స్వాభిమానం

‘‘ఏంటి జయా, చాలా హుషారుగా ఉన్నట్లున్నావు... ఏంటి విశేషం?’’ కూనిరాగాలు తీస్తూ పెరట్లో పని చేసుకుంటున్న జయని అడిగింది పక్కింటి నిర్మల.

Updated : 23 Oct 2022 06:37 IST

స్వాభిమానం

- నిరుపమ రావినూతల

‘‘ఏంటి జయా, చాలా హుషారుగా ఉన్నట్లున్నావు... ఏంటి విశేషం?’’ కూనిరాగాలు తీస్తూ పెరట్లో పని చేసుకుంటున్న జయని అడిగింది పక్కింటి నిర్మల.

‘‘నా కోడలు పల్లవి ఉద్యోగం మానేస్తుందట’’ గొప్ప సంబరంగా చెప్పింది జయ. సరిగ్గానే విన్నానా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది నిర్మల.

జయ, నిర్మల ఇద్దరూ పక్కపక్క ఇళ్ళవారు. ఇద్దరికీ ఎదిగొచ్చిన పిల్లలు తలా ఒకచోట స్థిరపడ్డారు. దాంతో రెండు కుటుంబాలూ ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు కలబోసుకుంటూ కొద్దికాలంలోనే మంచి స్నేహితులయ్యారు. కొన్నాళ్ళక్రితం కోడలు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తోందని జయ ముభావంగా చెప్పటం గుర్తొచ్చింది నిర్మలకి. ఉద్యోగం చేస్తుంటే సంతోషించాల్సింది పోయి, అలా డల్‌గా ఉన్నావేంటని అడిగినా పొడిపొడిగా మాట్లాడి మాట దాటేసింది. దాంతో నిర్మల మరి రెట్టించలేదు అప్పుడు.

ఇంతలోనే ఇవాళ ఈ వార్త. ఆ చిక్కుముడి ఏంటో ఇవాళ తెల్సుకోవాల్సిందే అనుకుంటూ- ‘‘అదేంటే జయా, పల్లవి జాబ్‌ చేస్తున్నప్పుడు సంతోషించకుండా, మానేస్తుందన్నప్పుడు పొంగిపోతున్నావు. అసలెందుకు మానేస్తుందిట? హాయిగా కొడుకూ కోడలూ ఇద్దరూ జాబ్స్‌ చేసుకుంటూ ఉంటే వేన్నీళ్ళకి చన్నీళ్ళలా ఉండేది కదా. పైగా ఆ మధ్య కలిసినప్పుడు తను పనిచేసే కాలేజీ గురించి, తన విద్యార్థులు తనతో ఎంత ప్రేమగా ఉంటారో చాలా సంతోషంగా చెప్పింది పల్లవి. ఇంతలోనే ఏమైంది? రిజైన్‌ చెయ్యాల్సినంతటి కష్టం ఏమొచ్చింది? ఇంట్లో అంతా బాగే కదా?’’ అని పరామర్శించింది నిర్మల.

దానికి జయ గట్టిగా పకపకా నవ్వి, ‘‘ఇప్పుడే అంతా బాగుపడుతుంది నిర్మలా. నీకు తెలుసు కదా... మా అబ్బాయి నవీన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా చేస్తున్నాడు. మంచి జీతం, పెద్ద హోదా, అంతకుమించిన పని ఒత్తిడి. ఈ వర్క్‌ఫ్రం హోం పుణ్యమా అని, ఉదయం లేచిన దగ్గరనుంచీ అర్ధరాత్రి వరకూ మీటింగ్‌లనీ, డెడ్‌లైన్లనీ ఎడతెగని పని. ఇది చాలదన్నట్టు పల్లవి పొలోమంటూ పొద్దునే కాలేజీకెళ్ళి, సాయంత్రం ఈసురోమని వచ్చి, ఏదో అంత ఉడకేసి, వీడికీ పిల్లలకీ పెడుతుంది.

ఎదిగే పిల్లలూ వాళ్ళ చదువులూ తిండీతిప్పలూ ఇవేవీ పట్టకుండా చేసే ఆ లెక్చరర్‌ గిరీ అంత అవసరమా? తను చక్కగా నీడపట్టున ఇంట్లో ఉండి, నవీన్‌కీ పిల్లలకీ మంచిగా వండిపెడ్తూ, వాడికి వేరే టెన్షన్స్‌ లేకుండా చూడొచ్చు కదా? నెలంతా చచ్చేంత చాకిరీ చేస్తే, ఆవిడకొచ్చేది పదిహేనువేలు. అది నా కొడుకు కారు పెట్రోలుకి కూడా చాలదు. నవీన్‌ నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు. అవి చాలవా వాళ్ళు సుఖంగా బ్రతకటానికి? ఇవి చాలక పుట్టినరోజులనీ పెళ్ళిరోజనీ మేం బంగారం, బట్టలూ, బహుమతులూ ఇస్తూనే ఉంటాం. ఇన్ని చేస్తున్నా... ఇంకా, నేనూ నా ఉద్యోగం అనుకుంటూ వెళ్తోంది. పాపం నవీన్‌- అటు తన ఉద్యోగం, ఇటు ఈవిడ ఇంటికొచ్చేవరకు ఇల్లూ, పిల్లలూ అన్నీ చూసుకుంటూ సహస్రావధానం చేస్తున్నాడు. ఎవరు సుఖపడుతున్నారు ఈవిడ వెలగబెట్టే ఉద్యోగంతో? ఎవర్ని ఉద్ధరించడానికి ఇల్లూ, పిల్లల్నీ చూసుకోక?’’ అంటూ ఆవేశంతో రొప్పుతూ కాస్త ఆగింది.

‘‘నిన్ననే నవీన్‌ ఫోన్‌ చేసి పల్లవికి అన్నీ మానేజ్‌ చేసుకోవటం కష్టంగా ఉందనీ, అందుకే జాబ్‌ రిజైన్‌ చేస్తానందనీ చెప్పాడు. పోనీలే ఇప్పటికన్నా వాడూ, పిల్లలూ కాస్త స్థిమితపడతారు’’ సంబరంగా చెప్పింది జయ. సంభ్రమంగా వింటున్న నిర్మల ‘‘ఇంతకీ ఎందుకు మానేస్తానందో కారణం వివరంగా కనుక్కున్నావా?’’ అని అడిగింది.

‘‘ఏముంది, పొద్దునే అందరికీ టిఫిన్లూ వంటా చేసి, క్యారేజీలు సర్ది, పిల్లలని స్కూలుకి పంపి, మా వాడికి లంచ్‌ రెడీ చేసిపెట్టి, కాలేజీకి వెళ్ళి పని చేసొచ్చి, మళ్ళీ సాయంత్రం వంటపనీ పిల్లలపనీ అంటూ పని చేసేసరికి నొప్పి తెలిసొచ్చి ఉంటుంది. నేను ఎప్పుడు ఫోన్‌ చేసినా తను బిజీబిజీ. ఎందుకొచ్చిన తిప్పలు, ఇంటిపట్టున ఉండొచ్చుకదా అని ఎన్నిసార్లు చెప్పినా వింటేనా? జీతం తీసుకొచ్చి మాకివ్వు,నీ తిప్పలు నువ్వు పడు అనే అత్తమామలుండే ఈ రోజుల్లో, హాయిగా ఇల్లూ పిల్లలూ చూసుకోమ్మా అన్నా కూడా వినిపించుకోలేదు ఇన్నాళ్ళూ. ఇప్పుడు తెలిసొచ్చినట్టుంది’’ కచ్చగా అంది జయ.
నిర్మల అన్యమనస్కంగా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది.

మర్నాడు నిర్మల- ఇల్లు కాస్త చూస్తుండమనీ, తాము తమ కొడుకు దగ్గరకు వెళుతున్నామనీ, ఎప్పుడొస్తామో తెలియదనీ చెప్పింది.  ఉన్నపళంగా ఈ ప్రయాణమేంటని అడిగిన జయకి ‘‘ఒక విధంగా దీనికి నువ్వే కారణం జయా. రాత్రంతా నువ్వు చెప్పిన దాని గురించే ఆలోచన. పల్లవి నిస్సహాయంగా... తన ఇంటివాళ్ళే మాటల తూటాలతో పొడుస్తుంటే... వేరే దారి లేక జాబ్‌ వదిలేస్తోందేమో అనిపించింది. అలాంటి పరిస్థితి నా కోడలికి రాకూడదనుకుని, ఈ ప్రయాణం పెట్టుకున్నాం. అన్నట్టు, నా కోడలికి స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. తనూ పిల్లలూ అంతా కుదురుకునేంతవరకూ కాస్త సాయంగా ఉందామని వెళుతున్నాం’’ అంది నిర్మల.

‘‘అయితే కొడుకింట్లో శాశ్వతంగా పనిమనిషిగా చేరటానికి వెళ్తున్నావన్నమాట. అయినా నేను పల్లవి గురించి అన్నదాంట్లో తప్పేముంది?’’ ఉక్రోషంగా అంది జయ.

‘‘జయా, ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఉద్యోగం అనేది ఒక గుర్తింపు, అవసరం. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన అని స్టేజీ ఎక్కి ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా, తమదాకా వచ్చేసరికి, తమ కోడలు ముందు ఇంట్లోవాళ్ళ అవసరాలు చూశాకే, తన పని చేసుకోవాలని అనుకుంటున్నారు. డబ్బు ఎంత సంపాదిస్తున్నాం అనేకన్నా, కుటుంబ నిర్వహణలో తన కష్టార్జితం కూడా కలిసి ఉందన్న విషయం, ఆ ఇంటి ఇల్లాలికి గొప్ప సంతృప్తినిస్తుంది. ఆ ఉద్యోగం తన ఉనికి, తన గౌరవం. ఒకరి భార్యగానో లేక ఒకరి తల్లిగానో మాత్రమే కాకుండా కుటుంబంలో, సమాజంలో తనకొచ్చే ఒక ప్రత్యేకమైన గుర్తింపు.

తన చదువుకు తగిన విలువ ఇచ్చే పనిని కష్టమైనా సరే ఎంతో ఇష్టంగా చేస్తుంది. ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తునట్టు కాదు. పనినీ, కుటుంబాన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళే సవ్యసాచులు నేటితరం అమ్మాయిలు. కానీ, దానికి సరైన తోడ్పాటు కావాలి. ఇక్కడ మనం చేసుకునే ఇంటిపనులే అక్కడా నేను చేస్తానన్నది. ఆ మాత్రానికే నా కోడలు- పిచ్చిపిల్ల తెగ సంబరపడిపోయింది. నా వాళ్ళ కోసం నేను చేసే పనులు నీ దృష్టిలో నన్ను పనిమనిషిని చేస్తే, నిన్ను చూసి జాలిపడటం తప్ప నేను చేసేదేంలేదు. ఒక చిన్న మాటసాయం, ప్రేమగా ఒక పలకరింపు,
ఏ పరిస్థితిలోనైనా మీకు మేమున్నామనే భరోసా ఈ కాలం పిల్లలకిస్తే మన ఆస్తులేమీ కరిగిపోవు’’ చురుగ్గా చెప్పింది నిర్మల.

‘‘కానీ, ఉద్యోగం మానెయ్యమని నేనెప్పుడూ పల్లవికి ఆంక్షలు పెట్టలేదు. ఇది తన సొంత నిర్ణయమే’’ రోషం తగ్గలేదు జయకి.

‘‘చూడు జయా, పల్లవి పని గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చూపించే విముఖతా, మాటల్లో నిరసనా, తన సంపాదన పట్ల చిన్నచూపూ నేనెప్పుడో గమనించాను. పల్లవి గుర్తించి ఉండదనుకున్నావా? కుటుంబమా, ఉద్యోగమా లాంటి సంకటం వస్తే, ఏ అమ్మాయైనా కుటుంబాన్నే కోరుకుంటుంది. కానీ అంతరంతరాల్లో ఏదో అసంతృప్తి. అది కొండలా పెరిగి ఇప్పుడు మనం వింటున్న డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యలు. అంతెందుకు... పల్లవికి ఇల్లు చూసుకోవటం కష్టంగా ఉంది కాబట్టి నవీన్‌ని జాబ్‌ మానేసి ఇల్లు చూసుకోమని చెప్పగలమా? మరి పల్లవికి మాత్రం ఆ పరిస్థితి ఎందుకు? తన సంపాదనతో తను ఇష్టపడి కొనుక్కున్న చీర, అహంతో అతిశయంతో నువ్విచ్చే నగల సాటి ఎప్పటికీ చెయ్యదు. అది తన స్వాభిమానానికి సంబంధించింది. దాన్ని తూట్లు పొడవటానికి ఒక్క పదునైన మాట చాలు. మానసికంగా ఎంత నలిగిపోయి ఉండకపోతే తనకెంతో ఇష్టమైన ఉద్యోగం వదులుకోవటానికి పల్లవి సిద్ధపడి ఉంటుంది. ఇష్టపూర్వకంగా వదిలెయ్యటం వేరు, వేరే దారి లేక వదిలేసుకోవటం వేరు. ఇన్నాళ్ళూ ఇది మీ కుటుంబ విషయమని నేను తల దూర్చలేదు. కానీ, నా కోడలికే అలాంటి ఇబ్బంది వస్తే, నేనే దగ్గరుండి తనని ముందుకు నడిపిను. అందుకే ఈ ప్రయాణం’’ స్థిరంగా చెప్పి వెళ్ళిపోయింది నిర్మల.

తనెప్పుడు ఫోన్‌ చేసినా, పల్లవి అనాసక్తిగా పొడిపొడిగా ఎందుకు మాట్లాడుతుందో, ఎంత ఖరీదైన బహుమతులిచ్చినా అభావంగా ఎందుకుంటుందో అర్థమైంది జయకి. ఆ తప్పు ఎలా సరిదిద్దుకోవాలో నిర్మల మార్గం చూపింది. కళ్ళకి పట్టిన అహపు పొరలు తొలగుతుండగా, తన ఉద్యోగం మానొద్దనీ, తనకి సాయంగా వస్తున్నాననీ చెప్పటానికి పల్లవికి ఫోన్‌ కలిపింది జయ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు