తలకొట్టేసినట్టు ఉంటుంది అందరూ అలా అంటుంటే’’ ఈసారి గట్టిగానే చెప్పింది సుజన.
పొలంలో చెట్టు కింద ఓ నులక మంచం మీద నాన్న పడుకుని ఉన్న ఫొటో నిన్న పేపర్లో పడింది. ఆ ఫొటో చూసి నాకు కూడా చాలా ఫోన్లు వచ్చాయి... ఏమిటిదంటూ! ఏమని చెప్పను? నాన్న కోరికది. తన సొంత పొలంలో ఉంటే ఆయనకది సింహాసనం మీద కూర్చున్నంత అనుభూతినిస్తుంది. అది చెప్పినా ఎవరికీ అర్థం కాదు. ఆయన కష్టపడుతున్నారని చూసేవాళ్ళు అనుకుంటారు. కానీ ఆ మట్టితో కలిసి బతకటం ఆయనకు చిన్ననాటి నుండీ ఉన్న ఓ కల. మామూలు వాళ్ళకది అర్థం కాదు. మట్టితో అనుబంధం ఉండేవాళ్ళే అర్థం చేసుకోగలరు.
ఒకప్పుడు నేను కూడా అందరిలాగే నాన్నను అర్థం చేసుకోలేక ‘ఇంకా ఎందుకు కష్టపడటం? నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఈ పల్లెటూరు వదిలి పట్టణం వెళ్ళిపోదాం పదండి, ఇక్కడ మనకు ఆస్తులు కూడా ఏమీలేవు కదా! ఇంకా ఎందుకు ఈ పల్లెటూరిలో?’ అని అన్నప్పుడు నాన్న చెప్పిన సమాధానం పదిహేనేళ్ళైనా ఇంకా నిన్నే చెప్పినంత బాగా గుర్తుంది నాకు.‘‘ఏమిటండీ, ఏమీ మాట్లాడరు?’’ సుజన మాటలకు నా ఆలోచనల నుండి బయటపడ్డాను. ‘‘చూద్దాములే!’’ అంటూ మాట
దాట వేశాను.
‘‘మీరెప్పుడూ ఇంతే. ఏదీ సరిగ్గా పట్టించుకోరు’’ అంటూ సుజన గది నుండి బయటకు వెళ్ళింది. సుజన బయటకు వెళ్ళగానే ఫైల్స్‌ వైపు దృష్టి సారించాను కానీ మనసు వాటి మీద నిలబడటం లేదు.
జ్ఞాపకాల దొంతరలలో నా చిన్నతనాన్ని వెతుక్కుంటోంది. ఏమీ లేకపోయినా ఎంత బాగా ఉండేవో ఆ రోజులు. తాతలనాటి చిన్న పెంకుటిల్లు. అవసరాలకు- ఉన్న అయిదెకరాల భూమినీ అమ్ముకుని, జీవనం కోసం మళ్ళీ అదే భూమిలో కౌలురైతుగా పనిచేస్తున్న నాన్నా, నాన్నకు సాయంగా ఎప్పుడూ కష్టపడే అమ్మా, ఒక తమ్ముడూ ఇద్దరు చెల్లెళ్ళూ...ఇదే చిన్నప్పుడు తనకున్న సంపద.
సాధారణంగా కౌలురైతులు- కూలీడబ్బులు కలిసొస్తాయని ఇంట్లో అందరూ కలిసి కష్టపడి పనిచేస్తారు. అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు పొలంలో పనిచేసేవారు. కానీ నాన్న
నన్నెప్పుడూ పొలం పనులకు రానివ్వలేదు.
‘నేను పొలం మీద వ్యవసాయం చేస్తాను. నువ్వు పుస్తకం మీద చదువనే వ్యవసాయం చెయ్యి. జ్ఞానమనే పంటను పండించు.
ఉద్యోగమనే ఫలసాయం పొందు. అప్పుడు నీ చెల్లెళ్ళనూ తమ్ముడినీ పైకి తీసుకురా. నువ్వు వ్యవసాయంలోకి వచ్చావంటే,
నాలాగే రేపటి కోసం వెతుక్కుంటూ, జీవితం గడపాల్సి వస్తుంది.’
‘వ్యవసాయానికి చీడపీడలు పట్టినట్టే, చదువుకి కూడా చెడు అలవాట్లూ, చెడు స్నేహాల రూపంలో ఆటంకం ఏర్పడవచ్చు. కానీ వాటినన్నిటినీ అధిగమించి, ఆరు నూరైనా నీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అంతవరకూ మేమంతా కష్టపడతాం. నువ్వు ఒక్క చదువు మీదే ధ్యాస పెట్టు. అదే నువ్వు నాకు చేసే సాయం’ అని నాన్న చిన్నప్పటినుండీ నాకు నూరిపోసేవాడు.
అమ్మానాన్నల కష్టాన్ని చిన్నప్పటి నుండీ దగ్గరనుండి చూసినవాడిని. నాన్న మాటల విలువేమిటో నాకు బాగా తెలుసు. అందుకని కష్టపడి, బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. మొదటి నెల జీతం తెచ్చి నాన్న చేతిలో పెట్టాను. ఇంటిల్లపాదీ సంవత్సరమంతా కష్టపడినా, అంత డబ్బు ఏ రోజూ కళ్ళ చూడలేదు. ఆ రోజు ఇప్పటికీ నాకు బాగా గుర్తే.
‘నాన్నా! నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇంక మీరు కష్టపడడానికి నేనొప్పుకోను. ఇంక కౌలుకు పొలం తీసుకోవద్దు. పట్టణం వెళ్ళిపోయి హాయిగా అక్కడే ఉందాం. తమ్ముడూ చెల్లెళ్ళూ అక్కడే చదువుకుంటారు’ అన్న నా మాటలకు- నాన్న చెప్పిన సమాధానం నా చివరి క్షణంవరకూ గుర్తుంటుంది. ‘నేను వ్యవసాయం చేసి కష్టపడలేదు. వ్యవసాయం చెయ్యడానికి భూమి లేక కష్టపడ్డాను. నాదంటూ చిన్నమడి చెక్క ఉంటే చాలు. నాకదే పెద్ద కొండ.’
ఆ మాటను అర్థంచేసుకున్న నేను ఉద్యోగం వచ్చిన కొన్నాళ్లకు- ఏ భూమైతే మా తాత ముత్తాతలదో, అమ్ముకున్నాక ఏ భూమినైతే నాన్న కౌలుకు తీసుకున్నాడో, అదే భూమిని కొని, నాన్న చేతుల్లో పెట్టాను దస్తావేజులు.
అప్పుడు నాన్న అన్న మాటలు గుర్తుకు వస్తే, ఇప్పటికీ నా మనసు చలించిపోతుంది.

‘నా జీవితంలో ఇటువంటి రోజు చూస్తాననుకోలేదురా పెద్దోడా. నేను చనిపోయేలోగా ఈ రోజు వస్తుందనుకోలేదురా. తాతముత్తాతల నుండి వచ్చిన భూమి అమ్ముకున్న రోజు, ఆ రోజే వాళ్లందరికీ పాడె కట్టానన్న భావం, ముద్దని నా గొంతు దిగనిచ్చేది కాదు. దిండు తడిచిపోయేలాగ ఎన్ని రాత్రుళ్ళు ఏడ్చానో... ఆ భగవంతుడికే తెలుసు. నీకు నేనున్నాను నాన్నా- అని, మళ్ళీ ఆ దస్తావేజులు నా చేతిలో పెట్టావు. చచ్చి నీ కడుపున పుట్టాలనుందిరా పెద్దోడా!’ అని నాన్న ఆ దస్తావేజులు మార్చి, మార్చి చూసుకున్నాడు. వేల డబ్బు చేతిలో పెట్టినప్పుడు కూడా నాన్న ఇంత సంతోషాన్ని పొందలేదు. రైతుకు అత్యంత ప్రీతిపాత్రమైనదేమిటో మొదటిసారిగా తెలుసుకున్నాను.
నాన్న కష్టపడటం చూడలేక ఓసారి ‘నాన్నా, నీకెందుకంత కష్టం? ఎవరైనా మనిషిని పెట్టి వ్యవసాయం చేయించుకో’ అంటే, ‘ఒరే పెద్దోడా, ఈ భూమి నా బిడ్డరా. నా బిడ్డను ఇంకొకరికి అప్పగించి నేనెలా ఉండగలను?’ అని నాన్న చెప్పిన సమాధానం- రైతుకూ భూమికీ మధ్య ఉన్న సంబంధమేమిటో నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేసింది.
ఆ తర్వాతెప్పుడూ నాన్నను వ్యవసాయం చేయ్యొద్దని నేను చెప్పలేదు. రైతులు ఎక్కువ కష్టపడకుండా వ్యవసాయం ఎలా చేయొచ్చో కనుక్కుని, ఆ పనిముట్లన్నీ నాన్నకు పంపించే వాడిని. ‘ప్రగతి రైతు సంఘం’ అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్‌ని స్థాపించి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయిస్తున్నాను. మా అయిదెకరాల పొలంలో చిన్న ఫాంహౌస్‌ కట్టించాను. కానీ నాన్న ఫాంహౌస్‌ కన్నా, చిన్నప్పటినుండీ అలవాటైన ఆ చెట్టుకిందే, నులక మంచం వేసుకుని విశ్రాంతి తీసుకుంటాడు. ఎందుకంటే ఆ నులక మంచం మీదే ఆయన తాతతండ్రులు పడుకునేవారు. అలాంటి సమయంలో ఎవరో ఆ ఫొటో తీసి ‘కలెక్టరుగారి తండ్రి’ అని క్యాప్షన్‌ పెట్టి పేపర్లో వేశారు. అది చూసినప్పటి నుండీ మా మామగారు సుజనతో మాట్లాడటం
గమనిస్తూనే ఉన్నా. ఇలాంటి విషయాలు ఆయన నేరుగా నాతో చెప్పడు. చెబితే నేనేమంటానో ఆయనకు బాగా తెలుసు. అందుకని సుజనతో చెప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఆయన బాధ ఆయనది. చీఫ్‌ ఇంజినీరుగా రిటైరైన ఆయనకు,
వియ్యంకుడు నులకమంచం మీద పడుకున్నాడంటే అవమానమే మరి. అసలు ఆ సంబంధం రావడం చాలా తమాషాగా జరిగింది. జనార్దనరావని నా పేరుతోనే ఉన్న ఇంకొక ఆఫీసరుని కలవబోయి, మధ్యవర్తి చేసిన చిన్న తప్పిదం వలన నా చిరునామాకి వచ్చారు. తర్వాత విషయం తెలిసినా, ఎందుకనో మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. పెళ్ళిచూపులకు మా ఇంటికి వచ్చినప్పుడు, మా మామగారు (అప్పటికి ఇంకా అవ్వలేదనుకోండీ) చాలా అతిశయంగా ‘కట్నం ఎంత కావాలో అడగండి, ఎంతైనా ఇస్తాను’ అన్నప్పుడు... నాన్న ‘మా అబ్బాయిని నేనమ్ముకోనండీ’ అనేశాడు. మా మామగారికి ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది. నాన్న అలా అంటాడని ఆయన ఊహించను కూడా ఊహించలేదు. ఆస్తులేమీ లేనివాళ్ళు. కట్నం ఇస్తామనగానే అర్రులు చాస్తారనుకున్నారాయన.
నిజానికి నేను కూడా, నాన్న కట్నం కావాలని అడగడేమో గానీ, ఇస్తే వద్దంటాడనుకోలేదు. నాన్న మాటతో నా మనసులో ఆయన స్థానం ఇంకా ఎదిగిపోయింది.

నాకు ఉద్యోగం వచ్చిందన్న ఆర్డర్‌ కాగితం తెచ్చి నాన్న చేతిలో పెట్టాను. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నేను రిటైర్‌ అయ్యే వరకూ మర్చిపోను... ‘ఎవరి ముందూ తలదించకు. నీ మనస్సాక్షిని చంపుకుని ఏ పనీ చెయ్యకు. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే, బాధపడే పని ఏదీ చెయ్యకు.’ నాన్న ఏమీ చదువుకోకపోయినా, జీవితాన్ని కాచి వడబోశాడనిపిస్తుంది- ఆ మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా. ఏమీ లేనప్పుడు ఎలా ఉండేవాడో, అన్నీ ఉన్నప్పుడు కూడా నాన్న అలాగే ఉంటున్నాడు. అది మా మామగారికీ, సుజనకీ నచ్చడం లేదు. చిన్నప్పటి నుండీ ఆయనను అలా చూడటం అలవాటు కాబట్టి నాకేమీ అనిపించదు. కానీ ఇలా ఫొటోలలో చూస్తుంటే, నాన్న గురించి ఎంత తెలిసున్నా నాకే ఏదోగా అనిపిస్తుంది. అలాంటిది
బయటివాళ్ళకు ‘అయ్యో పాపం, పిల్లలు పట్టించుకోరేమో, ఆయన ఇంకా అలాగే ఉన్నాడు’ అని నిజంగానే అనిపిస్తుందేమో!
వాళ్ళెవరో అంటారని కాదుగానీ, నాక్కూడా నాన్న దర్జాగా ఉంటే చూడాలని ఉంటుంది. కానీ నాన్న ఆడంబరాలకు చాలా దూరం. ‘మన దుస్తులనుబట్టి మనకు విలువ కట్టేవాళ్ళతో మనకేమి పనిరా’ అంటాడు. ఆయన మాటలలో నిజముంది. అందుకే ‘నాన్నా! ఇలాగే నువ్వుండు’ అని నాన్నకు నేను చెప్పలేను. కొడుకు కలెక్టరైతే మాత్రం... కలెక్టరు తండ్రి ఈ రకంగానే, ఇలాగే ఉండాలని రూలేమన్నా ఉందా? ఆయనకు నచ్చినట్లు ఆయన
ఉండటంలో తప్పేమిటో నాకర్థం కాదు.
‘ఈ దేశంలో రైతుకు ఏమీ అక్కరలేదు. పండించడానికి కొద్ది పొలం, పొలాన్ని నమ్ముకున్న బిడ్డలూ ఉంటే చాలు- తనే రాజనుకుంటాడు. అందరినీ నేను మార్చలేనేమోగానీ, నా బిడ్డలకు మట్టి విలువ నేర్పించి, మనం బతకడానికి ఆహారాన్ని పండిస్తున్న రైతు రుణం కొద్దిగానైనా తీర్చుకుంటాను’ అనుకున్నాను మనసులో. నాన్న మా ఊరు వదిలిరాడు. అమ్మకు రావాలని ఉన్నా, నాన్నను వదిలిరాదు. మరెలా! ఆలోచించగా, ఆలోచించగా నాకు ఒక్క విషయమే తట్టింది. కొండ- రాజు దగ్గరికి రాకపోతే, రాజే కొండ దగ్గరికి వెళ్ళాలి.
నాల్రోజుల తర్వాత పేపర్లో... ‘తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తున్న కలెక్టర్‌ గారు’ అన్న క్యాప్షన్‌తో ఫొటో వచ్చింది. ఈసారి నులక మంచం మీద నాన్న ఒక్కడే లేడు, మనవడూ మనవరాలితో ముచ్చట్లాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ ఫొటో చూసిన ఎవరికీ ‘అయ్యో పాపం’ అనిపించలేదు. ‘అబ్బ, ఎంత అదృష్టవంతుడో’ అనిపించింది. నాన్న కోరుకున్నదదే. ‘ఆస్తి సంపద కాదురా, ఆత్మీయ సంపద సంపాదించుకోవాలి’ అంటాడు. నేనున్నంత వరకూ నాన్నకా సంపదను దూరం కానివ్వను.
‘‘ఒరేయ్‌ పెద్దోడా, ‘చదువు, చదువు’ అని నిన్నెప్పుడూ పొలం పనిలోకి రానివ్వలేదుగానీ, నువ్వు మట్టితల్లిని ముద్దాడుతుంటే చూడాలని నాకు ఎంతగానో ఉండేది. ఇంక ఆ కల నెరవేరదేమో అనుకున్నాను. నువ్విలా వచ్చి... పొలంపనిలో నా పక్కన... కలలో కూడా ఊహించలేదు’’ గొంతు బొంగురుపోతుంటే అన్నాడు నాన్న.
‘‘తాతా, నాన్నే కాదు... మేం కూడా పొలంపనిలో నీ పక్కనే ఉంటాము’’ అన్నారు పదేళ్ల నా కొడుకు వంశీ, ఎనిమిదేళ్ల నా కూతురు శ్వేత వాళ్ళ తాతగారితో. అది విన్న నాన్న కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి... దుఃఖంతో కాదు ఆనందంతో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..