నాన్నే మా దైవం!

కథానాయకుడిగా, మహానాయకుడిగా ఎన్టీఆర్‌ పోషించిన పాత్రల గురించి తెలుగువారికి తెలియంది లేదు

Updated : 28 May 2023 10:05 IST

కథానాయకుడిగా, మహానాయకుడిగా ఎన్టీఆర్‌ పోషించిన పాత్రల గురించి తెలుగువారికి తెలియంది లేదు. జీవితంలో ఆయన పోషించిన పాత్రల్లో ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తికలిగించే పాత్ర అంటే తండ్రి పాత్ర. తమ తండ్రితో ఉన్న అనుబంధం గురించి ఆయన పిల్లల మాటల్లో...


పాఠాలు నేర్చుకున్నాం: బాలకృష్ణ

నాన్నగారే నాకు గురువు, దైవం, మార్గదర్శి. వేకువనే మూడున్నరకి నిద్రలేవడం ఆయన్నుంచే అలవాటైంది. నాన్నగారు పిల్లల్ని గారాబం చేయడం నేనెరగను. పొగడ్తలకు  చెడిపోతారన్న భయమో ఏమో మరి. చిన్నప్పుడే కాదు, హీరోగా స్థిరపడ్డాకా ప్రశంసించేవారు కాదు. ఆయన దగ్గర సుశిక్షితులైన సైనికులమని భావించేవారేమో మరి. నేనూ, హరి అన్నయ్య ఆయన దగ్గరే నటనలో పాఠాలు నేర్చుకున్నాం. నాన్నతో నాకు ఎదురైన రెండు సంఘటనల్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ రెండూ పనే దైవం అనే సూత్రాన్ని నేనిప్పటికీ పాటించడానికి కారణం అయ్యాయి. ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ షూటింగ్‌ను బ్రహ్మంగారు తిరిగిన ప్రాంతాల్లోనే తీశారు నాన్న. ఆరోజు క్లైమాక్స్‌ సీన్‌... అక్కడ జనమంతా షూటింగ్‌ చూస్తున్న సమయంలో... ‘ఈ సీన్‌ నువ్వు బాగా చేస్తేనే సినిమా ఆడుతుంది. లేదంటే దెబ్బతింటుంది’ అన్నారు. ‘ఇదేంటి ఇలా అంటున్నారు...’ అని మనసులో అనుకుంటూనే తలబాదుకునే సన్నివేశంలో ఏకధాటిగా నటించా. అప్పుడు రక్తం కూడా వచ్చేసింది. అయ్యో కొడుక్కి దెబ్బతగిలింది అనేది పట్టించుకోకుండా తర్వాత సన్నివేశానికి సిద్ధమవ్వమని చెప్పేసరికి ఆశ్యర్యపోయాను. పనిపట్ల ఎంత నిబద్ధత ఉండాలో తొలిసారి నేర్పించిన సంఘటన అది. సినిమా విడుదలయ్యాకా ఆ సన్నివేశం గొప్పతనం ఏంటో తెలిసింది. అలాగే ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ షూటింగ్‌ సమయంలో శ్మశానం నేపథ్యంలో సాగే సీన్‌ తెరకెక్కిస్తున్నప్పుడు నా కాలు కాలింది. అది కూడా పట్టించుకోకుండా తర్వాత షాట్‌ తీసేశారు నాన్న. నేనిప్పుడూ ఇదే అనుసరిస్తున్నాను. ఎప్పుడైనా కాస్త డల్‌గా అనిపిస్తే నాన్నగారి సినిమాల్లోని ‘మాయదారి మరలా బండిరా’, ‘మత్తు వదలరా...’ లాంటి పాటలు వింటుంటా. మోక్షజ్ఞకి తన తాతగారి గురించి చెబుతా. టీవీలో ఆయన సినిమా వచ్చిందంటే పక్కన కూర్చోబెట్టుకుని చూపిస్తా. ఇది మన కుటుంబం- మన వారసత్వమని చెప్పి, నేనున్నానని ధైర్యం ఇస్తూనే, ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యతని గుర్తుచేస్తా.


మనసు తెలుసుకుని.. పురందేశ్వరి

అమ్మ చనిపోయాక... నాన్నగారిని ఓసారి కలుద్దామని వెళ్తే డాబాపైన ఒంటరిగా కూర్చుని ఉన్నారు. దగ్గరకి వెళ్ళాక ‘నువ్వు వస్తూంటే ఓ క్షణం అమ్మే వస్తున్నట్టు అనిపించిందమ్మా! ఇద్దరూ చీర కుచ్చిళ్లని తన్నుకుంటూ నడుస్తారు అందువల్ల కావొచ్చు’ అన్నారు నవ్వుతూ. నాన్న నన్ను అంతగా గమనిస్తారా అనిపించింది. అంతకుముందు ఓసారి... మనసు బాగోలేక నాన్న దగ్గరకి వెళ్లాను. ఆయన ఏవో కబుర్లు చెబుతుంటే నవ్వుతూ ఉండిపోయాను. మా ఇంటికి తిరిగి వెళ్ళిన కాసేపటికి మా మేనమామ వచ్చి పిచ్చాపాటిగా మాట్లాడసాగారు. ఆయనెప్పుడూ అలా మాట్లాడరు. ‘ఏమైనా పని ఉండి వచ్చారా మావయ్యా?’ అని అడిగా. ‘చిన్నమ్మ మొహం నవ్వుతోంది కానీ, కళ్ళు నవ్వట్లేదు. విషయం కనుక్కోమని నాన్నే పంపారమ్మా’ అన్నారు. ఆ రోజు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే - మా చిన్నప్పట్నుంచీ సినిమాలూ, ఆపైన రాజకీయాలతో బిజీగా ఉండేవారు. ఉదయం ఆరింటప్పుడు అమ్మతో పిల్లల బాగోగుల గురించి చర్చించేవారు. మాతో గడిపే సమయం తక్కువ. అయినా మమ్మల్ని ఎంత శ్రద్ధగా గమనించారో.. అనిపించింది. ‘ఆడపిల్లవి...’ అన్న మాట ఇంట్లో విన్నది లేదు. అక్కని ఎంబీబీఎస్‌ చదివించారు. నేను సివిల్స్‌ రాస్తానంటే ప్రోత్సహించారు. అనివార్య కారణాలతో అది ఆగిపోయింది. తండ్రిగా ఇంట్లో పాటించిన ఆ సమానత్వభావననే ముఖ్యమంత్రిగానూ కొనసాగించారు.


డబ్బు విలువ చెప్పారు..: రామకృష్ణ

అమెరికాలో ఉద్యోగం చేశాక 1989లో తిరిగి వచ్చాను. ‘కోడలూ నువ్వూ ఉద్యోగాలు చేస్తున్నారుగా, అక్కడే ఉండొచ్చుగా’ అన్నారు. కానీ నాన్నగారికి దగ్గరగా ఉండాలనిపించి వచ్చేశా. తర్వాత రామకృష్ణ స్టూడియోస్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా నియమించారు. ఆరోజు ఆయన ఆశీర్వాదం తీసుకున్నప్పుడు... ‘నువ్వు నందమూరి రామకృష్ణగా కాకుండా స్టూడియో మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ రామకృష్ణగా ఉండాలి. కుర్చీకి గౌరవం ఇవ్వు. దీనికి అధికారంతోపాటు బాధ్యతా ఉంటుంది. అవసరమైతే స్టూడియో ఊడ్చడానికీ సిద్ధంగా ఉండాలి’ అని చెప్పారు. సినిమా కోసం పనిచేసే కింది స్థాయి ఉద్యోగులూ, టెక్నీషియన్ల కష్టం తెలుసుకోమనేవారు. చిన్నప్పట్నుంచీ మాకు వృథా ఖర్చులు అలవాటు చెయ్యలేదు. సంస్థ నిర్వహణలోనూ అది నాకు ఉపయోగపడింది. నేను మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా ఉండగా నాన్నగారు మా బ్యానర్‌లో కొన్ని సినిమాలు తీశారు. ఆ సమయంలో వ్యాపార అంశాలూ చర్చించేవాణ్ని. అలాంటప్పుడు సందర్భానుసారం తన అనుభవాల్నీ, ఆలోచనల్నీ, చిన్నప్పటి కష్టసుఖాల్నీ నాతో పంచుకునేవారు. అలా ఎన్నో జ్ఞాపకాల్ని నాకు మిగిల్చారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..