Updated : 15 Mar 2022 22:46 IST

ఈ బ్యాంకులో... క్రీడాసామగ్రి ఉచితం!


అదో బ్యాంకు... అక్కడ పెద్దగా సిబ్బంది ఉండరు కానీ లోన్లు తీసుకోవచ్చు. ఆ వివరాలు పాస్‌బుక్‌లో నమోదవుతాయి కానీ... వడ్డీ, అసలూ లాంటివేవీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే అక్కడ అసలు డబ్బు వ్యవహారాలే జరగవు. ఇదేదో వింతగా ఉందే అంటారా... అవును వింతే. ఎందుకంటే... అది ఔత్సాహిక పేద క్రీడాకారుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘ఫ్రీ స్పోర్ట్స్‌ ఎక్విప్‌మెంట్‌ బ్యాంకు’ మరి. ఎవరైనా సరే... తమకు కావాల్సిన స్పోర్ట్స్‌ కిట్‌ను లోను రూపంలో తీసుకుని, ఆడుకున్నాక తిరిగి ఇచ్చేయొచ్చన్నమాట.

‘మియావ్‌’... అరుణాచల్‌ప్రదేశ్‌, చంగ్‌లంగ్‌ జిల్లాలోని ఓ ఊరు. అక్కడి యువతకు క్రీడలంటే ఇష్టమే కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా శిక్షణ కాదు కదా.. సరదాకు ఆడుకునే అవకాశం కూడా లేదు. దానికి తోడు కొందరు మాదకద్రవ్యాలకు అలవాటు పడటంతో వాళ్లకు అదే ప్రపంచంగా మారి, నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. ఇవన్నీ చూసిన ఐ.ఏ.ఎస్‌ అధికారి, అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ సన్ని.కె.సింగ్‌ ఆ యువతలో మార్పు తేవాలనుకున్నారు. క్రీడలంటే ఆసక్తి ఉన్నవారిని చేరదీసి పార్కర్‌(గాల్లో ఎగురుతూ సాహసాలు చేసే ఆట)లో శిక్షణ ఇప్పించారు. వాళ్లు ఆ ఆటను శ్రద్ధగా నేర్చుకోవడమే కాదు అంతర్జాతీయ పార్కర్‌ పోటీలోనూ పాల్గొని పసిడి, రజత పతకాలను తీసుకొచ్చారు. అది చూశాక సరైన ప్రోత్సాహం అందిస్తే చాలామందిని మెరికల్లా తీర్చిదిద్దొచ్చని అనుకున్న సన్ని.కె.సింగ్‌ తన కార్యాలయంలోని ఓ గదిలో ‘ఉచిత స్పోర్ట్స్‌ ఎక్విప్‌మెంట్‌ బ్యాంకు’ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సరంజామా కొనడానికి అవసరమైన డబ్బును స్థానికుల నుంచీ, తనకు తెలిసిన వారి నుంచీ సేకరించారు. ‘మియావ్‌లో క్రీడాకారులే కాదు ఆటలపైన ఆసక్తి ఉన్నవారూ లేకపోలేదు. వాళ్లందరినీ పిలిచి నా ఆలోచనను వివరించడంతో బాగుందంటూనే తమకు తోచిన సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. వారిలో కొందరు డబ్బును విరాళంగా ఇస్తే, మరికొందరు తమ దగ్గరున్న క్రీడా సామగ్రిని అందించారు. తమ యువతలో మార్పు తెచ్చేందుకు ఇదే సరైన సమయమని వాళ్లూ భావించడం వల్లే ఈ బ్యాంకు ఏర్పాటైంద’ని అంటారు సన్ని.కె.సింగ్‌. అలా ప్రారంభించిన ఈ బ్యాంకులో క్రికెట్‌ కిట్‌ నుంచి టెన్నిస్‌/బ్యాడ్మింటన్‌ రాకెట్లు, టేబుల్‌టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, స్కేటింగ్‌ షూస్‌, క్యారంబోర్డు, చెస్‌బోర్డు వరకూ దాదాపు అన్నీ ఉంటాయి.  

ఎలా పనిచేస్తుందంటే...

క్రీడలపైన ఆసక్తి ఉన్నవారెవరైనా సరే... ఈ బ్యాంకులోని క్రీడాసామగ్రిలో నచ్చినదాన్ని తీసుకెళ్లి... ఆట అయిపోయాక తిరిగి పెట్టేయాల్సి ఉంటుంది. ఈ బ్యాంకులోని వస్తువుల్ని తీసుకునేందుకు నలభై అయిదేళ్లలోపు వాళ్లెవరైనా అర్హులే కానీ... పిల్లలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. అలా తీసుకెళ్లే వారి వివరాలను నమోదు చేసేందుకు ఇక్కడ రెండురకాల పాస్‌బుక్‌లు ఉంటాయి. ఒకటి వ్యక్తిగతంగా తీసుకెళ్లేవారికి ఇస్తే... రెండోదాన్ని బృందంగా ఆడుకోవాలనుకునేవారికి అందిస్తారు. బృందంగా వచ్చి స్పోర్ట్స్‌ కిట్‌లను తీసుకెళ్లేవారు ఏడు రోజుల నుంచి నెలలోపు వాటిని వాపసు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వస్తువులు పోయినా, పాడైపోయినా వాటిని తీసుకెళ్లినవారు ఎలాంటి ఫైన్‌ కట్టాల్సిన అవసరంలేదు కానీ నెలరోజులపాటు మరే క్రీడాసామగ్రిని తీసుకెళ్లకుండా వాళ్ల పాస్‌బుక్‌ను పక్కనపెట్టేస్తారు. ఏ కిట్‌ ఎవరి దగ్గర ఉందీ... ప్రస్తుతం బ్యాంకులో ఎన్నిరకాల ఆటవస్తువులు అందుబాటులో ఉన్నాయి... వంటి వివరాలన్నీ అందరికీ తెలియజేసేందుకు వాట్సాప్‌ గ్రూపు కూడా ప్రారంభించారు అధికారులు.

ఆటలే వ్యాపకం ఇప్పుడు...

ఈ బ్యాంకును ప్రారంభించిన కొత్తలో సరదాగా ఆడుకునేందుకు వస్తువుల్ని తీసుకెళ్లినవాళ్లు కూడా ఇప్పుడు క్రీడల్ని ఓ వ్యాపకంగా మార్చుకుంటున్నారట. దాన్ని చూసిన అధికారులు స్థానికంగా ఉన్న గ్రౌండ్లను శుభ్రం చేసి రాత్రుళ్లు కూడా ఆడుకునేలా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారట. దాంతో స్థానిక క్రీడాకారుల సాయంతోనే ఫుట్‌బాల్‌ నుంచి స్కేటింగ్‌ వరకూ నచ్చినదాన్ని ప్రాక్టీస్‌ చేస్తున్నారట. ‘ఈ బ్యాంకు పెట్టిన కొత్తల్లో ఒకరిద్దరు మాత్రమే వచ్చేవారు. క్రమంగా పిల్లల్లో, యువతలో మార్పు వచ్చింది. రాత్రుళ్లు కూడా వచ్చి నచ్చిన సామగ్రిని తీసుకెళ్తున్నారు. దీన్ని ఇలాగే కొనసాగించి, వీలైనన్ని ప్రాంతాల్లో ఇలాంటి బ్యాంకులను ఏర్పాటు చేయడమే మా ముందున్న లక్ష్యం. త్వరలో పదిమీటర్ల రైఫిల్‌ షూటింగ్‌లో శిక్షణ ఇచ్చేలా వేదికను సిద్ధం చేస్తున్నాం. అదే విధంగా ఒకేచోట స్కేటింగ్‌తోపాటూ సైక్లింగ్‌ కూడా చేసేలా గ్రౌండునీ ఏర్పాటు చేస్తున్నా...’మంటూ వివరిస్తారు సన్ని.కె.సింగ్‌. ‘ఒకప్పుడు ఎవరైనా క్రీడాకారులు గ్రౌండులో ఆడుతుంటే మేం ఆ ఫెన్సింగ్‌ వెనకాల నిల్చుని ఆశ్చర్యంగా చూసేవాళ్లం. ఇప్పుడు మేం కూడా మాకు నచ్చిన ఆటను ఆడగలుగుతున్నాం. మా కంటూ ఓ వ్యాపకం ఉందిప్పుడు’ అంటున్నారు స్థానికులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని