లక్ష్మణ రేఖ

‘‘అలుక మానవే చిలుకల కొలికిరో’’ అంటూ పాడుతూ సుమతి చుట్టూ తిరగసాగింది.‘‘నేను అలిగితే నీకేంటి?’’ అంటూ సుమతి బెట్టు చేసింది.‘‘ఓకే తల్లీ, ఇక నీ మాట జవదాటనని ఇదే చెప్పుచుంటిని’’ నాటక ఫక్కీలో అంటూ సుమతిని నవ్వించింది.

Published : 29 Oct 2022 23:28 IST

లక్ష్మణ రేఖ

- తాడిమేటి శ్రీదేవి

‘‘ఏంటి రవళీ, ఎక్కడికి బయలుదేరావు?’’ బల్ల మీద ఉన్న పుస్తకాలు నీటుగా సర్దుతూ అడిగింది సుమతి.

‘‘అడిగావా... బయటికి వెళ్ళేటప్పుడు ‘ఎక్కడికి’ అని అడగొచ్చా?’’ చిరుకోపం నటిస్తూ జుట్టును గబగబా దువ్వుకుని పోనీ టైల్‌లో బంధిస్తూ అడిగింది రవళి.

‘‘ఎగ్జామ్స్‌ దగ్గరకు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావ్‌ అని అడిగాను- నా అపరాధాన్ని క్షమించు తల్లీ’’ చేతులు జోడించింది సుమతి.

‘‘అలా రా దారికి. ఇంకా ఎనిమిదేగా అయింది. ఓ గంటలోపే వచ్చేస్తాను. సుధీర్‌ బయట డిన్నర్‌ చేద్దాం అన్నాడు’’ అద్దంలో చూసుకుంటూ చెప్పింది రవళి.

‘‘ఎందుకు ఇలా రాత్రిపూట బయట తిరగడం? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడంలేదు. వంట కూడా అయిపోయింది కదా- అతనికి ఫోన్‌ చేసి ఈరోజు కలవను, ఇంకో రోజు చూద్దామని చెప్పేయ్‌’’ అంది సుమతి.

రవళికి ఆ మాటలు నచ్చలేదు అని ఆమె మొహం స్పష్టం చేసింది. విసురుగా సమాధానం చెప్పబోయి నవ్వుతూ తేల్చేసింది... ‘‘అమ్మా ముసలమ్మా, ఏ యుగంలో ఉన్నావు? సిటీ లైఫ్‌ రాత్రే మొదలవుతుంది. అన్నం మిగిలిపోతుందని అనవసరంగా ఫీల్‌ అవ్వకు. రేపు టిఫిన్‌కి దాన్ని బ్రహ్మాండమైన నిమ్మకాయ పులిహోరగా మార్చేస్తాన్నేను. తమరు భోజనం చేసి నా కోసం భజన చేస్తూ కూర్చోకుండా పడుకోండి. కొంచెం లేట్‌ అయినా కంగారుపడకు. కొంపలు మునిగిపోవు’’ అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గడప దాటింది.

*   *  *

సుమతి, రవళి ఒకే ఊరివాళ్ళు. ఇద్దరివీ మధ్య తరగతి కుటుంబాలే. ఇంజినీరింగ్‌ సీట్లు సంపాదించుకుని, హాస్టల్లో ఉండి మొదటి సంవత్సరం చదువుతున్నారు.

ఇద్దరికీ హాస్టల్లో తిండి పడక జబ్బు పడటంతో, తల్లిదండ్రుల అనుమతితో చిన్న గది అద్దెకు తీసుకుని వండుకు తింటూ చదువుకుంటున్నారు. ఊరి నుంచి ఎవరు వచ్చినా ఊరగాయలూ ఇతర తినుబండారాలూ తెచ్చి ఇవ్వడంతో బాగానే మేనేజ్‌ చేసుకుంటున్నారు.

ఈ మధ్యన సుమతికి- హాస్టల్‌లోనే ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. అక్కడ టైమ్‌ ప్రకారం ఉండటం, వార్డెన్‌ భయం ఉండేవి. విడిగా గది తీసుకున్న తరవాత రవళిలో చాలా మార్పు కనిపిస్తోంది. క్లాస్‌మేట్‌ సుధీర్‌తో బయటకు తిరగడాలు పెరిగాయి. సుమతి హెచ్చరించినా లెక్కచేసే దశలో లేదు.

చేసేది లేక భోజనం చేసి చదువుకోసాగింది సుమతి. పదిన్నర దాటినా రవళి రాకపోవడంతో సుమతికి కంగారు మొదలయింది. సెల్‌ చేతిలోకి తీసుకుంది. ఇంతలో తలుపు చప్పుడూ, ‘సుమతీ’ అన్న పిలుపూ వినబడి తలుపు తీసింది.

‘‘ఏమిటిది రవళీ, ఇంత లేట్‌గానా ఇంటికి చేరడం? మనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అసలు? ఎందుకిలా చేస్తున్నావు?’’ కొంచెం గట్టిగానే అడిగింది సుమతి.

‘‘నువ్వు ఇప్పుడు నీతి పాఠాలు మొదలుపెట్టకు, నాకు నిద్ర వస్తోంది’’ అంటూ రవళి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. వచ్చాక ఏమీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా దుప్పటి ముసుగు పెట్టింది. సుమతి ఏం చేయాలో తోచక అలాగే ఉండిపోయింది. తరవాత నెమ్మదిగా నడిచి వచ్చి మంచం మీద నడుం వాల్చింది.

*   *  *

మర్నాడు సుమతి ఏమీ మాట్లాడకుండా తన పనులు తాను చూసుకోసాగింది. సుమతి అలా ఉండటం రవళికి అస్సలు నచ్చలేదు. సుమతి మాట్లాడకపోతే రవళి తట్టుకోలేదు. చిన్నతనం నుంచీ ఉన్న ఫ్రెండ్‌షిప్‌ వల్ల సుమతి అంటే ప్రాణం పెడుతుంది. కానీ సుధీర్‌ విషయంలో స్నేహితురాలు చెప్పే సుద్దులు ఆమెకి చెవికి ఎక్కడం లేదు.

‘‘అలుక మానవే చిలుకల కొలికిరో’’ అంటూ పాడుతూ సుమతి చుట్టూ తిరగసాగింది.

‘‘నేను అలిగితే నీకేంటి?’’ అంటూ సుమతి బెట్టు చేసింది.

‘‘ఓకే తల్లీ, ఇక నీ మాట జవదాటనని ఇదే చెప్పుచుంటిని’’ నాటక ఫక్కీలో అంటూ సుమతిని నవ్వించింది. సుమతి నవ్వగానే ‘‘నవ్వింది పూల చెండు, నాదేలే నా ఫ్రెండు’’ అంటూ పాట అందుకుంది రవళి ఆనందంగా.

ఒకరోజు సుమతి రూమ్‌కి వచ్చేసరికి రవళి నాన్నగారు బయట వెయిట్‌ చేస్తున్నారు. ‘‘మీరు ఏంటి బాబాయ్‌ ఇలా వచ్చారు?’’ అన్న సుమతితో, ‘‘పనుండి వచ్చానమ్మా, రవళి ఇంకా రాలేదా? కిందటి వారం వచ్చినప్పుడు కూడా దాన్ని కలవడం కుదరలేదు’’ బాధగా అన్నాడు సదాశివం.

‘‘దాని బ్యాచ్‌ వాళ్ళకి ప్రాక్టికల్స్‌ పెట్టినట్లున్నారు బాబాయ్‌. అక్కడికి వెళ్ళడానికి ఉండదు. మీరు వచ్చి వెళ్ళారని నేను చెపుతాలెండి’’ అంది సుమతి. తను తెచ్చిన కూరగాయలూ తినుబండారాలూ సుమతి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఆయన.

మధ్యమధ్యలో రవళి సుధీర్‌తో కలిసి బయటకు వెళ్తూ ఉండటం సుమతి హెచ్చరించడం జరుగుతూనే ఉన్నాయి.

‘‘రవళీ, మనం ఆడపిల్లలం. ఒక గీత గీసుకుని ఉండటం అలవాటు చేసుకోవాలి. ఎటుపోయి ఎటొచ్చినా మనకే నష్టం. అరిటాకూ ముల్లూ సామెత తెలిసిందే కదా’’ అంది సుమతి.

‘‘తెలుసు ముసలమ్మా తెలుసు. నా బుర్ర తినకు. నేను జాగ్రత్తగానే ఉంటాను’’ తీసిపారేసింది రవళి.

‘‘మన ఊరి వాడైన రమణ- సుధీర్‌ అంత మంచివాడు కాదు అని చెప్తున్నాడు. అతనికి చాలామంది చెత్త ఫ్రెండ్స్‌ ఉన్నారట. జాగ్రత్తగా ఉండకపోతే కష్టం. ఎందుకు చెప్తున్నానో అర్థంచేసుకో’’ అంటున్న సుమతితో-

‘‘ఎవరూ... రమణ చెప్పాడా? అతనికి సుధీర్‌ అంటే జలసీ. సుధీర్‌ ఫ్రెండ్స్‌ అతనిలాగే బాగా డబ్బున్న వాళ్లు. అలాంటి వాళ్ళను చూస్తే రమణ లాంటి వాళ్ళకు బాధ, అంతే.’’

మరీ అంత డబ్బున్న సుధీర్‌ నీతో స్నేహం ఎలా చేస్తున్నాడు?’’ అడిగింది సుమతి.

‘‘బికాజ్‌ హి లవ్స్‌ మి’’ శుభలేఖ సుధాకర్‌లాగా ఫన్నీగా సమాధానం చెప్పింది. ‘‘అతనికి గర్వం లేదు. అందుకే నేను ఫిదా అయిపోయాను’’ నవ్వింది రవళి.

*   *  *

ఏవేవో మాటలు కలగాపులగంగా వినిపిస్తున్నాయి. మగతగా అనిపిస్తూ రవళికి మెలుకువ రావటం లేదు.కాసేపటికి- కళ్ళు విడివడటం లేదుగానీ మాటలు అర్థం కాసాగాయి. అనంతగిరి చూసి వద్దాం అని సుధీర్‌ కార్లో బయలుదేరారు అని గుర్తు వస్తోంది. ‘అక్కడ నేచర్‌ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాంటిచోట ఈ బ్యూటీతో కలిసి గడపాలనుంది’ అన్న సుధీర్‌ మాటలకు రవళి బుగ్గలు ఎర్రబడ్డాయి. ‘కొన్ని ఫోటోలు తీసుకుని వెంటనే వచ్చేద్దామంటేనే...’ షరతు పెట్టినట్టు అంది రవళి. ‘అలాగే, ఆ ముసలమ్మ- అదే నీ ఫ్రెండ్‌తో కలిసి ఉండి, నువ్వు కూడా అలాగే తయారయిపోయేలా ఉన్నావు’ అన్నాడు సుధీర్‌. పొద్దున్నే బయలుదేరారు. బాగా ఎండగా ఉందని కారు దిగి వెళ్ళి కూల్‌డ్రింక్‌ తెచ్చాడు సుధీర్‌. అది తాగాక మత్తుగా అనిపించింది. ‘తలంటు పోసుకుని ఉన్నావు. పైగా చల్లటి గాలి. నేను నిద్రపోలేను కదా. నీకేంటి, హాయిగా నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకో’ అని సుధీర్‌ అనడం, తనూ అలాగే నిశ్చింతగా పడుకోవడం ఒకదాని వెంట
ఒకటి గుర్తు వచ్చాయి.

‘‘పిల్ల మాత్రం సూపర్‌ రా’’ ఎవరో అంటున్నారు.

‘‘జాంపండులా నోరూరిస్తోందిరా’’

ఇంకో గొంతు. ‘‘గట్టిగామాట్లాడకండిరా, మెలుకువ వస్తే కష్టం.’’

‘‘ఇంకాస్త ఎక్కువ కలపలేకపోయావా’’ వెనక నుంచి వెకిలి నవ్వు ఒకటి వినబడింది.

‘‘ఇంకా కలిపితే- ఆ టైమ్‌లో కూడా నిద్రపోతే మజా ఏముందిరా?’’ ఇంకొకడు అంటున్నాడు. వీళ్ళు ఎవరు..? కారులోకి ఎప్పుడు ఎక్కారు... సుధీర్‌ కూడా వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉండటం, వాళ్ళ వెకిలి మాటలూ అన్నీ కలిపి రవళికి విషయం తేటతెల్లం అవుతూ వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. పూర్తిగా అన్నీ తెలుస్తున్నా అలానే పడుకుని ఉండిపోయింది.

‘‘ఇంకా ఎంత దూరంరా... మన లవ్లీ స్పాట్‌?’’ అంటున్న వాడితో-

‘‘ఇంకో యాభై, అరవై కిలోమీటర్లు ఉంటుంది. ఈలోగా ఆ బ్యాగ్‌ తీసి చిప్స్‌ అవీ తినండి’’ అన్నాడు సుధీర్‌.

‘ఇప్పుడు అరిచి గోల చేసినా ఉపయోగం ఉండదు. తెలివిగా ఆలోచించాలి. సుమతి ఎన్నిసార్లు చెప్పినా విననందుకు బాగా శాస్తి జరిగింది నాకు’ అనుకుంటూ తప్పించుకునే మార్గాలు ఆలోచించసాగింది.

‘‘ఏయ్‌ లేస్తోంది, మాట్లాడకండి... హుష్‌!’’ అంటున్న సుధీర్‌ మాటలు రవళికి అసహ్యం కలిగించాయి. అప్పుడే మెలకువ వచ్చినట్లు లేస్తూ ‘‘నాకేమిటో కడుపులో తిప్పుతోంది సుధీర్‌. వాంతి వచ్చేలా ఉంది. ఒక్కసారి కారు పక్కగా ఆపు అంది.

‘‘ఓకే’’ అంటూ కారును రోడ్డు పక్కకి ఆపాడు సుధీర్‌.

డోర్‌ తీసి పట్టుకుని రవళిని నెమ్మదిగా దింపాడు. అక్కడ ఉన్న మైలురాయి మీద కూర్చుని ‘కొంచెం మంచినీళ్ళు’ అన్నట్లు సైగ చేసింది. బాటిల్‌తో తెచ్చిన నీళ్ళతో పుక్కిలించి, మొహం కడుక్కుని వాంతి రావడం లేదంటూ లేస్తున్న ఆమెను పొదివి పట్టుకుని కారు వైపు నడిపించాడు సుధీర్‌.

‘‘పిల్ల వాంతులంటోందంటే మనవాడు ఎప్పుడో కానిచ్చేసి ఉంటాడా?’’

‘‘అలానే ఉంది చూస్తుంటే, అయినా మనకెందుకురా మన ఛాన్స్‌ మనకి ఇస్తున్నాడుగా’’ అంటూ గుసగుసలు వినబడ్డాయి.

‘‘వీళ్ళు ఎవరు సుధీర్‌, మనం బయలుదేరినప్పుడు లేరు కదా’’ కారు దగ్గరికి నడుస్తుండగా నెమ్మదిగా అడిగిన రవళి ప్రశ్నకు-

‘‘వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, ‘బస్‌ మిస్‌ అయ్యాం, నెక్స్ట్‌ స్టేజ్‌లో దింప’మని రిక్వెస్ట్‌ చేశారు’’ అని చెప్పాడు సుధీర్‌.

‘ఎన్ని కథలు చెప్తున్నావ్‌రా... ఇలాంటి కథలు చెప్పే నన్ను పడేశావ్‌. అయినా నిన్ను అనుకుని ఏం లాభం లేదు, నాకు బుద్ధి ఉండాలి కదా’ లోపలే అనుకుంటూ తనని తాను తిట్టుకుంటూ కారెక్కింది రవళి.

‘‘కొంచెం స్పీడు తగ్గించు సుధీర్‌, ప్లీజ్‌’’ అంటూ సీటు వెనక్కి వాలిన రవళికేసి ఒకసారి చూసి ‘‘సరే’’ అంటూ కొంచెం స్పీడు తగ్గించాడు సుధీర్‌.

కారు పది, పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికి పోలీస్‌ వ్యాన్‌ కారుని ఆపేసింది.

‘‘ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తున్నాం’’ అన్నారు ఇన్‌స్పెక్టర్‌.

‘‘ఏమిటండీ, ఈ అమ్మాయి మా కజిన్‌. మేమందరం అనంతగిరి చూడటానికి బయలుదేరాం. ఎవర్నిపడితే వాళ్ళని అరెస్ట్‌ చేసేయడం ఏమిటి?’’ అంటూ దబాయించాడు సుధీర్‌. అతనికి వంత పాడారు మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్‌.

‘‘అహా అలాగా, ఆ అమ్మాయినే అడుగుదాం ఉండండి’’ అంటూ రవళికేసి చూశారు ఇన్‌స్పెక్టర్‌.

‘‘ఏమాత్రం భయపడకుండా చెప్పు తల్లీ, నువ్వు నీ ఇష్టప్రకారం వీళ్ళతో వెళ్తున్నావా? కాదంటే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి, మేము వీళ్ళ పనిపడతాం’’ అన్నారాయన.

‘‘నేను రావడం నా ఇష్టప్రకారం వచ్చినా ఇతను నన్ను మోసం చేయాలని చూశాడు సార్‌. ప్రేమిస్తున్నానని చెప్తే నమ్మి సైట్‌ సీయింగ్‌ అన్నాడని వచ్చాను. నాకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి తన ఫ్రెండ్స్‌తో కలిసి నన్ను... వీళ్ళు...’’ మాటలు పెగలక చున్నీ అడ్డుపెట్టుకుని భోరుమంది.

‘‘మీరు చదివిన చదువులు మీకు లోకజ్ఞానం ఇవ్వడం లేదు. ఆడపిల్లలను అక్కా చెల్లెళ్ళలా చూడాలనే సంస్కారాన్ని నేర్పడం లేదు’’ అంటూ నిట్టూర్చాడు ఆయన.

‘‘ఇదిగో 302, నువ్వు ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి చేర్చు. నేను వీళ్ళని కృష్ణ జన్మస్థానానికి తీసుకువెళతాను. నువ్వు వీళ్ళ కారు తీసుకుని రావయ్యా’’ అంటూ ఇంకో కానిస్టేబుల్‌కి అప్పజెప్పాడు ఆయన.

*   *  *

అసలే రవళి రాలేదని కంగారుపడుతున్న సుమతి పోలీస్‌ కానిస్టేబుల్‌తో వచ్చిన రవళిని చూసి మరింత కంగారుపడింది.

‘‘ఏమయిందే, అలా ఉన్నావేమిటి?’’ అంటూ ప్రశ్నలు గుప్పించ సాగింది. కానిస్టేబుల్‌ జరిగింది చెప్పి వెళ్ళిపోయాడు.

సుమతి రవళిని కౌగలించుకుని ‘‘ఎంత గండం తప్పిందే బాబూ. నేను మొత్తుకుంటుంటే విన్నావా?’’ అంటూ కంటతడి పెట్టుకుంది.

సుమతి మెడ చుట్టూ చేతులు వేసిన రవళి ‘‘ఇంకెప్పుడూ నువ్వు చెప్పిన దాన్ని కాదనను’’ అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం మొదలుపెట్టింది.

‘ఊరుకో’ అంటూ వెన్ను నిమురుతూ ‘‘ఇంతకీ పోలీసులు ఆ టైమ్‌కి ఎలా వచ్చారో?’’ ఆశ్చర్యంగా అంది సుమతి.

‘‘నీ దయ వల్లే’’ అన్న రవళిని వింతగా చూస్తూ-

‘‘నావల్లా?’’ అంటూ తెల్లబోయి కళ్ళు పెద్దవి చేస్తూ అంది సుమతి.

‘‘అవును. నువ్వు నా ఫోన్‌లో ‘దిశ ఆప్‌’ డౌన్‌లోడ్‌ చేసి ‘డిలీట్‌ చేస్తే ఒట్టు’ అన్నావు గుర్తుందా? అదే నన్ను కాపాడింది. నేను వాంతి వస్తోందని అబద్ధం చెప్పి కారు పక్కకి ఆపించాను. సుధీర్‌ని మంచినీళ్ళ బాటిల్‌ తెమ్మని, అతను వచ్చేలోగా చున్నీ చాటున పెట్టుకున్న సెల్‌లో ‘దిశ ఆప్‌’ ఆపరేట్‌ చేశాను. నేను ఎక్కడి నుంచి ఆప్‌ ఆపరేట్‌ చేశానో వెంటనే తెలిసి త్వరగానే పోలీసులు వచ్చేశారు. నీ రుణం తీర్చుకోలేనే’’ అంటున్న రవళిని తప్పిపోయిన పిల్ల ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లి హత్తుకున్నట్టు మరింత దగ్గరకి తీసుకుంది సుమతి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు