నాన్నకు ప్రేమతో

వీధిలో మా తొట్టి గ్యాంగుతో దొంగ-పోలీస్‌ ఆట ఆడుకుంటున్న నా చూపులన్నీ వీధిలోకి వస్తున్న వాహనాలవైపే ఉన్నాయి. నా ఎదురుచూపులు ఫలించి, వీధి మలుపు తిరిగి బజాజ్‌ స్కూటర్‌ మీద ఠీవిగా వస్తున్న మా నాన్న కనిపించారు.

Updated : 16 Jun 2024 09:59 IST

కథ

- గీత

వీధిలో మా తొట్టి గ్యాంగుతో దొంగ-పోలీస్‌ ఆట ఆడుకుంటున్న నా చూపులన్నీ వీధిలోకి వస్తున్న వాహనాలవైపే ఉన్నాయి. నా ఎదురుచూపులు ఫలించి, వీధి మలుపు తిరిగి బజాజ్‌ స్కూటర్‌ మీద ఠీవిగా వస్తున్న మా నాన్న కనిపించారు. అంతే, ‘‘మీరు ఆడుకుంటూ ఉండండర్రోయ్‌, నేనో పది నిమిషాల్లో వస్తాను’’ అంటూ అందరికీ వినిపించేలా ఓ పేద్ద కేక వేసి ఒక్క ఉదుటన మా ఇంటికేసి పరుగులు తీశాను.

 స్కూటర్‌ అలా ఆగిందో లేదో, ఇలా డిక్కీ తెరిచి వెతికేసి, నాక్కావలసింది దొరకబుచ్చుకుని ఇంట్లోకి దౌడు తీశాను. స్కూటర్‌ ఆగిన శబ్దానికి బయటకి వచ్చిన మా అమ్మ, పాలకోవా డబ్బాతో ఇంట్లోకి పరిగెడుతున్న నన్ను చూసి, ‘‘చిన్నీ, నీక్కావలసినందొక్కటీ ఇంట్లోకి తీసుకెళ్తే సరిపోయిందా, ఈ డిక్కీలోని మిగతా సరుకులు ఇంట్లోకి తీసుకురావడానికి ఓ చెయ్యి వెయ్యొద్దూ, రా ఇలాగ’’ అంటూ ఓ అరుపు అరిచింది.
నాన్న కేసి తిరిగి, ‘‘అయితే మీరు బజారు వెళ్ళేటప్పుడు మీ చెవిలో గుసగుసలాడుతూ అది చెప్పినది ఇదన్నమాట. ఇలా అడిగినవి అడిగినట్టు కొనిస్తూ పోతే ఎంత సంపాదనైనా ఏమి సరిపోతుంది చెప్పండి?’’ అంటూ నాన్న మీద విసుక్కుంటూ నెమ్మదిగా సరుకులు ఇంట్లోకి చేరవేయడం మొదలెట్టింది.
‘‘అందరిలా పిల్లల్ని షికార్లు తిప్పి హెూటళ్ళలో తినిపించే స్తోమత ఎలాగూ లేదు నాకు. నా అదృష్టం కొద్దీ నువ్వూ పిల్లలూ కూడా నా చాలీచాలని గుమాస్తా జీతంతో తీర్చగలిగే కోరికలే తప్ప, అంతకు మించినవేవీ కోరరు. అడపాదడపా అవి కూడా తీర్చకపోతే ఎలా చెప్పు’’ మిగతా సామాన్లు ఇంట్లోకి తీసుకొస్తూ తేల్చేశారు నాన్న.
‘‘బానే ఉందండీ మీరు చెప్పేది, అయినా ఇప్పుడు మాకు వచ్చిన లోటేంటని? ముద్దుల కూతుర్ని ఒక్కమాట అననీయరు కదా’’ అంటూ వంటింట్లోకి నడిచింది అమ్మ.
నా మటుకు నేను అటో చెవి వేసి అన్నీ ఆలకిస్తూనే ఓ మూడు నాలుగు పాలకోవాలు లాగించేసి, డబ్బా వంటింటి గట్టు మీద పడేసి మళ్ళీ ఆటలకు తుర్రుమన్నాను.

