అహం

‘‘ఏమిటి పవిత్రా, ఇంత చెపుతున్నా నీ మొండివైఖరిని వదలవా?’’ కల్యాణ్‌ మాటలకు రోషంగా అతనివైపు చూస్తూ, మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది.

Updated : 06 Nov 2022 02:44 IST

అహం

- యశోదాకైలాస్‌ పులుగుర్త

‘‘ఏమిటి పవిత్రా, ఇంత చెపుతున్నా నీ మొండివైఖరిని వదలవా?’’
కల్యాణ్‌ మాటలకు రోషంగా అతనివైపు చూస్తూ, మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది. మీ దృష్టిలో నేను మొండిదాన్ని, ఒప్పుకుంటాను... కానీ నా ఈ మొండితనానికి కారణం మీ అమ్మగారేగా? అయిదు సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడి కాపురం పెట్టుకోమని ఇంట్లోనుండి తరిమివేశారు?’’
‘‘తరిమివేయడం ఏమిటి పవిత్రా... అలా మాట్లాడకు.’’
‘‘లేకపోతే ఏమిటండీ... అప్పటినుండి వేరే ఉంటూ రెండేళ్ళ మన శ్రీజని డే కేర్‌లో దింపుకుని ఆఫీసుకు వెళుతూ ఎంత కష్టపడేదాన్నో చూసీ కూడా మీరు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా?’’
‘‘అప్పుడేదో జరిగిపోయింది. ఇప్పుడు అమ్మా నాన్నగారూ తమంతట తామే అంటున్నారు... ‘కల్యాణ్‌ నీ దగ్గరకు వచ్చి ఉంటాం... పవిత్ర ఆఫీసుకి వెళ్ళిపోతే బాబిగాడిని మేము చూసుకుంటామని.’’
‘‘అంత అవసరమేమీ లేదని చెప్పండి. ఇంకా కాదూ కూడదూ అంటే పిల్లలను తీసుకుని నేనే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. మీరు మీ పేరెంట్స్‌తో ఉండొచ్చు. అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళిపొమ్మన్నట్లే - ఇప్పుడు మీరు నన్నూ పిల్లల్నీ వెళ్ళిపొమ్మన్నారనుకుంటూ వెళ్ళిపోతాను.’’
‘‘పదవే శ్రీలూ’’ అంటూ చేతిలో ఉన్న నాలుగు నెలల బాబు, కూతురుతో పుట్టింటికు వెళ్ళిపోవడానికి ఆయత్తమైంది.’’
పవిత్ర మాటలకు కల్యాణ్‌ ముఖం చిన్నబోయింది.
‘‘అదేమిటి పవిత్రా అలా మాట్లాడతావు? నువ్వు మీ అమ్మగారింట్లో, నేను మా అమ్మానాన్నతో ఉండటం ఏమిటి?
ఈ చిన్న విషయానికే మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా?’’
తండ్రి అలా మాట్లాడుతుంటే ఏడేళ్ళ కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రివైపే చూస్తోంది.
నిన్నటి నుండి ఇంట్లో ఇదే పరిస్థితి. ‘మనం అమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామే శ్రీజా’ అంటూ తల్లి తనతో అంటూండటం... తండ్రి అమ్మను బతిమాలడం చూస్తూనే ఉంది.
‘‘మా అమ్మా నాన్నగారూ మనతో కలసి ఉండాలని ‘నీ దగ్గరకు వచ్చేస్తాము రా కల్యాణ్‌’ అంటూంటే, వద్దని ఎలా చెప్పగలను పవిత్రా? ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత నాకు లేదా చెప్పు? ఏం,  మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మా నాన్నా ఉండటం లేదా?’’
పవిత్రనుండి సమాధానం లేదు.
కల్యాణ్‌కి చాలా భయంగా ఉంది... పవిత్ర పిల్లలను తీసుకుని వెళ్ళిపోతుందేమోనని. చాలా పట్టుదల పవిత్రకి.
విషయం తెలిస్తే అమ్మా నాన్నగారూ ఎంత బాధపడ్తారు? ‘మా గురించి మీ సంసారంలో కలతలేమిటిరా’ అంటూ అమ్మ ఏడ్చేస్తుంది. ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్లు కాదా?
అయినా పవిత్రకేమిటీ అంత అహం. సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకుని వేలాడటమేమిటి- మూర్ఖత్వం కాకపోతే!

* * * * *

ఎనిమిది సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన పవిత్ర- అత్తవారింట్లో తను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది. మామగారూ, కాలేజీ చదువు చదువుతున్న ఇద్దరాడపడుచులూ, మరిదీ, వచ్చిపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావుడిగా ఉండేది. పైగా అద్దె ఇల్లు - రెండు బెడ్‌రూమ్‌లు, హాలు, వంటగది మాత్రమే. భర్త పక్కన కూర్చుని మాట్లాడుకోడానికి అవకాశం ఉండేదికాదు. రాత్రివేళ ఇద్దరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది.
పగలంతా ఇద్దరికీ ఆఫీసులో గడచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది. తమ బెడ్‌రూమ్‌లోకి వచ్చి హాయిగా రిలాక్స్‌ అవుదామనుకుంటుంటే మరిది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు. రాత్రి పదింటికిగానీ ఇల్లు సద్దుమణిగేదికాదు.
శని, ఆదివారాలు తలుపులేసుకుని పడుకుంటే అత్తగారు ‘చూడు పవిత్రా, పెళ్ళి కాని పిల్లలున్నారు ఇంట్లో, అలా మీరు తలుపులు బిడాయించుకుని పడుకోవడం బాగుండదు. నువ్వు రెస్టు తీసుకోవాలనుకుంటే హాల్లోనో మరో గదిలోనో పడుకో’మని చెప్పేసరికి తనకి తల కొట్టేసినట్లుగా అనిపించేది.
శని, ఆదివారాలు సాయంత్రం పూట ఏదైనా మూవీకిగానీ, పార్క్‌కుగానీ వెడదామంటే ‘ఇంట్లో చెల్లాయిలుండగా మనం షికార్లకి వెళ్ళడం ఏమిట’ని కొట్టిపారేసేవాడు కల్యాణ్‌.
చిన్న చిన్న అసంతృప్తులూ సర్దుబాట్ల మధ్య పెద్దది ‘శ్రీజ’ పుట్టడం జరిగిపోయింది.
డెలివరీ అయిన ఆరునెలల తరువాత పుట్టింటి నుండి శ్రీజను ఎత్తుకుని అత్తవారింటికి వచ్చింది పవిత్ర. తను ఆఫీసుకి వెళ్ళిపోతే శ్రీజను అత్తగారు చూసుకునేవారు.
ఇంట్లో వంటంతా ఆమే చేసేవారు.
ఆడపడుచులూ మరిదీ కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు. మామగారు గవర్నమెంట్‌ హైస్కూల్‌లో సైన్స్‌ టీచర్‌. ఆయన స్కూలుకి వెళ్ళిపోయేవారు.
ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపూ తల్లి పోరుపెడుతుంటే ఏదో కాస్త పనిలో సాయం చేసినా, చదువుకోవలసినవెన్నో ఉన్నాయనో, పరీక్షలు ఉన్నాయనో చెప్పి పనిని తప్పించుకోడానికి చూసేవారు.
మనవరాలి రాకతో అత్తగారికి పని ఎక్కువైంది.
ఒకరోజు అత్తగారు తనతో ‘‘చూడమ్మా, నువ్వు కాస్త పెందరాళే లేవడం అలవాటు చేసుకో. పొద్దుటే వేళకి అందరికీ గబగబా లంచ్‌ బాక్సులు రెడీ చేయడం, టిఫిన్లు రెడీ చేయడం నావల్ల కావడంలేదు.
అదివరకటి ఓపిక సన్నగిల్లింది. నువ్వు తొందరగా లేచి నాకు వంటపనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది. అలాగే పాపాయికి స్నానం అవీ కూడా నువ్వు ఆఫీసుకి వెళ్ళేలోపు కానిచ్చేయంటూ చెప్పేసరికి పవిత్రకు అహం అడ్డొచ్చేది. ప్రతీదీ భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పేది. పొద్దుటనుండి సాయంత్రం వరకూ ఆఫీసు పనిచేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటే పెందరాళే లేచి వంటపని చేయమంటున్నారు మీ అమ్మగారు. పొద్దుటే శ్రీజకు స్నానం చేయించడం నాకెలా కుదురుతుందంటూ ఎగిరిపడేది అతనిమీద.
కల్యాణ్‌ అటు తల్లికి చెప్పలేక, ఇటు భార్యకు చెప్పుకోలేక నలిగిపోయాడు. ఫలితం పవిత్ర-కల్యాణ్‌ మధ్య మౌనం రాజ్యమేలసాగింది.
పవిత్ర ఆఫీసునుండి రాగానే కూతురు శ్రీజతో తమ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి తలుపులేసుకునేది.
అత్తగారితో మాట్లాడటంగానీ, ఆడపడుచులతో సరదాగా గడపడంగానీ చేసేదికాదు.
పరిస్థితిని అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కల్యాణ్‌తో విడికాపురం పెట్టుకోండంటూ చెప్పేసింది.
అదే విషయాన్ని ఇప్పుడు గుర్తుచేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపొమ్మన్నారంటూ పవిత్ర ఇప్పుడు తనని దెప్పుతోంది.

నిజానికి కల్యాణ్‌ తల్లి కృష్ణవేణి చెడ్డదేమీ కాదు. చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలైతే బంధుత్వాలు తెగిపోతాయేమోనని భయపడిపోయే మనిషి. కోడలు కోరుకున్న స్వేచ్ఛా సదుపాయమూ తమింట్లో లేవని గ్రహించిన ఆమె... పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడింది. రేపు తన కూతుళ్ళకు పెళ్ళై అత్తవారింటికి వెడితే వాళ్ళు అత్తమామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె. కొన్నాళ్ళు వేరు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతామన్న ఆశతో ఆ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందేగానీ మరే చెడు ఆలోచనా లేదామెకు.
ఈ అయిదారు సంవత్సరాలలో ఆడపడుచులకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరిదికి నాగపూర్‌లో ఉద్యోగం వచ్చింది. మామగారు రిటైర్‌ అయిపోయారు.
ఆడపడుచుల పెళ్ళిళ్ళూ మరిది చదువూ అన్నీ కల్యాణ్‌ తండ్రి రాఘవరావుగారే చూసుకున్నారు. కల్యాణ్‌ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నారు. పైగా కల్యాణ్‌ ‘నాన్నగారూ, నేనూ పవిత్రా కలసి లోన్‌ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఒక రెండువందల గజాల స్థలం కొనాలని చూస్తుంటే, స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్‌లో దొరకడం లేదు’ అని చెప్తే ఆయనెప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కల్యాణ్‌కి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు. కల్యాణ్‌ తండ్రికి స్థలం బాపతు డబ్బు ఇవ్వబోతుంటే ఆయన తీసుకోలేదు. ‘నాకెందుకురా డబ్బు, నేనెలాగూ అక్కడ ఇల్లు కట్టలేను. నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్లే’ అంటూ తీసుకోలేదు. ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్నా సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు. ఇప్పుడు రిటైర్‌ అయిపోయిన ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులూ లేవు, కేవలం ప్రతీనెలా వచ్చే పెన్షన్‌ డబ్బులు తప్ప. ఎక్కడో అద్దె ఇంట్లో తనూ తన భార్యా ఒంటరిగా ఉండటం ఇష్టపడలేదు ఆయన. ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండటమే ధర్మం అనుకుంటూ కల్యాణ్‌కు చెప్పాడాయన, ‘నేనూ మీ అమ్మా వచ్చేసి మీతోనే ఉండిపోతామని.’
దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తూ మాట్లాడుతోంది. నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకి ఎంతగానో ఉంది. తమ ఇంటికి దగ్గరలో ఉండే డే కేర్‌ ఇప్పుడు వేరేచోటకి మార్చేశారు. తమింటికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. బాబిగాడిని తను పొద్దుటే ఆఫీసుకి వెళుతూ అక్కడ దింపితే, సాయంత్రం పవిత్ర ఆఫీసునుండి వస్తూ వాడిని పికప్‌ చేసుకుని తెచ్చుకోవాలి. పవిత్రకు కష్టమైనా మరో సర్దుబాటు లేదు. పెద్దది శ్రీజ స్కూల్‌ సాయంత్రం నాలుగు గంటలకే అయిపోతే తాము వచ్చేవరకూ దాన్ని అక్కడే ఏదో ట్యూషన్‌లో పెట్టాలి.
ఇవన్నీ పవిత్రకు తెలియనివా?
తెలుసు... కానీ అహం. తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు. మేకపోతు గాంభీర్యాన్ని ఒలకబోస్తుంది గానీ, బాబిగాడి రాకతో ఇటు వాడినీ, పాప శ్రీజనూ చూసుకుంటూ ఆఫీస్‌కు వెళ్ళిరావడం ఎంత కష్టమో తెలియదా తనకు?
చివరి ప్రయత్నంగా పవిత్రతో ‘‘వస్తామంటున్న అమ్మా నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు? కొన్నాళ్ళు ఉంచుకుందాం, ఆ తరువాత నాగపూర్‌లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరకు పంపిస్తాను’’ అని చెప్పి పవిత్రను మొత్తానికి ఒప్పించాడు.

