Published : 15 May 2022 01:31 IST

ఆ ఊళ్లో... కుక్కలన్నీ కోటీశ్వరులే!

పక్కవారి స్థలాన్ని మూడో కంటికి తెలియకుండా కబ్జా చేసే రోజులివి. అలాంటిది ఓ గ్రామంలో కుక్కలకి దాదాపు రూ.75 కోట్లు విలువ చేసే పొలం ఉన్నా గ్రామస్థులెవరూ దానివైపు కన్నెత్తి చూడరు. పైగా ఆ పొలంపైన వచ్చే కౌలుతో వాటి బాగోగులు చూస్తుంటారు. ఆశ్చర్యంగా అనిపించే ఈవింత జరిగేది ఎక్కడంటే...

ఒకటో, రెండో కుక్కల్ని పెంచుకుని వాటిపేరిట ఆస్తులు రాయడం, అవి కోట్లకు వారసులు కావడం మనకు తెలిసిందే. అదే గుజరాత్‌లోని మహెసణ జిల్లా పంచోత్‌ గ్రామంలో అయితే - ఆ ఊళ్లో పుట్టిన ప్రతి కుక్కా కరోడ్‌పతీనే. ఎందుకంటే ఏడు దశాబ్దాలుగా జీవ కారుణ్యంతో ఆ గ్రామస్థులంతా కుక్కలకూ, ఇతర మూగ జీవాలకూ నిస్వార్థసేవ చేస్తున్నారు. ‘మధ్‌ ని పాటి కుటారియా’ పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి భూత దయ గురించి ప్రచారం చేస్తూ కుక్కల సంరక్షణకోసం భూదానం మొదలుపెట్టారు. తమకున్న దానిలోనే అందరూ తలాకొంత ఇస్తూ రావడంతో వాటికి ఐదున్నర ఎకరాల పొలం సమకూరింది. తరవాత ఆ భూమి సరిపోతుందనే ఉద్దేశంతో భూమిని దానం తీసుకోవడం ఆపేసింది ట్రస్టు. మొదట్లో కుక్కల కోసం కేటాయించిన భూమి విలువ చాలా తక్కువగా ఉండేది. ఈమధ్య ఆ పొలం పక్కన బైపాస్‌ రోడ్డు వేయడంతో దాని విలువ దాదాపు రూ.75 కోట్లకు చేరింది. ఇప్పటికీ ఆ పొలం దాతల పేరిటే ఉన్నా- వారు దాన్ని వెనక్కి తిరిగి తీసుకోవడం, అమ్ముకోవడం వంటివి చేయకపోవడం అభినందించాల్సిన విషయం.

వేలంతో కౌలుకి...

ఆ ఐదున్నర ఎకరాల పొలాన్ని వేలం రూపంలో కౌలుకి ఇస్తారు. ఏడాదికి దాదాపుగా కౌలు రూపంలో వచ్చే లక్షన్నర డబ్బును ట్రస్టు పేరు మీద బ్యాంకులో వేసి కుక్కల బాగోగులు చూసుకుంటారు గ్రామస్థులు. అందులో భాగంగా కుక్కల కోసం పదేళ్ల క్రితం ‘రోల్టా ఘర్‌’ పేరుతో ఓ భవనాన్ని నిర్మించి వాటికి మూడు పూటలా ఆహారం సిద్ధం చేస్తున్నారు. ఉదయం కిచిడీ, చల్లార్చిన గంజీ- మధ్యాహ్నం అన్నం- రాత్రిపూట తృణధాన్యాలతో చేసిన రోటీలూ, పాలలో నానబెట్టిన బ్రెడ్డూ అందిస్తారు. ఆదివారం మాంసాహారం-  అమావాస్య, పౌర్ణమి రోజుల్లో రవ్వకేసరీ, లడ్డూలూ అదనంగా పెడతారు. ఆ ఆహారాన్ని కుక్కలకి పెట్టడానికి ఓ పదిహేను మంది వలంటీర్లు మూడుపూటలా వాటిని వెతుక్కుంటూ గ్రామంలో తిరుగుతారు. అవి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటికి ఆహారం పెడతారు. అలానే ప్రధాన కూడళ్ల వద్ద వాటి కోసం ఏర్పాటు చేసిన గిన్నెల్లోనూ కొంత వేస్తుంటారు. అక్కడక్కడా కుండల్లో నీళ్లూ, బుజ్జి కుక్కపిల్లలకోసం పాల గిన్నెలూ ఉంచుతుంటారు. మర్నాడుపొద్దున వాటిని శుభ్రం చేసి పెట్టే బాధ్యత కూడా వలంటీర్లదే. కౌలు ద్వారా వచ్చే డబ్బునే- భవనం నిర్వహణకీ, సరకులకీ, వంటవారికీ, వలంటీర్లకీ, జంతువుల వైద్యానికీ ఉపయోగిస్తారు. ఇక, అక్కడ కుక్కలతోపాటు కోతుల్నీ పక్షుల్నీ కూడా అంతే ప్రేమగా చూస్తారు. వాటికి జబ్బు చేస్తే వైద్యం చేయిస్తారు. రోగాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లూ వేయిస్తుంటారు. అలానే ప్రమాదవశాత్తూ ఏదైనా మంటలో గాయపడిన మూగ జీవాలకు చికిత్స చేయడానికి ఏసీ బర్నింగ్‌ వార్డును కూడా ఏర్పాటు చేసి మూగజీవాలపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు పంచోత్‌ వాసులు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts