Updated : 31 Oct 2021 05:56 IST

కొవిడ్‌కి ట్యాబ్లెట్‌...!

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం కావడంతో ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గాయి. అలాగని మళ్లీ రాదని చెప్పలేం. అందుకే ఆ వైరస్‌ను నివారించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా మెర్క్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ మోల్నుపిరావిర్‌ అనే ఓ ట్యాబ్లెట్‌ను రూపొందించింది. ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు మాత్రలు మింగినట్లే, దీన్ని కూడా వేసుకుంటే తీవ్రత పెరిగి ఆసుపత్రి పాలు కాకుండా ఉండొచ్చట. ఇప్పటికే ఈ మందు మూడు క్లినికల్‌ పరీక్షల్ని పూర్తి చేసుకుని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. నిజానికి ఈ మాత్రను ఇన్‌ఫ్లుయెంజాని తగ్గించేందుకు తయారుచేశారట. ఈలోగా కరోనా ముంచుకు రావడంతో ఆ ఫార్ములా¸నే సార్స్‌కోవ్‌-2 మీద ప్రయోగాత్మకంగా పరిశీలించారు. కరోనా లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపల ఈ మందును ఐదు రోజులపాటు ఇవ్వగా వైరస్‌ తీవ్రత తగ్గి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రావడం లేదని గుర్తించారు. దాంతో త్వరలో ఈ మాత్ర మార్కెట్లోకి రానుంది.


ఫోన్‌తోనే మంచినీటి పరీక్ష!

తాగునీటిని పరిశుభ్రంగా ఉంచేందుకు రకరకాల ఫిల్టర్లు వాడుతుంటాం. అయితే ఇవి అన్నిచోట్లా అందుబాటులో ఉండకపోవచ్చు. దాంతో చాలాచోట్ల కొలనులూ చెరువుల్లోని నీటిని నేరుగానే తాగుతుంటారు. కానీ అన్ని కొలనుల్లోనూ సూక్ష్మజీవులూ కలుషితాలూ ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఫోన్‌ కెమెరా ద్వారానే నీటిలోని సూక్ష్మజీవుల శాతాన్ని తెలుసుకోవచ్చు అంటున్నారు సింగపూర్‌ నిపుణులు. అదెలా అంటే- స్మార్ట్‌ఫోన్‌ కెమెరాకి మినీ మైక్రోస్కోప్‌ను అనుసంధానిస్తారు. ఇది సూక్ష్మజీవుల కదలికల్ని ఆల్గారిథమ్స్‌ టెక్నాలజీ ద్వారా గుర్తించి ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని ఆప్‌ ద్వారా తెలియజేస్తుందట. కాబట్టి రసాయనాలూ పరికరాల్లాంటివేమీ లేకుండానే ఆ నీటిని తాగడానికి వాడొచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు అంటున్నారు. ఈ కొత్త టెక్నాలజీ ఆధారంగా నీటి కొలనులూ చెరువుల్లోని సూక్ష్మజీవుల శాతాన్ని లెక్కించి, వాటిని ఏ మేరకు శుద్ధి చేయాలనేది తేలికవుతుంది అంటున్నారు సదరు పరిశోధకులు.


చిరుధాన్యాలు తింటే...

రోగ్యరీత్యా ఇటీవల చిరుధాన్యాల వాడకం చాలా పెరిగిందనేది తెలిసిందే. దాంతో వీటి వాడకంమీద పోషకాహార సంస్థలు రకరకాల అధ్యయనాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ సంస్థ నాలుగు దేశాల్లో ఇటీవల అధ్యయనం చేసింది. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను తీసుకునేవాళ్లలో ఐరన్‌ లోపం ఉండటం లేదని తెలిపింది. ముఖ్యంగా రక్తహీనత లోపంతో బాధపడేవాళ్లకి చిరుధాన్యాలు తినడం వల్ల వెంటనే ఫలితం కనిపిస్తుందని ఆయా అధ్యయనాలు చెబుతున్నాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకున్నవాళ్లలో హీమోగ్లోబిన్‌ శాతం 13.2 కన్నా ఎక్కువగా ఉంటుందనీ అలాగే సీరమ్‌లోని ఫెర్రిటిన్‌ శాతం సైతం 54.7 శాతం కన్నా పెరిగిందనీ గుర్తించారు. ఈ అధ్యయనం కోసం వెయ్యిమంది పిల్లల్నీ పెద్దవాళ్లనీ ఎంపికచేసి వాళ్లకు రోజువారీ ఆహారంలో భాగంగా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అరికెలు, సామలు... ఇలా ఆరు రకాలను కలిపి ఇచ్చారట. అందరిలోనూ ఐరన్‌ శాతం బాగా పెరిగినట్లు తేలింది. కాబట్టి చిరుధాన్యాలను ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది అని సూచిస్తున్నారు.


క్యాన్సర్‌ రోగుల్లో వ్యాయామం!

వ్యాయామం ఎవరికైనా ఆరోగ్యకరమే. అయితే క్యాన్సర్‌ రోగులు వ్యాయామం చేస్తే మరీ మంచిది. కండర బలాన్ని పెంచే ఏరోబిక్స్‌ చేయడం వల్ల క్యాన్సర్‌ కణాల పెరుగుదల తగ్గుతుందని ఆస్ట్రేలియాకి చెందిన ఎడిత్‌ కొవాన్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాయామం వల్ల ట్యూమర్‌ కణాల సంఖ్య తగ్గడానికి కారణమయ్యే ప్రొటీన్ల శాతం పెరుగుతుందట. ఇందుకోసం పదిమంది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బాధితుల్ని ఎంపికచేసి వాళ్లకి చికిత్సతోపాటు వరసగా పన్నెండు వారాలపాటు వ్యాయామం చేయించారు. అప్పుడు ఎముక కండరాల నుంచి విడుదలయ్యే మయోకైన్స్‌ అనే ప్రొటీన్ల శాతాన్ని లెక్కించారట. వీటి ప్రభావం క్యాన్సర్‌ కణాల మీద ఎలా ఉందో తెలుసుకోవడానికి వ్యాయామానికి ముందూ తరవాతా ల్యాబ్‌లో పరీక్షించగా- అందులో వ్యాయామం తరవాత క్యాన్సర్‌ కణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే మయోకైన్స్‌ నేరుగా క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడం లేదు. అవి రోగనిరోధక టి-కణాలను ప్రేరేపించడం ద్వారా వాటిని నాశనం చేస్తున్నాయి అంటున్నారు. మొత్తమ్మీద వ్యాయామం చేయడం అనేది క్యాన్సర్‌ రోగులకీ మంచిదే అని చెబుతున్నారు.


సిల్లీ పాయింట్‌

సూపర్‌మార్కెట్లలో అమ్మే ఆపిల్స్‌లో ఏడాది కిందటివి కూడా ఉండొచ్చు. చూడ్డానికి తాజాగా కనిపిస్తాయి కానీ వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు పైన మైనం పూత పూసి, పొడిగాలులకు గురిచేసి తర్వాత శీతల గిడ్డంగుల్లో భద్రపరుస్తారు. అలా అవి ఏడాది తర్వాత కూడా మార్కెట్లలోకి వస్తాయి.

* ఐరన్‌ మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఒకటని తెలిసిందే. అయితే, ఆరోగ్యకరమైన ప్రతి మనిషిలోనూ మూడు గ్రాముల ఐరన్‌... అంటే మూడంగుళాల మేకుకి సమానమైన ఇనుము ఉంటుందట.

* ప్రపంచంలో కేవలం రెండు శాతం మందికే లేతాకుపచ్చ రంగు కళ్లుంటాయి(పిల్లి కళ్లు కాదు!). వాళ్లలోనూ 90 శాతం మంది ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ల్లోనే ఉంటారు!

* అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో టీవీలూ సోషల్‌మీడియా సైట్లూ చూసేవాళ్లకన్నా రేడియో వినేవాళ్లే ఎక్కువ!

* మొబైల్‌ కంపెనీ ‘షామీ’ అంటే అర్థం... చిరుధాన్యం అని. ఈ ఫోన్‌లోపల ఉండే ప్రాసెసర్‌ పేరు ‘రైఫిల్‌’(తుపాకీ). చైనా తిరుగుబాటప్పుడు ‘తుపాకీతోనే ధాన్యం సాధ్యం’ అన్న మావో నినాదాన్ని గుర్తుతెచ్చేందుకే ఇలా పేర్లు పెట్టారు!

* నీళ్లు పోతున్నప్పుడు వచ్చే శబ్దం ఆ నీటి ఉష్ణోగ్రతను బట్టి మారుతుంది.

* 1973లో మోటరోలా సంస్థ ప్రపంచంలోనే తొలి సెల్‌ఫోన్‌ని కనిపెట్టినప్పుడు దాని ధర... పది లక్షల డాలర్లు(సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు!).

* బాధ కలిగితే నాలుగు చుక్కలు కన్నీళ్లు కార్చేది మనుషులు మాత్రమే! మిగతా ప్రాణుల కళ్లలోనూ నీళ్లొస్తాయి కానీ... అవన్నీ కేవలం కళ్లు పొడిబారకుండా చూస్తాయంతే.

* జర్మనీకి చెందిన ఫ్రాన్‌హోఫర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధన ప్రకారం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు 30శాతం రుచిని కోల్పోతామట.

* ప్రపంచ ప్రఖ్యాత కామసూత్రాలు రాసిన వాత్సాయనుడు.. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు.


ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర రెడ్‌ లైట్‌ పడినప్పుడు ఆగుతాం కదా... ఇలా గ్రీన్‌ లైట్‌ వెలిగే వరకూ వేచి చూసేందుకు పట్టణాలూ నగరాల్లో నివసించే వారు సగటున జీవిత కాలంలో ఆరునెలల్ని  కోల్పోతున్నారట.


క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచే మనదేశంలోని బౌద్ధులు అగరుబత్తీల్ని వాడటం మొదలు పెట్టారట.


చెస్‌ బాక్సింగ్‌... ఈ ఆట గురించి విన్నారా? చదరంగం ఆడుతున్నవాళ్లు కాస్తా అందులో ఫలితమేమీ తేలకపోతే బాక్సింగ్‌ రింగులోకి వెళ్లి ముష్టిఘాతాలకి దిగుతారు ఈ ఆటలో.


ఫ్రెంచి భాషలో వస్త్రాన్ని ‘టిష్యూ’ అంటారు. గుడ్డలా ఉండే కాగితాన్ని టిష్యూ పేపర్‌ అనడం అక్కణ్ణుంచి వచ్చిందే.


ప్రఖ్యాత ఇంగ్లిషు రచయిత సోమర్సెట్‌ మామ్‌... బ్రిటిష్‌వాళ్ల కోసం భారత్‌ లోని విప్లవకారుల్ని కనిపెట్టే గూఢచారిగానూ పనిచేశాడు!


వకాశం ఇవ్వాలే కానీ పిల్లలు రోజుకి 300 ప్రశ్నలు అడుగుతారని బ్రిటన్‌కి చెందిన లిటిల్‌ వుడ్స్‌.కామ్‌ పరిశోధనలో తేలింది.


ప్రపంచంలో భారత్‌ తర్వాత అత్యధికంగా సినిమాలు నిర్మించే దేశం... నైజీరియా! నాలీవుడ్‌ అని ముద్దుగా పిలిచే ఈ ఆఫ్రికా దేశంలో ఏటా వెయ్యి సినిమాలు తీస్తారట. అమెరికా హాలీవుడ్‌దీ దాని తర్వాతి స్థానమేనండోయ్‌!


ఫ్రికాలోని బెనిన్‌ దేశాన్ని కవలల దేశం అంటారు. మిగిలిన అన్నిచోట్లా సగటున వెయ్యికి పదమూడు మంది కవలలు పుడితే అక్కడ ముప్ఫై మంది పుడుతున్నారట మరి.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని