అవగాహనే ఆహ్వానంగా!

పెళ్లి సమయంలో ప్రత్యేకంగా ఎంపిక చేసుకునే వాటిలో ఆహ్వాన పత్రిక ఒకటి. పెళ్లి తేదీ వరకే దాని ప్రాధాన్యం తప్ప తరవాత ఎవరూ దాన్ని పట్టించుకోరు.

Updated : 04 Feb 2023 23:40 IST

అవగాహనే ఆహ్వానంగా!

పెళ్లి సమయంలో ప్రత్యేకంగా ఎంపిక చేసుకునే వాటిలో ఆహ్వాన పత్రిక ఒకటి. పెళ్లి తేదీ వరకే దాని ప్రాధాన్యం తప్ప తరవాత ఎవరూ దాన్ని పట్టించుకోరు. అయితే తమ పెళ్లి కార్డును అలా పక్కన పడేయకుండా ఎప్పటికీ ఓ సమాచార నిధిలా దాచుకోవాలని ఆశపడ్డారు గుజరాత్‌కి చెందిన సవలియా- ధార. క్రైమ్‌ సెల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సవలియా, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ధార ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఈ జంట తమ బంధువులకు సైబర్‌ క్రైమ్‌ గురించి అవగాహన కల్పించాలనుకున్నారు. అందుకే తమ పెళ్లి పత్రికలో- ఆహ్వానంతోపాటు ‘సైబర్‌ సమస్యలు- పరిష్కారాలు’ పేరుతో ఇరవై ఏడు పేజీల బుక్‌లెట్‌ను ప్రచురించారు. సైబర్‌ కేటుగాళ్లకు అవకాశమివ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలీ; మొబైల్‌, ల్యాప్‌టాప్‌, సోషల్‌ మీడియాలో గోప్యత కోసం ఎలాంటి సెట్టింగులు పెట్టుకోవాలీ; ఏ ఆప్‌ల జోలికి వెళ్లకూడదు; బాధితులకోసం ఉన్నచట్టాలేంటీ; సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్‌ నంబర్లు... తదితర సమాచారంతో కార్డును ప్రింట్‌ చేయించారు. ‘అదిరిపోయే రిటర్న్‌ గిఫ్టు ఇచ్చారు’ అంటూ బంధువులూ, ఉన్నతంగా ఆలోచించారని అధికారులూ వారిని పొగడ్తల్లో ముంచేస్తున్నారు మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..