Updated : 11 Aug 2021 22:21 IST
శార్వరీ... శుభకరీ!

కొత్త సంవత్సరాది రోజున లేత మామిడాకుల తోరణాలూ, శ్రావ్యమైన కోయిల గానాలూ, అందమైన ముగ్గులతో కళకళలాడే వీధివాకిళ్లూ ఇంటికి సంప్రదాయ కళను తెస్తే...  షడ్రుచుల పచ్చడి జీవిత తత్వాన్ని బోధిస్తుంది. మరి రాబోయే శార్వరీ నామ సంవత్సరాది రోజున చేయాల్సిన పనులూ.. మనం తీసుకునే ఉగాది పచ్చడి వల్ల కలిగే ఉపయోగాలేంటో చూద్దామా.

గాది అంటే... సృష్టి ప్రారంభానికి సూచిక. ఉత్తరాయణం, దక్షిణాయనం కలిపి మొదలయ్యే సంవత్సరాది. ఈ రోజున ప్రత్యేక పూజలంటూ లేకపోయినా... కొత్తగా ఏ పనులు మొదలుపెట్టినా అవి మిగిలిన ఏడాదంతా దివ్యంగా సాగుతాయని విశ్వసిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజునే పాత లెక్కలు మూసేసి కొత్త లెక్కలు రాయడం మెదలుపెట్టే సంప్రదాయమూ ఉంది. కొత్త సంవత్సరాదిని ఆనందంగా, శుభప్రదంగా జరిపితే... మిగిలిన ఏడాదంతా బాగుంటుందని అంటారు. ఈ రోజున చేసుకునే షడ్రుచుల పచ్చడి జీవితతత్వాన్ని బోధించడమే కాదు, ఆరోగ్యాన్నీ అందిస్తుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేసుకునే ఈ పండగను తొలుత యుగాది అని పిలిచేవారు. దీనికి యుగస్య ఆదిః అని అర్థం. అంటే... ఉత్తర, దక్షిణ ఆయనాలు రెండూ కలిసి ఉండే సంవత్సరానికి చైత్రశుద్ధ పాడ్యమే ఆది కనుక అదే యుగాది అయింది. కాలక్రమంలో ఆ యుగాదే ఉగాదిగా మారింది. బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు కూడాఇదే. సకల చరాచర జీవరాశికీ మూల కారకుడైన బ్రహ్మ ఈ మహత్కార్యాన్ని ఆరంభించిన రోజును అత్యంత వైభవంగా జరపాలనే ఆకాంక్ష కూడా ఉగాదికి నాంది అయింది.

అరవై తెలుగు సంవత్సరాలు...
కాలం ఎప్పుడూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. ఎక్కడ అంతం అవుతుందో అక్కడినుంచే ప్రారంభం అవుతుందంటారు. వసంత రుతువులో వచ్చే చైత్రమాసం శుద్ధపాడ్యమితో కొత్త సంవత్సరాది మొదలై, ఫాల్గుణ మాసంతో పూర్తవుతుంది. ఆ తరవాతే మళ్లీ చైత్రమాసం వస్తుంది. ఇలా ప్రతిఏటా వచ్చే కొత్త సంవత్సరాదిని మనం ఒక్కో పేరుతో పిల్చుకుంటాం. వాటికి ఆ పేర్లు రావడం వెనుకా ఓ కథ ఉంది. ఓసారి నారద మహర్షి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఓ రాజును పెళ్లాడతాడు. వారికి అరవైమంది పుత్రులు జన్మిస్తారు. కానీ ఓ యుద్ధంలో వాళ్లంతా మరణిస్తారు. అప్పుడు నారద మహర్షి నారాయణుడిని ప్రార్థిస్తే ‘నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు. అలా వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి’ అని వరమిస్తాడు. అవే ప్రస్తుతం తెలుగు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. వీటిలో ఒక్కో పేరుకీ ఒక్కో ప్రత్యేకమైన అర్థం ఉంది. ఈ ఏడాదిని మనం శార్వరీ నామ సంవత్సరంతో జరుపుకోబోతున్నాం. అరవై సంవత్సరాల్లో ఇది 34వ సంవత్సరం. శార్వరీ అంటే సంస్కృతంలో రాత్రి అని అర్థం. ఈ పేరు లక్ష్మీ సహస్రనామంలో వస్తుంది. అమ్మవారిని మనం శార్వర్యై నమః అని కొలుస్తాం. లక్ష్మీ అంటే సంపదకు సంకేతం కాబట్టి ఈ ఏడాది అందరికీ ఐశ్వర్యఫలితాలు అందుతాయని చెప్పుకోవచ్చు.  కిందటేడులానే తగినన్ని వర్షాలూ పడతాయి కాబట్టి రైతులకూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ పండగను జరుపుకోవడానికీ పద్ధతుంది. ఆ రోజున బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి పెద్దవాళ్లతో తలకు నువ్వులనూనె పెట్టించుకుని, వాళ్ల ఆశీర్వాదం తీసుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆకలి, దప్పిక, మలిన నిర్మూలనలు జరుగుతాయని అంటారు. కొత్త బట్టలు కట్టుకుని ఆత్మీయుల సాంగత్యంలో గడిపితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతారు. ఆ తరువాత ఇష్టదేవతను ప్రార్థించి పరగడుపున ఉగాది పచ్చడిని స్వీకరించాలి. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం కూడా చేయాలనీ చెబుతారు పెద్దలు.

పంచాంగ శ్రవణం ఎందుకంటే...
పంచాంగం అంటే అయిదు విభాగాలని అర్థం. అవే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథులు పదిహేనూ, వారాలు ఏడూ, అశ్వని మొదలు రేవతి వరకూ 27 నక్షత్రాలూ విష్కంభం మొదలు వైధృతి వరకూ 27 యోగాలూ బవ మొదలు కింస్తుఘ్నం వరకూ 11 కరణాలన్నింటి గురించి తెలియజేసేదే పంచాంగం. మనకు తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కించి, ఆ ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం ప్రధాన ఉద్దేశం. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద.. వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాపపరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు. పంచాంగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది.దుస్స్వప్నాలను హరించడంతోపాటు గంగానదీ స్నాన ఫలితాన్నిస్తుంది. గోదానం చేసిన భాగ్యాన్నీ, ఆయురారోగ్యాలనూ, విద్యాబుద్ధులనూ, సత్సంతానాన్నీ ప్రసాదిస్తూ సకల విజయాలనూ సిద్ధింపజేస్తుంది. పంచాంగ శ్రవణ సమయంలో ఎన్నోసార్లు గ్రహాల పేర్లు పలుకుతారు. అందువల్ల ఆయా గ్రహాలు సంతోషిస్తాయట. ఫలితంగా పంచాంగ శ్రవణం చేసినవాళ్లకీ, విన్నవాళ్లకీ సూర్యుడి వల్ల తేజస్సూ, చంద్రుడి వల్ల వైభవం, కుజుడి వల్ల సర్వమంగళం, బుధుడి వల్ల బుద్ధివికాసం, గురుడి వల్ల జ్ఞానం, శుక్రుడి వల్ల సుఖం, శనివల్ల దుఃఖరాహిత్యం, రాహువు వల్ల ప్రాబల్యం, కేతువు వల్ల ప్రాధాన్యం కలుగుతాయనీ, దేవతలూ అనుగ్రహిస్తారనీ శాస్త్రాలు చెబుతున్నాయి.

 

ఉగాది పచ్చడి - ఆరోగ్యప్రదాయిని
వసంతం అంటే ప్రారంభ రుతువు. ఈ సమయంలో చెట్లు చిగురిస్తాయి. పూలూ పూస్తాయి. ఈ మార్పుల ప్రభావం వ్యక్తిగత జీవితంపైనా పడుతుంది. దాంతో అనారోగ్యాలు దాడిచేయకుండా ఉండేందుకు ఈ సమయంలో ఏ ఔషధాలు మేళవిస్తే మంచిదో వాటితోనే ఉగాది పచ్చడిని తయారుచేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రధానంగా ఉగాది పచ్చడిలో వాడే బెల్లం, వేపపూత, మామిడి, చింతపండు, ఉప్పు, కారం... ఒక్కో రుచిని అందించడమే కాదు, తద్వారా వాత, పిత్త, కఫదోషాలను నిరోధిస్తాయి. అలాగే కొత్త ఏడాదిలో ఎదురయ్యే
ఆరు విధాలైన అనుభవాలను స్వీకరించేందుకు ఆ రోజునుంచీ సిద్ధంగా ఉండాలనీ ఈ పచ్చడి మనకు తెలియజేస్తుంది.

* వేపపూత: ఇది చేదుగా ఉంటుంది. జీవితంలో బాధ కలిగించే సంఘటనలన్నీ చేదుగానే ఉంటాయి. వాటిని తట్టుకోవాలనేదే ఈ చేదు అంతరార్థం. ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఈ చేదు కడుపులోని క్రిముల్ని నాశనం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడుతుంది. చర్మవ్యాధుల్ని నివారిస్తుంది. కంటిచూపునీ మెరుగుపరుస్తుంది.

* బెల్లం: ప్రతి మనిషి జీవితంలో మధురానుభూతులు అన్నివేళలా ఉంటే, ఎప్పుడైనా ఏ చిన్న దుఃఖం ఎదురైనా తట్టుకునే శక్తి ఉండదు. అందుకే తీపి కూడా మితంగానే తీసుకోవాలని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. అప్పుడే మనసూ ఆహ్లాదంగా ఉంటుంది. బెల్లం శరీరానికి కావాల్సిన విటమిన్లూ, ఖనిజాలను అందిస్తుంది. దగ్గూ, అజీర్తీ, మలబద్ధకం, అలర్జీ వంటి సమస్యలను నివారిస్తుంది.

* ఉప్పు: ఏ పదార్థమైనా రుచిగా ఉండాలంటే అందులోని
ఉప్పే కీలకం. దీన్ని ఉత్సాహానికి ప్రతీకగా చెబుతారు. అయితే ఇది సరైన పాళ్లలోనే ఉండాలి లేదంటే జీవితంలో ఆందోళనే కాదు, ఆరోగ్యపరంగానూ ముప్పు తప్పదు.

* కారం: ఇందుకోసం కొందరు నేరుగా కారం వాడితే, మరికొందరు మిరియాల పొడిని వేస్తారు. ఇలా ఏ పదార్థంలోనైనా కారం వాడినప్పుడు దాన్నుంచి వచ్చే మంటను తట్టుకోవాలి. అంటే జీవితంలో ఎదురయ్యే సందర్భాలను ధైర్యంగా తట్టుకునే శక్తిని సొంతంచేసుకోవాలి. కారం ఆకలిని పెంచుతుంది. కొవ్వునీ కరిగిస్తుంది.

* చింతపండు: చింతపండులోని పులుపు నేర్పుకు సంకేతం. నేర్పు లేకుండా జీవితంలో నెగ్గుకురాలేం. ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఇది ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని నివారిస్తుంది. జ్వరం రాకుండా చేస్తుంది. గుండెకు బలాన్ని కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతోపాటూ విరోచనకారిగానూ పనిచేస్తుంది.

* మామిడి: ఇది పదార్థానికి వగరు రుచిని ఇస్తుంది. అంటే సవాళ్లను స్వీకరించేందుకు సదా సిద్ధంగా ఉండాలన్నదే దీని సారాంశం. ఆరోగ్యపరంగా మామిడిపిందెలు శరీరంలోని మలినాలనూ, పొట్టలో పేరుకున్న వాయువులనూ పోగొడతాయి. పెద్దపేగుకు బలాన్ని చేకూర్చడంతోపాటూ శరీరాన్ని చల్లబరిచి, వడదెబ్బ రాకుండా చేస్తాయి. ఇన్నివిధాలుగా మేలుచేసే ఉగాది పచ్చడిని ఈ ఒక్కరోజునే కాకుండా... చైత్రమాసం మొత్తం రోజూ కొద్దిగా తీసుకోగలిగితే అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని