నిజమే.. నేను చేతకాని దానిలాగే ఉన్నా! నువ్వు చేసేది మాత్రం తప్పే!

ఆదివారం ఉదయం ఆరున్నర గంటలు దాటుతుండగా శ్రావణికి మెలకువ వచ్చింది. ఇంకాసేపు పడుకుందామనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు.

Updated : 07 Jul 2024 07:39 IST

- రాధా సింధూర

ఆదివారం ఉదయం ఆరున్నర గంటలు దాటుతుండగా శ్రావణికి మెలకువ వచ్చింది. ఇంకాసేపు పడుకుందామనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఇంక మెల్లగా లేచి ఫ్రెష్‌ అయ్యి బయటకి వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తమామలు ఒకసారి ఆమెవైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు. ఆరున్నర కాదు తొమ్మిదిన్నర దాటాక లేచినా వాళ్ళ రియాక్షన్‌ అదే ఉంటుందని తెలుసు శ్రావణికి. వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్‌ పెసరట్లు వేస్తూ కనిపించాడు.

హాట్‌ప్యాక్‌లో పెసరెట్టు వేయడానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో ‘‘గుడ్‌ మార్నింగ్‌, కాఫీ..?’’ అన్నాడు.
అవునన్నట్టు తలూపింది శ్రావణి.
‘‘ఒక్క నిమిషం’’ అని పెనం స్టౌ మీంచి దింపి, చట్నీ గిన్నె, హాట్‌ప్యాక్‌ తీసుకుని ‘‘ఇప్పుడు కాఫీ కలుపుకో’’ అని డైనింగ్‌ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. శ్రావణి అభావంగా ఉండిపోయింది.

వాక్కాయ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

తరవాత కాఫీ కలుపుకుని కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది. లోపల శబ్దాలు విని ‘అమర్‌ లంచ్‌ కోసం కూరగాయలు తరుగుతున్నాడన్నమాట’ అనుకుంది. ‘అత్తారింట్లో తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్‌ లేవు. వంట పనీ ఇంటి పనీ తనే చేయాలని లేదు. ఉద్యోగం చెయ్యీ లేదా చెయ్యకు అనేవారు లేరు. ఇలా ఉండు, అలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు. తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అయినా ఎందుకు ఈ అసంతృప్తి? తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా... అసలు తన ఆలోచనలో తప్పు ఉందా? ఎంతో ఆలోచించాకనే కదా... ఈ నిర్ణయం తీసుకుంది తను’ అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి.
శ్రావణిది ఉమ్మడి కుటుంబం. ఆస్తిపరులు కాకపోయినా మంచి పేరుకి మాత్రం లోటు లేదు. ముఖ్యంగా శ్రావణి తల్లి శారదగారి గురించి బంధువులు అందరూ మంచిగా చెప్పారు. ఈ సంబంధం వచ్చినప్పుడు- అమర్‌ తల్లిదండ్రులు నరసింహం- సుశీల ‘కుటుంబం ఎలాంటిదీ... అమ్మాయికీ అబ్బాయికీ ఇష్టమేనా’ అని మాత్రమే ఆలోచించారు.
శ్రావణి పెళ్ళికి ముందే అమర్‌తో ‘నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను. నా జీవితం నాకు నచ్చినట్టు గడపాలి అనుకుంటాను. మిమ్మల్నీ మీ కుటుంబాన్నీ గౌరవిస్తాను. అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరనే అనుకుంటున్నాను’ అంది.
అమర్‌కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది. అతనింట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చెయ్యడం ఎవరికీ ఇష్టంలేదు. పెళ్ళి చక్కగా జరిగింది. శ్రావణి అత్తారింటికి వచ్చింది.
నెల రోజులకే అత్తమామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది. అలా అని శ్రావణి- వాళ్ళనేం అనేది కాదు. కానీ ఏదో దూరం. తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది. పోనీ ‘నాకు ఫలానా ఇష్టం’ అని చెబితే అలాగే చేద్దాం అనుకుంటే అలా కూడా చెప్పేది కాదు. మొహమాటపడుతుంది అనుకుని అమర్‌, ‘శ్రావణీ... రోజూ మనిద్దరం కలిసి వంట చేద్దామా? నీతో గడిపినట్టు ఉంటుంది’ అంటే సరేనంది శ్రావణి. కానీ అన్ని విషయాలలో ఇంతే. ఏదైనా చెప్పబోతే ‘నాకు అలవాటు లేదు’ అనో ‘ఇష్టం లేదు’ అనో ముక్తసరిగా చెప్పేది. కొత్త కదా అని వాళ్ళే కలుద్దామనుకున్నా కుదిరేది కాదు. కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందామని అనుకున్నా, శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు.
ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు. శ్రావణి పనుందంటూ గదిలోంచి బయటకే రాలేదు. వాళ్ళ మర్యాదలు అన్నీ సుశీలే చూసుకుంది. ‘కోడల్ని చూడాలనే వచ్చాం, కానీ అవ్వనేలేదు’ అంటూ వెళ్ళారు వాళ్ళు.
ఆ మాటలకి అమర్‌ బాధపడ్డాడు. అసలు శ్రావణి ఎందుకిలా చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెనే నేరుగా అడిగేశాడు.
‘ఎందుకు రావడం? మర్యాదలు జరిపించుకుని మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికా?’ అంది శ్రావణి.
ఆ మాటకి అమర్‌ చిరాగ్గా ‘అసలు వాళ్ళతో ఒక్క మాటయినా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావ్‌? ఇప్పుడు మాత్రం నీ గురించి ఏం అనుకోరా? వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు. ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చావ్‌’ అన్నాడు.
‘నాకిష్టం లేదంటే అర్థం చేసుకోరేం?’

 

అదే మా డ్రీమ్‌రోల్‌ అంటున్న కథానాయికలు

‘ఇంకేం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులా ఉండాలి. మీ అమ్మగారు చూడు... అందర్నీ కలుపుకుని ఎలా ఉంటున్నారు? నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా?’ అన్నాడు కోపంగా.
ఆ మాటతో శ్రావణి ఆవేశంగా ‘ఓహో... అర్థమయ్యింది. నేను మీకు సేవలు చేయడం లేదనేగా. మీకు కావాల్సింది మీరూ మీ వాళ్ళూ చెప్పినట్టు నడిచే ఒక రోబో, అంతే’ అని గెస్ట్‌ రూమ్‌లోకి వెళ్ళి తలుపేసుకుంది. అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చచెప్పాలో తెలియలేదు అమర్‌కి.
పడుకుందన్నమాటే కానీ మర్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి. తను కావాలని అలా అనలేదు. అమర్‌ అలా అనుకునే మనిషి కాదని తెలుసు. కానీ అతన్ని గెలవనివ్వకూడదని ఆవేశంలో అలా అనేసింది. కానీ మర్నాడు ఎవరూ ఏం అనలేదు కానీ అప్పటినుంచీ తనేం చేసినా, ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు. అలా అని దెప్పడం, మాట్లాడకుండా ముభావంగా ఉండటం కూడా లేదు. ఏదో పరాయి వ్యక్తికి గౌరవం ఇచ్చినట్టు ఉంది. అడిగితే చెప్తారు లేదా లేదు. అప్పటినుంచే శ్రావణికి ఈ బాధ. ‘నిన్నేమైనా తిడుతున్నారా కొడుతున్నారా... వాళ్ళు నోరు మూసుకుని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా’ అనుకుంది శ్రావణి.

*                 *             *

పెళ్ళైన మూడు నెలల తరవాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్నపిల్లలా అయిపోయింది శ్రావణి. ‘ఏంటమ్మా ఈ సర్‌ప్రైజ్‌’ అంటూ తల్లిని చుట్టుకుపోయింది.
‘ఈ ఊర్లో పెళ్ళికి వచ్చానురా. నీ మీద బెంగతో ఒకసారి చూసిపోదామని వచ్చాను’ అంది శారద.
ఆవిడ వచ్చిన రెండ్రోజుల్లోనే- ఆ ఇంట్లో అత్తమామలూ శ్రావణీ అంటీముట్టనట్టు ఉంటున్నారని అర్థమైంది. పైగా అమర్‌ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు. మర్నాడు సాయంత్రం తెలిసినవాళ్ళ ఇంట్లో ఫంక్షన్‌ ఉంటే- అమర్‌, అతని తల్లిదండ్రులు వెళ్ళారు. అమర్‌ తల్లి సుశీల- శ్రావణి తల్లిని పిలిచింది కానీ నీరసంగా ఉందని రాలేనంది. తనని పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవడం చిత్రంగా అనిపించింది శారదకి.
వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో ‘నువ్వు కూడా వెళ్ళాల్సింది. మీ ఆయన బాధపడతారు’ అంది.
‘హుఁ అంతలేదు, అలా ఏం అనుకోరు’ అంది శ్రావణి.
‘ఏమ్మా అలా అంటావ్‌? మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు తల్లీ’ అంది శారద.
ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది. అంతా విన్నాక శారద ‘నువ్వు ఎంతో తెలివైనదానివనుకున్నాను. నీకు నచ్చినట్టు ఉండటం అంటే- ఒంటిపిల్లి రాకాసిలా ఉండటమా? ఈ పాడు ఆలోచన నీకెలా వచ్చిందే?’ అంది కాస్త కోపంగా.
‘నిన్ను చూసే వచ్చింది’ అంది శ్రావణి గట్టిగా. ఆ మాటకి శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.
‘అవును. చిన్నతనం నుంచీ చూస్తూనే పెరిగాను. ఒక్కరోజైనా నీకు నచ్చినట్టు ఉన్నావా? తిండి, బట్ట, మాట- చివరికి పిల్లల విషయంలో కూడా నీకూ నీ అభిప్రాయానికీ విలువ లేదు. పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది. అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది. కానీ నువ్వేం చేశావ్‌... అర్ధరాత్రుళ్ళు వంటింట్లో కూర్చుని ఏడ్చావ్‌. అలాంటి బతుకు నాకొద్దు అనుకునే ‘నా ఇష్టాలు నావే’ అని ముందే అమర్‌కి చెప్పాను’ అంది.
తనని చూసే కూతురు ఇలా ఆలోచనలు చేస్తోందని ఆవిడ ఊహకి కూడా అందలేదు. ‘నిజమే. నేను చేతకాని దానిలాగే ఉన్నాను. అది రైటని చెప్పను. కానీ నువ్వు చేసేది మాత్రం కచ్చితంగా తప్పే’ అంది.
శ్రావణి కోపంగా చూసింది.
‘కోపం కాదు, ఆలోచించు. నీ ఇష్టాల్నీ అభిప్రాయాల్నీ ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్టే అవతలివాళ్ళూ అనుకుంటారు. నా పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం కాదు. నేను మాట్లాడకుండా తప్పు చేస్తే, నువ్వు వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసి తప్పు చేస్తున్నావ్‌. దార్లో అడ్డంకులు ఉంటాయి అన్న భయంతో అసలు అడుగే వేయకుండా ఆగిపోతున్నావ్‌. దీనివల్ల నీకే కాదు- నీ భర్తకూ అత్తమామలకూ- ఎవరికీ సంతోషం ఉండదు. మీ బంధంలో బలం ఉండదు. ఒక్కసారి వాళ్ళు నీ అత్తమామలనీ... ఇది నీ అత్తిల్లనీ కాకుండా- ‘ఇది నా ఇల్లు... వాళ్ళు నా భర్తకు జన్మనిచ్చినవారూ... నాకు తల్లిదండ్రులతో సమానం... వాళ్ళని నేనే చూసుకోవాలి... పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వులనావలా ముందుకు సాగాలి... ఇందుకు ప్రధాన బాధ్యత నాదే’ అనుకుని ఆలోచించి చూడు’ అంది.
శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు ఆలోచించుకోవడానికీ తప్పు తెలుసుకోవడానికీ కొంత సమయం అవసరం అని శారద కూడా కదిలించలేదు.
ఆ రోజు సాయంత్రం అత్తమామలూ అమర్‌ ఫంక్షన్‌ నుంచి వచ్చాక, శ్రావణి సంకోచంగా ‘‘అత్తయ్యగారూ, కొంచెం కాఫీ ఇవ్వనా?’’ అంది.

ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకున్నారా?

ఆ మాటకు సుశీల ముఖం చేటంత అయ్యింది. ‘‘ఇవ్వు తల్లీ’’ అంది నవ్వుతూ.
శ్రావణి కాఫీ కలుపుతూ ‘నేను మాట్లాడితే ఎంత సంతోషించారు ఆవిడ. కోడలు మాట్లాడింది అనే ఆనందమే తప్ప, నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు. వాళ్ళతో కలుపుగోలుగా ఉంటే తనకీ అసంతృప్తి తగ్గింది. అమ్మ అన్నది నిజమే, నేనే తప్పుగా అనుకున్నాను’ అని ఆలోచిస్తూ ఉంది.
‘‘కాఫీ నేను సర్వ్‌ చెయ్యనా?’’ అంటూ వచ్చిన అమర్‌, కాఫీ పక్కన ప్లేట్లో బిస్కట్లు చూసి ‘‘ఎవరికి ఇవి?’’ అన్నాడు.
‘‘మనకి’’ అని, కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి నడిచింది శ్రావణి.
పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి ‘మన’ అనడంతో అమర్‌ మనసు నిండిపోయింది.
‘అత్తయ్యగారికి ఫోన్‌ చేసి సాయం అడిగి మంచి పని చేశాను’ అనుకుని తను కూడా బిస్కట్ల ప్లేట్‌తో నడిచాడు అమర్‌.

 Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..