మంచినీళ్లు...గులాబీరంగులో!

‘ఏం నీళ్లోగానీ ఎంత తాగినా దాహం తీరడం లేదు. చప్పగా ఉన్నాయి. మా బావి నీళ్లయితే ఎంత తియ్యగా ఉంటాయో... కొంచెం తాగినా హాయిగా అనిపిస్తుంది...’ ఒకప్పుడు ఊళ్లలో నీళ్ల గురించి ఇలానే మాట్లాడుకునేవారు.

Updated : 07 May 2023 16:43 IST

మంచినీళ్లు...గులాబీరంగులో!

‘ఏం నీళ్లోగానీ ఎంత తాగినా దాహం తీరడం లేదు. చప్పగా ఉన్నాయి. మా బావి నీళ్లయితే ఎంత తియ్యగా ఉంటాయో... కొంచెం తాగినా హాయిగా అనిపిస్తుంది...’ ఒకప్పుడు ఊళ్లలో నీళ్ల గురించి ఇలానే మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడో... పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా- మినరల్‌ వాటరే తాగుతామని ఒకరంటే, ఆర్వో ఫిల్టర్‌ నీళ్లే తాగుతున్నామని ఇంకొకరంటారు. అయితే కేరళవాసులు మాత్రం ‘గులాబీనీళ్లే మాకిష్టం... అదే మా ఆరోగ్య రహస్యం’ అంటున్నారు.

భూతల స్వర్గంగా పిలిచే కేరళ సుగంధ ద్రవ్యాలకీ  ఆయుర్వేద వైద్యానికీ పెట్టింది పేరు. అందులో భాగమే ఈ గులాబీ రంగు మంచినీళ్లు కూడా. అక్కడి గ్రామాల్లో ఎవరింటికి వెళ్లినా, రెస్టరెంట్లను సందర్శించినా... ఈ నీళ్లు కనిపిస్తాయి. ఆయుర్వేద స్పాలలోనూ డిటాక్సిఫికేషన్‌కి ఇస్తుంటారు. అవేంటని ఆరా తీస్తే... ఓ చెట్టు కాండాన్ని మరిగించిన నీళ్లు అని చెప్పుకొస్తారు.

ఎలా చేస్తారు?

కేరళలోని గ్రామీణులకి బావినీరే ప్రధానాధారం. అందుకే వ్యాధులు రాకుండా వాటిలో శొంఠి, యాలకులు, లవంగాలు, దనియాలు, జీలకర్ర, వట్టివేరు, తులసి, గంధం...వంటి ఔషధాల్ని వేసి మరిగిస్తారు. అవన్నీ ఒకెత్తయితే, పతిముగం (సప్పన్‌ వుడ్‌) అనే ఓ చెట్టు కాండం వేసి మరిగించిన నీళ్ళొక్కటీ మరొకెత్తు. అందులో వేసే చెక్క లేదా పొడి శాతం, ఇతర ఔషధాలను బట్టి లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటుందీ నీరు. ఈ నీటిని అక్కడివాళ్లు రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల వరకూ తాగుతుంటారట. అందుకోసం సిసాల్పినియా సప్పన్‌ అనే చెట్టు కాండాన్ని సన్న ముక్కలుగా లేదా పొట్టులా చేసినవి అమ్ముతారు. రెండు లీటర్ల నీటికి అర టీస్పూను పొడి లేదా రెండు చిన్న చెక్కల్ని వేసి కొన్ని నిమిషాలు మరిగించి స్టవ్‌ ఆఫ్‌ చేసి మూతపెడితే చాలు... ఆ నీళ్లు గులాబీ రంగులోకి మారతాయి. ఎందుకంటే ఈ కాండంలో బ్రెజిలిన్‌ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. అందుకే దీన్ని ఆహారపదార్థాల్లోనూ రంగుగా వాడతారు.

ప్రయోజనాలెన్నో!

కేరళలో ఎక్కువగా పెరిగే పతిముగాన్ని ‘ఈస్ట్‌ ఇండియన్‌ రోజ్‌వుడ్‌’ అనీ పిలుస్తారు. ఈ చెట్టు కాండంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు అనేకం ఉన్నాయి. ప్రొటొశాపోనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఆల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌... వంటి నాడీ సంబంధిత వ్యాధుల్ని నిరోధిస్తుందట. మూర్ఛనీ రానివ్వదట. ఈ నీళ్లు గ్లూకోజ్‌ స్థాయుల్నీ క్రమబద్ధీకరిస్తాయి. మరిగించిన కషాయం టీబీ, డయేరియా, డీసెంట్రీ... వంటి వ్యాధుల్నీ తగ్గిస్తుంది. దంత క్షయాన్ని కలిగించే స్ట్రెప్టోకాకస్‌ మ్యూటన్స్‌ అనే బ్యాక్టీరియానీ నివారిస్తుంది. చర్మ, కీళ్ల ఇన్ఫెక్షన్లకు కారణమైన స్టాఫైలొకాకస్‌నీ నాశనం చేస్తుందట. రోజూ ఈ నీళ్లు తాగేవాళ్లకి పేగు, గొంతు, కొలొరెక్టల్‌ క్యాన్సర్లు త్వరగా రావని పరిశీలనలు చెబుతున్నాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు అల్సర్లనీ అడ్డుకుంటాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంవల్ల ఆస్తమా వంటి శ్వాససమస్యలూ తగ్గుతాయి. వేసవిలో ఈ నీళ్లు తాగడంవల్ల శరీరం చల్లబడుతుందట.

అయితే వట్టివేరు, నన్నారి, గంధం, పతిముగం... ఈ నాలుగు రకాల ఔషధాల్ని కలిపిన ‘దాహశామని’ అనే మిశ్రమం మరిగించిన నీళ్లనూ కేరళీయులు తాగుతుంటారు. ఇతర ఔషధాలూ కలవడంతో ఆ నీళ్లు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఈమధ్య క్రీడాకారులూ వ్యాయామం చేసేవాళ్లూ తక్షణ శక్తి కోసం కృత్రిమ ఫ్లేవర్లతో నింపిన గులాబీ రంగు నీళ్లను తాగుతున్నారు. అయితే అవి ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టరే అనీ, వాటితో పోలిస్తే సప్పన్‌ వుడ్‌ వాటర్‌ మేలు అంటున్నారు సంప్రదాయ నిపుణులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..