Published : 14 Aug 2022 00:22 IST

పలుకే బంగారమాయెనా

- అప్పరాజు నాగజ్యోతి

‘‘నాన్నా, నువ్వు కొనే ప్రతీ వస్తువూ నానమ్మ కోసమేనా?’’

కొత్త ఏసీని అమ్మ గదిలో బిగించమంటూ నేను పనివాళ్ళతో చెబుతుంటే విన్న మా అబ్బాయి శైలేష్‌ తన అయిష్టతని బాహాటంగా ప్రదర్శించేసి విసురుగా బైటకెళ్ళిపోయాడు.

కొడుకు మాటలు బిగ్గరగా వినిపిస్తుంటే వంటింట్లో నుండి హాల్లోకొచ్చిన కోమలితో ‘‘పెద్దంతరం, చిన్నంతరం లేకుండా ఎంత పెడసరంగా మాట్లాడుతున్నాడో చూడు’’ అన్నాను నేను కోపంగా.

‘‘వాడన్న దాంట్లోనూ నిజం ఉంది కదండీ. ఆరు నెలలక్రితం ప్లాస్మా టీవీ కొంటున్నారని చెప్పగానే ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా అందులో క్రికెట్‌ మ్యాచ్‌లు చూడొచ్చునని వాడు ఆశపడ్డాడు. తీరా చూస్తే ‘మా అమ్మకి చత్వారం ఉంది. పెద్ద స్క్రీన్‌పైన బొమ్మలు బాగా కనబడతాయి’ అంటూ దాన్ని కాస్తా తీసుకెళ్ళి అత్తయ్యగారి గదిలో పెట్టించారు. ఇలా ప్రతీ విషయంలో ప్రథమ తాంబూలాన్ని మీ అమ్మగారికే అందిస్తుంటే ఇంట్లో మిగతావాళ్ళకి మండదా మరి.’’

ఓ పక్కన కొడుకుని సమర్థిస్తూనే పనిలో పనిగా తన అక్కసునీ వెల్లడించింది మా ఆవిడ.

‘‘నా చిన్నతనాన్నే నాన్న చనిపోతే ఎన్నో ప్రయాసలకోర్చి పెంచి పెద్ద చేసిన మా అమ్మకి ఈ మాత్రమైనా సౌకర్యాలని కల్పించడం కొడుకుగా నా విధి. అది మాత్రమే  కాదు కోమలీ, అమ్మ గదిలోనే అన్ని ఏర్పాట్లూ ఉంటే అమ్మకిక గది దాటి బైటకొచ్చే అవసరం ఉండదు. దాంతో ఆవిడ ప్రాణానికి హాయిగా ఉంటుంది, నీకూ వెసులుబాటుగా ఉంటుంది. చీటికిమాటికీ అమ్మ హాల్లో తచ్చాడుతూ ఉంటే నీ ప్రైవసీకి ఇబ్బంది కలిగిందని చిర్రుబుర్రులాడుతూ కంప్లైంట్లు చేసేది నువ్వేగా... కాదంటావా?’’

‘‘ఆ మాటా నిజమేలెండి. అత్తయ్యగారు హాల్లోకొచ్చి ప్రతీ విషయాన్నీ ఆరాలు తీస్తుంటే నాకు మహా చిరాకొచ్చేస్తుంది. పోనీ ఆవిడ అంతటితో ఆగినా సర్దుకుందును, కానీ అక్కడే సోఫాలో కూర్చుని నా కోసం వచ్చే ఫ్రెండ్స్‌ అందరితోనూ బాతాఖానీ పెట్టుకుంటారు. ఇంక మన రిషీగాడు కనిపించడం ఆలస్యం, వాడి చెవిలో జోరీగలాగా దూరి ఏవో నీతిబోధలు చేస్తూనే ఉంటారు. అవన్నీ వాడికి నచ్చవు, అలాగని పెద్దావిడనేమీ అనలేక నామీద ఎగురుతాడు. ఈ గోలంతా పడేకంటే మీరన్నట్టుగా ఆవిడకి గదిలోనే అన్ని ఏర్పాట్లూ చేయడమే ఉత్తమం. అయినా మీ చాదస్తమేగానీ, అత్తయ్యగారికోసం మీరిన్ని చేస్తున్నా నాకైతే ఆవిడ మొహంలో ఏనాడూ పిసరంతైనా సంతృప్తీ కనిపించదు, ఆవిడ నోటినుండి మీ గురించిన ఒక చిన్న పొగడ్తా వినిపించదు. ‘పలుకే బంగారమాయెనా’ అన్నట్టు ఎప్పుడూ మూతి బిగించుకునే కూర్చుంటారు.’’

తను చెప్పవలసింది చెప్పేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది కోమలి. అమ్మ గురించి చివర్లో తనన్న మాటలు నాకు అప్రియంగా అనిపించినా ఆ క్షణాన వాటిని నేనంతగా పట్టించుకోలేదు. అయితే ఏసీ ఫిట్‌ చేయడం పూర్తయాక అమ్మ గదిలోకి వెళ్ళి, రిమోట్‌తో  టెంపరేచర్‌ సెట్‌ చేసి మలయమారుతంలా వీచిన చల్లగాలిని ఆస్వాదిస్తూ ‘అమ్మా, ఏసీ బాగా పని చేస్తోంది కదూ’ అన్న నా మాటలకి అవునన్నట్లుగా కేవలం తలాడించి ఊరుకున్న అమ్మ మోములో నేనాశించిన ఆనందం కనిపించనప్పుడు మాత్రం అమ్మ గురించి కోమలి చేసిన వ్యాఖ్యానంలో నిజం లేకపోలేదనిపించింది. ఆ తర్వాత మాట్లాడేందుకింక ఏమీలేదన్నట్టుగా నిర్లిప్తంగా టేబుల్‌ పైనున్న భగవద్గీతని అందుకుంటున్న అమ్మతో సంభాషణని పొడిగించడం ఇబ్బందిగా తోచి అక్కడినుండి బైటకొచ్చేసి హాల్లో సోఫాలో కూర్చున్నాను.

నేను హాల్లోకి రావడం చూసిన కోమలి ‘‘ఏమండీ, మన ఇంటికి కొత్త ఏసీ వచ్చిన శుభ సందర్భంలో మీకు ఇష్టమైన గులాబ్‌జామ్‌ చేశాను, తినండి’’ అంటూ చేతికివ్వగా అందుకుని తినబోతూ ‘‘అమ్మకిచ్చావా కోమలీ?’’ అని అడిగాను.

‘‘ఆవిడకి పెట్టకపోతే మీరూరుకుంటారా మహానుభావా! ఆ గదిలోకి ముందుగా సప్లై చేశాకే మీకిస్తున్నానులెండి’’ కాస్త కినుకగా అంది కోమలి.

ఏమాటకామాటే చెప్పాలి, అప్పుడప్పుడూ కోమలి నాపైనా, అమ్మపైనా చెణుకులని విసురుతుందేగానీ అమ్మకి ఏ విషయంలోనూ లోటు రానీయదు. అందుకే తనపైన అమితమైన ప్రేమ పొంగుకురాగా ‘‘శిల్పారామం చూడాలని ఎప్పటినుండో అడుగుతున్నావుగా, త్వరగా తయారై రా, వెళ్ళి వద్దాం’’ అనగానే కోమలి మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోయింది.

‘‘ఇదిగో, ఇప్పుడే చిటికెలో వచ్చేస్తాను’’ అంటూనే నా బుగ్గపైన గట్టిగా ముద్దు పెట్టేసి బెడ్‌రూమ్‌లోకి పరిగెత్తింది. తనంతే, అల్ప సంతోషి. చిన్నచిన్న వాటికే సంబరపడిపోతుంది, ఆ ఆనందాన్ని అప్పటికప్పుడే ఇలా ఏదో ఒక చర్య ద్వారా ప్రదర్శించేసి నా మనసుని దోచుకుంటుంది. అమ్మ కూడా ఎప్పుడూ అలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా నిర్వేదంగా ఉండకపోతే అప్పుడప్పుడైనా కోమలిలాగా చక్కగా తన సంతోషాన్ని మాటల్లోనో చేతల్లోనో వ్యక్తం చేస్తే బాగుండును కదా.

*              *             *

శిల్పారామంలో చూడవలసినవన్నీ చూసేసి ఇంటికి బయల్దేరుతుండగా హఠాత్తుగా వెనక నుండి నా భుజం మీద చేయి పడటంతో ఉలిక్కిపడి చూస్తే అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు.

‘‘అరేయ్‌ కిరీటీ, నువ్వేమిటిరా ఇక్కడ’’ అంటూనే ఆనందంగా వాడిని కౌగిలించుకున్నాను.

‘‘చెన్నై నుండి ట్రాన్స్‌ఫర్‌ మీద ఇక్కడికొచ్చి రెండు నెలలయింది సాయీ. ఆఫీసు పనుల్లో బిజీగా ఉండటంవల్ల ఇంతదాకా నిన్ను కలవలేకపోయాను. వీలు చూసుకుని మీ ఇంటికి రావాలనే అనుకుంటున్నాను, ఇంతలో ఇలా కలిశాం. అన్నట్టు మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నాతోపాటు మా ఇంటికి రండి. అమ్మ ఎప్పుడూ మిమ్మల్ని గుర్తుచేసుకుంటూనే ఉంటుంది’’ అన్నాడు కిరీటి.

‘‘అలాగేరా’’ అంటూనే, కోమలి వైపు తిరిగి ‘‘కోమలీ, వీడు నా ఫ్రెండ్‌ కిరీటి. మేము తణుకులో ఉన్నప్పుడు మావి పక్కపక్క ఇళ్ళు. వీడూ నేనూ అక్కడ ఆరేళ్ళు కలిసి చదువుకున్నాం. తను మన పెళ్ళిక్కూడా వచ్చాడు’’ అంటూ పరిచయం చేశాను. ఆ తర్వాత కిరీటితో కలిసి వాళ్ళ ఇంటికి బయల్దేరాము.

*              *             *

చెప్పులని ఓ వారగా వదిలి హాల్లోకి అడుగుపెట్టగానే అక్కడ సోఫాలో కూర్చున్న యశోద పిన్నిని వెంటనే గుర్తుపట్టాను.

‘‘అమ్మా, ఎవరొచ్చారో చూడు’’ అన్న కిరీటి మాటలకి కళ్ళజోడు సరిచేసుకుని, నా మొహంలోకి రెండు క్షణాలపాటు తేరిపార చూశాక ‘‘ఎవరదీ... సాయిరాం కదూ. చాన్నాళ్ళకి కనిపించావు. బాగున్నావా బాబూ, ఇందిరక్క ఎలా ఉంది?’’ అంటూ ఆప్యాయంగా పలకరించింది యశోద పిన్ని.

‘‘అందరం బాగున్నాం పిన్నీ. నువ్వెలా ఉన్నావ్‌?’’

‘‘నాకేం, నిక్షేపంలా ఉన్నాను. బంగారంలాంటి కొడుకు, నెత్తిన పెట్టుకుని చూసుకునే కోడలుపిల్ల, ముద్దులు మూటగట్టే మనవరాలు’’ అంటూ నిండుగా చెప్పిన పిన్ని కళ్ళల్లో కనిపించిన సంతృప్తికి నాకు చాలా సంతోషం వేసింది. అమ్మ కళ్ళలో ఇటువంటి ఆనందం ఎందుకు కానరాదో!

కాసేపు ముగ్గురం కలిసి తణుకులో జ్ఞాపకాలను నెమరేసుకుంటుంటే కోమలి శ్రోతలా వింటూ కూర్చుంది. ఇంతలో సడెన్‌గా ఏదో గుర్తుకురాగా ‘‘ఏరా కిరీటీ, ఈ వేళ శిల్పారామం మేనేజర్‌ని కలవాలన్నావుగా, కలిశావా?’’ అన్న పిన్ని ప్రశ్నకి ‘‘ఆ పని పూర్తిచేసుకుని తిరిగొస్తుంటేనే అనుకోకుండా అక్కడ మన సాయి కనిపించాడమ్మా’’ అని చెప్పాడు కిరీటి.

ఆ తల్లీకొడుకుల సంభాషణ నాలో ఆశ్చర్యాన్ని నింపింది. కిరీటి తన ఆఫీసుకి సంబంధించిన విషయాలని కూడా తల్లితో చెప్పుకోవడం చిత్రంగా అనిపించింది. నా మట్టుకు నేను అమ్మతో ఇలాంటివి పెద్దగా మాట్లాడను. అడపాదడపా ఆఫీసు విషయాలు ఇంట్లో పంచుకున్నా అది కోమలితోనే. అయినా ఒక తరం వెనక మనిషి అయిన అమ్మకి నా ఆఫీసు విశేషాలు చెబితే మాత్రం అర్థమవుతాయా, పాడా!

అంతలో బయటనుండి లోనికి వచ్చిన వ్యక్తిని ‘‘భాగ్యలక్ష్మి, నా భార్య’’ అని పరిచయం చేస్తూనే ఆమె చేతుల్లో నుండి కూరగాయల సంచులని అందుకుని వంటింట్లో పెట్టి వచ్చాడు కిరీటి. సోఫాలో యశోద పిన్ని పక్కనే కూర్చుని కొంగుతో నుదుటిపైన చెమటను తుడుచుకుంటూ ‘‘అత్తయ్యా, ఈవేళ మార్కెట్లో మీ అబ్బాయికిష్టమైన చింతచిగురు దొరికింది. అలాగే మీకిష్టమైన బొమ్మిడాయిలూ దొరికాయి. ఈ రాత్రికి వంట ఏం చేయమంటారు?’’ అని భాగ్యలక్ష్మి అడుగుతుంటే- ‘‘బాగా అలిసిపోయినట్టున్నావు. ఇవాళ్టికి నువ్వు రెస్ట్‌ తీసుకోమ్మా. నేను ఇందాకే టొమాటో పచ్చడి చేసి, వంకాయ కూరలోకి మసాలా కూడా రెడీ చేశాను. అన్నమూ కూరా అరగంటలో అయిపోతాయి’’ అని చెబుతూ, ‘‘సాయీ, మీరూ ఈవేళ ఇక్కడే భోజనం చేయండి. నీకు టొమాటో పచ్చడి చాలా ఇష్టం కదా’’ అంది యశోద పిన్ని.

‘‘నా ఇష్టాలు నీకెంత బాగా గుర్తున్నాయి పిన్నీ’’ అంటూ ఆశ్చర్యపోతూనే ‘‘ఇప్పుడు భోజనాలవీ వద్దు, ఆలస్యమవుతోంది. ఇంట్లో అమ్మ ఒక్కత్తే ఉంది, మరోసారి తీరిగ్గా వస్తాము’’ అన్నాను.

‘‘అయ్యో, అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలి వచ్చావా? అలా అయితే త్వరగా బయల్దేరు సాయీ. నిన్ను విడిచిపెట్టి ఉండటమంటే ఇందిరక్కకి ఎంత నరకమో నాకు బాగా తెలుసు. అప్పట్లో మన కాంపౌండ్‌లో ఆడవాళ్ళమంతా కలిసి అడపాదడపా సినిమాకో షాపింగ్‌కో ప్రోగ్రాం వేస్తే ‘మా సాయి ఇంటికొచ్చేటప్పటికి నేనింట్లో ఉండకపోతే వాడు బెంగెట్టుకుంటాడు. వాడు లేకుండా నాకూ ఎక్కడికీ వెళ్ళబుద్దేయదు’ అంటూ ఇల్లు కదిలేది కాదు మీ అమ్మ. ఎప్పుడైనా పొరపాటున వచ్చినా ముళ్ళపైన ఉన్నట్టుగా ఉండి కాసేపటికే ‘ఇంక మా సాయి ఇంటికొచ్చే టైమయింది’ అంటూ ఉరుకులు పరుగులమీద వెళ్ళిపోతుండేది. దాని పంచప్రాణాలూ నువ్వేరా. నువ్వు మీ అమ్మ కళ్ళెదుట మసలుతూ, నాలుగు మాటలు దాంతో నవ్వుతూ మాట్లాడితే చాలు దాని మనసు పొంగిపోతుంది. మీరు ఇంటినుండి బయలుదేరి ఎంతసేపయిందో ఏమో, త్వరగా వెళ్ళు బాబూ. అయినా అమ్మని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదరా. తను కదలలేని పరిస్థితుల్లోగానీ లేదు కదా’’ అంటూ ఆందోళనపడింది యశోద పిన్ని. పిన్ని మాటలు నాలో నిద్రాణమైన బాల్య జ్ఞాపకాలని తట్టిలేపాయి. నిజమే, నా చిన్నతనంలో నేను ప్రతిదీ అమ్మతోనే పంచుకునేవాడిని. స్కూల్‌ నుండి నేను ఇంటికి తిరిగొచ్చేవేళకి అమ్మ ఇంట్లో ఉండకపోతే నాకస్సలు తోచేది కాదు.

ఏ రోజుకారోజు ఆ వేళ ఎలా గడిచిందో పూస గుచ్చినట్టుగా వివరంగా అమ్మతో చెప్పుకోకుంటే నాకు పిచ్చెక్కినట్టుగా ఉండేది. ఆ మాటకొస్తే నేను ఉద్యోగంలో చేరిన మొదట్లో కూడా ఆఫీసు కబుర్లని అమ్మతోనే పంచుకునేవాణ్ని. అదేమిటో మరి కోమలితో పెళ్లయ్యాక నా అలవాట్లన్నీ మారిపోయాయి. కోమలి తల్లిదండ్రులూ బంధువర్గమూ ఇదే ఊళ్ళో ఉంటారు. తనకి స్నేహితురాళ్ళు కూడా ఎక్కువే. పెళ్ళైన మొదట్లో తరచుగా వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్ళడం, లేదా వాళ్ళని మా ఇంటికి భోజనాలకి పిలవడం జరుగుతుండేది. రెండుమూడు రోజులు వరసగా ఏవైనా హాలిడేస్‌ కలిసొస్తే అందరం కలిసి పిక్నిక్‌లకీ టూర్లకీ వెళ్తుండేవాళ్ళం. అమ్మనీ మాతో రమ్మంటే తను పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపేది కాదు. నేను బలవంతం చేయబోతే ‘పెద్దవారు, ఆవిడని ఇబ్బంది పెట్టడం దేనికి? ఆవిడకి ఎలా ఇష్టమో అలానే ఉండనివ్వండి’ అనేది కోమలి.

అలా వివాహం తర్వాత కోమలితో నా బంధం బలపడి నా మనసునీ తలపులనీ తనతో పంచుకోవడం మొదలెట్టగానే నాకు తెలీకుండానే అమ్మకీ నాకూ మధ్యన దూరం పెరిగిపోయి మాటలు తగ్గిపోయాయి. ‘భోజనం చేశావా, మందులు వేసుకున్నావా?’ లాంటి పొడిపొడి మాటలే తప్ప అమ్మతో నేను నోరారా కబుర్లు చెప్పి ఎన్నాళ్ళయిందో!

నేనలా ఆలోచనల్లో ఉండగానే ‘‘చూడు నానమ్మా, అమ్మ నన్ను ఐస్‌క్రీమ్‌ తిననివ్వడంలేదు’’ అంటూ తల్లిపైన ఫిర్యాదుతో నానమ్మ పక్కనే వచ్చి కూర్చుంది కిరీటి కూతురు.

‘‘మరే, ఐస్‌క్రీమ్‌ తింటే నీకు రొంప చేసి జ్వరమొచ్చేస్తుందేమోనని అమ్మ భయం తల్లీ. నాలుగురోజులాగితే స్కూల్లో పరీక్షలైపోయి సెలవులిస్తారుగా, అప్పుడు మనమిద్దరం కలిసి కథలు చెప్పుకుంటూ బోలెడన్ని ఐస్‌క్రీమ్‌లు తిందాం, సరేనా బుజ్జితల్లీ’’ అంటూ యశోద పిన్ని తన మనవరాలికి నచ్చచెబుతుంటే చూడముచ్చటగా ఉంది.

మా శైలేష్‌కి మా అమ్మ దగ్గర ఇటువంటి చనువు లేనేలేదు. అయినా కన్నకొడుకుని నేనే అమ్మకి మానసికంగా దూరం జరిగిపోయాక ఇంక నా భార్యాబిడ్డల విషయం చెప్పేదేముంది.

‘నానమ్మా’ అంటూ చిన్నతనంలో అమ్మ వద్దకి శైలేష్‌ పరుగెత్తబోతుంటే ‘ష్‌, నానమ్మని డిస్టర్బ్‌ చేయకు’ అంటూ కోమలి వాడిని వారిస్తూ వెనక్కి లాగేది. అది చూసి ‘మా అమ్మకి శ్రమ కలగనీయకుండా కోమలి చక్కగా చూసుకుంటోంది’ అనుకుని సంతోషించానే తప్ప, దాని ఫలితంగా నానమ్మ వద్ద మనవడికి చనువు లేకుండా పోతుందని ఆలోచించలేకపోయాను. కిరీటి ఇంటి వాతావరణానికీ మా ఇంట్లో పద్ధతులకీ నడుమ ఉన్న అంతరం నాకిప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అమ్మ కళ్ళల్లో కాంతి లోపించడానికీ ఆమె మౌనానికీ గల కారణం లీలగా బోధపడుతోంది.

‘‘పిన్నీ, మీరంతా ఈ ఆదివారం వీలు చేసుకుని లంచ్‌కి మా ఇంటికి వచ్చేయండి. మిమ్మల్నందరినీ చూసి అమ్మ చాలా  సంతోషిస్తుంది’’ అని చెప్పి, ఆ తర్వాత కోమలితో కలసి బయటకు వచ్చేస్తుంటే మాతోపాటు తనూ గేటుదాకా వచ్చాడు కిరీటి.

‘‘కిరీటీ, నువ్వు పిన్నిని చూసుకుంటున్న తీరు అభినందనీయం. పిన్ని కళ్ళల్లో కనిపించే మెరుపే దానికి సాక్ష్యం’’ అంటూ వాడిని మనస్ఫూర్తిగా అభినందించాను.

‘‘భలేవాడివి సాయీ. అమ్మని సంతోషపెట్టేందుకు నేను ప్రత్యేకంగా చేస్తున్నదేమీ లేదు. నా ఎరుకలో చాలామంది వాళ్ళ తల్లిదండ్రులకోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేకమైన గదులని ఏర్పాటు చేయడం నాకు తెలుసు. నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను అమ్మ కోసం అలాంటి సౌకర్యాలేవీ అమర్చలేకపోయానన్న విషయం నన్నెప్పుడూ బాధిస్తూనే ఉంటుంది. అదే మాట అమ్మతో అంటే ‘అందరు కొడుకుల్లా నువ్వు నీ ఇంట్లో ప్రత్యేకమైన గదిని ఇవ్వకపోతే ఏమిటి, నీ గుండెల్లో నాకు ప్రత్యేకమైన చోటునిచ్చావు. అది చాలదూ ఈ అమ్మకి? కృష్ణా రామా... అంటూ ఇంట్లో ఓ మూలన పడుండే ముసలమ్మతో మాటలేమిటిలే- అనుకోకుండా ప్రతిరోజూ వీలు చేసుకుని నా దగ్గర కూర్చుని నీ కష్టం సుఖం చెప్పుకుంటావు. నా సలహాలు అడుగుతావు, నేను నోరు తెరిచి చెప్పకుండానే నా అవసరాలు తెలుసుకుంటావు. అడ్డాలనాడు బిడ్డలుగానీ గడ్డాలనాడా- అన్నట్టు కాకుండా ఇప్పటికీ చిన్ననాటి కిరీటిలాగే నాతో మసలుకుంటావు. ఏ తల్లికైనా ఇంతకంటే కావలసింది ఏముంటుందిరా’ అంటుంది అమ్మ. నిజమే కదా సాయీ, ఇంట్లో పెద్దవాళ్ల ఉనికిని గుర్తించి నోరారా పలకరిస్తే చాలు పొంగిపోతారు, అనుభవంతో వాళ్లకి తోచిన సలహా ఇస్తారు. వాళ్ళ పెద్దరికానికి మనం పిసరంత గౌరవాన్నిస్తే, దాన్నే వాళ్లు కొండంత పెన్నిధిగా భావిస్తారు. కొత్తగా మన జీవితంలోకి అడుగుపెట్టిన భార్యాబిడ్డల మోజులోపడి పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా మన కుటుంబంలో సభ్యులుగా వాళ్ళని కలుపుకుపోవడాన్ని మించి వాళ్ళు కోరుకునేది ఏముంటుంది సాయీ. నా అదృష్టంకొద్దీ నా భార్యకీ పెద్దలపట్ల గౌరవం ఉంది. అందుకే అమ్మతో కోడలిలా కాకుండా కూతురులా మసలుకుంటుంది.’’

కిరీటి మాటలు నా మనసుని ఛెళ్ళుమని తాకాయి. అమ్మ విషయంలో నేను చేస్తున్న అపరాధం ఏమిటో నాకిప్పుడు పూర్తిగా అర్థమయింది. చిన్నతనంనుండీ నన్ను వృద్ధిలోకి తీసుకురావడమే ధ్యేయంగా బతికిన అమ్మకు నా ఇంట్లో సకల సదుపాయాలతో ఒక గదిని ఏర్పాటు చేయడంతోటే నా బాధ్యత పూర్తయిందని భావించడం ఎంత అవివేకం! 

యశోద పిన్నికి మల్లే హాల్లో నిండుగా కూర్చుని ఇంట్లో అన్నింటా తానై ఉండవలసిన అమ్మని ఒక్క గదికే పరిమితం చేయడమంటే ఆకాశంలో హాయిగా విహరించే పక్షిని పంజరంలో బంధించినట్లేగా. స్వేచ్ఛను హరించేసే పంజరాన్ని బంగారంతో చేసినా అది పక్షికి ఆనందాన్నివ్వదన్న చిన్న విషయం ఇంతకాలంగా నా మనసుకెందుకు తోచలేదు?

అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీలో సినిమాని చూడటంలో ఉన్న ఆనందానికి అమ్మని దూరం చేసేసి ‘అమ్మా నీ గదిలో పెద్ద టీవీ పెట్టాను. ఇప్పుడు నీకు బొమ్మ స్పష్టంగా కనపడుతోంది కదా’ అని అడగడం ఎంత హాస్యాస్పదం! 

నిజమే, కిరీటి చెప్పినట్టుగా అమ్మని ప్రత్యేక అతిథిలా కాకుండా కుటుంబంలో భాగంగానే చూసుకోవాలి. ఏ తల్లైనా కోరుకునేది అదే. అలా కాకుండా కేవలం ఆధునిక సౌకర్యాలన్నీ అమర్చేసి సరదాలనీ సంతోషాలనీ తన సమయాన్నీ భార్యాబిడ్డలతోనే పంచుకునే నాలాంటి కొడుకు సమక్షం ఏ తల్లికి మాత్రం సంతృప్తినిస్తుంది? డబ్బుతో లభించే సౌకర్యాలే మనిషికి సంతోషాన్నిచ్చేట్టయితే ఈ భూమ్మీద ఉన్న సంపన్నుల తల్లిదండ్రులంతా చాలా సంతోషంగా ఉండాలి. విదేశాల్లో స్థిరపడి అక్కడ సంపాదించిన డాలర్లతో ఇక్కడ సకల సౌకర్యాలనీ అమర్చిపెట్టిన పిల్లల తల్లిదండ్రులు మరింత ఆనందంగా ఉండాలి, కానీ వాళ్ళెవరూ అలా ఉండటంలేదే!

సౌకర్యాల ద్వారా కలిగే హాయి కేవలం మేనునే తప్ప మనసుని తాకదు. ఎన్నాళ్ళనుండో నన్ను వేధిస్తున్న ‘అమ్మ ఎందుకు సంతృప్తిగా ఉండడం లేదు?’ అన్న ప్రశ్నకి సమాధానం ఈవేళ దొరికింది. బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం జరిగినట్టుగా కిరీటి ఇంట్లో నా జ్ఞాననేత్రాలు తెరుచుకున్నాయి. ఇకపై అమ్మ కళ్ళల్లో వెలుగునీ ఆమె గుండెల్లో సంతృప్తినీ ఎలా నింపాలో అర్థమవగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాను. ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మ గదిలోకి వెళ్లి అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుని ‘‘అమ్మా, ఈవేళ యశోద పిన్నీ, కిరీటీ కలిశారు’’ అంటూ అక్కడి కబుర్లని ఒక్కొక్కటే పూసగుచ్చినట్టుగా వివరిస్తుంటే... మెరుస్తున్న కళ్ళతో నావైపే చూస్తున్న అమ్మ ముఖంలో అద్వితీయమైన సంతృప్తి!

నాలోనూ అదే ఆనందం పొంగిపొరలగా నాకు తెలీకుండానే చిన్ననాటి సాయినై పోయి అమ్మ ఒళ్లో తలపెట్టుకున్నాను. పోగొట్టుకున్న పెన్నిధి తిరిగి పొందిన అనుభూతితో నా మనసంతా నిండిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని