ఇంటికి ఇత్తడి సొగసు!

ఆధునిక వసతులతో ఇల్లు సౌకర్యంగా ఉండటంతోపాటు వినూత్నంగా అందంగా ఉండాలని కోరుకునేవాళ్ల సంఖ్య ఈమధ్య పెరుగుతోంది. అందులో భాగంగానే ఇత్తడితో చేసిన యాంటిక్‌ వస్తువులతోనే ఇంటిని తీర్చిదిద్దుకుంటున్నారు.

Updated : 05 Feb 2023 04:18 IST

ఇంటికి ఇత్తడి సొగసు!

ఆధునిక వసతులతో ఇల్లు సౌకర్యంగా ఉండటంతోపాటు వినూత్నంగా అందంగా ఉండాలని కోరుకునేవాళ్ల సంఖ్య ఈమధ్య పెరుగుతోంది. అందులో భాగంగానే ఇత్తడితో చేసిన యాంటిక్‌ వస్తువులతోనే ఇంటిని తీర్చిదిద్దుకుంటున్నారు. ఇంటి ప్రధాన ద్వారంతోపాటు పూజగది తలుపుల్నీ మందిరాల్నీ తార్కశీ కళతో చేయించుకుంటున్నారు. ఫర్నిచర్‌తోపాటు కబోర్డులమీదా ఇత్తడి డిజైన్లను చొప్పించి ఆధునిక ఇళ్లను కూడా సంప్రదాయ లుక్‌ వచ్చేలా చేస్తున్నారు. అంతేనా... వండుకునే కుక్కర్‌, వాడుకునే పోపులపెట్టె, తినే ప్లేటూ... ఇలా సర్వం ఇత్తడితోనే మెరిపిస్తున్నారు.

త్తడి అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేవి వెనకటి వంటింటి సామాన్లూ భారీ గంగాళాలూ గుండిగలూ డేగిశాలే. అప్పట్లో వాటిని పండగలూ శుభకార్యాల సమయంలో కిందకి దించి చింతపండుతో రుద్ది వాడేవారు. పనైపోయాక మళ్లీ వాటిని అచ్చం మేలిమి బంగారంలా మెరిసిపోయేలా తోమించి గదికి పైభాగంలో అటకల్లా ఉండే అరమీద అందంగా సర్దించేవారు. ఆనాటి సంప్రదాయానికి కాలం చెల్లిపోవచ్చుగాక. అలాగని వాటి వాడకం మాత్రం పూర్తిగా పోయిందని చెప్పలేం. కొందరు పాతవాటిని మార్చి కొత్తవి కొంటే, వాటినే పాలిష్‌ చేయించి గది మూలల్లోనూ బాల్కనీల్లోనూ కార్నర్‌ టేబుల్స్‌మీదా వాటికి పక్కనా అందంగా అలంకరిస్తున్నారు.

అంతేనా... ప్లాస్టిక్కూ స్టీలూ సామాన్లతో నిండిపోయిన వంటింట్లోకి రాగి, మట్టి పాత్రలు వస్తున్నట్లే మళ్లీ ఇత్తడి కూడా చొరబడింది. పైగా రాగిలానే ఇత్తడిమీదా సూక్ష్మజీవులు ఎక్కువసేపు జీవించలేవనీ, ఆహారపదార్థాలు వేడి తగ్గకుండా ఉంటాయన్న కారణంతోనూ వంటింటి సామాన్లు అన్నింటినీ ఇత్తడితో చేయడం పెరిగింది. కుక్కర్లూ గిన్నెలూ భోజనం ప్లేట్లూ గరిటెలూ కట్లరీ సెట్లూ... ఇలా చాలానే చేస్తున్నారు. అతిథులు వచ్చినప్పుడు అందించే టీ సెట్‌లూ ట్రేలూ కూడా ఇత్తడి అందాల్ని అద్దుకుంటున్నాయి. పైగా వీటిని ఎంతో కళాత్మకంగా చేయడంతో ఇంటికి వచ్చినవాళ్ల చూపు వాటిమీదే నిలిచిపోవడం ఖాయం. ఇవే కాదు, చిమ్నీలూ కబోర్డులూ వార్డ్‌రోబ్‌ ఫిట్టింగ్‌లూ...వంటి వాటిల్లోనూ బ్రాస్‌ జిగేల్‌మంటోంది. పోతే పూజగది తలుపులూ ప్రధాన ద్వారాలూ అన్నీ తార్కశీ కళతో మెరుస్తున్నాయి. అంటే-  కొమ్మలూ రెమ్మలూ పక్షులూ జంతువులూ దేవీదేవతల బొమ్మలూ... ఇలా రకరకాల డిజైన్లలో చెక్కిన ఇత్తడి రేకుల్ని చెక్కలోపల ఒదిగిపోయేలా అతికిస్తారన్నమాట.

ఎక్కడ చేస్తారు?

ఇత్తడి కళాఖండాల తయారీలో ప్రపంచంలో మొదటి స్థానం మన దేశానిదే. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మీర్జాపూర్‌, మొరాదాబాద్‌లతోపాటు తెలంగాణలోని పెంబర్తి, ఆంధ్రప్రదేశ్‌లోని బుడితి, అజ్జరం గ్రామాలు ఇత్తడి వస్తువులకు పేరొందాయి. తిరుపతి కూడా ఇత్తడి కళాఖండాలకు పెట్టింది పేరు. అయితే ఇత్తడి వస్తువుల ఎగుమతిలో మొరాదాబాద్‌ తరవాతే మిగిలినవన్నీ. పర్షియా నుంచి వచ్చిన ముస్లిం కుటుంబాలు తమతోపాటు తార్కశీ కళనీ తీసుకురావడంతో అక్కడ ఇత్తడి స్థిరపడిపోయింది. అందుకే దీనికి ఇత్తడి నగరం అని పేరు.

ఆ మెరుపు ఉంటుందా?

వెండి, బంగారాల మాదిరిగా ఇత్తడి ముడి లోహం కాదు. భూమిలో తవ్వితే దొరకదు. రాగి, జింక్‌ల సమ్మేళనమే ఇత్తడి. సాధారణంగా ఇత్తడిలో 67 శాతం కాపర్‌కి 33 శాతం జింక్‌, ఒక శాతం టిన్‌ కూడా కలిపి వాడుతుంటారు. అయితే ఇందులోని జింక్‌కి కిలుము పట్టే గుణం ఉంటుంది. దాంతో ఈమధ్య జింక్‌ శాతాన్ని బాగా తగ్గించి దానికి బదులుగా కాపర్‌ శాతం పెంచుతున్నారు. 75 శాతం కాపర్‌కి 25 శాతమే జింక్‌ కలిపినప్పుడు వచ్చే ఇత్తడి బంగారంలా మెరుస్తుందట. అందుకే దీన్ని నకిలీ బంగారం అనీ ప్రిన్సెస్‌ మెటల్‌ అనీ పిలుస్తూ గిల్టు నగల్లో వాడుతుంటారు. జింక్‌ శాతం పెరిగేకొద్దీ ఇత్తడి నాణ్యత, ధరా తగ్గుతాయి. అందుకే కొన్ని ఆఫ్రికన్‌ దేశాల్లో 90 శాతం రాగికి 10 శాతమే జింక్‌ కలిపిన నగల్నే బంగారంలా పెట్టుకుని మురిసిపోతారట. ఎంత కాలమున్నా చెక్కు చెదరకపోవడం, పాతవి కరిగించి కొత్తవి చేసుకోగలగడం ఇత్తడి ప్రత్యేకత. పైగా ఇత్తడి అలంకరణ వస్తువులేవయినా బట్టతో తుడిచినా మెరుస్తాయి. ఒకవేళ కాస్త రంగు తగ్గినట్లు అనిపిస్తే బ్రాసోతో పాలిషింగ్‌ చేస్తే బంగారంలానే తళతళలాడతాయి. వాడుకునే వస్తువులయితే కాస్త చింతపండో నిమ్మకాయో పెట్టి రుద్దితేఆ మెరుపే వేరు. అందుకే మరి...ఇత్తడి అందాలతో ఇంటికి సరికొత్త సొబగులు అద్దేస్తున్నారు నేటి ఇంటీరియర్‌ డిజైనర్లు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..