కథలో రాయని పాత్ర

ఉదయం 6.50 నిమిషాలకు బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఇండిగో ఫ్లైట్‌కి ఇంద్రకీలాద్రిపై తచ్చాడుతున్న ఆషాఢమేఘాలు స్వాగతం పలికాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగుతూనే రమణకి ఫోన్‌ చేశాడు ఆనంద్‌.

Updated : 23 Jun 2024 07:07 IST

- గజ్జెల దుర్గారావు

దయం 6.50 నిమిషాలకు బెంగళూరు నుండి విజయవాడ వస్తున్న ఇండిగో ఫ్లైట్‌కి ఇంద్రకీలాద్రిపై తచ్చాడుతున్న ఆషాఢమేఘాలు స్వాగతం పలికాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగుతూనే రమణకి ఫోన్‌ చేశాడు ఆనంద్‌.

‘‘బాబూ, ఆనందూ’’ ఆప్యాయంగా పలకరించింది ఫోనెత్తిన సునంద.

‘‘వదినగారూ... నమస్తే. రమణన్న లేచాడా..?’’ అడిగాడు.

‘‘అసలు నిద్రపోతేగా... ఇప్పుడే స్నానానికి వెళ్ళారు. మీరు ల్యాండ్‌ అయ్యారా, రమణని పంపేదా?’’ అంది నవ్వుతూ.

‘‘వద్దొద్దు... క్యాబ్‌ తీసుకుని నేనే వచ్చేస్తా. ఎనిమిదికల్లా మీ ఇంటి ముందు ఉంటా.’’

*    *    

ఆనంద్‌కి నలభై ఐదేళ్ళుంటాయి. మోడ్రన్‌ ఎంటర్‌ప్రైజస్‌ అధినేత. హోటల్స్‌, కన్‌స్ట్రక్షన్‌, టెక్స్‌టైల్స్‌ ఏరియాల్లో వ్యాపారాల్లో సౌత్‌ ఇండియాలో టాప్‌ లీడ్‌లో ఉన్న బిజినెస్‌మేన్‌ అతను. రమణ విజయవాడ బ్రాంచ్‌కి సీఈఓ. వారిద్దరిదీ ఇరవైయేళ్ళ అనుబంధం.

‘‘ఆనంద్‌, నా షర్ట్‌ బాగుందా?’’ ఎక్కడలేని హుషారుతో తుళ్ళిపడుతున్నాడు రమణ. అతని మొహం వెలిగిపోతోంది.

‘‘చూడయ్యా! తనకే అవార్డు వచ్చినంత సంబరపడిపోతున్నాడు మీ అన్న. రాత్రంతా ఒకటే ముచ్చట్లు నీ గురించి. చెబితే నమ్మవుగానీ... ఉదయం నుండి ఇప్పటిదాకా ఐదు షర్టులు మార్చాడు.’’

అదొక భావోద్వేగపు ప్రకటనగా తోచింది ఆనంద్‌కి. ఆనంద్‌ చిన్న నవ్వు నవ్వి రమణ టక్‌ సరిచేసి ఆలింగనం చేసుకున్నాడు. వారిద్దరినీ సంతోషంగా చూస్తూ... కాఫీ కలిపింది సునంద.

‘‘రమణన్నా, దారిలో టిఫిన్‌ చేసి వెళ్దాం. ఇంతకీ నువ్వుగానీ టిఫిన్‌ చేసేశావా?’’ సందేహంగా అడిగాడు ఆనంద్‌ అద్దంలో జుట్టు సరిచేసుకుంటూ.

‘‘లేదు, ఓన్లీ కాఫీ... ఏమీ తినొద్దని రాత్రే చెప్పావుగా...’’ కాఫీ కప్‌ టేబుల్‌ మీద పెట్టి, కార్‌ కీస్‌ తీసుకుంటూ సునందకి బై చెప్పి బయటకి వచ్చాడు రమణ. అనుసరించాడు ఆనంద్‌. కారు ముందుకు ఉరికింది.
‘‘శ్రీనూ హోటల్‌కేగా?’’ ఆనంద్‌ వైపు చూస్తూ అన్నాడు.
కళ్ళు పెద్దవి చేస్తూ తలూపాడు ఆనంద్‌.
‘‘అయితే కొత్తగుళ్ళ పడమర గేటు దగ్గర పార్క్‌ చేసి లోపలి నుండి వెళ్దాం’’ అన్నాడు రథం సెంటర్‌ దగ్గర మలుపు తిప్పుతూ.

ఒక రకమైన పారవశ్యంలో ఉన్నాడు ఆనంద్‌. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ... ప్రతి షాపునీ మనుషుల్నీ తన్మయంగా చూస్తున్నాడు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. కమ్మని కృష్ణ గాలికి కొమ్మలు మత్తుగా తలూపుతున్నాయి.

అరవై ఏళ్ళ నాటి కేరళవారి హోటల్‌ అది.

అడుగుపెడుతుంటే వేడివేడి దోసెలపై కరుగుతున్న నేతి సువాసన ముక్కు పుటాలను తాకింది. కుర్చీ ముందుకు జరుపుకుని ‘‘రమణన్నా... పెసరట్టు-ఉప్మా కావాలి నాకు’’ అన్నాడు ఆనంద్‌ మార్బుల్‌ టేబుల్‌ మీద వేళ్ళతో దరువేస్తూ.

‘‘ఎంత ఎదిగినా నువ్వు నువ్వే. ప్రపంచమంతా వేరే... నువ్వు వేరే. అంతే!’’ అంటూ పక్కనే నిలబడి అంతా వింటున్న సప్లయర్‌కి కళ్ళతోనే ఆర్డర్‌ చెప్పేశాడు రమణ.

*    *    

ఇరవై ఏళ్ళక్రితం మాట. ఒక రోజు అదే హోటల్లో అక్కడే కూర్చుని ఉన్నాడు ఆనంద్‌. అతనికి బాగా ఆకలిగా ఉంది. సప్లయర్‌ని పిలిచి ‘ఉప్మా-పెసరట్టెంత?’ అని అడిగాడు. అతను చెప్పేలోపే ‘ఇడ్లీ ఎంత?’ అని అడిగాడు. ఆ సప్లయర్‌ ఆనంద్‌కి గోడకేసి వేలుపెట్టి చూపించి ‘చదువుకో’ అన్నట్టు సైగ చేసి, పక్క టేబుల్‌ దగ్గరికి వెళ్ళిపోయాడు చెవిలో పెన్సిల్‌ సరిచేసుకుంటూ. అతణ్ణి మళ్ళీ పిలిచి ‘ఒక కాఫీ తీసుకురా’ అని చెప్పాడు ఆనంద్‌ నెమ్మదిగా.

‘కాఫీ ఇప్పుడే వద్దు. ఇందాక పెసరట్టు చెప్పా కదా... మరొకటి కూడా పట్రా మా ఇద్దరికీ... తరవాత కాఫీ’ ఆనంద్‌ అనుమతి తీసుకోకుండా చెప్పాడు అతనికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి. ముప్పై ఐదేళ్ళుంటాయి. బక్కపల్చగా ఉన్నాడు.

ఆయన్ని చూస్తే వణికిపోయేవాణ్ని: రామ్మోహన్‌ నాయుడు

‘అరే వద్దండీ... నేను తినే వచ్చా. కాఫీ చాలు. మీకెందుకు శ్రమ’ అన్నాడు ఆనంద్‌ కంగారుగా, మొహమాటపడుతూ. మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇద్దరికేసి చూస్తూ నిలబడ్డాడు సప్లయర్‌. ‘ఏదో ఒకటి తేల్చండి’ అన్నట్టుగా.

అతన్ని వెళ్ళి తెమ్మని పురమాయించి, కొంచెం ముందుకు వంగి, ‘తప్పుగా అనుకోకండి. నా పేరు రమణ. ఇవాళ మా తమ్ముడి పుట్టినరోజు. ప్రతి ఏడాదీ వాడూ నేనూ ఇక్కడికొచ్చి టిఫిన్‌ చేసి వెళ్తాం. అదొక అలవాటు. ఈసారి వాడు లేడు. ఇంటర్వ్యూ పనిమీద హైదరాబాద్‌ వెళ్ళాడు. ఇవాళ వాడి ప్లేసు మీరు తీసుకోవాల్సిందే, తప్పదు. నేను చాలా సంతోషిస్తా...’ ప్రాధేయపూర్వకంగా అడిగాడు.

సరే అనక తప్పలేదు ఆనంద్‌కి. ‘చాలా థ్యాంక్స్‌ అండీ...’ కృతజ్ఞతగా చెప్పాడు ఆనంద్‌ బయటకు వచ్చేటపుడు.

‘ఫర్వాలేదు. మీరేం చేస్తారు, ఎక్కడుంటారు... అడగొచ్చా?’ అంటూనే అడిగాడు రమణ.

‘నా పేరు ఆనంద్‌ అండీ. మాది ఇక్కడే బ్రాహ్మణవీధి. ఎంకామ్‌ గోల్డ్‌ మెడల్‌. జాబ్‌ కోసం వెతుకుతున్నా... ఫ్యామిలీ అంతా నా మీదే డిపెండ్‌ అండీ. మీరు..?’’

‘హాఁ... నేను- మనో ఎంటర్‌ప్రైజస్‌ ఉంది కదా... బందర్‌ రోడ్డు కాంధారీ దగ్గర... దానిలో సేల్స్‌ మేనేజర్‌గా చేస్తున్నా ఏడేళ్ళుగా...’

‘ఓహ్‌... చాలా మంచి పేరుందండీ ఆ కంపెనీకి.’

రమణ తలూపి, ‘అవును. ఎంప్లాయిస్‌ని బాగా చూసుకుంటారు. ప్రెజంట్‌ కొంచెం లాస్‌లో ఉంది. మా ఎండీ సార్‌, మేడమ్‌ చాలా మంచివాళ్ళు. మీరు గోల్డ్‌ మెడల్‌ అంటున్నారుగా, ఏదైనా ఛాన్స్‌ ఉండొచ్చు. మొన్నటి వరకూ పెద్ద సార్‌ ఉండేవారు. ఆయనకి హెల్త్‌ బాగోక వాళ్ళ అబ్బాయికీ కోడలికీ మొత్తం అప్పజెప్పేశారు. మాట్లాడి చూద్దాం... కాదనకపోవచ్చు.’

రమణ మాటలు పూర్తి కాకముందే అతనివైపే రెప్పార్పకుండా చూస్తున్న ఆనంద్‌ టక్కున చేయి పట్టుకున్నాడు కృతజ్ఞతగా.

‘మీరు ఫ్రీ అయితే నాతో రండి వెళ్దాం’ అంటూ రమణ స్కూటర్‌ స్టాండ్‌ తీసి స్టార్ట్‌ చేశాడు. మారు మాట్లాడకుండా వెనక ఎక్కి కూర్చున్నాడు ఆనంద్‌.

‘మీకో విషయంలో సారీ చెప్పాలి’ బండి పోనిస్తూ తల కాస్త వెనక్కి తిప్పి అన్నాడు రమణ.

‘నాకా... మీరా..?’

‘నాకెవరూ తమ్ముళ్ళు లేరు. మీతో టిఫిన్‌ తినిపించడానికి అబద్ధం చెప్పా’ అన్నాడు రమణ బండి వినాయకుడి గుడి మీదుగా ముందుకు పోనిస్తూ. జీవితం గొప్పగా మారిపోతున్నట్టు అనిపించింది ఆనంద్‌కి.

*    *    

‘‘జీవితం గొప్పగా మారిపోయింది రమణన్నా... ఇక్కడే... నువ్వు పరిచయం అయ్యాక’’ అన్నాడు ఆనంద్‌ కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకుంటూ... జ్ఞాపకాల్లోంచి బయటకు వస్తూ. ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరకు వచ్చారు. ఆనంద్‌ డ్రైవ్‌ చేస్తున్నాడు.

అతన్ని ఉద్యోగంలో చేర్చిన రోజులు గుర్తొచ్చాయి రమణకి. రాత్రింబవళ్ళూ కంపెనీ కోసం పని చేశాడు ఆనంద్‌. మోహన్‌ ఎంటర్‌ప్రైజస్‌ అధినేతలు మోహన్‌, ఆయన భార్య మనోహరి డైనమిక్‌గా కంపెనీని నడిపేవారు. ఆనంద్‌ తెలివితేటల్నీ చొరవనీ గుర్తించి ప్రోత్సహించేవారు మార్కెటింగ్‌లో. ఆనంద్‌కి వాళ్ళు చాలా ఇచ్చారు.

ఆనంద్‌ కంపెనీకి లాభాలు తెప్పించి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అతను ఎదుగుతుంటే రమణ మురిసిపోయేవాడు. అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచీలు తెరిపించారు మోహన్‌ దంపతులు. ప్రతి కొత్త బ్రాంచీనీ కొన్నాళ్ళపాటు ఆనంద్‌ నేతృత్వంలో నడిపించేవారు.

ప్రస్తుతం తానే ‘మోడ్రన్‌ ఇన్‌ఫ్రా’ అనే కంపెనీకి అధినేత అయిపోయాడు ఆనంద్‌. ఈ రోజు ప్రతిష్ఠాత్మక ‘సౌత్‌ ఇండియన్‌ ఎమర్జింగ్‌ బిజినెస్‌మేన్‌’ అవార్డు అందుకోబోతున్నాడు.

‘‘రమణన్నా, ఈ బందర్‌ రోడ్డులో నీ స్కూటర్‌ మీద ఎన్నిసార్లు ఎక్కించుకుని తిప్పావో లెక్కలేదు. అంతా ఒక కలలా ఉంది. మోహన్‌ సార్‌, మనోహరి మేడమ్‌, నువ్వు... మీరంతా లేకపోతే నేనెక్కడ... ఈ అవార్డ్‌ మీ అందరిదీ. ఈరోజు వాళ్ళిద్దరి గురించీ మాట్లాడతా’’ అన్నాడు ఆనంద్‌ స్థిరంగా.

‘‘అంతేనా... నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిన వ్యక్తి మరొకరున్నారు.’’

‘‘నీ గురించి చెప్పకుండా ఎలా అన్నా?’’ నవ్వేశాడు ఆనంద్‌.

‘‘నా గురించి కాదులే. తీసుకున్న దానికి వంద రెట్లు తిరిగిచ్చే తత్వం నీది. గుప్పెడు అటుకులిచ్చిన కుచేలుడికి- కృష్ణుడు అంతులేని సంపదలిచ్చినట్టు... చిన్న ఉద్యోగం కుదిర్చిన నాకు సొంతిల్లు కట్టించావు. నా పిల్లల్ని పెద్ద చదువులు చదివించావు. నా తమ్ముడివో కొడుకువో స్నేహితుడివో అర్థంకాదు ఆనంద్‌ ఆలోచిస్తే...’’ అంటూ కంటతడి పెట్టాడు రమణ.

‘‘అయినా... నువ్వూ నేనూ వేరా... చెప్పు’’ అన్నాడు కొనసాగింపుగా.

‘‘మరి, ఇంకెవరున్నారు?’’ ఆలోచిస్తూ అడిగాడు ఆనంద్‌.

‘‘రాధ... రాధ గురించి చెప్పాలి.’’ మౌనంగా తలూపాడు ఆనంద్‌. అతని చేతులు స్టీరింగ్‌పై బిగుసుకున్నాయి రాధ పేరు వినగానే.

కారు పెనమలూరులోని కన్వెన్షన్‌ హాలు ముందర ఆగింది. చాలా కోలాహలంగా ఉందక్కడ. ఏర్పాట్లన్నీ చాలా ఆర్భాటంగా కనిపిస్తున్నాయి. సౌత్‌ ఇండియా బిజినెస్‌ సమ్మిట్‌ జరుగుతుందక్కడ. కోటీశ్వరులు కొలువుతీరే వ్యాపార జాతర. ఆనంద్‌కి అభినందనలు తెలుపుతూ ఉన్న ఫ్లెక్సీలూ స్వాగత బ్యానర్లూ చూసిన రమణకి ఛాతీ పొంగింది.

సభ ప్రారంభమయింది. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలూ- తమ ఉత్పత్తుల గురించీ వ్యాపారంలో అనుసరిస్తున్న విధానాల గురించీ ప్రభుత్వాల సహకారం గురించీ తమ తమ ప్రెజంటేషన్స్‌ ఇస్తున్నాయి. మోహన్‌, మనోహరి దగ్గరికెళ్ళి నమస్కారం చేసి వారి పక్కనే కూర్చున్నాడు ఆనంద్‌. అతని భుజం తట్టాడు మోహన్‌. భోజన విరామం తరవాత నాలుగు గంటలకి అవార్డు ప్రదానోత్సవం ప్రారంభమయింది. ఆనంద్‌ గురించి అందరూ గొప్పగా మాట్లాడారు. మోహన్‌ వంతు వచ్చింది.

‘‘ఇక్కడ ఉన్న అందరికంటే ఆనంద్‌ గురించి మాకే ఎక్కువ తెలుసు. ఆయన మా ప్రొడక్ట్‌. ఒకప్పుడు మా దగ్గర నాలుగు వేల జీతానికి పని చేశాడు. ఈరోజు తానే నాలుగువేల మందికి జీతం ఇస్తున్నాడు. దీన్నే గెలుపు అంటారు. తానొక్కడే గెలవడం కాదు, చుట్టూ ఉన్న వారిని కూడా గెలిపిస్తాడు మా ఆనంద్‌. అతనొక విజేత... ఇటువంటి విజేతల జీవితాలను కథలుగా తెలుసుకోవాలి నేటి యువత. ఇటువంటి స్ఫూర్తివంతమైన కథలో మేము కూడా పాత్రలు కావడం మాకు ఎంతో సంతోషం. ఆనంద్‌ ఇంకా ఎదగాలి... అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టి ఇండియాలోనే టాప్‌ మోస్ట్‌ బిజినెస్‌మేన్‌ కావాలి. అది మోహన్‌ ఎంటర్‌ప్రైజస్‌ ఆకాంక్ష...’’ అంటూ మనస్ఫూర్తిగా ముగించాడు.

అందరికంటే రెండు చప్పట్లు ఎక్కువ కొట్టాడు రమణ.

చివరిగా తన స్పందన తెలియ చెప్పడానికి పోడియం దగ్గర మైక్‌ తీసుకున్నాడు ఆనంద్‌. రమణకి చాలా ఉత్కంఠగా ఉంది. ‘రాధ గురించి కూడా రెండు మాటలు చెబితే బాగుండు’ అనుకున్నాడు.

ప్రతిరోజూ దెబ్బలే... ఒళ్ళంతా వాతలే..!

‘‘అందరికీ నమస్కారం. నేను గెలవలేదు. గెలిపించారు. నా చేయి పట్టి, వెన్ను తట్టి, ముందుకు నెట్టి మరీ నన్ను గెలిపించారు. మోహన్‌ సార్‌, మనోహరి మేడమ్‌ నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు. నేను స్వేచ్ఛగా ఆలోచించడానికీ తోచిన పని చేయడానికీ మోహన్‌ ఎంటర్‌ప్రైజస్‌ అవకాశం కల్పించింది. అది నా మాతృ సంస్థ. నిజానికి- ఒక కంపెనీకి అధినేత కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. ఓ రకంగా అది మోహన్‌ సార్‌ ఆకాంక్ష. వారు బ్యాంకులకు ష్యూరిటీ ఇచ్చి మరీ నాచేత కంపెనీ పెట్టించారు. ఉద్యోగిని భాగస్వామిగా మార్చుకోడానికి మనసుండాలి. సొంత కంపెనీ పెట్టించి, తమతో సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించడానికి ఇంకా పెద్ద మనసుండాలి. మా మోహన్‌ సార్‌ది పెద్ద మనసు. ఈ అవార్డు వారిదే... వారికే. మోహన్‌ ఎంటర్‌ప్రైజస్‌లో ఎప్పటికీ నేనొక ఉద్యోగినే. ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పాలి... మా విజయవాడ బ్రాంచ్‌ సీఈఓ రమణ... ఒక్క మాటలో- నాకు మా నాన్నలేని లోటు తీర్చే వ్యక్తి... అందరికీ నా ధన్యవాదాలు’’ ముగించాడు ఆనంద్‌.

రమణకి అసంకల్పితంగా కన్నీళ్ళొచ్చేశాయి. కానీ రాధ గురించి ఒక్క మాటైనా చెప్పకుండా ముగించడం అతనికి ఎక్కడో నచ్చలేదు. అసలు రాధ లేకపోతే ఈ ఆనంద్‌- చదువు కూడా పూర్తి చెయ్యలేక, ఎక్కడో రిక్షా తొక్కుతూనో ఆటో నడుపుతూనో ఉండేవాడు ఇప్పటికీ... అనిపించింది అతనికి. జ్ఞాపకాలు మళ్ళీ దొర్లుకొచ్చాయి.

మోహన్‌ ఎంటర్‌ప్రైజస్‌లో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఆనంద్‌ని ‘పెళ్ళిచేసుకోకుండా ఎన్నాళ్ళుంటావ్‌?’ అని పదేపదే అడిగేవాడు రమణ.

ఎవరికీ చెప్పనని మాటిచ్చాక ‘రాధ’తో తన విఫల ప్రేమకథని రమణకి చెప్పుకున్నాడు ఆనంద్‌.

ఆనంద్‌ విజయవాడలో డిగ్రీ చదువుతుండగా ఆంధ్రా యూనివర్శిటీలో జరిగిన యువజనోత్సవాలలో రాధ పరిచయమయింది. ఆమెది విశాఖపట్టణం. ‘భారతదేశ ఆర్థిక ప్రగతి’ అనే అంశం మీద ఆనంద్‌ చేసిన ప్రసంగం ప్రొఫెసర్స్‌ మన్ననలు అందుకుంది. రాధకి ఆనంద్‌తో స్నేహం కుదిరింది. వాళ్ళిద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు. అకస్మాత్తుగా ఆనంద్‌ తండ్రి చనిపోవడంతో మొత్తం కుటుంబ భారం ఆనంద్‌ మోయాల్సి వచ్చింది. అతని చదువు ఆపాల్సిన పరిస్థితులలో రాధ ఆర్థిక సహాయం చేసింది. ఆనంద్‌ ఎంకామ్‌ పూర్తి చేయడంలో రాధ, ఆమె తండ్రి వెంకటాద్రి ఎంతో సహాయం చేశారు. రాధ ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఆనంద్‌ ఎంకామ్‌లో గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు.

ఒకరోజు వెంకటాద్రిగారు ఆనంద్‌ ఇంటికి వచ్చి ‘రాధ- ఆనంద్‌ని పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటోంది’ అని చెప్పాడు. కానీ తనకి మాత్రం ‘తన ఒక్కగానొక్క కూతురుని తన స్థాయికి తగిన పెద్దింటి కోడలిగా పంపాలనుంది’ అని కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు. తాను అంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తాను వచ్చి మాట్లాడిన సంగతి రాధకి చెప్పవద్దని మరీమరీ కోరాడు.

ఆనంద్‌కి గుండెల్లో చెప్పలేనంత దిగులు కలిగింది. తాను వారి స్థాయికి తగినవాడిని కాదనీ తమ కుటుంబం అంతా వారికి భారం కాలేమనీ రాధకి నచ్చజెప్పి దూరం అయిపోయాడు. ఉత్తరాలకి అక్షరాలు కరువయ్యాయి. అలా దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నపుడు రమణ పరిచయం అయ్యాడు.

*    *    

రాత్రి ఎనిమిది అయింది. ‘‘రమణన్నా నేను కంపెనీ కార్‌లో వెళ్తా. నువ్వు వెళ్ళిపో లేటవుతుంది’’ అన్నాడు ఆనంద్‌ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ.

‘‘లేదు. నీతో మాట్లాడాల్సింది ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో నేనే డ్రాప్‌ చేసి ఇంటికి వెళ్తా.’’

అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని బయలుదేరారు ఇద్దరూ వర్షంలో. రమణ మౌనంగా డ్రైవ్‌ చేస్తున్నాడు. ‘‘ఏంటన్నా సైలెన్స్‌... ఏదో మాట్లాడాలి అన్నావు కదా’’ అడిగాడు ఆనంద్‌.

‘‘రాధ గురించి ఒక్క మాటైనా చెప్పాల్సింది. అది కనీస కృతజ్ఞత. అసలు రాధని మర్చిపోయిన ఆనంద్‌ని నేను ఊహించలేను’’ అన్నాడు రమణ పెదాలు బిగిస్తూ.

‘‘అన్నా, తన గురించి పదిమంది ముందు మాట్లాడితేనే కృతజ్ఞతా చెప్పు. ఇప్పుడు తనకీ ఒక కుటుంబం ఉండే ఉంటుంది. సభాముఖంగా మాట్లాడి జనాలు ఏదో ఊహించుకునే పరిస్థితి కల్పించడం మర్యాదేనా... అలా చేస్తే నేనసలు మనిషినేనా.. నన్ను అర్థంచేసుకో’’ అన్నాడు ఆనంద్‌.

సబబే అనిపించింది రమణకి. ‘‘మరి బతికినంతకాలం చుట్టూ ఉన్న వారి కోసమే బతుకుతావా? మీ వదిన ఎప్పుడూ అంటూ ఉంటుంది- ఆనంద్‌ కళ్ళల్లో దీపావళినీ గుండెల్లో గోదావరినీ పెట్టుకుని తిరుగుతుంటాడని. జీవితం పొద్దు వాలకముందే కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో ఆనందూ. ఇందాక మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంచావు కదా నన్ను... ఆ చనువుతో అడుగుతున్నా’’ ఆర్తిగా అడిగాడు రమణ.

పెదవి దాటని నవ్వొకటి విసిరాడు ఆనంద్‌. వర్షం కురుస్తూనే ఉంది వాళ్ళ మనసుల్ని చల్లబరచడానికి.

ఆనంద్‌ని డ్రాప్‌ చేసి రమణ వెళ్ళిపోయాడు.

ఒంటరిగా కూర్చున్న ఆనంద్‌ని అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి. తన మనసులో ఉన్నదేంటో, తన మౌనం వెనుక ఉన్న రహస్యమేంటో ప్రపంచానికి చెప్పలేని స్థితి అతనిది.

‘‘హ్యాపీ జర్నీ ఆనంద్‌. ఆల్‌ ద బెస్ట్‌’’ వాట్సాప్‌లో టెక్స్ట్‌ మెసేజ్‌ చూసి ఆనంద్‌ ఎంతో సంతోషించాడు. మనోహరి పంపిన మెసేజ్‌. పదేపదే చదువుకున్నాడు ఆనంద్‌. మనోహరి మేడమ్‌ కాదు, వెంకటాద్రిగారు తనకి దూరం చేసిన రాధామనోహరి.

ఉద్యోగంలో చేరిన మొదటిరోజు రాధని చూసి ఖిన్నుడైపోయాడు ఆనంద్‌. బాధ, దుఃఖం, సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు తను. ఆమెది కూడా అదే పరిస్థితి. కానీ...

ఈ చిట్కాలను పాటిస్తే, మనీ మ్యాజిక్‌ మహాసులభం

ఆనంద్‌ ఎలా ఎదగాలని కోరుకుందో అలా ఎదిగేందుకు రాధామనోహరి కృషి చేసింది. తనకంటే యోగ్యుడైన మోహన్‌ను చూసి ఆనంద్‌ సంతోషించాడు. మోహన్‌ పట్ల తన అపారమైన విశ్వాసాన్ని అడుగడుగునా చూపేవాడు. చదువుకోడానికి ఆర్థికసాయం చేసిన వెంకటాద్రి, ఉద్యోగం ఇప్పించిన రమణ, కంపెనీ పెట్టించిన మోహన్‌తో తనది రుణానుబంధం. వారిపట్ల వారి

విధేయత చెక్కు చెదరనిది.

ఎంతటి గొప్పవారి జీవిత చరిత్రలోనైనా రాయలేని పాత్ర ఒకటైనా ఉంటుంది ఇందుకేనేమో...

వర్షం ఆగింది ఆకాశం తేటపడింది. విమానం గాల్లోకి ఎగిరింది. బలంగా శ్వాస తీసుకుని భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆనంద్‌. హృదయం వేడెక్కినపుడు నిట్టూర్పు చల్లబరుస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు