ఆడుతూ పాడుతూ

పక్షుల కిలకిలరావాల శబ్దంతో కూడిన కాలింగ్‌బెల్‌ అదేపనిగా మోగుతుండడంతో తెలివి వచ్చింది శిశిరకి. ఇంకా బద్దకంగా, మత్తుగా ఉండటంతో లేవాలనిపించక, పక్కనే పడుకుని నిద్రపోతున్న చైతన్యని ‘‘చైతూ చూడు, ఎవరో కాలింగ్‌బెల్‌ కొడుతున్నారు’’ అంటూ చేత్తో తట్టింది.

Updated : 21 May 2023 03:17 IST

 జ్యోతి సుంకరణం

క్షుల కిలకిలరావాల శబ్దంతో కూడిన కాలింగ్‌బెల్‌ అదేపనిగా మోగుతుండడంతో తెలివి వచ్చింది శిశిరకి. ఇంకా బద్దకంగా, మత్తుగా ఉండటంతో లేవాలనిపించక, పక్కనే పడుకుని నిద్రపోతున్న చైతన్యని ‘‘చైతూ చూడు, ఎవరో కాలింగ్‌బెల్‌ కొడుతున్నారు’’ అంటూ చేత్తో తట్టింది.

‘‘హే... నువ్వే చూడు’’ అంటూ తన చేతికి అందనంత దూరానికి జరిగి పడుకున్నాడు.

దాంతో కోపం వచ్చిన శిశిర, కాలింగ్‌బెల్‌ సౌండ్‌ వినపడకుండా తలగడ చెవులకి అడ్డంగా పెట్టేసుకుని తను కూడా లేవకుండా పంతంగా పడుకుంది. మరో రెండుసార్లు ఆ బెల్‌ మోగి మోగి ఆగిపోయి, ఈసారి శిశిర సెల్‌ రింగ్‌ అవ్వడం మొదలయింది. ‘‘హొ... గాడ్‌’’ అని విసుక్కుంటూనే తీసి చూసుకుంది. అందులో ‘సర్వెంట్‌మెయిడ్‌ కాలింగ్‌’ అని రావడం చూసి, చికాకు పడుతూనే ఆన్‌ చేసింది. అటునుండి ‘‘ఏంటమ్మా, ఎన్నిసార్లు బెల్‌ కొట్టినా తియ్యరు, ఎప్పుడు వచ్చినా ఉండరూ...’’ విసుగ్గా అంది పనిమనిషి.

‘‘ఇంత పొద్దున్నే... అదీ ఆదివారం రావలసిన అవసరం ఏమిటీ... కాస్సేపయ్యాక రావచ్చుగా’’ అని శిశిర కూడా విసుక్కోవడంతో ‘‘పొద్దున్న ఏంటమ్మా, పదకొండు అవుతూంటే... మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు రాలేను. ఇష్టమైతే చేయించుకోండి, లేకపోతే నా జీతం నాకియ్యండి, పని మానేస్తాను’’ అని అటు నుండి గట్టిగా మాట్లాడేసరికి శిశిరకి కూడా కోపం వచ్చింది.

‘మానేస్తే మానెయ్యి’ అనేసేదే కానీ ఠక్కున గత నాలుగైదు రోజులుగా సింక్‌ నిండా నిండిపోయిన అంట్ల గిన్నెలూ మాసిన బట్టలతో నిండిపోయిన బాల్కనీ గుర్తువచ్చి బలవంతంగా లేచి వెళ్ళి తలుపు తీసి ఆ తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్ళింది.

పనిమనిషి చేసే శబ్దాలకు చైతన్య కూడా లేచేశాడు. ఫ్రెష్‌ అయి వచ్చి, స్టౌ మీద పాలు పెట్టి, ఫ్రిజ్‌లోంచి బ్రెడ్‌, బట్టర్‌ తీసుకుని హాల్లోకి వెళ్ళి కూర్చుంది శిశిర. చైతన్య కూడా బ్రష్‌ చేసుకుని అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇద్దరూ బ్రెడ్‌ తింటూ సెల్‌ఫోన్లలో మునిగిపోయారు. పనిమనిషి పని చేసుకుని వెళ్ళిపోయింది కూడా గ్రహించుకోలేదు. ఈలోగా ఘాటైన మాడు వాసన రావడంతో అప్పుడు గుర్తువచ్చింది శిశిరకి- పాలు స్టౌ మీద పెట్టిన సంగతి. వెంటనే పరిగెత్తుకు వెళ్ళింది. స్టౌ నిండా ఒలికి పోయిన పాలనూ మాడిన గిన్నెనూ చూసి, వాటినో తిట్టు తిట్టుకుని, స్టౌ ఆపేసి అలా ఎక్కడ వాటిని అక్కడే వదిలేసి బయటికి వచ్చేసింది.

ఆ సంగతి కూడా గ్రహించలేదు చైతన్య. ఈలోగా ఎవరో ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి మూవీ టికెట్స్‌ బుక్‌ చేశాం రమ్మనడంతో వెంటనే ఇద్దరూ రెడీ అయిపోయి డోర్‌ లాక్‌ చేసుకుని వెళ్ళిపోయారు.

శిశిర-చైతన్యలకు వివాహమై ఇంచుమించు ఏడాది కావస్తోంది. ఇద్దరూ మంచి చదువులే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ ఇంట్లో అతి గారంగా పెరిగినవారే. కావాల్సినట్లు ఉంటూ కావలసినది తింటూ వీకెండ్స్‌ పార్టీలతో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చెయ్యడమే వాళ్ళకు తెలిసిన జీవితం.

అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా, అవి నడుస్తూ తెలియనివాళ్ళకి అన్నీ తెలియజెప్తూ జీవితంలో రకరకాల కోణాల్ని స్పృశింపజేస్తాయి. ఎప్పటిలాగే ఓ వీకెండ్‌ లేట్‌నైట్‌ పార్టీలో ఎంజాయ్‌ చేసి వచ్చి పడుకున్నారిద్దరూ. మరి అక్కడి ఫుడ్‌లో తేడా వచ్చిందో ఏమో కానీ తెల్లారేసరికి ఇద్దరికీ వాంతులూ విరోచనాలూ పట్టుకున్నాయి. అవి అంతకంతకూ పెరిగి ఇద్దరూ హాస్పిటల్‌లో అడ్మిట్‌ కావలసి వచ్చింది. విషయం తెలిసి ఇద్దరి తల్లిదండ్రులూ వెంటనే బయలుదేరి వచ్చేశారు. హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చాక తండ్రులు ఇద్దరూ వెళ్ళిపోయి తల్లులు ఉన్నారు. ఇంటినిండా ఎక్కడికక్కడ మోపుల్లా ఉన్న మాసిన బట్టలూ, అట్టలు కట్టేసి బంకలా అంటుకుపోతున్న స్టవ్వూ వంట గదీ, దుమ్మూ ధూళితో ఉన్న గదులూ, పాకుడు పట్టి జారిపోతూ కంపు గొట్టేస్తున్న బాత్‌రూమ్‌ల మీద పడింది వాళ్ళిద్దరి దృష్టీ. వెంటనే ఇద్దరూ కొంగు బిగించి, పనిమనిషి సాయం తీసుకుని ఆ ఇంటిని అంతటినీ ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. అలా చేస్తూ చేస్తూ ఒకానొక సమయంలో విసుగు వచ్చిన చైతన్య తల్లి ‘‘ఏమిటమ్మా శిశిరా, ఇలాగా ఇంటిని ఉంచుకునేది, శుభ్రం చేసుకోవద్దూ’’ అంటూ మందలించింది కోడల్ని.

ఆ మాటల్ని కోడలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కోడలి తల్లి మాత్రం వెంటనే పట్టించుకుని ‘‘అంత చదువు చదువుకునీ, ఉద్యోగం చేస్తూ అంత సంపాదిస్తున్నది ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోడానికా వదినగారూ... అయినా మీ అబ్బాయి ఆఫీసు నుంచీ మా పిల్లకంటే ఓ గంట ముందే వచ్చి ఓ గంట ఆలస్యంగా వెళతాడట కదా, తను చెయ్యొచ్చు కదా’’ అంటూ సాగదీసింది.

‘‘ఆఁ భలే చెపుతున్నారు, మావాడు మా ఇంట్లో లేకలేక పుట్టిన ఏకైక మగపిల్లాడు, మా వంశోద్ధారకుడు, మంచినీళ్ళు కూడా చేతికి అందిస్తాం. అటువంటిది పెళ్ళి అయ్యాక ‘కాఫీ నేనే కలుపుకుని తాగుతున్నానమ్మా’ అని ఫోన్‌ చేసి చెపుతూ ఉంటే కడుపు తరుక్కుపోతోంది’’ అని అప్పటికప్పుడే చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఎంతో బాధగా చెప్పింది చైతన్య తల్లి.

‘‘మా పిల్లని మేమేం గాలికి పెంచలేదు, మీరింకా మంచినీళ్ళు చేతికి ఇచ్చేవారేమో, నేనైతే చేతులు కందిపోతాయని నేనే తాగించి, తినిపించేదాన్ని. అలాంటిది మొన్నోసారి ఫోన్‌ చేసి ‘దోసెలు వేస్తుంటే చెయ్యి కాలిందమ్మా’ అంటూ చెప్పేసరికి నా గుండె కోసేసినంత పనయ్యింది.

ఏ స్విగ్గీలోనో ఆర్డర్‌ పెట్టుకోక, అంత ఉద్యోగం చేస్తూ కూడా దోసెలు పోసుకుంటూ చేతులు కాల్చుకోవాల్సిన ఖర్మ నీకేమిటే అంటూ రోజల్లా తిడుతూనే ఉన్నాను’’ అంటూ శిశిర తల్లి ఒకింత ఎక్కువ చేసి చెప్పింది.

‘‘మరి అదీ సంగతి. ఆడపిల్లకి కాస్త పనీ పాటా నేర్పక, ఇలా పెంచబట్టే ఈ కొంప ఇలా తగలడింది’’ అంటూ శృతి మించి నోరు పారేసుకుంది చైతన్య తల్లి.

ఇక అంతే... ‘‘ఏమిటి వదిన గారూ... నా పెంపకాన్నే ఎత్తిచూపుతున్నారు. ‘చదువుకునే రోజుల్లోనే మీ కూతురు ఎవడితోనో లేచిపోయింది’ అన్న విషయం మాకు తెలీదు అనుకోకండి, మరి మీ పెంపకాన్ని ఏమనుకోవాలి, అన్నీ తెలిసీ ఈ సంబంధం కలుపుకున్నందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి’’ అనేసింది శిశిర తల్లి.

దాంతో చైతన్య తల్లి ‘‘ఎప్పుడో పదేళ్ళక్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తోడుతున్నారు, అలా చూసుకుంటే మీ శిశిరకి మావాడికన్నా ముందే ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందనీ వాడితో కొన్నాళ్ళు తిరిగిందనీ అక్కడ వ్యవహారం చెడి మా దగ్గరికి వచ్చారనీ తెలిసి మరీ చేసుకున్నాం. అందుకు మాకు ఈ శాస్తి జరగాల్సిందే’’ అంటూ తోకతొక్కిన త్రాచల్లే లేచింది.

ఇలా ఇద్దరూ శృతి మించి పోతుండడంతో అటు చైతన్య, శిశిర కూడా అంత నీరసంలోనూ లేచి వచ్చి, ఎవరి తల్లిని వాళ్ళు చెరో గదిలోకి లాక్కుపోయారు. ఇక అప్పటి నుండీ ఆ ఇద్దరి తల్లుల మధ్యా మాటల యుద్ధం మొదలయ్యింది. అది రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.

‘బాబూ చైతన్యా, కొంచెం అది అందుకో, ఇది అందుకో’ అంటూ అతని తల్లి చూస్తూ ఉండగా పని చెప్తూ శిశిర తల్లి రెచ్చగొడుతూ ఉంటే, దానికి ప్రతీకారంగా ‘అమ్మా శిశిరా, కాస్త ఈ కూర తరిగి పెట్టమ్మా, కాఫీ కలుపమ్మా’ అంటూ చైతన్య తల్లి కోడలికి, వాళ్ళ అమ్మ చూస్తుండగా పనులు చెప్పి కక్ష తీర్చుకుంటుండేది. ఒకరోజు ఏదో ఆఫీస్‌ వర్క్‌ సీరియస్‌గా చేసుకుంటున్న చైతన్య దగ్గరికి శిశిర తల్లి వచ్చి ‘‘బాబూ చైతూ, పొద్దున్న పనిమనిషి రాలేదు, కాస్త వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు వేసెయ్‌’’ అని చెప్పింది. అది విన్న చైతన్య తల్లి ‘‘ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళం ఉంటే పనిమాలా వెళ్ళి అల్లుడికి బట్టలుతకమని చెబుతావా, నువ్వు అసలు ఆడదానివేనా’’ అంటూ శివాలెత్తేసింది.

