అమ్మా... నీ హక్కులు తెలుసా?

ఈ సృష్టిచక్రాన్ని గిర గిర తిప్పే శక్తి అమ్మదే... ఆమె కాదంటే- రేపటి ప్రపంచమే ఉండదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరో ప్రాణికి జన్మనిస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న అమ్మని ఆదరంగా చూసుకోవాల్సిన బాధ్యత కడుపున పుట్టిన బిడ్డలకి ఎంత ఉందో, సమాజానికీ అంత ఉంది.

Updated : 12 Mar 2024 15:48 IST

ఈ సృష్టిచక్రాన్ని గిర గిర తిప్పే శక్తి అమ్మదే... ఆమె కాదంటే- రేపటి ప్రపంచమే ఉండదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరో ప్రాణికి జన్మనిస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న అమ్మని ఆదరంగా చూసుకోవాల్సిన బాధ్యత కడుపున పుట్టిన బిడ్డలకి ఎంత ఉందో, సమాజానికీ అంత ఉంది. అందుకే, అమ్మ రుణం తీర్చుకోలేనిది అని ఊరుకోకుండా, ఆమె కష్టాన్ని తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అమ్మకి కొన్ని ప్రత్యేక హక్కుల్ని ఇవ్వడం ద్వారా సమాజంలో ఆమె ప్రాధాన్యం ఏమిటో చెప్పకనే చెబుతున్నాయి. ఈ మదర్స్‌డే సందర్భంగా అమ్మలకి ఉన్న ఆ హక్కులేమిటో చూద్దాం.

లిత చిన్న ప్రైవేటు పాఠశాలలో టీచరు. తొమ్మిదో నెల వచ్చేదాకా ఓపిగ్గా స్కూలుకు వెళ్లింది. డెలివరీకి సెలవు పెట్టబోతే రాజీనామా చేయమంది యాజమాన్యం. ఆమె స్థానంలో మరొకరిని పెట్టుకోవాలి కాబట్టి జీతంతో కూడిన సెలవు ఇవ్వడం సాధ్యం కాదంటూ డెలివరీ తర్వాత మరోచోట ఉద్యోగం చూసుకోమని సూచించింది. ఒక పక్కన పెరిగే ఖర్చు, మరో పక్కన ఉన్న ఉద్యోగం కూడా ఊడటంతో బాధపడటం తప్ప మరో దారి కనపడలేదామెకి.

రేఖది మరో సమస్య. పెళ్లి చేసుకుని కొత్తగా నగరానికి వచ్చిన ఆమె ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. మూడు సంవత్సరాల దాకా మెటర్నిటీ లీవు పెట్టడానికి లేదని యాజమాన్యం హెచ్చరించింది. చట్టాలూ హక్కులూ ఏమీ తెలియని రేఖ నగరంలో ఖర్చులు తట్టుకోవాలంటే ఇద్దరికీ ఉద్యోగం అవసరం కాబట్టి సరేనని ఉద్యోగంలో చేరింది. రెండేళ్లయినా పిల్లలు పుట్టలేదంటే ఏదన్నా సమస్య ఉందేమో డాక్టర్‌ దగ్గరికి వెళ్లమంటూ పెద్దలు పోరుతుంటే వారికి విషయం చెప్పలేక సతమతమైపోయింది రేఖ.

సరళది ఇంకో సమస్య. ఆమె పనిచేసే చోట క్రెష్‌ లేదు. దాంతో రెండేళ్ల పిల్లవాడిని బయట కేర్‌సెంటర్‌లో పెట్టేది. తన జీతంలో సగం అక్కడ కట్టాల్సి వస్తోంది. అయినా పిల్లవాడిని బాగా చూసుకుంటే చాలనుకుంటే- అదీ లేదు. బాబుకి చీటికీ మాటికీ జ్వరమో జలుబో వస్తోంది. అలా వచ్చినప్పుడల్లా ఆఫీసుకు సెలవు పెట్టడానికి ఇబ్బంది పడుతోంది.

లలిత వాళ్ల వదినది నగరంలో ప్రభుత్వ ఉద్యోగం. ఆమె చక్కగా ఆర్నెల్లు జీతంతో కూడిన మెటర్నిటీ లీవు తీసుకుంది. ఆ తర్వాత బిడ్డను కూడా తనతో తీసుకెళ్లి ఆఫీసులోనే ఉన్న క్రెష్‌లో ఉంచి మధ్యలో వెళ్లి పాలిస్తూ సాయంత్రం తనతోపాటే తెచ్చుకునేది. ఉద్యోగం చేస్తూ కూడా ఆమె ఆనందంగా బిడ్డను పెంచుకోవడం చూసిన లలిత తనలాంటి ప్రైవేటు ఉద్యోగులకు ఆ వెసులుబాటు లేదనుకుని కుమిలిపోయేది.

నిజానికి ఉద్యోగం ప్రభుత్వంలోనా, ప్రైవేటులోనా అన్నది సమస్యే కాదు. ఉద్యోగస్తురాలిగానే కాదు, కుటుంబ సభ్యురాలిగానూ తల్లులందరికీ చట్టపరంగా సమాన హక్కులున్నాయి. కానీ చాలామందికి వాటిపట్ల సరైన అవగాహన లేకపోవడం వలన ఆ సౌకర్యాల్ని  అందుకోలేకపోతున్నారు.

వందేళ్లు పట్టింది!

పందొమ్మిదో శతాబ్దం వరకూ రోగాలూ, రొష్టులూ, వృద్ధాప్యం లాగే పిల్లల్ని కని, పెంచడం కూడా సహజ పరిణామంగానే చూసేవారు. అది పూర్తిగా వ్యక్తిగత, కుటుంబ విషయంగానే భావించడంతో సమాజ జోక్యం ఉండేది కాదు. ఎప్పుడైతే రాజరికాలు నశించి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్లూనడం మొదలెట్టిందో అప్పుడే ప్రజాసంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతల్లో ఒకటైంది. పారిశ్రామిక విప్లవం తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడం ప్రారంభించాక ప్రత్యేకించి మహిళా సంక్షేమమూ ప్రజాసంక్షేమంలో భాగమైంది. ఇంటా బయటా రెండు డ్యూటీలు చేస్తున్న మహిళలకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలన్న చర్చ మొదలైంది. అయితే చెప్పుకున్నంత తేలికగా ఇప్పుడున్న సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. కొన్నిచోట్ల ప్రతిపాదించిన వందేళ్లకి కానీ ఆచరణ సాధ్యం కాని సందర్భాలూ ఉన్నాయి.

ప్రభుత్వాలు చొరవ చూపి చట్టాలు చేయడం ఒకెత్తు అయితే వాటిని అమలుచేయడం మరొకెత్తు. ప్రసూతి సెలవు తీసుకున్న మహిళలకు పురుష ఉద్యోగులు ఏమాత్రం సహకరించేవారు కాదు. వాళ్లు ఉట్టి పుణ్యానికే సెలవు పెట్టి సుఖపడిపోతున్నట్లు బాధపడేవారు. సూటిపోటి మాటలతో వేధించేవారు. ఒకోసారి యాజమాన్యాలూ వారికి తోడయ్యేవి. మహిళలకు సమానవేతనం ఇవ్వకపోవడం, పదోన్నతులు ఆపేయడం... లాంటి చర్యలకు పాల్పడేవి.

ఇలాంటి సమస్యలన్నిటినీ ఎదుర్కొంటూ మహిళలు ఉద్యోగాల్లో కొనసాగడం అంటే- ఏటికి ఎదురీదడమే. అయినా స్వావలంబనా సాధికారతల విలువ తెలిసిన మహిళలు ఆ కష్టాలను ఎదిరిస్తూనే ఉద్యోగ ప్రస్థానంలో ముందుకు సాగుతున్నారు. అందుకే- ప్రసూతి సెలవుతో మొదలుపెట్టి వృద్ధాప్యంలో సంరక్షణ వరకూ భిన్న సందర్భాల్లో తల్లులకు అండగా నిలిచే చట్టాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

ప్రసూతి సెలవు

మనదేశంలో మొట్టమొదటగా ప్రసూతి సెలవు చట్టాన్ని(మెటర్నిటీ బెనెఫిట్స్‌ యాక్ట్‌-1929) తెచ్చిన ఘనత బోంబే రాష్ట్రానికి దక్కుతుంది. దాని రూపకల్పన వెనక రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో 1961లో తెచ్చిన మెటర్నిటీ బెనెఫిట్‌ యాక్ట్‌ ఎప్పటికప్పుడు కాలానుగుణమైన సవరణలు చేసుకుంటూ అమలవుతోంది. దీని ప్రకారం పదిమందికి మించి ఉద్యోగులున్న ప్రతి సంస్థలోనూ కనీసం 80 రోజులు పనిచేసిన మహిళలు పన్నెండు వారాల ప్రసూతి సెలవు పొందవచ్చు. అయితే మిగతా చట్టాల్లాగే దీన్నీ అతిక్రమించేవారికి కొదవ లేదు.

* ఎయిర్‌హోస్టెస్‌ల రిటైర్మెంట్‌ వయసు 35 ఏళ్లుండేది. ఒకవేళ ఉద్యోగంలో చేరిన నాలుగేళ్ల లోపల పెళ్లి చేసుకున్నా, 35 ఏళ్లలోపే గర్భం దాల్చినా వెంటనే రిటైర్‌ అవ్వాల్సిందే... అన్నాయి సంస్థ సర్వీస్‌ నిబంధనలు. మగవాళ్లకి అలా లేదు, ఎందుకీ వివక్ష అంటూ ఉన్నత న్యాయస్థానం ముందుకెళ్లింది ఓ ఎయిర్‌హోస్టెస్‌. ఇది ఆర్టికల్‌ 14 ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కుకి భంగం కలిగించడం కాదా అని ప్రశ్నించింది. స్త్రీల పట్ల వివక్ష చూపుతున్న ఆ సర్వీసు నిబంధనల్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. దాంతో ఎయిర్‌హోస్టెస్‌ల రిటైర్మెంట్‌ వయసుని 55 ఏళ్లకి పెంచారు.

* నీరామాథుర్‌ ఎల్‌ఐసీలో ఉద్యోగి. ప్రొబేషన్‌లో ఉండగా మెటర్నిటీ లీవుకి దరఖాస్తు చేయడంతో ఆమెకు ఎలాంటి నోటీసూ ఇవ్వకుండానే ఉద్యోగంలోంచి తీసేసింది సంస్థ. ఆమె ఉద్యోగంలో చేరేటప్పుడు నెలసరికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తమకు ఇవ్వలేదని సాకు చూపింది. సంస్థ అడిగిన సమాచారం స్త్రీల ఆత్మగౌరవానికీ ప్రైవసీకీ భంగం కలిగించేలా ఉందని కోర్టు తప్పుబట్టింది. దరఖాస్తు నుంచి ఆ ప్రశ్నలను తొలగించడమే కాక, ఆమెను ఉద్యోగంలోకి తీసుకోవాలనీ ఆదేశించింది.

* దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లో రోజు కూలీలుగా పనిచేస్తున్న మహిళలు తమకీ ప్రసూతి సెలవు ఇవ్వాలనీ, అది లేనందువల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామనీ కోరగా న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. విధుల్లో తేడాలున్నప్పటికీ జీవిక కోసం శ్రమిస్తున్న అందరికీ కనీస సౌకర్యాల కల్పన విషయంలో సమానత్వం పాటించాలని పేర్కొంది. దాంతో ప్రసూతి సెలవు చట్టాన్ని రోజుకూలీలకు కూడా వర్తింపజేశారు.

* ఈ మధ్య మద్రాసు హైకోర్టు ముందుకు ఒక కేసు వచ్చింది. రోడ్డు రవాణా సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళకు సంస్థ జీతం నష్టంతో ప్రసూతి సెలవు ఇచ్చింది. శాశ్వత ఉద్యోగి కాదు కాబట్టి ఆమెకు మెటర్నిటీ బెనెఫిట్స్‌ వర్తించవని పేర్కొంది. న్యాయస్థానం సంస్థ వాదనను అంగీకరించలేదు. ఉద్యోగం శాశ్వతమా, తాత్కాలికమా, ఒప్పందమా... అన్నది అప్రస్తుతమనీ ఉద్యోగం అంటూ చేస్తున్నవాళ్లందరికీ చట్టం ఒకేలా వర్తించాలనీ చెప్పింది. సెలవు సమయానికి ఆమెకు జీతం చెల్లించమని ఆదేశించింది.

ఇలా న్యాయస్థానం ముందుకెళ్లి పోరాడగలిగేవాళ్లు ఎంతమంది? అలా పోరాడే శక్తిలేని వారు మౌనంగా అన్యాయాన్ని భరిస్తున్నారు.

ఇప్పుడు ఆర్నెల్లు

ఉద్యోగరంగంలోకి వస్తున్న మహిళల సంఖ్య బాగా పెరగడమూ మారుతున్న కుటుంబ వాతావరణమూ అన్నీ కలిసి మెటర్నిటీ బెనెఫిట్స్‌ చట్టంలో మరెన్నో మార్పులు తెచ్చాయి. 2017లో దీన్ని సవరించి ప్రసూతి సెలవును 12 వారాలనుంచి 26 వారాలకు పెంచారు. ఇద్దరు పిల్లల వరకు ఇది వర్తిస్తుంది. కుటుంబనియంత్రణను ప్రోత్సహించేందుకు గాను మూడో బిడ్డ నుంచి మాత్రం 12 వారాలే ఇస్తారు. కాన్పు సమయంలోనూ ఆ తర్వాతా ఏమైనా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తే మరో నెల సెలవు పొడిగించుకునే అవకాశమూ ఉంది.

గర్భస్రావం

మహిళలు ఎదుర్కొనే మరో సమస్య గర్భస్రావం. ప్రమాదవశాత్తూ అబార్షన్‌ అయినా, లేక తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని బట్టి తప్పనిసరై గర్భస్రావం చేయాల్సి వచ్చినా ప్రసూతి సెలవు వర్తించదు కాబట్టి సొంత సెలవు పెట్టుకోవాలనుకుంటారు చాలామంది. మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం-1971 ప్రకారం అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగినులు ఆరు వారాల జీతంతో కూడిన సెలవు పొందవచ్చు. అయితే అబార్షన్‌కి కారణమూ, నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలోనే అన్ని వసతులూ ఉన్న ఆస్పత్రిలోనే అది జరిగినట్లు రుజువూ చూపాలి. అబార్షన్‌ కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలైతే మరో నెల అదనంగా సెలవు పొందవచ్చు.

దత్తత, సరొగసీ

గీతకి పిల్లలు పుట్టలేదు. దాంతో సరొగసీ విధానాన్ని ఎంచుకుంది. ఆ బిడ్డను పెంచుకోవడానికి మెటర్నిటీ లీవు ఇవ్వవలసిందిగా దరఖాస్తు చేస్తే ఆమె పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విభాగం అందుకు అంగీకరించలేదు. ఆమె స్వయంగా గర్భం దాల్చి బిడ్డను కనలేదు కాబట్టి సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. గీత న్యాయం కోరుతూ కోర్టుకు వెళ్లింది. న్యాయస్థానం ఆ సంస్థ వాదనను కొట్టివేసింది. బిడ్డను ఎలా కన్నారన్నది ఇక్కడ ప్రశ్నే కాదనీ బిడ్డను పెంచడానికి సెలవు పొందడం తల్లిగా ఆమె హక్కనీ ప్రసూతి చట్టం నిబంధనల ప్రకారం ఆమెకు సెలవు ఇచ్చే తీరాలనీ తీర్పు చెప్పింది.

2017లో మెటర్నిటీ యాక్ట్‌ చట్టానికి చేసిన సవరణలో సరొగసీ, దత్తతలను కూడా చేర్చారు. పిల్లలు లేని జంట దత్తత తీసుకున్నప్పుడు ఆ బిడ్డ మూడు నెలల లోపు వయసులో ఉంటే, బిడ్డను ఇంటికి తెచ్చుకున్న రోజు నుంచి 12 వారాలపాటు తల్లి సెలవు తీసుకోవచ్చు. ఒకవేళ ఏ మహిళకైనా వివాహబంధం ఇష్టం లేకపోతే- ఆమెకు మాతృత్వపు మధురిమలను ఆస్వాదించే హక్కు లేదా అన్నదీ... నిపుణుల ముందు చర్చనీయాంశం అయింది. దాంతో ఒంటరి మహిళలకూ దత్తత హక్కుని కల్పించింది చట్టం. మూడు నెలల వయసు లోపు బిడ్డను కనుక ఆమె దత్తత తీసుకున్నట్లయితే, ఆమె ఉద్యోగం చేస్తున్నట్లయితే నిరభ్యంతరంగా మూడునెలల ప్రసూతి సెలవు తీసుకోవచ్చు.

శిశు సంరక్షణ

ఆర్నెల్ల సెలవు తీసుకున్నంత మాత్రాన తల్లి కష్టాలు గట్టెక్కవు. ఆఫీసుకు వెళ్లిపోతే పాలివ్వడం కుదరదు కాబట్టి తమపాలు మాన్పించి పోతపాలు అలవాటు చేస్తారు. కానీ బిడ్డకు కనీసం ఏడాదిపాటు తల్లిపాలు ఇవ్వడం అవసరం అంటారు డాక్టర్లు. దీన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వాలు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. సెలవు పూర్తి చేసుకుని విధుల్లో చేరిన తల్లులు పిల్లలకు పాలివ్వడానికి రోజుకు రెండుసార్లు విరామం తీసుకునే వెసులుబాటూ చట్టంలో ఉంది. అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడం సంస్థల బాధ్యత అని ప్రసూతి చట్టానికి 2017లో చేసిన సవరణలో పేర్కొన్నారు. యాభై మందికి మించి ఉద్యోగులున్న ప్రతి సంస్థా కార్యాలయం ఆవరణలోనే తప్పనిసరిగా శిశుసంరక్షణ కేంద్రాన్ని(క్రెష్‌) ఏర్పాటుచేయాలి. పిల్లల్ని చూసుకోవడానికి తగిన సిబ్బందిని నియమించాలి. పిల్లలకు బడిలో చేర్చే వయసు వచ్చేవరకూ తల్లులు ఈ క్రెష్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మధ్య మధ్యలో వెళ్లి పిల్లల్ని చూసిరావచ్చు.

వారికి... రెండేళ్లు అదనం!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం(సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌) చేస్తున్న మహిళలకైతే ప్రసూతి సెలవే కాకుండా ఆ తర్వాత కూడా పిల్లల కోసం రెండేళ్లు (730 రోజులు) చైల్డ్‌ కేర్‌ లీవ్‌ సౌకర్యం ఉంది. పిల్లలు పెరిగే క్రమంలో అనారోగ్యం, పరీక్షలు లాంటి సందర్భాల్లో ఈ సెలవు పెట్టుకోవచ్చు.పిల్లలకు పద్దెనిమిదేళ్లు నిండేలోపల ఇద్దరు పిల్లల కోసం దీన్ని వాడుకోవచ్చు. దివ్యాంగులైన పిల్లలైతే వయోపరిమితి లేదు. ఒకేసారి రెండేళ్ళు కాకుండా ఏడాదిలో మూడు సార్లకి మించకుండా ఎన్నిసార్లయినా పెట్టుకోవచ్చు. సింగిల్‌ పేరెంట్‌ అయితే ఏడాదికి ఆరుసార్లు వాడుకోవచ్చు. మొదటి 365 రోజులకు పూర్తిగా, తర్వాత 365 రోజులకు 80 శాతం వేతనం ఇస్తారు.

విడాకులు తీసుకుంటే...

ఉద్యోగినులుగానే కాదు, కుటుంబపరంగానూ మహిళల హక్కుల్ని కాపాడేందుకు తగిన చట్టాలున్నాయి. దాంపత్య జీవితంలో భాగస్వామితో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా విడిపోతే బిడ్డలకు దూరం కావాల్సి వస్తుందేమోనన్న భయంతోనో, సంపాదన లేని తాను వారిని పోషించలేనేమోనన్న ఆందోళనతోనో సర్దుకుపోయే మహిళలు ఎక్కువగా ఉన్న సమాజం మనది. ‘ఆ పరిస్థితుల్నీ, బిడ్డకు తల్లి అవసరాన్నీ దృష్టిలో పెట్టుకుని ఐదేళ్లలోపు పిల్లల కస్టడీ తల్లికే అప్పజెప్పాలని చెబుతోంది- గార్డియన్‌ అండ్‌ వార్డ్స్‌ చట్టం’ అంటున్నారు ప్రముఖ న్యాయవాది జి.వరలక్ష్మి. తొమ్మిదేళ్లు దాటిన పిల్లల్ని వారి ఇష్టం ప్రకారం ఎవరి దగ్గర ఉంటామంటే వారికి అప్పజెబుతారు. సాధారణంగా మగపిల్లల్ని తండ్రి దగ్గరా ఆడపిల్లల్ని తల్లి సంరక్షణలోనూ ఉంచడానికి ప్రాధాన్యమిస్తారు. అంతేకాదు, పిల్లలు తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి దగ్గర ఉన్నా మరొకరికి వారిని సందర్శించే హక్కు ఉంటుంది. పిల్లలు మైనర్లుగా ఉన్నంతవరకూ తల్లిదండ్రులిద్దరికీ వారి మీద సమాన హక్కులు ఉంటాయి.

ఏ కారణంగానైనా భర్తను కోల్పోయి బిడ్డలతో ఒంటరిగా ఉన్న స్త్రీ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే మామగారి నుంచి మనోవర్తి పొందే వెసులుబాటు కల్పిస్తోంది హిందూ దత్తత మరియు పోషణ చట్టంలోని సెక్షన్‌ 19. మరో సెక్షన్‌ 21లోని ఒక క్లాజ్‌ ప్రకారం చనిపోయిన కొడుకు, కూతుళ్ల పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దదే. వేరే పెళ్లి చేసుకోనంతవరకూ కోడల్నీ పోషించాలి. ఒకవేళ ఆమె మళ్లీ పెళ్లి చేసుకున్నా బిడ్డల మీద హక్కు కోల్పోదు. వారిని అత్తమామలకు అప్పజెప్పనక్కర లేదు. అలాగని బిడ్డలను తానే పెంచితే వారికి సొంత తండ్రి ఆస్తి రాదన్న భయమూ లేదు. దాన్ని భార్యగా తన పేరు మీదికో, బిడ్డల పేరు మీదికో మార్పించుకునే హక్కు ఆమెకు ఉంటుంది. పెళ్లి తర్వాత భర్త ద్వారా తనకు లభించిన వస్తువుల్నీ ఆస్తుల్నీ వదులుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తండ్రి పేరున ఏమీ లేకున్నా తాతకి పిత్రార్జితపు ఆస్తి ఉంటే అందులోనూ పిల్లలకు వాటా వస్తుంది. అందుకు వారు అభ్యంతరం చెబితే ఆ ఆస్తిని అనుభవిస్తున్నవారి నుంచి భరణం పొందే హక్కు ఆమెకు ఉంది.

వృద్ధాప్యంలో సంరక్షణ

భర్తను కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్న మహిళలు ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ. అలాంటి కొన్ని కోట్లమంది సహజంగానే పిల్లల మీద ఆధారపడి బతుకుతున్నారు. వీరందరూ తమ వృద్ధాప్యాన్ని గౌరవంగా పిల్లలూ మనవల సంరక్షణలో ఆనందంగా గడుపుతున్నారా అంటే లేదనే చెబుతున్నాయి సమాజంలో తరచూ వెలుగులోకి వస్తున్న సంఘటనలు. ఎన్ని వ్యయప్రయాసలకోర్చి అయినా పిల్లల్ని పెంచి పెద్ద చేయడం పెద్దల బాధ్యత అయితే, వృద్ధాప్యంలో ఆ పెద్దల్ని పసిపాపల్లా కనిపెట్టుకుని ఉండడం కన్న బిడ్డల కనీస కర్తవ్యం అన్నది తరతరాలుగా మన సమాజం ఆచరిస్తున్న విధానం. ఇప్పుడా కర్తవ్యాన్ని మరిచి ఆస్తి మాత్రం తీసుకుని పెద్దలను అనాథలుగా రోడ్డున వదిలేస్తున్న బిడ్డల కథలు తరచూ వింటున్నాం. ఆ స్థితినుంచి పెద్దల్ని కాపాడడానికీ ఓ చట్టం ఉంది. 2007లో తెచ్చిన సీనియర్‌ సిటిజెన్‌ చట్టం- తల్లిదండ్రుల్నీ తాతలూ బామ్మల్నీ కూడా పోషించడం పిల్లల బాధ్యత అని చెబుతోంది. వాళ్లని తమ దగ్గర ఉంచుకుని ప్రేమగా చూసుకోవడం, విడిగా ఉంటే నెల నెలా ఇంటి నిర్వహణకు డబ్బు ఇవ్వడం, సమయానికి వైద్యం చేయించడం... పిల్లలు చేసి తీరాలంటోంది. పిల్లలు లేనివారికి బంధువుల్లో వారి ఆస్తికి ఎవరైతే వారసులు అవుతారో వారే పోషణ బాధ్యతనూ వహించాలి. అలా చూడనప్పుడు కన్నబిడ్డల దగ్గరినుంచీ అయినా, వారసుల దగ్గరినుంచి అయినా తమ ఆస్తిని తిరిగి తీసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. బిడ్డల నిరాదరణకు గురవుతున్న వారెవరైనా స్వయంగా కానీ, మరొకరి సహాయంతో కానీ కలెక్టర్‌ కార్యాలయానికి ఒక దరఖాస్తు పంపితే చాలు, వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు.

ఈ చట్టాలన్నీ కూడా మహిళల హక్కుల్ని కాపాడుతూ వారి సాధికారతకు బాటవేస్తున్నాయి. ఉద్యోగ భద్రతా వేతనంతో కూడిన ప్రసూతి సెలవూ ఇవ్వడం వల్ల సమాజానికి చాలా మేలు జరుగుతోందని అధ్యయనాలు చాటుతున్నాయి. విశ్రాంతి వల్ల తల్లుల ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు కాబట్టి బిడ్డల పోషణ మీద దృష్టి పెట్టగలుగుతున్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల వినియోగం పెరిగింది. వారి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతోంది. శిశుమరణాలు బాగా తగ్గాయి. ఒత్తిడి లేకుండా కలిసి గడిపే సమయం పెరగడం వల్ల తల్లీబిడ్డల మధ్యా, కుటుంబసభ్యుల మధ్యా బంధాలు బలపడుతున్నాయి. అమ్మ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే... ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉంటుందన్నదే ఈ చట్టాలన్నిటి పరమార్థమూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..