‘మిషన్‌ సక్సెస్‌’

‘‘వెళ్లిన పని ఏమైంది, కాయా? పండా?’’ ఫోనులో వినిపిస్తున్న భర్త ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలీక మౌనం వహించింది సుజాత. ‘‘నువ్వు నీళ్లు నములుతూ కూర్చుంటే ఇక్కడ నాకు ఫోను బిల్లు వాచిపోతుంది.

Updated : 25 Sep 2022 06:05 IST

‘మిషన్‌ సక్సెస్‌’

- కర్రా నాగలక్ష్మి

‘‘వెళ్లిన పని ఏమైంది, కాయా? పండా?’’ ఫోనులో వినిపిస్తున్న భర్త ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలీక మౌనం వహించింది సుజాత.

‘‘నువ్వు నీళ్లు నములుతూ కూర్చుంటే ఇక్కడ నాకు ఫోను బిల్లు వాచిపోతుంది. అసలు అక్కడికి ఎందుకు వెళ్లావో గుర్తుందా? తొందరగా ఏదోకటి తేల్చి కొంప చేరు, చెయ్యి కాల్చుకోలేక ఛస్తున్నాను.’’

కోపంతో మండిపడుతున్న భర్తకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా జాప్యం చేస్తే ఇంకెన్ని మంగళహారతులు వినాల్సి వస్తుందో అనే భయంతో ‘‘ఇద్దరూ చాలా బిజీగా ఉంటున్నారు, మాట్లాడ్డమే కుదరలేదు’’ మెల్లగా అంది.

‘‘మీనమేషాలు లెక్కపెట్టకు. రాత్రికి ఇద్దరూ కొంప చేరగానే అమీతుమీ తేల్చేసిరా. శుభంగాడు స్కూల్‌కి వెళ్తున్నాడా, నువ్వయినా వాడితో తెలుగులో మాట్లాడు, అక్షరాలు దిద్దించు, ఇవాళే వాళ్లతో మాట్లాడు, ఓకే ఇక ఉంటాను’’ ఫోను డిస్కనెక్ట్‌ చేసిన శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సుజాత.

ఏమిటో ఈ కాలం పిల్లలు. పెద్దపెద్ద చదువులు చదివి పెద్ద పదవులలో రాణిస్తున్నారు, కానీ జీవితంలో ఓడిపోతున్నారు. కారణాలు వెతికితే ఏమీ కన్పించటం లేదు. పైగా వారిదగ్గర చూపే ఓర్పు జీవిత భాగస్వామి దగ్గర చూపలేకపోవడం, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు ప్రవర్తించడం చూస్తే వీళ్లకింకా మెచ్యూరిటీ రాలేదనిపిస్తుంది.

అసలు వీళ్లకి ఎప్పటికైనా మెచ్యూరిటీ వస్తుందా? ఇంట్లో వాళ్ల మాట వినాలనిగానీ, అర్థం చేసుకోవాలనిగానీ తెలీదా? ముప్ఫైయేళ్ల మురిపెం అయిన ఉద్యోగానికిచ్చే ప్రాధాన్యత చేయిజారితే పొందలేని జీవితానికి ఇవ్వటం లేదు, ఎందుచేతనో? ఆలోచనలలో ఆరునెలల వెనక్కి వెళ్లింది సుజాత.

కొడుకు దగ్గర నుంచి వచ్చిన వాట్సాప్‌ కాల్‌ కాళ్లకింద చోళ్లు పోసింది. ఒంట్లో నెత్తురు ఆవిరయిన భావన, నోట్లోంచి మాట రాలేదు. స్పీకరులోంచి కొడుకు మాటలు విన్న భర్తదీ అదే పరిస్థితి.

‘ఇదేమిట్రా ఈ నిర్ణయం. ఇద్దరూ ప్రేమించే పెళ్లిచేసుకున్నారు కదా? మరిప్పుడు ఇదేంటిలా?’ తడబడుతూ ప్రశ్నించింది సుజాత.

కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి ‘అదికాదురా, ఇదేం బొమ్మల పెళ్లి కాదుగా... కావాలనుకున్నప్పుడు బొమ్మలకు దండలు వేసి అక్కరలేదనుకుంటే బొమ్మలను తీసుకెళ్లిపోవడానికి. పెళ్లి..., ముగ్గురి బతుకులు ముడిపడి ఉన్న జీవితం...’ అంది సుజాత.

‘మాకూ ఈ డైలాగులు తెలుసు, మేమూ సినిమాలు చూస్తాం. మాకు చెప్పలేదేం అని అనకుండా ఉండేందుకు ముందుగా మీకు చెప్పాం అంతే’ కొడుకు గొంతులో చిన్నప్పటి మొండితనం వినిపించింది సుజాతకి.

‘ఓహో మాకు తెలియజేస్తున్నావన్నమాట. సరే మరి శుభంగాడి గురించి ఏం ఆలోచించారు. మీ అత్తవారికి ఈ విషయం తెలుసా?’

‘ఆలోచించడానికేముంది. వర్ష ఇష్టం, తనకెలా కావాలంటే అలా చేసుకోనీ. తనవాళ్లకి తను చెప్పుకుంటుంది. ఇదేం ప్రపంచంలో పదో వింతకాదు, అందరూ చేస్తున్నదే మేమూ చేస్తున్నాం, ఓకే బై.’

ఎంత సులువుగా చెప్పాడో, ఆపాటి సమన్వయం ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉన్నా ఇప్పుడీ పరిస్థితి ఎందుకొస్తుంది. ఈ కాలం పిల్లలకి అంతా తొందరే. ఏమైనా అంటే ‘డిజిటల్‌ యుగం, ఫాస్టుగా లేకపోతే ఎలా’ అని సమాధానం.

‘ఏమిటే నీ కొడుకు వాగుతున్నాడు. మన ఇంటావంటా ఉందా ఇది? రేపు నలుగురిలో తలఎత్తుకు తిరగాలా? వద్దా? లవ్వూ గివ్వూ అని తమిళ పిల్లని తెచ్చి నెత్తిన పెట్టాడు. వద్దురా మనకి ఇలాంటివి అని చెప్పడం పోయి, కాలం మారిందండీ, పెళ్లిళ్లు వాళ్ల ఇష్టప్రకారమే జరగాలి అని తందాన పాడావు. ఇప్పుడు విడాకులు అంటున్నాడు వెళ్లి తాళం వెయ్యి’ అని కోపంతో ఊగిపోతున్న భర్తని సముదాయించలేక మౌనం వహించింది సుజాత.

శాంతంగా ఆలోచించి పరిష్కరించవలసిన సమస్యకానీ ఇలా అరుచుకుంటే లాభం లేదని తెలిసిన సుజాత ముందుగా వియ్యాలవారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫోను చేతిలోకి తీసింది. నెంబరు నొక్కకముందే వియ్యంకుడి నెంబరు ఫ్లాష్‌ అవుతూ రింగయింది మొబైల్‌.

ఓమారు కలిసి మాట్లాడుకుందాం అని నిర్ణయించుకున్నారు. ఈ లోపున సుజాత కోడలికి ఫోను చేసింది. ఎన్నో రకాలుగా అడిగినా ‘సారీ అత్తమ్మా, రోజూ గొడవలు పడుతూ, ఎడమొహం పెడమొహంగా ఉండే బదులు విడిపోతేనే మంచిదనే నిర్ణయానికి వచ్చాం’ అంటుందే తప్ప మరో మాట లేదు.

కొడుకును కదిపితే ‘తనే విడిపోదాం అంది, అలా అన్న తరువాత ఇంకేం మిగిలింది, నేను సరే అన్నా’ అంటాడు తప్ప మరో మాటలేదు. వియ్యంకుడికి యాభైయేళ్లకి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు. ఈ వయసులో ఇలాంటి వార్త వారి ఆరోగ్యాలమీద దెబ్బకొట్టింది. మనో వ్యాధికి మందేదీ?

ఆరోగ్యరీత్యా కదలలేని పరిస్థితి వాళ్లది. ఉద్యోగ బాధ్యతలతో కదలలేని పరిస్థితి భర్తది. అయినా ఇలాంటి సున్నితమైన విషయాలలో భర్త తలదూర్చకపోతేనే మేలు అనుకుని, పదేళ్ళకి వీసా ఉన్న సుజాత పదకొండో రోజున అమెరికా చేరుకుంది. అప్పటినుంచీ తీరుబాటుగా కూర్చొని పిల్లలతో మాట్లాడాలని చూస్తోంది. పిల్లలు దానికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. ఆఖరుకు భర్త చెప్పినట్లు ఆరునెలలూ ఉత్తినే గడచిపోతాయా? అసలు వాళ్లు తనని మాట్లాడనిస్తారా? అన్నీ ప్రశ్నలే. సమాధానాలు ఎప్పటికి దొరుకుతాయో?

‘‘నానమ్మా ఎక్కడున్నావ్‌.

నిన్న నువ్వు నేర్పిన మృత్యుంజయ మహామంత్రం నాకొచ్చేసిందిగా, విను. ప్రామ్టింగ్‌ లేకుండా చెప్తే 5 క్రెడిట్స్‌ వస్తాయిగా’’ స్కూల్‌ యూనిఫాంలో పరుగెత్తుకు వచ్చాడు శుభం.

‘‘ఉండు నాన్నకి హగ్‌, కిస్‌ ఇచ్చేసి వస్తా’’ అంటూ తండ్రి గదివైపు పరుగెత్తాడు.

వాడికి ఇంగ్లీషు తప్ప మరే భాషా రాదు. అందుకే వాడితో అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడాలి. అమ్మానాన్నల ముద్దుమురిపాలతో పెరిగిన వాడు, వీక్‌ డేస్‌లో అమ్మదగ్గర, వీకెండ్స్‌లో నాన్నదగ్గర ఉండాలని తెలిస్తే ఏమవుతాడు? వాడి భవిష్యత్తు ఏంటీ? తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లల్లా వాడూ సంఘవిద్రోహిగా మారతాడా? తలచుకుంటేనే దడ పుట్టించే ప్రశ్నలు కలవరపరచసాగాయి. ఆలోచనలకు స్వస్తి చెప్పి వాడి ఆటపాటలలో మునిగిపోయింది సుజాత.

ఆ సమాధానం దొరికే సమయం అతి తొందరలోనే రాబోతోందని అప్పటికి సుజాతకి తెలీదు.

*             *             *

‘‘నానమ్మా’’ అంటూ కాళ్లకు చుట్టుకొని వెక్కి వెక్కి రాగాలు పెడుతున్న మనవడిని ఎలా సముదాయించాలో తెలియలేదు సుజాతకి.

‘‘ఏమయిందమ్మా, స్కూల్లో దెబ్బ తగిలిందా చూపించూ, మంత్రం వేసేస్తా, నొప్పి ఉండదు’’

‘‘నో... నో... నాకేం కాలే...’’

‘‘మరి... ఎందుకేడుస్తున్నావ్‌, నీకు తెలుసుగా నువ్వేడిస్తే నాకూ ఏడుపొస్తుందనీ’’ మాట పూర్తి కాకముందే సుజాత కళ్లల్లో నీళ్లొచ్చాయి.

‘‘ఏడవకు నానమ్మా... నేనేడవనులే... మరే... మరే... నా ఫ్రెండు మేక్స్‌ తెలుసుగా?’’

‘‘ఊ తెలుసూ...’’

‘‘వాళ్ల మమ్మీ డాడీ డైవోర్స్‌ తీసుకున్నారు కదా. వీక్‌ డేస్‌లో మమ్మీదగ్గర, వీకెండ్స్‌లో డాడీ దగ్గర ఉండేవాడు. ఇప్పుడేమో డాడీకి గర్ల్‌ఫ్రెండూ, మమ్మీకి బాయ్‌ ఫ్రెండూ వచ్చారు. డాడీయేమో వీకెండ్స్‌కి తీసుకువెళ్లడం మానేశాడు. మమ్మీయేమో వీడిని బాగా పనిష్‌ చేస్తోంది. మమ్మీ బాయ్‌ఫ్రెండు కూడా వీడిని బాగా పనిష్‌ చేస్తున్నాడట. మేక్స్‌ని వెల్ఫేర్‌ సెంటర్లో చేరుస్తారట. అక్కడ మమ్మీడాడీ లేని పిల్లలని చేరుస్తారట, వాడు చాలా దిగులుగా ఉన్నాడు నానమ్మా’’ తిరిగి వెక్కివెక్కి ఏడ్వసాగాడు.

వాడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు సుజాతకి.

అయినా వాడి దుఃఖం చూడలేని సుజాత ‘‘ఏడవకు నాన్నా, మేక్స్‌ వెళ్లిపోతే మరో ఫ్రెండ్‌ దొరుకుతాడులే. వెల్ఫేరు సెంటర్స్‌లో పిల్లలని బాగా చూసుకుంటారమ్మా.

అక్కడ ఎవరూ పిల్లల్ని కొట్టరు. మంచి స్కూల్స్‌లో చదివిస్తారు. నువ్వేం మేక్స్‌ గురించి బెంగ పెట్టుకోకు’’ అంటూ వాడి వెన్ను నిమరసాగింది.

‘‘నేనేం మేక్స్‌ గురించి ఏడవటంలే’’ ఉక్రోషంగా అరచినట్లన్నాడు శుభం.

‘‘మరి’’ అయోమయంగా అంది సుజాత.

‘‘నీకు తెలుసా నానమ్మా, మమ్మీడాడీ కూడా డైవోర్స్‌ తీసుకునేటట్టున్నారు?’’

నానమ్మ వైపు చూస్తూ అన్నాడు శుభం.

‘‘ఛ ఛ అలాంటిదేమీ లేదమ్మా’’

‘‘నీకు తెలీదు నానమ్మా లాస్ట్‌ జనవరి నుంచీ వాళ్లిద్దరూ వేరే వేరే రూమ్స్‌లో పడుకుంటున్నారు. రోజూ గట్టిగా అరుచుకుంటున్నారు కూడా. మేక్స్‌ మమ్మీడాడీ కూడా డైవోర్స్‌కి ముందు ఇలాగే చేసేవారట. నాకు తెలుసు వీళ్లు కూడా డైవోర్స్‌ తీసుకుంటారు’’ బావురుమన్నాడు శుభం.

*             *             *

మనవడిని నిద్ర పుచ్చుతున్న సుజాతలో ఎన్నో ఆలోచనలు... పసివాడు ఎంత వేదన పడుతున్నాడు... పిల్లాడి బాధ చూస్తూ కూడా తల్లిగా తన కొడుక్కి మంచీ చెడూ చెప్పకపోతే తన పెద్దతనం ఎందుకు దొంగలు తోలడానికా? అవును చెప్పాలి, విని ఆచరిస్తే మంచిదే లేకపోతే వాళ్ల ఖర్మ.

నిద్రలో కూడా వెక్కిళ్లు పెడుతున్న శుభానికి దుప్పటి సరిచేసి హాలులోకి వచ్చింది. నిశ్శబ్దంగా డిన్నర్‌ చేస్తున్న కొడుకునీ కోడలినీ చూస్తూ ‘‘నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను’’ అంది సుజాత.

‘‘మాట్లాడ్డానికి ఏమీ లేదమ్మా’’ అంటున్న కొడుకుని ఆపి, ‘‘అదే మీ చదువుకున్న వాళ్లతో ఉన్న సమస్య’’ అంది.

‘‘మాట్లాడాలనుకుంటే మాట్లాడు, కానీ ఫలితం ఉండదు.’’

‘‘మనం చేసే ప్రతీ పనిలోనూ లాభం ఉండాలనుకుంటే జీవితం వ్యాపారమవుతుంది.’’

‘‘సినిమా డైలాగ్స్‌ చెబుతున్నావా అమ్మా?’’

‘‘సినిమాలూ జీవితాల్లోంచే వస్తాయిరా. ఇన్నేళ్ల మీ ప్రేమ, పదేళ్ల మీ వైవాహిక జీవితం ఇలా ఎందుకైంది నాన్నా. ఒక్కసారి ఒకరినొకరు నిందించుకోకుండా ఆలోచించుకోండి. మీరు ఆనందంగా గడిపిన సమయాలు అస్సలు లేవా? ఇద్దరూ ఇలా పిల్లీ కుక్కల్లా పోట్లాడుకోవడానికి కారణాలు ఏమిటి? ఒకరిమీద ఒకరికి ఇష్టం పోయిందా లేక మరెవరి ఆకర్షణలోనైనా పడ్డారా?’’

సుజాత ప్రశ్న పూర్తి కాకుండానే ఇద్దరూ ఒకేసారి ‘‘అదేం కాదు’’ అని జవాబిచ్చారు.

‘‘మరి?’’

‘‘నీకు తెలుసుకదా... నేను వారంలో ఐదురోజులు ట్రావెల్‌ చేయాలి. ఇంటికొచ్చేసరికి భోజనం ఉండదు. బట్టలు వాష్‌ అయి ఉండవు. ఇల్లు పరమ భీభత్సంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నీ కోడలు తీరంతే. రానురానూ ‘నువ్వే చేసుకోవచ్చుకదా నన్ననకపోతే’ అంటుంది. నాలుగేసి గంటలు ఫ్లైటులో ప్రయాణం చేసి ఒళ్లు అలసిపోయి వస్తే సరైన తిండికూడా లేకపోతే ఇకనాకు పెళ్లెందుకు. నా లైఫ్‌కీ బాచిలర్‌ లైఫ్‌కీ తేడా ఏమిటి? ‘రోజూ నీ నస భరించలేను వేరే మార్గం చూడు’ అంది. ‘వేరే మార్గం అంటే విడిపోవడమా?’ అన్నాను, ‘రోజూ తిట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోవడమే మేలు’ అంది. సరే అని విడాకులకు ఏర్పాట్లు చేస్తున్నా’’ అన్న కొడుకు మాటలలో మొత్తం సమస్య అర్థం అయింది సుజాతకి.

‘‘సరే నీ వైపు సమస్యను కూడా చెప్పమ్మా, నీకు తెలుసా మీ అమ్మానాన్నా మీ తొందరపాటు నిర్ణయానికి ఎంత బాధపడుతున్నారో?’’ కోడలితో అంది సుజాత.

‘‘ఆయన వైపునుంచి ఆయన చెప్పారు కదా అత్తమ్మా. ఇక నావైపు నుంచి అంటే- నాది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌. వంటమాట దేవుడెరుగు మంచినీళ్లు తాగడానికి కూడా సమయం ఉండదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా? ఏపాటి సమయం చిక్కినా శుభంగాడి ఫుడ్‌ ప్రిపేర్‌ చెయ్యడం. వాడి బట్టలు వాష్‌ చెయ్యడంతోనే సరిపోతుంది. మరి వరుణ్‌ బట్టలూ నావీ వెనుకపడతాయి. శుభం స్కూలు నలభై మైళ్ల దూరం. రోజూ వాడిని దింపాలి తేవాలి అంటే సుమారు నలభై నలభై ఎనభైమైళ్ల ప్రయాణం. అదీకాక వాడిని స్విమ్మింగుకీ, సాకర్‌ క్లాసులకూ తీసుకువెళ్లాలి. వీకెండ్స్‌లో చిన్మయా మిషన్‌ క్లాసెస్‌కి తీసుకువెళ్లాలి. నాదీ శరీరమే, నాకూ రెస్ట్‌ కావాలి. ‘నీ బట్టలైనా మిషన్‌లో వేసుకోవచ్చుగా’ అంటే నాకు టైం లేదంటాడు వరుణ్‌. వీక్‌డేస్‌లో ఎలాగూ ట్రావెల్‌లో ఉంటాడు. కాబట్టి కనీసం వీకెండు క్లాసులకన్నా శుభాన్ని వరుణ్‌ తీసుకువెళితే నాకు బట్టలు వాష్‌ చేసుకోవడానికీ,
డిష్‌ వాషర్‌ లోడ్‌ చేసుకోవడానికీ వీలవుతుందికదా?’’ వర్ష తన ఇబ్బందులను చెప్పుకుపోతోంది.

నిజమే, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలలో జీతాలు ఎక్కువ. పనికూడా ఎక్కువే. అమెరికాలో ఉన్న వాళ్లకైతే పండుగ పబ్బాలకు సెలవులు కూడా ఉండవు. పొద్దుట అమెరికా కస్టమర్‌తో మాట్లాడాలి. పనిచేసే వారు ఇండియాలో ఉంటారు కాబట్టి తెల్లవార్లూ వాళ్లతో మాట్లాడాలి. కాబట్టి వీరికి రాత్రీ పగలూ తేడా లేదు. చేసే పనికి అంతూ పొంతూ కూడా ఉండదు. చిన్నప్పటినుంచీ ఇటు పుల్ల అటు పెట్టకుండా పెరిగిన పిల్లలు... పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీలో పెద్ద జీతం అనగానే ఆకాశంలో విహరిస్తారు. వాస్తవంలో పడేసరికి ప్రేమ పెళ్లో, పెద్దలు కుదిర్చిన పెళ్లో అయి ఒకరో ఇద్దరో పిల్లలు కలిగి కష్టాలు మొదలవుతాయి. సరైన నిద్రాహారాలులేక పని ఒత్తిడి తట్టుకోలేక వచ్చే చిరాకు ఇంట్లో వారిమీద చూపించడం మొదలుపెడతారు కానీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు మాత్రం వెతకరు. విడాకులే వారి సమస్యకి పరిష్కారమనుకుంటున్నారు. ఆలోచనల్లోంచి బయటపడి

‘‘తలనొప్పి వస్తే తల నరుక్కుంటామా? బామ్‌ రాసుకుంటామా?’’ కొడుకును అడిగింది సుజాత.

‘‘నువ్వు మరీనమ్మా, తల ఎవరైనా నరుక్కుంటారా?’’

‘‘మరి మీరు అదే చేస్తున్నారు కదా?, ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకుని మందు వేయాలిగానీ ఇదేమిట్రా?’’

‘‘అంటే మేం అనవసరంగా రియాక్ట్‌ అవుతున్నామనా? మాకు ఆలోచించే

శక్తి లేదనా?’’

‘‘శక్తి ఉంది కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు.’’

‘‘నీ ఉద్దేశ్యంలో సమస్య ఎక్కడ ఉన్నట్లు?’’

‘‘అలా అడిగావు బావుంది. సమస్య

మీ ఉద్యోగాలలో ఉంది.’’

‘‘అయితే ఉద్యోగం మానేసి కూర్చోమంటావా?’’

‘‘ఆ తొందరే వద్దనేది, సమస్యకి తగిన చర్య తీసుకోవాలి. వంకాయకూరలో ఉప్పు ఎక్కువయిందని నువ్వూ, తిన్న కంచం తియ్యలేదని కోడలూ కోర్టుకెక్కితే ఎలా? చిన్నవాడైనా శుభం చక్కగా తన వాదన వినిపించాడు. వాడి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? నీ చిన్నప్పుడు- చిన్నప్పుడు ఏమిటి ఇప్పటికీనూ, నాకూ మీ నాన్నకూ ఏ విషయంలోనూ అభిప్రాయాలు కలవలేదు. అంతమాత్రాన విడిపోయామా? కొన్నిసార్లు ఆయన మాటకు నేను విలువిచ్చి పాటించాను. కొన్నిసార్లు నామాట చెల్లించుకున్నాను. దేనికైనా పట్టూ విడుపూ ఉండాలి. సరే మీరన్నట్టుగానే అభిప్రాయాలు కలవలేదని విడాకులిచ్చేసుకుని మరో భాగస్వామిని వెతుక్కుంటే వారితో అభిప్రాయభేదాలు రావని గ్యారంటీ ఉందా? అలా జరిగితే మళ్లీ విడాకులా? శుభం వాడి అభిప్రాయం చెప్పాడు కదా. నేను కొన్ని సలహాలు ఇస్తాను. ఆలోచించండి, నచ్చితే పాటించండి, సరేనా?

మేము ఎవరికీ తలవంచం. మమ్మల్ని ఏ బంధాలూ కట్టిపడెయ్యలేవు. మేం సర్దుకోలేం కానీ ఎదుటివారు అన్నింటికీ ఒదిగి ఉండాలి... ఇది మీ అభిప్రాయం.

ఇది న్యాయమేనా? ఒకరు ఒక మెట్టు ఎక్కాలి. అవసరమయితే ఒకమెట్టు దిగాలి. మనం మాట్లాడే ప్రతి మాటనూ ఆచితూచి వాడాలిగానీ నోరుందికదా అని నోటికొచ్చింది మాట్లాడితే ఎలా? ప్రతి యాక్షనుకీ రియాక్షను ఉంటుంది అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఆడకైనా మగకైనా ఇది వర్తిస్తుంది. ఒకటి చెప్పండి... మీ బాసుతో అభిప్రాయభేదం వస్తే ఏం చేస్తున్నారు... సర్దుకుపోతున్నారా, మాటకు మాట అని దెబ్బలాడుతున్నారా?’’

‘‘మాటకు మాట అంటే వెంటనే ఫైరే.’’

‘‘కష్టమర్‌తోనో..?’’

‘‘ఇంకా జాగ్రత్తగా ఉంటాం.’’

‘‘మీ సబార్డినేట్స్‌తోనూ చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి పని చేయించుకుంటారు అవునా? మరి మీ ఇద్దరూ మాట్లాడు కొనేటప్పుడు మాత్రం సామరస్యం ఎందుకు లోపిస్తోంది? మా కాలంలో ఆఫీసులలో పని కాబట్టి మేం ఆఫీసుని గుమ్మం బయటే విడిచి ఇంట్లోకి వచ్చేవాళ్లం. ఇప్పుడు మీకు ఇల్లే ఆపీసు కాబట్టి మీ ల్యాప్‌టాప్‌ మూసేయగానే మీ లైఫ్‌ మొదలవుతుంది. మీరు చేసే ఉద్యోగం ముప్ఫైయేళ్లు మాత్రమే- అది గుర్తుంచుకోవాలి.

మిమ్మల్ని గమనించిన తరువాత నాకు బోధ పడింది ఏమిటంటే ‘ఇంటి పనులు నేనెందుకు చెయ్యాలి, మగవాడిని’ అనే అహంకారం నీది. ‘నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్నీ నేనెందుకు చెయ్యాలి’ అనేది వర్ష అభిప్రాయం. మొత్తం మీ సమస్యలకు ఇదే కారణం.

దీనికి సింపుల్‌గా ఒక సొల్యూషన్‌ చెబుతాను వినండి. ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు కాబట్టి మీ ఇంటి పనులకి పనిమనిషిని పెట్టుకోండి. పిల్లాడి స్కూలుకి దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రతిరోజూ నలభైమైళ్ల దూరం ప్రయాణం తగ్గి నీకు అలసట తగ్గుతుంది. వండుకోవడానికి సమయం లేదని ఏదో ఫాస్టుఫుడ్‌ తినీ, లేకపోతే అసలు తినకా నీరసపడి ఆ కోపం పిల్లాడిమీదో భర్తమీదో చూపించే బదులు ఇండియన్‌ స్టోర్‌లో దొరికే కూరలు తెచ్చుకుని అన్నం వండుకుంటే సరి. లేదా ఇళ్లల్లో తయారు చేసి హోమ్‌ డెలివరీ చేసేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లతో రోజువారీ ఏర్పాటు చేసుకున్నా హాయిగా గడిచిపోతుంది. మరో ముఖ్యమైన సంగతి, స్ట్రెస్‌ మేనేజ్‌మెంటు... మన శరీరాన్నీ మైండ్‌నీ అప్పుడప్పుడూ రీఛార్జ్‌ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మీకోసం మీరు సమయం వెచ్చించుకోవాలి. శని ఆదివారాలలో మరీ ముఖ్యమైన కాల్స్‌ అయితే తప్ప ఆన్సర్‌ చేయకండి. మీ కుటుంబంతో మీకు నచ్చిన రీతిలో గడపండి. మూడు నాలుగు నెలలకొకసారి ఔటింగుకి వెళ్లిరండి. ప్రతీ చిన్న విషయానికీ విడాకులు కాదు పరిష్కారం. ఎలా విడిపోవాలో కాక ఎలా కలిసుండాలో ఆలోచించండి.

మీ జీవితాలు మీవే కాదనను. కానీ మీ జీవితాలతో పెనవేసుకున్న పిల్లాడి గురించి కూడా ఆలోచించాలిగా? మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ముద్దుమురిపాలు పొందారు. మరి వాడు చేసిన పాపం ఏంటి? మీరు ఎదుర్కొన్న సమస్యలు మేం ఎదుర్కోలేదా? మీకు కనీసం ఆర్థిక సమస్యలేదు. కానీ మా దగ్గర చాలినంత డబ్బూ ఉండేది కాదు. ఓ వీకెండు సినిమా అనీ మరో వీకెండు పార్కుకనీ తక్కువ ఖర్చుతో ఉండే వాటిని ఎంచుకునేవాళ్లం. అంతేకానీ పిల్లలనీ ఇంటినీ వదిలి పెట్టేయాలని ఎప్పుడూ అనుకోలేదు. భార్యభర్తలు ఒకరికి ఒకరు ఒదిగి ఉండడం తప్పుకాదు. ఒకరు కోపంలో ఉన్నప్పుడు మరొకరు తగ్గాలి.

అంతమాత్రాన మనం ఓడిపోయినట్టుకాదు. సంసారం సాగరం అన్నారు కానీ సంసారం సమరం అనలేదు. ఈ చిన్న విషయం మీకు అర్థమైతే చాలు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మీకు నచ్చితే ఆచరించండి లేదా మీ ఇష్టం.
నాకూ పిల్లాడికీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. నేను వాడిని అనాథగా వదల్లేను’’ అనేసి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది. తన సూచన వాళ్లకి ఆమోదయోగ్యమవు తుందో కాదో తెలియని ఆందోళన తెలతెలవారే వరకూ నిద్రను ప్రసాదించలేకపోయింది.

*             *             *

శుభం మెల్లగా ‘‘నానమ్మా’’ అని పిలవడంతో మెలకువ వచ్చింది సుజాతకి.

‘‘పద నానమ్మా బ్రష్‌ చేసుకుందాం’’ అనడంతో తలుపు తీసింది సుజాత.

‘‘సర్‌ప్రైజ్‌... సర్‌ప్రైజ్‌ శుభం...’’

అంటున్న అమ్మానాన్నలని నమ్మలేనట్లు చూశాడు శుభం.

ఇల్లంతా అలంకరించిన కొవ్వొత్తులనీ, డైనింగు టేబుల్‌పైన పెట్టిన పువ్వులనూ, కేక్‌నీ చూసి, ‘వావ్‌ ఐ లవ్‌ యూ, ఐ లవ్‌ యూ మమ్మీడాడీ. నానమ్మా దా ఫ్యామిలీ హగ్‌ టైమ్‌’ అంటున్న శుభం మొహంలో కోటి చంద్రుల కాంతిని చూసింది సుజాత.

‘వన్‌ సెకండ్‌’ అని ‘మిషన్‌ సక్సెస్‌’

అని భర్తకి వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టి పరుగున వచ్చింది సుజాత.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..