చిలకపచ్చని చిట్టి చామంతులివి..!

పెళ్లివేదిక, పెళ్లి మంటపం అలంకరణ, పూలదండలు లేదా వరమాల అనగానే ఎవరికైనా గుబాళించే గులాబీలతోనో లిల్లీపూలతోనో గుదిగుచ్చినవే గుర్తుకొస్తాయి. కానీ ఈమధ్య సరికొత్త పూలమాలలు వధూవరుల

Updated : 23 Jan 2022 07:15 IST

చిలకపచ్చని చిట్టి చామంతులివి..!

పెళ్లివేదిక, పెళ్లి మంటపం అలంకరణ, పూలదండలు లేదా వరమాల అనగానే ఎవరికైనా గుబాళించే గులాబీలతోనో లిల్లీపూలతోనో గుదిగుచ్చినవే గుర్తుకొస్తాయి. కానీ ఈమధ్య సరికొత్త పూలమాలలు వధూవరుల మెడలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అవే ఆకుపచ్చని చామంతి పూలదండలు!

బంతి పూల మాదిరిగానే చామంతి పూలనీ పండుగలూ వేడుకల్లో అలంకరణార్థం వాడటం తెలిసిందే. అవన్నీ కాస్త పెద్ద సైజులో పసుపూ ఎరుపూ తెలుపూ రంగుల్లోనే ఉంటాయి. కానీ ఇప్పుడు అచ్చంగా చామంతులతోనే అదీ ఆకుపచ్చని చిట్టి చామంతులతో వరమాలల్ని కడుతున్నారు. చామంతులు ఆకుపచ్చ రంగులోనూ ఉంటాయా... వాటితో పూలమాలల్నీ అల్లేస్తున్నారా అనిపిస్తోంది కదూ... ప్రకృతిలో రంగుల పుష్పాలు ఉన్నట్లే ఆకుపచ్చని పువ్వులూ ఉన్నాయి.

అందాల ఆకుపచ్చని పువ్వు!

ఏ మొక్కకయినా సహజంగా ఆకులు మాత్రమే పచ్చగా ఉంటాయి. పువ్వులు మాత్రం రంగురంగుల్లోనే వికసిస్తాయి. ఆకుల్లోని క్లోరోఫిల్‌తో మొక్క ఆహారాన్ని తయారుచేసుకుంటే, సంతానోత్పత్తిలో భాగంగా కీటకాలను ఆకర్షించేందుకు రంగుల్లో పుష్పిస్తుంది. అరుదుగా కొన్ని మొక్కలు మాత్రం కెమోఫ్లేజ్‌లో భాగంగా అంటే- పూలను తినే కీటకాలనుంచి రక్షించుకునే క్రమంలో పచ్చరంగులోనూ విరుస్తాయి. అలా విరిసేవాటిల్లో గులాబీలూ బంతులూ చామంతులూ... ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఇవి మొక్క రంగులోనే కలిసిపోతాయి కాబట్టి అందంగా ఉండవన్న కారణంతో ఒకప్పుడు ఆకుపచ్చని పూలమొక్కల్ని అంతటా పెంచేవారు కాదు. క్రమంగా అలంకరణలో భాగంగా ఆకుపచ్చ అందాన్ని గుర్తించిన ఫ్లోరిస్టులు ఈ రంగుపూలతో బొకేల్ని రూపొందించడంతో ఒక్కసారిగా వాటికి డిమాండ్‌ పెరిగిపోయింది. అలా వచ్చినవే ఈ చిట్టిపొట్టి చిలకపచ్చ బటన్‌ చామంతులు. వీటినే బటన్‌ మమ్స్‌ అనీ అంటారు.

విరిసీవిరియనట్లుగా దగ్గరగా ఉండే రేకులతో ఈ బటన్‌ చామంతులు చూడ్డానికి ముద్దుగా ఉంటాయి. త్వరగా వాడిపోవు. ఈ మొక్కలు కూడా చలినీ వేడినీ తట్టుకుని అన్నికాలాల్లోనూ పూస్తుంటాయి. సహజంగానే ముద్దుగా ఉండే వీటిని దగ్గరగా మాలగా కూర్చినప్పుడు మరింత అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా బ్యాక్‌డ్రాప్‌ డెకరేషన్‌లో ఎంబ్రాయిడరీ చేసినట్లుగా అనిపించేందుకు ఈ ఆకుపచ్చని బటన్‌ చామంతుల్ని ఎక్కువగా వాడుతున్నారు. దాంతో దండలతోపాటు పెళ్లి వేదిక అలంకరణలోనూ ఈ చామంతులు అందంగా విరుస్తున్నాయి.

బటన్‌ చామంతుల్లో రంగులనేకం ఉండగా ఆకుపచ్చే ఎందుకూ అంటే- ఏ చీర, సూట్‌ మీదయినా ఈ రంగు కొట్టొచ్చినట్లు కనిపించడంతోపాటు తెలుపూ నారింజ పసుపూ ఎరుపూ... ఇలా ఏ రంగు పూలమధ్యలోనైనా ఆ రంగు అందంగా ఒదిగిపోవడం ఒక కారణమైతే, ఆ రంగులోని కొత్తదనమే మరో కారణం. మిగిలిన రంగులతో పోలిస్తే ఆకుపచ్చరంగు శుభప్రదం, పునరుజ్జీవానికీ పెరుగుదలకీ ప్రతీక అన్న కారణంతో కూడా పెళ్లి పూలదండల్ని వీటితోనే గుదిగుచ్చు తున్నారు. పైగా ఈ రంగుని చూసినప్పుడు కళ్లకి ఒకలాంటి ప్రశాంతత కలుగుతుంది. ఆనందంగానూ ఆహ్లాదంగానూ అనిపిస్తుంది. పెళ్లిలో ప్రకాశవంతమైన రంగుల్ని చూసీ చూసీ అలసిపోయిన కళ్లకి ఆకుపచ్చ రంగు ఒకింత హాయినిస్తుంది. అందుకే వీటిని వేజు ల్లోనూ బొకేల్లోనూ కూడా అలంకరిస్తున్నారు. రోజూ కాసేపు పచ్చదనాన్ని చూడటంవల్ల కళ్ల సమస్యలూ తగ్గుతాయి అంటారు యోగశాస్త్ర నిపుణులు. దాంతో చిలకపచ్చని చామంతి మొక్కలు నర్సరీల్లోనూ కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద పెళ్లి అలంకరణలోనూ దేవీదేవతల పూలమాల ల్లోనూ వధూవరుల వరమాలల్లోనూ ఆకుపచ్చ చామంతులే నయా ట్రెండ్‌ అనేస్తున్నారు ఫ్లారిస్టులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..