వేసవి తాపానికి చల్లని ఔషధాలు..!

మండుటెండల్లో వచ్చే ముంజెలూ మామిడికాయలూ కొబ్బరిబోండాలూ... అన్నీ దాహాన్ని తీర్చేవే... ఒంటికి చల్లదనాన్ని అందించేవే... అలాగే పోషకాలతో నిండిన పండ్లతో చల్లని షర్బత్‌లూ జ్యూస్‌లూ చేసుకోవడమూ తెలిసిందే.

Published : 24 Apr 2022 01:41 IST

వేసవి తాపానికి చల్లని ఔషధాలు..!

మండుటెండల్లో వచ్చే ముంజెలూ మామిడికాయలూ కొబ్బరిబోండాలూ... అన్నీ దాహాన్ని తీర్చేవే... ఒంటికి చల్లదనాన్ని అందించేవే... అలాగే పోషకాలతో నిండిన పండ్లతో చల్లని షర్బత్‌లూ జ్యూస్‌లూ చేసుకోవడమూ తెలిసిందే. అయితే చల్లదనంతోపాటు ఔషధగుణాలూ మెండుగా ఉన్న వేర్లూ పండ్లూ విత్తనాలూ... ఇలా చాలానే ఉన్నాయి. ప్రాచీనకాలం నుంచీ ఆయుర్వేదంలోనూ వాడుతోన్న వాటితో చేసిన మధురమైన పానీయాలెన్నో ఇప్పుడు మార్కెట్లోనూ దొరుకుతున్నాయి.


నన్నారి... ఎండల్లో ఎంతో హాయి!

వేసవి రాగానే శీతలపానీయాలతో ఫ్రిజ్‌ని నింపేస్తాం. కానీ ఎండల్ని తట్టుకునేందుకు ప్రకృతే మనకెన్నో ఔషధ ఉత్పత్తుల్ని అందిస్తోంది. అందుకు చక్కని ఉదాహరణ నన్నారి ఉరఫ్‌ అనంతమూల లేదా సుగంధిపాల వేళ్లు. రాయలసీమలో ఎక్కువగా పెరిగే ఈ చెట్ల వేళ్లతో చేసే షర్బత్‌, అద్భుతమైన సమ్మర్‌ డ్రింక్‌. ఆ ప్రాంతంలో ఇది లేని సోడా బండి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అనేక కంపెనీలు నన్నారి సిరప్‌ని అమ్ముతున్నాయి. ఇందుకోసం సన్నగా పొడవుగా పెరిగే ఈ చెట్టు వేళ్లను కత్తిరించి పంచదార నీళ్లలో ఉడికించి షర్బత్‌ తయారుచేస్తారు. వేళ్ల మధ్యలోని గట్టిభాగాన్ని తీసేసి ఏడెనిమిది గంటలపాటు నీళ్లలో నానబెడతారు. సుమారు పావుకిలో వేళ్లకు ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోసి అవి ఎరుపు రంగులోకి తిరిగేవరకూ ఉడికించి చల్లారాక వడగట్టి లీటరు కషాయానికి కిలోన్నర చక్కెర కలిపి మరిగించి, చల్లారాక బాటిల్స్‌లో నింపుతారు. ఓ టేబుల్‌స్పూను సిరప్‌ని గ్లాసు నీళ్లలో కలిపి టీస్పూను నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. కొన్నిచోట్ల సబ్జాగింజల్నీ పుదీనా ఆకుల్నీ కూడా వేసుకుంటారు. దాహాన్ని తీర్చే చల్లని పానీయంగానే కాదు, నడుంనొప్పి, కాళ్లనొప్పులు, మూత్రంలో మంటతో బాధపడేవాళ్లకీ నన్నారి మంచిదే. ఈ వేరు రక్తశుద్ధికీ వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. మూత్రనాళాన్ని శుభ్రం చేయడంతోబాటు నాడీ రుగ్మతలనీ తగ్గిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌, మొలలు, కంటి సమస్యలు, మూర్ఛ, డయేరియా, చర్మవ్యాధుల నివారణలోనూ దీని పొడి లేదా కషాయాన్ని వాడుతుంటారు ఆయుర్వేద వైద్యులు. సోడాని కనిపెట్టకముందు అమెరికాలోని మందుల షాపుల్లోనూ ఈ సిరప్‌ ఉండేదట.


బిల్వ ఫలం...పోషకాలు పుష్కలం!

బిల్వపత్రాలతో పూజిస్తే పరమశివుడు కరుణిస్తాడనేది భక్తుల నమ్మకం. అయితే  మారేడు పండ్లలోని ఔషధగుణాల గురించి మాత్రం అందరికీ తెలియదు. ఎన్నో పోషకాలతో నిండిన ఈ పండ్లలో బీటాకెరోటిన్‌, సి-విటమిన్‌, రిబోఫ్లేవిన్‌లు పుష్కలం. అందుకే వీటిని ఆయుర్వేద, సిద్ధ వైద్యాల్లోనూ; కొన్నిచోట్ల గృహవైద్యంలోనూ వేల సంవత్సరాలనుంచీ వాడుతున్నారు. ఈ పండ్లతో చేసిన షర్బత్‌ వేసవిలో ఇన్‌స్టంట్‌ కూలర్‌లా పనిచేస్తుందన్న కారణంతో బెంగాల్‌, ఒడిశావాసులు దీన్ని తప్పక తాగుతారట. మారేడు కాయలు పండుగా మారాక వెలగపండులా తొక్క గట్టిగా అయిపోతుంది. అప్పుడే దీన్ని పగులగొట్టి గుజ్జుతో జ్యూస్‌లు చేస్తుంటారు. ఈ పండ్లగుజ్జులో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి దీని షర్బత్‌ రక్తప్రసరణకి మేలు చేస్తుంది. డయేరియా, కలరా, మధుమేహం, స్కర్వీ, చెవినొప్పి, చర్మసమస్యలు, శిరోజాల సంరక్షణకీ కొలెస్ట్రాల్‌ నియంత్రణకీ... ఇలా ఎన్నింటినో ఇది తగ్గిస్తుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు ఈ పండ్లు ఎంతో మేలు.

 


కోకమ్‌... జీర్ణశక్తి కోసం..!

తీపీపులుపూ కలగలిసిన రుచిలో ఎర్రని పండ్లతో ఉండే ఈ చెట్లు కొంకణ్‌ తీరంలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఆయుర్వేదంలో ఈ చెట్టునే వృక్షామ్ల అంటారు. యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువగా ఉండే ఈ పండ్లు అద్భుతమైన ఔషధాలు. అందుకే స్థానికులు జీర్ణశక్తి కోసం ఈ పండ్లను ఎండబెట్టి చింతపండులా వాడుతూ రసం, పప్పూ చేస్తుంటారు. ఇందులోని హైడ్రాక్సీ సిట్రిక్‌ ఆమ్లం జీవక్రియని పెంచడంతోపాటు పిండిపదార్థాలు కొవ్వుగా మారే శాతాన్ని తగ్గిస్తుంది. జ్వరాలకూ అలర్జీలకీ కూడా ఇది మందులా పనిచేస్తుంది. వేసవిలో కోకమ్‌తో చేసే షర్బత్‌ వడదెబ్బ తగలకుండా చేస్తుంది. పొక్కులూ మొటిమలమీద ఈ పండ్ల రసాన్ని నేరుగా రాసినా ఫలితం ఉంటుంది. ఒక్క వేసవి అనే కాదు, ఈ షర్బత్‌ లేదా జ్యూస్‌ని అన్ని కాలాల్లోనూ పరగడుపునే తాగితే మంచిదట. దీనివల్ల పొట్ట నిండినట్లుగా అయి, ఆకలి వేయదు. హృద్రోగ సమస్యలతోనూ క్యాన్సర్లతోనూ పోరాడే గుణాలు ఉన్న ఈ పండ్ల షర్బత్‌- అజీర్తినీ ఆందోళననీ డిప్రెషన్‌నీ కూడా తగ్గిస్తుంది. ఇందులోని గార్సినాల్‌ అనే ఎంజైమ్‌ అల్సర్లకు మంచి మందు. అందుకే సీజన్‌లో వచ్చే ఈ పండ్లతో షర్బత్‌ల్నీ సిరప్‌ల్నీ తయారుచేసి నిల్వచేస్తారు.


షర్బత్‌ బెర్రీ... ఫల్సా పండు..!

గుండ్రంగా ద్రాక్షను పోలి ఉండే ఫల్సా పండ్లూ తీపీ పులుపూ కలగలిసిన రుచితో వేసవిలోనే వస్తాయి. వీటిల్లోని చల్లని గుణాల్ని గుర్తించి పూర్వకాలం నుంచీ ఈ పండ్ల షర్బత్‌నీ జ్యూస్‌నీ తాగుతున్నారు. అందుకే ఈ పండుకి ఇండియన్‌ షర్బత్‌ బెర్రీ అని పేరు. విటమిన్లూ ఖనిజాలూ నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ పండ్లతో చేసిన షర్బత్‌ వేడిని హరించి, తక్షణ శక్తిని అందిస్తుంది. విటమిన్‌-సి శాతం అధికంగా ఉండటంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వేసవిలో శరీరం నుంచి నీటితోపాటు ఎలక్ట్రోలైట్లూ చెమటరూపంలో పోతాయి కాబట్టి ఫల్సా షర్బత్‌ తాగితే సోడియం, పొటాషియంల శాతం తగ్గకుండా ఉంటుంది. రక్తహీనతతోనూ కీళ్లనొప్పులతోనూ బాధపడేవాళ్లకి ఈ సమ్మర్‌ ఫ్రూట్‌ ఎంతో మేలు. ఈ పండ్లరసంలో కాస్త నిమ్మరసం, అల్లంరసం కలుపుకుని తాగితే జీర్ణ సమస్యలూ శ్వాస సంబంధ సమస్యలన్నీ తగ్గుతాయట. మలేరియా, మధుమేహం, బీపీలతో బాధపడేవాళ్లకీ ఇది మంచిదే. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం, పాలీఫినాల్స్‌ ఎక్కువగా ఉండటంతో ఈ పండ్ల షర్బత్‌ను భోజనానంతరం చిన్న గ్లాసుతో తీసుకుంటే, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు తగ్గుతాయి.


సబ్జాగింజలతో...చల్లచల్లగా..!

వేసవిలో సబ్జాలు చేసే మేలు తెలిసిందే. సబ్జాగింజలూ తులసి గింజలూ చూడ్డానికీ ఒకేలా ఉంటాయి కానీ రెండూ ఒకటికావు. రుద్రజడ అనే మొక్క నుంచి వచ్చేవే సబ్జాగింజలు. ఈ మొక్కనే కమ్మగగ్గరాకు అనీ, వంద రోగాల్ని తగ్గిస్తుందనీ చెబుతారు. ఈ గింజల్ని నానబెడితే, అవి నీటిని పీల్చుకుని మృదువుగా మారి, పట్టుకుంటే జారిపోతుంటాయి. జిగురుతో కూడిన రుచికోసం ఐస్‌లూ ఐస్‌క్రీమ్‌లూ డెజర్ట్‌లూ ఫలూదాల్లో వాడుతుంటారు. సబ్జాగింజల్ని నానబెట్టుకునీ లేదా పండ్లరసాలేమయినా కలుపుకుని తాగినా మంచిదే. నానాక యాంటీఆక్సిడెంట్లూ ఎంజైమ్‌లూ గింజల్లోంచి బయటకు వచ్చి ఆరోగ్యానికి మేలుచేస్తాయి. సబ్జా గింజల్లో ఆల్ఫాలినోలిక్‌, ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలు కొవ్వుని కరిగించి జీవక్రియని పెంచుతాయి. వీటిని ఏదైనా జ్యూస్‌ లేదా షర్బత్‌లో కలుపుకుని తాగడంవల్ల ఆకలి తగ్గి తద్వారా బరువు తగ్గడానికి దోహదపడతాయి. ఈ గింజల్లో ప్రొటీన్లూ పీచూ ఇతరత్రా పోషకాలూ పుష్కలం. ఇవన్నీ కలిసి జీవక్రియకీ; నాడీవ్యవవస్థ, జీర్ణవ్యవస్థల పనితీరుకీ; కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకూ తోడ్పడతాయి. డిప్రెషన్‌, ఆందోళనల్ని తగ్గించేందుకూ; శిశువు పెరుగుదలకీ కంటిచూపు మెరుగవడానికీ సాయపడతాయి.


గంధం... తాగేందుకు..!

గంధం... ఈ మాట వినగానే ఒంటికి పూసుకునేదో లేదా దాంతో తయారుచేసే క్రీములూ సబ్బులే గుర్తొస్తాయి. కానీ ఇది అద్భుతమైన వేసవి పానీయం కూడా. చల్లదనాన్ని ఇచ్చే గంధం పొడికి పాండన్‌ ఎక్స్‌ట్రాక్ట్‌, గులాబీ రేకులూ, కుంకుమపువ్వూ కలిపి రకరకాల రుచుల్లో షర్బత్‌లూ సిరప్‌లూ తయారుచేస్తున్నారు. ఇది దాహాన్ని తీర్చడమే కాదు, శరీరంలోని వేడినీ హరించేస్తుందట. అధిక దాహం, అలసట, నీరసం, నోరు ఎండిపోవడం, జ్వరం, మూత్రంలో మంటగా అనిపించడం... వంటి లక్షణాలతో బాధపడేవాళ్లకి గంధంతో చేసిన షర్బత్‌ల వల్ల వెంటనే ఫలితం కనిపిస్తుంది. అంతేనా, చదువుతో వేడెక్కిన మెదడుకి ఉపశమనాన్ని ఇవ్వడంతోపాటు జ్ఞాపకశక్తి పెరిగేందుకూ ఇది తోడ్పడుతుందట.


వట్టి వేరు... గట్టి మేలు!

పూల వాసనలన్నీ పరిమళ తైలాలనిస్తాయా... ఇవ్వవు కదా. అలాగే మొక్కల వేర్లన్నీ కూడా మట్టివాసనకే పరిమితమైపోవు. తవ్వి తీస్తే కొన్ని ఔషధాలవుతాయి. మరికొన్ని పోషకాలను అందిస్తాయి. ఇంకొన్ని సుగంధాన్నీ వెదజల్లుతాయి. చాలాకొన్ని మాత్రమే చల్లదనాన్నీ పంచిస్తాయి. కానీ వట్టి వేరు... సకల సుగుణాలకూ పెట్టింది పేరు. పరిమళాన్నీ ఔషధగుణాల్నీ చల్లదనాన్నీ అందించే వట్టివేరు(ఖస్‌)తో చేసే చాపల్ని కిటికీలకు కట్టడం, కూలర్లలో వాడటం తెలిసిందే. కానీ గడ్డి జాతికి చెందిన ఈ మొక్క వేళ్లతో వేసవి పానీయాన్నీ తయారుచేస్తారు. ఇది శరీరంలోని అధిక వేడిని చేత్తో తీసినట్లుగా లాగేస్తుందట. ఐరన్‌, మాంగనీస్‌ పుష్కలంగా ఉండే వట్టివేళ్ల షర్బత్‌ రక్తప్రసరణను పెంచి, బీపీని తగ్గిస్తుంది. కళ్లు మండుతున్నా, దాహం తీరకున్నా డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నా ఖస్‌ పానీయం తాగితే మేలు. ఖస్‌ సిరప్‌ను లస్సీలూ మిల్క్‌షేక్‌లూ ఐస్‌క్రీములూ పండ్లరసాల తయారీలో కలుపుతారట.

ఇవే కాదు... మామిడికాయలు, చింతపండు, పాలదుంప, తాటిముంజెలతో చేసే షర్బత్‌లూ; జల్‌జీరా, పుదీనాపానీ, జిగర్‌ఠండా, మజ్జిగ, లస్సీ, రాగి అంబలి, పానకం... వంటి ఆరోగ్యకరమైన సంప్రదాయ పానీయాలెన్నో దాహాన్ని తీర్చి వేసవి వేడిని తగ్గిస్తాయి. కాబట్టి మీకిష్టమైన వాటితో కూల్‌కూల్‌గా గడిపేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..