బరువు
‘‘ఏమిటీ, పిల్లలిద్దర్నీ మీ అత్తగారి దగ్గర వదిలివచ్చావా?’’ ఆశ్చర్యంగా అడిగింది సుజన. నవ్వుతూ తలూపింది వనజ.
డా।। మజ్జి భారతి
‘‘ఏమిటీ, పిల్లలిద్దర్నీ మీ అత్తగారి దగ్గర వదిలివచ్చావా?’’ ఆశ్చర్యంగా అడిగింది సుజన.
నవ్వుతూ తలూపింది వనజ.
ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలి వస్తే మరుసటిరోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తుకొచ్చింది సుజనకి. ఇంటినిండా తిని పడేసిన కుర్‌కురే ప్యాకెట్లూ ఐస్‌క్రీమ్ కప్పులూ చాక్లెట్ రేపర్సూ మ్యాగీ ప్యాకెట్లూ... ఇంకా అలాంటి చెత్తాచెదారం. ఇదేమని అడిగితే, ‘నువ్వెలాగూ తిననివ్వవు. పోనీలే ఒక్కరోజే కదా అని...’ దీర్ఘం తీస్తుంది అత్తగారు. పోనీ సరిపెట్టుకుందామనుకుంటే, ‘నాన్నమ్మకు నేనంటే చాలా ఇష్టం. అందుకే నాకిష్టమైనవి కొంటుంది. నువ్వెప్పుడూ కొనవు. నువ్వు బ్యాడ్’’ అంటూ కొడుకు మాటలు.
పిచ్చెక్కిపోతుంటుంది సుజనకు.
కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డంపడిపోతుంటారు. ‘పోనీలే చిన్నపిల్లవాడు. పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే’ అంటూ. అది వాడిమీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థంకాదు సుజనకు.
పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే, ఎల్‌కేజీ, యూకేజీలకే- ‘క్లాసులు పోతున్నాయి. ఇలాగైతే కష్టం’ అంటూ టీచర్ల గొడవ.
అలాగని ఏ ఫంక్షన్లకూ వెళ్ళకుంటే... ఒక చిన్న ఫంక్షన్‌కూ వెళ్ళలేకపోతే ఈ జీవితమెందుకన్న నిరాశా నిస్పృహలు.
ఈ బాధలుపడలేక ఉన్న ఆ ఒక్కడినీ ఈమధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది, భర్తకు ఇష్టంలేకపోయినా.
ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది... చదువు మధ్యలో మానేసి, పెళ్ళి చేసుకుని, జీవితంలో ఏమి సాధించింది తను? ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం... ‘పోనీలెద్దూ పెద్దావిడ...’ అంటూ భర్త వత్తాసు. ఏమిటో ఈ జీవితం... ఏదో అసంతృప్తి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది. తనెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతోందో.
‘‘ఏమిటే అంత దీర్ఘాలోచనలో పడిపోయావు?’’ వనజ మాటలకు, ఆలోచనల నుండి బయటపడింది సుజన. స్నేహితురాళ్ళిద్దరూ, చాలా కాలానికి ఒక పెళ్ళిలో కలుసుకున్నారు. అందుకని మాటలు తరగడం లేదు. వనజకేమోగానీ, మరికాసేపట్లో విడిపోతామంటే, సుజనకు ఇప్పటినుండే బెంగ మొదలైంది. పెళ్ళయిన ఇంత కాలానికి తను తనలా... స్నేహితుల మధ్య నవ్వుతూ తుళ్ళుతూ గడిపి...
మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడుపొస్తోంది.
‘మా ఇంటికి రావచ్చు కదా, నాలుగు రోజులుండి వెళ్దువుగాని...’ సడన్‌గా అంది వనజ. అనడమేకాదు, పోరుపెట్టి, సుజనా వాళ్ళాయనకు ఫోన్ చేసి మరీ, ఓకే అనిపించింది. సుజన ఆనందానికి పట్టపగ్గాల్లేవు.
* * *
తీరా వెళ్ళాక చూస్తే- సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి.
ఇంకా పనిమనిషి రాలేదేమో... ఎంత జాగ్రత్తపడినా... చిప్స్ తునకలూ కుర్‌కురే ముక్కలూ అక్కడక్కడా. నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని.
‘‘ఏదో పిల్లలు అడిగారని...’’ తానూ నవ్వుతూ చెప్పారావిడ.
‘‘ఇంకో వారం వరకూ వాళ్ళవి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి’’ నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ.
అదే తన ఇంట్లో సీను గుర్తుకొచ్చింది సుజనకు. తిని పడేసిన స్నాక్ ప్యాకెట్లు ఇంటినిండా... అవి చూస్తే తనకు కోపం నషాళానికి అంటుతుంది. అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారవి తీయకుండా అలాగే ఉంచుతుందనిపిస్తుంది. ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది.
‘ఈ చెత్తంతా వాడికి పెట్టొద్దన్నానా?’ తను. ‘ఉన్న ఒక్క మగ నలుసుకి నచ్చినది తినడానికి కూడా లేదు ఈ ఇంట్లో’ అత్తగారి కౌంటర్. ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకూ... మధ్యలో భర్త.
‘‘ఏమిటే, నువ్వూ నీ ఆలోచనలూ. కాసేపు రెస్ట్ తీసుకో. ఈలోగా నేను వంట చేసేస్తాను’’ వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. ‘‘భలేదానివే! రెస్ట్ తీసుకోవడానికా నేను వచ్చింది?
పద, నేను కూడా వంటగదిలోకే’’ వనజను అనుసరించింది సుజన.
* * *
వనజ వాళ్ళాయన ఆఫీసులోనే లంచ్ చేస్తాడట. ఆడవాళ్ళు ముగ్గురూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ‘‘వేపుడు చేశావా? వంకాయా టొమాటో ముద్దకూర చెయ్యవలసింది. బాగుంటుంది’’ అంది వనజ అత్తగారు.
‘‘ఈసారి చేసుకుందాం లెండి’’ నవ్వుతూ చెప్పింది వనజ. ప్రయాణం చేసొచ్చి, వంట చేసిపెడితే ఆనందించాల్సిందిపోయి, ఇంకా ఏదో ఉంటే బాగుండునన్న వనజ అత్తగారి మాటలకు, సుజనకు నిజంగా కోపం వచ్చింది. ఆవిడ ఏదో సాయం చేసినట్లు, ‘చేసుకుందాంలెండి’ అని వనజ అనడం కూడా నచ్చలేదు. కానీ తన ఇల్లు కాదు కాబట్టి, గమ్మున ఊరుకుంది. భోంచేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్రకొరిగారు.
* * *
సాయంకాలం స్కూలు నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదలలేదు. వంటగదిలో పనిచేస్తున్నంతసేపూ, వనజ చుట్టూనే తిరిగారు. పనంతా చేసి ‘‘వెళ్ళి నాన్నమ్మ దగ్గర కూర్చుని హోమ్‌వర్క్ చేసుకోండి. నేనూ నా ఫ్రెండూ డాబా మీదకు వెళ్తాం’’ అంటే బలవంతంగా వెళ్ళారు. ఆశ్చర్యమేసింది సుజనకు. తను ఇంట్లో లేనప్పుడు, ఒక గంట వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండాల్సివస్తే, ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు. అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే, ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను. బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లలను చాలా బాగా చూసుకుంటారేమో... తనలో తానే సమాధానపడింది సుజన.
‘‘ఏమిటే, ఎప్పుడూ ఆలోచనల్లో ఉంటున్నావు?’’ అన్న వనజ మాటలకు నవ్వేసింది.
‘‘పిల్లల హోంవర్క్..?’’ అర్ధోక్తిలో ఆపింది సుజన.
‘‘వాళ్ళు చేసుకుంటారులే. లేకపోతే తర్వాత చెప్తాను. మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాం రా!’’ అంటూ డాబా మీదకు దారితీసింది వనజ. మాటలు తెగటంలేదు స్నేహితులిద్దరికీ. భోజనాల సమయానికి కిందకి దిగక తప్పలేదు.
‘‘నీ ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చెయ్యడం ఎందుకని చెప్పలేదు... రమ-విశాల్ సినిమాకి వచ్చారట. ఇక్కడే భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది’’ చావుకబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు.
రమ- వనజ ఆడపడుచు. విశాల్ ఆవిడ భర్త. ఈమధ్యనే పెళ్ళయింది వాళ్ళకు.
దగ్గర్లోనే ఉంటారు. ‘భోజనానికి వస్తానన్నవాళ్ళు ముందే చెప్తే అందరితోపాటు వంట చేసేది కదా... పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈసరికి వనజ వంట చేసేది కదా. ఈసురోమంటూ ఇప్పుడు ఎనిమిది గంటలకి మళ్ళా వంట చేయాలా వాళ్ళకోసం? వనజను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా...’ కోపం తన్నుకు వస్తోంది సుజనకు. నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వేపు చూసింది. వనజ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు.
వాళ్ళు వచ్చి భోజనాలు చేసి, వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి అయింది. ఇంతా చేస్తే... ఆ అమ్మాయేదో అమెరికా నుండి వచ్చినట్లు, వాళ్ళ అమ్మగారు మరీమరీ బలవంతపెడితే ఉండిపోయింది రమ. వాళ్ళాయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈమాత్రం దానికి ఇంత హడావుడా. ఎదుటివాళ్ళకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కరలేదా... సుజన మనసు కుతకుతలాడిపోయింది.
* * *
ఆ తెల్లవారి ఇంకో సీన్. పిల్లలు స్కూలుకి వెళ్ళేంతవరకూ వనజ అత్తగారు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు... ‘‘టిఫిన్ ఏం చేస్తున్నావు? దోసెలా... పెసరట్టు వెయ్యకపోయావా..? రమకిష్టం. పాపం అదక్కడ చేసుకుంటుందో లేదో. వీలైతే కొంచెం శెనగ పలుకుల పచ్చడి చెయ్యరాదూ... పెసరట్టుతో బాగుంటుంది’’ ...ఇలా కూతురి ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు. ఇంకా ఆ కూతురు లేవనేలేదు. కూతురిని లేపి వదినకు సాయం చెయ్యమనొచ్చు కదా. సుజనకు మండిపోతోంది. తన ఇంట్లోనూ ఇదే తంతు. చూసిచూసి వంటమనిషిని పెట్టేసింది- ‘మీకేం కావాలో వంటమనిషితో చేయించుకుని తినండ’ని చెప్పి. దానికి అత్తగారు ఎంత గొడవ చేసిందీ... ‘వంటగదిలో అరగంట పనికి ఆరువేలు ఆ వంటమనిషి ముఖాన పొయ్యాలా అని?’ ‘అంతగా బాధనిపిస్తే మీరే ఆ అరగంట వంటగదిలో గడపండి’ అని సమాధానమిస్తే గింజుకుపోయింది. వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి... నిర్ణయించుకుంది సుజన.
వనజ వంటగదిలో నానా హైరానా పడుతుంటే వాళ్ళాయన, రఘు గది నుండి బయటకే రాలేదు. వనజే మధ్యలో కాఫీ, ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్ళి, గదిలో కాసేపు ఉండి వస్తుంది. గదిలో ఆ మహానుభావుడి అవసరాలేవి తీరుస్తుందో మరి. గదిలోకి తెప్పించుకోకపోతే, వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా. ఇదేమన్నా రూమ్ సర్వీసా? బయటకొస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా. అబ్బే, అంత పాటా! వీళ్ళ అవసరాలు తీరితే చాలు, ఇంకేమీ పట్టించుకోరు... పళ్ళు పటపటా కొరుక్కుంది సుజన.
* * *
భోజనాలవేళ ఇంకో సీన్... కూతురేదో చంద్రమండలం నుంచి దిగొచ్చినట్టు, వాళ్ళ అమ్మగారు చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. ‘ఇది వేసుకో, అదివేసుకో... అక్కడ వండుకుంటున్నావో లేదో... వదిన బాగా చేస్తుంది, ఇంకొంచెం వేసుకో... ఓ రెండు రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదూ. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నాలుగు పూటలు వస్తాయి’ అని తెగ గారాబం చేస్తోంది ముసలిది. చేయించట... చేయించి... ఎవడుచేస్తాడు? ఈవిడ కూతురు లాంటిది కాదా కోడలు... కోడలితో ఎంత పనైనా చేయించవచ్చా... మండిపోయింది సుజనకు.
సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు. కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ. ‘‘బజ్జీలు వెయ్యమంటాను వదినను, నీకిష్టం కదా. జంతికలు కూడా కొద్దిగా చెయ్యమంటాను. ఇంటికి తీసుకెళ్ళు. నాలుగు రోజులు తినొచ్చు’’ కూతురికి చెప్తూ వాళ్ళత్తగారు హడావిడిపడిపోతున్నారు. ఆ మాటలు విన్న సుజనకు ‘ఆ బజ్జీలో, జంతికలో మీరిద్దరూ కలిసి చెయ్యొచ్చు కదా. ఖాళీగానే ఉన్నారు కదా!’
అనెయ్యాలన్నంత చిరాకు వేసింది.
‘ఏదో ఫ్రెండ్‌తో రెండు రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే, రామేశ్వరం వెళ్ళినా, శనీశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడా అత్తగారి ఆరళ్ళే. ఎక్కడైనా కోడలితో చాకిరీ చేయించడమే. ఈ కోడళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో.
ఇంకెందుకు ఇక్కడ, మా ఇంటికి పోతాను’ ఉక్రోషంగా అనుకుంటూ, వనజకు చెబుదామని- వనజా వాళ్ళాయనా గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి, దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి, గదిలోకి వెళ్ళబోయి... లోపల వాళ్ళిద్దరినీ చూసి, చప్పుడు కాకుండా తలుపులు దగ్గరకు వేసి వెనుదిరిగింది సుజన.
* * *
‘‘నాలుగు రోజులు నాతో గడుపుదామని వచ్చి, అప్పుడే తిరుగు ప్రయాణమంటున్నావేమిటీ, ఏమైందే నీకు?’’ లాలనగా అడిగింది వనజ.
‘‘ఏముందే... అక్కడికీ ఇక్కడికీ తేడా ఏమీ లేదు’’ నీరసంగా అంది సుజన.
‘‘తేడా ఏమీ లేదా?’’ కొంటెగా అడిగింది వనజ. ‘గదిలో తాను వాళ్ళిద్దరినీ చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి?’ బిత్తరపోయింది సుజన.
‘‘చెప్పవే’’ మరింత కొంటెదనంతో అడిగింది వనజ. వాళ్ళాయన దగ్గరకు తీసుకుంటే గారాలుపోతుంది వనజ. ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో... డైలమాలోపడింది సుజన.
‘‘చెప్పవే’’ రెట్టించింది వనజ. దాంతో బాగా మండింది సుజనకు.
‘‘ఏమిటే, నువ్వూ నీ గొప్పలూ? మీ ఆయన దగ్గరకు తీసుకోగానే, వంటగదిలో బండచాకిరీ చేశానన్న విషయం మర్చిపోవడమే గొప్పా!’’ కినుకగా అడిగింది సుజన.
‘‘లేకపోతే ఆ బరువంతా నెత్తిన పెట్టుకుని మా ఆయన దగ్గర ఉండమంటావా?’’ ప్రశ్నించింది వనజ.
అదే తన ఇంట్లో... భర్త అలా దగ్గరకు తీసుకోగానే, ‘చాల్లెండి సంబడం. భార్యను బాగా చూసుకోవడం తెలియదుగానీ, దీనికి మాత్రం తక్కువలేదు’ అని విదిలించుకోవడం... చిన్నబుచ్చుకుని ఆయన ఆఫీసుకు వెళ్ళడం... గుర్తుకొచ్చింది సుజనకు.
‘‘అయినా నాకు తెలియక అడుగుతాను... భార్య వంటగదిలో ఎంత అవస్థ పడుతుందో ఈ మగవాళ్ళకు అక్కరలేదు కానీ, గదిలో మాత్రం ముద్దు, మురిపాలు తీరిపోవాలి’’ అక్కసుగా అంది సుజన.
‘‘భార్యాభర్తల మధ్య అవుంటే చాలు. బయట ఏం జరిగినా, ఎంత జరిగినా మర్చిపోవచ్చు’’ నవ్వుకుంటూ బదులిచ్చింది వనజ.
‘‘సరే, ఒకటడుగుతాను చెప్పవే. పనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి, ‘అది చెయ్యి, ఇది చెయ్యని’ అంటుంటే నీకు కోపం రాదా? నాకైతే మండిపోతుంది’’ పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన.
‘‘కోపం తెచ్చుకుని నా మూడ్ నేను పాడుచేసుకోలేను. వాళ్ళేదో అన్నారనీ వీళ్ళేదో అన్నారనీ ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకుని, నా ఆనందాన్ని పాడుచేసుకోను. మా అత్తగారు నన్నేదో అన్నారని నేను అనుకుంటే, అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది. ‘పెద్దావిడ చాదస్తానికి ఏదో అన్నారులే’ అనుకుంటే, ఆ మాట దూదిపింజలా తేలిపోతుంది. ఇన్నాళ్ళూ అందరికీ వండిపెట్టిన మనిషి... ఇప్పుడేదో తినాలని అనుకుంటే, ఓపికున్న రోజు వండి, ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మనసొమ్మేం పోతుంది? ఆవిడ మాట కొట్టేయలేదని, ఆవిడా సంతృప్తిపడతారు’’ బదులిచ్చింది వనజ.
‘‘ఇంకోమాట అడుగుతాను చెప్పవే- నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీమీద లేనిపోనివి చెప్తారన్న భయం నీకుండదా?’’ మనసులోని సందేహాన్ని వెలిబుచ్చింది సుజన.
‘‘పిల్లలకు చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే, ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అన్నిరకాల మనస్తత్వాల వారితో మెలిగేలా, ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా, పిల్లలను మానసికంగా సిద్ధం చెయ్యాలి. అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు. అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా... నామీద చాడీలు చెప్పడానికి’’ నవ్వుతూ అంది వనజ.
‘‘మీ ఆడపడుచు అలా కూర్చుని ఉంటే, ఆవిడకు అన్నీ చేసిపెట్టాలంటే నీకేమీ అనిపించదా?’’ మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన.
‘‘చెప్పాను కదా, అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తిమీద పెట్టుకుని మొయ్యను నేను. నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి, వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి, నా బుర్ర పాడుచేసుకోను’’ కచ్చితంగా చెప్పింది వనజ.
‘‘ఇంకోమాట... మీ అత్తగారూ ఆడపడుచూ నీకేమీ సాయం చెయ్యకుండా పనంతా నీ మీద పడేసినా, ఏమీ అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు?’’ సందేహాన్ని వెలిబుచ్చింది సుజన.
‘‘భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు, వాళ్ళమధ్య ఇంకే విషయమూ చొరబడకూడదు.
ఆ కాసేపూ వాళ్ళిద్దరూ అన్ని విషయాలూ మర్చిపోవాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలచుకోవాలన్నది నిజమే. అయితే అత్తగారిల్లు అంటే- అందులో భర్తతోపాటు అతని తల్లిదండ్రులూ తోడబుట్టినవాళ్ళూ కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మెలిగితే ఏ ఇబ్బందీ ఉండదు.’’
వనజ మాటలు విని ఆలోచనలోపడింది సుజన. పని ఎక్కువైందని వంటమనిషిని పెట్టింది. ఇద్దరు పిల్లలయితే చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది. ఉన్న ఆ ఒక్కడూ మాట వినడంలేదని హాస్టల్లో పెట్టింది. అయినా తను ఆనందంగా లేదు. ఏదో అసంతృప్తి. తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా. అయినా వనజ ఆనందంగా ఉంది, ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కూడా. మరి తేడా ఎక్కడ ఉంది? అత్తగారూ ఆడపడుచూ వాళ్ళనే మాటలూ... వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ, వాటికే ప్రాధాన్యతనిస్తూ ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతోంది తాను. అత్తగారు ఏదైనా అంటే- పెద్దావిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతిక్షణం తను బాధపడుతూ వాళ్ళనీ బాధపెడుతోంది. వాళ్ళలా ఎందుకున్నారూ ఎందుకలా మాట్లాడుతున్నారూ అని గింజుకోవడం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో... వనజను చూస్తే అర్థమైందిప్పుడు.
ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలికై, ఇంటి మీదికి దృష్టి మళ్ళింది. ‘‘ఇంకోసారి మళ్ళీ వస్తానులేవే. ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను’’ శాంతించిన మనసుతో- బ్యాగు చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?
-
Dulquer Salmaan: భీమ్స్ బీట్స్ విన్న ప్రతిసారి డ్యాన్స్ చేస్తున్నా: దుల్కర్ సల్మాన్
-
Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
OBC census: ఓబీసీ గణన చేపట్టాల్సిందే..: మల్లికార్జున ఖర్గే డిమాండ్