Updated : 19 Dec 2021 03:13 IST

ఆ ‘సైన్స్‌’ సత్తా మనకూ ఉందని నిరూపించా!

ఒక్క ఇంటర్వ్యూతో ఓ విలేకరి కాస్తా సీఎంగా మారిపోయే ‘ఒకే ఒక్కడు’ కథలాంటిదే... విష్ణురెడ్డిది కూడా! కాకపోతే ఆయనేమీ ‘ఒక్కరోజు’ ముఖ్యమంత్రి కాలేదు... ఏళ్లతరబడి ప్రపంచం కోసం పహారాకాసే శాస్త్రవేత్తయ్యాడు. భూమిని ఏ క్షణానైనా ఢీకొట్టే ప్రమాదమున్న ఆస్టరాయిడ్స్‌(గ్రహశకలాలు)పైన నిఘాపెట్టాడు. ప్రపంచం మొత్తం మీద ఆ పరిశోధన చేసే అరుదైన ఐదుగురు శాస్త్రవేత్తల్లో తానూ ఒకడయ్యాడు. తండ్రి తనని యాక్టర్ని చేయాలనుకుంటే తాను జర్నలిస్టయి, అనుకోకుండా సైంటిస్టుగా మారిన విష్ణురెడ్డి కథలోని ఇంకెన్నో మలుపులు... ఆయన మాటల్లోనే..

‘అబ్బా... కరెంటుపోయింది!’ - చిన్నప్పుడు రాత్రిపూట ఈ మాట వింటే చాలు నేను చాలా ఆనందపడిపోయేవాణ్ణి. కరెంటు కోత ఉంటేనే మా డాబాపైకి వెళ్లొచ్చు. నల్లటి రగ్గుపైన తెల్లటి పూలు చల్లినట్టున్న ఆకాశాన్ని తనివితీరా చూడొచ్చు అన్న ఆశ నాది. నేను పెరిగిన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దాదాపు ప్రతిరోజూ ఈ అవకాశం దక్కేది నాకు. అక్కడే మా అమ్మానాన్నలు  వైద్యులుగా ప్రాక్టీస్‌ చేస్తుండేవారు. ఇంట్లో ఇద్దరు అక్కయ్యల తర్వాత నేను. చివరివాణ్ణి కాబట్టి బాగా అల్లరిచేసేవాణ్ణి. నేను కాస్త కుదురుగా దృష్టినిలిపి చూసే విషయం ఆకాశంలోని నక్షత్రాల్నే. అమ్మ నాకు బువ్వపెడుతూ చందమామనే కాదు... ఆకాశంలోని ఇతర వింతల్నీ చూడటం నేర్పింది. 1980ల్లో ఓసారి మూడు గ్రహాలు ఒకేచోటకి చేరే అరుదైన ఘటనని చూపించింది. ఎనిమిదేళ్లప్పుడు అనుకుంటాను... హేలీ తోకచుక్క వచ్చినప్పుడు- నాకే కాదు, ఇంటిల్లి పాదికీ దాన్ని ఎలా చూడాలో అమ్మే నేర్పింది. అలా ఆకాశంలోని వింతలూ విశేషాలూ చూసేవేళల్లో తప్ప నాదెప్పుడూ అల్లరల్లరే. అమ్మని బాగా సతాయిస్తుండేవాణ్ణి. అది భరించలేక ఒక్కోసారి ‘నేను నీకు ఇక కనిపించను. వెళ్లిపోతా...’ అంటూ బెదిరిస్తుండేది. కానీ ఓసారి... నిజంగానే వెళ్లిపోయింది. అమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. నాకు అప్పుడు పన్నెండేళ్లు... అమ్మ ఇక తిరిగిరాదని తెలిసే వయసే అయినా ‘లేదు వస్తుంది’ అని మనసు మారాం చేస్తుండేది. తెలిసీతెలియని ఆ ఉద్వేగాల నడుమే నాన్న నన్ను చెన్నైలోని ఓ రెసిడెన్షియల్‌ స్కూల్లో చేర్చారు. ఒంటరిగా బతకగలగడం నా జీవితంలో అప్పట్నుంచే మొదలైంది...

తొలి టెలిస్కోపు...

ఆకాశాన్ని పరిశీలించడం అన్నది... అమ్మ ద్వారా నాకొచ్చిన అలవాటు కావడం వల్లనేమో తను దూర మయ్యాక ఆ హాబీకి మరింతగా దగ్గరయ్యాను. రాత్రిళ్లు నక్షత్రాలని చూస్తూ నిద్రపోయేవాణ్ణి. అప్పట్లోనే పత్రికల్లో అంతరిక్షానికి సంబంధించిన వార్తల్ని సేకరించడం మొదలుపెట్టాను. ఒంటరితనాన్ని మరచిపోవడానికేమో మంచి చిత్రకారుణ్ణి కూడా అయ్యాను... ఫొటోగ్రఫీలోనూ పట్టు సాధించాను. ఇన్ని వ్యాపకాలతో నాకు టెన్త్‌లోనూ, ప్లస్‌ టూలోనూ అరకొర మార్కులే వచ్చాయి. ఇంటర్‌ కాగానే నాన్న ‘సినిమాల్లోకి వెళతావా’ అని అడిగారు. మానాన్న వయసులో ఉన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించారట. ‘చెబితే నమ్మండి...’ అనే సినిమాలో సెకండ్‌ హీరోగానూ, కృష్ణ హీరోగా వచ్చిన ‘చెప్పింది చేస్తా’లో కాస్త కీలక పాత్రలోనూ చేశారట. ఆ తర్వాత ఆయన సినిమాలకు దూరమైపోయినా ఆ రంగంలోని ప్రముఖులతో మంచి పరిచయాలుండేవి. అందుకే నన్ను అటువైపు వెళ్ల మనేవారు. ఆ కారణంతోనే నన్ను బీఎస్సీ విజువల్‌ కమ్యూనికేషన్స్‌ కోర్సులో చేర్చారు. ఆ కోర్సు క్రియేటర్‌గా నాకెన్నో నేర్పింది. అంతేకాదు, నేను ఆకాశాన్ని పరిశీలించడానికీ కావాల్సినంత వెసులుబాటుని ఇచ్చింది. వారాంతాల్లో దగ్గర్లోని ఇంజినీరింగ్‌ కాలేజీకి వెళ్లి అక్కడున్న ఆస్ట్రానమికల్‌ టెలిస్కోపు నుంచి ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయేవాణ్ణి. చివరికి ఓ రోజు పట్టుబట్టి మరీ నాన్నచేత అలాంటి టెలిస్కోపు కొనిపించుకున్నాను. డిగ్రీ అయ్యాక- నాన్న కోరికని కాదనడం ఎందుకని సినిమా రంగంవైపు వెళ్లాను. కొన్ని సినిమాల్లో చిన్నపాత్రల్లో కనిపించాను. కానీ ఆ రంగంలోని ‘అస్థిరత’ నాకు నచ్చలేదు. దాంతో ఏదేమైనా సైన్స్‌కి దగ్గరగానే ఉండాలనుకున్నాను. నాకు తెలిసిన అంతరిక్ష సంగతులు ఆసక్తికరంగా రాయడం అలవాటు చేసుకున్నాను. జర్నలిజంలో అందుకు అవకాశం ఉంటుందని భావించి దిల్లీ ‘ఏషియన్‌ ఏజ్‌’ పత్రికలో చేరాను. అలా మూడేళ్లు గడిచాయి. 1997 ఫిబ్రవరి నెల అనుకుంటాను... నా పేజర్‌కి ఓ మెసేజ్‌ వచ్చింది. ‘అమెరికాలోని ప్రముఖ శాస్త్రవేత్త టామ్‌ గెరెల్స్‌ ఇండియా వచ్చాడు. ప్లానెటోరియంలో మాట్లాడుతున్నాడు’ అన్నది దాని సారాంశం. టామ్‌ గెరెల్స్‌ ప్రపంచ టాప్‌ సైంటిస్టుల్లో ఒకరు. ఆస్టరాయిడ్స్‌పైన పరిశోధనలు చేస్తుంటారు. ఆయన ప్రసంగంలో మాకు మంచి వార్త దొరుకుతుందనుకుని బయల్దేరాను...

ఓ ఛాలెంజ్‌

ఆ రోజు టామ్‌ గెరెల్స్‌ విశ్వంలోని ప్రతి అంశంపైనా మాట్లాడారు కానీ అవేవీ మాకు వార్తగా పనికొచ్చేవి కావు. దాంతో ఆయన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేద్దామనుకున్నాను. ఆయనకి టైమ్‌లేక హోటల్‌కి వెళ్లేదారిలో కారులోనే ఇంటర్వ్యూ ఇస్తామన్నారు. అలా ఆస్టరాయిడ్స్‌ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇద్దరం మాటల్లోపడి కారుదిగి హోటల్‌కి వచ్చేశాం. ఆ తర్వాత నేను సెలవు తీసుకుంటూ - నాకు అంతరిక్షంపైన ఉన్న ఆసక్తిని వివరించి ‘నాలాంటి అమెచ్యూర్స్‌ కూడా దీనిపైన పరిశోధనలు చేయొచ్చా?’ అని అడిగాను. ఆయన నావైపు చిరునవ్వుతో చూస్తూ ‘మీ భారతీయుల కెప్పుడూ తక్షణ ప్రయోజనాలిచ్చే టెక్నాలజీపైనే చూపు. ఆస్టరాయిడ్స్‌వల్ల రేపు ప్రపంచానికి ముప్పుందన్నా సరే... వాటిని పట్టించుకోరు. ఆ పనేదో తమ కోసం ‘నాసా’వాళ్లు చేస్తారులే అన్న ధోరణి మీది!’ అన్నారు. ఆ మాటలకి నాకు కోపమొచ్చింది... ‘అందరూ అలా ఉండరు!’ అన్నాను ఉక్రోషంగా. ‘నేను చూసిన చాలా మంది అలాగే ఉన్నారు. ఆస్టరాయిడ్స్‌పైన పరిశోధన చేస్తామని నమ్మబలికి పత్తాలేకుండా పోయారు. నువ్వూ వాళ్లలో ఒక్కడివైనా ఆశ్చర్యపోను!’ అన్నారు టామ్‌. నేను కోపాన్ని తమాయించుకుని ‘చూస్తూ ఉండండి. నేను ఆస్టరాయిడ్‌ పరిశోధకుడిగా మీ ముందుకొస్తాను!’ అని వచ్చేశారు. బహుశా-చిన్నప్పటి నుంచి అంతరిక్షంపైన నాకున్న ఏదో అనురక్తిని ఆ సవాలు నిద్రలేపిందేమో తెలియదు. అప్పటి నుంచి ప్రతిరోజూ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఒంటిగంట దాకా విలేకరిగా పనిచేసేవాణ్ణి, ఆ తర్వాత ఉదయం ఆరుగంటల దాకా ఆస్టరాయిడ్స్‌పైన నెట్‌లో పరిశోధిస్తూ ఉండిపోయేవాణ్ణి.

ఇంతకీ ఏమిటివి?

గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్‌) అంటే గ్రహం నుంచి ఊడిపడ్డ శకలాలు కాదు... ఇంకా గ్రహంగా ఏర్పడని శకలాలు. మన భూమి కూడా ఒకప్పుడు అలా చిన్న శకలంగా తిరుగుతూ ఉండి... పెద్దదై ఇప్పుడు ఓ ప్రత్యేక గ్రహంలా మారింది. విశ్వంలో ఇలాంటి ఆస్టరాయిడ్స్‌ లక్షల్లో ఉంటాయి. ఒక్కోసారి ఇవి భూమికి ప్రమాదకరంగానూ మారతాయి. ఆరున్నరకోట్ల సంవత్సరాలకి ముందు ఇలాంటి ఆస్టరాయిడ్‌ ఒకటి భూమిని ఢీకొనడంతో అప్పటికే ఇక్కడున్న డైనోసార్లు సహా 98 శాతం జీవజాలం నశించిందంటారు. ‘మరి అలాంటి ఆస్టరాయిడ్‌ మళ్లీ వస్తే...?’ ఈ భయంతోనే అమెరికాలో వాటిపైన పరిశోధనలు సాగుతున్నాయి. నేను ఇంటర్వ్యూ చేసిన టామ్‌ గెరెల్స్‌ ఆధ్వర్యంలోనే ఆరిజోనా వర్సిటీలో ఇవన్నీ జరుగుతుండేవి. ఆయనతో ఛాలెంజ్‌ చేశాక నేనూ ఓ కొత్త ఆస్టరాయిడ్‌ను కనిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా దగ్గరున్న టెలిస్కోపు ఇందుకు సరిపోలేదు... మరింత పెద్దవి కావాల్సొచ్చాయి. అందుకోసం మనదేశంలోని పలు ప్రభుత్వ అబ్జర్వేటరీలకి వెళ్తే, జర్నలిస్టుగా నేనేదో ‘స్టింగ్‌ ఆపరేషన్‌’ కోసం వచ్చానని లోపల అడుగుపెట్టనిచ్చేవారు కాదు. అప్పుడే ఆన్‌లైన్‌ ద్వారా రాయ్‌ టకర్‌ అనే శాస్త్రవేత్త నాకు మిత్రుడయ్యాడు. అతను నా బాధలు చూడలేక ‘నువ్వు అమెరికా వచ్చి నా టెలిస్కోపునీ ల్యాబ్‌నీ ఇందుకోసం వాడుకోవచ్చు!’ అన్నాడు. వెంటనే అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాకానీ... అప్పుడే నా నెత్తిన పిడుగుపడ్డట్టు ‘సెప్టెంబర్‌ 11’ దాడులు జరిగాయి. దాంతో  అమెరికా వీసాలివ్వడం దాదాపు ఆపేసింది!

‘భారత్‌’ అనే పేరుపెట్టాను!

ఎట్టిపరిస్థితుల్లోనూ వీసా రాదు అన్న అపనమ్మకంతోనే అమెరికన్‌ ఎంబసీకి వెళ్లాను. అక్కడున్న అధికారి అందర్నీ అడిగినట్టే ‘అమెరికా ఎందుకు వెళ్లాలను కుంటున్నావు’ అని ప్రశ్నించారు. ‘ఆస్టరాయిడ్‌ని కనిపెట్టడానికి!’ అని చెప్పగానే ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేశాడు. గ్రహ శకలాలపై చాలా లోతైన ప్రశ్నలు వేసి సంతృప్తిగా ‘నీకో నెలకి వీసా ఇస్తాను’ అన్నాడు. ‘నాకు కనీసం మూడునెలలు కావాలి. కాదు అంటే నాకు మీరు వీసా ఇవ్వక్కర్లేదు!’ అని చెప్పాను. ‘చాలామంది ఆ ఒక్కనెలే చాలని ఎగిరిగంతేస్తారు. ఆలోచించుకో..!’ అన్నాడు. నేను నా మాటమీదే నిలబడ్డాను. ఆ పట్టుదల అతనికి నచ్చిందేమో కోరినన్ని రోజులు ఇచ్చాడు. నేను వెనుదిరుగుతూ ‘అవునూ... ఆస్టరాయిడ్స్‌పైన మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు’ అని అడిగాను. పెద్దగా నవ్వేసి ‘నేనూ నీలాగే అమెచ్యూర్‌ శాస్త్రవేత్తని’ అన్నాడు. కేవలం ఆ కారణంగానే నా అమెరికా ట్రిప్‌ కన్‌ఫర్మ్‌ అయ్యిందని చెప్పాలి! ఫ్లైట్‌ టికెట్టుకి కావాల్సిన డబ్బు కోసం దిల్లీలో నేనుంటున్న ఇంటి సామాన్లన్నీ అమ్మేశాను. అమెరికాలోని మిషిగన్‌లో దిగి అక్కణ్ణుంచి ఆరిజోనాకి ఫ్లైట్‌లో వెళ్లేందుకు డబ్బుల్లేక బస్సులో వెళ్లాను. ఐదురోజుల ప్రయాణం అది! అక్కడికెళ్లాక ఒక్క క్షణం కూడా వృధాకానివ్వలేదు. కొత్త ఆస్టరాయిడ్‌ కనిపిస్తుందేమోనన్న ఆశతో రోజుకి 20 గంటలపాటు కష్టపడ్డాను. ఎంత వెతికినా ఏడురోజులదాకా నాకేమీ దొరకలేదు. అలా వెతుకుతూ, ఓ సాయంత్రం నిద్రలోకి జారుకున్నాను. నా స్నేహితుడు రాయ్‌టకర్‌ బిగ్గరగా ‘విష్ణూ... నిద్రలే’ అంటుంటే బలవంతంగా కళ్లు విప్పాను. అతని చేతిలో అప్పటిదాకా నేను చూసిన గ్రహశకలాల ప్రింటవుట్లు ఉన్నాయి. నా చేయి పట్టుకుని ఊపుతూ ‘కంగ్రాట్స్‌! నువ్వు కొత్త ఆస్టరాయిడ్‌ను కనిపెట్టావు!’ అన్నాడు. నిజం చెప్పొద్దూ... మొదట అది నాకు కలగానే అనిపించింది. నిజమని గ్రహించిన వెంటనే దానికి... ‘78118 భారత్‌’ అని పేరుపెట్టాను. ఆ తర్వాత...

ఆయన నమ్మలేకపోయారు!

‘మీ సవాలులో నేను నెగ్గాను!’ అంటూ ఉరుకులు పరుగుల మీద టామ్‌ గెరెల్స్‌ ముందు వాలిపోయాను. నన్ను చూసి అప్రతిభుడయ్యారాయన. ‘నీలో ఇంత పట్టుదల ఉందా?!’ అంటూ వచ్చి కౌగిలించు కున్నారు. ఆ రోజు నుంచీ నాకు గురువయ్యారు. ఆయన సూచనమేరకే భారత్‌ వచ్చి జీఆర్‌ఈకి ప్రిపేర్‌ అయ్యాను. యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ డకోటాలో అంతరిక్ష పరిశోధనలపైన మాస్టర్స్‌కి అప్లయ్‌ చేస్తే సీటొచ్చింది. కాకపోతే, సైన్స్‌ బేసిక్స్‌ నేర్చుకోవడం కోసం 15 కోర్సులకి బదులు 45 కోర్సుల్ని చదవాల్సి వచ్చింది. అక్కడే పీహెచ్‌డీ కూడా చేసి టాప్‌ స్టూడెంట్‌గా నిలిచాను. ఆ తర్వాత నా ‘పోస్ట్‌ డాక్టరల్‌’ కోసం ప్రపంచంలోని ప్రఖ్యాత అబ్జర్వేటరీల్లో పనిచేశాను. నాసా చేపట్టిన ప్రతిష్ఠాత్మక డాన్‌ మిషన్‌లో ప్రపంచంలోని టాప్‌-100 శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేపట్టాను. 2011లో మా గురువు టామ్‌ గెరెల్స్‌ కన్నుమూశారు. ఆరిజోనా వర్సిటీలో ఆయన నిర్వహిస్తున్న పదవిని అనూహ్యంగా నాకు అప్పగించారు! భారతీయులూ ఆస్టరాయిడ్స్‌పైన పరిశోధనలు చేయగలరని ఎవరితోనైతే సవాలు విసిరానో... ఆయన స్థానంలో నేను కూర్చోవడంకన్నా ఏం కావాలి అనిపించింది!

ప్రస్తుతం ఆస్టరాయిడ్స్‌పైన ప్రపంచంలో ఐదుగురు శాస్త్రవేత్తలే అధికారికంగా పరిశోధనలు చేస్తున్నారు... వాళ్లలో నేనూ ఒకణ్ణి. అవి భూమిపైకి ఎప్పుడు దూసుకు వస్తాయోనని పహరా కాయడంలాంటి పని ఇది. దాంతోపాటూ ఆస్టరాయిడ్స్‌ల్లో ఉండే ఖనిజాలపైనా లోతుగా పరిశోధన చేస్తున్నాను. అన్నట్టు, నేను నా సహచర శాస్త్రవేత్త లూసిల్‌ని పెళ్ళిచేసుకున్నాను. నా కథంతా విని భారతదేశానికి వెళ్దామని అడుగుతూ ఉంటుంది లూసిల్‌. అందుకోసమైనా తనని త్వరలోనే మన దేశానికి తీసుకొచ్చి... నేను తిరిగిన ప్రదేశాలని చూపించాలని ఉంది! 

- కంభంపాటి సురేశ్‌, ఈనాడు, హైదరాబాద్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని