బ్రకోలీ తినలేకపోతున్నారా?
కొందరికి చాక్లెట్ ఇష్టమైతే మరికొందరికి బిస్కెట్ అంటే ఇష్టం కావచ్చు. కానీ ఈ రెండింటినీ తినలేనంత అయిష్టం ఉండదు. కానీ బ్రకోలీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్, క్యాబేజీ... వంటి వాటిని చాలామంది తినడానికి ఇష్టపడరు. నిజానికి ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ కారణంతోనే బలవంతంగానైనా కొందరు అలవాటు చేసుకోగలుగుతారు. కానీ కొద్దిమంది మాత్రం దీన్ని నోట్లో కూడా పెట్టలేరు. అందుకు కారణం ఆయా కూరగాయలు కాస్త చేదుగా ఒకలాంటి ఘాటైన వాసన కలిగి ఉండటం కారణం అనుకుంటాం. కానీ ఆయా వ్యక్తుల నోటిలో ఉండే బ్యాక్టీరియానే అసలు కారణం అంటున్నారు పరిశోధకులు. అదెలా అంటే- సాధారణంగా బ్రకోలీ వంటివాటిల్లో ఉండే గ్లూకోసైనోలేట్స్ నోటిలోకి వెళ్లగానే ఐసోథయోసైనేట్లుగా మారడంతో ఒకలాంటి వాసన వస్తుంది. దీంతోపాటు ఆ కూరల్లోని ఎస్-మిథైల్-ఎల్-సిస్టీన్ సల్ఫాక్సైడ్ అనే పదార్థమూ ఉంటుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియాతో కలిసి సల్ఫర్‌ను విడుదల చేయడంతో ఒకలాంటి వెగటు వాసన వస్తుందట. ఈ బ్యాక్టీరియా శాతం ఒక్కొక్కరి నోటిలో ఒక్కోలా ఉంటుంది. కొందరు ఆ కూరల్ని తినగలగడానికీ కొందరు అస్సలు తినలేకపోవడానికీ ఇదే కారణం కావచ్చు అంటున్నారు పరిశోధకులు.
మధుమేహం రాకుండా..
ఈమధ్య బరువు తగ్గేందుకు అనేక రకాల డైట్లను ఫాలో అవుతున్నారనేది తెలిసిందే. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా అలా వచ్చిందే. క్యాలరీలు తగ్గించకుండా కేవలం తినే సమయంలో మార్పు చేయడంవల్ల చాలావరకూ ఫలితం ఉంటుందని పరిశోధనల్లోనూ తేలింది. దాంతో తినే వేళల మధ్యలో 14-16 గంటల విరామం ఉండేలా చూసుకుంటున్నారు. దీనివల్ల జీవక్రియా లోపంతో వచ్చే మధుమేహం, హృద్రోగాలు వంటివి రాకుండా ఉంటాయని ఎండోక్రైన్ సొసైటీ పేర్కొంటోంది. దీనివల్ల నిద్ర కూడా బాగా పడుతుందని అంటున్నారు. ఎందుకంటే మన శరీరంలోని జన్యువులూ హార్మోన్లూ జీవక్రియా వేగంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. ఎప్పుడైతే ఓ నిర్ణీత సమయంలో తింటామో దానికి అనుగుణంగా జీవగడియారం కూడా సరిగ్గా పనిచేస్తుంది. దాంతో మిగిలిన వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ వ్యాధుల బారిన పడకుండా ఉంటాం అని చెబుతున్నారు సదరు పరిశోదకులు.
అంతా ఆ బ్యాక్టీరియా వల్లే..
పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుందనీ, అది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదనీ తెలిసిందే. ఎందుకంటే అది మరెన్నో వ్యాధుల నివారణకీ శరీర పనితీరుకీ కూడా తోడ్పడుతుంది. అయితే ఆ బ్యాక్టీరియా మనం వేసుకున్న మందుల మీద కూడా ప్రభావం కనబరుస్తుందట. ఉదాహరణకు వైవిధ్యభరితమైన బ్యాక్టీరియాలోని కొన్ని రకాలు మధుమేహం లాంటి వ్యాధులకు ఇచ్చే మందుల పనితీరుని అడ్డుకుంటున్నాయట. అలాగే క్యాన్సర్ చికిత్సల్లో వాడే మందులమీదా కొన్ని రకాల బ్యాక్టీరియా దుష్ప్రభావాన్ని కనబరుస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయమై వీళ్లు 15 రకాల మందుల్ని వాడి మరీ పరిశీలించారట. అంతేకాదు, ఒక్కో మందు ఒక్కొక్కరిలో ఒక్కోలా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అంటే కొన్ని మందులు కొందరిలో సరిగ్గా పనిచేయకపోవడానికీ మరికొందరిలో పనిచేయడానికీ వాళ్ల పొట్టలోని బ్యాక్టీరియా ఆయా మందుల మీద చూపే ప్రభావమే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. దీన్నిబట్టి పొట్టలోని బ్యాక్టీరియాని అనుసరించే మందుల్నీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంటే- ఆయుర్వేదం, హోమియో వైద్యాల్లో శరీర లక్షణాల్ని బట్టి మందులు ఇచ్చినట్లే అల్లోపతీలో కూడా బ్యాక్టీరియా వైవిధ్యం ఆధారంగా వైద్యం చేసే రోజులు రానున్నాయన్నమాట.
గ్రీన్ టీ క్యాన్సర్‌కీ మందే!
గ్రీన్ టీలోని ఎపిగాలోకెటెచిన్ అనే యాంటీఆక్సిడెంటు రోగనిరోధకశక్తి పెరిగేలా చేస్తుందనేది తెలిసిందే. అయితే ఇది పి53 అనే జన్యు ప్రొటీన్ శాతాన్నీ పెంచుతుందని న్యూయార్క్‌లోని సలీయర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నిపుణులు చెబుతున్నారు. ఈ పి53 అనేది యాంటీ క్యాన్సర్ ప్రొటీన్ కూడా. ఇది దెబ్బతిన్న డీఎన్ఏని బాగుచేస్తుందట. అందుకే దీన్ని ‘గార్డియన్ ఆఫ్ ద జీనోమ్’గానూ పిలుస్తారు. క్యాన్సర్‌ను నివారించే మందుల్ని తయారుచేసే క్రమంలో భాగంగా ఈ సంస్థకు చెందిన నిపుణులు గ్రీన్‌టీలోని ఈజీసీజీ పనితీరుని ప్రత్యేకంగా పరీక్షించారట. అందులో ఇది నేరుగా పీ53 అనే జన్యువును ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు, ఈ పీ53 జన్యు ప్రొటీన్ శాతం పెరగడంతో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండటాన్నీ గమనించారట. ఇది దెబ్బతిన్న కణాలను బాగుచేయడంతోపాటు ఆల్జీమర్స్‌నీ అడ్డుకుంటున్నట్లూ గుర్తించారు. దీని ఆధారంగా గ్రీన్ టీలోని ఈజీసీజీని సేకరించి దాంతో క్యాన్సర్‌కు మందుల్ని రూపొందించే పనిలో ఉన్నారు నిపుణులు.
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్