ఆవిష్కరించారు... అవార్డు అందుకున్నారు!

ఆ ముగ్గురూ పల్లెల నుంచి వచ్చారు. అక్కడి ప్రజల సమస్యలను చూశాక వాటిని పరిష్కరించడానికి తమ మేథస్సును ఉపయోగించారు. అద్భుత ఆవిష్కరణలు చేశారు. దేశ విదేశాల్లోని రైతులకూ, సామాన్యులకూ ఎంతో మేలు చేస్తున్న వారి ప్రయోగాలు...  జాతీయ అంతర్జాతీయ గుర్తింపునూ సాధించాయి.

Published : 23 Oct 2022 00:26 IST

ఆవిష్కరించారు... అవార్డు అందుకున్నారు!

ఆ ముగ్గురూ పల్లెల నుంచి వచ్చారు. అక్కడి ప్రజల సమస్యలను చూశాక వాటిని పరిష్కరించడానికి తమ మేథస్సును ఉపయోగించారు. అద్భుత ఆవిష్కరణలు చేశారు. దేశ విదేశాల్లోని రైతులకూ, సామాన్యులకూ ఎంతో మేలు చేస్తున్న వారి ప్రయోగాలు...  జాతీయ అంతర్జాతీయ గుర్తింపునూ సాధించాయి.


కొబ్బరికాయ ఒలిచేలా...

లభై సెకన్లలో ఒక కొబ్బరికాయ పీచు తీయడం కుదురుతుందా? కేరళకు చెందిన కేసీ సిజోయ్‌ తయారు చేసిన ఒక యంత్రం ఆ పనిని అతి సులువుగా చేసేస్తుంది. సౌదీ అరేబియాలోని ఒక పరిశ్రమలో కొన్నేళ్లు పనిచేసిన తరవాత సిజోయ్‌ సొంత రాష్ట్రానికి తిరిగొచ్చాడు. జీవనోపాధి కోసమని కొబ్బరిబోండాలు అమ్ముదామనుకున్నాడు. కానీ తోపుడు బండ్లపైన కొబ్బరి నీళ్లు అమ్మేవాళ్లు ఆ కాయల్ని కొట్టడానికి చాలా ఇబ్బంది పడటం గమనించాడు. దాంతో ఆ టెక్నాలజీని కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. పదేళ్ల పాటు కష్టపడి ఒక యంత్రాన్ని తయారు చేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ కొబ్బరికాయల పీచును ఒలిచేందుకు అది ఉపయోగపడింది. దానికి పేటెంట్‌ కూడా తీసుకుని కూకుస్‌ ఇండస్ట్రీస్‌ పేరిట వ్యాపారం ప్రారంభించిన సిజోయ్‌- కొబ్బరికాయల్ని ఒలిచి వాటిని సూపర్‌మార్కెట్‌లకు అందిస్తున్నాడు. అంతేకాదు, తన ఆవిష్కరణను ఇంకా అభివృద్ధి చేయడానికి ఈ మధ్యనే రూ.25 లక్షల కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ను అందుకున్నాడు. త్వరలో ఆ యంత్రాల్నీ మార్కెట్‌లోకి తీసుకురావాలనుకుంటున్నాడు సిజోయ్‌.


పోషకాల సజ్జలు

దో ఒకటి తిన్నంత మాత్రాన ఒంటికి బలం రాదు. సరైన పోషకాహారం తీసుకుంటేనే ఆ శక్తి సమకూరుతుంది. కానీ, పేదలు ఎక్కువగా ఉన్న మన దేశంలో అందరికీ అలాంటి తిండి లభించాలంటే సాధ్యమా? కాబట్టే పోషకాహార లోపంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యను అరికట్టడానికి- అత్యధిక సూక్ష్మపోషకాలతో నిండిన సజ్జల (పెర్ల్‌ మిల్లెట్‌) వంగడాన్ని సృష్టించాడు మన దేశానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ మహాలింగం గోవింద్‌రాజ్‌. అందుకుగాను ప్రతిష్ఠాత్మకమైన నార్మన్‌ ఇ.బోర్లాగ్‌ క్షేత్రపరిశోధన అవార్డునూ, రూ.8 లక్షల నగదు బహుమతినీ గెలుచుకున్నాడు. తమిళనాడులోని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన గోవింద్‌రాజ్‌- కిళ్లికులం వ్యవసాయ కళాశాల, కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని డాక్టరేట్‌ పట్టా అందుకున్నాడు. 2011లో హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తూ... సజ్జల్లో సూక్ష్మపోషకాలను పెంచే (బయోఫోర్టిఫికేషన్‌) ప్రాజెక్టును చేపట్టాడు. అలా ఐరన్‌, జింక్‌ పోషకాలతో కూడిన సజ్జలను ఆవిష్కరించి ‘ధనశక్తి’ అని నామకరణం చేశాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 1.20 లక్షల మంది రైతులు ఆ సజ్జలను సాగు చేస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లోనూ ఎంతోమంది ఆ సజ్జలను ఆహారంగా తీసుకుంటున్నారు.


సహజంగా ఆరబెట్టేలా...

మార్కెట్లలో సాయంత్రం చీకట్లు ముసురుతున్న కొద్దీ కూరగాయలను చిరువ్యాపారులు ఎంతోకొంతకు అమ్మేసుకుంటూ ఉంటారు. రోజులు గడిస్తే అవి కుళ్లిపోయి పనికి రాకుండా పోతాయి కాబట్టి. అందుకే రేట్లు తగ్గించి అయినా అమ్మేస్తారు. కొన్నిసార్లు మిగిలిపోయిన వాటిని అక్కడే పారబోసి ఉసూరుమంటూ వెళ్లిపోతారు. మహారాష్ట్రలోని రైతుకుటుంబానికి చెందిన వైభవ్‌ టిడ్కే... కృత్రిమ ప్రిజర్వేటివ్‌ ఏమీ కలపకుండా, ఆ కూరగాయల్లోని పోషకాలు పోకుండా వాటిని భద్రంగా నిల్వచేసే యంత్రాన్ని కనుక్కున్నాడు. అలా అతను తయారుచేసిన సోలార్‌ కండక్టర్‌ డ్రయర్‌... కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం, మసాలా దినుసుల వంటి వాటిని సహజసిద్ధంగా ఎండబెట్టి భద్రపరిచేందుకు సాయపడుతోంది. ఇండియాతో పాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, వియత్నాం, ఫ్రాన్స్‌, జమైకా, కెన్యాలలో దాన్ని ఇప్పుడు ఎంతో మంది రైతులు వాడుతున్నారు. సోలార్‌ కండక్టర్‌ డ్రయర్‌ ద్వారా రైతుల ఆదాయం పెరగడంతోపాటు ఏడాదికి దాదాపు 22,500 టన్నుల ఆహార పదార్థాలు వృథాగా మట్టిపాలు కాకుండా ఉంటున్నాయట. అందుకే వైభవ్‌ స్టార్టప్‌ ‘ఎస్‌4ఎస్‌ టెక్నాలజీస్‌’... ఫుడ్‌ విభాగంలో ఈ మధ్య యూఏఈకి చెందిన ప్రతిష్ఠాత్మక జాయేద్‌ సస్టెయినబిలిటీ అవార్డుతోపాటు కోటిరూపాయల నగదు బహుమతినీ అందుకుంది. కూరగాయలూ, పండ్లలోని తేమ శాతాన్ని తగ్గించి వాటి జీవిత కాలాన్ని పెంచే ఫూడర్‌ అనే మరో సోలార్‌ డ్రయర్‌ని కూడా వైభవ్‌ బృందం తయారుచేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..