సిల్లీపాయింట్‌

అలహాబాద్‌లో ఉన్న అశోకుడి స్థూపాన్ని 19వ శతాబ్దం దాకా అక్కడి ప్రజలు... భీముడి గదగా భావిస్తూ వచ్చారట!

Updated : 07 May 2023 04:53 IST

సిల్లీపాయింట్‌

అలహాబాద్‌లో ఉన్న అశోకుడి స్థూపాన్ని 19వ శతాబ్దం దాకా అక్కడి ప్రజలు... భీముడి గదగా భావిస్తూ వచ్చారట!

* 1948 వరకూ సికింద్రాబాద్‌ ప్రాంతానికి ఇంగ్లిషే అధికార భాషగా ఉండేది!

* ప్రపంచంలో అతిచిన్న దేశమైన వాటికన్‌ నగరంలో జేబు దొంగతనాలు ఎక్కువ. ఇక్కడ పోలీసులూ కోర్టులూ ఉన్నా జైళ్లు లేవు. అందువల్ల, శిక్ష ఖరారైనవాళ్ళని ఇటలీ దేశంలోని జైళ్లలో పెడతారు... అందుకయ్యే ఖర్చుల్ని వాటికన్‌ నగరమే భరిస్తుంది!

* పూర్వం ఎప్పుడో నలమహారాజు చెప్పినట్టు విశ్వసిస్తున్న పాకశాస్త్ర విషయాలన్నీ గుదిగుచ్చి 13వ శతాబ్దంలో ‘పాక దర్పణం’ అన్న గ్రంథం రాశారు. అందులో మాంసోద్ధనం పేరుతో నేటి దమ్‌ బిర్యానీ రెసిపీ కూడా ఉంది!

* జంతువులన్నింటా మనిషే కాస్త ఎక్కువ సేపు ఆవులిస్తాడు.... దాదాపు ఆరు సెకన్లు. చిట్టెలుక కేవలం క్షణంపాటే ఆవులిస్తుంది!

* అన్నం, నూడుల్స్‌... ఇలా సమస్త ఆహార పదార్థాల్లోనూ గుడ్లు వాడటం జపనీయులకి అలవాటు. సగటు జపనీయులు ఏడాదిలో 322 గుడ్లు తింటారన్నది లెక్క! ప్రపంచంలో గుడ్లని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం కూడా అదే.


సెయింట్‌ బెర్నార్డ్‌... చూడటానికి భారీగా అనిపిస్తుంది కానీ, ప్రపంచంలో అతిసాధువైన తెలివైన కుక్క ఇది. అందుకే, అమెరికాలో దీన్ని బేబీ సిట్టర్‌గా ఉపయోగిస్తారు.
* యునెస్కో వారసత్వ కేంద్రాలుఅత్యధికంగా ఉన్న దేశం... ఇటలీ! మొత్తం 58 పర్యటక కేంద్రాలు ఉన్నాయక్కడ.


* సహారా ఎడారి సమీపాన ఉన్న మాలి దేశంలో అక్టోబర్‌-ఫిబ్రవరి మధ్య ఉష్ణోగ్రత 34 డిగ్రీలుంటుంది... అంటే ఇంచుమించు మనదేశంలో ఏప్రిల్‌లా అనిపిస్తుంది. నిజానికి ఇదే వాళ్ళకి చలికాలం. వేసవిలో అక్కడ సగటున 60 డిగ్రీల ఎండ నమోదవుతుంది మరి!

* నార్వే, ఐస్‌లాండ్‌ దేశాల్లో... రంజాన్‌ మాసంలో ముస్లిములు తప్ప ఇంకెవ్వరూ పగటిపూట ఉపవాసదీక్ష చేయరు. రోజులో 22 గంటలపాటు పగలే ఉంటే... ఎలా చేస్తారు చెప్పండి?!

* 1931నాటి ‘కాళిదాసు’కి తొలి తమిళ టాకీ సినిమాగా గుర్తింపుంది. విచిత్రమేంటంటే- ఇందులో హీరోయిన్‌ తమిళంలో మాట్లాడి తెలుగులో పాటలుపాడితే, హీరో తెలుగులోనే మాట్లాడతాడు. ఇతర పాత్రలన్నీ హిందీలో సంభాషిస్తాయి!


1860 వరకూ నిమ్మ జాతి పళ్ళతో మాత్రమే జ్యూస్‌లు తయారుచేసేవారు. ఆ ఏడాది పళ్ళరసాలని నిలవచేసే కొత్తపద్ధతి వచ్చాకే ఆపిల్‌, ద్రాక్ష వంటివాటిని జ్యూస్‌లుగా వాడటం మొదలుపెట్టారు.  


స్వాతంత్య్రానికి  పూర్వం మనదేశంలోని రైల్వే స్టేషన్‌లలో క్షురకులూ ఉండేవారు. రైల్లో ప్రయాణించే సైనికులకి అవసరమైతే గడ్డం గీయడం వీళ్ళ పని.


ఆర్కిడ్స్‌లో మొత్తం 28 వేల రకాలున్నాయి. వాటిల్లో కొన్ని కోతుల్లానూ, హంసల్లానూ, బాలె డ్యాన్సర్‌లానూ, ఊయల్లో పాపల్లానూ పూలు పూస్తాయి. ఇంత విభిన్నంగా ఉంటాయి కాబట్టే... అమెరికాలో వాటిని వైవిధ్యానికి ప్రతీకగా చూస్తారు. ఏటా ఏప్రిల్‌లో ఉత్సవాలు చేస్తారు.


తల్లి కడుపులో మూడున్నర నెలలు ఉన్నప్పుడే మనకి తలపైన వెంట్రుకల వరసలు(ఫాలికల్స్‌) ఏర్పడతాయి. ఒక్కసారి అలా ఏర్పడ్డాక... అవి జీవితాంతం మారవు!


ఐఫోన్‌ని భూతద్దంలానూ ఉపయోగించవచ్చు! ఈ ఫోన్‌లో మ్యాగ్నిఫయర్‌ ఆప్‌ని నొక్కితే చాలు... ఎంత చిన్న అక్షరాలనైనా, మనం చీకట్లో ఉన్నా  చదివేయొచ్చు.


మోనాలిసా చిత్రాన్ని మొదట చూస్తే నవ్వుతున్నట్టూ, కాసేపలా చూస్తూ ఉంటే విషాదంలో ఉన్నట్టూ, అంతలో చిరునవ్వు చిందిస్తున్నట్టూ అనిపిస్తుంది. ఆ బొమ్మలోని అసలు భావమేంటో ఎవరికీ నేటికీ అంతుబట్టలేదు. ఆర్థిక వ్యవస్థలోనూ ఒక్కోసారి ఏ అంచనాలకూ రాలేని పరిస్థితి వస్తుంటుంది కదా! ఆ పరిస్థితిని... ‘మోనాలిసా ఎఫెక్ట్‌’ అంటారు ఆర్థికశాస్త్రవేత్తలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..