*               *                * 

ఆ రోజు స్కూల్లో లెక్కల మార్కులు ఇచ్చారు. నా లెక్కల ట్యూషన్‌ మాస్టారు- మా నాన్నే. ఆయన ఇచ్చిన టార్గెట్‌కి కొంత తగ్గాయి మార్కులు. మార్కులు తగ్గాయి అన్న బాధకన్నా నాన్న ఏమంటారో అనే భయం పట్టుకుంది నాకు. అనుకున్నట్టే నాన్న గట్టిగానే కోప్పడ్డారు.
‘‘ఎంతసేపూ ఆటలూ అల్లరీ తప్పితే చదువు మీద ధ్యాస ఏదీ? పరీక్ష అంటే భయమూ భక్తీ ఏడ్చిందా అసలు. ఆన్సర్‌ పేపర్‌ చూసుకో ఎన్ని సిల్లీ మిస్టేక్స్‌ చేశావో! చదువు మీద శ్రద్ధ లేకుండా ఏదో నాకోసం చదివితే, ఇదిగో... మార్కులు ఇలాగే ఏడుస్తాయి’’ అంటూ ఓ కసురు కసిరారు.
‘‘ఈసారి తప్పకుండా...’’ అంటూ నేను ఏదో సన్నగా సణిగే లోపలే నాన్న నాకేసి సీరియస్‌గా చూసి అక్కడి నుండి వాకౌట్‌ చేసేశారు. అంతే, కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చింది నాకు.

‘‘ఇదేం విడ్డూరమే? ఆయన అన్న చిన్న మాటకి, ఇవేం శోకాలు, ఇదేం వరస? లే, ఊరుకో ఇంక’’ అంటూ గదిలోకి వచ్చింది అమ్మ. ‘‘అయినా నాకు తెలియక అడుగుతానూ... నేను నెత్తి మీద ఓ రెండు ఇచ్చినా దులిపేసుకు వెళ్ళిపోతావు. ఆయన ఒక్క మాటంటే మాత్రం రోజుల తరబడి శోకాలెడతావెందుకే, ఇంత అఘాయిత్యపు పిల్లవేమే’’ అని అమ్మ అంటుండగానే...
‘‘ఆయన చెప్పినదానికి కొన్ని మార్కులే కదా తగ్గాయి, మళ్ళీసారి తప్పకుండా ఆయన చెప్పినన్ని మార్కులు తెచ్చుకుంటానని చెబుతుంటే వినిపించుకోకుండా కోప్పడ్డారు అమ్మా’’ అని ఉక్రోషంతో వెక్కిళ్ళు పెట్టాను.
‘‘అలాగే తెచ్చుకుందూగానిలే, నేను చెబుతాను ఆయనతో, ఇంక భోజనానికి నడు’’ అంటూ బలవంతంగా అన్నానికి లాక్కెళ్ళింది అమ్మ.

Ramoji Rao: అక్షరం... అక్షయం... మీ సంకల్పం!

అది 1987 ఏప్రిల్‌ నెల. బడికి వేసవి సెలవులు ఇచ్చారు, బామ్మగారి ఊరు వచ్చాం. మమ్మల్ని ఊర్లో దింపి వెళ్ళటానికి నాన్న కూడా వచ్చారు మాతో. ఆఫీసులో ఓవర్‌టైమ్‌ అనీ, ఏవో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలనీ ఎప్పుడో మేము నిద్రపోయే టైమ్‌కిగానీ ఇల్లు చేరని నాన్న, మాకు దొరకడమే కష్టం. అటువంటిది మాతోపాటు సెలవులకి ఊరు వచ్చి మా అందరితో ఆయన అంత సమయం గడపడం మహదానందంగా ఉంది మాకు. పెందరాడే భోజనాలు ముగించుకుని, అందరం ఆరు బయట పక్కలు వేసుకుని పడుకున్నాం.
‘‘నాన్నా, నిద్ర రావడం లేదు. రేపు మమ్మల్ని నీ చిన్నప్పటి స్కూల్‌కి తీసుకెళ్ళి చూపిస్తానన్నావు కదా, ఆ కబుర్లు చెప్పు’’ అంటూ అడుగుతున్న పిల్లల్ని చూసి, ‘‘సరే, వినండి...’’ అంటూ మొదలెట్టారు నాన్న.
‘‘ఈ ఊరు చాలా చిన్న ఊరు కదా, అప్పట్లో ఇక్కడ ఐదో తరగతి వరకే ఉండేది బడి. ఆపై చదువులు చదవాలంటే పక్క ఊరికి వెళ్ళాలి. అక్కడ కూడా ఎనిమిదో తరగతి వరకే ఉండేవి క్లాసులు. ఆపైన చదవాలంటే టౌన్‌కి వెళ్ళాల్సిందే మేము. ఐదో తరగతి వరకు ఎలాగో కానిచ్చేశాం. కానీ, ఆరో తరగతికి వచ్చేసరికే వచ్చింది చిక్కు. పక్క ఊర్లో బడికి వెళ్ళాలంటే పడవలో కాలవ దాటి అవతలి ఒడ్డుకి వెళ్ళాలి. నా చిన్నప్పుడే మీ తాతగారు- అంటే, మా నాన్నగారు పోవడంతో,

మా చేతుల్లో అస్సలు డబ్బులు ఉండేవి కాదు. పడవ వాడికి ఇవ్వడానికి డబ్బులు లేక, బట్టలూ పుస్తకాలూ నెత్తిమీద పెట్టుకుని నడుం లోతు నీళ్ళలో నడుస్తూ అవతలి ఒడ్డుకి చేరి, బట్టలు వేసుకుని స్కూలుకి వెళ్ళేవాళ్ళం’’ అంటూ చెబుతున్న నాన్నని ఆపి, ‘‘మరి మీ షూస్‌ జారి నీళ్ళల్లో పడిపోతేనో’’ అంటూ నేను వేసిన ప్రశ్నకి చిన్నగా నవ్వి, ‘‘ఆ రోజుల్లో మీలా మాకేమీ స్కూలు యూనిఫారంలూ షూసూ లేవు. పదో తరగతికి వచ్చేదాకా మాకసలు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు తెలిసిందా, ఉత్త కాళ్ళతోనే నడవడం. అప్పట్లో మా ఊళ్ళో కరెంటు కూడా లేదు. ఇంట్లో ఉన్న ఒకటో రెండో లాంతర్లతో అంతమంది పిల్లలం ఎలా చదువుకోవడం? అయితే మా పక్కింటివాళ్ళకి ఒక చిన్న కిరాణా కొట్టుండేది. ఆ కొట్లో అసిస్టెంటుగా కూర్చుంటే, కొట్లోని దీపం కింద చదువుకోనిచ్చేవారు. అలా వెళ్ళి అక్కడ కూర్చుని చదువుకునేవాడిని. ఇంక తొమ్మిదో తరగతికి వచ్చేసరికి, టౌనుకి వెళ్ళి చదువుకోవడం మా తలకుమించిన పని అయిపోయింది. చదువంటే ఎంతో ఇష్టం, బాగా చదువుకోవాలని ఆశ. కానీ ఎలా? మా స్కూలు సీనియర్లు కొంతమంది టౌనులో గది అద్దెకు తీసుకుని అక్కడ ఉండి చదువుకుంటున్నారని తెలిసి వాళ్ళని అడిగితే, ఎంతో మంచి మనసుతో, వాళ్ళ రూములో నన్ను చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు. అలా- ఉండటానికి ఇల్లు దొరికింది. బాగా చదువుకుని స్కాలర్‌షిప్‌లు రావడంతో, ఫీజుల భారం కొంత తగ్గింది. అంతకుముందు షాపులో పనిచేసిన అనుభవంతో, ఓ రెండు షాప్స్‌లో లెక్కలు రాసే పార్ట్‌టైమ్‌ పని దొరికింది. దగ్గర్లో ఉండే ఓ టైలర్‌ దగ్గర బటన్లూ అవీ కుట్టే పని కూడా దొరికింది. అలా వచ్చిన డబ్బుతో నా వంతు రూమ్‌ రెంట్‌ కట్టీ నోట్‌బుక్స్‌ అవీ కొనుక్కునేవాడిని. క్లాస్‌మేట్స్‌ కొందరు తమ టెక్స్ట్‌బుక్స్‌ ఇచ్చి సాయం చేసేవారు. అలా ఎలాగో బండి లాగించేసి, స్కూల్‌ ఫైనల్‌ పాస్‌ అయ్యాను. ఇంకా చదువుకోవాలని ఉన్నా స్తోమత లేక అక్కడితో ఫుల్‌స్టాప్‌ పెట్టి ఉద్యోగంలో చేరిపోయాను. అదర్రా పిల్లలూ, నా స్కూలు చదువు కథా కమామీషు. బాగా పొద్దు పోయింది, పడుకోండి ఇక’’ అంటూ ముగించారు నాన్న.
అంతా విని సాలోచనగా నాన్నని చూస్తూ, ‘‘నాన్నా, నీది హ్యాపీ స్టోరీనా, శాడ్‌ స్టోరీనా? వాటీజ్‌ ద మోరలాఫ్‌ ద స్టోరీ’’ అంటూ మరో ప్రశ్న పొడిచాను. నాకు వచ్చిన ధర్మ సందేహానికి నవ్వుతూ, ‘‘నాది కచ్చితంగా హ్యాపీ స్టోరీనే! ఎంతోమంది మంచివాళ్ళు ఇచ్చిన సపోర్ట్‌తో నేను స్కూలు ఫైనల్‌దాకా చదువుకున్నాను. ఉద్యోగం చేసుకుని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే నేను ఈరోజు ఎలా ఉండేవాడినో కదా! మీరు కూడా కష్టపడి బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం తెచ్చుకుని, చదువుకోవడానికి డబ్బులు లేనివాళ్ళకి ఎంతోకొంత సాయం చెయ్యాలి. పేదరికంవల్ల ఏ విద్యార్థి చదువూ ఆగిపోకూడదు, అన్ని దానాల్లోకీ విద్యాదానం గొప్ప దానం’’ అంటూ మా అందరికీ గుడ్‌నైట్‌ చెప్పి వెళ్ళి పడుకున్నారు నాన్న.
‘ఓహెూ, అందుకనేనేమో- చదువుకనో ఉద్యోగానికనో వేరే ఊరునుంచి వచ్చి మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. నేను కూడా పెద్దయ్యాక నాన్నలా అందరికీ సాయం చెయ్యాలి...’ అని ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను.


*               *                * 

వేసవి సెలవులు ఇంకో వారంలో అయిపోతాయి అనగా తిరిగి మా ఊరు వచ్చేశాం. ఆ రోజు ఆదివారం. ఉదయం టిఫిన్లు అయ్యాక, పోయిన ఏడాదివి మా నోట్‌బుక్స్‌ ముందేసుకుని కూర్చున్నారు నాన్న. మా పాత పుస్తకాల్లో నుంచి ఏమీ రాయని ఖాళీ కాగితాలను నీటుగా చింపి, వాటితో
కొత్త పుస్తకాలు కుడుతున్నారు. వచ్చేయేటికి అవే మాకు రఫ్‌ నోట్‌బుక్స్‌. దబ్బనంలోకి దారం ఎక్కిస్తూ, ‘‘అమ్మడూ, నేను వేణుగోపాలరావు గారితో మాట్లాడాను, వెళ్ళి వాళ్ళమ్మాయి మాధవి దగ్గరనుండి నెక్స్ట్‌ ఇయర్‌ బుక్స్‌ తెచ్చుకో, ఇదే చేత్తో వాటికీ అట్టలు వేసేస్తాను’’ అంటుంటే,
‘‘ఈ ఏడు కూడా మళ్ళీ పాత బుక్సేనా, కొత్తవి కొను నాన్నా’’ అని మారాం చేశాను.
‘‘అదిగో ఆ పేచీలే వద్దనేది. అన్నయ్యా చెల్లాయీ పాత బుక్స్‌ వద్దని నీలాగే పేచీలు పెట్టారా?’’ అంటూ అమ్మ ఇంకా ఏదో అనేలోపే నాన్న కలగజేసుకుని ‘‘కొత్త అట్టలు వేసి ఎంచక్కా నీకు ఇష్టమైన లేబుల్స్‌ వేస్తానురా. అప్పుడు చూడు, నీ బుక్సు కొత్త వాటి కంటే బాగుంటాయి!’’ అంటూ ఇట్టే మురిపించి మరిపించడంతో ‘సరే’నని తలూపి నెక్స్ట్‌ ఇయర్‌ బుక్స్‌ తెచ్చుకోవడానికి మాధవి వాళ్ళింటికి తుర్రుమన్నాను.

*               *                * 

కోచింగ్‌ క్లాస్‌ నుంచి ఇంట్లోకి అడుగుపెడుతున్న నాకు, నాన్న-పెదనాన్న గార్ల సంభాషణ చెవిన పడింది. ‘‘ఆడపిల్లలకి అంత పెద్ద చదువు
లెందుకురా, వాళ్ళకన్నా ఎక్కువ చదివినవాళ్ళని తీసురావడం కష్టం అయిపోతుంది ఆ తర్వాత. ఊళ్ళో ఉన్న కాలేజీలో డిగ్రీ చేయించి పెళ్ళి చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా’’ నాన్నకు నచ్చజెబుతున్నారు పెదనాన్నగారు.

‘‘ఆ రోజుల్లో మనం, ఉన్న ఊళ్ళో బళ్ళు లేక, ఆ ఊరూ ఈ ఊరూ తిరిగి, ఆ పంచనా ఈ పంచనా చేరి, నానా కష్టాలు పడి చదువుకున్నాం. అంతో ఇంతో వృద్ధిలోకి వచ్చాం. కానీ ఈ తరం పిల్లలు పోటీని ఎదుర్కొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే మంచి కాలేజీల్లో పెద్ద చదువులు తప్పనిసరి. మన వందన చాలా తెలివైంది, ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులూ స్కాలర్‌షిప్‌లూ తెచ్చుకుంది. దానికి ఇంజినీరింగ్‌లో సీటు ఎక్కడ వస్తే అక్కడికి పంపి చదివిస్తాను. నేను నా పిల్లలకి ఇవ్వగలిగే ఆస్తి చదువే అన్నయ్యా. వాళ్ళు ఎంత చదువుకుంటే అంతా చదివిస్తాను’’ అంటున్నారు నెమ్మదిగా నాన్న.
‘‘సర్లే రా, నీ ఇష్ట ప్రకారమే కానియ్యి. చదువంటే నీకున్న ఇష్టమే నీ పిల్లలకూ వచ్చింది. అందరికీ చక్కగా చదువు అబ్బి వృద్ధిలోకి వస్తున్నారు. డబ్బేమైనా అవసరమైతే చెప్పు, మొహమాటపడకు’’ అంటున్న పెద్దనాన్నగారిని ఆపి, ‘‘లేదన్నయ్యా, పిల్లల చదువులకని వేరువేరు చీటీలు కట్టాను, ఆ డబ్బులు ఉన్నాయి. అవికాక, పండగ బోనస్‌లూ అవీ వచ్చినప్పుడు వాళ్ళ పేర తీసుకున్న బాండ్లు ఉన్నాయి. ఇంకొంత రొక్కం చేబదులు తీసుకుంటే సర్దుబాటు అయిపోతుంది’’ అంటున్నారు నాన్న.

మాకు స్కూల్‌ యూనిఫాంలూ ఫీజులూ పుస్తకాలూ కోచింగులూ శుభ్రమైన తిండీ బట్టా... ఇలా సమస్తం, ఏ లోటూ లేకుండా యథావిధిగా జరిగిపోతున్నా, కేవలం ఓ రెండు జతల బట్టలతో నాన్న, మెళ్ళో పుస్తెల తాడు తప్ప మరే ఇతర వస్తువులూ లేకుండా అమ్మ, ఎందుకు అలా ఉండిపోయారో, తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా కేవలం మా బాగు కోసమే ఎలా బతికారో, అప్పుడప్పుడే బాధ్యత తెలిసి వస్తున్న నాకు అర్థమయ్యి, కళ్ళు చెమర్చాయి. ‘ఏమిస్తే వాళ్ళ రుణం తీరేను, బాగా చదివి వాళ్ళ కలలు నిజం చెయ్యాలి’ అనుకుంటూ ఇంట్లోకి నడిచాను.

*              *                * 

ఇంజినీరింగ్‌లో ఉండగా- ఓసారి సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చాను. వాకిట్లో ముగ్గు వేసి ఇంట్లోకి వస్తున్న నాకు- తాతగారు నాన్నతో అంటున్న మాటలు చెవిన పడ్డాయి. వారి మాటల్లో నా ప్రస్తావన రావడం గమనించి చెవులు రిక్కించాను.
‘‘బాగా ఎరిగిన సంబంధం కదా మరోసారి ఆలోచించుకోండి అల్లుడుగారూ. అబ్బాయిది పర్మనెంటు ఉద్యోగం, పెద్ద పదవి, సంపాదన, మంచి స్థితిమంతులు. కాకపోతే అబ్బాయి వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడని వెంటనే పెళ్ళి చెయ్యాలని అడుగుతున్నారు వాళ్ళు’’ అంటున్న తాతగారి మాటలు విని గుండెల్లో రాయి పడింది నాకు.
అప్పుడు నాన్న ‘‘అక్కడే కదా మావయ్యగారూ వచ్చిన చిక్కంతా. వందన చదువు ఇంకా పూర్తి అవ్వలేదు. దాని చదువు మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు. చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగంలో చేరి, దాని కాళ్ళ మీద అది నిలబడ్డాకే పెళ్ళి చేద్దామని నా ఉద్దేశ్యం. అయినవాళ్ళే కదా... అర్థం చేసుకుని ఓ రెండు మూడేళ్ళు ఆగుతామంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు’’ అన్నారు నిక్కచ్చిగా.
‘‘నేను ఆ విషయం కదిపి చూశాను అల్లుడుగారూ, వందనను మొన్న ఏదో పెళ్ళిలో చూసి ఇష్టపడ్డారట. అమ్మాయి డిగ్రీ పూర్తి చెయ్యకపోయినా ఫర్వాలేదు, మాకు ఉద్యోగం చేసే కోడలు అక్కరలేదు. ఇంటి పట్టున ఉండి ఇంటిపనులూ అవీ చూసుకుంటే చాలు, రెండు మూడు నెలలకు మించి ఆగడం కుదరదు అన్నారు’’ వివరించారు తాతగారు.
‘‘మీకు తెలియంది కాదు మావయ్యగారూ, నేను వందనని కొడుకులానే పెంచాను. అది చదువుల్లో ఫస్ట్‌. మంచి తెలివితేటలుగల పిల్ల, దానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. దాన్ని వంటింటికి పరిమితం చేసే కుటుంబంలో ఇవ్వలేను.
మీరు అన్యథా భావించవద్దు, ఏదో ఒక రకంగా సర్ది చెప్పి ఈ సంబంధం తప్పించెయ్యండి’’ అని మెత్తగానే తేల్చేశారు నాన్న.
‘అండగా నువ్వు ఉండగా, నాకు భయమెందుకు నాన్నా దండగ’ అంటూ ఎప్పుడూ నాన్నతో నేను కొట్టే సరదా డైలాగుని మననం చేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను.

*               *                * 

ఇంజినీరింగ్‌ మంచి మార్కులతో పాసయిన నాకు- ఆ వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు అయిదు అంకెల జీతంతో నాకొచ్చిన ఆఫర్‌ లెటర్‌ చూసి మురిసిపోయారు నాన్న. హైదరాబాద్‌ మకాం మార్చవలసి వస్తోంది. కొత్త ఊరు, ఆడపిల్ల ఒక్కత్తే ఎలా ఉంటుందో ఏమో అని దిగాలుపడింది అమ్మ. అలా ఉద్యోగరీత్యా హైద్రాబాదులో ఓ రూములో మకాం పెట్టిన నన్ను, అట్టే ఆలస్యం చెయ్యకుండా, మంచి సంబంధం ఒకటి చూసి, ఓ ఇంటిదాన్ని చేసేశారు అమ్మా నాన్న.

*               *                * 

ఆఫీసు నుండి ఉసూరుమంటూ ఇల్లు చేరేసరికి ఏడు దాటిపోయింది. నాకోసమే ఎదురుచూస్తున్న నా చిట్టితల్లి గబగబా పాక్కుంటూ వచ్చి నా చంకెక్కేసి ఆపై వదల్లేదు నన్ను. దాన్ని చంకనేసుకునే ఆ పనీ ఈ పనీ తెముల్చుకుని కాస్త అలా కూర్చున్నానో లేదో, నాన్న దగ్గరనుండి ఫోను.
‘‘ఏరా, ఈ మధ్య ఫోన్లు లేవు అంతా కులాసాయేనా? చంటిదీ అల్లుడుగారూ బాగున్నారా?’’ అంటూ చల్లని పలకరింపు.
‘‘ఆఫీసులో పని చాలా ఎక్కువైంది నాన్నా. ఇంట్లో చంటిపిల్ల ఎదురు చూస్తోందని తెలిసి కూడా ఆఖరి నిమిషంలో ఆ పనీ ఈ పనీ చెప్పి లేట్‌ చేసేస్తాడు నాన్నా మా బాసు. పరమ చాదస్తుడు, శాడిస్టు. విసుగొచ్చేస్తోంది, జాబు మారిపోదామని చూస్తున్నాను’’ అన్నాను, ఉయ్యాలలో పిల్లని ఊపి నిద్రపుచ్చుతూ.
‘‘వందనా, బాసు కష్టాలు లేనిదెవరికి? ఆ రోజుల్లో మావి ఏవో వానాకాలం చదువులు. అరాకొరా జీతాలతో, దొరక్క దొరక్క అబ్బరంగా దొరికే చిరు ఉద్యోగాలు. మీలా కాస్తకీ కూస్తకీ ఉద్యోగాలు మారే అవకాశం మాకు లేదు కాబట్టి, బాసు ఎలాంటివాడైనా సర్దుకుపోయేవాళ్ళం. కొన్నాళ్ళకి పరిస్థితులు అవే చక్కబడేవి. అయినా అమ్మడూ, ఇలా చిన్నాచితకా కష్టాలకి భయపడి, మంచి జీతం ఎన్నో ఫెసిలిటీస్‌ ఉన్న అంత మంచి కంపెనీలో ఉద్యోగం మానుకుంటావా చెప్పు? ఆ వెళ్ళే కొత్త జాబులో మాత్రం అన్నీ బాగుంటాయని గ్యారంటీ ఏంటీ? అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ధైర్యంగా ఉండు, అన్నీ అవే సర్దుకుంటాయి’’ అంటున్న నాన్న మాటలు వింటూ ఆలోచనలోకి జారుకున్నాను.
‘నిజమే కదా, కొత్తచోట కూడా ఇలాంటి త్రాష్టుడే తగిలితేనో? భయపడి పారిపోతే ఎలా, నాన్న చెప్పినట్టు ఓర్పుతో పరిష్కరించుకోవడమే బెటర్‌...’ అనుకుంటూ ఫోన్‌ పెట్టేశాను.

*               *                * 

అన్నయ్యకి హైద్రాబాద్‌ బదిలీ అవ్వడంతో ఈమధ్యే అమ్మా వాళ్ళు హైద్రాబాద్‌కి మకాం మార్చారు. ఆఫీసు నుండి ఆగమేఘాల మీద అమ్మావాళ్ళింటికి చేరాను. సోఫాలో కూర్చుని వార్తలు చూస్తున్న నాన్న పక్కన చేరి, నా బ్యాగ్‌లో నుండి ప్రమోషన్‌ లెటర్‌ తీసి ఆయన చేతికిచ్చాను.
ఆ లెటరు తీసుకుని చదివిన నాన్న కళ్ళు మెరిశాయి. నా గొంతు విని లోపలినుంచి వచ్చిన అమ్మతో, ‘‘చూడవే వందనకి ప్రమోషనూ మంచి ఇంక్రిమెంటూ వచ్చాయి. నా సర్వీసు చివర్లో కూడా ఇంత జీతం అందుకోలేదు నేను’’ అని చెప్పి, ‘‘చాలా సంతోషంరా అమ్మడూ, ఇలాగే కష్టపడి పనిచేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి’’ అంటూ భుజం తట్టారు నాన్న. ప్రమోషను వచ్చినదానికన్నా ఎక్కువ సంతోషమేసింది ఆయన కళ్ళల్లో తొణికిసలాడిన ఆనందాన్నీ గర్వాన్నీ చూసి.

కొంతసేపటికి ‘‘భోజనాలు వడ్డించాను రండి’’ అని అమ్మ పిలిస్తే, టీవీ కట్టేసి వెళ్ళి భోజనాలకి కూర్చున్నాం. అన్నం కలుపుకుంటూ నాన్న ‘‘వందూ, నీకు మొన్న చెప్పాను కదా... మా ఆఫీసు ఫ్యూను సడన్‌గా పోవడంతో, ఫీజులు కట్టలేక వాళ్ళ పిల్లలు డిగ్రీ మధ్యలో ఆపెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని. ఆ కాస్త డిగ్రీ పూర్తయ్యిందంటే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని, వాళ్ళ అమ్మనీ కుటుంబాన్నీ వాళ్ళే చూసుకుంటారు. నువ్వొకరినీ అన్నయ్య ఒకరినీ ఆదుకుని ఎలాగోలా డిగ్రీ గట్టెక్కించెయ్యాలిరా, అల్లుడుగారితో ఒక్క మాట చెప్పి...’’ అంటున్న నాన్నని మధ్యలోనే ఆపి ‘‘నువ్వు అంతలా చెప్పాలా నాన్నా, నేను ఆయనతో ఆరోజే మాట్లాడాను. డబ్బులు కూడా డ్రా చేసి తెచ్చాను, వాళ్ళకి రేపే పంపండి’’ అంటున్న నన్ను చూసి, తృప్తిగా తలాడించారు నాన్న. ‘మాకు ఇహానికి కావలసిన చదువుసంధ్యలూ విద్యాబుద్ధులూ ఉద్యోగాలూ అన్నీ ఏర్పాటు చేసిన నాన్న, పరానికి కావాల్సిన పుణ్యం పరమార్థాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మా నాన్న బంగారం’ అనుకున్నాను మనసులోనే.

నాన్నే మా హీరో: సెలబ్రిటీల పిల్లలు పంచుకున్న విశేషాలు

ఆ రోజు బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి మా ‘చిట్టి’ స్కూల్లో. పేరెంట్స్‌కి ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చుని చూస్తున్నాం నేనూ మావారూ. కొంతసేపటికి స్టేజీ మీదకి వచ్చిన మా అమ్మాయి, తనకిచ్చిన సర్‌ప్రైజ్‌ టాపిక్‌ ‘మై హీరో, మై రోల్‌మోడల్‌’ మీద స్పీచ్‌ మొదలుపెట్టింది. తన తండ్రే తన హీరో అంటూ- ఆయన తనకి ఎప్పుడూ అండగా ఉండి ఎలా స్ఫూర్తినిస్తారో, నాన్నంటే తనకి ఎందుకు అంత ఇష్టమో తనకు చేతనైన నాలుగు చిన్న మాటల్లో అనర్గళంగా ఏకరువు పెట్టేసింది. నేను ఆఫీస్‌ నుండి ఇంటికి వచ్చింది మొదలు, పడుకునే వరకూ నన్నే అంటిపెట్టుకుని, నా చంక దిగని ఈ అమ్మకూచి, సడన్‌గా ఇలా నాన్న కూచిగా ఎప్పుడు మారిందబ్బా అని ఆశ్చర్యపోవడం నా వంతయింది.

కూతురి వాగ్ధాటినీ అది తనపై కురిపిస్తున్న ప్రేమనీ చూసి మురిసిపోతున్న మావారితో, ఒకింత అక్కసుగా ‘‘గోరుముద్దలు తినిపించడం, హెూమ్‌వర్కులు చేయించడం, రోగం రొష్ఠూ వస్తే సేవలు చెయ్యడం... ఇదంతా ఏమో నా పని. దాన్ని నెత్తినెక్కించుకుని గారాబం చేసి దాన్నుంచి మార్కులు కొట్టేయడం మీ పని’’ అని నవ్వుతూ అంటున్న నాకు, ఎందుకో అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. ‘నానా చాకిరీ చెయ్యడానికేమో అమ్మ కావాలి, మెచ్చి మేకతోలు కప్పి ప్రేమ ఒలకబోసేది మాత్రం నాన్న మీద. మీ ఆడపిల్లలు అంతా ఇంతేనే. రేపు నీకు కూడా పుడతారుగా పిల్లలు, నీ కూతురు కూడా నీలాగే నాన్న కూచి అవ్వకపోతుందా, నేను చూడకపోతానా’ అంటుండేది ఆవిడ.
‘నిజమే కదా, అచ్చమైన నాన్న కూచిలా, అయినదానికీ కానిదానికీ అడ్డంగా నాన్నని వెనకేసుకొచ్చి ఎన్నిసార్లు అమ్మని దబాయించాను. అది సరదాకైనా సరే, చేసిన పాపం ఊరికే పోతుందా...’ అనుకుంటూ నవ్వుకుంటున్న నా దగ్గరకి, ప్రోగ్రామ్‌ అవుతూనే పరిగెత్తుకు వచ్చిన మా అమ్మాయి- ‘‘ఎలా ఉంది అమ్మా, నా స్పీచ్‌’’ అని అడిగింది.
దాని బుగ్గలు పిండుతూ, ‘‘బాగుందే, నాన్న కూచీ’’ అన్నాను.
ఠక్కున వాళ్ళ నాన్న మెడచుట్టూ చేతులు వేసి ‘‘నాన్న కూచినా, ఊహుఁ అదేమీ కాదు. అయినా మీ నాన్న నీకు హీరో అయితే,
మా నాన్న నాకు హీరో కదా అమ్మా’’ అంటూ లాజిక్‌ మాట్లాడుతున్న చిట్టితో-
‘‘పోవే మీ నాన్న నీకు గొప్పేమో, కానీ మా నాన్నే అందరికన్నా గ్రేట్‌ తెలుసా!
మా నాన్న హీరోలకే హీరో, మై డాడ్‌ ఈజ్‌ ద బెస్ట్‌’’ అన్నాను దాన్ని ఉడికిస్తూ.
నన్ను మింగేసేలా ఓ చూపు చూసి, ‘‘అమ్మ దోస్త్‌ కటీఫ్‌, పద నాన్నా... మనం ఐస్‌క్రీమ్‌ తిందాం, అమ్మకేమీ కొని పెట్టొద్దు’’ అంటూ నాన్న చేయి పట్టుకుని ఐస్‌క్రీమ్‌ షాపు కేసి లాక్కెళ్తున్న మా అమ్మాయినీ దాని ఉడుకు మోత్తనాన్నీ చూస్తే నవ్వు ఆగలేదు నాకు. కూతురిని మురిపెంగా చూసుకుంటూ, ఐస్‌క్రీమ్‌ తింటూ అది చెబుతున్న కబుర్లన్నీ సంబరంగా వింటున్న మావారి ఆనందాన్ని చూస్తుంటే- ఏ కూతురికైనా తన తండ్రే కదా హీరో. నాన్నకు ప్రేమతో కూతురు ఇచ్చే ఈ ‘మా నాన్న గ్రేట్‌’ అనే అవార్డుని మించి ఏ తండ్రైనా కోరేదేమీ ఉండదేమో అనిపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..