బొంబాయిరవ్వతో పొంగలి, కట్‌లెట్‌

ఇడ్లీ, దోశ తరువాత సులువుగా చేయగలిగిన టిఫినంటే ఉప్మానే. కానీ ఆ పేరెత్తితేనే చాలు.. పిల్లలు అమ్మో వద్దంటూ పేచీ పెడతారు. అలాంటి చిన్నారులకు ఉప్మారవ్వతోనే ఈ వంటకాలు చేసిపెట్టి చూడండి.

Published : 07 May 2023 00:52 IST

బొంబాయిరవ్వతో పొంగలి, కట్‌లెట్‌

ఇడ్లీ, దోశ తరువాత సులువుగా చేయగలిగిన టిఫినంటే ఉప్మానే. కానీ ఆ పేరెత్తితేనే చాలు.. పిల్లలు అమ్మో వద్దంటూ పేచీ పెడతారు. అలాంటి చిన్నారులకు ఉప్మారవ్వతోనే ఈ వంటకాలు చేసిపెట్టి చూడండి. చాలా బాగున్నాయంటూ మళ్లీమళ్లీ వీటినే కావాలని అడుగుతారంటే నమ్మండి.


ఊతప్పం

కావలసినవి:  బొంబాయిరవ్వ: కప్పు, పుల్లటిపెరుగు: అరకప్పు, ఉప్పు: తగినంత, ఉల్లిపాయ- క్యాప్సికం- క్యారెట్‌- టొమాటో: ఒక్కోటి చొప్పున, కొత్తిమీర: కట్ట, అల్లం తరుగు: చెంచా, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: రెండు, నూనె: అరకప్పు.  

తయారీ విధానం: ఓ గిన్నెలో పెరుగు, రవ్వ వేసుకుని బాగా కలపాలి. ఆ పిండిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను కూడా వేసి కలిపి అరగంట నాననివ్వాలి. ఇప్పుడు మరికాసిని నీళ్లు కలిపి ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడిపెనంమీద ఊతప్పంలా వేసి నూనెతో ఎర్రగా
కాల్చుకుని తీసుకోవాలి.


కట్‌లెట్‌

కావలసినవి: పాలు: ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ తరుగు: అరకప్పు, చీజ్‌తురుము: అరకప్పు, కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను, బొంబాయిరవ్వ: కప్పు, ఎండుమిర్చి గింజలు: అరచెంచా, ఒరెగానో: అరచెంచా, మిరియాల పొడి: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: ముప్పావు కప్పు, వెన్న: చెంచా.  

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి పాలు పోయాలి. అవి వేడెక్కుతున్నప్పుడు ఉల్లిపాయ తరుగు, చీజ్‌తురుము, కొత్తిమీర తరుగు, ఎండుమిర్చి గింజలు, ఒరెగానో, మిరియాలపొడి వేసి కలపాలి. చీజ్‌ కరిగాక రవ్వ, తగినంత ఉప్పువేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన గిన్నెలోకి తీసుకుని గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.ఆ తరువాత ఇవతలకు తీసి కట్‌లెట్‌ ఆకారంలో చేసుకోవాలి. వీటిని రెండు మూడు చొప్పున వేడిపెనంమీద ఉంచి నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.


పొంగలి

కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, పెసరపప్పు: అరకప్పు, నీళ్లు: మూడుకప్పులు, నెయ్యి: అరకప్పు, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: చెంచా, మిరియాలు: చెంచా, పసుపు: పావుచెంచా, పచ్చిమిర్చి: రెండు, అల్లం తరుగు: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత, జీడిపప్పు పలుకులు: పావుకప్పు.

తయారీ విధానం: ముందుగా పెసరపప్పును దోరగా వేయించుకుని ఆ తరువాత కుక్కర్‌లో తీసుకుని ముప్పావుకప్పు నీళ్లు పోసి రెండు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి చెంచా నెయ్యి వేసి అందులో రవ్వను వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మరో రెండు చెంచాల నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు వేయించుకోవాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అల్లంతరుగు వేయించుకుని పసుపు, ఉడికించిన పప్పు, తగినంత ఉప్పు, మిగిలిన నీళ్లు పోసి కలపాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న రవ్వ వేసి కలపాలి. రవ్వ ఉడుకుతున్నప్పుడు మిగిలిన నెయ్యి వేసి మరోసారి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.


కేక్‌

కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, గోధుమ పిండి: పావుకప్పు, చక్కెర: కప్పు, బేకింగ్‌పౌడర్‌: చెంచా, వంటసోడా: పావుచెంచా, ఉప్పు: పావుచెంచా, యాలకులపొడి: చెంచా, కుంకుమపువ్వు రేకలు: చిటికెడు, పెరుగు: కప్పు, పాలు: పావుకప్పు, నెయ్యి: పావుకప్పు, టూటీఫ్రూటీ పలుకులు: పావుకప్పు.  

తయారీ విధానం: ముందుగా బొంబాయిరవ్వ, చక్కెరను మిక్సీలో తీసుకుని పిండిలా అయ్యేవరకూ గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో గోధుమపిండి, బేకింగ్‌పౌడర్‌, వంటసోడా, ఉప్పు, పెరుగు కలిపి మూత పెట్టాలి. మరో గిన్నెలో పాలు, కుంకుమపువ్వు రేకలు, యాలకులపొడి, నెయ్యి వేసుకుని గిలకొట్టినట్లుగా చేసుకుని ఇందులో రవ్వ మిశ్రమాన్ని వేసి అన్నింటినీ కలుపుకోవాలి. ఈ పిండిని నెయ్యి రాసిన కేకు పాత్రలో తీసుకుని పైన టూటీఫ్రూటీ వేసి.. ముందుగా వేడిచేసుకున్న అవెన్‌లో ఉంచి నలభై అయిదు నిమిషాలు బేక్‌ చేసుకోవాలి.


క్రిస్పీ ఫింగర్స్‌

కావలసినవి: బొంబాయి రవ్వ: అరకప్పు, ఉడికించిన బంగాళాదుంపలు: రెండు, అలంవెల్లుల్లి ముద్ద: చెంచా, ఉప్పు: తగినంత, ఎండుమిర్చి గింజలు: చెంచా, మిరియాల పొడి: అరచెంచా, పచ్చిమిర్చి: ఒకటి, కొత్తిమీర తరుగు: పావుకప్పు, నీళ్లు: కప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.  

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నీళ్లు పోసి అరచెంచా నూనె వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి కలిపి ఉడికాక దింపేయాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకుని కాస్త పిండిని తీసుకుని వీలైనంత పొడుగ్గా ఫ్రెంచ్‌ఫ్రైస్‌ ఆకారంలో చేసుకుని వేడి నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..