వంకాయ

‘తాజా కూరల్లో రాజా ఎవరండీ? ఇంకా చెప్పాలా... వంకాయేనండీ...’ చెవుల దగ్గర మోగుతున్న పాటకి విసుగూ చిరాకులతో కూడిన కోపమొచ్చింది.‘‘అబ్బబ్బ... అమ్మా, ప్లీజ్‌ కాసేపు ఆఫ్‌ చెయ్‌ ఆ పిచ్చి పాటల్ని’’ అరిచాను దుప్పట్లో నుండి.

Published : 20 Nov 2022 00:00 IST

వంకాయ

- ధనలక్ష్మి ఎం.

‘తాజా కూరల్లో రాజా ఎవరండీ? ఇంకా చెప్పాలా... వంకాయేనండీ...’ చెవుల దగ్గర మోగుతున్న పాటకి విసుగూ చిరాకులతో కూడిన కోపమొచ్చింది.

‘‘అబ్బబ్బ... అమ్మా, ప్లీజ్‌ కాసేపు ఆఫ్‌ చెయ్‌ ఆ పిచ్చి పాటల్ని’’ అరిచాను దుప్పట్లో నుండి.

అంతే మరుక్షణం సౌండ్‌ ఇంకా పెరిగింది. కచ్చితంగా ఇది ఆ రాక్షసుడి పనే అయ్యుంటుంది... శాడిస్ట్‌, సైకో, కోతి.

‘‘అరే అన్నయ్యా, నేనిప్పుడొచ్చానా... నీకు మరి ఫోనుండదు, తర్వాత నీ ఇష్టం’’ అరిచాను వీలైనంత గట్టిగా.

‘‘నోరు మూసుకుని ముందు లే, వాడికి తర్వాత వార్నింగిద్దువుగానీ’’ నాకు వార్నింగిచ్చింది అమ్మ.

ఇక లేవక తప్పలేదు.

‘‘నేను చెప్పానా... ఈ పాటకి కచ్చితంగా లేస్తుందని’’ అరుస్తున్నాడు మా ఇడియట్‌- వెనుక నుండి ఆనందంగా.అసలు ఎవరా పాట రాసిన రచయిత? ఇంకేం దొరకలేదా వంకాయ తప్ప. ఎప్పుడైనా తిన్నారా వంకాయ కర్రీ, అదే నేనైతే వంకాయ ప్లేస్‌లో బెండకాయ పెట్టి రాసేదాన్ని. అయినా వంకాయతో నా శత్రుత్వం ఈనాటిది కాదు, ఏళ్ళనాటిది. నా చిన్నప్పటి నుండే మొదలైంది ఈ యుద్ధం. ఎందుకో తెలియదు కానీ వంకాయ కూరంటే పిచ్చి మా తాతయ్యకి. అదే లెవెల్లో- అంటే నాలుగు సెంట్లున్న మా పెరడంతా వంకాయ మొక్కలతో నింపేశాడు. ఇక అప్పటి నుండీ వారంలో ఆరు రోజులూ, పన్నెండు పూటలూ మా ఇంట్లో వంకాయనే. చిన్నప్పటి నుండీ వంకాయల్ని చూసి చూసీ, వాటి మధ్యలోనే ఉండి, అవే తిని పెరిగినందుకేమో... వంకాయ పేరు వింటేనే ఒళ్ళు మండే స్థాయికొచ్చేశాను.

అమ్మ ఆ కూర వండినప్పుడల్లా నాకు ఉపవాసమే. కేవలం ఉపవాసమే అయినా బాగుండేది. తిననందుకు నాన్నతో దెబ్బలూ, నానమ్మ ఉపన్యాసాలూ. నా బాల్యమంతా ఇలానే గడిచిపోయింది. ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేస్తోంది.

ఛీ... అంతా వంకాయ వల్లనే.

మధ్యాహ్నం కిలోమీటరు నడిచి స్కూలు నుండి ఆకలితో ఇంటికొచ్చి ఆవురావురమంటూ తినేద్దామని కంచం ముందు కూర్చునేసరికి ఎదురుగా గిన్నెలో వంకాయ సాక్షాత్కారంతో చప్పున చల్లారిపోయేది నా ఆకలి. ఎక్కడలేని నీరసం వచ్చేసేది.
ఆ టైమ్‌లో నాకేగానీ మ్యాజికల్‌ పవర్స్‌ ఉంటే గిన్నెలో వంకాయ కర్రీని ‘అబ్రకదబ్ర’ అంటూ బెండకాయగా మార్చేసేదాన్ని. కానీ ఏం చేస్తాం, అనుకున్నవన్నీ జరగవు కదా.

నెలలో ఇరవై రోజులూ- నా లంచ్‌బాక్స్‌లో అదే కర్రీ కనిపించిన కారణంగా కాలేజీలో నా నిక్‌నేమ్‌ వంకాయగా స్థిరపడిపోయింది. ఫ్రెండ్స్‌, సీనియర్స్‌, జూనియర్స్‌... ఆఖరికి సార్స్‌ కూడా అలానే పిలిచి, పిలిచి నా అసలు పేరు మరిచిపోయే స్థాయికొచ్చేశారు.

‘అసలే కోతి, ఆపైన కల్లు తాగింది, నిప్పు తొక్కింది’ అన్నట్టు తయారైంది నా పరిస్థితి.

నాకా పేరంటేనే చిరాకంటే, అదే నా పేరు చేశారు ఈ పిచ్చిమొహాలు. నేనే కానీ ప్రధానమంత్రిని అయితే ఫస్ట్‌ వంకాయల్ని పూర్తిగా బ్యాన్‌ చేసేదాన్ని. లేకుంటే కనీసం మా ఫ్యామిలీని వంకాయలు లేని ఊరికైనా తీసుకెళ్ళి వదిలేసినా సరిపోయేది. నా తలనొప్పి తగ్గేది.

‘‘వంకాయలు... వంకాయలు... వంకాయలోయ్‌...’’ ఓ విధంగా సాగదీస్తూ ఇంటి ముందు నిలబడింది కాంతమ్మ. ఇదొకటి- ప్రపంచంలో ఇంకేం దొరకనట్టు ఎప్పుడూ అవే అమ్ముతుంది.

పొరపాటున ఎప్పుడైనా పెరట్లో వంకాయలు లేకున్నా రెడీమేడ్‌గా అందిస్తుంది. ఏంటో అందరూ నాకు శత్రువులే.

‘‘ఏంటి వందనమ్మా, కావాలా వంకాయలు?’’

పిచ్చి కోపమొచ్చింది నాకు. అక్కర్లేదమ్మా, మా పెరడంతా అవే. కావాలంటే పది బుట్టలు నువ్వే తీసుకెళ్ళు, కొబ్బరికాయ కొడతాను నీకు’’ చెప్పేసి వెనక్కి తిరిగేసరికి రెండు నిమిషాలాగింది నా గుండె.

పెద్ద గిన్నె నిండా, చేతులనిండా వంకాయలతో వస్తూ కనిపించారు నాన్న. అబ్బా! తలపట్టుకోవటం నా వంతయింది. మళ్ళీ వంకాయలా... ఏడుపు మొహం పెట్టాను.

‘‘నోరు మూసుకో. అసలు నీ బాధ పడలేకనే వారంలో రెండు మూడుసార్లు మాత్రమే వండుతున్నాంగా, ఇంకా ఎందుకా ఏడుపు?’’

‘లేకపోతే వారమంతా అవే వండి వంకాయ వారోత్సవాలు చేసుకోండి’ అనాలనిపించినా మళ్ళీ ‘వంకాయలు- వాటి వలన లాభాలు’ పుస్తకం చదువుతారేమో అని ఊరుకున్నాను.

‘‘రిలాక్స్‌ బంగారం, లంచ్‌ స్పెషలేంటో తెలుసా?’’ ఊరిస్తున్నట్టు అడిగాడు మా ఇడియట్‌.

‘ఏంటీ?’ అని ఆలోచించేంతలోనే ‘‘బిర్యానీ, మసాలా వంకాయ... హా...’’ ఓ దీర్ఘ నిట్టూర్పు వదులుతూ సూపర్‌ కాంబినేషన్‌ కదా. సగం మూసిన కళ్ళతో అప్పుడే తినేస్తున్నట్టు ఫీలైపోతూ పిచ్చి ఎక్స్‌ప్రెషనూ... వీడూ.

‘‘వద్దా, పోనీ గుత్తొంకాయ నా చేత్తో స్వయంగా చేస్తా. మొన్న రూమ్‌లో వండితే మా ఫ్రెండ్స్‌ ప్లేట్సు కూడా తినేశారు తెలుసా?’’

‘‘ఉఫ్‌... సొంత డప్పు వాయించుకోవటమంటే ఇదే.’’

‘‘నిజం రా, అందరూ చాలా బాగుందన్నారు.’’

‘‘హే... నీకేం పట్టింది? మసాలా వంకాయైనా, గుత్తొంకాయైనా, ఏదైనా వంకాయతోనేగా చేసేది.’’

‘‘అలా కాదే, నీకెలా చెప్పాలీ... ఆఁ చెప్తా గాటిట్‌. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి ఉందనుకో, ఎప్పుడూ అలాగే ఉన్నా, ఒక్కో డ్రెస్‌లో ఒక్కోలా కనిపిస్తుంది కదా.. అలాగన్నమాట’’ కళ్ళెగరేశాడు.

‘‘అర్థమైంది, క్లియర్‌గా అర్థమైంది.’’

‘‘ఏంటీ, వంకాయ వేరు... గుత్తొంకాయ వేరనా?’’

‘‘కాదు, నువ్వు పుస్తకాలొదిలేసి అమ్మాయిల్నీ వాళ్ళ డ్రెస్సుల్నీ పరిశీలించటం మొదలుపెట్టావని.’’

‘ఆఁ...’ నోటిని అరచేత్తో మూసుకుని కళ్ళు తాటికాయలంత చేశాడు.

నవ్వాగలేదా ఎక్స్‌ప్రెషన్‌కి.

‘‘ఛీ.. ఛీ... ఏం మాటలే అవి? అమ్మా నాన్నలున్నారన్న బుద్ధి లేకుండా’’ తల కొట్టుకున్నాడు.

‘‘అయితే వాళ్ళు లేనప్పుడు అడగొచ్చన్నమాట.’’

‘‘నీకు దండమే’’ రెండు చేతులూ జోడించాడు. ‘‘నువ్వు వంకాయ తినకు, నన్నూ తినకు’’ లోపలికెళ్ళిపోయాడు వేగంగా.

లేకపోతే నాతో పెట్టుకుంటాడా? ఇంకోసారిలాంటి పిచ్చి సలహాలివ్వడు. ప్రతి ఒక్కరూ సలహాలిచ్చేవాళ్ళే. అది గొప్ప ఈజీ కదా. మొన్న కవితక్క పెళ్ళికెళ్ళినపుడు కూడా అంతే. భోజనాల్లో ఎన్నో వెరైటీలుంటాయని ఆశగా వెళ్తే అక్కడ కూడా వంకాయమాత దర్శనమే.

అదేం పిచ్చో? వంకాయ బజ్జీ, మసాలా వంకాయ, వంకాయ చట్నీ ఆలు-వంకాయ... ప్రాణం ఉసూరుమంది. అవన్నీ చూడగానే ఆకలి రివ్వున గాల్లోకి ఎగిరిపోయింది. క్షుద్బాధతో నేనేడుస్తుంటే-

‘అదేమన్నా విషమా? తింటే చచ్చిపోతావా ఏం? అయినా నిన్ను కాదు, మీ అమ్మానాన్నల్ని అనాలి- చిన్నప్పుడే నాలుగు తగిలించి మరీ తినిపించకుండా ఊరుకున్నందుకు.’

‘ఈ కాలం పిల్లలే అంత, అన్నింటికీ వంకలు పెట్టడమే.’

‘ఏదైనా గట్టిగా అంటే... మళ్ళీ అలకలొకటి.’

... ఇలా ఒక్కొక్కరూ ఒక్కొక్క స్టేట్‌మెంటిచ్చారు. వాళ్ళలా అందరిముందూ తిడుతుంటే ఎంత ఏడుపొచ్చిందో!

అంతా ఈ వంకాయ వల్లనే. ఎలా వీటిని పూర్తిగా లేకుండా చేయాలి? దొంగ అవతారం ఎత్తి, ఉన్న మొక్కలన్నింటినీ పీకి దూరంగా పడేస్తే, వద్దులే, దొరికిపోతే ఇక అంతే.

లేకపోతే సైంటిస్టునై వీటికి శత్రువుల్ని తయరుచేస్తేనో?

మనకంత ఓపికెక్కడిది? ఉన్న పుస్తకాలు చదివి పరీక్షలు రాయడమే కష్టమంటే, ఇంక కొత్త వస్తువులు తయారుచేయడం.

ఇది అవుటాఫ్‌ సిలబస్‌.

‘‘వందనా, మధ్యాహ్నం సంగతేంటి?’’ అరిచింది అమ్మ లోపలి నుండి.

‘‘ఆమ్లెట్‌. హాట్‌ హాట్‌ ఆమ్లెట్‌ విత్‌ ఆనియన్స్‌.’’

‘‘దేవుడా చచ్చిపోతున్నా- ఒక్కొక్కరికి ఒక్కోటి వండటానికి. అందుకే...’’ బ్రేకేసినట్టు ఆగిపోయింది.

‘‘ఆఁ... అందుకే?’’

‘‘నీకూ ఒక ఇల్లుందనుకో...’’ మళ్ళీ ఆపింది.

‘‘అంటే ఏంటమ్మా? ఇప్పుడు నేను కొత్తిల్లు కట్టుకోవాలా?’’ ఏం అర్థం కాలేదు నాకు.

‘‘ఎందుకమ్మా, ఆ డొంకతిరుగుడంతా. మరేంలేదే... నాన్న నీకొక సంబంధం చూశారు’’ టక్కున చెప్పేశాడు అన్నయ్య.

‘‘నాకా?’’

‘‘ఆగాగు, అప్పుడే ఆశ్చర్యపోకు. వాళ్ళు రేపే వస్తున్నారు.’’

‘‘రేపా..?’’ ఏంటీ షాకుల మీద షాకులు.

‘‘ఆగమన్నానా... మా అందరికీ, వాళ్ళకీ ఓకే అయిపోయింది కూడా. ఇప్పుడు తీరిగ్గా ఆశ్చర్యపో.’’

‘‘మీరేం చేసినా నా మంచి కోసమేగా, అంతా మీ ఇష్టం అనేసి తలదించుకోవాలా?’’

‘‘ఇప్పుడేం చెప్పక్కర్లేదులే. రేపు వాళ్ళు వచ్చాక చెపుదువు’’ నాన్న గొంతులో కఠినత్వం నన్నింకేం మాట్లాడనివ్వలేదు.

మాకు లైఫ్‌ గురించి ఎన్నో గోల్స్‌. కానీ వీళ్ళ గోల్‌ పెళ్ళొక్కటే. ఇంకేం చేస్తాం, చూద్దాం? పెళ్ళి చేయటం ఎంత కష్టమో... తప్పించటం అంత ఈజీ అని మాకు తెలియదు మరి!

*           *           *

‘‘మరీ అలా ఏడుపు మొహం పెట్టి కూర్చోకుంటే తల పైకెత్తి అబ్బాయిని చూడొచ్చుగా’’ వెనుక నుండి పొడిచింది నానమ్మ.

‘‘ఏం, నేనెందుకు చూడాలి. నేనేమైనా వాడిని పెళ్ళి చేసుకోబోతున్నానా? నేను చూడనంటే చూడనంతే!’’

‘‘అయ్యో, అయ్యో! ఎందుకే అలా అందరికి వినిపించేలా అరుస్తావ్‌?’’ తల కొట్టుకుంటూ వెళ్ళిపోయింది.

‘‘అంకుల్‌, మీరేం అనుకోకుంటే నేనో రెండు నిమిషాలు వందనతో మాట్లాడొచ్చా?’’

ఉలిక్కిపడి తల పైకెత్తా. ఆ బ్లూ షర్ట్‌ వేసుకున్నవాడే పెళ్ళికొడుకనుకుంటా,

ఎంత ధైర్యమో? నాన్న పర్మిషన్‌ అడిగాడు, మరి నన్నడగక్కర్లేదేమో!

ఒక్క నిమిషం నిశ్శబ్దమానంతరం గట్టిగా నవ్వారందరూ ఇల్లదిరేంతలా.

‘‘వందనా, తనకి ఇల్లు చూపించు’’

ఆర్డరేసిన నాన్న మీద గొంతుదాకా కోపమొచ్చినా ఏం చేయలేని నిస్సహాయత. అందరూ ఉన్నారు కదా... ఇంకేమంటాను? నోరు మూసుకుని లేచి నిలబడ్డా.

గుండె జెట్‌ వేగంతో కొట్టుకుంటోంది వేగంగా. ఏంటిది... భయమేనా, ఇంకేదైనానా?

మెల్లగా గుమ్మం దాటుతూ తలుపు దగ్గరున్న అన్నయ్య చేయి గట్టిగా పట్టుకున్నాను.

‘‘నేనెందుకే?’’ గొణిగాడు.

‘‘ప్లీజ్‌ రా!’’ బతిమాలాను- తప్పదుగా, లేకపోతే ఈ భయంతో గుండె ఆగిపోయేలా ఉంది.

‘‘పద...’’ నవ్వుతూ నా భుజం చుట్టూ చెయ్యేశాడు. ఇప్పటి వరకూ హెచ్చించిన గుండె వేగం కాస్త నెమ్మదించింది.

‘‘లోపలికి రండి... అదే పెరడు’’ ఆహ్వానించాడు.

‘‘స్టాప్‌, స్టాప్‌ చందూ.’’ ఠక్కున ఆగిపోయాడు అన్నయ్య.

‘‘అదేగా నీ పేరు? నేనైతే నిన్ను ‘చందూ’ అని పిలుస్తా. నువ్వు కూడా చక్కగా నన్ను ‘గౌతమ్‌’ అని పిలువు. ఈ ‘అండీ’, ‘గారు’ లాంటి పదాలు వాడొద్దు.’’

స్నేహపూర్వకంగానే ఉన్నాయా మాటలు, ఆజ్ఞలా అయితే లేవు.

అన్నయ్య మొహంలో ఏదో సంతృప్తి, అన్నయ్యకి కూడా నచ్చేశాడా ఏంటి?

అసలే ‘ఎలా ఈ సంబంధం వదిలించుకోవాలా’ అని నా బాధలో నేనుంటే, వీడేమో అందర్నీ ఇంప్రెస్‌ చేసేస్తున్నాడేంటి?

‘‘అయినా నువ్వంత గౌరవం ఇవ్వటానికి ఇదేం అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ కాదులే’’ మరో బాంబు పేల్చాడు.

‘‘ఏంటీ?’’ అన్నయ్య షాకై నావైపు చూశాడు. నేను అంతకంటే పెద్ద షాక్‌లో ఉన్నాను.

‘‘వెయిట్‌, వెయిట్‌ చందూ... కేవలం నావైపు నుండి మాత్రమే, వందనకేం తెలియదులే.’’

‘‘థ్యాంక్‌ గాడ్‌’’ ఇప్పుడు కుదుటపడ్డాను కానీ ఇంకా అయోమయంగానే ఉంది.

‘‘నిజం వందనా, నాది అయిదేళ్ళ ప్రేమ తెలుసా?’’ నా వైపు చూశాడు.

మరి నాకేంటి... ఈ ముఖాన్ని ఇంతకుముందు చూసిన గుర్తు కూడా రావటం లేదు.

‘‘మనిద్దరం ఒకే కాలేజ్‌, నేను నీ సీనియర్‌’’ ఒక్కో బాణం వదులుతున్నాడు.నేను నీకు చెప్తానే అనుకో, నువ్వు ఠక్కున కాదనేస్తావ్‌. నాకా నమ్మకం ఉందిలే. ఎంతో కష్టపడి నిన్ను ఇంప్రెస్‌ చేయాలి. నా టైమ్‌ బాగాలేక అంతలోనే మీ వాళ్ళకి తెలిసిపోయిందనుకో... మళ్ళీ గొడవలూ తిట్లూ... ఉఫ్‌... అందుకే షార్ట్‌కట్‌ వెతుక్కున్నా, ఎలా ఉంది ఐడియా?’’ నవ్వాడు భీముడిలా.

నేనూ, అన్నయ్యా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని జాయింట్‌గా గౌతమ్‌ వైపు చూశాం- అర్థంకాని మొహాలతో.

‘‘ఓకే, ఓకే... మరీ అలా పిచ్చివాణ్ణి చూసినట్టు చూడకండి అన్నా చెల్లెళ్ళిద్దరూ, డైరెక్ట్‌గా పాయింట్లోకి వచ్చేస్తా.

నిజం వందనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే పీజీ అవ్వగానే ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డా. ఇదంతా చెప్పి బలవంతంగా ఒప్పించాలని కాదు కానీ, ఎలా చెప్పాలో తెలియక...’’ ఆగిపోయాడు సందేహంగా.

చెమటలు పట్టాయి. గడగడా వాగుతున్న గౌతమ్‌కీ, అది వింటున్న మాక్కూడా. ఇలాంటిది నా లైఫ్‌లో జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు.

‘‘వందనా, ప్లీజ్‌ ఓకే చెప్పవా. నాకు స్మోకింగ్‌, డ్రింకింగ్‌ లాంటి అలవాట్లేం లేవు. మేల్‌ ఇగో ప్రదర్శించకుండా నీ ఇష్టాయిష్టాలకూ అభిప్రాయాలకూ విలువ ఇస్తాను. ఏ కష్టం రానివ్వనని భవిష్యత్తు చెప్పలేకున్నా, వచ్చిన ప్రతీ కష్టంలో నీతోనే ఉంటాను’’ ఆర్ద్రంగా వినిపిస్తోందా గొంతు.

ఏంటీ సందిగ్ధావస్థ... నాకేం అర్థం కావట్లేదు, అంతా పిచ్చిపిచ్చిగా ‘యస్‌’ అనాలని లేదూ, ‘నో’ అనాలని కూడా లేదు.

నా మీద ఇంకా ఏవైనా సందేహాలుంటే మీ నాన్నని అడగండి. ఆయనేం ఆషామాషీ కాదులే, ఓ కమిషన్‌ వేసి మరీ ఎంక్వైరీ చేసి అప్పుడొప్పుకున్నారు పెళ్ళి చూపులకి.’’

నిస్సహాయంగా అన్నయ్య వైపు చూశా. తలూపాడు- తనకి ‘ఓకే’ అన్నట్టు. మరి నా సంగతేంటి? నాకే తెలియలేదు.

‘‘రా వందనా, గౌతమ్‌కి తోట చూపిద్దాం’’ అన్నయ్య పిలిచాడు.

అసంకల్పితంగా వాళ్ళతోపాటు నడుస్తున్నా కానీ, ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి.

గౌతమ్‌ నాకు నచ్చాడా? కచ్చితంగా నచ్చకుండా మాత్రం లేడు. నాన్న సర్టిఫికేట్‌ ఉందంటే అన్నింటిలో పాస్‌ చేయొచ్చు. కానీ మరి నా గోల్‌? అడిగితేనే కదా తెలిసేది.

‘‘గ్రూప్స్‌ నా గోల్‌’’ అనేసరికి ఇద్దరూ ఆగి నా వైపు చూశారు.

‘‘అంటే ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే వచ్చేస్తుందని కాదు, ఒక్కసారి ఫుల్‌గా హార్డ్‌గా ప్రిపేరై రాయాలని.’’

‘‘అయితే అప్పటి వరకూ పెళ్ళి ఆలోచన పక్కన పెట్టాలా?’’ చాలా మధురంగా ఉందా స్వరం.

తలూపాను మౌనంగా.

‘‘కష్టమే అయినా ఇష్టమైన వారి కోసం తప్పదుగా.’’

మనసు లోతుల్ని తాకిందా మాట ఇంకా ‘యస్‌’ చెప్పకుండా ఉండగలనా? అన్నయ్యని చూసి నవ్వేశాను.

‘‘ఓకేనా?’’ ఆనందం పట్టలేనట్లు గట్టిగా అరిచేశాడన్నయ్య.

‘‘బావా’’ అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు. నాకా దృశ్యం చాలా నచ్చింది. ‘‘నేను... నేను... చెప్పేసి వస్తా’’ లోపలికి పరిగెత్తాడు.

‘‘థ్యాంక్యూ వందనా, అసలు... నేను...’’ ఆగిపోయాడు మాటలు రానట్లుగా.

‘‘నేనంటే నిజంగా ఇష్టమా?’’ ఎందుకో అలా అడగాలనిపించింది.

‘‘నిజం...గా’’ ఒత్తి పలికాడు.

‘‘ఎంత??’’

‘‘చా..లా..’’

‘‘చాలా అంటే’’ మళ్ళీ అడిగాను.

‘‘చాలా అంటే’’ ఆలోచిస్తూ... ‘‘అదిగో ఆ వంకాయలంతిష్టం’’ ఎదురుగా ఉన్న వంగతోటను చూపించాడు.

గుండె గుభేల్‌మంది నాకు.

దేవుడా! ఎంత నిర్దయుడివి. నీ గుడికెప్పుడూ రాలేదని ఇలా పగ తీర్చుకుంటావా? ఇక జీవితాంతం వదలదా వంకాయ? ఖర్మ కాకుంటే వీడికీ వంకాయ పిచ్చేనా?

‘‘వావ్‌... మీకు వంకాయ తోటనే ఉందా? అయితే ఇల్లరికం వచ్చేస్తా, ఎంచక్కా రోజూ వంకాయ కర్రీ తినొచ్చు’’ ఆనందంలో గౌతమ్‌, ‘తాజా కూరల్లో రాజా ఎవరండీ?’ పాటతో అన్నయ్య, ఏడుపు మొహంతో నేను...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..