అసలే కొద్ది రోజులు లీవ్‌లో ఉండిపోవడంతో ఆఫీస్‌ వర్క్‌ ఎక్కువై చికాకులో ఉన్నాడేమో చైతన్యకి కూడా అత్తగారి ధోరణి కోపాన్ని తెచ్చి పెట్టింది. ‘‘సర్లే పెద్దవాళ్ళు, ఏమైనా అంటే శిశిర ఫీల్‌ అవుతుందీ అని ఊరుకుంటే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు ఆంటీ. ఇక మీదట ఏ పనులు చెప్పాలనుకున్నా, మీ అమ్మాయికే చెప్పండి, నాకు కాదు’’ అంటూ చాలా సీరియస్‌గా చెప్పేశాడు. ఎప్పుడూ ఎదురు మాట్లాడని అల్లుడు అలా అనేసరికి ఒక్కసారి తెల్లబోయింది శిశిర తల్లి. ‘‘అదీ అలా బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టు’’ అంది ఆనందంగా చైతన్య తల్లి.

‘‘ఏంటి ఆంటీ, మా అమ్మను పట్టుకుని అలా అంటున్నారు, ఏం మీరు నాకు పని చెప్పగా లేనిదీ మీ అబ్బాయికి మా అమ్మ చెప్తే మీకు రోషం వచ్చిందా’’ అప్పటి వరకూ వేరే గదిలో ఉన్న శిశిర వచ్చి విసురుగా అంది.

‘‘అదేమిటీ, మీ అమ్మకు లేకపోతే పోయే నీకు కూడా లేదా నువ్వు కట్టుకున్న మొగుడి మీద గౌరవం. వాడిని చులకనగా చూస్తుంటే మందలించాల్సింది పోయి, మీ అమ్మను వెనకేసుకు వస్తావా’’ అంటూ కోడలి మీద విరుచుకు పడింది చైతన్య తల్లి.

‘‘చిన్నప్పటి నుండీ పెంచి పెద్ద చేసి నా బాగోగులు చూసిన మా అమ్మను వెనకేసుకుని రాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన మీ అబ్బాయినీ మిమ్మల్నీ వెనకేసుకు వస్తానా...’’ అంటూ శిశిర కూడా అత్తగారి మీద అరిచింది.

‘‘నువ్వు మీ అమ్మని వెనకేసుకు వచ్చి ఆవిడ మాటే వింటే ఇక మీ కాపురం తగలడినట్లే’’ అంది చైతన్య తల్లి.

‘‘నాకు మా అమ్మే ముఖ్యం, తన మాటే వింటాను, ఆ తర్వాతే ఏదైనా’’ అంటూ తెగేసి చెప్పింది శిశిర.

అది విన్న చైతన్య ‘‘నీకు మీ అమ్మ ముఖ్యం అయితే నాకూ మా అమ్మే ముఖ్యం, నాకూ తన తర్వాతే ఎవరైనా’’ అంటూ మొండిగా మాట్లాడాడు.

కొడుకు ఇచ్చిన సపోర్ట్‌తో రెచ్చిపోయిన అతని తల్లి ‘‘విన్నావుగా మా అబ్బాయి మాట, వాడికి తగినంత గౌరవం ఇచ్చి, వంటా వార్పూ చేసుకుంటూ ఇక నుంచి అయినా భాధ్యతగా సంసార పక్షంగా ఉంటేనే నీకు ఈ ఇంట్లో స్థానం, లేదంటే ఇప్పుడే మీ అమ్మతోపాటూ ఈ ఇంటి నుండి వెళ్ళిపో’’ అనేసింది.

అది విన్న శిశిర తల్లి ‘‘ఎవరి ఇంట్లోంచి ఎవరిని వెళ్ళమంటున్నావు మహాతల్లీ... ఈ ఫ్లాట్‌ మా అమ్మాయిది. దాని సంపాదనతో కొన్నది, నీ కొడుకుది కాదు- అది తెలుసుకో ముందు. మా అమ్మాయి ఆఫీస్‌కి వెళ్ళి రావడం తప్ప ఇంట్లో ఏ పనీ చెయ్యదూ చెయ్యలేదు. ఇంట్లో అన్ని పనులూ తనే చూసుకుంటూ, మా అమ్మాయిని అపురూపంగా చూసుకుంటానని మీ అబ్బాయి మాట ఇస్తేనే ఇక మీదట ఈ బంధం కొనసాగేది. అలా కుదరదనుకుంటే తక్షణమే మీ తల్లీ కొడుకూ ఇంట్లోంచి వెళ్ళండి’’ అంటూ హుకుం జారీ చేసేసింది శిశిర తల్లి.

ఆవిడ మాటలు విని నిర్ఘాంతపోయాడు చైతన్య. పెళ్ళయిన కొత్తలో ఈ ఫ్లాట్‌ శిశిర కొనడానికి సిద్ధపడితే, ‘నీ నుండి నేనేదో ఆశించాననుకుని మీవాళ్ళంతా తప్పుగా అనుకుంటారు, నువ్వు కొనద్దు’ అని వారిస్తే, ఇంకా ‘నా’, ‘నీ’ అనుకోవడం ఏమిటీ, అంతా మనిద్దరిదీ. అయినా ‘ఫ్లాట్‌ కొన్నాం అనే అందరికీ చెపుదాం. ఎవరి డబ్బుతో అన్నది మనిద్దరి మధ్యే ఉంచుకుందాం’ అంటూ అప్పట్లో శిశిర చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి చైతన్యకి. ‘ఎవ్వరికీ చెప్పం’ అని తనతో అబద్దం చెప్పి, ‘తన తల్లితో అంతా చెప్పింది అన్నమాట’ అని గ్రహించిన చైతన్యకి తన తల్లి మాటల్లో పూర్తి న్యాయం ఉంది అనిపించేసి, ఇంతకాలం శిశిరా, ఆమె తల్లీ తననో వెర్రి వాజమ్మగా లెక్క కట్టారని భావించి, శిశిరను అసహ్యించుకుని ఆ క్షణంలోనే తన తల్లిని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.

ఓ ఆరు నెలలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలలేదు. మొదట్లో కొద్దిరోజులు రిలీఫ్‌గానూ ప్రశాంతంగానూ అనిపించినా రానురానూ చైతన్యా, శిశిరా ఇద్దరిలో అంతర్మథనం మొదలయ్యింది. అలాగని ఓ మెట్టు దిగితే అవతలి వాళ్ళకి లోకువ అయిపోతామనే అహం కూడా అడ్డు వచ్చింది. దానికితోడు అటూ ఇటూ బంధువులలో గుసగుసలూ ఆరాలూ మొదలయ్యాయి. ‘ట’ కారం మాటలతో జరిగినదాన్ని పెద్దది చేసేందుకు సాధ్యమైనంత కృషి చేస్తున్నారు బంధువర్గం అంతా. దానిలో భాగంగా ఎవరికోసమో ‘పెళ్ళికి ఎవరైనా అబ్బాయిలు ఉంటే చెప్పండి’ అన్న శిశిర తల్లి మాటలు చిలవలు పలవలుగా రూపాంతరం చెంది, ‘శిశిరకి ఇంకో పెళ్ళి చెయ్యడానికి చూస్తున్నారు’ అని చైతన్య తల్లికి వచ్చి చేరాయి. ‘కుటుంబం అన్నాక లక్షా తొంభై గొడవలు అవుతాయి, ఈ మాత్రానికే విడాకులు తీసుకుని ఇంకో పెళ్ళి చేస్తాం అనుకుంటారా ఎవరైనా’ అంటూ ఈవిడ అన్న మాటలు వెళ్ళి వెళ్ళి మరో విధంగా చేరాయి శిశిర తల్లికి. అలా చినికి చినికి గాలి వానై, ఆ వాన పెను తుఫానై ఆఖరికి ఇద్దరూ విడాకులు తీసుకుని శాశ్వతంగా విడిపోయే వరకూ వచ్చింది.

*              *                 *  

‘‘మీ పెళ్ళి జరగడానికి ముందు నుంచే మీ ఇద్దరికీ నాతో బంధుత్వమే కాదు, ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది. అసలు ఆ అనుబంధంతోనే మీ ఇద్దరూ ఒకటి అయితే బావుంటుందని ఆశించి, మీ పెద్దవాళ్ళతో మాట్లాడి, మీ పెళ్ళి జరిపించాను. ‘ఒక మంచి జంటను కలిపాను’ అనే ఆనందం పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడు మీరిలా..!

వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసి నమ్మలేక పరిగెట్టుకుని వచ్చాను. అసలు ఏం జరిగింది?’’ అంటూ అడిగింది, శిశిరకు అక్క వరుస, చైతన్యకు ఆఫీస్‌లో సీనియర్‌ కూడా అయిన భార్గవి.

ఎవరి కోణంలో వాళ్ళు జరిగిందంతా చెప్పుకు వచ్చారు ఇద్దరూ. సుమారు ఒక ఆరు నెలల క్రితం తను ట్రాన్స్‌ఫర్‌ మీద వేరే ఊరు వెళుతున్నప్పుడు తనకి సెండాఫ్‌ ఇవ్వడానికి- నవ్వుతూ తుళ్ళుతూ కలిసి వచ్చిన వాళ్ళిద్దరినీ గుర్తు తెచ్చుకుని, ఇప్పుడిలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ అలా ఎడ మొహం, పెడ మొహంగా కూర్చోవడాన్ని అస్సలు భరించలేకపోయింది భార్గవి. ‘‘నా మాట మీదా నా మీదా గౌరవంతో పిలవగానే నా దగ్గరికి వచ్చారు. అలాగే రేపు ఒక్కసారి నా మాట విని నాతో రండి, ఒక దగ్గరికి తీసుకువెళతాను మీ ఇద్దరినీ’’ అంటూ చెప్పి వాళ్ళిద్దరినీ మర్నాడు సిటీకి దూరంగా ఉన్న ఓ ఫామ్‌ హౌస్‌కి తీసుకెళ్ళింది. చుట్టూ రకరకాల పూల మొక్కలతో అందమైన లాన్‌ మధ్యలో కుటీరాన్ని తలపించే ఆకృతిలో ఉన్న చిన్న ఇల్లు అది. లాన్‌లోనే కబుర్లు చెప్పుకుంటూ కుర్చీలలో కూర్చుని ఉన్నారు ఒక వృద్ధ జంట.

‘‘రండి రండి మీ కోసమే చూస్తున్నాం’’ అంటూ వీళ్ళని నవ్వుతూ ఆహ్వానించారు. చుట్టూ ఆ పరిసరాలూ, చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ వృద్ధ జంటనీ చూసిన శిశిర, చైతన్యల మనస్సులు ఒక్కసారి ప్రశాంతంగా అయిపోయాయి. కాసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్ళారు అంతా. ఆ పెద్దాయన లోపల కిచెన్‌లోకి వెళ్ళి అందరికీ వేడి వేడిగా ఘుమఘుమలాడే ఉప్మాని ప్లేట్లలో వేసి పట్టుకొచ్చి పెడితే, ఆ పెద్దావిడ వెళ్ళి అందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చింది. ‘‘అయ్యో, మీ ఇద్దరికీ ఎందుకండీ శ్రమ, నేను తెస్తాను’’ అంటూ లేవబోతున్న భార్గవిని, ఆ పెద్దావిడ ‘‘ఇందులో మాకు ఎటువంటి శ్రమా లేదు, నువ్వు మొహమాటపడకుండా కూర్చుని తిను’’ అంటూ కూర్చోబెట్టేసింది. అప్పుడే కాదు... ఆ తర్వాత లంచ్‌, ఆ తర్వాత గార్డెనింగ్‌ అన్నీ కూడా ఇద్దరూ కలిసి అసలు ఏ మాత్రం శ్రమ లేకుండా ఓ క్రమ పద్ధతిలో, ఓ అండర్‌స్టాండింగ్‌తో చేసుకుపోవడం చూసి చైతన్యకీ శిశిరకీ ఆశ్చర్యం వేసింది. భార్గవి ఇక్కడికి రమ్మని ఎందుకు పిలిచిందో... తన ఉద్దేశ్యం ఏమిటో... అసలు వీళ్ళు ఎవరో... అంతా అయోమయంగా, అన్యమనస్కంగా ఆలోచిస్తూ కూర్చున్న ఇద్దరూ, కాస్సేపట్లోనే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు గమనిస్తూ రాను రానూ సమయాన్నే మర్చిపోయారు. ఆ రాత్రి ఆరుబయట కూర్చుని శిశిర, చైతన్యలకి ‘‘వీళ్ళిద్దరూ రిటైర్డ్‌ ప్రొఫెసర్స్‌. ఒకప్పుడు నేను వీళ్ళ స్టూడెంట్‌ని. వీళ్ళ నుండి నేను చదువు మాత్రమే కాదు, అంతకన్నా విలువైనవి ఎన్నో నేర్చుకున్నాను. ఇంకా బాగా చెప్పాలంటే నా ఆరాధ్య దైవాలు ఇద్దరూ. నా జీవితం ఎంతో ప్రశాంతంగా, ఓ క్రమ పద్ధతిగా మారిందీ అంటే దానికి వీళ్ళే కారణం. అనేక అలజడులతో, అపోహలతో ఉన్న మీ ఇద్దర్నీ ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళని చూపిస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందేమోనని ఆశించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇద్దరూ కూడా ఉన్నత విద్యావంతులు. మంచి హోదాలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు- అది కూడా ఆ రోజుల్లో. ఆడపిల్లలని ప్రాథమిక విద్యే చదివించని ఆ రోజుల్లో నేనింత చదువుకునీ, ఉద్యోగం చేస్తూ కూడా ‘ఇంటిపనీ వంటపనీ చెయ్యాలా’ అని ఆవిడ అనుకున్నా... ‘నేను మగవాడ్ని, నేనెందుకు ఇంట్లోపని చెయ్యాలి’ అని ఆయన అనుకున్నా... ఈరోజు ఇద్దరూ ఇంత ఆనందంగా ఉండేవారు కాదు. వీళ్ళకి ముగ్గురు పిల్లలు. అంతా మంచి మంచి పొజిషన్లలో ఉన్నవాళ్ళే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సరదాగా గడిపి వచ్చేస్తుంటారు. నేనూ నా భర్తా కూడా వీళ్ళని చూసి ఆ జీవన శైలినే అలవాటు చేసుకున్నాం.

ఇప్పుడు మీ విషయాన్ని తీసుకుంటే- మీ ఇద్దరి అవగాహనా లోపం, మీ పెద్దవాళ్ళ తొందరపాటూ తప్ప మీరిద్దరూ విడిపోయేంత భయంకర పరిస్థితులు మీ మధ్య లేవు.

అతి గారం, శృతి మించిన మీ పేరెంట్స్‌ కేరింగ్‌తో కష్టపడే తత్వం మీలో లేకుండా పోయింది. పెళ్ళి చేసుకుని విడిగా కాపురం పెట్టాక- ప్రతి కుటుంబంలోనూ ఉండే రోజువారీ పనిపాటలూ అవసరాలూ, భార్యాభర్తలుగా చేసుకోవలసిన సర్దుబాట్ల గురించి అస్సలు అవగాహన లేకపోవడం వలన- అతి చిన్న విషయాలే ఈ రోజు మీ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చాయి. పిల్లలు ఆనందంగా ఒకరికొకరుగా బతకాలని కాక- ఏది ఎలా పోయినా పని చెయ్యకుండా కూర్చుంటే చాలనుకునే మీ అమ్మానాన్నల అతి ప్రేమ, అహంకారం అగ్నికి ఆజ్యం పోశాయి.

వయసు పైబడినా ఒంట్లో ఓపిక లేకపోయినా కేవలం ఇద్దరి మధ్యా ఉన్న అర్థం చేసుకునే గుణం, అనవసర అహాల జోలికి పోకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం వలన వీళ్ళిద్దరూ ఇంకో మనిషి అవసరం లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఆ రోజులు వేరు, ఆ తరం వేరు- నిజమే. పూర్తిగా వాళ్ళలాగా ఉండలేకపోయినా కాస్త అయినా వీళ్ళని చూసి నేర్చుకుని, ‘ఏ విధంగా విడిపోవాలీ’ అని కాకుండా ‘ఏ విధంగా కలిసి ఆనందంగా జీవించాలీ’ అనే దిశగా మీరిద్దరూ అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం’’ అంటూ నెమ్మదిగా చెప్పింది భార్గవి.

ఆ మర్నాడు ఉదయమే శిశిర, చైతన్యలు ఇద్దరూ దూరంగా పూలమొక్కల మధ్య కూర్చుని మాట్లాడుకుంటూ ఉండటం చూసి, ‘మంచి మార్పుకి పునాదులు పడుతున్నా యన్నమాట’ అనుకుని సంతోషించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..