చీతాలను... ఎందుకు తెచ్చుకున్నామంటే...

పేరుకి క్రూరమృగమే. కానీ కనుకొలకుల నుంచి నోటివరకూ ఎవరో కాటుకతో గీత గీసినట్లున్న చారల ముఖంతోనూ పోల్కాడాట్స్‌ దుస్తులేసుకున్నట్లుగా ఒంటి నిండుగా ఉన్న చుక్కలతోనూ పొడవాటి కాళ్లతోనూ అందంగా ఉంటుంది చీతా... గాలిని చీల్చుకుంటూ మెరుపు వేగంతో దూసుకెళ్లే ఏకైక ప్రాణి... పరుగుకి మరో పేరు.

Updated : 05 Mar 2023 04:54 IST

చీతాలను... ఎందుకు తెచ్చుకున్నామంటే...

పేరుకి క్రూరమృగమే. కానీ కనుకొలకుల నుంచి నోటివరకూ ఎవరో కాటుకతో గీత గీసినట్లున్న చారల ముఖంతోనూ పోల్కాడాట్స్‌ దుస్తులేసుకున్నట్లుగా ఒంటి నిండుగా ఉన్న చుక్కలతోనూ పొడవాటి కాళ్లతోనూ అందంగా ఉంటుంది చీతా... గాలిని చీల్చుకుంటూ మెరుపు వేగంతో దూసుకెళ్లే ఏకైక ప్రాణి... పరుగుకి మరో పేరు. అది మన దేశంలో అంతరించిపోయింది, ఇక లేదు అనుకున్న తరుణంలో- ఒకటీ రెండూ కాదు, 20 చీతాలు ఆఫ్రికా ఖండం నుంచి ఆకాశయానాన ప్రయాణించి మరీ భారత భూభాగంలోకి అడుగు పెట్టాయి. ఇందుకోసం ప్రభుత్వం ‘ప్రాజెక్టు చీతా’ను చేపట్టి కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది.  ఈ సందర్భంగా- అసలీ చీతా ఏంటీ... దాన్ని సంరక్షించాల్సిన అవసరం మనకేంటీ... తెలుసుకోవాలంటే..!

దు నెలలక్రితం... గ్వాలియర్‌లో వచ్చి వాలిందో చార్టర్డ్‌ కార్గో విమానం. పులి ముఖం బొమ్మతో ఉన్న ఆ విమానంలోంచి ఎనిమిది చెక్క పెట్టెల్ని ఎంతో జాగ్రత్తగా దించారు సిబ్బంది. వాటిని మళ్లీ అంతే జాగ్రత్తగా మధ్యప్రదేశ్‌లోని శ్యోపుర్‌ జిల్లాలో ఉన్న కునో-పాల్‌పుర్‌ నేషనల్‌ పార్కుకి తరలించారు. అయితే ఆ పెట్టెల్లో ఉన్నవి నిధులూ నిక్షేపాలూ కాదు... సజీవ చీతాలు. నమీబియా నుంచి వచ్చిన వాటిని క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్‌లో ఉంచి, కొన్నాళ్లకు ఒక్కటొక్కటిగా నిర్దేశిత అడవిలోకి వదిలేశారు. ఆ తరవాత కూడా అటవీ సిబ్బంది వాటి బాగోగులు చూస్తూనే ఉన్నారు. ఈ ఐదునెలల్లో అవి ఆరోగ్యంగానే ఉన్నాయి. అంటే- మన వాతావరణానికి బాగానే అలవాటుపడ్డాయన్నమాట. కాబట్టి నిశ్చింతగా మరో పన్నెండు చీతాలను దక్షిణాఫ్రికా నుంచి భారతావనిలోకి స్వాగతించారు. వీటిని తెచ్చేందుకే సుమారు రూ.90కోట్లు ఖర్చయిందట. ఈవిధంగా రానున్న పదేళ్లలో వంద వరకూ ఆఫ్రికన్‌ చీతాల్ని తీసుకొచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఎలా సంరక్షిస్తున్నారు?

ఈ చీతాల ఆలనాపాలన చూసేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మనుషుల వల్ల చీతా ఇబ్బందిపడకుండా ఎన్‌క్లోజర్లకు సమీపంలో మంచెల్లాంటి నిర్మాణాలు ఏర్పాటుచేసి నిఘా పెట్టారు. వాటికి తెరలు కట్టి రంధ్రాల గుండా చీతాల్ని పరిశీలిస్తుంటారు. కదలికల్ని గమనించేందుకు వాటికి రేడియో కాలర్లను అమర్చారు. ఫ్రెడ్డీ, ఆల్డన్‌, ఒబాన్‌, సవన్నా, సాషా, ఆశా, సిబిలి, సియాసా... ఇలా వీటికి పేర్లు పెట్టడం వల్ల ఏది ఎక్కడుందో తెలుసుకోవడం సిబ్బందికి తేలికవుతుంది. నిపుణుల సూచన మేరకు ముందుగా వీటికి గేదె మాంసం పెట్టారట. సాధారణంగా చీతా మూడు నుంచి ఐదు రోజులకోసారి ఆహారం తీసుకుంటుంది. నీళ్లు తాగుతుంది. వీటి రక్షణకోసం సాత్పురా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి కాపలా కాయడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న లక్ష్మి, సిద్ధాంత్‌... అనే రెండు ఏనుగుల్నీ తీసుకొచ్చారు. ఇవి చీతాలకు కేటాయించిన ప్రత్యేక క్లోజర్లలోకి వచ్చిన నాలుగు చిరుతల్ని తరిమి కొట్టాయట కూడా. వాటివల్ల చీతాలకు హాని కలుగుతుందని కాదుగానీ కొత్త వాతావరణానికి అలవాటుపడేవరకూ ఇతర క్రూరమృగాలు వీటి దగ్గరకు రాకుండా చూస్తున్నారట.

అసలెందుకీ చీతా?

జీవవైవిధ్యం అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. వందల రకాల వన్యప్రాణులు ఉన్నాయిక్కడ. వాటిల్లో కొన్ని అంతరించిపోయే దశలోనూ ఉన్నాయి. ఉదాహరణకు కృష్ణజింకలూ గంగానది డాల్ఫిన్లూ బెంగాల్‌ టైగర్‌... వంటివి. వీటి సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే ఆసియన్‌ చీతా, పింక్‌ హెడెడ్‌ బాతు, హిమాలయన్‌్ క్వెయిల్‌... వంటివెన్నో ఏనాడో అంతరించిపోయాయి. కొత్తగా ఈ చీతాలెందుకు.... వాటికంత ఖర్చెందుకు... అనిపించడం సహజం.
అవన్నీ వందల, వేల ఏళ్ల క్రితమే కనుమరుగైతే స్వాతంత్య్రానంతరం అంతరించిన తొలి ప్రాణి చీతా. వీటితోపాటే గడ్డిమైదానాలూ మాయమై వ్యవసాయ భూములవుతున్నాయి. జీవావరణ వ్యవస్థలోని సమతౌల్యత లోపిస్తోంది. జింకలూ దుప్పులూ... వంటి శాకాహార జంతువులు ఎక్కువై గడ్డి మైదానాలు బీడుభూములుగా మారుతున్నాయి. ఫలితం... నేల బీటలు వారుతోంది. నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. వెరసి ఇవన్నీ వాతావరణ మార్పులకు కారణమై మానవ మనుగడమీద ప్రభావం చూపనున్నాయి. అంతేకాదు, శాకాహార జంతువులు ఎక్కువైతే ఆహారంకోసం పంటపొలాల్లోకి వస్తాయి. దాంతో విషాహారం ఇవ్వడం, వేటాడటం...వంటి క్రూరమైన పద్ధతుల్లో వాటిని మనిషి చంపుతాడు. ఫలితం... ఆవరణ వ్యవస్థలో కొత్త సమస్యలొస్తాయి.

చీతాల్లేకపోతేనేం... పులీ, సింహం, చిరుతా... వంటివన్నీ ఉన్నాయి కదా అనిపించవచ్చు. కానీ దేని ప్రాధాన్యం దానిదే. ఉదాహరణకు ఓ పెద్ద పులి ఐదువందల జింకల సంఖ్యను నియంత్రించగలిగితే, చీతా మరో ఐదు వందల లేళ్లను తగ్గిస్తుంది. కాబట్టి అడవి నియంత్రణకు మిగిలిన వాటితోపాటు ఇదీ అవసరమే. పోతే, బిగ్‌ క్యాట్స్‌లోనే చీతా అరుదైనది. భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తగల జంతువు ఇదొక్కటే. అంతరించిన భారతీయ చీతాని ఎటూ తీసుకురాలేం. కానీ దానికి దగ్గరగా ఉన్న ఆఫ్రికన్‌ చీతాను తీసుకురావడంతో జీవ వైవిధ్యం పెరుగుతుంది. కొత్త జంతువుల్ని చూడ్డానికి వచ్చే వాళ్లు పెరుగుతారు. కాబట్టి ఎకో టూరిజంతో ఆదాయమూ వస్తుంది. ఈ రకమైన జంతు మార్పిడివల్ల దేశాలమధ్య స్నేహసంబంధాలూ దృఢపడతాయి. ఇలాంటి ఎన్నో కోణాల్ని దృష్టిలో పెట్టుకునే రెండు దశాబ్దాల కిందట ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చేందుకు చీతా ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది నాటి ప్రభుత్వం. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 30 శాతం భూభాగాన్నీ సాగరజలాల్నీ కాపాడాలంటూ ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపులో భారత్‌ సైతం గళం కలిపింది. అందులో భాగంగానే వన్యప్రాణుల సంరక్షణ తద్వారా పర్యావరణ పరిరక్షణకోసం చీతాల ప్రాజెక్టుని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం.

ఆఫ్రికన్‌, ఆసియన్‌ చీతాల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో అవి మన వాతావరణానికీ సరిపోతాయని జన్యు నిపుణులూ తేల్చిచెప్పడంతోనూ సుప్రీంకోర్టు ఆమోద ముద్రతోనూ ఎట్టకేలకు చీతాలు మళ్లీ మన నేలమీదకి వచ్చాయన్నమాట. ప్రపంచంలోనే మాంసాహార వన్యప్రాణుల్ని భారీయెత్తున ఓ ఖండం నుంచి మరో ఖండానికి తరలించడం కూడా ఇదే తొలిసారి.  

నిజానికి ఆసియా సంతతికి చెందిన చీతాల్ని మళ్లీ తెచ్చేందుకు ఏడు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. క్లోనింగ్‌ ద్వారానైనా ఈ సంతతిని కాపాడాలి అనుకున్నారు. రెండు దశాబ్దాల కిందట- ఇరాన్‌ నుంచి తీసుకురావాలనుకున్నారు కానీ బదులుగా సింహాలను అడగడంతో ఆ ప్రతిపాదన అప్పట్లో వెనక్కి వెళ్లింది.

ఎలా అంతరించాయి?

వందేళ్ల క్రితం... ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో లక్షకి పైగా చీతాలుండేవట. ఆసియా రకం చీతాలు ఇరాన్‌లో యాభై వరకూ మిగిలి ఉంటే, ఆఫ్రికా రకం సంఖ్య సుమారు ఏడున్నర వేలకు చేరింది. మనదేశంలో ఇవి అంతరించడానికి వేటే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. నాటి రాజులు వినోదంకోసం వన్యప్రాణులను క్రూరంగా చంపేవారు. దివ్యభానుసింహ్‌ రాసిన ‘ద ఎండ్‌ ఆఫ్‌ ఎ ట్రెయిల్‌: ద చీతా ఇన్‌ ఇండియా’ అనే పుస్తకం ప్రకారం- మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ దగ్గర వెయ్యికి పైగా చీతాలు ఉండేవనీ కృష్ణజింకల్నీ, హరిణ జాతి జింకల్నీ వేటాడ్డానికి వీటిని ఉపయోగించేవారనీ తెలుస్తోంది. అందుకే చీతాని ‘హంటింగ్‌ లెపర్డ్‌’ అనీ పిలిచేవారట.

తరవాత ఔరంగజేబు సైతం చీతాలతోనే 400కి పైగా జింకల్ని వేటాడాడట. అయితే ఈ రకంగా చీతాల్ని వేటకోసం మచ్చిక చేసుకోవడంతో అవి సంతానోత్పత్తికి దూరమై సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ తరవాత వచ్చిన బ్రిటిషర్లు సైతం వీటిని వేటాడేవారు. చుక్కల జింకలానే చీతాని సైతం దాని అందమైన చుక్కల చర్మంకోసం కూడా చంపేసేవారట. దాంతో 20వ శతాబ్దం నాటికి వీటి సంఖ్య రెండు వందలకు తగ్గిపోయింది.

చిట్టచివరగా ఉమ్మడి మధ్యప్రదేశ్‌లోని కొరియా జిల్లాలో ఉన్న సర్జుగ సంస్థాన్‌ రాజు రామానుజ ప్రతాప్‌సింగ్‌ 1947-48ల్లో మూడు చీతాలను వేటాడటంతో అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. వేట వల్లే చీతా అంతరించిందని అటవీశాఖ అధికారి పర్వీన్‌ కాస్వాన్‌ ఇటీవల ట్వీట్‌ చేయడంతోపాటు గొలుసులతో వీటిని మంచాలకు కట్టేసిన 1939 నాటి ఫొటోలనీ వీడియోలనీ షేర్‌ చేయడం విశేషం. అయితే వేటతోపాటు ప్రత్యేక రిజర్వ్‌లు లేకపోవడం, సింహాలూ పులులూ హైనా వంటివాటితో ఆహారంకోసం పోటీపడాల్సి రావడం వల్ల కూడా చీతాల సంఖ్య తగ్గింది. కారణాలేమయితేనేం... 1952 నాటికి మనదేశంలో చీతాలు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్నీ తీసుకొచ్చింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మనదగ్గరే కాదు, ఆఫ్రికన్‌ దేశాల్లోనూ వీటి సంఖ్య బాగా తగ్గింది. సఫారీ పర్యటనల్లో ఎక్కువమంది చీతాల్ని చూడ్డానికే వెళతారు. అదీ అవి వేటాడే సమయం చూసుకుని అంటే- ఉదయం లేదా సూర్యాస్తమయానికి ముందో వెళ్లడంతో అవి సరిగ్గా వేటాడలేకపోతున్నాయి. వాహనాల వల్ల తల్లీ పిల్లలు విడిపోతున్నాయి. మాసైమారాలో చీతాలు వేటాడే సమయంలోనే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో అవి విపరీతమైన ఒత్తిడికి లోనై అనారోగ్యం పాలవుతున్నాయట. చీతాల్లో జన్యువైవిధ్యం తక్కువగా ఉండటం, జనాభా పెరగడంతో గడ్డితో కూడిన అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, వన్యప్రాణుల అక్రమ రవాణా... వంటివన్నీ కూడా చీతాల సంఖ్యను తగ్గిస్తున్నాయి. అమెరికాకు చెందిన డా. లారీ మార్కర్‌ అనే శాస్త్రవేత్త వీటిని కాపాడేందుకు ‘చీతా కన్జర్వేషన్‌ ఫండ్‌’ పేరుతో ఓ సంస్థను నెలకొల్పింది. ఇది పలు దేశాల్లో పనిచేస్తూ చీతాల రక్షణకు కృషిచేస్తోంది.

కునో పార్కే ఎందుకు?!

వింధ్య పర్వత సానువుల్లో దాదాపు 750 చదరపు కిలోమీటర్ల మేర ఈ సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంది. ఇది తడీ పొడీ గడ్డి మైదానాలతో నిండిన వైవిధ్యభరితమైన అటవీ ప్రాంతమనీ శాకాహార జంతువులు ఎక్కువగా ఉండటంతోపాటు అక్కడి వాతావరణం చీతాలకు అనుకూలంగా ఉంటుందనీ భారతీయ వన్యప్రాణుల సంస్థ అంటోంది. పైగా ఒకప్పుడు పెద్ద పులి, చిరుత పులి, సింహం, చీతా... అన్నీ కలిసి ఇక్కడ నివసించేవి. భవిష్యత్తులో వీటి సంఖ్య పెరిగాక గతంలో అవి నివసించిన మరిన్ని జాతీయ సంరక్షణ కేంద్రాల్లోనూ వీటిని పెంచే ఆలోచన చేస్తున్నారు.

మొత్తమ్మీద వీటి రాకతో జాతీయ ఉద్యానవనానికి భూమి మరింత అవసరమై తాము నిర్వాసితులమవుతామని కొందరు భయపడుతుంటే, పర్యటకుల సంఖ్య పెరిగి జీవనోపాధి లభిస్తుందని మరికొందరు సంబరపడుతున్నారట. ఎవరేమనుకున్నా ఈ చీతాలు కొత్త వాతావరణంలో సంతానోత్పత్తి చేయగలగడంతోపాటు, సరైన ప్రణాళికతో వాటిని సంరక్షించగలిగినప్పుడే ప్రాజెక్టు చీతా పూర్తిగా విజయవంతమైనట్లు అని వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ పేర్కొంటోంది. ఆ రోజు రావాలనీ మన నేలమీద చీతా మళ్లీ పుట్టి పరుగులు తీయాలనీ కోరుకుందాం!


చీతా ప్రత్యేకత

‘చిత్రక’(చుక్కలు) అనే సంస్కృత పదం నుంచే చీతా వచ్చిందట. చూడ్డానికి చిరుతకీ చీతాకీ పెద్ద తేడా కనిపించదు. అందుకే చాలామంది చీతా చిరుతా ఒక్కటే అనుకుంటారు. కానీ రెండూ వేర్వేరు. మధ్యలో ఖాళీలున్న వలయాకారపు మచ్చలతో ఉంటుంది చిరుత. లేత బంగా రువర్ణంలో మెరిసే శరీరమ్మీద చిన్నా పెద్దా చుక్కలతో ఎంతో అందంగా ఉంటుంది చీతా. ఇతర క్రూరమృగాల్లా గాండ్రించదు. పిల్లిలా మ్యావ్‌ అంటూ శబ్దం చేస్తుందంతే. భూమ్మీద గంటకు 113 కి.మీ. వేగంతో పరుగెత్తే ఏకైక జంతువు. మూడు సెకన్లలోనే 96 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. వేగం కోసమే రూపుదిద్దుకుందా అన్నట్లుగా ఉంటుంది దీని రూపం. ఏరోడైనమిక్‌ కోణంలో ఉండే చిన్న తల, సన్నని శరీరం, పొడవాటి కాళ్లు, ఎలా అంటే అలా వంగే వెన్నెముక, పొడవాటి తోక... వెరసి చీతాని భూమ్మీద వేగంగా పరుగెత్తే జంతువుగా మార్చాయి. తృటిలో తలను 180 డిగ్రీల కోణంలో తిప్పగలగడం దీనికున్న మరో ప్రత్యేకత. పరుగెత్తేటప్పుడు ఎక్కవశాతం చీతా నాలుగు కాళ్లూ గాల్లోనే ఉంటాయి. ఉరికేటప్పుడు శరీరం కదులుతున్నా తల స్థిరంగా ఉండి దృష్టంతా వేటమీదే ఉంటుంది. కంటి నుంచి వచ్చిన నల్లని చారల(మలార్‌ స్ట్రైప్స్‌)వల్ల కాంతి నుంచి రక్షణ ఉంటుంది. దాంతో అది స్పష్టంగా చూస్తూ వేటాడగలదు.


అనుబంధాలూ ఎక్కువే!

చీతా స్వతహాగా సిగ్గరి. పోరాడే తత్త్వం తక్కువ. మనిషికి హాని కలిగించదు. త్వరగా మచ్చిక చేసుకోవచ్చు. గర్భం దాల్చిన ఆడ చీతాలు ఒంటరిగా జీవిస్తాయి. కాన్పుకి రెండు నుంచి ఎనిమిది పిల్లల్ని కంటాయి. కానీ అనారోగ్యం, ఇతర జంతువుల దాడివల్ల బతికే వాటి సంఖ్య తక్కువ. అక్కడికీ పిల్లల్ని రక్షించుకునేందుకు తల్లి చీతా ప్రదేశాలను మారుస్తుంటుంది. దగ్గరుండి వాటికి వేటలో నైపుణ్యాన్ని నేర్పిస్తుంది. ఏడాదిన్నర నుంచి రెండేళ్లపాటు తల్లితోనే ఉండి ఆ తరవాత స్వతంత్రంగా జీవించడం నేర్చుకుంటాయి పిల్ల చీతాలు. వీటికి వేటలో నైపుణ్యం రావడానికి కనీసం మూడున్నరేళ్లు పడుతుంది. ఆడ చీతాలు తమ ఆవాసాన్ని తల్లికి సమీపంలోనే ఏర్పాటుచేసుకుంటాయి. దాంతో ఆడ చీతాల్లో తల్లి తరపు చుట్టరికమే ఎక్కువ. నాలుగైదేళ్లు వచ్చాక మగ చీతాలు మాత్రం తల్లి దగ్గర ఉండకుండా వేరే ప్రాంతానికి వెళుతుంటాయి. అలాగని వీటికి అనుబంధాలు ఉండవని కాదు. సోదర చీతాలతో చిరకాలం సంబంధాలు కలిగి ఉంటాయట. వాటితో కలిసి వేటాడుతూ తమ ప్రాంతంలోకి వేరే జంతువులు రాకుండా చూసుకుంటాయి. ఓ కుటుం బంలా కలిసి ఉండే చీతాలన్నీ ఒకదానిపట్ల ఒకటి ఎంతో ప్రేమగా ఉంటాయి. వేటకోసం దూరంగా వెళితే పిల్లిలా కుయ్‌ మంటూనో లేదా పక్షిలా శబ్దాలు చేస్తూనో మాట్లాడుకుంటాయి. కౌగిలించుకోవడం, ముఖాన్ని నాకడం ద్వారా తమ ప్రేమను చూపించుకుంటాయి. చుట్టూ చెట్లు ఉన్న గడ్డి మైదానాల్లో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. మగ చీతాలు ఆ చెట్లమీద మలమూత్రాలను విసర్జించి, వాటి వాసన ద్వారా తమ ఆవరణను గుర్తుపెట్టుకుంటాయట.


చీతా... పెంపుడు జంతువా?!

బరువు తక్కువగా ఉండటంతోపాటు మచ్చికయ్యే లక్షణం కొంతవరకూ ఉండ టంతో గల్ఫ్‌ దేశాల్లో చీతాల్ని పెంచుకోవడం ఓ స్టేటస్‌ సింబల్‌గా మారింది. ‘చీతా కన్జర్వేషన్‌ ఫండ్‌’ అంచనా మేరకు ఏటా సొమాలియా నుంచి 300కి పైగా చీతా పిల్లలు మధ్య తూర్పు దేశాలకు వెళుతున్నాయట. ఆయా ప్రభుత్వాలు చీతాలను పెంచొద్దంటూ ఆంక్షలు విధించినప్పటికీ- వాటిని సహజ వాతావరణానికి దూరం చేయడమే కాదు, వాటికి బలవంతంగా ఐస్‌క్రీమ్‌ తినిపించడం, ఈత కొట్టించడం... వంటివీ చేస్తున్నారు. ఖరీదైన కార్లలో వెంటే తిప్పుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులూ పెడుతున్నారు. ఈ రకమైన పెంపకం వల్ల అవి త్వరగా చనిపోతున్నాయి. పిల్ల చీతాలు బెంగతో అనారోగ్యం పాలవుతున్నాయట. సరైన ఆహారం లేకపోవడం, వాతావరణంలో తేడా కారణంగా అడవుల్లో పదీ పన్నెండేళ్లూ సంరక్షణ కేంద్రాల్లో ఇరవయ్యేళ్లు జీవించే చీతా నాలుగేళ్లు నిండకుండానే చనిపోతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..