* * * * *

కల్యాణ్‌ తల్లిదండ్రులు వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు...
మొదట్లో- పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది. కానీ ఆఫీసుకు వెళుతూ... పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలూ సూచనలూ చెప్పడానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది.
బామ్మ సంరక్షణలో బాబిగాడు బొద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులను చిందిస్తున్నాడు.
శ్రీజని డే కేర్‌లో వేసినపుడు ఎప్పుడూ దానికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్సే. తరచుగా జలుబూ దగ్గూ జ్వరం వచ్చేవి. ఎవరో ఒకరు ఆఫీసుకి సెలవు పెట్టి కూర్చునేవారు. పిల్ల కూడా అర్భకంగా ఉండేది.
ఇప్పుడలా కాదు... కమ్మని పప్పూ అన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెపుతూ బామ్మ తినిపిస్తుంటే అది బంతిలా తయారయ్యి ఛెంగు ఛెంగున గంతులేస్తోంది.
అదివరకటిలా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంటపనిలో సాయం చేస్తూ, పిల్లలకి స్నానాలూ అవీ చేయించి ఆఫీసుకి వెడుతోంది.
అప్పట్లో ఆమెలో ఉన్న అహం కొద్దికొద్దిగా కరగనారంభించింది.
రాత్రిపూట వంటపని నాదే, మీరూ మామయ్యగారూ ఏ గుడికో, పార్కుకో వెళ్ళిరండంటూ అత్తగారికి విశ్రాంతినిస్తోంది.
పిల్లల టెన్షన్‌ లేదు తమకి ఇప్పుడు. హాయిగా ఆఫీసుకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు. కల్యాణ్‌ నాన్నగారు ఇంట్లోకి కావలసిన కూరగాయలూ సరుకులూ కొని తెచ్చేస్తున్నారు.
పవిత్రకు అత్తగారి సహకారం అర్థమవుతోంది. తను వచ్చేవరకూ బాబిగాడిని చూసుకోవడం...
వాడికి టైమ్‌ ప్రకారం పాలు పట్టడం, డైపర్స్‌ మార్చడం... అలాగే శ్రీజ స్కూల్‌ నుండి రాగానే దాని యూనిఫాం మార్పించి దానికి తినిపించడం... ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు.
అదివరకు అయితే తనే ఇంటి తాళం తెరుచుకుని పిల్లలతో ఇంట్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు, ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటోంది. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంతో కళకళలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు.
అప్పట్లో తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనపడేదికాదు. నిజానికి అత్తగారు అప్పుడూ ఇప్పుడూ కూడా అదే ప్రేమను చూపుతున్నారు. తనే ఆమెను సరిగా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది.
ఆ రోజు పవిత్ర ఆఫీసునుండి వస్తూనే హుషారుగా వచ్చింది- చేతిలో స్వీట్‌ బాక్సుతో.
ముందుగా అత్తగారికీ మామగారికీ స్వీట్లు ఇస్తూ, ‘‘నాకు ఆఫీసర్‌గా ప్రమోషన్‌ వచ్చిందని’’ ముఖంనిండా ఆనందం పులుముకుంటూ మరీ చెప్పింది.

ఇద్దరూ ‘‘చాలా సంతోషమమ్మా’’ అంటూ అభినందించారు.
ఈలోగా కల్యాణ్‌ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్‌ చేసింది.
ఆమె ముఖం నిండా ఆనందమే.
పవిత్రతో ‘‘నీకు ప్రమోషన్‌ రావడమే ఆనందం అనుకుంటుంటే... మీ చిన్నాడపడుచు వాణీకి మూడోనెల అని డాక్టర్‌ కన్‌ఫర్మ్‌ చేసిందిట. ఈ రోజు అన్నీ శుభవార్తలే, మనసు ఆనందంతో పొంగిపోతోందమ్మా’’ అంటూ కోడలివైపు ఆప్యాయంగా చూస్తూ అంది.
‘‘ఓ... అవునా అత్తయ్యగారూ, నిజంగానే పెద్ద శుభవార్త. అయితే ఈ ఆదివారం వెళ్ళి మనం వాణీని మనింటికి తీసుకొచ్చి కొన్నిరోజులు ఉంచుకుందా’’మంటూ చెప్పేసరికి కోడలి అభిమానానికి ఆమె హృదయం అర్ద్రమైంది.
పవిత్ర హృదయం మంచిదే, ఏదో చిన్నతనం, అప్పట్లో తనే సరిగా కోడలిని అర్థం చేసుకోలేదు, పవిత్రకు అహంకారం అని పొరబడ్డా అనుకుంటూ ఆమె మనసులో చాలా బాధపడింది.
ఒక గంట తరువాత పెద్దాడపడుచు శ్రీవల్లి నుండి ఫోన్‌...
‘‘వావ్‌ వదినా యూ ఆర్‌ జీనియస్‌, ఆఫీసర్‌ ప్రమోషన్‌ వచ్చినందుకు కంగ్రాట్స్‌!’’
‘‘ధాంక్యూ వల్లీ, జీనియస్‌ని ఏమీ కాదులే, మూడుసార్లు డింకీ కొట్టిన తరువాత వచ్చిన ప్రమోషన్‌.’’
‘‘అలా అనకు వదినా... ఇల్లూ పిల్లలూ సంసార బాధ్యతలలో ఉన్న మనలాంటి లేడీస్‌కు ఎప్పుడు వచ్చినా ఫస్ట్‌ టైమ్‌ వచ్చినట్లే ఫీల్‌ అవ్వాలి. ఇంతకీ మా వదిన ఆఫీసర్‌ అయినందుకు ఈ ఆడపడుచుకి ఏమి గిఫ్ట్‌ ఇస్తుందో’’ నాటక ఫక్కీలో అంది.
‘‘ఈ ఆదివారం వచ్చేయ్‌ వల్లీ... వాణీని కూడా తీసుకువస్తున్నాం. మీ ఇద్దరికీ మీకు నచ్చిన చీరలు కొనిపెడతాను.’’
‘‘అబ్బ... మా వదిన ఎంత మంచిదో’’ అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసిముసి నవ్వులు నవ్వసాగింది.
ఆరోజు రాత్రి ‘‘అయితే మేడమ్‌ గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో’’ అంటూ ఆటపట్టిస్తున్న కల్యాణ్‌ వైపు ప్రేమగా చూస్తూ,
‘‘నా ఈ ప్రమోషన్‌కి కారణం అత్తయ్యగారే. నాలుగు సంవత్సరాలనుండి నేను నా కెరీర్‌ మీద సరిగా ఫోకస్‌ చేయలేకపోయాను. అదీకాక శ్రీజ ఎప్పుడూ సిక్‌ అవుతుండేది. నేను ఎక్కువ సెలవు తీసుకున్న కారణంగా నా పెర్ఫామెన్స్‌ ఎప్రైజల్‌కి పూర్‌ రేటింగ్‌ పడేది. అందుకే ప్రమోషన్‌కి డ్రాప్‌ అవుతున్నాను. కానీ అత్తయ్యగారూ మామయ్యగారూ ఇక్కడకు వచ్చిన ఈ సంవత్సరం కాలంలో ఒక్కరోజు కూడా నేను లీవ్‌ తీసుకోకుండా ఆఫీసుకి వెళ్ళి వస్తున్నాను. అత్తయ్యగారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్‌ విషయం చెపితే, ‘నువ్వు ఈసారి బాగా ప్రిపేరవ్వు, ఆఫీసుకి సెలవు పెట్టకు, పిల్లల్ని నేను చూసుకుంటా’నని చెపుతూ ఎంతో సహకరించారు’’ అని చెపుతున్న పవిత్రవైపు ఆశ్చర్యానందాలతో చూశాడు కల్యాణ్‌.
‘మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు. కుటుంబ సభ్యుల ప్రేమకూ పాత్రులవుతా’రన్న విషయం పవిత్ర విషయంలో నిజం అయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..