క్రిస్మస్‌ విందు.. వారెవ్వా!

నక్షత్ర కాంతులతో మిరుమిట్లు గొలిపే ముంగిళ్లూ... ఏసు ప్రభువుకు భక్తితో చేసే ప్రార్థనలూ... అతిథులతో కళకళలాడే లోగిళ్లూ...

Updated : 25 Dec 2022 00:47 IST

క్రిస్మస్‌ విందు.. వారెవ్వా!

నక్షత్ర కాంతులతో మిరుమిట్లు గొలిపే ముంగిళ్లూ... ఏసు ప్రభువుకు భక్తితో చేసే ప్రార్థనలూ... అతిథులతో కళకళలాడే లోగిళ్లూ... ఇలా క్రిస్మస్‌ వేడుక అంటేనే ఓ సంబరం. మరి ఆ రోజున చేసుకునే వంటకాలూ కాస్త ప్రత్యేకంగానే ఉండాలిగా...  


ప్లమ్‌ పుడ్డింగ్‌

కావలసినవి: కిస్‌మిస్‌: అరకప్పు, చెర్రీలు: అరకప్పు, ఖర్జూర పలుకుల తరుగు: అరకప్పు, నల్లద్రాక్ష: పావుకప్పు, టూటీఫ్రూటీ: అరకప్పు, కమలాఫలం రసం: కప్పు, జీడిపప్పు-బాదం పలుకులు: ముప్పావుకప్పు చొప్పున, ఎండు ఆప్రికాట్లు: అరకప్పు, బ్రెడ్‌పొడి: కప్పు, మైదా: అరకప్పు, గుడ్లు: రెండు, బేకింగ్‌పౌడర్‌: చెంచా, బ్రౌన్‌షుగర్‌: కప్పు, చాక్లెట్‌పొడి: రెండు టేబుల్‌స్పూన్లు, చల్లని వెన్న: కప్పు, దాల్చినచెక్కపొడి: చెంచా, జాజికాయపొడి: చెంచా, ఉప్పు: అరచెంచా, వెనిల్లా ఎసెన్స్‌: రెండు చెంచాలు.
తయారీ విధానం: ఒక రోజు ముందుగా కమలాఫలం రసంలో కిస్‌మిస్‌, చెర్రీలు, ఖర్జూర తరుగు, నల్లద్రాక్ష, టూటీఫ్రూటీ, ఎండు ఆప్రికాట్‌ ముక్కలు వేసుకుని బాగా కలపాలి. మర్నాడు ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలో తీసుకుని అందులో వెన్న తప్ప ఒక్కో పదార్థాన్ని వేసుకుంటూ బాగా కలపాలి. తరువాత వెన్నను వేసి మరోసారి కలిపి ఈ మిశ్రమాన్ని పుడ్డింగ్‌ మౌల్డ్‌లో తీసుకుని బిగుతుగా మూత పెట్టాలి. ఇప్పుడు ఈ పాత్రను సిమ్‌లో ఆవిరిమీద నాలుగు గంటలు ఉడికించుకుని తీసుకోవాలి.  


డేట్స్‌ ఆల్మండ్‌కేక్‌

కావలసినవి: ఖర్జూర ముక్కలు: కప్పు (నీళ్లతో ముద్దలా చేసుకోవాలి), బాదం పొడి: పావుకప్పు, గోధుమ పిండి: కప్పు, బాదంపాలు: పిండి కలిపేందుకు, ఓట్స్‌పొడి: కప్పు, దాల్చినచెక్కపొడి: అరచెంచా, బేకింగ్‌పౌడర్‌: చెంచా, యాలకులపొడి: చెంచా, ఉప్పు: అరచెంచా, వెన్న: అరకప్పు, గుడ్డు: ఒకటి, వెనిల్లా ఎసెన్స్‌: అరచెంచా, బాదంపలుకులు: అరకప్పు.

తయారీ విధానం: ఓ గిన్నెలో గోధుమపిండి, ఓట్స్‌పొడి, బాదంపొడి, దాల్చినచెక్కపొడి, బేకింగ్‌ పౌడర్‌, యాలకులపొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. మరో గిన్నెలో వెన్న, గుడ్డుసొన, వెనిల్లా ఎసెన్స్‌ వేసుకుని బాగా గిలకొట్టుకోవాలి. ఇందులో గోధుమపిండి మిశ్రమం, ఖర్జూర ముద్ద వేసి బాదంపాలతో కేకు మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్నరాసిన కేకు ట్రేలో తీసుకుని పైన బాదం పలుకుల్ని అలంకరించి... 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందే వేడిచేసి పెట్టుకున్న అవెన్‌లో పెట్టి... ఇరవై అయిదు నిమిషాలు బేక్‌ చేసుకుని తీసుకోవాలి.  


కొబ్బరి కుకీస్‌

కావలసినవి: గోధుమపిండి: అరకప్పు, చక్కెరపొడి: పావుకప్పు, కొబ్బరిపొడి: ఒకటింబావు కప్పు, వెన్న: పావుకప్పు, వెనిల్లా ఎసెన్స్‌: అరచెంచా, పాలు: టేబుల్‌స్పూను, ఉప్పు: పావుచెంచా.

తయారీ విధానం: ఓ గిన్నెలో వెన్న, చక్కెర పొడి వేసి క్రీమ్‌లా వచ్చేవరకూ గిలకొట్టుకోవాలి. ఇందులో కప్పు కొబ్బరి పొడితోపాటు మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని మెత్తని పిండిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుకీల్లా చేసుకుని వాటికి మిగిలిన కొబ్బరిపొడి అద్ది... 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగా వేడిచేసుకున్న అవెన్‌లో ఇరవై నిమిషాలు బేక్‌ చేసుకుని తీసుకోవాలి.


మలబార్‌ చికెన్‌ బిర్యానీ

కావలసినవి: చికెన్‌ ముక్కలు పెద్దవి: కేజీ, కారం: రెండు చెంచాలు, పసుపు: అరచెంచా, నిమ్మరసం: చెంచా, ఉప్పు: తగినంత.మసాలాకోసం: ఉల్లిపాయలు: రెండు పెద్దవి, టొమాటో: ఒకటి, పెరుగు: కప్పు, కొత్తిమీర-పుదీనా తరుగు: కప్పు చొప్పున, గరంమసాలా: ఒకటిన్నర చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, నెయ్యి: అరకప్పు, బాస్మతీ బియ్యం: మూడు కప్పులు (ముందుగా నానబెట్టుకోవాలి), ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు: కప్పు, నేతిలో వేయించిన జీడిపప్పు- కిస్‌మిస్‌ పలుకులు: పావుకప్పు చొప్పున, లవంగాలు: నాలుగు, యాలకులు: రెండు, దాల్చినచెక్క: ఒకటి పెద్దది.

తయారీ విధానం: చికెన్‌ ముక్కలపైన కారం, పసుపు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టౌమీద గిన్నె పెట్టి ముప్పావువుంతు నెయ్యి వేసి ఉల్లిపాయముక్కలు, టొమాటో తరుగు వేయించుకుని కొద్దిగా ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక చికెన్‌ ముక్కలు, పుదీనా-కొత్తిమీర తరుగు, గరంమసాలా, పచ్చిమిర్చి వేసి కలిపి... చికెన్‌ ఉడికిందనుకున్నాక దింపేయాలి. బియ్యాన్ని కడిగి అందులో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, ఆరుకప్పుల నీళ్లు పోసి అన్నాన్ని ముప్పావువుంతు ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకుని అడుగున సగం కూర పరిచి దానిపైన సగం అన్నం... వేయించిన ఉల్లిపాయముక్కలు, సగం జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు వేసి... పైన మళ్లీ అదేవిధంగా చేసుకోవాలి. దీనిపైన మిగిలిన నెయ్యి వేసి మూత పెట్టి ఇరవై నిమిషాలు దమ్‌ పద్ధతిలో సన్నని మంటపైన ఉంచి... దింపేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..