Updated : 05 Dec 2021 06:33 IST

మీ పుట్టగొడుగుల్ని మీరే పెంచుకోవచ్చు!

బాగున్నారా... అని పలకరించి చూడండి... ‘ఈమధ్యే టెస్టులు చేయించుకున్నా... డి-విటమిన్‌, బి12 తక్కువగా ఉన్నాయి. పుట్టగొడుగుల్ని బాగా తినమన్నారు డాక్టరుగారు అని చెబుతారు నూటికి తొంభై శాతం మంది. కారణమేదయినాగానీ ఈమధ్య అందరిలోనూ ఆ రెండు విటమిన్ల లోపమూ... తద్వారా పుట్టగొడుగుల వాడకం పెరగడమూ మాత్రం వాస్తవం. అందుకేనేమో అవి రెడీమేడ్‌ గ్రో కిట్స్‌ రూపంలోనూ మార్కెట్లో దొరుకుతున్నాయి. 

సాధారణంగా వర్షాకాలంలో ఊళ్లల్లో పుట్టలమీదే మష్రూమ్స్‌ దొరికేవి. ఇప్పుడు వాటిని ఫామ్స్‌లో పెంచడంతో ఏడాది పొడవునా అవి మార్కెట్లో ఉంటున్నాయి. గత ఐదేళ్లలో పుట్టగొడుగుల పెంపకం మనదేశంలో నలభై రెట్లకు పైగా పెరిగింది. కానీ అవి చాలావరకూ విదేశాలకే ఎగుమతి అవుతున్నాయి. వాళ్లతో పోలిస్తే మనదగ్గర ఇలా పెంచిన పుట్టగొడుగుల వాడకం బాగా తక్కువ. తాజాగా ఉండవన్న కారణంతో వాటిని వండడానికి వెనుకాడుతుంటారు. అందుకే ఇప్పుడు ఎవరికి వాళ్లు ఇంట్లోనే పెంచుకునేలా రెడీమేడ్‌ మష్రూమ్‌ గ్రో కిట్స్‌ను రూపొందిస్తున్నారు. కరోనారీత్యా కూడా అందరికీ ఆహారం పట్లా వాటిల్లోని పోషకాల గురించీ అవగాహన పెరిగింది. ముఖ్యంగా డి-విటమిన్‌ లోపం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనీ రోగనిరోధకశక్తి తగ్గిపోతోందనీ పరిశోధకులూ చెబుతున్నారు. వైద్యులు సైతం డి, బి12 విటమిన్లతో పాటు ఇతరత్రా విటమిన్లూ ప్రొటీన్లూ ఇందులో సమృద్ధిగా ఉండే పుట్టగొడుగుల్ని తినమంటున్నారు.

ఎలా పెరుగుతాయి?
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ నగరంలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సంస్థకు చెందిన మష్రూమ్‌ రిసెర్చ్‌ విభాగం, రెడీ టూ ఫ్రూటింగ్‌(ఆర్‌టీఎఫ్‌) అనే సరికొత్త టెక్నాలజీని రూపొందించింది. దాంతో ఇప్పుడు మనదగ్గరా ఈ కిట్స్‌ తయారీ పెరిగింది. అప్పటివరకూ ఈ రకమైన కిట్స్‌ విదేశాల్లోనే తయారయ్యేవి. కొత్త టెక్నాలజీ ప్రకారం- పుట్టగొడుగుల కాలనీల్ని ముందుగానే రూపొందించి నీరు తగిలినప్పుడే మొలకెత్తేలా సీల్‌ చేస్తారు. నీళ్లు చిలకరిస్తే అందులోని బీజకణాలు మొలకెత్తి, పెరగడానికి 10- 15 రోజుల సమయం పడుతుంది. ఎవరికి వాళ్లు ఇంట్లోనే హాయిగా పెంచుకోవచ్చు. పిల్లలకీ ఆసక్తికరంగా అనిపిస్తుంది అంటున్నారు సోలన్‌లోని పుట్టగొడుగుల విభాగానికి చెందిన నిపుణులు.

మష్రూమ్‌ క్యాపిటల్‌గా పేరొందిన సోలన్‌లోనే కాదు, ఇతర నగరాలకు చెందిన అనేక సంస్థలు ఇప్పుడు ఈ కిట్స్‌ను తయారుచేస్తున్నాయి. ఇవన్నీ అట్టపెట్టెల్లా ఉంటున్నాయి. వీటిలోపల ఫంగస్‌ స్పోర్లతో కూడిన స్టఫ్‌ బ్యాగులాంటిది ఉంటుంది. బాక్సుమీద సూచించిన విధంగా దాన్ని బయటకు తీసి చాకుతో గాటులా పెట్టాలి. దాన్ని మళ్లీ బాక్సులో పెట్టేసి, కత్తిరించినచోట ఉదయం, సాయంత్రం రోజుకి రెండుసార్లు బాటిల్‌తో నీళ్లను స్ప్రే చేయాలి. ఇలా చేస్తుంటే, మూడు నుంచి ఏడు రోజుల్లో మొలకలు వస్తాయి. అవి పూర్తిగా పెరగడానికి మరో మూడునాలుగు రోజులు పడుతుంది. ఇప్పుడు హాయిగా వాటిని కోసుకుని కావాల్సినట్లుగా వండుకోవచ్చు. ఈ బాక్సు నుంచి మరో పదీ పదిహేను రోజుల వ్యవధిలో ఇంకో పంట కూడా వస్తుంది. అయితే ఈసారి మొదటిసారి మొలకెత్తిన వాటిల్లో సగమే పుట్టగొడుగులు ఉంటాయి. ఆ తరవాత బ్యాగు పైనుండే రెండు లేయర్లనీ తీసి, రోజూ నీళ్లు చల్లుతుంటే మూడో పంట కూడా వస్తుంది అంటున్నారు ఉత్పత్తిదారులు. మొత్తమ్మీద ఈ రెడీమేడ్‌ గ్రో కిట్స్‌ ప్లాస్టిక్‌ బకెట్లూ బాక్సులూ అట్టపెట్టెలూ గుడ్డసంచీలూ... ఇలా రకరకాల రూపాల్లో దొరుకుతున్నాయి. కాబట్టి మీకు నచ్చిన రూపంలో పుట్ట గొడుగుల్ని కొనేయండి... పెంచేయండి... తినేయండి!


 


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని