ఆఫీసు ఇరుగ్గా ఉందా?
కొన్నిచోట్ల ఇరుకిరుకు ఆఫీసు గదుల్లోనే పదుల సంఖ్యలో కూర్చుని పనిచేయాల్సి ఉంటుంది. గాలీ వెలుతురు సరిగ్గాలేని అలాంటి ఆఫీసుల వల్ల ఉద్యోగుల ఆలోచనాశక్తి దెబ్బతింటుందని హార్వర్డ్ టి.హెచ్.చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆరు దేశాల్లో 40 భవంతుల్లో పనిచేస్తోన్న 300 మంది మీద దశాబ్దానికి పైగా చేసిన పరిశీలనల్లో వాయు కాలుష్యానికీ మెదడు ఆలోచనాశక్తికీ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఆయా భవనాల్లో ఎప్పటికప్పుడు ఏరోసల్స్, కార్బన్‌డైఆక్సైడ్, ఉష్ణోగ్రత, తేమ... వంటివన్నీ లెక్కించారట. అందులో ఏరోసల్స్, కార్బన్‌డైఆక్సైడ్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ల ఆలోచనాశక్తి కూడా తగ్గుతున్నట్లు గుర్తించారు. అదే వాటి శాతం తగ్గినప్పుడు ఉద్యోగులు తమకు ఇచ్చిన టాస్క్లమీద బాగా ఆలోచించి పనిచేశారట. దీన్నిబట్టి ఇండోర్ వాతావరణంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు దాని ప్రభావం మెదడుమీదా తద్వారా ఆలోచనాశక్తిమీదా పడుతుందని చెప్పుకొస్తున్నారు.
జూమ్ మీటింగుల్లో కెమెరా ఆఫ్!
తరచూ జూమ్ మీటింగులతో బిజీగా ఉండే వ్యాపారవేత్తలు కొన్నిసార్లు కెమేరా ఆఫ్ చేస్తుంటారు. అలా చేయడం ఆరోగ్యరీత్యా మంచిదేననీ దానివల్ల అలసట తగ్గుతుందని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. స్కైప్, ఫేస్బుక్, జూమ్ ఆప్‌ల ద్వారా గత కొన్నేళ్లుగా వీడియో మీటింగ్స్ పెరిగాయన్న సంగతి తెలిసిందే. కరోనాతో ఈ సంఖ్య మరీ పెరిగింది. డాక్టర్ అపాయింట్మెంట్స్, వర్క్ మీటింగ్స్, స్నేహితులూ కుటుంబ సభ్యులతో చిట్‌చాట్... వంటివన్నీ ఈ వీడియో ఆప్స్లోనే జరుగుతున్నాయి. అయితే అవి ఎక్కువసేపు ఉన్నప్పుడు చాలా బడలికగా అనిపిస్తుందట. ఎంత వద్దనుకున్నా కెమెరా ముందు ఉన్నప్పుడు అందులో సరిగ్గా కనబడుతున్నామా లేదా అన్న విషయమ్మీద మనకు తెలియకుండానే ఎక్కువగా ఫోకస్ చేస్తామనీ, స్క్రీన్ చూస్తూ మాట్లాడటం వల్ల కళ్లూ త్వరగా అలసిపోతాయనీ మొత్తమ్మీద ఆ ఒత్తిడి మెదడుమీదా పడుతుందనీ అంటున్నారు. అదే కెమెరా ఆఫ్ చేసి మాట్లాడటం వల్ల అంత అలసట ఉండదట. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఉద్యోగుల్ని రెండు వారాలపాటు కెమెరాలతోనూ మరో రెండు వారాలు కెమెరా లేకుండానూ మీటింగులో పాల్గొనేలా చేశారట. అందులో కెమెరా ఉన్నప్పుడు వాళ్లు త్వరగా అలసిపోయారన్నది స్పష్టమైంది. దాంతో తరచూ మీటింగుల్లో పాల్గొనే వాళ్లు కెమెరా ఆఫ్ చేసి మాట్లాడటమే ఉత్తమమని సూచిస్తు న్నారు సదరు పరిశోధకులు.
చేపలే మేలు!
చేపల్ని ఎక్కువగా తినడం వల్ల మైగ్రెయిన్‌లూ తలనొప్పీ తగ్గుతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్‌కు సంబంధించిన పరిశోధకులు పేర్కొంటున్నారు. దీనికోసం 200 మంది మైగ్రెయిన్ బాధితుల్ని తీసుకుని పరిశీలించారట. అందులో మొక్కజొన్న, సోయా, ఇతరత్రా నట్స్ ఎక్కువగా తిన్నప్పుడు ఆయా ఉత్పత్తుల్లోని లినోలిక్ ఆమ్లం వల్ల మైగ్రెయిన్ మరీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటే- ఈ ఉత్పత్తుల్లోని లినోలిక్ ఆమ్లం సంబంధిత నాడిలో ఇన్ఫ్లమేషన్కి కారణమవుతుందట. అదే వాళ్లు లినోలిక్ ఆమ్లం ఉన్న ఉత్పత్తుల్ని తక్కువగా తీసుకుని, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేప, పీతలు వంటి సీ ఫుడ్ పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు నాడుల్లో ఎలాంటి ఇన్ఫ్లమేషన్ కనిపించలేదట. దీన్నిబట్టి చేపల్ని ఆహారంలో భాగంగా చేసుకున్నవాళ్లలో తీవ్రమైన తలనొప్పి, మైగ్రెయిన్లు వచ్చే అవకాశం తక్కువని చెప్పుకొస్తున్నారు.
అవకాడో తింటే పొట్ట తగ్గుతుందా?
ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా వయసు పెరిగేకొద్దీ పొట్ట పెరిగి పోతుంటుంది. అయితే స్త్రీలు రోజుకో అవకాడో తినడం వల్ల పొట్టలోని కొవ్వు తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం వీళ్లు అధిక బరువు ఉన్న సుమారు వంద మందికి పన్నెండు వారాలపాటు రోజుకి ఒకసారే భోజనం పెట్టి, అందులో భాగంగా అవకాడోని కూడా ఇచ్చారట. దాంతో వాళ్లలో పొట్టలోని కొవ్వు బాగా తగ్గిందట. బరువు విషయం కాకుండా- అవకాడో తినడంవల్ల కొవ్వులు ఏ భాగంలో పేరుకుంటున్నాయనే విషయాన్ని మాత్రమే ఇందులో పరిశీలించారట. సాధారణంగా చర్మ కణాల అడుగు భాగంలోగానీ, పొట్ట లోపలి భాగంలోని అవయవాల చుట్టూగానీ కొవ్వు కణాలు పేరుకుంటాయి. పైగా పొట్టలోకి కొవ్వు చేరడం వల్ల మధుమేహం కూడా పెరుగుతుందట. అయితే అవకాడో తిన్నవాళ్లలో కొవ్వు పదార్థాలు పొట్ట లోపలి అవయవాల చుట్టూ పేరుకోకుండా చర్మం అడుగు భాగానికి చేరుకుంటున్నట్లు గుర్తించారు. దాంతో అది తిన్నవాళ్లలో పొట్ట తగ్గింది. అదే అవకాడో- మగవాళ్లలో ఎలాంటి ప్రభావాన్నీ కనబరచలేదట. దీన్నిబట్టి అవకాడో తినే మహిళల్లో పొట్ట పెరగదని అంటున్నారు.
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్